top of page

మధురవాణి ప్రత్యేకం

తప్పొప్పుల తక్కెడ – 8

8. ఉపన్యాసం- ఉత్కృష్ట కళ

elanaga.jpg

ఎలనాగ

ముందుగా తప్పొప్పుల తక్కెడ - 7 ను చూద్దామా?           

              

 

చదువులు – పరీక్షలు  (తప్పొప్పుల తక్కెడ – 7)

                          

అద్విత వుమెన్స్ కాలేజీలో చదువుతోంది. కొద్దిరోజుల్లోనే ఆమెకు పరీక్షలు మొదలు కాబోతున్నాయి కనుక, అద్వితలో టెన్షన్ ఎక్కువైంది. ఆమెలోని బిడియం, బెఱుకు సమస్యలుగా మారాయి. ఆమె కోపధారి అసలే కాదు. అద్వితకు నైమిష్య మంచి స్నేహితురాలు. ఆమె తరచుగా ఉద్భోద చేస్తూనే ఉంటుంది, అద్వితా నీ సున్నితం నీకు ఇబ్బందికరంగా మారగలదు, దాన్ని పోగొట్టుకో అని. కానీ పాపం ఆమె మాత్రం ఏం చేయగలదు? సున్నితం అన్నది మనస్తత్వానికి సంబంధించిన విషయం. పరీక్షలు మొదలైయ్యాయి. ఆనాడు మొదటి పరీక్ష. అద్విత పెళ్ళైన స్త్రీ. పరీక్షలకు నిరాలంకారంగానే పోవాలనుకుంది. కానీ వారం రోజుల క్రితమే కొనుక్కున్న సింధూరం రంగు చీర తొడుక్కుని వెళ్లింది. ప్రశ్నాపత్రం చూడగానే ఆమెలో ఆందోళన ఎక్కువైంది. తెలియని కొన్ని ప్రశ్నలు ప్రశ్నాపత్రంలో ఉండడం దానికి కారణం. టెర్రరిస్టుల జీవితాల కథలతో తీసిన హార్రర్ సినిమా చూస్తే ఎలా గుబులు కలుగుతుందో అలా భయం కలిగింది ఆమెకు. సమాధానాలు రాని ప్రశ్నలకు జవాబులు రాసే ప్రశక్తే లేదు, అనుకుంది మనసులో. ఏదో విధంగా మనో ఒత్తిడిని తట్టుకుని, జవాబులు రాసి వచ్చింది. అన్ని పరీక్షలను దాదాపు అలానే రాసింది. పరీక్షల్లో తను ప్యాసవనని విపరీతమైన మనోవేదనతో వేగి పోయింది. కానీ పరీక్షా ఫలితాలు అనుకూలంగా వచ్చాయి. ఆమె ప్యాసైంది.

 

  తప్పు                                        ఒప్పు

1. అద్విత                           అద్వితీయ, అద్వైత

2. వుమెన్స్ కాలేజీ             మహిళా కళాశాల

3. బెఱుకు                           బెరుకు

4. కోపధారి                          కోపకత్తె, కోపగత్తె, కోపిష్ఠి స్త్రీ, కోపన

5. నైమిష్య                           నైమిశ

6. ఉద్భోద                           ఉద్బోధ                        

7. నీ సున్నితం                      నీ సున్నితత్వం

8. మొదలైయ్యాయి              మొదలయ్యాయి, మొదలైనాయి

9. నిరాలంకారంగానే               నిరలంకారంగానే

10. సింధూరం                      సిందూరం

11. తొడుక్కుని                     కట్టుకుని

12. ప్రశ్నా పత్రం                     ప్రశ్నపత్రం

13. టెర్రరిస్టుల                      టెరరిస్టుల, ఉగ్రవాదుల

14. హార్రర్                           హారర్, భయం కలిగించే

15. ప్రశక్తే లేదు                      ప్రసక్తే లేదు

16. మనో ఒత్తిడి                    మానసిక(మైన) ఒత్తిడి

17. వేగి పోయింది                  వేగిపోయింది

18. ప్యాసైంది                       పాసైంది, ఉత్తీర్ణురాలైంది

 

వివరణలు:

1. అబ్బాయిల, అమ్మాయిల పేర్లలో భాషాపరమైన సవ్యత ఉండాలి. కానీ ఈ ఆధునిక కాలంలో వ్యాకరణ విరుద్ధమైన పేర్లను పెడుతున్నారు. ఐతే, అవి పేర్లు కనుక ఆక్షేపణ తెలిపే అవసరం లేదు అని వాదించేవాళ్లూ ఉన్నారు. చిన్నప్పుడు బడిలో పేరును నమోదు చేసేటప్పుడు గానీ, న్యూమరాలజీ ప్రకారం మార్చినప్పుడు గానీ కొత్త రూపాలున్న పేర్లు పుట్టుకొస్తాయి. కానీ భాష పరంగా, వ్యాకరణం పరంగా సవ్యత ఉండాలి. మనం పెట్టదల్చుకున్న పేరు యొక్క మాట అద్వితీయం నుండి పుట్టిన పేరైతే అద్వితీయ, అద్వైతం నుండి పుట్టినదైతే అద్వైత సరైన పేర్లు. 

2. ఆంగ్లపదాలను తెలుగులిపిలో రాసేటప్పుడు తప్పులు దొర్లే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి, ఆంగ్ల ఉచ్చారణ సరిగ్గా తెలిసినప్పుడు మాత్రమే తెలుగులిపిలో రాయడం శ్రేయస్కరం. ఉదాహరణకు women కు సరైన ఉచ్చారణ వుమెన్ కాదు, విమెన్. కనుక, women’s college అని ఇంగ్లిష్ లో గానీ, మహిళా కళాశాల అని తెలుగులో గానీ రాయడం ఉత్తమం. 

4. వస్త్రాన్ని ధరిస్తాం కనుక వస్త్రధారి అనీ, మకుటాన్ని ధరిస్తాం కనుక మకుటధారి అనీ అనవచ్చు. కానీ మనం కోపాన్ని ధరించం, కలిగి ఉంటాం. కాబట్టి, కోపధారి సరైన మాట కాదు. నిఘంటువుల్లో కోపి, కోపిష్ఠి అన్న మాటలన్నాయి కానీ, అవి పురుషులకు వర్తిస్తాయి. కోపిష్ఠురాలు కూడా ప్రామాణిక నిఘంటువుల్లో లేదు. కోపకత్తె, కోపగత్తె, కోపిష్ఠి స్త్రీ, కోపన ఉన్నాయి.

5. నైమిశము, నైమిశారణ్యము ఒక అడవికి గల పేర్లు. నైమిషము, నైమిష్యము అనే అడవి లేదు. కనుక నైమిష్య సబబుగా లేదు. నైమిష అని పెట్టుకోవచ్చు, రాసుకోవచ్చు.

6. ఉత్ + బోధ = ఉద్బోధ అవుతుంది. భోద తప్పు కనుక, ఉద్భోద తప్పే.

7. సున్నితం విశేషణ పదం (adjective), అది నామవాచకం (noun) కాదు. కానీ ఇక్కడ నామవాచకం రావాలి. కనుక, నీ సున్నితత్వం అని రాస్తే నిర్దుష్టంగా ఉంటుంది. ఐతే, నిఘంటువుల్లో వెతికితే సున్నితత్వం దొరకకపోవచ్చు. అత్వం కలిసిన రూపాలు చాలా వరకు నిఘంటువుల్లో కనిపించవు. ఉదాహరణకు అమాయకత్వం, అర్చకత్వం మొదలైనవి.  

9. జగత్ + అంబ = జగదంబ, జగదాంబ కాదు. నిర్ + ఆధారం = నిరాధారం. అదే విధంగా నిర్ + అలంకారం = నిరలంకారం.  

 

10. ఇది చాలా మంది తప్పుగా రాసే, పలికే మాట. సింధువు ఉన్నది కానీ సింధూరం లేదు. సిందూరం సరైన మాట.

13. తొడుక్కోవడం అనే పదం తెలుగుభాషలో లేదని కాదు. ఐతే ప్యాంటు, షర్టు, కోటు మొదలైనవాటిని తొడుక్కుంటారు కానీ చీరను తొడుక్కోరు, కట్టుకుంటారు.

12. ప్రశ్నము అన్న పదానికి రూపాంతరం ప్రశ్న. ఇవి రెండూ పుల్లింగ పదాలు. ఒక సవ్యసమాసం (వైరి సమాసం కానిది) లోని పూర్వపదం స్త్రీలింగశబ్దం ఐనప్పుడే దానిలోని చివరి అక్షరానికి దీర్ఘం వస్తుంది. అంటే, ప్రశ్న ఒకవేళ స్త్రీలింగశబ్దం ఐతే ప్రశ్నాపత్రం సరైన పదబంధం అయివుండేది. కాబట్టి ప్రశ్నపత్రం అని రాయాలి.

13, 14. Terror, horror లను టెరర్, హారర్ అని పలకాలి. కాబట్టి, టెరరిస్టు, హారర్ సరైన పదాలు. ఉగ్రవాది స్వచ్ఛమైన తెలుగు మాట. ఐతే, వ్యవహారంలో టెరరిస్ట్ ను చాలా తరచుగా వాడుతున్నాం. ఇక హారర్ కు భయం, భీతి సరిగ్గా సరిపోయే మాటలు. కానీ హారర్ సినిమాను భయం సినిమా అని రాస్తే, పలికితే చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. అందుకే భయం కలింగించే సినిమా అని రాస్తే సమంజసంగా ఉంటుంది.

15. ప్రశక్తి తప్పు, ప్రసక్తి ఒప్పు.

16. మనసు (మనః/మనస్) సంస్కృత పదం. ఒత్తిడి అచ్చతెలుగు మాట. కనుక, ఈ రెండింటిని కలిపి తయారు చేయగా ఏర్పడేది వైరి (దుష్ట) సమాసం ఔతుంది. కాబట్టి, మానసికమైన ఒత్తిడి అని రాయాలి. మానసిక ఒత్తిడి కూడా వైరిసమాసమే. కానీ అది ఉచ్చారణ పరంగా మనో ఒత్తిడి కంటె కొంచెం నయం అనిపించవచ్చు.

17. పోవుట అనే ప్రత్యేకమైన క్రియాపదం ఉంది. కనుక, వేగి పోయింది అంటే రెండు క్రియలను కలిగిన వేగి వెళ్లింది అన్న అర్థం రావచ్చు. అందుకే వేగిపోవడం అని ఒకే క్రియాపదంగా కలిపి రాస్తేనే మేలు.  

18. పాసవడం ఆంగ్లపదమైనా అది వ్యవహారంలో బాగా నలిగిపోయిన మాట. కాబట్టి, ఒకవేళ దాన్ని వాడినా ‘య’ వత్తు లేకుండా రాయడం సముచితంగా ఉంటుంది.                                                       

                           

***

 

ఇక తప్పొప్పుల తక్కెడ - 8  కోసం ఇస్తున్న ఈ కింది పేరాగ్రాఫును (పారాగ్రాఫును) చదివి, మీ జవాబులను రాయండి. 

                                 

    ఉపన్యాసం ఉత్కృష్ట కళ

     (తప్పొప్పుల తక్కెడ – 8)

కొన్ని సభల్లో కొందరు అనర్ఘళంగా ప్రసంగిస్తారు. వారి ఉపన్యాస కళ అంతగా పరిణితి చెంది ఉంటుంది మరి. అటువంటి వారికి మొమెంటోను ఇచ్చి సత్కరిస్తారు సభా నిర్వాహకులు. అది నోబుల్ ప్రైజ్ కాకపోయినా వక్త సంతోషిస్తాడు. అతని అదృష్టం ఉచ్ఛస్థితిలో ఉందని ఇతరులు అభినందించినా అభినందించవచ్చు. ఆ వక్తకు ఉపన్యాస సామ్రాట్టు అనే బిరుదును పొందినంత ఆనందం కలగవచ్చు. విపరీతమైన సంతోషంతో ఉక్కిరిబిక్కిరైతే, అతడు నిర్ణిద్ర రాత్రులను గడుపుతాడనేది కూడా యదార్థమే. తర్వాత ఆ సభాకార్యక్రమం యూ ట్యూబ్ ఛానెల్లలో ప్రసారమైతే అతని ఆనందం మరింత ఉధృతంగా ఉండవచ్చు.

******

bottom of page