top of page

సంపుటి 1 సంచిక 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా ​మధురాలు

మరపురాని గతం

మురళీ లంక

"భైరూట్ కి స్వాగతం! సమయం ఉదయం పదకొండు గంటల ముప్ఫై నిమిషాలు..." ఎయిర్ హోస్టెస్ చెప్పటంతో టోనీకి వెన్నులో నుంచి చలి పుట్టింది. ఎయిర్ పోర్ట్ నుంచి మర్జా దారి పొడుగునా గుండె భారం పెరుగుతూనే ఉంది. అన్నయ్య బలవంతం చెయ్యబట్టి వచ్చాడే కాని తనకి ఊరికి తిరిగి రావటం ఇష్టం లేదు.

 

"టోనీ! దిగు. మనం వచ్చేసాం" అన్నయ్య తట్టి పిలవటంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు. అప్పుడే ఆగిన కారు చుట్టూ మూగిన జనాలు తననే పట్టి పట్టి చూస్తున్నారు. అన్నయ్య ఒక్కొక్కరినీ పరిచయం చేస్తున్నాడు. మనసు పరిపరి విధాల పరిగెడుతుండగా పాతిక సంవత్సరాల తర్వాత కలిసిన బంధుమిత్రుల ఆత్మీయత ఒక వింత అనుభూతిలా ఉంది. భోజనం తర్వాత చిన్ననాటి స్నేహితులతో ఊరంతా కాసేపు తిరిగి వచ్చాడు.

 

రోజంతా అన్నయ్య, స్నేహితులు తనని ఎంత పలకరించినా టోనీ నోరు మెదపలేదు. రాత్రి అయ్యేసరికి శరీరం, మనసు బాగా అలిసిపోయినా గుండెల్లో భారం నిద్ర మాత్రం రానివ్వలేదు. ఎప్పటికో ఓ రాత్రివేళ కంటిని నిద్ర ఆవరిస్తుండగా మనసు మొండిగా గతంలోకి తీసికెళ్ళింది.

 

* * *

 

టోనీ తండ్రి జార్జ్‌ది ఉమ్మడి కుటుంబం. తల్లి జెస్సికా, అన్నయ్య, తను, తమ్ముడు, చెల్లెలు, బాబాయిలు, పెదనాన్నలు, వాళ్ళ పిల్లలు అంతా పక్క పక్కనే ఉండేవారు. జార్జ్ కిరాణా కొట్టుకి మంచి ఆదాయం ఉండేది. చుట్టూ కొండలు, గుట్టల మధ్య రెండంతస్తుల మంచి ఇల్లు. వెరసి ఒక అందమైన కుటుంబం. జార్జ్ తను స్థిరపడ్డాక కుటుంబం మొత్తానికి తనే పెద్ద దిక్కు అయ్యి తమ్ముళ్ళని, మరుదులని చదివించి వృద్ధిలోకి తీసుకొచ్చాడు.

 

కాలం చిత్రమయినది, ప్రశాంతమయిన సముద్రతీరంలో కూర్చుని కలలకి ఇసుక మేడల రూపం ఇస్తూ ఉంటాము. ఉవ్వెత్తున ఎగసిపడే అలకి మమకారం ఉండదు. సర్వం తనలో కలుపుకుంటుంది.

 

అప్పుడు తనకి పదకొండేళ్ళనుకుంటా! పాలస్తీనా నుంచి వలస వచ్చిన కాందిశీకులు, లెబనాన్ లోని స్వీయ మతస్థులతో కలిసి క్రైస్తవ వ్యతిరేక భావనల్ని ప్రేరేపించారు. ఆ మతోన్మాదం బైరూట్ నుంచి మెల్లిగా మర్జా పక్క గ్రామాల వరకు ఆవరిస్తోందని వార్తలు వస్తున్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన నలభై ఏళ్ళ తర్వాత ప్రశాంతమైన దేశం మళ్ళీ మత కల్లోలాల్లో చిక్కుకుపోతుంటే, ఒక్కొక్క గ్రామం మత ఛాందసుల ఉక్కు పాదాల క్రింద నలగటం మొదలు పెట్టింది.

 

ఆ మర్నాడు టోనీ పుట్టినరోజు. టోనీకి కొత్త బట్టలు కొనటం కోసం పక్క ఊరికి వెళ్లి వెనక్కి వస్తున్నారు వాళ్ళ కుటుంబం. ఇల్లు దగ్గర పడుతున్నకొద్దీ వాతావరణంలో ఎదో తెలియని వేడి అనిపించటం మొదలయ్యింది. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళేసరికి పెద్ద పెట్టున బంధువులు, స్నేహితుల ఏడుపులు వినబడటం మొదలయింది.

 

అంతవరకు చుట్టు పక్కల గ్రామాలలో తారాడుతున్న మతోన్మాద రక్కసి క్రీనీడలు మర్జా మీద కూడా పడ్డాయి. తమకి ఒక బలమైన శత్రువు ఉన్నాడని, ఆ శత్రువు తమని కబళించటానికి పొంచి ఉన్నాడని కూడా తెలియని మర్జా గ్రామస్థులు ఎవరి పనుల్లో వారున్నారు. ఆవేశంతో కళ్ళు మూసుకుపోయిన మతోన్మాదులు కొన్ని వీధుల మీద పడి కనపడ్డవాళ్ళని కనపడ్డట్టుగా ఊచకోత కోసేశారు. కొద్ది గంటల ముందు వరకు ఆడుతూ పాడుతూ తిరిగిన బంధువుల పిల్లలు, స్నేహితులు ఎంతోమంది పీకలు తెగి పడి ఉన్నారు.

 

ఎంతటి కఠినాత్ముడికయినా మనసు ద్రవించిపోయే దృశ్యం అది. ఏ శత్రుత్వమూ లేకుండా అభం శుభం తెలియని సాటి మనుషుల్ని, పసి పిల్లల్ని కూడా చంపేసే మనుషులు ఉంటారని చిన్నారి టోనీకి తెలియదు. మర్జా గ్రామస్థులు వాళ్ళకేమి అపకారం చేసారు? మానవత్వాన్ని విడిచిపెట్టటమే మత విశ్వాసమా? వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి మిగిలిన తనని, అమ్మ నాన్న వాళ్ళని కూడా చంపేస్తారా? ఆ పసి గుండెలో ఎన్నో సమాధానం దొరకని ప్రశ్నలు, భయం, మానవత్వం పట్ల అపనమ్మకం చినుకులా మొదలై, వరదలా పొంగి, సముద్రంలా గంభీరమయ్యాయి.

ఆరోజు తరవాత ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో, తల్లి గుండెల్లో ఒదిగిపోయి పడుకున్నాడో టోనీకే తెలుసు. ఆ రోజు తరవాత మర్జా పరిస్థితే మారిపోయింది. ఆ తరువాతి కాలంలో లెబనాన్ లో దేశవ్యాప్త అంతర్యుద్ధంగా పరిణామం చెందిన ఆ మత ఘర్షణల్లో వేలకొద్దీ మనుషులు ఆహుతి అయ్యారు. రెచ్చగొట్టే నాయకులు, మత పెద్దలు, పక్క దేశాల మీద పగ తీర్చుకోవటానికి తయారయిన విదేశీ ముఠాలు, కారణం ఏదైతేనేం? సామాన్యుల జీవితాలు ఆ ఉక్కు పాదాల కింద భూస్థాపితమైపోతున్నాయి.

 

ఓ రోజు "మిమ్మల్ని తలుచుకోని రోజు లేదు. మీరంతా అమెరికా వచ్చెయ్యండక్కా!" అని ఫోన్ చేసాడు మావయ్య.

 

"నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే ఛస్తాను" అంటూ నిక్కచ్చిగా చెప్పేసాడు జార్జ్. ఇక్కడే ఉంటే తన కుటుంబం మొత్తం బలి కావలసి వస్తుందేమో అనే భయం ఒకపక్క, భయంతో పారిపోవడం అవమానమనే మొండితనం ఒకపక్క లాగుతుండగా, జార్జ్ మాత్రం మొండితనానికే పెద్దపీట వేసాడు.

 

"జార్జ్! నువ్వే నా జీవితం! నా జీవితం ఒక్కటే ఐతే నువ్వు ఎలా చెప్పినా వినేదాన్ని. కాని, ఇక్కడే ఉండి నా పిల్లల జీవితాలని బలి పెట్టలేను. నువ్వు రావాలనుకున్నప్పుడు రావచ్చు" అని తెగేసి చెప్పి అమెరికా వెళ్ళటానికి సిద్ధపడింది జెస్సికా.

 

అమెరికా విదేశాంగ కార్యాలయానికి వెళ్ళిన జెస్సికాకి అక్కడ చుక్కెదురయింది. లెబనాన్ లో నెలకొన్న తీవ్రవాద పరిస్థితుల దృష్ట్యా అమెరికా జెస్సికాకి వీసా ఇవ్వటానికి నిరాకరించింది. మళ్ళీ కథ మొదటికొచ్చింది. మావయ్య మాత్రం పట్టు విడిచిపెట్టలేదు. అక్కని తన రక్త సంబంధం ద్వారా అమెరికాకి తీసుకొచ్చి, తరవాత కుటుంబాన్ని తీసుకురావచ్చు అని తెలుసుకున్నాడు. దాంతో జెస్సికా మాత్రం అమెరికా వెళ్ళగలిగింది.

 

"భర్తని, పిల్లలని విడిచి పెట్టి తన స్వార్థం తను చూసుకుంటోందని” చుట్టు పక్కల వాళ్ళంతా అనుకుంటున్నారు.  కాని, వరదలో కొట్టుకుపోతున్నవాడికి ఒడ్డున పడటమే లక్ష్యం! ఒడ్డున పడేసే మార్గం తన జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతుంది అని ఆలోచిస్తూ కూర్చోడు. ప్రస్తుత పరిస్థితిలో తనూ, పిల్లలూ కూడా ఇక్కడే ఉండి ఆహుతి కావాలి, లేదా తన ద్వారా తన పిల్లలని కూడ దేశం దాటించే అవకాశం ఇలా కలిసి రావచ్చు. భర్తని, పిల్లలని అతి కష్టం మీద విడిచిపెట్టి అమెరికాకి వెళ్ళింది జెస్సికా.

 

ఆరోజుకారోజు టోనీ పరిస్థితి, కుటుంబం పరిస్థితి మరీ అధ్వాన్నమైపోయింది. మతోన్మాదుల దాడులు ఎదుర్కోవడానికి మర్జాలో యువకులు కలిసి గుంపులుగా గస్తీ తిరగటం మొదలు పెట్టారు. దాంతో మతోన్మాదులు కత్తులు పక్కన పెట్టి ప్రేలుడు పదార్థాలను ఆశ్రయించారు. ఇప్పుడు నిలువ నీడ కూడా లేకుండా ఇళ్ళను పేల్చెయ్యటం మొదలు పెట్టారు. ఆ పేలుళ్ళలో జార్జ్ దుకాణం కాలిపోయింది. అప్పటివరకు మర్జా వదిలి రానని మొండికేసిన జార్జ్ కూడా ఏదయినా అవకాశం దొరికితే ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టెయ్యాలనే నిర్ణయానికి వచ్చాడు.

 

కాలానికి ఆకలి ఎక్కువ. ఏ రోజు ఎవరిని బలి కోరుతుందో చెప్పటం కష్టం. ఆ ఆకలి తీర్చటానికి తన వంతు ఏ రోజు వస్తుందో అనే భయంతో ప్రతి ఒక్కరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకు వెళ్లదీస్తున్నారు. ఇంటి నుంచి ఎవరైనా బయటికి వెళితే వాళ్ళు ఇంటికి ఎలా తిరిగి వస్తారో, అసలు వస్తారో రారో కూడా తెలియదు. అలాగని ఇంట్లో ఉంటే, ఏ ఇంటి మీద ఎప్పుడు మందు పాతర పడుతుందో తెలియదు. ఆ మృత్యు కోరల్లో నుంచి బయట పడటానికి టోనీ కుటుంబం చేసిన ప్రయత్నాలు ఏవీ నెరవేరలేదు. చివరికి ఒకరోజు యాత్రికులుగా వీసా సంపాదిద్దామని అమెరికా కార్యాలయానికి వెళ్ళారు. ఆరోజు యాదృచ్ఛికంగా అమెరికా కార్యాలయం మీద మందు పాతర పేలడంతో కొన్ని రోజులు ఆ కార్యాలయం మూతపడింది.

 

చిట్టచివరికి మూడు సంవత్సరాల తరవాత టోనీ కుటుంబానికి ఉపశమనం కలిగింది. జెస్సికా అమెరికా వచ్చిన మూడు సంవత్సరాలకి భర్తకి, పిల్లలకి వీసా తెప్పించుకోగలిగింది. బైరూట్ లో విమానం గాలిలోకి ఎగిరే వరకు టోనీకి గాని, మిగిలిన వాళ్లకి గాని తాము ప్రాణాలతో దేశం దాటగలమన్న నమ్మకం లేదు. విమానం గాలిలోకి ఎగరగానే అందరి గుండెల్లోను ఉప్పొంగిన భావజాలం వర్ణనాతీతం. మనసుకి అత్యున్నత స్థాయిలో కలిగే ఏ అనుభూతినయినా వర్ణించటానికి మాటలు సరిపోవు. తన పిల్లలని, భర్తని అమెరికాలో విమానాశ్రయంలో చూడగానే జెస్సికాకి మరొక్కసారి కన్నీళ్లు వరదలై పారాయి. ఈ సారి ఆనందంతో.

* * *

అప్పటికి తెల్లవారు జామున నాలుగయింది. టోనీ గది కిటికీలో నుంచి బయటకి చూస్తుంటే, నిర్జనంగా, ప్రశాంతంగా కనబడుతున్న వీధులలో తన బాల్యం పలకరిస్తున్నట్టుగా అనిపిస్తోంది. జీవితం పరిచిన విస్తరిలా ఉన్నప్పుడు ప్రతి చిన్న కష్టం భూతద్దంలో కనపడుతుంది. కళ్ళ ముందు కనపడే అదృష్టాలకి కూడా గుర్తింపు ఉండదు. కాని, గడిచిన జీవితం తను అనుభవించే ప్రతి అదృష్టం పట్ల కృతజ్ఞతతో ఉండటం నేర్పింది.  

 

కాలం గాయాలని తగ్గిస్తుందంటారు. కాని తన అస్తిత్వాన్నే ప్రశ్నార్థకం చేసి, నరనరాల్లోకి జీర్ణమైపోయిన అనుభవాలు ప్రతి గుండె చప్పుడుకి మధ్య తమ ఉనికిని తెలియజేస్తూనే ఉంటాయి. ఈ అలజడి తనని ఈ జన్మలో విడిచిపెడుతుందా? ఇప్పటికైనా తను ఈ గతాన్ని వెనక్కి నెట్టి భవిష్యత్తులోకి కొత్త ప్రయాణం మొదలు పెట్టగలడా? వెనక్కి నెట్టెయ్యటానికి గతం అంటే జ్ఞాపకం కాదు… నా ఉనికి.

 

******

మురళీ లంక

మురళీ లంక

హైదరాబాదుకి చెందిన మురళి లంక ప్రస్తుతం హ్యూస్టన్ నగరంలో నివసిస్తున్నారు. వృత్తి రీత్యా ఐటీ రంగంలో పని చేస్తున్నారు. ప్రవృత్తి నాట్యం, రచన, స్నేహితులతో కలిసినప్పుడు పద్యాలు పాడటం.

bottom of page