top of page

సంపుటి 1 సంచిక 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

'సినీ' మధురాలు

ఆ గళం ...అచ్చమైన నుడి కారం

శ్రీనివాస భాను ఓలేటి

పాడటం ఓ కళ! అందులోనూ నేపథ్య గానం ప్రత్యేకమైన కళ!

తెర మీది దృశ్యం, తెర వెనక గాత్రం - పాలూ తేనెల్లా కలిసిపోవాలి.

వాటిని విడదీయలేని అనుభూతి ఆవిష్కృతం కావాలి.

ఇంపుగా ఉండాలి. సొంపులు తిరిగి సోయగాలు పోవాలి.

ఇవన్నీ ఒకెత్తు. స్పష్టత, స్వచ్ఛత గొంతులో గుడి కట్టాలి.

ఇవన్నీ కొలువు తీరిన గొంతు శ్రీ బాలు గారిది.

అందుకే యాభయ్యేళ్లుగా అది తెలుగు చలనచిత్ర గీతానికి పర్యాయపదమైపోయింది.

పాటల చదువుకు పాఠ్యగ్రంథమైపోయింది.

తరాల సంగీతాభిమానుల తరగని అభినందనల్ని అందుకుంటోంది.

 

'శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న'లో "రావే కావ్యసుమబాలా .." అని తొలిసారిగా పల్లవించినప్పుడూ, 'ప్రైవేటు మాస్టారు'లో "పాడుకో పాడుకో .." అని పాడుతూ చదువుకోమని సందేశం ఇచ్చినప్పుడూ, అలాగే "మేడంటే మేడా కాదూ .." (సుఖ దుఃఖాలు), "రావమ్మా మహాలక్ష్మీ ..", "చుక్కలతో చెప్పాలని ..", చాలు లే నిదురపో .." (ఉండమ్మా బొట్టు పెడతా) లాంటి పాటలతో పూతరేకుల తీయదనాన్ని లేత గొంతులో పంచి ఇచ్చినప్పుడూ - తెలుగు సినిమా అభిమానులు ఆనందించారు. "కొత్త గొంతు గమ్మత్తుగా వుంది" అనుకున్నారు. ఆ క్రమం లో “నేనంటే నేనే వచ్చింది”. "ఓ చిన్నదానా .." పాట వెల్లువలాగా దూసుకొచ్చింది. హాల్లో చూసిన వాళ్ళనీ, రేడియోలో విన్న వాళ్ళనీ ఒకే లాగ ఉర్రూతలూగించింది. ముఖ్యంగా నటుడు కృష్ణకు సరిపడే గొంతు వచ్చిందని జనం చెప్పుకున్నారు.

 

నటుడైనా, గాయకుడైనా తమ లో వైవిధ్యాన్ని రుజువు చేసుకోవాలనుకుంటారు. హుషారు పాటలతో పాటు లలిత శాస్త్రీయ సంగీత ఛాయలున్న పాటల్ని కూడా పాడగలనని ఆ స్వరం నిరూపించుకునే దశలో బాలు గారికి 'శ్రీరామ కథ'లో సముద్రాల రాఘవాచార్యుల వారి చివరి గీతం "రామ కథ.. శ్రీరామ కథ" ను రాగమాలిక లో పాడే అవకాశం వచ్చింది. గాత్రంలో వైవిధ్యాన్ని చూపించడానికి దోహదపడింది. అలాగే 'ప్రతీకారం’ చిత్రం లో "నారీ రసమాధురీ..", 'ఆంధ్ర పుణ్యక్షేత్రాలు' (జానకి గారితో కలిసి పాడిన ప్రైవేటు ఆల్బం - రాగ మాలిక) లాంటివి కూడా ఆయన లోని గాయకుడు ఆశించే వైవిధ్య ప్రదర్శనకు ఊతమిచ్చాయి!

 

కానీ, అప్పటి చలన చిత్ర అవసరాల దృష్ట్యా అలాంటి అవకాశాల కోసం బాలుగారు మరికొంత కాలం నిరీక్షించాల్సి వచ్చిందేమో! అదృష్టం వల్ల అవకాశాలు వస్తాయోమో గానీ, వాటిని సద్వినియోగం చేసుకోడానికి కృషి, పట్టుదల, ప్రతిభ ముప్పేటలా తోడు కావాలి. ఆ మూడూ ఉన్న బాలూ గారి గొంతు ఎప్పటికప్పుడు సత్తాను నిరూపించుకుంటూనే, ఎదురైన పరీక్షల్లో విజయాన్ని ప్రథమ శ్రేణిలో సాధిస్తూనే వచ్చింది.

 

సంపూర్ణ నేపథ్యగాయకుడిగా ఎదిగే ప్రస్థానం లో ఆయనకు మరో ముఖ్యమైన సవాలు ఎదురయింది. అదే - "అగ్రనటులు ఎన్టీఆర్, ఏయన్నార్ లకు బాలుగారి గొంతు సరిపోతుందా?" అన్న మీమాంస! అప్పటికి ఎన్టీఆర్ కి ఆయన "పట్టాలి అరక దున్నాలి మెరక .." (చిట్టి చెల్లెలు), "నిద్దురపోరా స్వామీ.." (కోడలు దిద్దిన కాపురం), అలాగే ఏయన్నార్ కి "నాహృదయపు కోవెల లో .." (ఇద్దరు అమ్మాయిలు) లాంటివి పాడారు. కానీ మీమాంస తీరడానికి మరికొంత సమయం పట్టింది. ఆ లోగా వైవిధ్యం, సంకల్పం, పట్టుదల, తపన, రాజీపడని తత్త్వం, క్రమశిక్షణ, ఒడిసిపట్టి ఒదిగిపోయే నైపుణ్యం - ఈ ఏడు లక్షణాలూ సప్తస్వరాలై బాలుగారి గొంతులో స్థిరపడిపోయాయి. ఫలితం ఏమిటో అగ్రనాయకులకు ఆయన పాడిన పాటలే చెప్పాయి. 'దానవీరశూర కర్ణ' వచ్చింది. దుర్యోధనుడిపాత్ర లో ఎన్టీఆర్ కి యుగళగీతం - "చిత్రం ..భళారే విచిత్రం" ఒక ఊపు ఊపింది ...సరికొత్త పోకడ సృష్టించింది. 'ఆలుమగలు' వచ్చింది. "ఎరక్కపోయి వచ్చాను .." పాట అక్కినేని హావభావాలకు అచ్చమైన శబ్దరూపాన్నిచింది. ఇద్దరు అగ్రనటుల గొంతుల్లోనూ, కవళికల్లోనూ వ్యక్తమయే విభిన్నత్వానికి నూరుపాళ్ళ న్యాయం చెయ్యడానికి బాలుగారిలో ధ్వన్యనుకరణ నైపుణ్యం అక్కరకు వచ్చింది. ఆ తర్వాత 'అడవిరాముడు', 'ప్రేమాభిషేకం' లాంటివి చారిత్రిక అధ్యాయాలు! చలనచిత్రానికి అవసరమైన మోతాదులో శాస్త్రీయ సంగీత ఛాయల్ని మేళవించి, ఓ సినిమా ఆద్యంతాల వరకు న్యాయం చేకూర్చడం ఆ తర్వాతి చరిత్ర! అది 'శంకరాభరణం'తో సాకారమయింది. బాలు గారికి జాతీయ పురస్కారాన్ని అందించింది.

 

యాభయ్యేళ్ళ ఈ సుదీర్ఘ ప్రస్థానంలో బాలుగారి ప్రతిభ కేవలం తెలుగు పాటలకే పరిమితం కాకపోవడం మరో ప్రత్యేకత. తమిళ, కన్నడ చలనచిత్రాభిమానులు "బాలూ తమ వాడే" అని ప్రేమించి, అభిమానించేలాగా ఆయా భాషల్లో పాటలకు న్యాయం చేశారాయన. అంతేకాదు, చిరుతెర మీద తన అనర్గళమైన వ్యాఖ్యాన ప్రతిభతో పొరుగు రాష్ట్రాల వారిప్రశంసలు కూడా అందుకుంటున్నారు. అలాగే తన హిందీ పాటలతో ఉత్తరాది మెప్పును, హిందీ పాటకు జాతీయ పురస్కారాన్నీ పొందారాయన!

 

మాతృభాష లో కావచ్చు, మరో భాష లో కావచ్చు...బాలుగారి విజయ రహస్యం - భాషల పట్ల ఆయనకున్న అపారమైన గౌరవం! ఉచ్చారణ లో స్పష్టత కోసం, సహజమైన పలుకుబడి లో నిబిడీకృతమైన అందాల్ని అందించడం కోసం, తన పాట వింటున్న ప్రతీ వ్యక్తినీ - "ఈయన నా భాషను నాలాగే పలుకుతున్నారు" అని ఒప్పించి, మెప్పించి, తనతో పాటు తీసుకువెళ్ళడం కోసం, బాలు గారు పడే తపన, రాజీ లేని కృషి, నిరంతర అధ్యయనం, ఇలా ఎన్నో ఆయనకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. వివిధ వేదికల మీద నుంచి, మాధ్యమాల నుంచి ఔత్సాహిక గాయనీ, గాయకులకు ఆయనిచ్చే సూచనల్లో, సలహాల్లో ఇవన్నీ అంతర్లీనంగా ఉంటాయి. అందుకే బాలుగారు ఏ భాషలో పాడినా ఆ నుడికారానికి అది రక్షణ కవచం లాగా నిలిచిపోతుంది.

 

ఆయన పాటల యుగంలో జన్మించిన అసంఖ్యాకుల్లో నేనూ ఉన్నానని చెప్పుకోడానికి గర్విస్తున్నాను. పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఆయన పాటకు పర్యాయపదమై కొనసాగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.​.

 

*****

ఓలేటి శ్రీనివాసభాను

ఓలేటి శ్రీనివాసభాను గారు 1953 మే 6న పార్వతీపురం (విజయనగరం జిల్లా)లో జన్మించారు. పార్వతీపురం, బొబ్బిలి, విశాఖ ల్లో విద్యాభాసం. దక్షిణ మధ్య రైల్వే లో సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెకర్ గా పనిచేసి స్వచ్చంద విరమణ. పదిహేనోయేట తొలి రచన ప్రచురణ. వివిధ దిన, వార,మాస పత్రికల్లో కథలు, కవితలూ, వ్యాసాలూ,నవలలూ ప్రచురించారు. ఈనాడు, ఆంధ్రభూమి,  మొదలైన అనేక ప్రముఖ పత్రికలకు దీర్ఘకాలిక శీర్షికలు నిర్వహించారు. డా.అంజిరెడ్డి (డా. రెడ్డి లాబ్స్ ) గారి ఆత్మకథను 'కల నిజమైతే' పేరిట అనువదించారు. శ్రీకులశేఖర ఆళ్వారుల ముకుందమాలను ఖండగతి లో పాడుకునేందుకు వీలుగా రాశారు. ఆకాశవాణి, వివిధ టీవీ చానళ్ళ లోను నృత్యరూపకాలూ, పాటలూ, యాంకర్ స్క్రిప్ట్ లూ రాస్తున్నారు. హిందీ, కన్నడ,ఇంగ్లిష్ ధారావాహికలకు తెలుగు లో డబ్బింగ్ రచన చేశారు. నివాసం హైదరాబాద్.

Anchor 1
bottom of page