top of page

మధురవాణి ప్రత్యేకం - భువనోల్లాసం

నా కథ - 9

bhuvana.jpg

భువనచంద్ర

“సో… లిచ్ఛవి పెక్యూలియర్ విమెన్! అవునా?” అన్నాడు శాండీ. 

“నో… పెక్యూలియర్ కాదు, వెరీ వెరీ సెన్సిటివ్ పర్సన్. బహుశా మా అందరిలాగానే ఒకప్పుడు ఫుల్లీ చార్జ్‌డ్ బ్యాటరీలాగా ఉండేది అనుకుంటా. ఏదో జరిగింది, గ్లాసు ముక్కలైనట్టు ఆవిడ గుండె ముక్కలు అయింది. గుండె నిండా కఠినత్వం పేరుకుంది. ఇవాళ కొంత కరిగింది.. అదీ మన బాలాను చూశాక. గట్టిగా పట్టుబడితే చెప్పేదేమో కానీ పట్టుబట్టే అంత ధైర్యం చేయలేకపోయాను” గోరువెచ్చని పాలల్లో కాస్త తేనె కలిపి సిప్ చేస్తూ అన్నది కామీ. 

“నాకూ అడగాలనిపించింది కానీ అడగలేదు. కొన్ని విషయాలు నిగూఢంగా ఉంటేనే మంచిదనిపించింది. ఎవరు ఎవరికి ఏమి చెప్పాలన్నా నమ్మకం అనే వారధి ఏర్పడాలి, అది ఏర్పడడానికి ఎవరికైనా కొంచెం సమయం పడుతుంది” నేనూ టీ సిప్ చేసి అన్నాను.

అక్కడ నుంచి వచ్చాక మేం ముగ్గురం శాండ్ విచ్‌లు తిన్నాము. వెజ్ శాండ్ విచ్‌ చాలా బాగుంది. టమాటో, ఆనియన్, క్యాప్సికం, కీరా కాక మరేవో సాస్‌లు జత చేశారు. దాంతో మహా రుచి వచ్చింది. ఆ మాటే శాండీతో అన్నాను.   

“దట్ ఈస్ మై సీక్రెట్” అన్నాడు శాండీ నవ్వుతూ. 

“రియల్లీ! బయటివి కాదా?” అన్నది కామీ ఆశ్చర్యంగా. 

“శాండీ మేక్స్ శాండ్ విచెస్” అన్నాడు ఫకాల్న నవ్వి.

“వెల్, హిమాలయా కంపెనీ మీ ఇద్దరికీ చోటు ఇచ్చింది ఇక నా సంగతి ఏమిటో తేల్చుకోవాలి” అన్నాడు శాండీ.  

“ఏం చేద్దామనుకుంటున్నావూ?” అడిగాను.

“హర్షతో పాటు కూర్చుని స్క్రిప్ట్ వర్క్, స్క్రీన్ ప్లే నేర్చుకుందాం అనుకుంటున్నాను. అతను ఇంకా డైలాగ్స్‌ని కాగితం మీద పెట్టలేదు అందువల్ల డైలాగ్ రైటింగ్ కూడా నేర్చుకోవచ్చు. అన్నిటికంటే కష్టం సన్నివేశాలని బట్టి కాల్ షీట్స్ వేయడం” అన్నాడు శాండీ. 

“అంటే?”

“మీరు గుండమ్మ కథ చూశారు కదా! NTR, ANR, సావిత్రి, జమున ఎన్ని సీన్లలో ఒకే చోట కనిపించాలి, అదే చోట సావిత్రి, NTR లేక ANR, జమున ఎన్నిసార్లు కనిపించాలి, ఇతర నటీనటుల కాంబినేషన్‌లో వాళ్లు అదే చోట కనిపించాలి, NTR ANR SVR ఒకే చోట ఎన్నిసార్లు కంబైండ్‌గా కనిపించాలి etc.. etc.. ఇవన్నీ స్పష్టంగా పేపర్ మీద పెట్టి, ఏ సీన్‌కి ఎంత సమయం పడుతుందో లెక్కగట్టి ఆ సమయాన్నిబట్టి నటీనటుల కాల్ షీట్స్ తీసుకుంటారు” ఓపిగ్గా చెప్పాడు శాండీ. 

నాకు ఆశ్చర్యమనిపించింది. 

“పాటలు, ఫైట్స్ పక్కనపెట్టి ఏ సన్నివేశంలో ఎందరు నటులు ఉంటారు, ఎన్ని లొకేషన్స్‌లో సన్నివేశాలు జరుగుతాయి, సుమారు ఎంత సమయం పడుతుందీ అన్న విషయాలు పర్ఫెక్ట్‌గా లెక్కలు వేస్తారు. లొకేషన్స్ అంటే, గుండమ్మ కథలో 1. గుండమ్మ గారి ఇల్లు, 2. విజయలక్ష్మి ఇల్లు, 3. ఎస్వీ రంగారావు గారి ఇల్లు, 4. రమణారెడ్డి ఇల్లు, 5. మొదట్లో అంజి (NTR) టిఫిన్ తినే హోటల్. అదే హోటల్లో రమణారెడ్డి నీళ్ల పాలు అమ్ముతాడు, 6. సావిత్రి పిండి రుబ్బే చోటు (అక్కడే ‘లేచింది, నిద్ర లేచింది…’ పాట కూడా తీశారు), 7. జమున, ANR పని చేసే తోట ఇల్లు (అక్కడే ‘ప్రేమ యాత్రలకు బృందావనము…’ పాట తీశారు). గుండమ్మ గారి ఇంటి లోకేషన్లోనే ‘కోలు కోలోయమ్మ…’ పాట తీసింది. 

ఇలా స్పష్టంగా సన్నివేశాలు, లొకేషన్లు, నటీనటులు, సన్నివేశం తీయడానికి పట్టే సమయం లెక్కలు కట్టి నటీనటుల కాల్ షీట్లు తీసుకుంటారన్నమాట” ఇంకొంచెం వివరించాడు శాండీ. 

“ఓరి నాయనో చాలా వ్యవహారముందే!” ఆశ్చర్యంగా అన్నది కామీ.

“సినిమాల్లోకి డైరెక్టర్స్‌గా రావాలనుకున్న వాళ్ళందరూ పాత సినిమాలను చూస్తే లొకేషన్లు, సన్నివేశాలు, నటీనటుల సంఖ్య, సన్నివేశాలకు పట్టే సమయం వంటివి నోట్ చేసుకుని స్టాప్‌వాచ్‌తో లెక్కలు కడుతుంటే కొన్నాళ్ళకి కాల్ షీట్స్ వెయ్యడం తెలుస్తుంది” నవ్వి అన్నాడు శాండీ. 

“మనకి చాలా ఈజీగా కనిపిస్తుంది కానీ సినిమా తీయడం అంటే ఓ మహాయజ్ఞం అన్నమాట” అన్నాను నేను. 

నిజంగా యజ్ఞమే. ఆనాటి నుంచి ఓసారి సినిమా చూశాక మరోసారి అదే సినిమాని లొకేషన్లు etc  కోసం చూడడం మొదలు పెట్టాము.

 

“ఒక లొకేషన్లో 20 సీన్లు చేయాలంటే ఒకేసారి వన్ బై వన్ తీసేస్తారు. సన్నివేశానికి తగిన డ్రెస్సులు, నటీనటులు, సన్నివేశంలో కనపడాల్సిన వస్తువులు, సెట్ ప్రాపర్టీస్ అన్నీ నోట్ చేసుకుంటారు. గుండమ్మ కథనే విశ్లేషించి చూడు, ఓర్నీ… ఇంత సింపుల్‌గానా అనిపిస్తుంది. అంత సింపుల్‌గా సెట్ చేయడానికి ఎంత మాస్టర్ బ్రెయిన్ కావాలీ?” అన్నాడు శాండీ.

ఆ తర్వాత కామీ, “ఇవన్నీ పక్కన పెట్టు, ఒకే పాటలో హీరోయిన్, హీరోలు పది డ్రస్సులు మారుస్తారు. ఎందుకూ? ఐదు నిమిషాల పాటకి 50 డ్రస్సులు మార్చాలా?” అని అడిగింది.

“ఒక ప్రేయసీ, ప్రియుడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయినా అది ముదరడానికీ, పెళ్లి వరకూ వెళ్లడానికీ అయిదు నెల్లో ఆరు నెల్లో పడుతుంది కదా! ఎన్ని డ్రెస్సులు మారిస్తే ప్రేమలో అంతకాలం గడిచినట్టు లెక్క అన్నమాట. అలాగే సాంగ్స్‌లో అనేక రకాల పాటలు ఉంటాయి లవ్ సాంగ్స్, టీజింగ్ సాంగ్స్, సోలో సాంగ్స్, గ్రూప్ సాంగ్స్, భక్తి పాటలు, తత్వపు పాటలు, జోల పాటలు, లాలి పాటలు… ఇలా ఎన్నో రకాలు ఉంటాయి ప్రతి సాంగ్‌లో డ్రస్సులు మార్చరు”. కామీ ప్రశ్నకు వివరంగా జవాబు ఇచ్చాడు శాండీ. 

కబుర్లు చెబుతూనే ఆ రోజు రాత్రి పన్నెండయ్యింది. వాళ్ళిద్దరూ నిద్దర పోయినా నాకు మాత్రం నిద్దర రాలేదు. లిచ్ఛవి మరీ మరీ జ్ఞాపకానికొచ్చింది. ఆవిడ కళ్ళ కింద నలుపు ఎన్నో విషాదాలని తనలో ఇముడ్చుకుంది. నలుపు చీకటికీ, విచారానికి సంకేతమే కదా, మౌనానికి కూడా అది సంకేతమే. ఆ తర్వాత మా అమ్మ గుర్తుకొచ్చింది. నేను సినీనటినయ్యానని తెలిస్తే ఏమనుకుంటుందీ? ‘ఏమీ అనుకోదు’ అనిపించింది. మరి మా నాన్న? ఫక్కున నవ్వొచ్చింది. ఇప్పుడు నేను హీరోయిన్‌ని కదా! సరోజినీ ఆంటీని డాన్స్ మాస్టర్‌గా పెట్టుకోమంటాడేమో! జీవితం నిజంగా ఓ ప్రయాణమే, ఓ ప్రశ్నార్ధకమే, ఓ అస్పష్ట చిత్రమే, మళ్లీ సడన్‌గా అనిపించింది. ‘లిచ్ఛవీ బహుశా నాలాగే ఒంటరిదేమో, అదీ విధి చేతుల్లో సర్వమూ కోల్పోయిన ఒంటరిదేమో’. నేనేమీ కోల్పోలేదు, తల్లీ, తండ్రి వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు అంతేగా. మరి లిచ్ఛవీ!  ఎప్పుడో మగత నన్ను కమ్ముకుంది ఓ మేఘంలా.

వారం రోజులు వరసగా ఆఫీసుకు వెళ్లి వచ్చాను. లిచ్ఛవి చాలా గంభీరంగా, చాలా డిగ్నిఫైడ్‌గా మాట్లాడేది. ఫలానా విషయం అనే కాదు. సినిమాల్లో ఆడవాళ్లు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఒకసారి సొసైటీలో ఎలా మెలగాలనే విషయం, ఒకసారి ఎవరినీ నమ్మకూడదు కానీ నమ్మినట్టు ఎలా ఉండాలో, ఒకసారి స్నేహితులను ఎంత దూరంగా, ఎంత దగ్గరగా పెట్టాలీ అనే విషయాల్ని చక్కగా లెక్చరర్‌లా చెప్పింది.  

ఈ వారం రోజులు ఆవిడ మా ఎదురుగా విస్కీ తాగలేదు. అయితే ఠంచనుగా 7:30 కల్లా మమ్మల్ని పంపించేసేది. 

ఆఫీస్ స్టాఫ్ బాగా అలవాటయ్యారు. నన్ను స్టార్ హీరోయిన్‌లా చూస్తున్నారు, ఒదిగి ఒదిగి ఉంటున్నారు, కామీతో మాత్రం సరదాగా ఉంటున్నారు. ఆ విషయం గమనించింది కూడా కామీనే.

“బాలా, నిన్ను మహారాణిలా చూస్తూ నన్ను రాణిగారి ముఖ్య చెలికత్తెలా చూస్తున్నారే. అయామ్ రియల్లీ ఎంజాయింగ్ దిస్. సినిమా వాళ్లకి అహం అనేది ఎందుకు వస్తుందో ఇప్పుడు అర్థం అయింది. ఆ అహం పెరగడానికి స్టాఫూ, టెక్నీషియన్లూ కూడా ఓ విధంగా కారణమే” అన్నది.

అది చెప్పేదాకా నా మట్టి బుర్రకి ఆ విషయం తట్టలేదు. గమనిస్తే అది చెప్పింది నూరు శాతం రైట్.

 

శిబూ సార్ ఓ రోజు నన్ను తన గదిలోకి పిలిచారు. సాయంత్రం 6:30 అవుతుంది అప్పుడు.

“ఒంటరిగా ఉండగలవా, లేక కామీ తోడు కావాలా?” అన్నారు నేను వెళ్ళగానే. 

“నో ప్రాబ్లం సార్, నేను ఉండగలను” అన్నాను ధైర్యంగా. 

“వెల్, లిచ్ఛవి ద్వారా నీ గురించి వింటూనే ఉన్నాను. ఐ యాం వెరీ హ్యాపీ. ఆ విషయం అలా పెడితే రేపు సాయంకాలం 5:30 కి నాతో నువ్వు ఒంటరిగా ఓ పెద్ద ఫంక్షన్‌కి రావాలి. విలేఖరులు, ఛానల్స్ వాళ్ళూ  కనీసం 60, 70 మంది నిన్ను ప్రశ్నలు సంధిస్తూనే ఉంటారు. నువ్వు ఏ మాత్రం తొణక్కుండా ఉండటమే గాక వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషనూ చెప్పకుండా చిరునవ్వుతో బురిడీ కొట్టించాలి” అన్నారు. 

“ఆ పరిస్థితి నుంచి తప్పించడానికి మీరు ఉంటారుగా!” అన్నాను నేను. 

ఫకాల్న నవ్వారు శిబు. “పిచ్చి మోహమా, కావాలనే నేను పక్కకి పోయి చానల్ వాళ్ళు నిన్ను ప్రశ్నించే అవకాశం ఇస్తా. పార్టీ అయిపోయినా నువ్వు ఎవరో, నీకు నాకు సంబంధం ఏమిటో ఎవరికీ తెలియకూడదు. అప్పుడే ప్రెస్ వాళ్ళ, చానల్స్ వాళ్ళ అటెన్షన్ 100% నీ మీద ఉంటుంది, బ్రహ్మాండమైన పబ్లిసిటీ, సూపర్ రూమర్స్ కూడా పుడతాయి. మనకి కావాల్సింది అదే” ఆప్యాయంగా నవ్వుతూ అన్నాడు.

ఆశ్చర్యంతో నాకు నోట మాట రాలేదు. 

“కంగారు పడకు, ఇక్కడంతా బిజినెస్సే. ఇది ముంబై బాలా, ఇక్కడ ఏదీ, ఎవరికీ ఫ్రీగా చేయరు ముఖ్యంగా సినీఫీల్డులో. నేను నీకు ఏ జాగ్రత్తలు చెప్పను, ఇందాక చెప్పింది మాత్రం మనసులో పెట్టుకొని ఎంజాయ్ ద షో. అన్నట్టు నువ్వు మళ్ళీ లిచ్ఛవి దగ్గరికి వెళ్ళు, కాస్ట్యూమర్స్ సిద్ధంగా ఉన్నారు. రేపటికి మాత్రం చాలా కాస్ట్లీ, చాలా బోల్డ్, చాలా బ్యూటిఫుల్ లుక్‌తో నువ్వు ఉండాలి. దుస్తులు తయారు చేయడం కోసం కొలతలు తీసుకుంటారు. లిచ్ఛవి, కామీ నీ దగ్గరే ఉంటారు కనుక ఏ భయం అక్కరలేదు. టాప్ డ్రెస్ డిజైనర్ విపిన్ చడ్ఢా నీ కొలతలు తీసుకోబోతున్నాడు, టాప్ మోస్ట్ హీరోయిన్స్‌కి మాత్రమే అతను టేపుతో కొలతలు తీస్తాడు. భయం, సిగ్గు పక్కన పెట్టు. అలాగే రితీష్ ధవన్ అనే టాప్ మేకప్ మేను కూడా అసిస్టెంట్స్‌తో వచ్చి నిన్ను చూస్తాడు. రేపు సాయంత్రం నాలుగు గంటలకి నీకు దుస్తులు తొడగబడతాయి, ఫస్ట్ మేకప్ వేయబడుతుంది. ఐదు గంటల పదిహేను నిమిషాలకి నేను వస్తాను. మన, సారీ… నా కారులోనే మనం ఫంక్షన్‌కి వెడుతున్నాం. నీకు అయిదు ఎంట్రీ పాసులు విఐపివి ఇచ్చే ఏర్పాటు చేస్తాను. కామీ, శాండీ కాక మరో ముగ్గురిని నువ్వు ఇన్వైట్ చేయొచ్చు” మెల్లగా నా భుజం తట్టి బయటికి వెళ్లిపోయారు శిబూ. 

నాకు మతిపోయింది బోల్డ్ లుక్సా? బోల్డ్ కాస్ట్యూమ్సా? అవి కాస్ట్లీనా? టాప్ మోస్ట్ డిజైనరూ, టాప్ మోస్ట్ మేకప్ మేనా? అవాక్కయి నేను అలానే ఆ గదిలోనే ఉండిపోయా. ఓ క్షణం తరువాత శిబూ సడన్‌గా లోపలికి వచ్చారు.

“బాలా, వర్రీ కాకు. నేనున్నానుగా come… come…” అని నా చేయి పట్టుకుని బయటికి తెచ్చారు.  హాల్లో ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు విపిన్ చడ్ఢా, రితీష్ ధవన్‌లు వాళ్లే అనిపించింది. శిబూ నా వంక క్రీగంట చూడగానే అసంకల్పితంగా వారికి  చేతులు జోడించి నమస్కరించాను. 

“వాహ్… శిబూ సాబ్! షీ ఈస్ ఎ డ్రీమ్…”  నోరంతా తెరిచి నవ్వుతూ అన్నారొకరు. 

“వీరు విపిన్ చడ్ఢా, ది గ్రేట్ కాస్ట్యూమ్ డిజైనర్” అని పరిచయం చేశారు శిబూ, “వారు రితీష్ ధవన్, మేకప్ ఆర్టిస్ట్. అంతేకాదు మాన్ ఆఫ్ థౌసండ్ షేడ్స్” అన్నారు. 

మరోసారి చేతులు జోడించి “నమస్తే” అన్నాను.

“వెల్ విపిన్, వెల్ రితీష్… గెట్ ఆన్ టు యువర్ జాబ్” అని వారితో చెప్పి, నా వంక చూసి చిన్నగా నవ్వి బయటికి వెళ్లిపోయారు శిబూ. 

రితీష్ చూపులో ఓ తీవ్రత కనిపించింది. అది వృత్తికి సంబంధించిన కాన్సన్ట్రేషన్ అని నాకు అనిపించింది. విపిన్ మొహంలో వేయి వెలుగులు, నమ్మశక్యం కాని దాన్ని చూస్తే వచ్చే వెలుగు అది.

‘అసలు నా మొహంలో ఏముందని వీళ్ళు ఇంత అటెన్షన్ చూపిస్తున్నారూ!’ అని నాలో నేను అనుకుంటూ ఉండగానే లిచ్ఛవి బయటికి వచ్చి, “కమాన్ బేబీ, రూమ్ నంబర్ ఫోర్‌లో మొదట విపిన్ నీకు కొలతలు తీస్తాడు. ఆ తరువాత రితీష్ తన స్టాఫ్‌తో స్కిన్ టెస్ట్ చేస్తాడు. స్టిల్ ఫోటోగ్రాఫర్స్ కూడా ఇంకో గంటలో వస్తారు, ఎలా చూసినా వర్క్ అయ్యేటప్పటికీ రాత్రి 10 గంటలు అవుతుంది. గ్రాబ్ సంథింగ్ టు ఈట్”  అంటూ నన్ను లోపలికి తీసుకెళ్లింది. 

కామీ, లిచ్ఛవీ చైర్స్‌లో కూర్చొని ఉన్నారు. నేను విపిన్ ఎదురుగా నిల్చుని ఉన్నాను. అతను నా ఆపాదమస్తకము చూస్తూ చకచకా కొలకలు తీసుకుంటున్నాడు. బయట కుట్టించేటప్పుడు, అంటే లంగా, బాడీ, జాకెట్లు కుట్టించేటప్పుడు తీసుకునే కొలతలు నాకు తెలుసు, కానీ అసలు ఇన్ని కొలతలు తీసుకుంటారని నా ఊహలో కూడా లేదు. అతను తీసుకుంటూ ఉండగానే అతని అసిస్టెంట్స్ మెషిన్ వాన్‌తో సహా వచ్చారు. మిషన్ వ్యాన్ అంటే కుట్టు మిషన్లు etc లతో ఉన్న వ్యాన్. అవుట్ డోర్ షూటింగ్స్ కోసం ఆ వాన్లను వాడుతారట, అందులో సర్వం ఉంటాయట.

 

“ఫెంటాస్టిక్ బాలాజీ… మీకు డ్రెస్ డిజైన్ చేయడం నాకో ప్రెస్టేజ్” అంతా అయ్యాక షేక్ హ్యాండ్ ఇచ్చి గబగబా బయటికి వెళ్లిపోయాడు విపిన్. 

“ఇక తెల్లార్లు అతనికి నిద్ర ఉండదు” నవ్వింది లిచ్ఛవి. 

నా మొఖం సిగ్గుతో ఎర్రబడిందని నాకనిపించింది. 

“బాలా, నాది బయటికి కనిపించే సెక్సీ స్ట్రక్చర్. నీది నిజంగా అపురూపమైన స్ట్రక్చరే” నన్ను గట్టిగా కావలించుకుని ముద్దు పెట్టి అన్నది కామీ.

 నిజంగా నాకు నోట మాట రాలేదు. 

రితీష్ మొహం మీద, హాండ్స్ మీద, లైట్ ఫోకస్ చేస్తూ, ఏ స్కిన్ లోషన్ అప్లై చెయ్యాలా, ఎలాంటి మేకప్ వాడాలా అని మల్లగుల్లాలు పడుతున్నాడు. 

“చాలా చాలా లైట్ మేకప్ సెలెక్ట్ చేస్తాను బాలాజీ, అసలు మేకప్ చేసినట్టే తెలీదు కానీ ఫెంటాస్టిక్ గ్లో ఉంటుంది. ప్రోగ్రాం రేపే గనుక ఐ కెనాట్ టేక్ ఎనీ రిస్క్” అన్నాడు.

ఫైనల్లీ మొత్తం వర్క్ అయ్యేసరికి 9:30 అయింది. 

“బాలా, కాన్ యూ బి విత్ మీ ఫర్ 15 మినిట్స్. యూ టూ కామీ” అన్నది లిచ్ఛవి. 

“ఎస్ మేమ్” అన్నాము. 

రితీష్ వెళ్ళిపోగానే బాయ్ విస్కీ ఐస్ క్యూబ్స్ తెచ్చాడు, గబగబా విస్కీ పోసుకుని ఐసు ముక్కలు వేసి చప్పరిస్తూ మమ్మల్ని కూర్చోమన్నది. కూర్చున్నాం. 

“అమ్మాయిలూ, రేపట్నుంచి మీరు ప్రపంచానికి పరిచయం అవుతారు అఫ్‌కోర్స్ మొదట బాలా. కానీ… ఐ విల్ మిస్ యూ. ఒక్కసారి ఇంట్రో (ఇంట్రడక్షన్) అయ్యాక ఈ చనువు, ప్రేమ నేను చూపే వీలు ఉండదు. ప్రొఫెషనలిజంకి అర్థం ఇంతే, ముఖ్యంగా సినిమాల్లో”. 

ఓ క్షణం ఆగింది. ఏదో చెప్పాలని చెప్పలేకపోతున్న విషయం నాకు అర్థమైంది, కానీ నేను మౌనంగా ఉన్నా. 

“ఐ మీన్… ఐ మీన్…” మళ్లీ ఆగిపోయింది లిచ్ఛవి. 

కామీ ఏదో అడగాలని ఆగిపోవడం నేను గమనించాను. 

“వద్దు… ఏమీ అడగవద్దు ప్లీజ్. జస్ట్ నా ఎదురుగా ఉండండి” అంటూ గటగటా విస్కీ తాగేసింది లిచ్ఛవి. బహుశా కరుగుతూ కరుగుతూ ఉన్న ఐసు మొక్కలు కూడా ఆమె గొంతులో నుంచి కడుపులోకి జారిపోయి ఉంటాయని నాకనిపించింది. 

“సారీ…” అంటూ మళ్ళీ మరో గ్లాసులో విస్కీ పోసుకుని ఐస్ క్యూబ్స్ కలుపుతూ సుదీర్ఘంగా నిట్టూర్చింది లిచ్ఛవి. 

మరో 10 నిమిషాల్లో మరో రౌండు పూర్తి చేసి “బాలా, నీకు ఎప్పుడు ఏ కష్టం కలిగినా నేనున్నాను, just call me, బస్… లోకంలో ఎవరూ నిన్ను ‘టచ్’ చేయలేరు. కామీ, బీ మై ఫ్రెండ్. OK. నేనడిగిన 15 నిమిషాలు అయిపోయింది. బీ ఆన్ యువర్ వే మై డియరెస్ట్ గాళ్స్” అంటూ లేచింది.

 

నాకెందుకనిపించిందో తెలీలేదు గభాల్న లిచ్ఛవిని కౌగిలించుకున్నాను. అంతే, ఆర్తిగా నన్ను గుండెలకు హత్తుకుని నా నుదుటిమీద, తలమీద ఆబగా ముద్దు పెట్టి విడవలేక, విడవలేక కౌగిలి సడలించింది. మా అమ్మ కూడా ఏనాడూ అంత ప్రేమగా, ఆర్తిగా నన్ను దగ్గరకు తీయలేదు.

 

“థాంక్యూ మై చైల్డ్, లవ్ యూ” అంటూ బయటిదాకా వచ్చి పంపించింది. 

ఆమె కళ్ళల్లో అనంతమైన తృప్తి… తడి…

 

***

 

“ఎందుకు కావలించుకోవాలనిపించిందీ?” కారులో నన్ను అడిగింది కామీ. 

“నిజంగా నాకు తెలీదు కామీ… ఏదో ఒంటరిగా మహాదుఃఖాన్ని ఆవిడ భరిస్తున్న మాట వాస్తవం,  ‘ప్రేమరహిత్యం’ అనేది ఆవిడ గుండెని కాల్చేస్తున్నదీ వాస్తవమే. అయితే నేను ఎందుకు వెళ్లి కావలించుకున్నానో నాకు నిజంగా తెలియదు. ఆవిడని కౌగిలించుకుంటే ఆవిడ బాధ కొంత తగ్గుతుందనే నిజం నా మనసుకి తెలిసి ఉండొచ్చు, నా మనసుకి ఎలా తెలిసిందీ అంటే నా దగ్గర సమాధానం లేదు. మనసు గొప్ప రిసీవర్, మనసు ఓ గొప్ప ట్రాన్స్మిటర్, మనసు గొప్ప అడ్వైజర్, మనసు ఓ గొప్ప ఎనలైజర్. ఇవి మాత్రం నిజంగా నిజాలు” అన్నాను.

“నాకేం అనిపించిందో తెలుసా, బహుశా మీరిద్దరూ ఏ జన్మలోనో తల్లీకూతుళ్లు అయి ఉండాలి” అని నా భుజం మీద తట్టి అన్నది కామీ.

“ఏమో నాకు మాత్రం ఒకటే అర్థమైంది. ఆమె ప్రేమలో ఏ కల్మషమూ లేదు” అన్నాను.

అది నిజం. ఆమె కౌగిలించినప్పుడు నాకు కనిపించింది స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే. “నో వన్ కెన్ టచ్ యూ” అన్న ఆమె మాట మళ్లీ నా చెవుల్లో రింగుమంది. చాలా చాలా రగ్గెడ్‌గా, టఫ్‌గా కనిపించే లిచ్ఛవి నుంచి అంత అనురాగపూరితమైన మాట ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయలేరు. సడన్‌గా కఠినత్వపు గోడ కరిగిపోయి పూలతోట కనిపించినట్టు లిచ్ఛవి నాకు అనిపించింది. నిన్న వేరు, నేడు వేరు - మరి రేపు? రేపటి కథ చూసుకోవాల్సింది రేపేగా!

 

*****

bottom of page