top of page

వంగూరి పి.పా- 31

అమెరికాలో తెలుగు సాహిత్య వాతావరణం- అప్పుడూ, ఇప్పుడూ

vanguri.jpg

వంగూరి చిట్టెన్ రాజు

(డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ (డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి) పాతికేళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఇటీవలి సదస్సులోని ప్రసంగ వ్యాసం.)

ఉపోద్ఘాతం:

 డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్- DTLC అనగా డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి వారి “పాతికేళ్ళ పండుగ” కి నన్ను ఆహ్వానించి, ప్రసంగించే అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి నా వేనవేల ధన్యవాదాలు. 25 సంవత్సరాలుగా మంచి సాహిత్య విలువలు పాటిస్తూ నిరాటంకంగా తెలుగు సాహిత్య సేవ చేస్తున్నందుకు డిట్రాయిట్ తెలుగు సాహిత్య సమితి DTLC బృందానికి శతకోటి అభినందనలు. ఇటువంటి సందర్భంలో, ఇంత మంది లబ్ధప్రతిష్టులైన హంసల మధ్య కాకిలా ప్రకాశిస్తున్న నేను నాకు ఇచ్చిన ప్రసంగ అవకాశాన్ని ఏ అంశం గురించి మాట్లాడితే సమంజసంగా ఉంటుందా అనుకున్నప్పుడు- దానికేముందీ? DTLC వారు గత పాతికేళ్ళుగా ఎంత గొప్ప సాహిత్య సేవ చేశారో, వారితో నాకున్న అనుబంధం గురించీ నాలుగు మాటలు చెప్పేస్తే చాలు కదా అని అనుకున్నా. కానీ, ఇటువంటి సమావేశం లో “వయో అర్హత” మాత్రమే ఉన్న వాడిగా అమెరికాలో తెలుగు సాహిత్య చరిత్ర గురించి మాట్లాడితే బావుంటుంది అని అనిపించింది. ప్రాచీన సాహిత్య చరిత్రని రాజుల పరంగా, కవుల పరంగా, ప్రక్రియల పరంగానూ, ఆధునిక సాహిత్యాన్ని సాంఘిక ఉద్యమాల నేపథ్యంలో సంఘ సంస్కరణ యుగం (కందుకూరి, జాతీయోద్యమం, కాల్పనికం అభ్యుదయం, విప్లవం, ప్రాంతీయ వాదం, స్త్రీవాదం అని అనేక కోణాలలో వర్గీకరించవచ్చును అని ఇప్పుడు నేను సిలికానాంధ్రా విశ్వ విద్యాలయం లో M.A. తెలుగు చదువుకుంటూ సాహిత్య చరిత్ర అధ్యయనం తరగతులలో మా గురువు ఆచార్య మృణాళిని గారి దగ్గర నేర్చుకున్నాను. చాలా యేళ్ళుగా మృణాళిని గారు నన్ను “గురువు గారు” అని సంబోధిస్తూ ఉన్నా ఇప్పుడు ఆ తరగతులలో నేను ఆమెను “గురువు గారు” గా సంబోధించడం వేరే సంగతి.

నా ఉద్దేశ్యంలో అమెరికాలో తెలుగు సాహిత్య చరిత్ర కి సంప్రదాయ వర్గీకరణలు అన్నీ వర్తించవు. ఎందుకంటే ఉత్తర అమెరికాలో తెలుగు సాహిత్య చరిత్ర కేవలం సుమారు 60 సంవత్సరాలు. అందులో నేను స్వయంగా గమనించినది సుమారు 50 సంవత్సరాలు. ఈ స్వల్ప కాలం లోనే అమెరికా తెలుగు సాహిత్య చరిత్రని ఈ క్రింది కోణాలలో వర్గీకరించవచ్చును అని నా అభిప్రాయం.

1.సాహిత్య ప్రక్రియల కోణం:

ఇక్కడ చరిత్ర వ్రాయాలంటే మొట్ట మొదటి కథ, కవిత మొదలైనవి ఎప్పుడు అమెరికాలో  ఆవిర్భవించాయి, వాటి వాటి పరిణామాలు, పురోగతి ఎలా సాగింది, చెప్పుకోదగ్గ నూతన ప్రక్రియలు, సమాజాన్ని ప్రభావితం చేసిన రచనలు ఏమైనా వచ్చాయా మొదలైన సాహిత్య ప్రక్రియల కోణం.

2.రచయితల పరంగా చరిత్ర:

తెలుగు నాట చరిత్రకారుల సంప్రదాయాన్ని పాటిస్తూ రచయితల పరంగా వారి తొలి రచనల నుంచి సాగిన రచనా వ్యాసంగాన్ని చారిత్రక దృష్టిలో పరిశీలించడం. ఉదాహరణకి 1960 లలో మన ఉత్తర అమెరికా తెలుగు సాహిత్య చరిత్ర ప్రారంభకులలో ఇప్పటికీ తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న వారు డిట్రాయిట్ నివాసి అయిన చెరుకూరి రమాదేవి గారు. అలాగే అప్పుడే డిట్రాయిట్ లోనే అడుగు పెట్టి, అమెరికాలో అనేక ప్రాంతాలలో నివశించి కాలిఫోర్నియా లో స్థిరపడ్డ వేమూరి వెంకటేశ్వర రావు గారు. నా పరిశీలనలో వారిద్దరి లాగా సుదీర్ఘ కాలం సృజనాత్మక సాహిత్య సృష్టి, సేవలు చేసిన వెల్చేరు నారాయణ రావు, వేలూరి వెంకటేశ్వర రావు, పెమ్మరాజు వేణుగోపాల రావు, వేమూరి వెంకట రామనాధం, విశ్వనాధ అచ్యుత దేవరాయలు, సి.ఎస్.సి. మురళి, శొంఠి శారదా పూర్ణ, సత్యం మందపాటి మొదలైన వారి రచనలని సాహిత్య చరిత్ర కోణం లో పరిశీలించడం.

3.అలనాటి ముద్రణ పత్రికలు, గ్రంధాల నుంచి ఈనాటి అంతర్జాల ప్రచురణల కోణం:

తెలుగు సాహిత్యం లో 11వ శతాబ్దం లో తొలి గ్రంథరచన, ప్రచురణ రాజరాజ నరేంద్రుడి ప్రోత్సాహంతో రచించి తాళ పత్రాలలో ప్రచురించిన వాడు నన్నయ. అలా ప్రచురణల ఆధారంగా సాహిత్య చరిత్రని వర్గీకరిస్తే అమెరికాలో రచయితలు 1970 లో ప్రారంభం అయిన తెలుగు భాషా పత్రిక కాలం నుంచీ స్థానిక, జాతీయ సంస్థాగత పత్రికలు, తానా పత్రిక, తెలుగు అమెరికా, తెలుగు నాడి, అంతర్జాలం లో వెబ్ పత్రికల ఆవిర్భావం, బ్లాగ్ లు, ఫేస్ బుక్, వాట్సప్ సమూహాలు మొదలైన వాటి సాహిత్య స్వరూపం, ప్రచురణ, రచయితకీ, పాఠకులకీ దగ్గరయే అవకాశాలు ఇలా అనేక మౌలికమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అమెరికా సాహిత్య చరిత్రలో ఇది మరొక కోణం.

4.దేశ వ్యాప్తంగా సాహిత్య వాతావరణ కోణం:

ఏ దేశం లో అయినా ఉన్నత స్థాయి సాహిత్యం అన్ని కాలమానాలలోనూ అలవోకగా ఉత్పన్నం అవదు. దానికి అనువైన ఒక సాహిత్య వాతావరణం కావాలి. దానికి కొందరు కారణజన్ములైన సృష్టికర్తలు, స్ఫూర్తి ప్రదాతలు ఉంటారు. రాజరాజ నరేంద్రుడు, కృష్ణ దేవరాయలు, అన్నమయ్య,  త్యాగరాజు మొదలైన వారు అటువంటి సృష్టికర్తలు, స్ఫూర్తి ప్రదాతలకి ఉదాహరణలు. వారు జీవించిన కాలాలలో సాహిత్య వాతావరణం ఉన్నత స్థాయిలో ఉండి భవిష్యత్తుకి మంచి బాటలు వేసింది. అదే విధంగా భాషా సాహిత్యాల పట్ల అలవిమాలిన నిర్లక్ష్యం, నిరాదరణ, వ్యతిరేకత చరిత్రలో చోటు చేసుకున్న సందర్భాలు కూడా అనేకం. ఉదాహరణకి గత 60 సంవత్సరాలలో తెలుగు రాష్ట్రాలలో సాహిత్య వాతావరణం ఎలా మార్పులు చెందిందో మనం గమనించి నిర్ఘాంత పోతూనే ఉన్నాం.  అదే గత 60 సంవత్సరాలలో ఉత్తర అమెరికాలో సాహిత్య వాతావరణంలో జరిగిన మార్పులు పరిశీలించడం మరొక కోణం.

పై నాలుగు అంశాలలో ఆఖరిది అయిన అమెరికాలో తెలుగు సాహిత్య వాతావరణ చరిత్ర గురించి ఈ నాటి ప్రసంగం లో నాకు తోచిన నాలుగు మాటలు మీతో పంచుకుంటాను. ఈ విశ్లేషణ లో అవసరం అనిపించినప్పుడు తప్ప వ్యక్తుల ప్రస్తావన కన్న వ్యవస్థల ప్రస్తావనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేశాను.

అమెరికాలో తెలుగు సాహిత్య వాతావరణం- అప్పుడూ, ఇప్పుడూ

ప్రారంభ దశ: 1960-1975 అంటే బాల్యం:

ఈ దశలో అమెరికాలో సాహిత్య వాతావరణం అక్కడా, ఇక్కడా ఒకటో, రెండో మబ్బు తునకలు ఉన్న నిర్మలాకాశం లాగా ఉండేది. అంటే ఇంచు మించు శూన్యమే అని చెప్పుకోవాలి. దీనికి ఉదాహరణగా వేమూరి వెంకటేశ్వర రావు గారి ఆనాటి అనుభవాలు చెప్పుకోవచ్చును. ఆయన 1961, సెప్టెంబర్ లో ఈ నగరానికి అంటే డిట్రాయిట్ వచ్చారు. వచ్చిన కొత్తలో మొహం వాచిపోయి తెలుగు వారి కోసం వాకబు చేయగా అక్కడెక్కడో పక్క రాష్ట్రమైన ఇలినాయ్ లో షాంపేన్ అనే నగరంలో చెరుకూరి రామారావు & రమాదేవి దంపతులు ఉన్నారు అని తెలిసింది. వెంటనే ఎలాగో వాళ్ళ ఫోన్ నెంబర్ పట్టుకుని, మాట్లాడేసి వచ్చీరాని డ్రైవింగ్ తో వాళ్ళింటికి వెళ్ళి వారం రోజులు ఉన్నారు. అప్పటికే రమా దేవి గారు భారతదేశం లో ఉన్నప్పుడే నవలల పోటీలో బహుమతి గెల్చుకున్న రచయిత అని ఆయనకి తెలియదు. ఆవిడా చెప్పలేదు. ఆ వారం రోజులూ అసలు తెలుగు సాహిత్యం అనే మాట కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు..ట. దేశవ్యాప్తంగా తెలుగు సాహిత్య వాతావరణ లేమి, శూన్యత గురించి ఇంత కన్నా వేరే ఉదాహరణ అక్కర లేదు. ఎందుకంటే ఆ ఇద్దరూ అరవై ఏళ్ళ తర్వాత కూడా, ఇప్పటికీ కథలూ, కమామీషులూ రాస్తూ అమెరికా లో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నారు.

 

సాహిత్య స్పృహ నామమాత్రంగానే ఉన్న ఆ నేపథ్యంలో ఏప్రిల్ 1970 లో పెమ్మరాజు వేణుగోపాలరావు గారు ప్రధాన సంపాదకులుగా, గవరసాన సత్యనారాయణ, రావిపూడి సుబ్బారావు, పరిమి కృష్ణయ్య సంపాదకులుగా అట్లాంటా నుంచి “తెలుగు భాషా పత్రిక” అనే వ్రాత పత్రిక వెలువడింది. ఆ పత్రిక మొదటి సంచిక లోనే శాస్త్రీయ వ్యాసాలతో పాటు మూడు కథలు, కొన్ని కవితలతో 1975 దాకా ఆ పత్రిక కొన సాగి అన్ని సంచికలలోనూ  అమెరికాలో అన్ని ప్రాంతాల రచయితల కథలు, కవితలు ప్రచురించి అమెరికా జాతీయ స్థాయిలో తెలుగు సాహిత్యం ఉనికిని గుర్తించిన తొలి ప్రయత్నం తెలుగు భాషా పత్రిక అని చెప్పవచ్చును.

రెండవ దశ: 1975-90- కౌమారం- నిలదొక్కుకున్న అమెరికా సాహిత్య వాతావరణం: 

 

రెండవ దశగా భావించదగ్గ 1975-1990 పదిహేను సంవత్సరాలనీ అమెరికా మొదటి తరం సాహిత్యం అనీ, “నాస్టాల్జియా తరం” అనీ కూడా అనవచ్చును. ఈ కాలం లోనే అమెరికాలో తెలుగు వారు ఎక్కువ సంఖ్యలో ఇక్కడే స్థిరపడి నిలదొక్కుకోడం, అనేక నగరాలలో స్థానిక తెలుగు సాంస్కృతిక సంస్థలు ఏర్పడడం జరిగింది. ఆయా సంస్థలు ప్రధానంగా తమ కార్యకలాపాల ప్రచారానికి ‘హౌస్ జర్నల్స్” గా పత్రికలు స్థాపించినా, వాటి సంపాదకులు అక్షర ప్రేమికులైన సాహితీవేత్తలే కావడం తో ఆయా పత్రికలలో కథలూ, కవితలూ కూడా చోటు చేసుకుని స్థానిక రచయితలకి ప్రచురణావకాశాలు కలిగించాయి. కానీ ఆ రచనలు ఇతర నగరాలలో ఆసక్తి ఉన్నవారికి చేరే అవకాశాలు తక్కువ. సుమారు 1980 నుంచి ప్రారంభం అయిన తానా పత్రిక ఆ లోటు తీర్చడంలో ముందంజ వేసింది. మరీ ముఖ్యంగా జాతీయ స్థాయిలో ప్రతీ రెండేళ్ళకీ జరిగే తానా మహా సభల ప్రత్యేక సంచిక (సావనీర్) అమెరికాలో అన్ని ప్రాంతాల రచయితలకి అంత వరకూ లేని “ఔట్ లెట్” నీ, కథలు, కవితలు వ్రాయడానికి ఉత్సాహాన్నీ కలిగించిన ఏకైక అవకాశం గా నిలిచింది. ఈ 1975-90 దశలలో అమెరికా తెలుగు సాహిత్యానికి, ముఖ్యంగా కథకి గట్టి పునాదులు పడ్డాయి. అటు కవితా వికాసం కూడా తోడు కావడంతో అమెరికాలో తెలుగు సాహిత్యానికి ఒక స్థిరత్వం వచ్చింది. ఈ తరం అమెరికా కథా సాహిత్య వాతావరణం ఇంచుమించు తెలుగు వారి మాతృదేశం జ్ఞాపకాలలోంచీ, నిట్టూర్పులలోంచీ, అనుభవాలలోంచీ, అసంతృప్తులలోంచీ పుట్టింది. అంటే అది అమెరికా కథా సాహిత్యం లో నాస్టాల్జియా యుగం అనుకోవచ్చును. ఈ కథకులు ఇంచుమించు అందరూ అమెరికా వచ్చాక కలం పట్టిన వారే. కవితా ప్రపంచం లో స్థానిక సమాజ స్పృహ ఉండే అవకాశం తక్కువ కాబట్టి ఎప్పటి లాగానే అటు పద్య కవితలూ, ఇటు వచన కవితలూ అనేక ఇతివృత్తాలతో సమానాంతరంగా ప్రయాణం చేస్తూనే ఉంది.

ఈ దశ లో దేశవ్యాప్తంగా ప్రతీ రెండేళ్ళకొకసారి జరుగుతున్న తానా మహా సభలలో సినీ, రాజకీయ, ఆధ్యాత్మిక, వ్యాపార రంగాలకి ఇచ్చిన ప్రాధాన్యతల మధ్య సాహిత్యానికి ‘చారులో కర్వేపాకు”, “ఎడారిలో ఆముదం వృక్షం”  లాంటి స్థానం లభించి, దేశవ్యాప్తంగా ఉన్న సాహితీవేత్తలు కొంతమంది అయినా వ్యక్తిగతంగా కలుసుకునే అవకాశం ఉండేది. ఆ సభలకి భారత దేశం నుంచి కొంతమంది లబ్దప్రతిష్టులని ఆహ్వానించి గౌరవించి అమెరికాలో తెలుగు సాహిత్య వాతావరణ వికాసానికి తానా సభలు తోడ్పడ్డాయి. భారత దేశం నుంచి ఆ సభలకి వచ్చిన వారు ఇతర నగరాలలో సాహితీవేత్తలని కలుసుకుంటూ సాహిత్య సంబంధాలు పెంపొందించుకున్నారు.

 

మూడవ దశ: 1990-2005 – అమెరికా తెలుగు డయాస్పొరా సాహిత్య వాతావరణం పరిపుష్టి:

అమెరికా తెలుగు సాహిత్య వాతావరణం ఈ దశలో శరవేగంగా  పరిపుష్టి చెందడానికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి ఈ సమయం లో రెండు కారణాలని ప్రధానంగా చెప్పుకోవచ్చును. మొదటి కారణం ముక్కవల్లి, పోతన ఫాంట్స్, RTS (Rice Transliteration Standard), R I T  మొదలైన అనేక సాంకేతిక పురోగమనాలతో కంప్యూటర్ లో తెలుగు యుగం ప్రారంభం అయి Y2K ప్రభావం తో పుంఖానుపుంఖాలుగా కంప్యూటర్ నిపుణులైన యువతీయువకులు, వారిలో సాహిత్యాభిలాషులూ అమెరికా తరలి రావడం. ఈ దశలో ఈ వెబ్ అనే అభౌతిక ప్రపంచం లో తెలుగు సాహిత్య వాతావరణం గురించి సురేష్ కొలిచాల రెండు సమగ్రమైన వ్యాసాలలో (ఈమాట మార్చ్, మే 2009 సంచికలు) విపులంగా, సాధికారికంగా వివరించారు. క్లుప్తంగా చెప్పాలంటే WETD (World Electronic Telugu Digest (1991),  యూజ్ నెట్ చర్చా వేదికలలో ఆగస్ట్ 15, 1992 లో ప్రారంభం అయి 1996 దాకా నడిచిన న స్కిట్ (S.C.I.T Soc.Culture.Indian.Telugu), 1995 లో ఘంటసాల మైలింగ్ లిస్ట్ సృష్టి, ‘తెలుగు వాణి’, ‘తెలుసా’ చర్చా వేదిక (1996-1999), బహుశా ఇప్పటికీ కొనసాగుతున్న రచ్చబండ ఆ నాటి అమెరికా జాతీయ సాహిత్య వాతావరణానికి ఒక ప్రధాన పార్శ్వంగా  చెప్పుకోవచ్చును. ఈ పార్శ్వాన్ని ‘ఆకాశ వాణి” పార్శ్వం అనవచ్చును. ఈ సందర్భంగా “SCIT గ్రూపులో తెలుగు సాహిత్యం మీద ప్రత్యేకమైన ఆసక్తి ఉన్న మేమంతా ఒక కుటుంబంగా మసలుకునేవాళ్ళం.” అన్న సురేష్ కొలిచాల ఆప్త వాక్యం, ఆ తర్వాత ఆయన పేర్కొన్న వారి పేర్లూ చూస్తే ఆనాటి “ఆకాశ వాణి” లో అమెరికా సాహితీవేత్తల పాత్ర సుస్పష్టం అవుతుంది. అయితే ఈ అంతర్జాల వేదికలలో చురుకుగా పాల్గొన్న వారు, సాంకేతిక అభివృద్ధికి కారకులైన వారు అందరూ వ్యక్తిగత స్పర్శ లేని వారే అనడం అతిశయోక్తి కాదు.  ఇక సాహిత్యం మీద చర్చలు ఎంత ఆసక్తికరంగా జరిగినా, నియంత్రణ లో లోపాల కారణంగా కత్తుల రత్తయ్య, గండర గండడు లాంటి ‘అనామకులు, వారి అవాంఛనీయమైన వ్యాఖ్యలు, రాజకీయ, కుల ద్వేషాల అక్కసులూ సాహిత్య వాతావరణాన్ని కలుషితం చేశాయి. సాహిత్య చర్చలలో కూడా వ్యక్తిగత దూషణ భూషణ తిరస్కారాలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి దూషణ భూషణ తిరస్కారాలు అనగా తిట్లు తిన్నవారిలో ఏ పాపం ఎరగని నా పేరు కూడా బాగానే వినపడేది. ఇక 1990-95 ప్రాంతాలలో వెబ్ సృష్టి, అనతి కాలంలోనే గ్రాఫికల్ వెబ్ బ్రౌజర్ మొదలైన పరిణామాలతో వెబ్ ప్రపంచం లో తెలుగు ప్రభంజనం మొదలయింది. అందులో ఒక ప్రధాన భాగం ఎవరి బ్లాగ్ ప్రపంచాన్ని వారు ఏర్పాటు చేసుకోవడం ఒక ఎత్తు అయితే వెబ్ పత్రికల ఆవిర్భావం మరొక ఎత్తు.  ఆ అంతర్జాల కుటుంబ సభ్యులలో తొలి తరాల అమెరికా సాహితీవేత్తలు అతి తక్కువ మంది మాత్రమే ఉండడం గమనించ దగ్గ విశేషం. ఈ దశలో కంప్యూటర్ విప్లవం నీడలు ఆ తొలి తరం వారి మీద పడక పోవడం. పడినా వాటిని తమ సాహిత్య పోషణ కి ఎలా అన్వయించుకోవాలో తెలియని అయోమయ స్థితిలో ఉండడం, ఇదంతా ఏదో బ్రహ్మ పదార్ధం అనే భావజాలం మొదలైన అనేక సహజమైన కారణాలకి కంప్యూటర్ తరానికీ, తొలి తరానికీ సాహిత్య వాతావరణం లో ఎక్కడా పొందిక లేదు అనే చెప్పాలి.

 

అయితే తరాలకి అతీతంగా అమెరికా తెలుగు సాహితీవేత్తలని  ఒకే వేదిక మీదకి తెచ్చే అందమైన, అవసరమైన సంకల్పంతో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, అజో విభో,  తెల్సా, సప్నా మొదలైన సంస్థల ప్రారంభం ఈ దశలో అమెరికా తెలుగు సాహిత్య వాతావరణ స్పృహ కి మరొక ప్రధాన కారణం. ఇదే సమయంలో తానా సంస్థ చీలిపోయి, ఆటా ఏర్పడడం మొదలైన దేశవ్యాప్త రాజకీయ పరిణామాలు జరిగినా సాహిత్య పోషణ, పురోగతులపై వాటి ప్రభావం జాతీయ స్థాయిలో పరిమితమైనదే అనే చెప్పాలి. ‘మనం’ అనే భావన నుంచి ‘నువ్వా, నేనా?” అనే భావోద్వేగాలు పుట్టుకొచ్చిన రాజకీయ పరిణామాల లో సాహితీవేత్తల ఉనికి, ప్రభావం నామమాత్రమే!

 

ఈ నేపథ్యం లో అంతకు మునుపే రచనల పోటీలు, పుస్తక ప్రచురణలు ఎన్ని జరిగినా  ప్రారంభం అయి ఇప్పటికీ నిరాటంకంగా కొన సాగుతున్న జాతీయ స్థాయి ఉగాది పోటీలు, అమెరికా తెలుగు కథానిక- మొదటి సంకలనం ప్రచురణ అమెరికాలో అన్ని ప్రాంతాల, అన్ని తరాల సాహితీవేత్తలనీ, అంతర్జాల చర్చా వేదికలలో, బ్లాగ్ లలో చురుగ్గా పాల్గొంటున్న ఆధునిక సాంకేతిక యువతరం వారినీ స్పృశించాయి.  ఆ స్ఫూర్తితో అమెరికా సాహిత్య ప్రపంచానికి తలుపులు పూర్తిగా తెరచినది 1998లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అట్లాంటాలో నిర్వహించిన మొట్టమొదటి అమెరికా తెలుగు సాహితీ సదస్సు. అమెరికాలో అనేక నగరాల నుంచి వచ్చిన అటు తొలి తరం రచయితలు, ఇటు కంప్యూటర్ యుగం యువతీయువకులు ఒకరినొకరు ముఖాముఖీగా కలుసుకోవడం అందరికీ ఇప్పటికీ ఒక మరపురాని అనుభూతి కలిగించి ఉత్తేజపరిచింది. కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా, అమెరికాలో వెల్లి విరుస్తున్న సాహిత్యానికి డయాస్పోరా సాహిత్యం అని కాలక్రమేణా అప్పటి నుంచీ వాడుక లోకి వచ్చింది. అమెరికాలో తెలుగు సాహిత్య ప్రపంచ ఉనికిని, ప్రత్యేకతని గుర్తించి అక్కడి రచయితలని, కవులని, సాహితీవేత్తలని ఏకీకృతం చేసే సత్సంకల్పం అట్లాంటా సదస్సులో చాలా మటుకు నెరవేరినా, అమెరికాలో తెలుగు సాహిత్యానికి స్వయం ప్రకటిత ప్రతీకలుగా ప్రకాశించడానికి కొందరి ప్రయత్నాలకి బీజాలు కూడా అక్కడే పడ్డాయి. అసలు మనకీ, భారత దేశానికీ సాహిత్య పరంగా సంబంధం ఎందుకూ, ఇక్కడి రచయితలకి ఆ దేశ పత్రికలలో తమ రచనలు ప్రచురించుకునే కుతూహలం ఎందుకు, అవసరం ఏమిటీ అనే అంశం మీద కూడా ఈ దశలో చాలానే చర్చలు జరిగాయి.

 

అలాగే ఆ వ్యవస్థాపక సంపాదకులలో ఒకరి మాటలలో చెప్పాలంటే “అట్లాంటా సదస్సు కలిగించిన స్ఫూర్తితో”, “రచయితలకి ఇక్కడ తెలుగులో రాసే రచయితలకు తమ రచనలు ప్రచురించటానికి ఇండియాలోని పత్రికలు తప్ప మరో చెప్పుకోదగ్గ మార్గాలు లేకపోవడం ఒక పెద్ద లోపమని” భావించి 1998 విజయ దశమి నాడు మొదలయిన ‘ఈమాట” అమెరికా నుంచి వెలువడి ఇప్పటికీ నిరాటంకంగా నడుస్తున్న ఎలక్ట్రానిక్ పత్రిక. ఈమాట, కౌముది, సారంగ, మధురవాణి, నెచ్చెలి మొదలైన అనేక వెబ్ పత్రికలు ప్రధానంగా అంతర్జాతీయ స్థాయి లో రచయితలకీ, పాఠకులకీ మధ్య వారధిలా నిలుస్తూ అందులో భాగంగా  అమెరికా తెలుగు సాహిత్య వాతావరణ స్పృహ లో కూడా తమ వంతు పాత్ర నిర్వహించాయి.

అలాగే అదే సంవత్సరం లో డిశంబర్, 1998 లో ఈనాడు మనం రజతోత్సవాలు జరుపుకుంటున్న డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి ప్రారంభించబడి అమెరికాలో క్రమ పధ్ధతిలో నెల వారీ సాహిత్య సమావేశాల పరంపర మొదలయింది అని చెప్పవచ్చును. అప్పుడే మొదలయి, ప్రతీ ఆరు నెలలకొకసారి ఇప్పటికీ జరుగుతున్న టెక్సస్ సాహిత్య సదస్సులు అమెరికా తెలుగు సాహిత్య పరిణామం లో మరొక విశిష్టమైన అంశం. అయితే అమెరికాలో ప్రతీ నగరం లోనూ అడపాదడపా ముఖ్యంగా ఇండియా నుంచి ఎవరైనా వచ్చినప్పుడు సాహిత్య సమావేశాలు జరగడం, స్థానిక పత్రికలలో (ఉదా. తెలుగు జ్యోతి) కథలకీ, కవితలకీ చోటు దక్కడం జరుగుతూనే ఉన్నా, అంతర్జాలం లో ఆధునిక తరం తెలుగు సాహిత్య చర్చలు జరుపుతూనే ఉన్నా- అన్నింటినీ రంగరించి తనకంటూ ఒక ప్రత్యేకమైన రుచీ, రంగూ, వాసన ఉన్న అమెరికా తెలుగు సాహిత్య వాతావరణం ఉనికికి గుర్తింపు 1998 లో జరిగి, తర్వాత దశలో అది పటిష్టం అయింది.

 

పై రెండు దశల లోనూ, అంటే సుమారు నాలుగు దశాబ్దాల పాటు ఇంచుమించు పూర్తిగా తెర వెనుక తమదే అయిన ఎకడెమిక్ ప్రపంచం లో యూనివర్శిటీ ఆఫ్ విస్కాన్సిన్, యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా మొదలైన అనేక విశ్వవిద్యాలయాలలో తెలుగు సాహిత్యం తన ఉనికిని చాటుకున్నా, అమెరికా తెలుగు సాహిత్య వాతావరణం మీద దాని ప్రత్యక్ష ప్రభావం చాలా తక్కువ. వ్యక్తిగత స్థాయిలో అనేక మంది సాహిత్య పరంగా లధి పొందారు. వీటన్నింటికీ కేంద్ర బిందువు ఆచార్య వెల్చేరు నారాయణ రావు గారు.

 

నాలుగవ దశ: 2005-2020:  పరిణితి దశ

 

నిజానికి ఈ దశని పరిణితి దశ అనాలో, కలగాపులగం దశ అనాలో, లేదా స్వర్ణ యుగారంభం అనాలో అసలు ఏమనాలో కూడా తెలియని స్థితిలో అమెరికా తెలుగు సాహిత్య వాతావరణం ఉంది. దీనికి ప్రధాన కారణం ఫేస్ బుక్, వాట్సప్ మొదలైన సామాజిక మాధ్యమాల ప్రభావమే అని చెప్పక తప్పదు. స్మార్ట్ ఫోన్ల ధర్మమా అని ప్రపంచవ్యాప్తంగా సమాచార ప్రసారం క్షణాల మీద జరిగిపోవడం సాహిత్య ప్రచారం, చర్చల మీదా కూడా అపారమైన ప్రభావం పడింది. 

 

రచయితలు, కవులు, సాహితీవేత్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అత్యంత సులభతరం కావడం తో సాహిత్య ప్రపంచం ఏకీకృతం అయి ఒక మహా సామ్రాజ్యం ఆవిష్కరించబడినట్టు పైకి అనిపించినా, వాస్తవానికి అది చీలిపోయి వందలాది సామంత రాజ్యాలుగా విడిపోయిన భావన కలుగుతోంది. అక్కడ తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ లు విడిపోవడం, ఇక్కడ కాలక్రమేణా అలనాటి ‘మనం” నుంచి “నువ్వా, నేనా?” అని కీచులాడుకునే స్థాయిని అధిగమించి “నువ్వూ, నేనూ” అని ఎవరి అస్థిత్వానికి వారు గుర్తిస్తూ అనేక జాతీయ సంఘాలు పుట్టుకొచ్చాయి. వీటి ప్రభావం సాహితీవేత్తల మీద కూడా అనివార్యంగానే పడినప్పటికీ పైన అంతా బంగారం పూత. లోపల అసలు స్వరూపాలతో వర్గ భేదాలు, ప్రాంతీయ భేదాలు అంతర్లీనంగానే అమెరికా సాహిత్య వాతావరణం లో అంతర్భాగం అయ్యాయి. కొండొకచో అనధికార అభిమాన సంఘాలు కూడా ఏర్పడ్డాయి.

 

ఈనాటి అమెరికా సాహిత్య వాతావరణంలో వందలాది ఫేస్ బుక్, వాట్సప్ మొదలైన సమూహాలు విచ్చల విడిగా స్వైర విహారం చేస్తున్నాయి. ప్రతీదీ సాహిత్య సమూహమే! ప్రతీ దానికీ ఒకరిద్దరు సాహితీవేత్తలు నిర్వాహకులుగా ఉంటారు. వారి అనుయాయులు, భజన పరులు ఎలాగూ ఉండగా తమ పేర్లు తరచుగా కనపడడానికీ, తమ రచనలు, వ్యాఖ్యలు ఒకటికి పది సార్లు, పది చోట్ల ప్రచురించుకునే ఆసక్తి ఉన్నవారు అనేక సమూహలలో అనేక దేశాల వారు చేరతారు, చేర్పించబడతారు. ఇలా ఒక సామంత రాజ్య సమూహసృష్టి జరిగాక ఏళ్ళ తరబడి సాహిత్య సృష్టి, చర్చలు, కీచులాటలు, అన్నింటికన్నా ఎక్కువగా సొంత డబ్బా, పర డబ్బా, పరస్పర డబ్బాల మోత జరుగుతూనే ఉంది.  ఒక విధంగా చెప్పాలంటే అమెరికా సాహితీవేత్తలు అందరూ కలిసి విడిపోయిన కాలం లేదా విడిపోయి కలిసిన కాలం గా ఈ దశ లో అమెరికా సాహిత్య వాతావరణాన్ని విశ్లేషించవచ్చును.

 

అంతర్జాల పరంగా పరిస్థితి అలా ఉంటే ఈ దశ లో కూడా అమెరికా సాహితీవేత్తలు వ్యక్తిగతంగా కలుసుకునే అవసరాలలో ఎక్కువ మార్పు లేదు కానీ అవకాశాలలో మంచి మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే డిట్రాయిట్ లో మొదలు పెట్టిన DTLC, డాలస్, హ్యూస్టన్ లలో ‘నెల నెలా తెలుగు వెన్నెల”, టెక్సస్ లో ఆరు నగరాలలో ప్రతీ ఆరు నెలలకీ జరుగుతున్న టెక్సస్ సాహిత్య సదస్సులు, మొదలైన చోట్ల ప్రారంభించబడి, నిలదొక్కుకున్న నెల వారీ సాహిత్య సమావేశాలు, చికాగో, అట్లాంటా మొదలైన నగరాలలో సమావేశాలు, సిలికానాంధ్రా వారి కార్యక్రమాలు, జాతీయ సంఘాల సంబరాలలో సాహిత్య వేదికలు, ప్రతీ రెండేళ్ళకీ ఒక్కొక్క రాష్త్రం లో జరుగుతున్న అమెరికా తెలుగు సాహితీ సదస్సులు అమెరికా సాహితీ వేత్తలు పరస్పరం కలుసుకునే వెసులుబాటు కల్పించి స్ఫూర్తి దాయకంగా నిలిచాయి.  ఇలాంటి వ్యక్తిగత స్పర్శతో పాటు అంతర్జాల సమూహాల ద్వారా అను నిత్యం పలకరించుకుని సాహిత్య సంభాషణలు చేసే అవకాశాలు ఈ దశలో పుష్కలంగా ఉన్న కారణం చేత ఈ దశలో (2005-2020) లో అమెరికా తెలుగు సాహిత్య వాతావరణం బాగా పరిణితి చెందింది.

 

ప్రస్తుత దశ –పాండెమిక్ తర్వాత (2020- )

గత దశకి కొనసాగింపుగా, అమెరికాలో ప్రస్తుత సాహిత్య వాతావరణం కూడా మూడు కాయలూ, ఆరు పువ్వులూ అన్నట్టుగా ఉంది. కోవిడ్ ధర్మమా అని నాలుగైదేళ్ళు అంతా అతలాకుతలం అయిపోయినా, ఆ కాలం లో విజృంభించిన జూమ్ లాంటి అంతర్జాల సమావేశాలు అమెరికా తెలుగు సాహిత్య వాతావరణాన్ని నిజంగానే ‘ఆకాశానికెత్తేసి’ ఎంతో “ఎత్తు” లోకి తీసుకెళ్ళాయి. అనగా నేల మీద నలుగురినీ ఆప్యాయంగా పలకరించే తెలుగు సాహిత్యం ఆ నేల విడిచి ఆకాశం లో వెబ్ ప్రపంచంలో సాము చేస్తోంది. పత్రికలు, పుస్తకాల ముద్రణ ఇంచుమించు ఆగిపోయి, ఆంగ్ల లిపిలో తెలుగు అక్షరాలు టైప్ చేసి కంప్యూటర్ తెర మీదే సాహిత్య సృజన, పఠనం నిలదొక్కుకున్నాయి. మా బోటి తొలి తరం కూడా మెల్ల మెల్లగా ఈ సాంకేతిక పురోగతి తెలుగు భాషాసాహిత్యాలకి చేసిన విప్లవాత్మకమైన మార్పులకి అలవాటు పడింది. అంతర్జాలం లో ప్రతీ బ్లాగ్, ఫేస్ బుక్, వాట్సప్, తదితర సమూహాలూ, ఏ దేశం లో జరిగినా అన్ని జూమ్ సాహిత్య సమావేశాలూ అన్నీ అమెరికాకే పరిమితం అయే పరిస్థితి దాటి అన్నీ అంతర్జాతీయ సమావేశాలుగా మారిపోయాయి. అమెరికా అనే ప్రాంతీయతకి ప్రాధాన్యత తగ్గింది. మజ్జిగ పలచబడింది. ఒక విధంగా చూస్తే అమెరికా తెలుగు సాహిత్యం అంతా అంతర్జాలం లోనే అనేక మాధ్యమాలలో పెల్లుబికి చర్చలు, ప్రతి చర్చల మధ్య అతి వేగంగా ప్రవహిస్తోంది. అలనాడు కుప్పలు తెప్పలుగా పోశి ఉన్న వేద రాశిని నాలుగు వేదాలుగా విభజించగలిగిన వేదవ్యాసుడికి కూడా ఈ నాడు అంతర్జాలం లో గుట్టలు, గుట్టలు గా “అర ఘడియ భోగం, ఆరు నెలల రోగం” లా ఉన్న తెలుగు సాహిత్యాన్ని ఏవో కొన్ని రకాల క్రమ పద్ధతి పెట్టడానికి అసాధ్యం అనే స్థాయిలో తెలుగు సాహిత్యం ఉంది. ఇక ఆ గజి బిజి లో అమెరికా తెలుగు సాహిత్యాన్ని వెతుక్కోవడం గడ్డివాములో గుండు సూదిని వెతకడం లాంటిదే!

 

అంతర్జాలం లో అయినా, ప్రత్యక్ష వేదికలుగా అయినా ఈ దశలో ప్రపంచమంతటా, మరీ ముఖ్యంగా అమెరికాలో సాహిత్య వాతావరణం అనేక ‘గేటెడ్ కమ్యూనిటీలు” గా మారి నిలదొక్కుకుంది.  సాహిత్య తపన ఉన్న ఒకరిద్దరు వ్యక్తులూ, వారిని అనుసరించే బృందం ఆయా వేదికలకి ప్రధాన భాగస్వాములు. అందువలన ఆయా వ్యక్తుల వర్గ అభిమానాలూ, వర్గాలకి అతీతంగా కొందరి మీద ఏర్పరచుకున్న వ్యక్తిగత అభిమానాలూ, వ్యతిరేకతలూ, పేరు తెచ్చుకోవాలి అనే సహజమైన చిన్న కోరికలూ మొదలైన అంశాలు ఈ సాహితీ వేదికల ఏర్పాటు, నిర్వహణలలో చోటు చేసుకున్నాయి. అమెరికా తెలుగు సాహితీ వాతావరణం లో సాహితీ వేత్తలు అందరినీ ఏకీకృతం చేసే ఆలోచనకి కాల దోషం పట్టిందా అనే అనుమానం నాకు కలుగుతోంది.   అలనాటి సామంత రాజుల స్థానం లో ఈ నాటి గేటెడ్ కమ్యూనిటీ నాయకులు కలిసినట్టుగానే ఉండి కలవని వారూ, కలిసీకలవని వారూ, అసలు కలవడానికి ఇష్టపడని వారూ, కలిసినట్టు నటించే వారు - ఇలా అనేక రకాలుగా ఏకత్వం లో భిన్నత్వమా, భిన్నత్వం లో ఏకత్వమా అనేది తెలియక అమెరికా తెలుగు సాహిత్యం అనే అఖండ సామ్రాజ్య ఉనికినీ, ప్రత్యేకతనీ ప్రశ్నించే దశ లో మనం ప్రస్తుతం ప్రయాణిస్తున్నాం. ఎల్లలు లేని ప్రపంచ తెలుగు సాహిత్యం లో తమకి తామే నిర్ధేశించుకున్న హద్దులూ, సరిహద్దులతో అమెరికా తెలుగు సాహిత్యమే కాక తెలుగు రాష్ట్రాలలో పరిస్థితులని ప్రతిబింబిస్తోంది అనడం లో అతిశయోక్తి లేదు.

*****

ఆధారాలు:

1.       ‘ఈమాట పూర్వాపరాలు -నా జ్ఞాపకాలు” -సురేష్ కొలిచాల, ఈమాట మార్చ్ & మే 2009 సంచికలు

2.      https://pustakam.net/?p=20567 – జంపాల చౌదరి (మూడు బీర్ల తర్వాత -అక్కిరాజు భట్టిప్రోలు పుస్తకానికి వ్రాసిన ముందుమాట)

3.      “అమెరికా తెలుగు కథాసాహిత్యం పుట్టుక, పురోగతి, భవిషత్తు” – వంగూరి చిట్టెన్ రాజు (https://www.madhuravani.com/)

bottom of page