top of page

సంపుటి 1 సంచిక 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

ఆహ్వానిత మధురాలు

వీరాభిమాని

భువనచంద్ర, Buvanachandra

భువనచంద్ర

విజయవాడ రైల్వే స్టేషన్ హడావిడిగా వుంది. పదో నంబరు ప్లాట్ ఫాం మరీ హడావిడిగా వుంది. స్తంభాల చుట్టూ నిర్మించిన అరుగులాంటి దిమ్మ మీద కూర్చుని చుట్టూ చూశాను. ఒకాయన ఓ పేపరు అందరికీ కనిపించేలా మడిచి పట్టుకు తిరుగుతున్నాడు. ఆ పేపర్లో ఓ ఫొటో కనిపిస్తోంది. జాగ్రత్తగా చూస్తే ఆ ఫొటో అతనిదే. నా పక్కన ఓ మధ్య వయస్కురాలుంది. ఆవిడ పక్కన ఓ బామ్మగారూ, హుషారైన మనవరాలూ, అవతలి పక్కన ఓ రిటైర్డ్ తహసీల్దారు. ఆయన ఇందాకే పరిచయమయ్యాడు. ఓ నడివయస్సామె కూడా పరిచయమైంది. ఆవిడ కూతురు వాటర్ బాటిల్ కోసం వెళ్ళింది. ఆవిడా చెన్నై వస్తోందిట. ఓ కుర్రాడు షోల్డర్ బాగుతో వచ్చి నా ముందు నిలబడ్డాడు...ఉస్సు..ఉస్సంటూ. కారణం తీవ్రమైన ఎండ. మిట్ట మధ్యాహ్నం దాటింది గనక సూర్యుడుచండ ఫ్రచండుడై ప్రతాపం చూపిస్తున్నాడు.

"బాబూ, ఓ బాటిల్ నీళ్ళు తెచ్చి పెడతావా?" ఆ కుర్రాడ్ని అడిగాడు ఓ పెద్దాయన. "సీ, అయాం నాట్ యువర్ సర్వెంట్" తలెగరేసి తల బిరుసుతో అన్నాడా కుర్రాడు. "నేను తెచ్చి పెడతాలెండి" బామ్మగారి మనవరాలంది. అసలు ఏమవుతోంది యువత? పెద్దవాళ్ళంటే గౌరవమే లేకుండా పోతోందా కుర్రాళ్ళకీ? ఆలోచిస్తున్నాను.

ఆ కుర్రాడు దీర్ఘంగా పేపరు పట్టుకుని నడిచేవాడ్నే చూస్తున్నాడు. సడన్‌గా, "సార్...మీరు ద గ్రేట్ విలన్ కూర్మీ గారు కదూ! ఆహా… ఇవాళ నాదెంత భాగ్యం! ఓహ్!" అంటూ సాష్టాంగ పడ్డాడు. "ఈజిట్? సో నైస్ యంగ్ మాన్!" సదరు విలన్ గారు కూడా స్టైలుగా చుట్టూ చూసి కుర్రాడితో అన్నాడు. "నా పేరు జితేంద్రనాథ్ సార్...మీ ఫాన్‌ని" అభిమానంతో వంకర్లు తిరుగుతూ అన్నాడు కుర్రాడు. ఆ మాటలు నీళ్ళ బాటిల్ తెచ్చిన అమ్మాయి కూడా విని, 'ద గ్రేట్ విలన్’ వంక కుతూహలంగా చూసింది. "వీడి బొంద... వీడు గ్రేట్ విలన్ ఏమిటీ? ఆ చెత్త 'తొక్కుడు పచ్చడి’ సినిమాలో విలన్ కి మూడో అసిస్టెంటు గానో ఏడో అసిస్టెంటు గానో ఏడిశాడు. వీడు నాకు తెలీక పోవడమే... వీడి పేరు కూర్మావతారం... వీడినాన్న పేరు శేషావతారం. వీళ్ళ తాత పేరు వరాహావతారం...!" కూర్మీ జాతకాన్ని మొత్తం చదివేసింది బామ్మ గారు.

"ఏమిటోనండీ, సినిమా వాళ్ళనీ, రాజకీయనాయకుల్నే తప్ప ఇవాల్టి యువకులు ఎవరి గురించీ పట్టించుకోవడం లేదు!" నిట్టూర్చాడు ఓ పెద్దాయన. "నిజమే సుమండీ. మొన్న ఒక టీవీ ఛానల్లో GK పోటీ పెట్టారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎవరూ అంటే అక్కడున్న వంద మందిలో ఒక్కడు కూడా చెప్పలేదు. సినీనటి బాబిలోనియా బర్త్ డే మాత్రం నూటికి నూరు మందీ ఖచ్చితంగా చెప్పారు." తనూ ఓ నిట్టూర్పు జోడించి అన్నాడు పెద్దాయన.

"సార్... మీ బేగ్ నేను పట్టుకోనా సార్... ద గ్రేట్ విలన్ కూర్మీగారి బేగ్ పట్టుకున్నానని నా ఫ్రెండ్స్ తో గర్వంగా చెప్పుకుంటాను!" అత్యంత అతి వినయంతో అన్నాడు జితేంద్రనాథ్.

"ఈ బేగు పట్టుకుని వాడు వుడాయిస్తే గాని వీడికి బడాయి వదల్దు" కూర్మీ వైపు కోపంగా చూస్తూ, పక్క వాళ్ళకు వినిపించేటట్టు అన్నది బామ్మ గారు. "నీకెందుకే కోపం?" నవ్వింది మనవరాలు. "లేకపోతే! గుర్తించి కూడా నేనెవరో తెలీనట్టు పోజు కొడుతూంటే కోపం రాదూ?" దీర్ఘం తీసింది బామ్మగారు. "సారీ మిస్టర్ నాథ్...ఎవరి లగేజి వాళ్ళే మొయ్యాలనేది నా ప్రిన్సిపుల్. అయినా నేను వాటర్ తెచ్చుకోవాలి" గంభీరంగా అన్నాడు కూర్మీ. "నో సర్, నేను తెస్తా" అంటూ ప్లాట్ ఫారం వైపుకి పరిగెత్తాడు జితేంద్రనాథ్. "ఓరి వీడి మొహం మండా, ఇందాక తాతగారడిగితే, నేను నీకు సర్వెంటునా అని నీలిగాడు, ఇప్పుడేమో ఆ వరాహంగాడి మనవడి కోసం మిల్కా సింగులా పరిగెడుతున్నాడు. కలికాలం అంటే ఇదే గామోసు!" మెటికలు విరిచింది బామ్మగారు. అరనిముషంలో బాటిల్ తెచ్చి, మూత తీసి, కూర్మీఓ గుక్క తాగి బాటిల్ ఇచ్చాక మళ్ళీ బాటిల్ కి మూత బిగించి భక్తిగా ఆ బాటిల్ పట్టుకు నుంచున్నాడు జితేంద్రనాథ్.

"ఇదిగో మనీ" జేబులో చెయ్యి పెట్టకుండానే అన్నాడు కూర్మీ. "నో సార్, మీకు వాటర్ తేవడం నా భాగ్యం" ఇంకా భక్తిగా అన్నాడు జితేంద్రనాథ్. "వెధవది… పుట్టుకతో వచ్చిన బుధ్ధెక్కడికి పోతుందీ? వీడి నాన్నా వీడి తాతా కూడా మరీ పిసినార్లులే. జేబులో చెయ్యి పెట్టకుండా 'ఇదిగో మనీ' అంటాడా, వీడి చెవుల్లో చెట్లు మొలవా!" కూర్మీని కోపంగా చూస్తూ అన్నది బామ్మ. "అబ్బ వాళ్ళ గోల మనకెందుకే?" నవ్వుతూనే కొంచెం చికాకు ధ్వనించేలా అన్నది మనవరాలు.

"అవునండీ బామ్మగారూ… అసలు జనాలు ఎంత అధ్వాన్నంగా తయారయ్యారంటే, మన గాంధీగార్నీ, నెహ్రూగార్నీ కూడా మర్చిపోయారు..ఎంత సేపూ..." తాసిల్దారు గారు అంటూ ఉండగానే "చెన్నై నించి విజయవాడ వచ్చు జనశతాబ్ది మరికొద్ది నిముషములలో పదవ నంబరు ప్లాట్ ఫారం మీదకు రాబోతున్నది. యాత్రియో కృపయా ధ్యాన్ దే" అని తెలుగు హిందీ భాషల్లో నిరాసక్తంగా అనౌన్స్ చేసింది అనౌన్సరిణి. జనాలు గబగబా లేచి నిలబడ్డారు. కొందరైతే సామాన్లు కూడా పట్టుకుని సిధ్ధంగా వున్నారు.

"ఇదిగో ముసలాయనా... కాస్త కళ్ళు పెట్టుకు చూడు. నేను నా మనవరాలికి బామ్మను గానీ, నీక్కాదు. ఇంకోసారి అట్టా పిలవకు" గట్టిగా తాసిల్దారుకి వార్నింగిచ్చింది బామ్మ.

రిటైర్డ్ తాసిల్దారు నోరు తెరిచే లోగానే "శ్రీమంత్ కి జై .. యంగ్ హీరో శ్రీమంత్ జిందాబాద్" అంటూ ఓ గుంపు గుంపూ ప్లాట్ ఫాం మీద కొచ్చింది. చూస్తే కుర్ర హీరో శ్రీమంత్. అతను యాక్ట్ చేసిన 2 సినిమాలు సూపర్ హిట్టై కూర్చున్నాయి. ప్రస్తుతం యువతకి అతనంటే పిచ్చి క్రేజ్.

జితేంద్రనాథ్ అటు తిరిగే లోగానే ఇటు వైపు నించి ధన ధనా ట్రైను ప్లాట్‌ఫాం మీదకి వచ్చేసింది.

రాయల్‌గా టికెట్టుకొని రిజర్వు చేసుకున్నా, ఆ సీటుని ఎవరన్నా ఎత్తుకుపోతారేమో అన్నంత హడావిడిగా, కంగారుగా, దిగేవాళ్ళని కనీసం దిగనివ్వకుండా తోసుకుంటూ ఎక్కడం మనవాళ్ళకి అలవాటు. మామూలుగానే ట్రైను ఎక్కడమూ దిగడమూ ఓ ప్రహసనం అయితే, ఇవ్వాళ ఈ శ్రీమంత్ అభిమానుల హడావిడిలో ట్రైను ఎక్కడం ఎవరెస్టెక్కినంత పనైంది. నాకు ముందే కూర్మీ, జితేంద్రనాథ్ ఎక్కేశారు. బామ్మగారు జమాయించి మరీ జనాల్ని తోసేసి ట్రైనెక్కింది... మనవరాలితో సహా. నేను చూస్తూ వుండగానే నాథ్ వాటర్ బాటిల్ ని కూర్మీ ఒళ్ళో పడేసి జనాల్ని తోసుకుంటూ శ్రీమంత్ దగ్గరగా వెళ్ళి, "సార్, శ్రీమంత్‌గారూ, నేను మీకు పిచ్చ ఫాన్నండీ... మీ ‘బుద్ధిలేనోడు’ సినిమా ముప్ఫైసార్లూ, ‘ఆడేరా ఎదవ’ సినిమా అరవై సార్లూ చూశానండీ. అసలు మిమ్మల్ని కలవడం నా పూర్వజన్మ అదృష్టమండీ" అంటూ స్తోత్రం మొదలుపెట్టాడు - అదీ గాఠిగా. ఆ స్తోత్రం అందరూ విన్నారు. పాపం కూర్మీ మొహం పెసరట్టు మాడినట్టు మాడింది. శ్రీమంత్ అప్పటికే జనాలతో బిజీగా ఉండటంవల్ల జితేంద్రనాథ్ వైపు తిరిగి కూడా చూడలేదు. కోపంగా వెనక్కొచ్చాడు నాథ్. "హూ! లోకంలో ఎంత ఎదిగినా మీలాగే ఒదిగి వుండేవాళ్ళు అతి తక్కువమంది సార్! వెధవది రెండు సినిమాలు హిట్టయ్యాయో లేదో, ఎంత టెక్కూ? ఒక్క సినిమా ఫ్లాపయ్యాక చూద్దాం వీడి బోడిగొప్ప" కోపంగా అన్నాడు జితేంద్రనాథ్ కూర్మీతో.

“కూర్మాయ్ తో అంటే వాడేం చేస్తాడూ? ఆ కుర్రవెధవ పార్టీ మార్చేసి అటు పరిగెత్తాడుగా, మళ్ళీ పాతపార్టీలోకి చేర్చుకోవడానికి ఇదేమైనా రాజకీయ పార్టీయా?" గలగలా నవ్వింది బామ్మగారు.

మొత్తానికి ట్రైన్ బయల్దేరింది. అయినా తెనాలిదాకా శ్రీమంత్ ‘హవా’ నడుస్తూనే ఉంది.

"సురమాలినీకీ జై… సురమాలినీ జిందాబాద్" ట్రైన్ తెనాలిలో ఆగకముందు నించే చెవులు హోరెత్తిపోయాయి. మాజీ నర్తకీమణి ‘సురమాలిని’ స్టైల్‌గా ట్రైనెక్కింది. మా కంపార్టుమెంటులోనే. సురమాలిని ఆ రోజుల్లో సూపర్ డాన్సర్. ఆవిడ డాన్స్ లేని సినిమా వుండేది కాదు. నవ్వుతూ ముందునించీ, నడుస్తూ వెనకనించీ జనాల్ని మత్తులో ముంచి ముంచి తేల్చింది. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ సినీరంగం సురమాలినికి జోహార్లు కొట్టింది. ఇంకా జనానికి సురమాలిని "సెగ" తగ్గలేదు.

ఆవిడ ఎంటరైన మరుక్షణం ఆవిడ పాదాలమీద వున్నాడు జితేంద్రనాథ్.

"ఓరి వీడ్ని తగలెట్టా! అదేమిటీ, పాదాలమీద పడిపోయాడూ?" నోరు వెళ్ళబెట్టింది బామ్మగారు.

"అదేనండీ సినిమా క్రేజంటే!" వరస కలపకుండా అన్నాడు రిటైర్డ్ తాసిల్దారు.

సురమాలిని సుతారంగా ఆవిడ సీట్లో కూర్చోగానే కంపార్టుమెంటుకి కసెక్కింది. పెళ్ళాలు పక్కన లేకుండా ప్రయాణం చేస్తున్న మగవాళ్ళంతా ఆవిడ చూపు’ కోసం, ఆటోగ్రాఫు కోసం క్యూ కట్టారు. ఆ ‘క్యూ’ని కంట్రోల్ చేస్తూ సురమాలినికి బాడీగార్డైపోయాడు జితేంద్రనాథ్. మధ్యమధ్యలో "నేను మీ వీర ఫ్యాన్ని మేడం! మీ ‘ఇస్తావా చస్తావా’ సినిమా యాభై సార్లు చూశా. అంతెందుకూ, ‘కుక్క వెంటపడగానే కక్కొచ్చిందీ’ పాట కోసమే మీ ‘భలే నాయాల’ సినిమా వందసార్లు చూశా. ఇవాళ నా జన్మ తరించింది!" అంటూ స్తోత్రాలూ చదువుతున్నాడు."ఓహ్ ... నీళ్ళ సీసా మర్చిపోతిని" తమిళ యాసతో అన్నది సురమాలిని.

"ఒన్ మినిట్" అని ఒక్క గంతులో కూర్మీ దగ్గరికొచ్చి, అప్పుడే బాటిల్ మూతని ఓపెన్ చేసిన కూర్మీ చేతుల్లోంచి బాటిల్నీ, మూతనీ కూడా పెరుక్కుని మరో గంతులో సురమాలినిని చేరి సీసా అందించాడు జితేంద్రనాథ్.

"ఓరి వీడి ముక్కులో ములక్కాడ దూర్చా! తాగబోయే నీళ్ళు లాక్కుపోయాడేమిటీ ఆ వెధవాయ్?" ఆశ్చర్యంగా జితేంద్రనాథ్‌ని చూస్తూ అన్నది బామ్మగారు.

"అంతేనండీ అంతే. సినిమా క్రేజంటే అంతే!" వరస కలపకుండా జాగ్రత్తలు తీసుకుని అన్నాడు రి. తాసిల్దారు.సురమాలిని చుట్టూ మగాళ్ళూ, శ్రీమంత్ చుట్టు ఆడాళ్ళూ ఆయస్కాంత సిద్ధాంతాన్ని రుజువు చేస్తున్నారు. జనాలందరూ సినీస్టార్స్‌ని చూడడానికి అదే పనిగా మా కంపార్టుమెంటులోకి వస్తూ వుండడంతో మాకు పిచ్చెక్కిపోతోంది. గుంపువల్ల ఏ.సీ.ఎఫెక్టు తెలీడంలా. టీ.సీ, వెండర్సూ కూడా రావడం మానేశారు.

ట్రైను గుంటూర్ని గుంభనంగానే దాటినా ఒంగోల్లో మళ్ళీ ఇంకో వూపు అందుకుంది. కారణం, "వరహాల్రావుగారూ వర్ధిల్లాలి, వరహాల్రావు గారూ జిందాబాద్" అనే అరుపులూ, జయజయధ్వానాలే.

పొట్టిగా, లావుగా, చామనచాయలో వున్న ఓ మిడిల్ ఏజ్‌డ్ వ్యక్తి దొర్లుతున్నట్టుగా కంపార్టుమెంటులో ప్రవేశించి కళ్ళతోనే కంపార్టుమెంటుని ఎక్స్‌రే తీసి సురమాలినిని స్పాట్ చేశాడు. ఆయన వెనకే ఇద్దరు గన్‌మెన్‌లూ, మరో కొంతమంది టిక్కెట్టు లేని (అక్కర్లేని) అనుయాయులూ. మళ్ళీ ఆయస్కాంత సిద్ధాంతాన్ని రుజువు చేస్తూ సురమాలిని కూడా వరహాల్రావుని స్పాట్ చేసింది. (రాజకీయనాయకులూ, సినీకళాకారులూ పరస్పరము ఆకర్షించుకొందురు. అందుకే నేటి యంగ్ హీరో = రేపటి రా.నాయకుడు)."సుమ్మీ" ఆనందంగా నోరంతా తెరిచి అన్నాడు వరహాల్రావు.

"వరా!" మధురాతిమధురంగా వరహాల్ని చూసి, లేచి, మరీ అన్నది సురమాలిని.

అనడమే కాదు పక్కన కూర్చున్నవాడ్ని, "సార్, మీరు కొంచెం దయచేసి మరో సీట్లోకి మారితే వారు నా పక్కన కూర్చుంటారు - ప్లీజ్!" అని ఓ సెక్సీ స్మైలు కూడా ఇచ్చింది.

కరెక్టుగా అలాంటి స్మైల్‌కే వరహాల్రావు కొన్నేళ్ళ క్రితం దిమ్మతిరిగి పడిపోవడమే గాక, సురమాలినితో పిక్చరు కూడా తీశాడు. పిక్చరు సూపర్‌హిట్టైనా డబ్బంతా సురమాలిని ఖాతాలోకీ, చిప్పాకర్రా మాత్రం వరహాల్రావు ఖాతాలోకీ ‘జమ’ అయ్యాయని గిట్టనివాళ్ళు బోలెడు కూతలు కూశారనుకోండీ... అది వేరే విషయం.

అప్పటిదాకా సురమాలిని పక్కన కూర్చున్నవాడు మహదానందంగా లేచి, "వై నాట్ మేం" అని మా వేపుకి వచ్చి నిలబడటమే కాక ఫోన్ తీసి

"ఇదిగో సత్యా... ఇప్పుడేమైందో తెలుసా? మన సురమాలిని లేదూ... అవును, ఆవిడే... ఓ చిన్న విషయంలో నన్ను భలే ప్రాధేయపడిందనుకో... అదా? ఇంటికొచ్చాక చెబుతాలే" అని అర్జంటుగా పెళ్ళానికి ఫోన్ కూడా చేశాడు. వరహాల్రావు ‘సుమ్మీ’ పక్కన సెటిలవగానే గన్‌మేన్‌లు జనాల్ని నిర్దాక్షిణ్యంగా అక్కడినించి పంపించారు. జితేంద్రనాథ్ ఆ ‘స్పాట్’ని వదలకుండా అక్కడే వేలాడుతుంటే ఓ గన్‌మేన్, "నీక్కాదూ చెప్పేది? అవతలికి పో!" అని వార్నింగ్ కూడా ఇచ్చాడు. "చూడండి మేం, ఇతనూ..." గన్‌మేన్ మీద సురమాలినికి ఫిర్యాదు చెయ్యబోయాడు నాథ్.

"సెప్పినాడుగా పూడ్సమనీ ... పూడ్సు" అని సగం తమిళ తెలుగులో అన్నది సు.మా. జితేంద్రనాథ్ మొహం మొన్నటి పువ్వులా వాడిపోయింది.

"ఇందాక ఆ గుమ్మడికాయగాడితో బాగానే మాట్లాడిందిగా తెలుగులో! మళ్ళీ ఈ పూడ్చడాలూ పాతిబెట్టడాలూ ఎందుకూ?" ఆశ్చర్యంగా అన్నది బామ్మగారు.

"సినిమావాళ్ళంటే అంతే!... ఓ విషయం మీకు చెప్పాలి... ఆ వరహాల్రావుగారు మాజీ ఎమ్మెల్యే. వారి నియోజకవర్గంలోనే నేను పనిచేశా. మాంచి కళాపోసన వున్నవారు. తండ్రి బంగార్రావుగారు గతించాక ఎమ్మెల్యేగా నిలబడి గెలిచారు. ఎందరో ‘సనాధ’, ‘అనాధ’ స్త్రీలకి వారు వెన్నుదన్నుగా నిలిచారు. అదిచూసి ఓర్వలేని ప్రతిపక్షంవారు వీరిని ఓడించారుగానీ, లేకపోతే మంత్రి కాదగినవారు!" గతకాలపు తాసిల్దారీ లౌక్యాన్నంతా మేళవించి అన్నాడు రి.తాసిల్దారు.

కుతూహలంగా అటు వరహాల్రావు వంక చూస్తే ఆయన సురమాలిని వీమ్మీద చనువుగా చెయ్యేసి గట్టిగా నవ్వుతున్నాడు. కొన్ని పరిచయాలకి కాలపరిమితి వుండదుకదా! ఆ తరవాత జనాలకి అర్థమైంది వగలకి వయసుండదని.

నెల్లూరు రాగానే మళ్ళీ స్లోగన్ సునామీ. యువనటి ‘మృదులా ఓమనకుట్టి’ జయజయధ్వానాల మధ్య రైలు ప్రవేశం చేసింది. గోలేగోల. ఇందాకటి అవమానాన్ని క్షణంలో వదిలించుకుని అటు పరిగెత్తాడు జితేంద్రనాథ్.

"ఏమిటీ, ఆకాశంలో తారలన్నీ ఇవ్వాళ ట్రైన్లోకి దిగాయా?" ఆశ్చర్యంతో అన్నది బామ్మగారు. అప్పుడే ట్రైనెక్కిన మరో పెద్దావిడతో. "మీకు తెలీదా అక్కయ్యగారూ, నెల్లూరు నించి మద్రాసు వెళ్ళే రోడ్డు పొద్దున్నించీ ట్రాఫిక్ జామ్ లో బ్లాకై పోయింది, కార్లని మోసుకెళ్ళే ఓ హెవీ వెహికిల్ అడ్డంగా పడ్డదిట. దాంతో కొన్ని వేల వెహికిల్సు నిలిచిపోయాయి. ఆ పడిపోయిన బండిని తియ్యడానికి వెళ్ళే క్రేనుకి కూడా దారి దొరక్కుండా అయిందట. దాంతో ట్రైన్స్ కి ఎక్కడ లేని రద్దీ వచ్చింది" వివరించిందావిడ.

"అలాగా అక్కయ్యా!" తలకాయ ఊపింది బామ్మగారు.

"అదేవిటో బామ్మా, ఆవిడ నిన్ను అక్కా అంటే నువ్వూ అక్కా అని అంటావే అవిడ్నీ?" అడిగింది మనవరాలు.

"నేనావిడ కంటే పెద్ద దాన్లా కనిపిస్తున్నానా? నన్ను అక్కయ్యా అని పిలిచి తను కుర్రది అని అనిపించుకోవాలనుకుందా నంగనాచి. అందుకే ప్లేటు తిరగేసా" నవ్వింది బామ్మగారు.

జనాలు ఫుల్‌గా మృదులా ఓమనకుట్టి చుట్టూ చేరిపోయారు. సు.మా., వరహల్రావు కూర్చున్నది నాకు రెండు వరసల ముందే గనుక వాళ్ళ మాటలు నాకు వినిపిస్తున్నాయి.

"హు... చూశావా వరా... ఆ మలయాళీది వేలెడంత లేదు. రావడం రావడం శ్రీమంత్ గాడి పక్కన సెటిలైపోయింది. అసలా ఇకఇకలు పకపకలు చూడు. అసలా డ్రెస్సుకి ఒళ్లంతా కనబడటంలా? మేం అసలు ఎప్పుడైనా అలా ఉన్నామా?” తన ఫాన్స్ అందరూ అటుపోవడంతో, ఈర్ష్య పుట్టుకొచ్చి అన్నది సురమాలిని.

"డోంట్ వర్రీ సుమ్మీ. ఈసారి మళ్ళీ నీతోనే ఓ సూపర్ హిట్టు తీస్తా! అప్పుడు లోకానికి రుజువవుతుంది నువ్వేమిటో!"

అనునయంగా సురమాలిని మోకాలి మీద చెయ్యేసి అన్నాడు వరా.

"ఇంకేం రుజువు చెయ్యాలి ఉడిగిపోయిన ఉమ్మెత్తలాగా?" నవ్వింది బామ్మ.

"అబ్బ ఆపవే నీ గోల" విసుక్కుంది మనవరాలు."

అందుకే అంటాను నీకు లోకజ్ఞానం బొత్తిగా లేదని, ఎదుటి వాళ్ళు బాధలోనో, ఈర్ష్యతోనో ఉన్నప్పుడే ఇలాంటి వరహాల్రావులు ‘అడ్వాన్టేజి’ తీసుకుంటారు. చూడు వాడు ఆ సుమ్మీ వీపు మీద పాములాగ చేతుల్ని పాకిస్తున్నాడు" మనవరాలికి వాళ్ళిద్దరినీ చూపిస్తూ అన్నది బామ్మగారు.

గూడూరొచ్చేసింది. గబగబా టాటా చెప్పినట్టు చెయ్యూపి గన్ మెన్ లూ, టికెట్ లేని అనుయాయుల్తో సహా ట్రైన్ దిగిపోయాడు వరహల్రావు.

పాపం ఎంత ప్రయత్నం చేసినా మృదుల కొనగంటి చూపు కూడా జితేంద్రనాధ్ కి దక్కకపోవడంతో నిరాశగా వచ్చి మళ్ళీ పక్కన కూర్చున్నాడు. "ఏదో మీలాంటి వాళ్ళు తప్ప మా అభిమానుల అభిమానాన్ని ఎవ్వరూ అర్ధం చేసుకోరు గురువుగారూ. ఈ శ్రీమంత్ గాడికీ ఆ మృదులకీ ఎన్ని లీటర్ల పాలతో కటౌట్‌లకి పాలాభిషేకం చేసామో మీకు తెలుసా? హూ! సినిమా వాళ్ళ దృష్టిలో, అంటే మీరు కాదనుకోండి, అభిమానులంటే తిని అవతల పారేసే పేపర్ ప్లేట్లు, కాల్చి పారేసే సిగరెట్టు పీకలు, చదివాక డిలీట్ చేసే యీ-మెయిళ్ళు!! నిట్టూర్చాడు నాధ్.

"తెలీకడుగుతా గానీ, ఎవడోయ్ నిన్ను ఫేన్‌గా ఉండమన్నదీ? ఈ కూర్మాయ్ పక్కన ఉన్నవాడివి పార్టీ మార్చి ఆ శ్రీమంత్ దగ్గరికి ఎందుకెళ్ళావూ? పోతివిబో - అక్కడన్నా ఉండక మళ్ళీ వెనక్కెందుకొచ్చావూ? వస్తివిబో - మళ్ళీ ఆ సురమాలిని చుట్టూ "టామీ"లాగా ఎందుకు తిరిగావూ? ... తిరిగితివిబో - మళ్ళీ అదేమిటీ ఆ మళయాళ మహాకాళి దాని వెనక ఎందుకు పడ్డావూ?" వాయించి పారేసింది బామ్మ.

"నువ్వూరుకోవే" కోపంగా కసిరింది మనవరాలు.

"మీరు చెప్పింది నిజమే మామ్మగారూ ఇంతకాలం పిచ్చివాడిలా సినిమావాళ్ళని అభిమానించా. ఏదో యీ కూర్మీలాంటి మహానుభావులు తప్ప మిగతా వాళ్ళందరూ …” అతన్ని మధ్యలోనే ఆపింది బామ్మ.

"అదే వద్దంది! ఈ లోకంలో ఎవడి పొట్టకోసం వాడు తిప్పలు పడేవాడే గానీ సామాన్యుడూ లేడు, మహానుభావుడూ లేడు. పది మంది నిన్ను ‘ఓహో’ అంటే నువ్వు గొప్పవాడివీ - ఛీ ఛీ అంటే చెత్త గాడివి. ఆ పది మంది ఎవరూ? నీ లాగా వెర్రిగా జనాల వెంట పడేవాళ్ళు" మానవ జీవన రహస్యాన్ని కళ్ళకి కట్టించింది బామ్మ గారు.

"నా కారు ఆల్‌రెడీ ఇక్కడే ఉంది. తరువాత మీకు ఫోన్ చేస్తా!" మర్యాదగా మృదులతో చెప్పి సూళ్ళూరుపేటలో దిగాడు శ్రీమంత్. అప్పుడు గుర్తుకు వచ్చింది వాళ్ళది సూళ్ళూరుపేట అనీ, ఆ వూరిలో వెలసిన చెంగాళమ్మ అంటే శ్రీమంత్ కి విపరీతమైన భక్తి అనీ.

కొంత కుతూహలం తగ్గినా సురమాలినినీ, మృదులనీ జనాలు పలకరిస్తూనే ఆటోగ్రాఫ్‌లు తీసుకుంటూనే సేల్ఫీలు తీసుకుంటూనే వున్నారు. అయితే జనాల గుంపు కుర్ర హీరోయిన్ దగ్గరే ఎక్కువుంది.

ముక్కుతూ మూలుగుతూ అక్కడక్కడా లోకల్ ట్రైన్స్‌కి దారి యిస్తూ జనశతాబ్ది బేసిన్ బ్రిడ్జి దాకా వచ్చింది.

ప్రయాణీకులు గబగబా సామాన్లు సర్దుకుని గేట్ల దగ్గరికి చేరుకుంటున్నారు. గమ్యం చేరక తప్పదని తెలిసీ అంత తొందరెందుకో! ఇద్దరు ముగ్గురు కుర్రవాళ్ళు మృదుల సామాను 'రాక్' నుంచి కిందకి దింపారు. మృదుల స్వీట్ గా ఓ స్మైలిచ్చి "యూ మస్ట్ హెల్ప్ మీ టిల్ మై డ్రైవర్ కమ్స్” అని వాళ్ళతో అనడం స్పష్టంగా మాకు వినిపించింది. సురమాలిని దగ్గరిప్పుడు ఎవరూ లేరు... ఎవరి తొందర వాళ్ళది. ఇంకో రెండు నిముషాలలో సెంట్రల్ వస్తుంది.

సురమాలిని చుట్టూ చూసి, జితేంద్రనాథ్ ని గుర్తు పట్టి ఓ స్వీట్ లుక్ ఇచ్చింది. కూర్మీ పక్కన దిగాలుగా కూర్చున్న వాడు కాస్తా ఒక్క ఉదుటున లేచి సురమాలిని దగ్గరికి పోయి ‘రాక్’ నించి ఆవిడ సూట్ కేస్ ని దించాడు. "థాంక్యు యంగ్‌మాన్" అంటూ చిరునవ్వుతో మెచ్చుకోలుగా చూసింది సురమాలిని.

"ఇహ ఆవిడ్ని కారెక్కించే దాక యీ పిల్లాడు వదల్డు ఎంతైనా ఫేన్ కదా !" కూర్మీ వంక నవ్వుతూ చూస్తూ అని సీట్లోంచి లేచింది బామ్మగారు. "ఫేన్ ... హూ...!" అని కూర్మీ గొణుక్కోవడం నాక్కూడా వినిపించింది, అది వేరే విషయం అనుకోండి.​.

****

Anchor 1

భువనచంద్ర

నూజివీడు దగ్గర గుల్లపూడిలో జన్మించి, 18 సంవత్సరాలకి పైగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పని చేసి, , నాలుగు వార్ మెడల్స్ పొందిన తరువాత భువన చంద్ర పదవీ విరమణ చేశారు.  తరువాత విజయ బాపినీడు గారి “నాకో పెళ్ళాం కావాలి” అనే సినిమాలో 1987 లో పాటల రచయితగా సినీ రంగ ప్రవేశం చేసి, సుమారు వెయ్యి చిత్రాలలో 2500 పైగా పాటలు రచించి విలక్షణమైన కవిగా లబ్ధ ప్రతిష్టులయ్యారు. స్క్రీన్ ప్లే, సంభాషణల రచయిత గానూ, నటుడిగానూ రాణించారు. అనేక పత్రికలలో కథలు, వ్యాసాలూ, ఒక ఆధ్యాత్మిక సీరియల్ మొదలైన ప్రక్రియలలో నిత్య సాహితీ కృషీవలుడిగా, మంచి వ్యక్తిగా పేరున్న భువన చంద్ర గారి నివాసం చెన్నై మహా నగరం.

*****

bottom of page