top of page

సంపుటి 1 సంచిక 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

ఆహ్వానిత మధురాలు

జరుక్ శాస్త్రి కథా విపంచి

డాక్టర్. కే.బి. లక్ష్మి​

''కళ్ళు మూసుకు తెల్లమిట్టను
పొడుము పట్లేమ్ పట్టనేర్తువు
భూమి మీదుండే విశేషాల్
తెలుసుకోవద్దా?
బిచ్చమెత్తిం దాక నీ ఆల్
బిడ్డలకు గతిలేని వాడివి
నీవు కూడా లేనివాళ్ళకు
దూరమౌతావా?
ఈశ్వరా నీ గ్గుండెలుంటే
వచ్చి నాతో ఎదర నుంచుని
చేయీ చేయీ కలిపి కొంచెం
మాటలాడ్తావా?''...


(-1934 ఆగస్ట్ కృష్ణా పత్రిక లో ప్రచురితం )


అంటూ ఆస్తిక్య దృక్పధంతో సాక్షాత్తూ ఈశ్వరుణ్ణి 'సవాల్ ' చేస్తూ బీదల పక్షాన నిలబడి స్వీయ కవితలల్లిన జలాలుద్దీన్ రూమీ జరుక్ శతజయంతి సంవత్సరమిది .


'మాగాయీ కందిపచ్చడి
ఆవకాయి పెసరప్పడమూ
తెగిపోయిన పాత చెప్పులూ
పిచ్చాడి ప్రలాపం, కోపం
వైజాగులో కారా కిళ్ళీ
సామానోయ్ సరదా పాటకు ......


(-1939 ఆగస్ట్ కృష్ణా పత్రిక )


అంటూ శ్రీ శ్రీ నవకవిత '' సిందూరం రక్తచందనం / బందూకం సంధ్యారాగం .... '' కు 'సరదాపాట' పేరుతో  పేరడీలు రాసిన (అలనాటి సాహితీ ఉద్ధండులు అందరూ జరుక్ పేరడీ బారిన పడిన వాళ్ళే )   జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రి 54 వ యేట కీర్తిశేషుడవకుండా ఉండి వుంటే ఈ ఏడాదికి నూటొక్కసంవత్సరాలు. 
                                 

' చుర్రుమనే పద్యాలు పలికి, కణకణలాడే పేరడీలు చేసి,  గొప్ప వ్యాసాలు  రాసిన  సంస్కృతాంధ్ర ఆంగ్ల భాషా ప్రవీణుడు,సాహిత్యం అంటే పంచప్రాణాలు పెట్టినవాడు 'రుక్మిణీనాధ శాస్త్రి. ఆధునిక సాహిత్యంలో 'శరత్ పూర్ణిమ'లు ప్రకాశింపచేసి మంచి కథలు, మనుషుల కథలు రాశాడు. జీవించిన కాసింత కాలంలోనే సాహితీ బాటలో పాదరసంలా పరుగులు పెట్టి తోటి సాహిత్యకారుల ఉష్ణోగ్రతలు పెంచి, తనదైన సృజన సుందర గంభీర ముద్రను బలంగా వేసిన జలసూత్రంవారి కథల అంతస్సూత్రం సూత్రప్రాయంగా పరిచయం చేసే ప్రయత్నమిది. 
                                   
సాహితీప్రక్రియల లోతుల్నయినా, వ్యక్తుల అంతరంగ అగాధాల్నయినా ఇట్టే ఒడిసిపట్టే సూక్ష్మ పరిశోధకుడు జరుక్. అందుకే అతని కథలు సగటు మనిషి జీవితాన్ని కాచి వడబోసినట్లుంటాయి. నుడులు, నానుడులతో నిండి కొండొకచో నిఘంటువుల్లో కూడా దొరకని అత్యంత స్వచ్ఛమైన వ్యావహారిక  సంభాషణలకు ఆలవాలమౌతాయి. తోచింది మాట్లాడడం, నచ్చింది చెప్పడం, నసుగుడు లేని సూటిదనం, నిర్భీతి వ్యక్తిత్వ పార్శ్వాలుగా వున్న జరుక్ శాస్త్రి తనచుట్టూ ఉన్నవాళ్ళని, పరిచయస్తుల్నీ యధాతధంగా  కథల్లో పాత్రల్ని చేసి పారేసిన ధీశాలి. అలాంటి పాత్రలు, ఇతివృత్తాలు ఈనాటికీ తాజాగా వ్యవస్థలో ఉనికిని చాటుకోవడం గమనార్హం. సరదాగాసాగే కథలో విషాదరేకల్ని, విషాదసూచికలు తలెత్తే కధనంలో సరదాని అనూహ్యంగా జతపరిచే వినూత్న శైలి జరుక్ శాస్త్రిది. కథల శీర్షికలు  కథాంశాల ఔచిత్యాన్ని చెప్పకనే చెబుతాయి. 
                                  
అడిగితే తనే గబుక్కున చెప్పలేనన్ని కలం పేర్లతో రచనలు చేసిన జరుక్ అటువంటి సరదా ఆయన సాహిత్య సేకరణకు పెద్ద అవరోధం. ఎంత ప్రత్యేకశైలి వున్నా కొన్ని ఖచ్చితంగా జరుక్ వే అని చెప్పడం కష్టం. సహృదయులు, శ్రేయోభిలాషులు, ఇష్టపడే స్నేహితుల్నీ వరంగా పొందిన జలసూత్రం ఇరవై కథలు మనకి దొరికిన నిధి. 1934 నుండి 1963 దాకా వివిధపత్రికల్లో అచ్చయిన కధలివి. అందులో ఒకటి ఆకాశవాణిలో ప్రసారమైనది. 
                                  
కథానికాశిల్పం, దాన్ని చెక్కడం లాంటివేవీ జరుక్ విధానం కాదు. పాత్రలు, సన్నివేశాలు, సంఘటనలు పనిగా కూర్చడం, మార్చడం సంగతే లేదు. కధ  మొదలుపెట్టగానే అవన్నీ అలా వచ్చి చేరిపోతాయి. పఠిత పెదవుల్ని సాగాదీయించే హాస్యం, చెంప ఛెళ్లుమనిపించే సెటైర్, గుండెని బరువెక్కించి, కన్నుల్లో కరుణ నింపే మానవత్వం కథన కౌశల  ప్రత్యేకతలు. 
                                  
భాషా పరిజ్ఞానం ఉన్న మేధావి కలం నుంచి వచ్చే కథలెలా ఉంటాయో! పాత్రల్ని అక్కరతో అంతలా ఎలా ప్రేమించాడో! అంత అలవోకగా సంభాషణల్లో సంస్కృత సమాసాలతో నిండిన వాక్యాలు, సందర్భోచితంగా అనేకమంది కవుల  పద్యపాదాలు, పాటలు పఠితజనమనోరంజకంగా ఎలా ఇమిడిపోతాయో! అది కథా? వాస్తవమా? అంతలా మనుషుల్ని చదివి, వాళ్ళ మనస్తత్వాలనెలా ఆకళింపు చేసుకుని అక్షరాల్లో ప్రాణం పోశాడు? ఏ కథకి ఆ కథ పఠిత జిజ్ఞాసనెలా సంతృప్తి పరచగలిగింది? మొదలైనవాటికి సమాధానం ఎన్నెన్నో జీవిత సత్యాలతో తొణికిసలాడే జరుక్ శాస్త్రి కథాభాండారాన్ని తెరచి, తరచి తెలుసుకోవలసిందే! 
                                
కొందరు విమర్శకుల ప్రకారం ప్రతి రచయిత ప్రారంభ రచనలకి, తదనంతర రచనలకీ పరిణతిలో తేడా వుంటుందనీ, పరిణతి క్రమానుగతమనే అభిప్రాయాలు వెలువడుతుంటాయి. అయితే 1934 నాటి తొలి కథ నుంచి 1963 ఆఖరి కథ వరకు జలసూత్రం కథల్లో సడలని టెంపో, గొప్ప పరిణతి వుండడం విశేషం. 
                               
కుటుంబ బాంధవ్యాలు, భార్యాభర్తలు, కానివారూ అయిన స్త్రీ పురుష సంబంధాలు, పిల్లల అమాయకత్వం, బతుకుతెరువులోని సంక్లిష్ట సంకీర్ణతలు, కులాసా ధిలాసాలు, పరాభవాలు, దాష్టీకాలు, వాత్సల్యాలు, స్నేహగాఢత, మమతానురాగాలు, భాష్యానికందని భవబంధాల తాత్వికత, దేశభక్తి, సామూహిక చైతన్యం, వ్యసన  బానిసత్వం, ఆర్తి, ఆర్ద్రత, ఆనందం, వగైరాలన్నీ దొంతర్లు దొంతర్లుగా జరుక్ కథల్ని పరిపుష్టం చేశాయి. ఏ కథలోనూ రచయిత మధ్యలో దూరి ఉపన్యాసాలివ్వడు. పాత్రలే ప్రాణంపోసుకుని పాఠకుల్ని వెంట నడిపిస్తాయి. ఒఖ్హదణ్ణం (1946), హోమగుండం (1945) కథలు ఫెమినిజం ఔట్ లుక్ తో ఇటీవల ఇంటర్నెట్ లో  చర్చనీయాంశాలవడం గమనార్హం. హోమగుండం కథానాయకి నరసమ్మను మొగుడు 'కాల్చుకు' తిన్న వైనం కథ చదువుతుంటే దృశ్యమానమై గుండెని చిక్కబట్టుకోవడం కష్టమౌతుంది. పేరడీ కలం ఇంత పేథస్ రాయడం, ఆ వైవిధ్యం అబ్బుర పరుస్తుంది. 
                              
'పెంకిపిల్ల' కథలో రెండే పాత్రలు  భార్య, భర్త. కథంతా  కేవలం ఆ ఇద్దరి సంభాషణల్లోనే నడుస్తుంది. అందులోనే సరసం, విరసం, కొంటెతనం, చిలిపి అల్లరి. భార్య పెంకిదయినా  భర్తకి మురిపెమే! ఒకరినొకరు ఒకే wave length లో అర్ధం చేసుకుంటే! స్నేహితుల ఆటవిడుపు, బ్రహ్మచారీ శతమర్కటః లక్షణాలను విస్తారంగా చెప్తుంది 'సముద్ర స్నానం'. 
                               
ప్రధానంగా రచయిత జరుక్ వ్యక్తిత్వంలో వున్న స్నేహశీలత, దయ, క్షమాగుణాలు, సాహితీపిపాస, సరదా మనస్తత్వం అతని కథల్లో ఏదో పాత్రలో తొంగి చూస్తుంటాయి. దాంతో పాఠకులు అది అతని కథేనేమో! అని అనుభూతి చెందుతారు. 'సంపాదకీయ దర్జా', ' సన్మాన ప్రయత్నం', 'యాచన', 'ఏం ఘోరం' వంటి కథలు మచ్చుకి కొన్ని. అలాగే 'అనుమానం ప్రాణసంకటం', 'సూట్ కేస్' కథలు శీలపరంగా భార్యని భర్త, భర్తని భార్య అనుమానించేవే అయినా సంభాషణలు, కథనం, ముగింపు ఏ కథకి ఆ కథకే ప్రత్యేకమైనవి. స్వార్ధ దృష్టితో కేవలం శరీరపరంగానే స్త్రీని చూసే మగ మనస్తత్వాలను జల్లెడ పట్టిన డిఫరెంట్ స్టోరీ 'శృంగ భంగం'. 
                            
మునిమాణిక్యం గారి కాంతం కథల కాపీ రైట్ కథ 'లిటరరీ కోర్టు'. అసలా కేసు,కృష్ణా పత్రిక దర్బారీయులే తీర్పరులు, కేసు తీరుతెన్నులు చదివి మనసారా నవ్వుకోవలిసిందే మరి. విద్యా విధానాన్ని,ఉపాధ్యాయులు, విద్యార్ధుల ధోరణిని కళ్ళకు కట్టి, గుండెతడి చేసే కథ 'నేను పోనే' అయితే, విద్యా విషయాలను లాజికల్ గా చర్చిస్తూనే, కొత్త నిర్వచనంతో ఆలోచింపచేసే కథ ఆనాటికీ ఈనాటికీ జరుక్ 'అల తల వల' ఒక్కటే అన్నది నిర్ద్వందం. 'నాలో నేను' ఉత్తమపురుషలో మ్యూజింగ్స్ లా సాగిన విభిన్నరచన. 
                           
కథల్లో జరుక్ కాయిన్ చేసిన 'సిగరెట్టిష్టు' (ఆరుద్ర దీని స్ఫూర్తితో వాడిన 'సిజరిష్ట్' ప్రాచుర్యం సంగతి మీకు తెలుసుగా), 'ఊచయుద్ధం' (విమర్శ), 'బడితె  బాజా లెక్చర్', 'వెలిసిపోయిన బట్టలాంటి నవ్వు' వంటివి వెతుక్కోనవసరం లేకుండా ఇంచు మించు రచనలన్నింటా కనిపించి ఆహ్లాదపరుస్తాయి. 
                          
సాహిత్యంలోని అన్ని ప్రక్రియలు చేపట్టి సమస్కంధ ప్రావీణ్యంతో రచనలు చేసిన జరుక్ శాస్త్రి తెలుగు పేరడీ సూరీడు. పేరడీకి తిరుగులేని శాశ్వత చిరునామాగా మారి , కధానికా సాహిత్యంలో సంస్కారవంతమైన రచయితగా ప్రముఖుల ప్రశంసలందుకుని అగ్రశ్రేణిలో  నిలిచిన మానవత్వం పరిమళించే మంచి మనిషి. ఆయన పేరడీలెంత హాస్యప్రసూనాలో, కథలంత నవరసభరితాలు. 
                            
సమకాలీన సమాజ స్థితిగతులకు దర్పణం పట్టిన శతజయంతి కవి కథకుడు జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రి.

*******
 

Anchor 1

డాక్టర్. కే.బి. లక్ష్మి

మాతామహుల ఊరైన అనకాపల్లిలో పుట్టిన K. B. లక్ష్మి గారి ప్రస్తుత నివాసం హైదరాబాద్. ఒక అబ్బాయి, అమ్మాయి, మనుమలు. విపుల, చతుర పత్రికల పూర్వ సంపాదకురాలు. దూరదర్శన్ వారి మీడియా పర్సన్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ స్టడీ సెంటర్ ఎకడమిక్ కౌన్సిలర్, (ఫేకల్టీ జర్నలిజం,పర్యావరణ విజ్ఞానం),  ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా నిరంతర కృషి. అనేక కథలు,వ్యాసాలు,కవితలు,సాహితీ సమీక్ష, విమర్శ, కాలమిస్ట్ గా లబ్ధప్రతిష్టులు. రచయిత్రిగా,జర్నలిస్ట్ గా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం మొదలైన అనేక  పురస్కారాలు అందుకున్నారు.

*****

డాక్టర్. కే.బి. లక్ష్మి
bottom of page