top of page

మధురవాణి ప్రత్యేకం

సాహితీ సౌరభాలు

తెలుగు సాహిత్యంలో భోజనం

prasad.jpg

ప్రసాద్ తుర్లపాటి 

“ అన్నం పరబ్రహ్మ స్వరూపం “ -  మనం తినే అన్నమే బ్రహ్మ స్వరూపం, దాని ద్వారానే మనకు ప్రాణం ఉంటుంది. మనం జీవించాలంటే భోజనం తప్పకుండా ఉండాలి. భోజనం లేనిదే జీవం కూడా లేదు. మన శరీరం పంచకోశములు తో నిర్మితమై ఉంటుంది. అందులో ముఖ్యమైనవి  – అన్నమయకోశం  మరియు ప్రాణమయ కోశం.  అందుకే శరీరంలో అన్నమయ కోశం శరీరం గాను, ప్రాణమయ కోశం ఆత్మగాను భావిస్తారు. కాబట్టి మానవ జీవితంలో అన్నం / భోజనం యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉన్నది. కోటి విద్యలు  కూటికోసమే అయినా రుచి లేని కూడు ఎవరికి ఇష్టముండదు కదా ! “ భోజనం దేహి రాజేంద్ర, ఘృతసూప సమన్వితం” అంటూ తమ కవిత్వంలో భోజనానికి పెద్దపీటే వేశారు భోజన ప్రియులు, మహా విద్వాంసులు, స్తుతిమతులైన ఆంధ్ర కవి పండితులు. వారు తమ కావ్యాలలో, చాటువులలో  భోజనం పై ఎన్నో పద్యాలను, వచన రచనలను మనకు అందించారు. ఆ సాహితీ విందును ఒక సారి పరికిద్దాము.

ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని వారన్నట్లు –

 

నిరుపహతి స్థలంబు, రమణీప్రియ దూతిక తెచ్చి యిచ్చు క

ప్పుర విడె మాత్మ కింపైన భోజన ముయ్యెల మంచ మొప్పు త

ప్పరయు రసజ్ఞు లూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్

దొరకని గాక ఊరక కృతుల్ రచియింపుమనంగ శక్యమే!

 

ఇల్లాలికి ఇష్టురాలైన చెలికత్తె (రమణీప్రియదూతిక) ప్రియమారగా తెచ్చి ఇచ్చే కర్పూర తాంబూలం ఉండాలి. మనసుకు నచ్చిన (ఆత్మకింపైన) భోజనమూ, భోజనం చేశాక కర్పూర తాంబూలం వేసుకొని విలాసంగాఊగడానికొక ఉయ్యాలమంచం ఉండాలి. తాను చెప్పే కవిత్వంలో తప్పొప్పులు చూడగలిగే రసజ్ఞులూ, కవి ఊహను ముందుగానే తెలుసుకోగల వారూ అయిన ఉత్తమలేఖకులూ, ఉత్తమ పాఠకులూ దొరకాలి. వీళ్ళందరూ దొరికినప్పుడే కానీ ఊరికే కృతులు రచించమంటే కుదురుతుందా ? కుదరదు.

కాబట్టి మన కవులకు భోజనముపై మక్కువ, మమ ‘కారం’  ఎక్కువే !! భోజన ప్రియులైన కవులలో మనకు మొదటగా స్పురించేది కవి సార్వభౌముడైన శ్రీనాధుడే.

కాశీ ఖండము లోని గుణనిధి కధలో, గుణనిధి శివాలయములో ఒక శివ భక్తుడు తెచ్చిన వంటకములను ఈ విధముగా వర్ణిస్తున్నాడు –

మరిచి ధూళీ పాళి పరిచితంబులు మాణి
బంధాశ్మ లవణ పాణింధమములు
బహుళ సిద్ధార్థ జంబాల సారంబులు
పటురామఠామోద భావితములు
తింత్రిణీక రసోపదేశ దూర్థురములు
జంబీర నీరాభి చుంబితములు
హైయంగవీన ధారాభిషిక్తంబులు
లలిత కస్తుంబరూల్లంఘితములు

శాకపాక రసావళీ సౌష్టవములు
భక్ష్యభోజ్య లేహ్యంబులు పానకములు
మున్నుగాఁ గల యోగిరంబులు సమృద్ధి
వెలయగొని వచ్చె నొండొండ విధములను

 

మరిచి ధూళి (మిరియాలపొడి) చల్లినవి కొన్ని, సైంధవలవణం వేసి తయారు చేసినవి కొన్ని, సిద్ధార్ధ (ఆవ పెట్టి ) వండినవి కొన్ని, ఇంగువతో (రామఠము) ఘుమ ఘుమలాడేవి కొన్ని వంటకములు, చింతపండు పులుసుతో (తింత్రిణీక రసం) చేసినవి కొన్ని. జంబీర నీరం (నిమ్మ రసం) తో చేసేవి కొన్ని, హైయంగవీనం – నిన్నటి పాలు తోడు పెట్టగా తయారైన పెరుగును నేడు చిలికి తీసిన వెన్నకాచిన నేయి లో మునిగి తేలుతూఉన్న కొన్ని పదార్ధములు, లేత కొత్తిమీర తో పరిమళిస్తున్నవి కొన్ని, భక్ష్య భోజ్య లేహ్యంబులు పానకములు మొదలగునవి ఆ శివభక్తుడు ప్రసాదాలుగా సమర్పించాడు.

ఇక తన హారవిలాసములోని శిరియాళుని కథలో వండే విధానాన్ని కూడా వివరించాడు –

మిరియము నుల్లియున్ బసుపు మెంతియు నింగువ జీరకర్ర శ

ర్కరమును చింతపండును గరాంబువు కమ్మని నేయి తైలమున్

పెరుగును మేళవించి కడుపెక్కు విధంబుల పాక శుద్ధి వం

డిరి శిరియాళునిం గటికి డెందమునం దరలాక్షులిద్దరున్ !!

 

శ్రీనాథుడు విధివశాత్తూ దేశాటన చెయ్యవలసి వచ్చి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.  సహజ భోజన ప్రియుడైన ఆయన్ని బాధించింది ఆయా ప్రాంతాల రుచులు, భోజనపు అలవాట్లు.  పల్నాటి సీమ అలవాట్లను చూసి –

రసికుడు పోవడు పల్నా

డెసగంగా రంభ యైన నేకులె వడుకున్

వసుధేశుడైన దున్నును

కుసుమాస్త్రుండైన జొన్న కూడే కుడుచున్

 

జొన్న కలి, జొన్న యంబలి,

జొన్నన్నము, జొన్న కూడు, జొన్నలె తప్పన్

సున్న సుమీ సన్నన్నము

పన్నుగ పల్నాటి సీమ ప్రజలందరకున్

 

గరళము మ్రింగితి ననుచున్

బురహర! గర్వింపబోకు, పో పో పో, నీ

బిరుదింక గానవచ్చెడి

మెఱసెడి రేనాటి జొన్న మెతుకులు దినుమీ!

 

శ్రీనాధుడు ఆ గరళకంఠుడికి ఇలా “ హరా! గరళము మ్రింగినానని గర్వించకు. ఒక్కసారి పల్నాడుకు వెళ్లి ఆ జొన్న మెతుకులు తిని చూడు , నీ బిరుదు వదులుకుంటావేమో! “అని సవాలు  కూడా విసిరాడు.

 

ఇక బచ్చలి శాకముతో జొన్న కూడు –

ఫుల్ల సరోజ నేత్ర యల పూతన చన్నుల చేదు ద్రావి నా

డల్ల దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెద వేల తింత్రిణీ

పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్న కూటితో

మెల్లన నొక్క ముద్ద దిగమ్రింగుము నీ పస కాననయ్యెడిన్

 

ఒక ముద్ద జొన్న అన్నము బచ్చలి కూర పులుసు కూర తో తినవయ్య బాబు !! అంటూ ఆ చిన్నికృష్ణుడి ని కూడా వదిలిపెట్టలేదు.

 

ఇక తమిళ భోజనాన్ని కూడా విమర్శిస్తున్నాడు శ్రీనాధుడు –

తొలుతనే వడ్డింత్రు దొడ్డ మిర్యపు చారు

చెవులలో బొగ వెళ్ళి చిమ్మిరేగ

బలు తెరంగుల తోడ బచ్చళ్ళు చవిగొన్న

బ్రహ్మరంధ్రము దాక బారు నావ

యవిసాకు వేచిన నార్నెల్లు ససి లేదు

పరిమళ మెంచిన బండ్లు సొగసు

వేపాకు నెండించి వేసిన పొళ్ళను

గంచాన గాంచిన గ్రక్కు వచ్చు

 

నరవ వారింటి విందెల్ల నాగడంబు

చెప్పవత్తురు తమ తీరు సిగ్గులేక

…………

చూడవలసెను ద్రావిళ్ళ కీడుమేళ్ళు

 

శ్రీనాధుడు కర్ణాటక సీమ లో వడ్డించిన భోజనం పై ఈ విధముగా స్పందించాడు.

కుల్లాయుంచితి, గోకజుట్టితి, మహాకూర్పాసముందొడ్గితిన్

వెల్లుల్లిన్ దిలపిష్టమున్ మెసవితిన్ విశ్వస్త వడ్డింపగా

చల్లాయంబలి ద్రాగితిన్, రుచుల దోసంబంచు బోనాడితిన్

దల్లీ! కన్నడ రాజ్యలక్ష్మి! దయలేదా? నేను శ్రీనాధుడన్!

 

రాజులు పంపే దిన వెచ్చాలతో హేమపాత్రల్లో సుష్టుగా సరస సల్లాపాలతో విందారగించిన కవీంద్రుడికి విశ్వస్త వడ్డిస్తే అంబలి మజ్జిగ తాగి వెల్లుల్లి తినడం కష్టమే కదా !!

మరి శ్రీనాధుడు కోరిన సరుకుల విషయం –

    నడినూక లేని అన్నము
  వడబోసిన నెయ్యి బుడమ వరుగున్ పెరుగున్
  గడిమీద నీయ బెట్టిన
  నడ గూడెపు నంబి పడుచు నడిగితి అనుమీ

 

తిరిగి తిండి విషయానికి వస్తే తాగిన చల్లను గుర్తు తెచ్చుకోవడం గొప్పే


   గొప్పయిన నిమ్మ పండ్లను
  కప్పురమును సొంఠి పొడియు కరివేపాకున్
  ఉప్పును యేలకు ఇంగువు

    ఒప్పుగ నీ చల్ల రుచికి నొన గూర్పదగున్
 

ఇక క్రీడాభిరామం లో ఈ విధంగా వివరించాడు ( ఓరుగల్లు లో ఇద్దరు మిత్రుల మధ్య సంభాషణ ) –

    కప్పుర భోగి వంటకము కమ్మని గోధుమ పిండి వంటయున్
  గుప్పెడు పంచదారయును కొత్తగా కాచిన యాలనే పెసర్
  పప్పును కొమ్ము నల్లటి పండ్లును నాలుగునైదు నంజులున్
  లప్పల తోడ క్రొంబెరుగు లక్ష్మణ వజ్ఘల యింట రూకకున్

 

“ స్వర్గస్థుడయ్యె విస్సన్న మంత్రి మరి హేమపాత్రాన్న మెవ్వని పంక్తి గలదు ?”  

 దివిజకవివరు గుండియల్‌ డిగ్గురనగ నరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి “, అంటూ దివికేగినాడు ఆ కవిసార్వభౌముడు.

 ‘అన్నం న నింద్యాత్‌’ అని తైత్తరీయోపనిషత్‌లోని భృగువల్లి చెబుతోంది. ‘అన్నాన్ని నిందించరాదు’ అని దాని అర్థం. ‘‘ప్రపంచంలో కడుపు నిండా ఆహారాన్ని తినలేనివారు ఎందరో ఉండగా నీవు తిన గలుగుతున్నావు. కాబట్టి లభించిన అన్నాన్ని దైవ ప్రసాదంగా స్వీకరించాలే తప్ప నిందించడం, నిరాకరించడం, రుచిగా లేదని ఈసడించడం కూడదు’’ అని ఉపనిషత్తు హెచ్చరిస్తోంది. ఈ ఉపనిషద్ వాక్యాన్ని పెడచెవినపె డితే ఎవరికైనా తిప్పలు తప్పవు కదా !!

ఇక శ్రీకృష్ణ దేవరాయలవారు ఆముక్తమాల్యదలో గోదాదేవి తండ్రియైన విష్ణుచిత్తుడు అనుదినం వైష్ణవులకు పెట్టె భోజనాల వైభవాన్ని వర్ణించాడు. “ ……. కలమాన్నము , నొల్చిన ప్రప్పు , నాలుగే న్బొగిపిన కూరలున్ , వడియముల్, వరుగుల్, పెరుగున్, ఘృతప్లుతిన్.”

వరి అన్నం , పొట్టుతీసి వొండిన పప్పు, నాలుగైదు పోపు వేసిన కూరలు .. ఇలా .. పెరుగు..”

ఆ నిష్టానిధి గేహసీమ నడురేయాలించినన్‌ మ్రోయు ఎం
తే నాగేంద్రశయాను పుణ్యకథలుం దివ్యప్రబంధాను సం
ధానధ్వానము “నాస్తి శాక బహుతా నాస్య్తుష్ణతా నాస్య్తపూ
పో నాస్య్తోదన సౌష్టవం చ కృపయా భోక్తవ్య”మన్‌ మాటలున్‌

 

తెలినులివెచ్చ యోగిరముఁ దియ్యని చారులుఁ దిమ్మనంబులున్

బలుచనియంబళు ల్చెఱకుపా లెడనీళ్లు రసావళు ల్ఫలం

బులును సుగంధిశీతజలము ల్వడపిందెలు నీరుఁజల్లయు

న్వెలయఁగఁ బెట్టు భోజనము వేసవిఁ జందనచర్చ మున్నుగన్

 

పునుగుం దావి నవోదనంబు మిరియంపుం బొళ్ళతో జట్టి చు

య్యను నాదారని కూర గుంపు ముకు మందై యేర్చునావం జిగు

ర్కొను పచ్చళ్ళును బాయసాన్నములు నూరుంగాయలున్ జే సురు

క్కనునేయుం జిరుపాలు వెల్లువుగ నాహారం బిడున్సీతునన్

 

ఇక  తెనాలి రామకృష్ణ కవి ‘చప్పటి దుంపలు తినుచును తిప్పలు పడుతున్నామని’ ఈ విధముగా అంటున్నాడు -

చప్పటి దుంపలు తినుచును

తిప్పలు పడు చుంటిమయ్య దేవా దయతో

గొప్పగు మార్గంబొక్కటి

 చెప్పుము మా నాల్కలొక్క చింతలు తీర్చన్

 

కవి చౌడప్ప గారికి కాకరకాయలు అంటే అంత ఇష్టముట -

వేయారు వగల కూరలు - కాయ లనేకములు ధాత్రి కల వందులలో

నాయకములు రా, కాకర - కాయలు మరి కుందవరపు కవి చౌడప్పా!

 

పడతుకయును వంకాయయు - అడరు సమూలంబు మధుర, మందుల లోగా తొడ మొదలుతొడిమమొదలును - కడుమధురముకుందవరపు కవి చౌడప్పా!

 

 నాదెళ్ల నృసింహ కవి కందిపప్పు మీద ఈ పద్యం చెప్పాడు. ముద్ద పప్పు అందరికీ ప్రీతి కదా -

వేడి మంగలములో వేయించి వేయించి గరగర విసిరిన కందిపప్పు

సరిపడ్డ లవణంబు సంధించి వండిన కనకంబుతో సరి కందిపప్పు

అన్నంబులో జొన్పి యాజ్యంబు బోసియు కల్పి మర్దించిన కందిపప్పు

పట్టి ముద్దలు చేసి భక్షణ సేయంగ కడుపులో జొచ్చిన కందిపప్పు

పైత్య వాతంబు లెల్లను పారద్రోలి కాంతపై యాశ పుట్టించు కందిపప్పు

బక్క దేహుల కెల్లను బలమునిచ్చి ఘనత దెచ్చును ఏ ప్రొద్దు కందిపప్పు

 

యోగి వేమనే ‘పప్పులేని తిండి ఫలము’ లేదన్నాడు.

                ఉప్పులేని కూర యొప్పదు రుచులకు

పప్పులేని తిండి ఫలములేదు

అప్పులేనివాడు యధిక సంపన్నుడు

విశ్వదాభిరామ వినురవేమ!

 

 

ఈ సందర్భముగా కాళిదాసు కానీ మల్లినాథ సూరి పండితుడు రచించిన ఈ శ్లోకం ఉదాహరించుకో వచ్చు  -

 

చారు చారు సమాయుక్తం ఇంగువ జీలకర్ర  సమన్వితం

లవణ హీన నరుచ్యంతే పాలాశ కుసుమం వృథా !!

 

రూప యౌవన సంపన్నా, విశాల కులసంభవా
విద్యావిహీన శోభంతే, పాలాశ కుసుమం వృథా

 

ఇక ముద్ద పప్పు, ఆవకాయల కలయిక మహాద్భుతం. అందుకే అన్నారు “ ఆవకాయ ఖావో , అమరత్వం పావో.. ” .

ఇక  గరికపాటి నరసింహారావు ఆవకాయ పై చెప్పిన పద్యం -

మామిళ్ళముక్కపై మమకారముంజల్లి

అందింపగా జిహ్వ ఆవకాయ

కూరలే లేనిచో కోమలి వేయుచో

అనురాగముంజల్లు ఆవకాయ

చీకుచున్ననుగాని పీకుచున్ననుగాని

ఆనందమేనిచ్చునావకాయ

ఆపదలనాదుకొను కూర ఆవకాయ

అతివనడుమైన జాడియే ఆవకాయ

ఆంధ్రమాత సిందూరమే ఆవకాయ

ఆంధ్ర దేశమ్మెతానొక్క ఆవకాయ

అంటే ముళ్ళపూడి వెంకటరమణ గారు ఏకంగా ఆవకాయ గురించి ఓ పాట అందుకున్నారు –

మధురం మధురం – ఆవకాయ మధురం

పాతదీ మధురం – కొత్తదీ మధురం

ఊటా మధురం – పిండీ మధురం

ముక్కా మధురం – టెంకీ మధురం

చర్మం మధురం – స్మరణం మధురం

 

మరి ఆవకాయను తలచుకుంటే ఆంధ్ర మాత, శాకాంబరిదేవి వరప్రసాదం గోంగూరను విస్మరించకూడదు కదా !! 

గోంగూర వంటి శాకము

సంగీతము చేత నబ్బు రసజ్ఞతయున్

బంగారు వంటి ధాతువు

శృంగారము వంటి రసము చిక్కవు సుమ్మీ

 

నారాయణ రెడ్డి గారు ఇక – “ ఎవడయ్య ఎవడువాడు ఇంకెవడు? తెలుగువాడు పంచభక్ష్యపరమాన్నాలు తన కంచాన వడ్డింప గోంగూర కోసమై గుటకలేసేవాడు”

గోంగూర పచ్చడి గురించి తెలియని వాడు తెలుగు వాడు కాదని రెడ్డి గారి అభిప్రాయం.

గువ్వల చెన్నడు – “ వెల్లుల్లి పెట్టి పొగచిన - పుల్లని గోంగూర పొగడగ వశమా ; మొల్లముగ నూనె వేసుక, కొల్లగ భుజియింపవలయు గువ్వల చెన్నా”  

ఇక కీర్తనా సాహిత్యంలో - సంకీర్తనాచార్యుడు అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఈ విధముగా కీర్తిస్తున్నాడు –

ఇందిర వడ్డించ యింపుగను

చిందక యిట్లే భుజించవో స్వామి ||ఇందిర వడ్డించ ||

  

అక్కాళ పాశాలు అప్పాలు వడలు

పెక్కైన సయిదంపు పేణులను

సక్కెర రాసులు సద్యోఘృతములు

కిక్కిరియ నారగించవో స్వామి ||ఇందిర వడ్డించ ||

 

మీరిన కెళంగు మిరియపు తాళింపు

గూరలు కమ్మని కూరలును

సారంపు పచ్చళ్ళు చవులుగనిట్టే

కూరిమితో చేకొనవో స్వామి ||ఇందిర వడ్డించ ||

 

పిండివంటలను పెరుగును పాలు

మెండైన పాకాలు మెచ్చిమెచ్చి

కొండల పొడవు కొరిదివ్యాన్నాలు

వెండియు మెచ్చవే వేంకటస్వామి ||ఇందిర వడ్డించ ||

 

అన్నమయ్య తన వేంకటేశ్వర శతకంలో ఈ విధముగా అంటున్నాడు –

 

అరిసెలు నూనె బూరియలు నౌగులు చక్కెర మండిగల్ వడల్

బురుడులు పాలమండిగ లపూపము ల య్యలమేలు మంగ నీ

కరుదుగ విందువెట్టు పరమాన్న చయంబులు నూపకోటియున్

విరత వనిర్ంలాన్నములు నేతుల సోనలు వేంకటేశ్వరా !

 

ఇక భద్రాచల రామదాసు తన కీర్తనలలో రామ నామాన్ని తియ్యని పదార్ధాలతో పోల్చాడు.

ఓ రామ నీనామ శ్రీరామ నీ నామ మేమి రుచిరా || ఓ రామ ||

కదళీ కర్జూరాది ఫలముల కధికమౌ

కమ్మనీ నీనామ మేమి రుచిరా || ఓ రామ ||

 

         నవరసములకన్న నవనీతములకంటె

అధికమౌ నీ నామ మేమి రుచిరా || ఓ రామ ||

 

పనస జంబూ ద్రాక్ష ఫలరసములకంటె

అధికమౌ నీ నామ మేమి రుచిరా || ఓ రామ ||

........

తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారు సంక్రాంతి పండుగ విందు భోజనాన్ని అందించారు -  

లేగటిపాలలోః గ్రాగి మాగిన తీయ

తీయ కప్పురభోగి పాయసంబు

చవులూరు కరివేప చివురాకుతో గమ

గమలాడు పైరవంకాయ కూర

తరుణకుస్తుంబరీ దళమైత్రిమై నాల్క

త్రుప్పుడుల్చెడు నక్కదోసబజ్జీ

క్రొత్త బెల్లపుః దోడి కోడలై మరిగిన

మదురు గుమ్మడి పండు ముదురు పులుసు

 

జిడ్డు దేఱిన వెన్నెల గడ్డ పెరుగు

గరగరిక జాటు ముంగాఱు జెఱకురసము

సంతరించితి విందుభోజనము సేయ

రండు రండని పిలిచె సంక్రమణలక్ష్మి

 

ఇక  బసవరాజు అప్పారావు గారి ఎంకి, నాయుడు బావతో తన ప్రేమనంతా తాను చేసిన వంటకాలను ప్రస్తావిస్తూ వ్యక్తపరుస్తున్నది ఈ గీతంలో –

గుత్తి వంకాయ కూరోయ్ బావా!

కోరి వండినానోయ్ బావా!

కూర లోపలా నా వలపంతా

కూరి పెట్టినానోయ్ బావా!

కోరికతో తినవోయ్ బావా!

 

తియ్యని పాయసమోయ్ బావా!

తీరుగా ఒండానోయ్ బావా!

పాయసమ్ములో నా ప్రేమనియేటి

పాలు పోసినానోయ్ బావా!

బాగని మెచ్చాలోయ్ బావా!

 

కమ్మని పూరీలోయ్ బావా!

కర కర వేచానోయ్ బావా!

కర కర వేగిన పూరీ లతో నా

నా కాంక్ష వేపినానోయ్ బావా!

కనికరించి తినవోయ్ బావా!

 

ఇక వంకాయ కూర ప్రాశస్త్యము లోక విదితమే !!

వంకాయ వంటి కూరయు

పంకజముఖి సీత వంటి భామామణియున్

శంకరుని వంటి దైవము

లంకాధిపు వైరి వంటి రాజున్ గలడే

 

ఇక మన సాహితీ సమావేశములలో తప్పనిసరిగా ఉండేవి మరియు  సాహితీ ప్రియులకు ఉత్సాహాన్నిచ్చేవి పకోడీలు – బజ్జీలు.

 

చిలకమర్తి వారి పకోడీ పద్యాలు -

వనితల పలుకులయందున

ననిముష లోకమున నున్న దమృతమటంచున్

జనులనుటె గాని, లేదట

కనుగొన నీయందమృతము గలదు పకోడీ !

 

ఎందుకు పరమాన్నంబులు

ఎందుకు పలు పిండివంటలెల్లను నాహా ! నీ

ముందర దిగదుడుపున కని

యందును సందియము కలుగ దరయ పకోడీ !

 

ఆ కమ్మదనము నా రుచి

యా కర కర యా ఘుమ ఘుమ, యా పొమకములా

రాకలు పోకలు వడుపులు

నీకేదగు నెందులేవు పకోడీ !

 

నీ కర కర నాదంబులు

మా కర్ణామృతములు, నీదు మహితాకృతియే

మా కనుల చందమామగ

నే కొనియాడెదను సుమ్ము నిన్ను పకోడీ!

ఆ రామానుజు డాగతి

పోరున మూర్చిల్ల దెచ్చె మును సంజీవిన్

మారుతి ఎరుగడు, గాక, య

య్యారె నిను గొనిన బ్రతుకడట పకోడీ !

 

హరపురుడు నిన్ను దిను నెడ

గరుగదె యొక వన్నె నలుపు గళమున, మరి చం

దురుడున్ దినిన కళంకము

గరుగక యిన్నాళ్లు నుండగలదె పకోడీ!

 

పకోడీ తరువాత కాఫీ కావాలి కదా !! శ్రీ శ్రీ గారి ఈ పద్యంలో కాఫీ వచ్చేసింది.

ఎప్పుడు పడితే అప్పుడు

కప్పెడు కాఫీ నొసంగ గలిగిన సుజనుల్

చొప్పడిన ఊరనుండుము

చొప్పడకున్నట్టి ఊరు చొరకుము మువ్వా!

 

తదుపరి తాంబూల సేవనో కావిస్తే ఆ మజాయే వేరు. జరుక్ శాస్త్రి గారి తాంబూలం -  

మాగాయీ కందిపచ్చడీ

ఆవకాయీ పెసరప్పడమూ

తెగిపోయిన పాత చెప్పులూ

పిచ్చాడి ప్రలాపం, కోపం

వైజాగ్ లో కారా కిళ్ళీ

సామానోయ్ సరదా పాటకు !

సుమతీ శతక కారుడు కూడా, తాంబూల ప్రాముఖ్యతను ఈ పద్యం లో పేర్కొన్నాడు –

 తమలము వేయని నోరును

విమతులతో జెలిమిజేని వెతఁబడు తెలివిన్

గమలములు లేని కొలకును

హిమధాముడులేని రాత్రి హీనము సుమతీ

 

మరి అన్ని వంటలకు పోపు కావాలి కదా !! అందుకే  కరుణశ్రీ గారు అన్నారు –“అమ్మ నీచేతి తాలింపు కమ్మదనము - భరతదేశాన ఘుమఘుమా పరిమళించె !!” . ఎంతమంది కవులు ఎంత చెప్పినా అమ్మ చేతి వంట కమ్మన ! అమ్మ భాష కమ్మన !!

అందుకే -  ముదిగొండ వీరభద్రమూర్తి గారన్నట్లు  -

మంచి గుమ్మడి కన్న దంచిన యెఱ్ఱని క్రొవ్వడ్ల బియ్యము కూడు కన్న

మేల్ జహంగీరు మామిడు పండు కన్న సుంకారిన లేసజ్జ కంకి కన్న

కమియ పండిన దాక కన్న, చక్కెర తగబోసి వండిన పాల బువ్వ కన్న

రసదాడి కన్న, పనస తొన కన్న ఖజూరము కన్నను జూన్ను కన్న

అలతి రెరతేనియన కన్న నామని తఱి కొసరి కూసిన కోయిల కూత కన్న

ముద్దు లొలికెడు జవరాలి మోవి కన్నతియ్యనైన దెయ్యది యదే తెలుగు బాస

 

 

అమ్మ చేతి వంట కమ్మన ! అమ్మ భాష కమ్మన!!

*****

bottom of page