top of page

పుస్త​క పరిచయాలు

నిర్వహణ: శాయి రాచకొండ  |  శ్రీనివాస్ పెండ్యాల

sahityam@madhuravani.com

పుస్తక విశ్లేషణ

మేము ఎంపిక చేసుకున్న కొన్ని  పుస్తకాలు ఈ ‘పుస్తక పరిచయాలు’ శీర్షికలో విశ్లేషించబడతాయి.

సంక్షిప్త పుస్తక పరిచయం

పుస్తక రచయితలకి ఉచితంగా ప్రచారం కలిగించడంకోసం మరియు పాఠకులకి కొత్త పుస్తకాల అందుబాటు గురించి క్లుప్తంగా పరిచయం చేయుట కొరకు "సంక్షిప్త పుస్తక పరిచయం" శీర్షిక ఉద్ధేశ్యింపబడింది. ఈ శీర్షిక లో తమ సరికొత్త గ్రంధాలని పరిచయం చెయ్యదల్చుకున్న వారు, ప్రచురించబడ్డ కొత్త పుస్తకాల ముఖ చిత్రం (స్కాన్ చేసిన ఫ్రంట్ కవర్), రచయిత వివరాలు, పుస్తకం గురించి ఐదు వాక్యాలు మించకుండా సంక్షిప్త సమీక్ష, కొనుగోలు వివరాలు మాకు పంపగలరు.

పంపించవలసిన చిరునామా:

sahityam@madhuravani.com

 పుస్తక పరిచయం విషయాలలో అంతిమ నిర్ణయం మధురవాణి నిర్వాహకులదే. 

Picture1.jpg
Picture2.jpg
Picture3.jpg
Picture4.jpg

భాగవత నవనీతం:

 

శలాక రఘునాథ శర్మ(శరశర్మ) గారిచేత వ్రాయబడుతున్న ‘భాగవత నవనీతం’ ఇప్పటికి నాలుగు భాగాలు వెలువరించబడింది.  పోతన గారి భాగవతం చిన్న దగ్గరనుంచి పెద్ద దాకా ఎంతమందినో అలరించి అనుభవింపచేసింది.  ఎంతమందో ఆ పద్య మకరందాన్ని అనుభవించి, తమ ఆనందాన్ని ఎన్నో రూపాలలో తెలుగు వాళ్ళకి అందజేయడం జరిగింది.  అయితే ఇవి చాలవా?  మరో మకరందం కావాలా? 

శలాకవారి పాండిత్యప్రతిభ గురించి చెప్పనక్కరలేదు.  మరి ఆయన ఈ ప్రయత్నాన్ని ఎందుకు తలపెట్టినట్లో?  పుస్తకానికి ముందుగా ‘హృదయసంవాదం’ లో ఆయన ఇలాంటి ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పారు.  ఎందుకట? “పోతనగారి శ్రీమదాంధ్రమహాభాగవతాన్ని నేరుగా అందుకోలేని తెలుగు పాఠకులకు అందుబాటులో ఉన్న భాషను ఉపయోగించి ఆకర్షణీయంగా అందించడం లక్ష్యంగా ఈ గ్రంథం రూపొందుతున్నది” అని చెప్పారు. 

ఇంకో ముఖ్యమైన ప్రశ్న, అయితే ఇది భాగవతాన్ని మరో రకంగా చెప్పడమా? అది పిష్టపేషణ (పిండి పిసకడం) వ్యవహారంలా అయిపోదూ?  దానికి శలాక వారి సమాధానం – అయిపోదు.  ‘అభ్యాసవైరాగ్యాలు’ రెండూ పొందాలనే భావన ఉన్న చోట్ల పిష్టపేషణం అన్న మాటకు నిలువ నీడ లేదు. 

ఆకాశవాణి కడప కేంద్రం వారు ప్రసారం చేసిన ‘వ్యాసపీఠం’ శీర్షికలో శలాకవారు కూడా భాగవతం కొన్ని భాగాలు చెప్పడం జరిగిందని, అక్కడ ప్రసంగాలు ఈ పుస్తక రచనకు దోహదం చేసాయని చెప్పారు.   

చాలా సరళమైన భాషలో వచనంలో చెప్పిన భాగవతం పోతన పద్యాలలోని మధురిమను ఇసుమంతైనా తగ్గించకుండా తనదైన శైలిలో శలాకవారు పంచిచ్చిన నవనీతం అందరూ ఆస్వాదించవలసింది. 

ప్రతులకు raghunathasarma@gmail.com లేక salaka.lalitha@gmail.com కు రాయండి. 

* * 

 

పింగళి సూరనామాత్య విరచిత రాఘవపాండవీయము (ద్వ్యర్థి కావ్యము) – పరిచయము, మహాకవి నాచన సోమనాథ ప్రణీత ఉత్తరహరివంశము – పరిచయము:

పై రెండు పరిచయగ్రంథాలూ బాలాంత్రపు వేంకటరమణ గారి కలంనుండి వెలువడినవే.  ఇదివరలో ఆయన వ్రాసిన మనుచరిత్రము, పారిజాతాపహరణము, పాండురంగమహాత్మ్యం, వసుచరిత్రము, ఆముక్తమాల్యద గ్రంథాల పరిచయాలు ఈ శీర్షికలో పేర్కొనడం జరిగింది.  అందరం పద్యాలు చదివి అర్ధం చేసుకోలేం.  అర్ధం చేసుకున్నా కేవలం తాత్పర్యం దగ్గరే ఆగిపోతాం.  అంతవరకూ చేసినా, ఈ ప్రబంధాలకి, అవి రాసిన కవులకి న్యాయం చేకూర్చలేము.  అందుకే కాబోలు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు ముందుగా చేపట్టిన ప్రక్రియ ‘పాఠకమిత్ర’ పద్ధతిలో (reader friendly) రాసే వ్యాఖ్యానాలు.  అలాంటి వ్యాఖ్యానాల లేమిని భర్తీ చేస్తూ పంచమహాకావ్యాలను చేపట్టి పరిచయం ఒక్కొక్కటిగా పరిచయం చేశారు వేంకటరమణ గారు.

 

పింగళి సూరన విరచితమయిన రాఘవపాండవీయం ఒక ద్వ్యర్థి కావ్యం.  ప్రతి పద్యంలోనూ రామాయణ భారత కథలు రెండూ సాగుతాయి.  కవిని, గ్రంధాన్ని పరిచయం చేస్తూ అనేకార్థ కావ్యాల గురించి, అలాంటి కావ్యాలు రాసిన వివిధ కవుల గురించి విశదీకరించి రాసినప్పుడు పాఠకులు ఉత్సుకతతో చదవడానికి అవకాశం ఉంటుంది.  పాఠకుల నాడి తెలిసిన వారు రమణగారు. 

నాచన సోమనాథుడు రాసిన ఉత్తరహరివంశము యొక్క పరిచయం కూడా అదేవిధంగా సాగుతుంది.  ఇక్కడ కూడా, కవి గురించి చెబుతూ, రమణగారు కొన్ని విశేషాలను పాఠకులముందుంచడం గమనార్హం.  ఎన్నో గ్రంథాలకు మల్లే అవతారిక లేకపోవడం వల్ల కవి పుట్టుపూర్వోత్తరాలు పాఠకులకు తెలియకపోవడం జరిగింది.  అయితే క్రీ.శ. 1344లో బుక్కరాయలు నాచన సోమన్నకు ఒక గ్రామాన్ని దానంచేసినట్లున్న ఒక తామ్ర శాసనం ద్వారా నాచన సోమనాథుడి గురించి తెలియడం ఒక విశేషం.

 

ఎన్నో వివరాలతో తను ఎంచుకున్న కొన్ని పద్యాలతో పూర్తి గ్రంథాలను పాఠకులకు అర్థమయే భాషలో పరిచయం చేసిన వేంకట రమణ గారు ధన్యులై మనల్ని ధన్యుల్ని చేశారు. 

పై రెండు పుస్తకాలూ అచ్చంగా తెలుగు ప్రచురణలే.  కాపీలకు acchamgaatelugu@gmail.com కు రాయండి. 

* * 

ఆధునిక తెలుగు భాషాశాస్త్ర వ్యాసాలు:

 

ఆధునిక తెలుగు భాషాశాస్త్ర వ్యాసాలు డా. శివుని రాజేశ్వరిగారు తెలుగు భాషపై, భాష గురించి రాసిన వ్యాస సంపుటి.  రాజేశ్వరి గారు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం లోని తెలుగు అధ్యయన శాఖలో అధ్యాపకురాలిగా ఎన్నో సంవత్సరాలు పనిచేసారు.  తన బోధన అనుభవాన్ని శాస్త్రీయ పరిశోధనను జోడించి రాసిన వ్యాసాలివి. 

 

తెలుగు భాష మేధావి స్థాయిలో ఉందా? లేక సాధారణ స్థాయా?  అన్న ప్రశ్న నుండి మొదలై, ఆధునిక తెలుగు భాష నిర్మాణ సిద్ధాంతాలేమిటో, అవి కవుల రచనలకు ఎలా ఆపాదించబడ్డాయో తెలియచేస్తూ రాసిన వ్యాసాలివి.  భాషపై మక్కువగలిగిన వారితో తన పరిశోధన ఫలితాలను ఈ వ్యాసాల ద్వారా పంచుకోవడం రాజేశ్వరి గారి ముఖ్యోద్దేశం.  అన్నమయ్య, గురజాడ, ఆరుద్ర, విద్వాన్ విశ్వం మొదలైన కవుల పదాలలో, గేయాలలో, క్రియా నిర్మాణమేలాంటిది?  టి.వి. వార్తలలో భాష ప్రయోగాలేలా ఉన్నాయి? ఇలా సాగిపోతాయి వ్యాసాలన్నీ.  ఈ సంకలనంలో ఇరవై అయిదు వ్యాసాలున్నాయి.  చాలా ఆసక్తికరంగా చదివించే వ్యాసాలివి. 

పుస్తకం అన్ని ముఖ్య పుస్తక విక్రేతల వద్దా దొరుకుతుంది.   

* * ***

Anchor 1
Anchor 2
Anchor 3
Anchor 5
Anchor 6
Anchor 7
Anchor 4
bottom of page