top of page

సంపుటి 1 సంచిక 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వంగూరి పి.పా.

కొట్టుడు యంత్రమూ – కష్టనిష్టూరాలూ కథ

వంగూరి చిట్టెన్ రాజు

మా చిన్నప్పుడు మా ఇంట్లో నేను ఎప్పుడు ఏం మాట్లాడినా “నీకేమన్నా పిచ్చా, వెర్రా” అనే వారు మా చెల్లెళ్ళలో ఎవరో ఒకరు. ఉదాహరణకి నేను ఎన్టీ వాడి సినిమాకి వెళ్దాం అన్నాను అనుకోండి. “పక్క హాల్లో నాగేశ్వర రావు సినిమా ఉండగా ఆ బొండాం గాడి సినిమాకి వెళ్ళడం ఏమిటీ, అదీ సాంఘికం సినిమాయా? నీ కేమన్నా పిచ్చా, వెర్రా?” అనేది ఓ చెల్లెలు. అదే కనక నేను “నాగేశ్వర రావు సినిమాకి తీసుకెళ్తాను. రెడీ అవండి.” అంటే  “నీ మొహం, పక్క హాల్లో శ్రీ కృష్ణ తులాభారం” ఆడుతుంటే ఆ ఆడంగి వాడి సినిమాకి వెళ్దాం అంటావేమిటీ. నీకేమన్నా వెర్రా, పిచ్చా” అనేది ఇంకో చెల్లెలు. “అదేం కాదు. మీకే పిర్రి, వెచ్చి. ఏదో ఒకటి, సినిమాకి తీసుకెళతాను మొర్రో అంటుంటే వెధవ గొంతెమ్మ కోరికలూ మీరూను. కిష్టి గాడి సినిమా అయినా చూడకూడదా ఏమిటి? ” అని విసుక్కునేది ఎలాగో అలాగ, ఏదో ఒక సినిమా చూడ్డానికి ఎప్పుడూ రెడీగా ఉండే మూడో  చెల్లెలు. 
 

ఈ పిర్రి వెచ్చి అనే తిరకాసు మాట ఇప్పుడెందుకు గుర్తుకొచ్చిందంటే నిత్య నూతనంగా మొదలయిన  ఈ మధురవాణి పత్రికలో “పి.పా” అనే శీర్షిక లో ఏదో ఒకటి వ్రాయమని ఆ నిర్వాహక బృందం వారు నన్ను ఆదేశించారు. “పీపాయా...అదేమిటీ బాటిల్స్, అల్యూమినియమ్ కేన్స్ మానేసి ఏకంగా పీపాలలో మొదలెట్టావా?” అని ఒంటి కాలి మీద లేచి కూచిపూడి మొదలెట్టింది మా క్వీన్ విక్టోరియా అదేదో కొత్త రకం ద్రావకం అనుకుని. దానికి అనుగుణంగా నేను నట్టువాంగం చెయ్యాలా లేక పూర్తి గాత్రమే మంచి ఫలితం ఇస్తుందా అని ఆలోచించి, శృతి మించి రాగాన పడే లోపుగా “పి.పా” అనగా “కుదించిన పిచ్చా పాటీ” అంటూ ఆవిడ జతులకి అడ్డం పడ్డాను. “కుదిరిన పిచ్చా? నీకా, నెవర్, ఇంపోజిబుల్, నోవే, హో నహీ సక్తా”  వగైరా అంగ్రేజీ మరియు హిందీ పదాలతో పాపం తను అలిసిపోతూఉంటే నేను జాలిపడి అందరి  అమెరికా ఇళ్ళలో లాగానే మా ఇంట్లో కూడా కంప్యూటర్లు తప్ప కాగితాలు, పెన్నులూ ఉండని కారణం చేత నా ల్యాపుటాపు మీద అర్జంటు గా “పి” అనగా “పిచ్చా” అనీ, “పా” అనగా “పాటీ” అనీ  50 ఫాంట్ల సైజులో కొట్టేసి ఆవిడకి కనపడేలా చూబెట్టాను. అప్పటికి ఆవిడ తిల్లానా దాకా వచ్చేసి, కాస్త అలిసి పోయి నా కంప్యూటర్ రాత చూసి  పక పకా నవ్వేసి..”ఓ, అదా. నీ గురించి వాళ్లకి కూడా తెలిసిపోయి భలే ఇరికించారు నిన్ను” అని జాలి భంగిమ లోకి వెళ్ళిపోయింది మా క్వీన్ విక్టోరియా. అటువంటి పరిస్థితులలో నేను ఎప్పటి లాగానే వెర్రి మొహం భంగిమ లోకి వెళ్ళగానే “అదీ వంగూరి పిచ్చి ఏ పాటీ?” ..సంధి కలిపితే పిచ్చే పాటీ అని అసలు ఈ శీర్షిక పేరు...అంటే తమరికి అందరిలా వేప కాయంత కాక పీపా సైజు అంత పిచ్చి ఉంది సుమా ఇలా టైటిల్ పెట్టారు. నువ్వో అమాయకం ఆంజనేయుడివి. ఎవరైనా పొగిడితే ఎదిగిపోతావు” అంది మా క్వీన్ విక్టోరియా. ఆ రెండు విషయాలూ ..అంటే నాకున్న పిర్రీ వెచ్చి సైజూ పీపా అంత అనియూ, మరియు దాన్ని బ్రేకింగ్ న్యూస్ గా ప్రచారం చేసే దురూహ తోటే మ.వా నిర్వాహకులు సమిష్టిగా స్కెచ్ వేశారనీ నేను నమ్మను కాక నమ్మను.

 

చెప్పొద్దూ ఇలాంటి అపోహకి కారణమైన నా కంప్యూటర్ మీద భలే కోపం వచ్చింది. ఎంత కంప్యూటర్ అయితే మటుకు, గూగుల్ వారు ఎంత గొప్ప వాళ్ళు అయితే మటుకు ఒక్క అక్షరం తప్పుకొడితే అంత శిక్ష వెయ్యాలా? ఏదో హడావుడిలో pichcha బదులు pichche  కొట్టానే అనుకోండి. అయితే మటుకు అర్థంలో ఇంత ఘోరమైన మార్పా? అసలు తెలుగు భాషని ఇంగ్లీషు అక్షరాలతో కొట్టించడం అమెరికా సామ్రాజ్యవాదుల కుట్ర లాగా నాకు అనిపిస్తోంది. మనది ప్రాచీన భాష, వాళ్ళది అప్రాచ్యుల భాషా కదా. మన అక్షరాలని వాళ్ళు కొట్టుకోవాలి కానీ ఇంత అవస్థ ఎందుకొచ్చిందీ అంట? 
 

అంతెందుకు? మొన్నీ మధ్యన ఎప్పుడూ లేనిది నాకు దేవుడి గారి మీద ఆవేశం వచ్చి ఓ భక్తి గీతం రాసి పారేద్దాం అనుకుని, కొత్త ఐడియా వచ్చి ఆ  టైటిల్ గూగుల్ వారి తెలుగులో ఇంగ్లీషులో కొట్టగానే “భాగవాటంలో సంభో సంకర” అని వచ్చింది. అది చెరిపేసి మళ్ళీ కొత్తగానే..అబ్బ..కొట్టగానే భాగవతం బాగానే వచ్చింది కానీ ఈ సంభో మటుకు అక్కడే పాతుకుపోయి, కంప్యూటర్ కట్టేసి మళ్ళీ రీ బూతు..అబ్బా...రీ బూటు బాబూ ... రీ బూటు చేసే దాకా వదల్లేదు. ఇలా ఎన్ని సార్లు కొట్టినా బూతులే వస్తుంటే మొన్న టీవీలో ఓ రాజకీయ నాయకుడు ఎన్నికలలో ఓట్ల లెక్కింపులో తమ పార్టీ అనుసరించే విధానాలని వివరించిన విధానం గుర్తుకొస్తొంది. ఆయన ఉవాచ: “ఎన్నికల బూతులో ఓట్ల లెక్కింపుకి యూతుకి ప్రత్యేక ప్రాతినిధ్యం ఇస్తాం. ఒక ఆడా, ఒక మగా యూతుని ప్రతీ బూతుకీ కేటాయిస్తాం. మా పార్టీ ఆడ యూతు ఉంటే ప్రతిపక్షం పార్టీ వారు మగ యూతుని ఆ బూతులో నియమించుకో వచ్చును”.  ఇది నిజంగానే అక్షరం పొల్లుపోకుండా నేను చెవులారా విన్న మాటలే. ఆయన చేత కంప్యూటర్ లో తెలుగు కొట్టిస్తే ..అనే ఆలోచనే నాకు కంపరం పుట్టించింది.  
 

మరో సారి మా ఊళ్లో జరిగే నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమంలో “స్వీయ రచనా పతనం” ఉంటుంది అని పొరపాటున ఆ ప్రకటనలో రాశాను. నిజమే కాబోలు అనుకుని ఒకావిడ ఈ రోజుల్లో స్వీయ రచనలూ –వాటి అధోగతీ అంటూ ఓ వ్యాసం రాసుకొచ్చింది. నేను ఎన్ని రకాలుగా ఇంగ్లీషులో కొట్టి చచ్చినా ఈ  “ఠ” అనే తెలుగు అక్షరం త, థ, ద, ధ లాగే వస్తుంది. పఠనం అనే మాట ఎప్పుడూ పతనం అవుతూనే ఉంటుంది. మరోసారి గురు వెంపటి చైనా సత్యం గారికి నివాళి ఇవ్వాల్సి వచ్చింది. పాపం ఆయన ఏమనుకున్నారో మరి! అంతకంటే అన్యాయం కేసీఆర్ డోరా గారికి జన్మ”దీన” శుభాకాంక్షలు తెలియజేయడం. అలాగే సోనియా గండీ రాహుల్ గాండీ “మూత్రమే” పార్టీకి పెద్ద దిక్కు.  ఇవేమీ నేను చేసిన స్పెల్లింగ్ తప్పులు కాదు.  గూగుల్ వారు కక్ష కొద్దీ చేయించిన తప్పులు. ఆ మాటకొస్తే లేఖిని వారు కూడా ఇందులో ఏమీ తీసిపోరు. 
 
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే శుభ్రంగా పెన్నూ, కాగితాలూ తీసుకుని కథలు రాసుకుంటే కేవలం మనం చేసే తప్పులే అందులో ఉంటాయి. పోన్లే పాపం, వీడికి తెలుగు రాదుగా అనుకుంటారు. ఈ కంప్యూటర్లలో పరాయి భాషలో తెలుగు అక్షరాలు కొట్టే ఖర్మ రావడంతో మన తాపులే కాక,...అదిగో చూశారా...మన తప్పులే కాక అప్పటికప్పుడు ఆ అక్షరం కొడుతూ తక్షణం చూసుకోకపోతే వచ్చి పడే తప్పులు కోకొల్లలు. వాటిని అచ్చు తప్పులు, అప్పుతచ్చులు అనకూడదు కదా. మరి తప్పు కొట్టుళ్ళు లేదా కొట్టు తప్పులు అనొచ్చా? అవి చూసి కొందరు విమర్శకులు అయ్యో పాపం వీడికి కంప్యూటర్ లో తెలుగు కొట్టడం రాదు కదా అని జాలిపడడం మానేసి ఏకంగా అస్సలు తెలుగే రాదు అని భ్రమ పడి చివాట్లు వేస్తూ ఉంటారు. దాన్ని విమర్శ అనాలా, ఆ వంక పెట్టుకుని తిట్టడం అనాలా?  అదేదో మా అభిమాన పాతకులనే అడుగుదాం....పాతకులు..పాటకులు కాదు బాబోయ్....పాఠకులనే అడుగుదాం....

 

*****

ఓ. రమణ మూర్తి, చెన్నై: శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారికి, మధుర వాణి చాలా చాలా చాలా బాగున్నది. రచన పత్రికలో ప్రతి నెలా నేను మొదట చదివేది ఆఖరు పేజీలలో వచ్చే మీ హాస్య రచనలే; ఆ తర్వాతే మిగతావన్నీ. భాష పై మీకున్న command చూస్తున్నప్పుడు తెలుగు భాషకు ఇంత flexibility ఉందా అని నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. మీరు మధురవాణి లో ఎంపిక చేసిన బాపు గారి కార్టూన్లు అన్నీ క్లాసిక్. అందులో ముఖ్యంగా అప్పడాల కర్ర వివరించే, బూర్ల మూకుడు దుకాణంలో నిలదీసే, పిండి రుబ్బే గ్రైండర్ దగ్గరున్న స్త్రీ రత్నాల face expressions and their outlines అధ్బుతం.

 

వంగూరి చిట్టెన్ రాజు: ఓ రమణ మూర్తి గారూ , మీ ఆత్మీయ స్పందనకి ధన్యవాదాలు. మీరు అనుకున్నట్టుగా నాకు తెలుగు భాష మీద పెద్ద పట్ట్టు ఏ మాత్రం లేదు. ఇంకా అ, ఆ లు నేర్చుకునే స్థాయి లోనే ఉన్నాను. ఉన్నంత లోనే తంటాలు పడతున్నాను..అంతే!

bottom of page