top of page

కవితా  మధురాలు

 - పెమ్మరాజు వేణుగోపాల రావు

pemmaraju venu gopal.jpg

సంపాదకుల ప్రత్యేక ఎంపిక

ఆఖరి చూపు
 

 

నా కోసం వేచి ఉన్నావని 

నలుగురూ చెప్పగా విని 

నీ దగ్గర చేరిన క్షణమే 

నీ దారిన వెళ్ళిపోతావని 

భయపడిన నా హృదయం 

జంకింది నిన్ను సమీపించి. 

 

కదలని మెదలని తనువు 

వదలక నిన్నాడించు ప్రాణం 

చైతన్యము వీడిన నీ భౌతికం 

నన్ను చూసి ఏమనుకుంటుందో 

నాకు తెలియక శంకించాను. 

 

నీ స్వరూప సాంగత్యంలో 

నిన్నటి మమతలు కనిపించలేదు 

నీ ఉచ్చ్వాస నిస్వాసాలలో 

నిన్నటి జీవన స్రవంతి లేదు 

నీ దేహపు సరిహద్దులలో 

మిగిలినది నేనెరిగిన నువ్వని 

భ్రమపడిన లోకమంతా 

నా రాకకు ఇచ్చిన స్వాగతమే 

నీకిచ్చిన అంతిమ వీడ్కోలు. 

 

కళ్ళు మూసి నిన్ను తలచిన మనసు 

ఎదుర్కొన్న ఒళ్ళు మరచిన నిశ్శబ్దం 

నీ కిచ్చిన తుది సంభావన 

అమ్మ చేసిన అంతిమ సంజ్ఞ 

 

("ఆత్మార్పణ" సమగ్ర కవితా సంపుటి నుండి)

- పాలపర్తి ఇంద్రాణి.

Indrani_edited.jpg

నిర్వహణ 

విన్నకోట రవి శంకర్ | మధు పెమ్మరాజు

kavita@madhuravani.com 

indraganti-prasad.jpg

-ఇంద్ర ప్రసాద్

 

నిచ్చెన


గతమంతా
నిచ్చెనలు
చేయడంతోనే
సరిపోయింది
ఇప్పుడు
అవన్నీ నిలబెట్టాలి

పడిపోతే
దెబ్బ తగలకుండా
ఉండడానికి
వల తయారు చెయ్యాలి
నవారు బిగించాలి

ఇంక
ఎక్కగలిగితే
స్వర్గమే!

కేవలం కవిని
 


కొందరు
మనుషుల్ని
సముద్రాలు
పిలుస్తాయి

వారు
చందమామకు
వల వేయడానికి
అలల మీద
కవాతు చేస్తారు

కొందరు
మనుషుల్ని
భూమి
పిలుస్తుంది

వారు
అగ్నిబీజాన్ని
వెలికి తీయడానికి
భూగర్భాన్ని
తొలుచుకు వెళతారు

కొందరు
మనుషుల్ని
ఆకాశం
పిలుస్తుంది

వారు
గ్రహాలకు
గాలం వేయడానికి
ఆకాశ నౌకల్లో
దూసుకు పోతారు

నేనొక
కవిని
మాత్రమే

ముకుళిత
హస్తాలను విప్పి
సూర్యునికి
సుగంధాలను
అర్ఘ్యం ఇస్తున్న
పుష్పాలను చూసి
అద్భుతం పడగలను

సముద్రుడి
వాకిటిలెంకలు
బంగారు రజను
ఇసుక తిన్నెలు
పొద్దుందాక
కాంచీ కాంచీ
విస్మయం చెందగలను

వేళ్ళతో
ఆచమనం చేసి
ఆకాశం వైపుకి
వేదఘోషగా ఊగే
వృక్షాల తాళాలకు
తన్మయం పొందగలను

అందాల గవ్వల
పోడుములకు
అబ్బుర పడి
పాతఱ దొరికినట్టే
జేబుల్లో నింపుకుని
సంతసం బుక్కగలను

నేనొక
కవిని

అంతే.

------



* అగ్నిబీజము = బంగారము
* వాకిటిలెంకలు = ద్వారపాలకులు
* పొద్దుందాక = రోజంతా

-చందలూరి నారాయణరావు

ch narayana.JPG

 కల సంకలనం
 

నా లోపలికెళ్లి

అలంకార అహంభావాలను ఒలిచి పక్కన పెట్టి

తలుపేసుకుని మూల మూలలో పోగొట్టుకున్న  గుట్టల కొద్ది జ్ఞాపకాలల్లో

స్పృహ కోల్పోయిన కల సంకలనాలు

తెరిచేకొద్దీ  నోటికి తగిలే  పగిలిన పదాలపై

నా కంటి పాపలే  నా  కళ్ళను,

విరిగిన వాక్యాలపై

నా కాలి ముద్రలే నా నడకను తప్పుపట్టి

ముఖంలోకి దూకిన  అపరిచిత ప్రశ్నలు

మెదడులో దుమ్ము రేపుకుంటూ

గతం వర్తమానంలోకి దూసుకువస్తుంటే

తేరిన మలినాలతో

రెప్పల రెక్కలు శుభ్రపడిన కళ్ళు

నిన్న  కల ఆగిన చోటే  నిద్రను తవ్వి

తూర్పారపట్టి

కోరికలు  బొట్లు బొట్లుగా

నల్లని మంచుగడ్డలా మారి

చల్లని సెగల మంటలకు

కొంగర్లు పోతున్న వాక్యాలు నుదుట దర్జాకు

మసకపడేలోగే వెలుగు వాకిలి తెరుచుకుని

నాలో వందమందిని తోడైసుకుని

నా నుండి బయటకొచ్చా...

 

bottom of page