top of page

సంపుటి 1 సంచిక 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

ఆహ్వానిత మధురాలు

ప్రయాణాల 'రహస్యం'

దాసరి అమరేంద్ర

''మీరు ఎందుకింత విరివిగా ప్రయాణాలు చేస్తున్నారు?'' హఠాత్తుగా అడిగారు రామలక్ష్మి గారు. ఊహించని ప్రశ్న. తత్తరపడ్డాను.
ఆ ప్రశ్న వెనకాల చాలా నేపథ్యముంది.
వివినమూర్తీ రామలక్ష్మిలతో నా పరిచయం పదిహేనేళ్లనాటిది. 
ప్రయాణాలతో నా పరిచయం వయస్సు దాదాపు ఏభై ఏళ్లు.
రామలక్ష్మిగారికి నా ప్రయాణాల పిపాస బాగా తెలుసు. కారుల్లోనూ, రైళ్లమీద, కాలి నడకనా, స్కూటర్ల మీదా నేను తరచూ చేసే ప్రయాణాల గురించి ఆవిడకు బాగా తెలుసు. అయినా ఎప్పుడూ వెయ్యని ప్రశ్న ఆ ఫిబ్రవరి ఉదయాన అడిగారు. ఆ ప్రశ్న వెనక నెల క్రితం నేను చేసిన పదకొండు రోజుల, ఇరవై ఎనిమిది వందల కిలో మీటర్ల దక్షిణ భారత స్కూటర్ల యాత్ర తప్పక ఉండి ఉండాలి.
********
ప్రతి ఫిబ్రవరిలోనూ శ్రీకాకుళం కథానిలయం వార్షికోత్సవాలు రెండు రోజుల పాటు జరుగుతాయి. నేను వెళుతూ ఉంటాను. శ్రీకాకుళంలో సాహితీ మిత్రులు రామలక్ష్మీ వివినమూర్తులు నా అతిథేయులు.
2014 ఫిబ్రవరిలో వార్షికోత్సవాలు ముగిసాక మరో రెండు రోజులు శ్రీకాకుళంలో ఉండిపోయాను. ఆ చుట్టు పక్కల ప్రదేశాలను తీరిగ్గా తిరిగి చూడాలని నా కోరిక. మొదటి రోజు ఓ ఏక్టివా స్కూటర్ సంపాదించి అక్కడి శ్రీముఖ లింగం, తేలినీలాపురం పక్షిధామం, వంశధారనది, ఆయా గ్రామసీమలూ, కొండా కోనలూ, చెట్టుచేమలూ, పిల్లాపెద్దలను పలకరిస్తూ... ఎండకు లెక్క చెయ్యకుండా 'చెడదిరిగి' వచ్చాను. ఆనాటి నా ప్రయాణపు విశేషాలను రామలక్ష్మి వివినమూర్తిలతో రాత్రి భోజనాలు ముగిసాక పంచుకొంటొంటే రామలక్ష్మిగారు పై ప్రశ్న సంధించారు.
ప్రయాణాలు ఎందుకు అన్న విషయం గురించి చాలా సార్లు ఆలోచించిన మాట నిజం. నాతో నేను చర్చించుకొన్నమాట నిజం. తర్కించుకొన్నాను. ఎన్నెన్నో, ఏవేవో సమాధానాలు... అంతగా సంతృప్తి కలిగించని సమాధానాలు.. నాకున్న సమయంలో కనీసం మూడో వంతును ప్రయాణాల కోసం ఎందుకు వినియోగిస్తున్నానా అన్న ప్రశ్నకు నాకే సమాధానం దొరకని అవస్థ. అలాంటి స్థితిలో ఆ చిన్న సూటి ప్రశ్న పెద్ద చిక్కు ప్రశ్నలా నా ముందు నిలబడింది. తడబడ్డాను. తత్తరపడ్డాను. 
'సంచారమన్నది మానవజాతి ప్రాధమిక లక్షణం' అన్నానేగానీ అది నాకే సంతృప్తికరంగా అనిపించలేదు. 'అది ఒక బాధ్యత అనిపించబట్టి' అన్నాను గానీ నాకే నవ్వొచ్చింది. ఆవిడ ఆశ్చర్యపడ్డారు. నవ్వలేదు. 'బాధ్యతా? ఎలాంటి బాధ్యతా? వివరంగా చెప్పగలరా' అన్నారు. అంతరాంతరాల్లో సమాధానం సుడులు తిరుగుతున్నా దానిని బయటకు తీసి మాటల్లో పెట్టలేకపోయాను.
మా సంభాషణ వింటున్న వివినమూర్తి అందుకున్నారు. 
''ప్రపంచమంతా తిరగాలనీ, ఎన్నెన్నో చూడాలనీ, ఎందరెందరినో కలుసుకోవాలనీ కొందరికి ఉంటుంది.  అది వాళ్ల హాబీ'' వివరించాడు.
''హాబీ అనకండి..పాషన్..పిపాస..'' సవరించాను.
అక్కడ ఆ సంభాషణకు కామా పడింది.
********

''రేపు నేను స్కూటరు మీద వెళ్లను. కారు మాట్లాడుకుందాం. అందరం కలిసి వెళదాం'' ప్రతిపాదించాను. రామలక్ష్మిగారూ వివినమూర్తీ సంతోషంగా ముందుకొచ్చారు. కాళీపట్నం(గారి పెద్దబ్బాయి) సుబ్బారావుగారు కూడా మాకు తోడయ్యారు. 
2014 ఫిబ్రవరి పదిహేడు ఉదయం 'తొమ్మిదింటికల్లా' బయల్దేరి శ్రీకాకుళానికి దగ్గరలో ఉన్న నాగావళీ సాగర సంగమ ప్రదేశం, శ్రీకూర్మం క్షేత్రం, కళింగపట్నం, శాలీహుండాలను తిరుగాడి సాయంత్రానికల్లా ఇంటికి చేరాలన్నది మా ప్లాను. 
అనుకొన్న ప్రకారం 'పదింటికి' ఇల్లు వదిలాం.
కాళీపట్నం సుబ్బారావుగారితో అప్పటిదాకా ఉన్నది పరిచయం మాత్రమే. స్నేహం కాదు. బయటకు భారీగా, గంభీరంగా కనిపించినా అయిదు నిమిషాలకల్లా మాలాగా సరదా అయిన మనిషి అని అర్థమయింది. (సాయంత్రానికల్లా స్నేహం పండింది!)
ఇహ వివినమూర్తి -రామలక్ష్మిల గురించి చెప్పేదేముంది?సన్నిహితులు. దేశవ్యాప్తంగా నాకున్న అనేకానేక స్వగృహాలలో వీళ్ల ఇల్లు అతి ముఖ్యమయినది.
నలుగురమూ కలిసి చక్కని బృందమయ్యాం. మంచి కంపెనీ.
********

మరి అది అజ్ఞానమో, మనదేశపు అలక్ష్యమో తెలియదుగానీ నది ముఖ ద్వారాలను ప్రేమించి పూజించాలన్న సంగతి మనకు తెలియదు. చిన్నచిన్న నదులు సముద్రంలో కలిసే చోటు గురించి స్థానికులకు కూడా స్పష్టత లేకపోవడం గమనించాను. పెద్దనదుల సంగతి కాస్తంత పర్లేదుగానీ మొన్న జనవరిలో కావేరీ ముఖ ద్వారం కూడా మాయలేడిలా మురిపించింది. 'నాగావళీ సాగర సంగమ ప్రదేశం' అని అడుగుతోంటే దారిలోని దానయ్యలు మేమేదో ఐరావతం గురించి వాకబు చేస్తున్నట్టు మాకేసి విచిత్రంగా చూశారు! కొంతమంది పాపం ఊహించి చెప్పబోయారు. కొంతమంది దీర్ఘంగా ఆలోచించి చూచాయగా దారి చెప్పగలిగారు. దొరికిన ఆధారాలన్నిటినీ సమన్వయం చేసుకొంటే 'మొఫాసా బందర్' అన్న ఊరు వెళ్లాలని బోధపడింది...
... దారి ఖచ్చితంగా తెలియకపోవడమూ ఒక రకంగా మంచిదే; అలాంటి చోట్లకు చేరుకోగలిగినపుడు మినీ కొలంబసుల్లా సంబరపడవచ్చు. శ్రీకాకుళం దాటీదాటగానే గ్రామసీమలు మొదలయ్యాయి. పరిసరాలను పరికించాలా, మిగిలిన ముగ్గురితో కబుర్లాడాలా అన్నది ఆరోజంతా నన్ను వెంటాడి వేధించిన మధురమైన డైలమా.

********

పావుగంట గడిచేసరికల్లా నాగావళి మాతో దోబూచులాడటం మొదలెట్టింది. కనిపించి పలకరించడం...కనుమరుగవడం... మళ్లా కనిపించడం- ఆ ఆట అలా సాగింది. తన ప్రయాణపు అంతిమ ఘట్టంలోఉందికాబట్టి నాగావళి కడువెడల్పుగా, గంభీర సుందరంగా, పసిడిరంగు ఇసుకరాసులతో కన్నులపండుగగా కనిపించింది. కళ్లేపల్లి అన్న గ్రామం చేరుకున్నాం. మా మొఫాసా బందర్ దాని పక్కనే అనుకున్నాం. కాదు. 'ఇంకా ముందుకు వెళ్లండి' అన్నారు కళ్లేపల్లి వాసులు. వెళితే గనగళ్లపేట అన్న ఊరు చిట్టచివరి బస్సు పాయింటు. 'ఇంతకు ముందు వచ్చాను. ఇక్కడ్నించి దారి నాకు తెలుసు' అన్నాడు మా కారు డ్రయివరు రమేషు. దారి తీసాడు. 'ఇహ కారు నడవదు' అనిపించినచోట దాన్ని ఆపి ఇసుకలో నడుస్తుంటే ఆవుల్ని తోలుకు వస్తున్న ఓ మనిషి ఆపి పలకరించాడు. 
...అతను ఆరడుగుల మనిషి. స్ఫురద్రూపి. నడివయసువాడు. హుందాగా సరదాగా ఉన్నాడు. తెలివైన కళ్లు. మారు వేషపు సిబీఐ మనిషి అనిపించాడు! ''ఇటు ఎంత వెళ్లినా మీకు సముద్రం తగలదు - నదీ ముఖద్వారం సంగతి సరేసరి. వెనక్కి వెళ్లి రోడ్డుపట్టుకోండి. ఓ కిలోమీటరు వెళ్లండి. ఎడమ వేపున ఓ సన్నపాటి దారి కనిపిస్తుంది. కారు వెళుతుంది. దాని వెంటే వెళితే మీకో తుఫాను షెల్టరు కనిపిస్తుంది. అదే సంగమ స్థలం. నాగావళితో పాటు ఓ చిన్న ఏరు కూడా వచ్చి సముద్రంలో కలుస్తుందక్కడ. చాలా బావుంటుందా ప్రదేశం'' వివరంగా చెప్పాడా మహానుభావుడు.
అటువేపుగా మళ్లాం. సులువుగా అక్కడికి చేరాం. పదకొండయిపోయింది.
స్థానికులే తప్ప టూరిస్టులు అస్సలు లేకుండా... ఏమాత్రం హడావుడి లేకుండా కనిపించిందా ప్రదేశం. జాగ్రత్తగా చూడగా దూరాన నాగావళి వచ్చి సముద్రంలో కలవడం కనిపిస్తోంది. మా పక్కనే ఉన్న ఓ చిరు యేరు వచ్చి కలవడం తెలుస్తోంది. కానీ ఆ త్రివేణీ దృశ్యాన్ని పరిపూర్ణంగా గమనించాలంటే - హెలికాప్టరు గాకపోయినా కనీసం లైట్హౌస్ లాంటి ఎత్తైన భవనం ఎక్కిచూడటం అవసరం అనిపించింది. (తాడిచెట్టు ఎక్కగలవోయ్ అమరేంద్రా?!)
చేపల పడవలు... రంగు రంగు రంగుల ఇసుక...చిన్నపాటి కెరటాలు.. పెద్దగా హోరులేని సముద్రం.. ప్రశాంతమైన వాతావరణం.. కాస్తంత మబ్బువేసి ఉండటంతో ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం.
ఓ గంటగడిపాం. ఓ చిన్నపాటి మొలలోతు నీళ్లున్న కయ్యను దాటి నేను వివినమూర్తీ నాగావళి తీరం దాకా వెళ్లి వచ్చాం. ఉల్లాసం... ఉత్సాహం... కబుర్లు... ఫోటోలు...

********

అప్పటికే పన్నెండయిపోతుంది.. ఇంకా వెళ్లవలసినవి మూడు ప్రదేశాలు..''పోనీ శ్రీ కూర్మం వదిలేద్దామా?'' అన్నాను. ''వద్దు. అక్కడి కుడ్య చిత్రాలు మీకు చూపించాలని నా కోరిక.. కాసేపయినా అక్కడ ఆగుదాం'' అన్నారు వివినమూర్తి. 
ఓ అరగంటలో శ్రీకూర్మం చేరాం.
దశావతారాలలో రెండవది కూర్మావతారం. ఇరవై లక్షల సంవత్సరాల క్రితం మహావిష్ణువు ఇక్కడ వెలసాడట.  పురాణాల్లో శ్రీకూర్మ క్షేత్రం ప్రస్తావన విరివిగా కనిపిస్తుందట.. కూర్మావతారపు గుడులు ఎంతో అరుదట.. అందులో ఇది ఒకటి.
ప్రవేశ ప్రదేశం దుకాణాలూ మనుషులతో కొంచెం ఇరుకిరుగ్గా అనిపించినా ఒకసారి ఆలయ ప్రాంగణంలోకి వెళితే అంతా విశాలంగా ఆహ్లాదకరంగా కనిపించింది. వాళ్లు ముగ్గురూ అప్పటికే గుడి చూసి ఉన్నారు- నాకేమో దేవుడ్ని చూడాలని అంత పట్టింపులేదు. పక్కనే ఎంతో విశాలంగా ఉన్న కోనేరును చూసుకొంటూ కుడ్య చిత్రాలు ఉన్న మంటపం దిశగా వెళ్లాం.. దారిలో డజన్ల కొద్దీ నక్షత్రపు తాబేళ్లు. 
అతి నిర్లక్ష్యపు స్థితిలో ఉన్నాయి ఆ కుడ్యచిత్రాలు.. అంతా కలిసి పదిహేను ఇరవై ఉన్నాయి. వాలి వధ, కాళింగ మర్ధనం, శేషశయన విష్ణువు, గోవర్ధన గిరిధారి, పల్లకిలో రాజకుమారి- ఆకర్షణీయంగా       ఉన్నాయవి. మధ్యలో చైనా రూపురేఖలున్న 'మునులు'- బౌద్ధబిక్షువుల ప్రభావమా? బయట ఉన్న బోర్డుల్లో ఈ చిత్రాల శైలిని అజంతా-ఎల్లోరా శైలితో పోల్చారు గానీ నా కంటికి ఇవి నాలుగొందల సంవత్సరాల క్రితం మాత్రమే వేసినవి అనిపించింది. ఆలయ పునరుద్ధరణ క్రమంలో ఆ మధ్య ఈ చిత్రాల మీద శుభ్రంగా సున్నాలు వేద్దామని ఉపక్రమించారట- ఎవరో మహానుభావులు అడ్డుకోవడం వల్ల ఆ ఉపద్రవం తొలగింది. అన్నట్టు ఆ పురాతన కుడ్యచిత్రాలతోపాటు ఈ మధ్యే వేయించి పెట్టిన సుందర వర్ణ చిత్రాల మాలిక కూడా ఆ మండపాలలో కనిపించి సంతోషపరిచింది. ఆబగా వాటినీ ఫోటోలు తీసుకున్నాను. చెప్పుకోదగ్గ శిల్ప సంపద కూడా ఉన్న దక్షిణాత్య సంప్రదాయంతో కట్టిన గుడి ఇది.
ఒంటిగంటన్నర అయింది. సరి అయిన భోజనశాల దొరకలేదు. దొరికిన ఒకే ఫలహారశాలలో వడలు, దోశలూ- వాళ్ల శ్రద్ధా ఆప్యాయతలూ... కడుపు బాగా నిండింది.

********

కోనసీమంత సస్యశ్యామలం అనలేంగానీ ఈ కళింగ సీమ కూడా పచ్చగా కళకళలాడుతూ కనిపించింది. ఫిబ్రవరి నెలగాబట్టి వరి పంట అంతా ఇంటికి చేరి కోతలు ముగిసిన పొలాలే కనిపించాయి. కానీ వాటిల్లో మళ్లీ పెసరలాంటి రెండో పంటలు.. అక్కడక్కడ చిన్నచిన్న చెరువులు... కుంటలు .. జనవరి ఫిబ్రవరి నెలల్లో ఇటు టెక్కలీ నౌపాడ నుంచి అటు కన్యాకుమారి కొచ్చిన్ల దాకా రెండు వేల పైచిలుకు కిలోమీటర్లు స్వంత ద్విచక్రవాహనంలో తిరుగాడి ఉన్నాను- ఆ ప్రదేశాలన్నిటిలోనూ ఆకట్టుకునే పచ్చదనమే కనిపించింది.. ఆ భావనా, ఎరుకా సంతోషం కలిగించాయి. 
మా మరుసటి మజిలీ కళింగ పట్నం- వంశధార ముఖ ద్వారం.
ఆ అరగంట ప్రయాణంలో 'రాజ్యాంగ నైతికత' అన్న విషయం మీద చర్చ మొదలైంది. చర్చించినది నేనూ వివినమూర్తిగారూ. రామలక్ష్మిగారూ, సుబ్బారావుగారూ శ్రోతలు. 'రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజల విషయంలోనూ నైతికంగా రాయబడి ఉండటం రాజ్యాంగ నైతికతలో ప్రధానమైన అంశం' అన్నది మూర్తిగారి వాదన. 'అలా గాదు.. రాజ్యాంగనైతికత అన్న విషయం- అప్పటికే రూపకల్పన పొందివున్న రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని అనుసరించడమూ, రాజ్యాంగ లక్ష్యాలకూ సామాన్య సామాజిక ప్రవర్తనకూ మధ్య ఉండే అంతరాలను తొలగించడమూ అన్న వాటి గురించేగానీ రాజ్యంగ నిర్మాణంలోని నైతిక విలువల గురించి కాదు' అన్నది నా వాదన. అలా సాగిపోతూ ఉండగా 'ఇంత సుందరమైన ప్రదేశాల్లో ఆ విషయాలు ఎందుకూ? ఇంటికి వెళ్లాక మాట్లాడుకోవచ్చు గదా' అని సౌమ్యంగా మందలించారు సుబ్బారావుగారు.
సాగర సంగమ ప్రదేశం ఇంకా నాలుగైదు కిలోమీటర్లు ఉండగానే వంశధార తన పరిపూర్ణ సౌందర్యంతో మమ్మల్ని పలకరించింది. కనుచూపు ఆననంత సుదూరాన అవతలి గట్టు.. మధ్యలో విశాలమైన ఇసుక తిన్నెలు.. వాటి మీద వందలాది తెల్లని కొంగలు.. ఈ తిన్నెల మధ్యగా పారుతోన్న నీలాల నీళ్లు..ఎక్కడో దూరాన కనిపించీ కనిపించని సముద్రతీర రేఖ- అక్కడో పావుగంట.
కళింగ పట్నం నేను ఏ మాత్రమూ ఊహించని అద్భుత సౌందర్యంతో దిగ్భ్రమ కలిగించింది! అటునుంచి ఇటుకు దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర సముద్ర తీరం.. అలజడి చెయ్యని అలలు.. ఉండీలేని యాత్రికులు..జేగురు రంగు ఇసుకను మృదువుగా తాకుతోన్న నీలపు సముద్ర జలాలు..స్ఫుటంగా కనిపిస్తోన్న సాగర సంగమం దృశ్యం..దూరాన క్షితిజ రేఖ దగ్గర నీలాల నీటిలో లీనమయిపోతోన్న వినీల ఆకాశం... అసలు మనిషి బ్రతక వలసింది ఇలాంటి చోటునగాదూ? అప్రయత్నంగా భీమ్లీ దగ్గర కనిపించే గోస్తనీ నది సంగమ దృశ్యం గుర్తొచ్చింది.

********

ఏదో కుటుంబం.. పాతిక ముప్ఫై ఏళ్ల యువతి. వాళ్ల అమ్మగారు.. నాన్న... కొంచెం విద్యాగంధం   ఉన్న గ్రామీణులు. అమ్మా కూతురూ కలిసి సముద్రపు ఒడ్డున ఇసుకలో చిన్నగుంట తవ్వి దాని పక్కనే ఓ గట్టులాగా ఆ ఇసుకతో కట్టి దీపం వెలిగిస్తున్నారు. ముచ్చట అనిపించి పక్కకు వెళ్లాం. 'మీ ఫోటో తీసుకోనా?' అని అడిగాను. సంబరంగా తల ఊపిందాయువతి. ఫోటోలు ముగించి సంపాదించిన చనువుతో 'ఏమిటి చేస్తున్నారూ ఆ ఇసుకలో?' అని అడిగాను. పిచ్చిక గూళ్లు కట్టే వయసూ సమయమూ కాదుగాదా.. వాళ్ల నాన్న అందుకున్నాడు. ''ఇసుకలో శివలింగం చేసి పూజచేస్తున్నాం. ఏదో మొక్కువుంది. అమ్మా-కూతురూ అదేదో గుడికి వెళ్లి శివుడికి మొక్కు తీరుద్దాం అన్నారు. అలా ఎందుకూ మనమే శివలింగం చేసి ఆ పని చేద్దాం- అన్నాను'' వివరించాడాయన. రామేశ్వరంలో లంకాయాత్రకు ముందు సైకత లింగ ప్రతిష్ట చేసిన రాముని కథ గుర్తొచ్చింది.
********

మధ్యాహ్నం మూడు దాటేసింది.
బయలుదేరి అయిదు గంటలు. అయినా అందరిలోనూ ఉత్సాహం..ఓపిక..
నాలుగో మజిలీ శాలిహుండం కేసి బయల్దేరాం.
అది వంశధార ఒడ్డునే.. ఓ చిన్న కొండమీద ఉన్న బౌద్ధక్షేత్రం. అంతాకలిసి కళింగపట్నం నుంచి పదికిలోమీటర్లు.
శాలిహుండానికి ఓ కిలోమీటరు ముందుగా ఉన్న 'గార' అన్న గ్రామంలో రోడ్డు పక్కనే సంత కనిపించింది. నా ధోరణికి అలవాటుపడిపోయిన సుబ్బారావుగారు కారు ఆపించారు.
మంగళవారం సంతకాబోలు- కూరగాయల నుంచి కుండలదాకా, పసుపూ కుంకుమల నుంచి పలుపు తాళ్లదాకా, వెదురుబుట్టల నుంచి ఎండు చేపలదాకా, అటవీ సంపదలనుంచీ నాటుకోళ్ల దాకా, కప్పులూ సాసర్లనుంచి చేతిగాజుల దాకా- అదో మినీ మహామాల్!! ఎన్నేళ్లయిపోయిందో ఇలాంటి సంతల్లో తిరుగాడి! అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని ఆబగా అందిపుచ్చుకొని-అక్కడో అరగంట! కెమేరాకు విరామమే చిక్కలేదు.

********

రెండేళ్ల క్రితమే గంటేడ గౌరినాయుడు గారు శాలిహుండం గురించి 'గొప్పగా' చెప్పారు. 'అది స్థానికులకు   ఉండే శృతి మించిన ప్రేమ' అని ఎంతో అతిశయంతో పెడచెవిన పెట్టాను. నా అతిశయం పుణ్యమా అని ఏ రకమైనా అంచనాలూ, ఆశలూ లేకుండా వెళ్లాను. వెళ్లీవెళ్లగానే మూర్ఛ ఒకటే తక్కువ!
నాలుగైదు వందల అడుగుల ఎత్తునున్న ఓ చిరుకొండ. దాదాపు పైదాకా కారు వెళ్లేదారి. కారు ఆపేచోట అందమైన ఉద్యానవనం. దిగువన దిగంతం దాకా పచ్చని బయలు ప్రదేశం. కాలి నడకన సిమెంటురోడ్డు మీద ఓ వందానూటా ఏభై గజాలు వెళ్లగా నలందా శిథిలాల ఫోటోల్లో కనిపించేలాంటి ధృఢమైన ముదురు ఎరుపు రంగు ఇటుకలతో కట్టిన అనేక చిన్నచిన్న కట్టడాలు.. గుండ్రపువీ, స్థూపాకారపువీ, నక్ష్తత్రాకారపువీ- ఒక్కసారిగా రెండువేల సంవత్సరాలు వెనక్కివెళ్లిపోయినట్టనిపించింది. వజ్రాయన బౌద్ధం పలకరించినట్టనిపించింది.  ఈ ఇటుక కట్టడాల మధ్యలోంచి ఓ రాళ్లు పరిచిన దారి. పైకి పైపైకి గుట్టమీదకు తీసుకు వెళ్లింది. అక్కడ ఓ బావిలాంటి కట్టడం- ధాన్యగారమని ఒక వివరణ. ఆపైకి ఎక్కగా దిగువన శిథిలాలు, ఎడమన వంశధార, ఎదురుగా 'గార' గ్రామం- కలకూ నిజానికీ నడుమన తేలియాడుతూ నేను.
పురాతన శిథిలాల మీద రాతలు రాయడం, పేర్లు చెక్కడం చూస్తే నాలాంటి వాళ్లకు ధర్మాగ్రహం కలగడం సహజం. కానీ ఆ ధాన్యాగారపు వెలుపలి గోడల మీద నల్లటి అక్షరాలతో రాసి ఉన్న ఓ సందేశం చూసి ఎంతో ముచ్చట వేసింది. 'జన్మనిచ్చిన నీకు జన్మజన్మలకూ రుణపడి ఉంటానమ్మా' అనే మాట ఎవరో డి.రాము అట-రాసారు!!
********

సుమారు వంద కిలోమీటర్ల మాయాత్ర ముగించి ఇంటికి చేరేసరికి సాయంత్రం అయిదయింది. యాత్ర అంటే ముగిసింది గానీ కబుర్లకు ముగింపు అంటూ ఉండదు గదా..
నిన్నరాత్రి రామలక్ష్మిగారు అడిగిన ప్రశ్నకు ఇవాల్టి యాత్రలో సమాధానం దొరికిందనిపించింది. ఆ సమాధానానికి నాందీ ప్రస్థావనగా ఓ ప్రశ్న సంధించాను.
''ఒక ప్రదేశపు ఒకానొకనాటి సాంఘిక, భౌగోళిక పరిస్థితులు తెలుసుకోవాలంటేనూ, పనిలో పనిగా సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, మత, ఆర్థిక వివరాలు తెలుసుకోవాలంటేనూ ఉత్తమ మార్గమేమిటీ?     ఉదాహరణకు 1830ల నాటి తెలుగుదేశపు వివరాలు చక్కగా తెలియాలంటే..?'' నిజం చెప్పాలి. నేనో సమాధానం దృష్టిలో పెట్టుకొనే అడిగాను.
భార్యాభర్తలిద్దరూ శాసనాలన్నారు, శిథిలాలన్నారు, కైఫియత్తులన్నారు. చివరికి నేను ఆశించిన సాహిత్యం దగ్గరకు వచ్చారు. రప్పించాను.
''మద్రాసు నుంచి రాయలసీమ తెలంగాణల మీదుగా కాశీ వెళ్లి తిరిగి ఒరిస్సా కళింగ ఆంధ్ర తీరాల్లో   తిరిగివచ్చి- ఆ వివరాలు రాసిన ఏనుగుల వీరస్వామి గారిని మించిన మార్గం లేదంటే లేదని'' ముగ్గురం అంగీకరించేసాం. అప్పుడు నోరు విప్పాను.
''రామలక్ష్మి గారూ మీ నిన్నటి ప్రశ్నకు సమాధానం చెపుతాను. నేను ప్రయాణాలు చేసేది 'తెలుసుకోవడం' కోసం. ఆ తెలుసుకొన్నది 'చెప్పడం' అన్న బాధ్యత నిర్వర్తించడం కోసం''-
అని అన్నానే గానీ ఇది పరిపూర్ణమైన సమాధానం కాదని తెలుసు.

 

******** 
 

Anchor 1

దాసరి అమరేంద్ర 

విజయవాడకి చెందిన దాసరి అమరేంద్ర గారు మార్చ్ 14, 1953 లో జన్మించారు. సతీమణి లక్ష్మి, కుమారుడు రాహుల్ , కుమార్తె అపూర్వ. ప్రస్తుత నివాసం న్యూ ఢిల్లీ. 1974 లో కాకినాడలో ఇంజనీరింగ్ పట్టా తీసుకుని ఢిల్లీ, బొంబాయి, బెంగుళూరు నగరాలలో భారత ఎలక్ట్రానిక్స్ సంస్థ లో ఉద్యోగం చేసి వారి  పూనా విభాగానికి CEO గా పదవీ విరమణ చేశారు. చిన్నతనం నుంచీ సాహిత్యాభిలాష కలిగి 1980 దశకంలో రచనావ్యాసంగం ప్రారంభించారు. అనేక కథలు, కవితలు, వ్యాసాలూ వ్రాసి ట్రావెలాగ్ రచనలో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రముఖులతో ఇంటర్వ్యూలు, అనువాదాలు చేశారు. స్వీయ కథా సంపుటాలు, ట్రావెలాగ్ పుస్తకాలు, వ్యాస సంకలనాలు ప్రచురించారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వారు అమరేంద్ర గారి రెండు అనువాద గ్రంధాలని ప్రచురించారు. తను నివసించిన అన్ని చోట్లా నెల నెలా సాహిత్య కార్యక్రమాలని ఏర్పాటు చేసి తన సాహిత్యాభిలాషని చాటుకున్నారు. భార దేశమే కాక ఐరోపా, ఆస్ట్రేలియా, ఇండొనీషియా, సింగపూర్, అమెరికా విస్తృతంగా పర్యటించిన దాసరి అమరేంద్ర గారి ట్రావెలాగ్ పుస్తకాలు అత్యంత విజ్ఞానదాయకంగా పేరుపొందాయి.​

*****

bottom of page