top of page

మీకు టెల్గూ తెలుసా...!

దీప్తి పెండ్యాల

“దీప్తి” ముచ్చట్లు

“బట్... నాకు టెల్గూ సరిగ్గా రాదూ”- అంది ఆ అమ్మాయి.

 

‘అవునా, మీరు తెలుగు రాష్ట్రాల్లో పెరగలేదా?’ -నా అమాయక ప్రశ్న!

 

“నో, నో, నో... మా డ్యాడీ జాబ్ కోసం… వైజాగ్, కరీంనగర్, కడప ఇలా టిరిగీ టిరిగీ...  ఫైనల్ గా హైడ్రాబాడు లో సెటిల్ అయ్యాము.”

 

మరింకేంటీ? ఓ? ఇంట్లో మాతృభాష తెలుగు కాదేమో?! - మరో అజ్ఞాన ప్రశ్న!

 

“నో,నో,నో... మా మమ్మీకి టెల్గూ ఫ్లుయెంటుగా వచ్చు”.

 

‘మరైతే సమస్యేమిటి’- నాలో చిన్నపాటి అసహనం.

 

“స్కూల్ లో టీచర్స్ టెల్గూలో టాక్ చేస్తే కొట్టారు... ‘నీ వల్లే’ అంటూ డ్యాడీ మమ్మీ ని తిట్టారు. దెన్, మమ్మీ ఇంగ్లిషు లెర్న్ చేసి టాక్ చేసింది... నెక్స్ట్, మా ఇంట్లో టెలుగు డిసప్పియర్ అయ్యింది”.

 

‘----‘---- “- అర్థమవని మౌనం...

 

“సేమ్ హియర్...  నాకూ టెల్గూ రాదు.” మరో అమ్మాయి.

 

"ఐ టూ డోంట్నో టెల్గూ..."

 

ఒకరి వెంట ఒకరు... ఒకే సమాధానం... తెలుగు సంఘం నిర్వహించిన ‘తెలుగువెలుగులు’ కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన యూనివర్శిటీ పిల్లలు వారంతా...

ధబ్...ఏదో కిందపడ్డ శబ్ధం!

అది నేనే!  మంచం కింద ఉన్నాను.

 

ఒక్కసారిగా మెలకువ వచ్చింది. కలేనా... ఎంత కలవరం క్షణంలో... కానీ, కల నిజమయ్యే రోజు రానుందా?!

అదే జరిగితే...?!

యునెస్కో వారి ఒక నివేదిక ప్రకారం- "ఒక జాతిలో 30% కంటే తక్కువ జనాభా మాత్రమే వారి మాతృభాష మాట్లాడుతున్నట్టయితే, ఆ భాష త్వరలో అంతరించి పోతుంది."

 

ఆ రకంగా చూస్తే... తెలుగుకి మరి కొన్ని తరాల తర్వాత ప్రమాద ఘంటికలు మోగనున్నాయన్న మాటేగా?!

 

విదేశాల్లో పెరుగుతున్న పిల్లలకి… పాపం… భాష నేర్చుకోవాలన్న ఇష్టం ఉన్నా, అవకాశం లేక కొందరూ…

స్వదేశంలో పెరుగుతున్న పిల్లలకేమో… నేర్చుకునే అవకాశమున్నా, పెద్దవాళ్ళెవరికీ ఇష్టం లేని కారణాన కొందరూ...

మొత్తానికి, వచ్చే తరానికల్లా తెలుగు మాట్లాడేవారి శాతం చాలా…చాలా… తక్కువవబోతోంది!

ఉలిక్కిపడదామా? ఊహిస్తుందే లెమ్మని ఊరకుందామా?!

 

విదేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో... చాలా మంది విజ్ఞులు పూనుకుని, తెలుగు బడులు, తెలుగు పాఠశాలలు, మన బడులూ... అవీ.... స్థాపించి మన అమూల్య భాషా సంపదని ముందు తరానికి అందించటానికి నిస్వార్థంగా కృషి చేస్తున్నారు! భాషని అంతరించకుండా కాపాడుతున్నసంరక్షకులే వీరంతా…! శతకోటి వందనాలూ తక్కువే వీరి భాషాభిమానానికి!!

 

తెలుగునీ, తెలుగు మాటలనీ, పాటలనీ, సాహిత్యాన్ని అభిమానించేవారూ, ప్రేమించే వారూ... కోకొల్లలు!  తెలుగుని సజీవంగా నిలిపేందుకు యత్నించే భాషాభిమానులెందరో! వారందరికీ వందల వందనాలు అందాల్సిందే!

 

ఇలాంటివారిని చూసినప్పుడు… చెప్పలేనంత సంతోషంతో...గర్వంగా.... మన తెలుగు భవిష్యత్తుకిక ఢోకా లేదని ఢంకా బజాయించి మరీ చెప్పేలోగా... ఆ ఆనందమంతా ఆవిరయ్యేలా...మరో రకం వారు … కొన్ని చోట్ల అడుగడుగునా...మరికొన్ని చోట్ల అడపాదడపా... ఎదురొస్తూంటారు.

భాషకి ముంచుకొస్తున్న ప్రమాదమల్లా ఈ మరో రకాల వారితోనే...

 

పిల్లలు తెలుగులో మాట్లాడుతున్నందుకు పసికూనలన్న జాలి కూడా లేకుండా కొట్టే టీచర్లని, స్కూల్ యాజమాన్యాలనీ చూసి చాలా బాధ పడుతూంటాము, సరే! ఆ బాధ న్యాయమే...! కానీ… అలాంటి కాన్వెంటుల్ని ఏరికోరి వెదకి మరీ తమ చిన్నారులని చేర్పిస్తూ మురిసిపోతున్నారే తల్లిదండ్రులు… మరి, ఆ అజ్ఞానము మాటేమిటీ?! సరయిన దారి చూపేదెవరూ?! ఇక, ఈ పరిస్థితికి ‘దిశా నిర్దేశం’ లాంటి ప్రయత్నమేదయినా చేస్తారేమో అని ఆశగా... మన ప్రభుత్వ పెద్దల వైపు చూశామంటే... ఉహూ... అక్కడ కూడా ఇంచుమించుగా అదేరకంగా ఆలోచిస్తున్నారు కనుక... ఈ పరిస్థితిని సరిచేసేవారు కంటిచూపు మేరలో… ప్చ్…  ఉహూ... ఆ వైపున ఎక్కడా కనబడట్లేదు!

 

ఇక, మరో వైపు చూశామా…

 

వారిని చూస్తే-మహా చిత్రమయిన జాతి మనది అనిపించక మానదు.

వారిని వింటే మన భాషలో సర్వ అపశ్రుతులు వినిపించక మానవు.

వారే- తెలుగు వచ్చీ... ’మాకు రాదహో!’ అని చాటే తరహా అన్నమాట.

 

జాగ్రత్తగా గమనించామా?! నిజంగా తెలుగు రానివారు, అంటే… పొరుగు రాష్ట్రాల్లో పెరగటం మూలానో, లేక ఏ ఇతర కారణంతోనో నేర్చుకునే అవకాశం లభించని తెలుగువారు ఆ మాట అన్నా… ఆ స్వరంలో నవ్వు ఉండదు! పైపెచ్చు కాస్త బాధో, ఆ బాధలో “వచ్చుంటే బాగుండేది" అన్న భావం లీలగానైనా కనబడుతుంది కూడానూ! కొండొకచో బయటకే ఆ భావం స్పష్టంగా చెప్పే వారూ ఉంటారు!

           

 కానీ... కానీ... "మాకు తెలుగు మాట్లాడటం సరిగ్గా రాదూ! " అని నవ్వుతూనో, ఆనందంగానో, గర్వంగానో అదేదో గొప్ప విషయంలా చెప్పారంటే... వాళ్ళని మించిన భాషా ద్రోహులు ఇక వేరే ఎవరూ లేరనే అర్థం!

.

...ఎందుకిలా పదే పదే అదే అదే చెప్తుంటారు? ఈ తరహా జనాలు? అని చిన్నప్పటినుంచీ... ఆలోచించీ, చించీ… ఒకసారి ఒక నిర్ణయానికి వచ్చాను! బహుశా... వీరు తమకి రాని విషయాన్ని ధైర్యంగా నవ్వుతూ నలుగురితో చెప్పుకునే ఉత్తమ సంస్కారులేమో... తత్ సంస్కారానికి నమస్కారాలు చెప్పాలి అని... ఒకమ్మాయి దగ్గరికెళ్ళి… తెలుగులో మొదలెట్టబోయి... తెలుగు సరిగ్గా రాదు కదా పాపం అని సానుభూతితో... హిందీలో ఏడిచాను ఒకసారి!... “అయ్యో! నాకు హిందీ రాదండీ" అని కించిత్ విచారంగా... తెలియజేసింది!!

విచిత్రంగా... ఈ "రాదు"కీ, అప్పటి "తెలుగు రాదు" కీ ఎక్కడో చిన్ని తేడా?! స్వరం లోనూ, భావంలోనూ...! పైగా ఆ వికటాట్టహాసమూ మాయమైంది! అదేంటీ... ఈ విశాలహృదయులు ఏదయినా రాదన్న విషయం మనస్పూర్తిగా నవ్వుతూ కదా చెప్తారూ... అందుకే కదూ... నేను నమస్కారాలు చేసిందీ... అని నా పంథాలో నేను తెలుగులోనే ఆశ్చర్యపోతూంటే... విద్యుత్తు వెలిగింది! అదేనండీ... బల్బు వెలిగింది.

 

“తెలుగు రాదని చెప్పటంలో వారు అపురూపమయిన ఆనందాన్ని పొందుతున్నారు. అందుకే ఆ నవ్వు గర్వంగా వచ్చి చేరుతుంది ఆ చెబుతున్న పెదాలపై!” అని తట్టింది. కానీ, ఎందుకా ఆనందమనేది ఇప్పటికీ సరిగ్గా అర్థమవలేదు!

 

‘తెలుగు రాదు’ అంటే తప్ప తన్మహానుభావులకి/భావురాళ్ళకీ ఆంగ్లం మహా బాగా వచ్చునని అవతలి అమాయకప్రాణాలకు అర్థం కాదనా?

 

లేక, ‘నాకు తెలుగే సరిగ్గా రాదు, నా ఇతర భాషా ప్రావీణ్యం పై ఆశలేమీ పెట్టుకోకండి’ అని సున్నితంగా ముందే హెచ్చరించటమా?!

 

లేక, నిజంగానే తెలుగు రానివారికి ఎక్కడయినా వీర తాళ్ళు వేస్తున్నారా?!

 

ఈ అనుమానాలు వచ్చాక, విచిత్రంగా ఆ- ‘తెలుగు రాద’న్న బాపతు నవ్వు చూస్తే ప్రతిస్పందనగా సానుభూతి కలగట్లేదు! బాధేస్తుంది! కన్నతల్లిని ఎదురుగా ఉంచుకుని అనాథనని చెప్పుకునే పాత సినిమాల్లోని నడమంత్రపు పుత్రులని చూస్తే కలుగుతుందే… ఆ రకమయిన బాధ!

చందమామలో చల్లదనం మూను పదంలో మృగ్యమవుతునట్టు భావించే అమాయక తెలుగు భాషాభిమానులకి మాత్రమే అర్థమయ్యే బాధ అది!

 

తెలుగు అంటే చులకనా భావమా, లోకువ భావమా?! అదే అయితే ఎందుకు?! రాకపోవటం గొప్పతనంగా ఎలా మారిందీ... ఎందుకు మారిందీ... ఎప్పుడు జరిగిందీ?! 

 

సరే నిజంగా మరిచామనే అనుకుందాము. చిన్న విషయం ఏదయినా తెలీకుంటేనే గూగుల్ మాతనో, వికీ పితానో అడిగి తెలుసుకోవటానికి ప్రయత్నిస్తామే... అలాంటిది, చిన్నప్పటి నుంచి అమ్మతో మాట్లాడిన ఈ కమ్మనయిన భాషని అలా అలవోకగా... అంత తేలిగ్గా... రాదంటూ తేల్చేయటం కన్నా... కొంచెం ప్రయత్నిస్తే తిరిగి మాట్లాడలేమంటారా?! అసంబద్ధ అబద్ధాల భ్రమల తెరలు పక్కకి తోసి చూస్తే తెలుస్తుంది… తెలుగు మాట్లాడటం రాకపోతే చక్కగా మాట్లాడే ప్రయత్నమయినా ఎందుకు చేయట్లేదో? తెలుగు రాదని చెప్పటంలో అతిశయమెందుకో?!

 

మాతృభాషలో స్వచ్ఛంగా మాట్లాడటాన్ని కూడా చిన్నతనంగా భావించే ఈ అర్థం లేని పిచ్చితనం తెలుగువారికి మాత్రమే సొంతం!! కాదంటారా?!

 

మనసుకి మరీ కష్టం కలిగితే మన్నించండి! కానీ, తెలుగు భాషని ప్రేమించండి. రానివారికి నేర్పించే ప్రయత్నం చేయండి. కానీ... అలా... నాకూ రాదంటూ బలవంతంగా దూరం చేసి మరీ… మన మూలాలని  సజీవంగా పెకిలించకండి!   వీలయితే … తరతరాలకూ తెలుగుని జీవనదిలా పారించటానికి చిన్ని ప్రయత్నమేదైనా చేయాలే కానీ... ఇలా రాదన్న రాళ్ళు వేసి ఆ ప్రవాహానికి గండి కొట్టటం మాత్రం…  భాషకి చేతులారా చేసే...... ఉహూ... కాదు... ’మాటలారా’ చేసే ద్రోహమవుతుంది.

 

చివరిగా ఒక్కమాట-- తమ సంస్కృతిని తాము ప్రేమించుకోలేని జాతిని ప్రపంచం గౌరవించదు!

‘మిమ్మల్ని మీరు, మీ సంస్కృతికి మూలమయిన మీ భాషనీ ప్రేమిస్తేనే మీ వ్యక్తిత్వానికి నిండయిన గౌరవం లభిస్తుంద’న్న మాట అక్షరాలా నిజం! తెలుగక్షరాలంత అందమయిన నిజం!

****

Deepthi Pendyala, madhuravani, Deepthi Pendyala madhuravani

సంపుటి 1 సంచిక 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

bottom of page