hasya.JPG
adannamaata.png

సంపుటి  4   సంచిక  1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

ఆణిముత్యాలు

madhuravani sahityam

వేదుల చిన్న వేంకట చయనులు

‘ఇదుగో వచ్చా, జావ అయిపోవచ్చింది’ అని వర్ధనమ్మ గట్టిగా కేక వేసింది. వంటింటి పక్కనే మంచం మీద మూల్గుతూ, భర్త రంగయ్య అప్పటికే నాలుగు శాపనార్థాలు పెట్టడమయింది. జావ కలుపుతూ వర్ధనమ్మ యథాప్రకారంగా స్మృతిపథం లోకి మరలింది.

ఆ మిద్దె ఇంట్లో కాలుపెట్టి అరవై యేళ్ళవ వస్తోంది. ఎంత వైభవంగా ఉండిందో ఆ ఇల్లు, ఆ వీథి, ఆ పల్లె! బండి శ్రీరాంపురం పొలిమేరలు చేరగానే, పచ్చని పైరులు, చల్లని వాతావరణమూ చూసి అచ్ఛంగా శ్రీరాములు వారే దానిని పోషిస్తున్నారా అని అనిపించింది, నూతన వధువైన వర్ధనమ్మకు. కాలచక్రంలో ఎంత మార్పు వచ్చింది! మిద్దె ఇల్లంతకీ ఉండేది ఇద్దరే. వాడేది కిందన ఉన్న రెండు గదులే. ఒకటి వంటిల్లు, రెండవది పడక గదిగానూ మార్పు చేసుకుని. రెండు పెరళ్ళలో వెనుక పెరడు ముళ్ళతుప్పలతో కాలు పెట్టడానికి పొసగకుండాను, ముందు పెరడు కూడా పాదులు, పూల చెట్లూ సంస్కార విహీనంగా పడి ఉన్నాయి. వీథిలో పది ఇళ్లలోనూ, ఎనిమిది దీపం కూడా పెట్టే దిక్కు లేక పడి  ఉన్నాయి. మిగిలిన రెండిళ్లలోనూ ఇంటి పెద్దలు రేపో మాపో పరలోకానికి దారి తీసే ముసలి వారే. తెల్ల వారక ముందే వీథిలో ఇంటి ముందు ముగ్గులు అల్లుతూ కూనురాగాలు లేవు. చీకటి పడ్డాక వీథిలో దీపమైనా లేక దెయ్యాల వాడగా బిక్కుబిక్కు మనే వీథి!

‘ఏమే, ఎక్కడేడుస్తున్నావే?’ అన్న రంగయ్య కేకతో వాస్తవికతకు దిగి, ఆతురతగా జావ పట్టుకుని వెళ్ళి, అందించింది. జావ తాగుతూన్న భర్తను చూస్తూ మరల గతం లోకి వెళ్ళి పోయింది. ఆ అలవాటు అంతో ఇంతో ఆదినుంచీ ఉన్నా ఇటీవల మూడు నెలలాయి, ఆయనకు జబ్బు చేసి మంచం మీదే అతని కాలం సాగుతూన్నప్పటి నుంచీ, వర్ధనమ్మకు గతమే మదిలో ఎక్కువ సాగుతొంది.

ఆ రోజు కనుల మెదలాడుతొంది…

వెంకన్న పట్టణం నుంచి డాక్టరుని తీసుకు వచ్చాడు. ఒకప్పుడు వెంకన్న లాంటి పనివాళ్ళు  ఇరవై మంది ఉండేవారు. ఇరవై ఎకరాల మాగాణీ, ముప్ఫయి ఎకరాల మెట్ట భూములు సాగు చేయడానికి ఉండేవి. ఇప్పుడు మిగిలింది రెండు ఎకరాల మెట్ట భూమే. పేరుకు సొంత వ్యవసాయము కానీ చేసేది అంతా వెంకన్నే. ఎనభై వచ్ఛేదాకా నిటారుగా జడకర్రలా ఉండి, ఆయనే వ్యవసాయం చేసే వారు. ఇప్పుడు అన్నింటికీ శరణ్యం వెంకన్నే. పాతకాలపు మనిషి కాబట్టి అవసరానికి అన్నీ చేసి పెడుతున్నాడు. డాక్టరుగారు గదినుంచి బయటకు రాగానే, ‘మలబద్ధానికి రోజుకి మూడు నాలుగు గ్లాసులైనా నీళ్లు త్రాగండి అనే దానిని. భోజనమప్పుడు తప్ప మంచి నీరెప్పుడూ తాగకుండా ఉంటే. అలాంటిది ఇప్పుడు చెంబులు చెంబులు తాగేస్తున్నారు. ఏమొచ్చినట్లు?’అని అడిగాక ‘గొంతుకలో కాన్సరు’ అన్న అతని జవాబు విని కొయ్యబారిపోయింది. ‘నే పోరు పెట్టేదాన్ని, ఆ జరదా కిళ్లీ మానేయండి అని. ఒక్కటే కదే వేసుకుంటున్నది అనే వారు. ఆ ఒక్కటీ కొంప ముంచిందంటారా?’ అని అన్నదానికి డాక్టరుగారు ‘అలా మోతాదుగా వాడినా, యేళ్ళ తరబడి వేసుగున్న దాని ఫలితం ఎక్కడికి పోతుంది? ఆ తరం ఆయన కాబట్టి ఎనభై దాకా నిక్షేపంగా ఉన్నారు. ఏదో బాధ ఓర్చు కొనడానికి మాత్రలు గాని ఆయనకి మనం చేయగలిగినదింకేమీ లేదు’ అనేశారు. ‘అంతేనంటారా? మా అబ్బాయిలు వఛ్చి ఏమలా ఏమీ చేయకుండా ఉంచేసేవని నన్నాడిపోస్తే నేనేమి జవాబు చెప్పగలను? పోనీ ఒక్కసారి విశాఖపట్టణం పెద్దాసుపత్రికి తీసుకు వెళ్లి ఆ కురుపేదో కోయించేస్తే..

‘విశాఖపట్టణం కాదండి. బొంబాయి కాన్సరు ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. ఖర్చుకి ఖర్చే కాకుండా ఈ వయసులో అక్కడి చికిత్స ఆయన తట్టుకోలేరమ్మా. నన్నడిగితే శ్రమే మిగిలి పోతుంది కానీ ఫలితం ఏమీ ఉండదమ్మా. రంగయ్య గారినే అడిగి చూడండి’.

డాక్టరుగారు వెళ్ళాక, ‘ఏమంటాడే? అయినా అంత సేపు తర్జనభర్జనలు దేనికి? నా గొంతుక మండి పోతున్నాది. ఈ చెంబులో ఒక్క నీటి చుక్కైనా లేకపోతే ఎలా చస్తాననుకున్నావే, నీ యింట పటారం గాను?

ముందు మంచినీళ్ళందించి, తాపీగా ‘ఏమీ లేదండీ. మీకు ఏఏ మందులు వాడాలో అతను..

‘అతగాడికేం? రాసుకు పోతాడు. అయినా ఇలా ఎన్నాళ్ళు బాధపడమంటాడు? ఓ చిన్న మాత్ర ఇఛ్చి శాశ్వతంగా కళ్ళు మూయించ లేడూ?

‘ఛ! అదేం మాటండీ? నూరు కాలాల పాటు నా పసుపుకుంకుమాలని కాపాడారా తండ్రీ అని నేను మొక్కుకుంటూ ఉంటే , మీ రెమో..

‘దండాలు పెట్టేస్తే అయిపోతే ఇకనేం? అసలు బాధ పడేది నేనా నీవా? నీ గోల అంతా నీ పసుపుకుంకుమ లనే గాని.. చూడూ … అనవసరంగా బ్రతికించేసుకుందామని మందులు కొనేసి సొమ్ము దండగ చేసుకోకు. ఈ నొప్పి లేకుండా చూడమను. అదే చాలు.’

‘అదేనండీ. నొప్పి నోట్లో పుండు వల్ల కదా! ఆ పుండుని కోసేందుకు..

‘అలా ఆ పెద్ద మనిషి అంటున్నాడా? చూడూ! నాకు ఆసుపత్రులు, ఆపరేషనులూ, ససేమీరా వద్దుగాక వద్దు. నొప్పికి మాత్ర ఇస్తే ఇమ్మను. లేదంటే అతని దారిని అతన్ని చూసుకోమని ఇంకో డాక్టరుని పిలు.

‘ఆయన అనలేదండి. నేనే..

‘ఏడిసేవ్! నీకు చెప్పాను కదా! నాకు ఆసుపత్రీ, గీసుపత్రీ వద్దు. ఇక్కడనుంచి ఇక నేరుగా అక్కడికే నాయాత్ర’ అని ఆయాసంగా మరి మాట్లాడ లేకపోయాడు, రంగయ్య.

‘మీరెక్కడికీ వెళ్ళవద్దు గాని అలాంటి అశుభం మాటలాడకండి’ అని కంటతడితో వర్ధనమ్మ గది బయటకు వచ్ఛేసింది.

బాధకు ఉపశమనంగాను నీరే తప్ప మరేదీ గొంతుకలొంచి వెళ్ళడము లేదని డాక్టరుగారు ఇంట్లోనే సెలైను, గ్లూకోజు, మందులూ, గొట్టాల ద్వారా ఎక్కించే ఏర్పాటు చేశారు. అవి చూసి ఆఖరు రోజులు వచ్ఛేశాయి అని వర్ధనమ్మ గుండె ఝల్లు మంది. ఇంతవరకూ పిల్లలకు కాన్సర్ అని చెప్పనే లేదు. వాళ్లకి చెప్పడం మంచిదని, ఆరు నెలల క్రితం పెద్దవాడు ప్రసాదు అమెరికా నుంచి వఛ్చినప్పుడు పెట్టించిన ఫోను దగ్గరకు వెళ్లి, గౌహాటీలో ఉన్న రెండవవాడు విజయ్ నంబరు తిప్పింది. పిల్లలు చేయడమే కాని వాళ్లకి ఎన్నడూ ఇంతవరకూ చేయలేదు. ఉత్తరాల తోనే సరిపెట్టుకున్నాది. రక్షించి ఆ నంబరు మ్రోగింది.

‘అల్లో అల్లో... నేనురా విజయ్. నీకు రాసేను కదరా నాన్నగారికి ఒంట్లో బాగో లేదని. డాక్టరుగారు దిక్కుమాలిన కాన్సర్ అంటున్నారురా..’ అని మారు మాట్లాడ లేకపోయింది. అటు పక్కనుంచి విజయ్ కూడా ఏడుస్తూ, ‘కంగారు పడకమ్మా. నే శలవు తీసుకుని వస్తున్నానమ్మా’అన్నది వినగానే వర్ధనమ్మకు కొండంత బలమొఛ్చినట్లయింది. ‘అన్నయ్యకు, చెల్లెళ్ళకీ నువ్వే చెప్పరా’ అని తేలికైన మనసుతో ఫోను పెట్టేసింది.

ఆ రోజంతా ఫోను మ్రోగుతూనే ఉంది  మొదట అమెరికా నుంచి ప్రసాద్. తరువాత హైదరాబాద్ నుంచి సుందరి. ఆ తరువాత విజయనగరం నుంచి రత్తాలు. ఎంత దూరాన ఉంటే అంత చప్పున ఫోన్ చేయాలని అనిపిస్తుందేమో అని అనుకున్నాది, వర్ధనమ్మ.

‘ఏంటే ఆ ఫోనులు? పిల్లలకి నాకిక ఆఖరి రోజులు వచ్ఛేశాయి అని కబురు చేశావేంటి? హమ్మయ్య. సర్వేశ్వరా! తండ్రీ త్వరగా తీసుకుపో బాబూ’ అని రంగయ్య మూలిగాడు.     

‘మీరు మరీనూ. డాక్టరలా ఏమీ అనలేదు గాని ఆ గొట్టాలేవో పెడుతున్నారురా అని విజయ్ కి ఫోను చేశాను. వాడు వాళ్లకి చెప్పాడనుకుంటాను. పిల్లలందరూ వరుసగా చేశారు.. ఒక్కర్తినీ ఉంది భయమేసి .. కనుల నీటితో మరి మాట్లాడ లేకపోయింది.

‘ఎంతో శ్రమ పడుతున్నావే నాగురించి. అందరికీ శ్రమ దేనికి గానీ వీలుంటే విజయ్ ని  రమ్మను.’ అని చేతిలో చేయి కలిపాడు రంగయ్య.

చాలాకాలం తరువాత అంత ప్రేమ చూపించిన ఆయనని చూస్తూ, ఒక చిరునవ్వుతో, ‘ఏం మిగతా వాళ్ళని చూడాలని లేదా? అని చిలిపిగా అడిగింది..

‘ఉంటుందే! ఉండకెక్కడ పోతుంది? పిలిచేయగానే వాళ్ళందరికీ వీలవుతుందా? విజయ్ కు రైలు ఖర్చులు లేవు. చట్టున ఓ నాలుగు రోజులు కాజువల్ లీవ్ తీసుకుని రాగలడు. ఓ మాట చెప్పనా?

‘నాకు వెళ్లిపోతున్నా అని విచారం లేదే. ఒక్కటే దిగులు. మా నాన్న నాకు బోలెడు ఆస్తి ఇఛ్చి వెళ్ళాడు. నేను నావాళ్లకి అందులో పదోవంతైనా ఇవ్వలేదు అనే విచారం’.

‘భలేవారండీ! ఆయన మీలా పిల్లల చదువులకి వేలకు వేలు, అమ్మాయిలా పెళ్లిళ్లకు లక్షలు లక్షలూ ఖర్చు పెట్టారా? అదలా ఉంచి ఆస్తిపాస్తులు మాకేమీ అవసరం లేదు, అన్నీ అమ్మేసి ఓ చిన్న ఇంట్లో హాయిగా పట్టణంలో ఉండండనే కదా వాళ్ళు నూరిపోస్తున్నారు? మరి దేనికి ఆ విచారమంతా?’

‘అవునే. పిల్లలు ఆణిముత్యాలు. …

అని కళ్ళు మూసుగుని ఉండిపోయిన ఆయనను చూసి, అప్పటికే చాలా మాట్లాడి అలసి పోయారని అక్కడనుంచి కదలి వర్ధనమ్మ వచ్ఛేయబోతొంటే చేయిపట్టుకుని, రంగయ్య మళ్ళీ, ‘ఈ గొట్టాలు పెట్టాక కొంత హాయిగానే ఉన్నాదే, అదేదో వెళ్తూన్నంత సేపూ. పిల్లలే సంపద అంటారు. ఆ లెక్కన మనం కోటీశ్వరులమేనే.

‘ప్రసాద్ ఒక్క రోజైనా అల్లరి చేయ లేదు. క్లాసులో ఎప్పుడూ ఫస్ట్ వచ్ఛే వాడు. అయినా వాడిని కూడా నా బెంగలో కొట్టాను. సినిమాలు, ఆటలూ అంటూ పాడైపోతున్నాడంటూ ..

కాస్త సేపు గతం స్మరిస్తూ మళ్ళీ ఒక చిరునవ్వుతో, ‘వెధవాయి విజ్జిగాడు అదెంత అల్లరి చేసేవాడో! నేను వాడిని కొట్టినంత ఏ తండ్రీ కొట్టి ఉండడేమో! దేముడి దయవలన హైస్కూలులో   చేరాక ఒక తీరుకి వచ్చాడు. అప్పటికీ అల్లాటప్పాగా ఆ సంఘం అంటూ ఎక్కడెక్కడికో ఉడాయిస్తూన్నప్పుడు  గాబరాగానే ఉండింది, వాడి భవిష్యత్తు గురించి. స్కూలు ఫైనల్  పాసవ డేమో అనుకుంటే, ఇంగినీరింగ్, ఆపైన రైల్వేలో పెద్ద ఉద్యోగం, ఓ యబ్బో!

‘మీరలా అబ్బాయిల గురించే వర్లిస్తున్నారు. మరి అమ్మాయిలు తీసిపోయారా ఏమిటి?

‘అన్నీ నేనే చెప్పేస్తే నీకేమీ మిగలదని..

అని ఒక చిరునవ్వు విసిరిన భర్తను చూసి పొంగిపోతూ, వర్ధనమ్మ అతని గుండెను నిమురుతూ తల వంచుకుని ఉండిపోయింది.

ఇంతకీ తల ఎత్తని ఆవిడతో, రంగయ్య, ‘పోనీలే. మన మనసులలో వున్నది ఒకటిగా. నేనే చెప్తాను. అబ్బాయిలు ముత్యాలైతే అమ్మాయిలు రత్నాలే! పెద్దది మా అమ్మ పేరు  పెట్టి నందుకు సాక్షాత్తు అమ్మే. మన ఇంటికి వఛ్చిన రత్నం. ఎంత సహనమో! అదే మన చిన్నదైతే ఆ రాకాసి అత్తగారికి ఎప్పుడో బుద్ధి చెప్పి ఇంటి పెత్తనం చేబట్టేది. ఎం ఉద్యోగం వెలగ బెడు తున్నాడో ఆ అల్లుడు మహారాజు! అమ్మ సంకన పిల్లి’.

‘శంకరం మంచి వాడేనండీ’.

‘ఎందుకే ఆ మంచి? పెళ్ళాన్ని కాల్చుకు తింటున్న అమ్మకి మెమ్మె అనుకుంటూనూ. అది సరే అలా వదిలేయ్. మన సుందరిని చూడు. చకచకా ఎలా సంసారం నడుపుకొస్తోందో? ఊళ్ళో అందరూ సుందరిగారంటే సుందరిగారని గొప్పగా చెప్పుకుంటారు’.

‘సరేలెండి. అది ఎప్పుడూ మీముద్దు మామ్మే. ఇంట్లో వాళ్ళపై అస్తమానమూ కస్సు బస్సూ లాడడమే దాని గొప్ప’.

‘ఇంట్లో వాళ్ళని కాకపోతే పైవాళ్ళని అంటే ఊరుకుంటారే! ముకుందం చూడు. చక్కగా ఎలా ఆర్జించుకు వస్తున్నాడో! అదీ తెలివితేట లంటే!’.

‘మీకలా బత్తాలు, పైఆర్జనలూ, కొట్టే వాళ్ళంటే మోజు. కానీ మీ అబ్బాయిలు మిమ్మల్నే పోలారు. ముక్కుసూటిగా పోయి దమ్మిడీ ఎవరిదేనా ఉండిపోతే అది తిరిగి ఇచ్ఛే వరకూ మీకు నిద్ర పట్టేదా?

‘నేనూ వాళ్ళూ ఈ ప్రపంచంలో బాగుపడే వారము కాదే. ఎందుకు వెధవ పేరు? నాలిక గీసు కోడానికా? నాలుగు రాళ్లు వెనక వేసుకోలేని అప్రయోజకులము’.

‘మీరెంతో పుణ్యాత్ములండీ. అందుకే వచ్ఛే జన్మలో కూడా మీరే నా భర్తగా అవాలని దేముణ్ణి ప్రతి రోజూ కోరుకుంటున్నాను’.

‘వెధవ పొగడ్తలకేం గాని అదేం కొరికే? నీ కోసం నే మరో జన్మ ఎత్తాలా?’

‘మీకిక జన్మ లేదంటే దేముడు నా మాట వింటే నాకూ జన్మ లేనట్టే గదండీ’ అని వర్ధనమ్మ పకపకా నవ్వుతూ ఉంటే రంగయ్య మోమున కూడా పూర్తిగా విప్పుకున్న బుగ్గలు చెప్పాయి అతను కూడా ఆనంద డోలలూగు తున్నాడని. అసలు అతనికి కడుపు నిండా నవ్వడము తెలియదు. మహా ఐతే బుగ్గలు విప్పారుతాయి. అదే తలచుకుంటూ వర్ధనమ్మ వంటగదికి అడుగులు వేసింది. రంగయ్య ఎంతో మాట్లాడి నందుకు అలసిపోయి కనులు మూసు కున్నాడు.

ఫోను పెట్టేసి ఎర్రబారిన కళ్ళతో వఛ్చిన ఆయనని చూసి, ‘ఆఫోను ఎవరిదండీ? అంత విచార కరమైన కబురు ఏంటి?’అని ఆత్రంగా భార్య కమల అడిగినప్పుడు, చెప్తా, అని సోఫాలో చతికిలబడి, విజయ్ చెప్పిన కబురు చెప్పాడు. ‘ఆమ్మో! కాన్సరే!’అని కమల పక్కన కూలబడ్డది. కొంచెం తేరుకుని, ‘ఐతే తొందరగా శలవు తీసుకుని బయలు దేరండి. ఎలాగో లాగ ఇక్కడ నేను పిల్లలని మేనేజ్ చేస్తాను. సాధ్యమైనంత వరకూ ఇంటినుంచే నాపని చూసుకునే ఏర్పాటు చేసుకుంటాను. మా బాస్ చాలా మంచివాడు. కాదనడు’ అని కమల అన్నది.

‘కాన్సర్ అంటే రేపోమాపో అని కాదుకదా. ఎన్నాళ్ళ కని అక్కడ ఉండగలను?  అందుకని ..

‘అందుకనీ... బాగుందండీ మీవరుస. అక్కడ పాపం అత్తయ్యగారు ఒక్కరూ ఎలా మేనేజ్ చేయ గలరు? అక్కడ ఆవిడకి అన్ని ఏర్పాటులూ చేసి రావాలి గాని ఇలా . ..

‘ఓ రెండు వారాలే కదా శలవు పెట్ట గలను? అది రియల్ ఎమర్జెన్సీ కని ఉంచుగుంటే బాగుంటుందేమో!’

‘ఇంతకంటే ఎమర్జెన్సీ మరేముంటుందండీ? ప్రాణం ఉండగా చూడగలమా లేదా అనే ఆదుర్దాతో వెళ్లడం కన్నా ఇప్పుడు వెళ్తేనే మంచిది.’

నేను ఆరు నెలలలో క్రితమే వెళ్లాను కదా? డాక్టర్ మమ్మల్ని పిలిపించండి అన్నప్పుడు నాకు ఫోను చేస్తే వెంటనే బయలు దేరి వస్తా అని చెప్తాను.’

‘మీ ఇష్టం. నే చెప్ప వలసినది చెప్పాను. ఈ సారి మీరు అత్తయ్యతో మాట్లాడినప్పుడు నేను కూడా ఆమెతో మాట్లాడుతాను. నన్నడగకుండా ఫోను పెట్టేయకండి’ అని సానుభూతితో పక్కన చేరింది.

విజయ్ తో రత్తాలు ఫోనులో మాట్లాడుతూన్నంత సేపూ పక్కనే ఉండి చెవులు రిక్క పొడుచుకుని ఉన్నాది రత్తాలు అత్తగారు గంగాయమ్మ. ఏడుస్తూ రత్తాలు ఫోన్ పెట్టేసిన వెంటనే, ‘ఎవరే అది? విజయ్ ఏనా? మీ అయ్యకు కాన్సరా? అమ్మకు ఫోను చేసి పరిస్థితి సరిగ్గా కనుక్కో కుండానే తురుతురు మని మూటా ముడీ కట్టేయక్కర లేదు. కాన్సర్ అంటే ఆజీవి ఎన్నాళ్ళు బాధ పడాలో ఏమో! కష్టం కష్టం జరాకష్టం అన్నారు అందుకే’ అని కోడలు జవాబు విన పనే లేదన్నట్లు ఆవిడ అక్కడనుంచి వెళ్ళిపోయింది.

ఎంత దయమాలిన గుండె అని ఆశ్చర్య పోతూ పొరలి వచ్ఛే దుఃఖాన్ని దిగమింగేసుకుందుకు రత్తాలు బాత్ రూముకి దారి తీసింది.

విజయ్ కబురు చెప్పగానే వెంటనే సుందరి అమ్మకు ఫోను చేసి, ‘ఇక్కడ కొంచెం చక్కబెట్టి రేపు ట్రైనులో బయలు దేరి వస్తున్నాను. డాక్టరుగారి ఫోన్ నెంబర్ నాకు చెప్పు’ అని అమ్మ జవాబు విన్నాక, ‘నెంబర్ తెలియక పొతే ఆయనకి ఎలా కబురు చేశావు? .. సరిపోయంది. వెంకన్నని ఆరు మైళ్ళ దూరం పంపించావా?’ అని ఎప్పటిలాగే ఒక చురక అంటించి, అమ్మ రాగం విని మళ్ళీ, ‘సరే! నేనేమన్నానని ఆ ఏడ్పు? ఏడవకు. నే వఛ్చి అన్నీ చూసుకుంటా అన్నాను కదా!’అని సుందరి ఫోను పెట్టేసింది.

విజయ్ అందరికీ ఫోనులు చేస్తూన్నది భార్య కాంతం గమనిస్తూనే ఉన్నాది. దుఃఖంతో అలాగే కూర్చున్న ఆయన దగ్గరకు వెళ్లి, ‘ఔను గాని, నాకు తెలియక అడుగుతాను, అందరికీ మీరే ఫోను చేయాలా? ఇంట్లో ఫోను ఉంది కదా, ఆ మాత్రం తానే తన పిల్లలందరికీ చేసుకో వచ్చును కదా? పోనీ కష్టంలో ఉన్నాది అని సర్దుకుంటే, మీరొకరికి చేస్తే వాళ్ళు ఆతరువాత వారికి ఛేయ వచ్చును కదా? అలా చేస్తే మీకే ఒక్కొక్కళ్ళతో ఆ ఏడుపులూ, చెప్పిందే చెప్పే శ్రమ తప్పునా?’

‘బాగుందే నీవరుస. నా వాళ్ళతో చెప్పుకుని నే ఏడవడం కూడా ఓ శ్రమేనా? నీ ఇల్లు బంగారం గానూ. నీకు గుండె పేగూ లేదే!

‘ఇందులో గుండె పేగు ఎక్కడ నుంచి వచ్చాయండీ? మామయ్యకు బాగోలేదంటే ఏడవ వద్దన్నానా? నాకు తెలీదేంటి, మీకు తేరగా వస్తోందని కదా అత్త మీకా పని అంటగట్టింది.’

‘ఛ! పోనిచ్చుకున్నావు కాదు నీ కుళ్ళు బుద్ధి. నీకసలు అత్తగారే కాకుండా మేనత్త అన్న అభిమానం ఎక్కడకు పోయిందే?

‘ఓ యబ్బ! అభిమానంట! అభిమానం! మేనకోడలని కట్నంలో పైసా ఐనా తగ్గించిందా? పూర్తిగా ఏభై వేలూ అక్కడ పెట్టే కన్నెధార పోయమనలేదూ తన అన్నయ్యని? అంత ఘనంగా పెళ్లి చేసినా బాగా చేసావ్ అన్నయ్యా అని ఒక్క ముక్కైనా అన్నాదా పెళ్లి అయ్యాక? ఎందు కుంటుంది అలాంటి అత్త మీద అభిమానం?

‘సరే లేవే. నీకోపం నువ్వు ఉంచుకో. నా ఏడ్పు నేనేడవనీ’ అని అక్కడ నుంచి విజయ్ లేచి వెళ్ళిపోయాడు.

రాత్రి పక్కమీద మళ్ళా కాంతం, ‘డాక్టర్ పిల్లలకి కబురు చేయండి అనేశాడా?’ అని అడిగింది.

‘ఆ సంగతి నాకు తెలియదు. మాంచి ధైర్యవంతు రాలైన అమ్మే టెలిఫోనులో అలా ఏడ్చినదంటే మరి వేరే చెప్పాలా? దిక్కు మాలిన కాన్సర్ అంటే మరో మాట దేనికీ?’

‘చూడండీ, ఓ సారి ఫోన్ చేసి ఏ స్థితిలో మామయ్య ఉన్నాడో కనుక్కోడము మంచిది. లేక పొతే శలవు దండుగ. శ్రమకి శ్రమా.’

‘నేనడుగ దలచుకోలేదింక. ఒక పది రోజులు శలవు పెట్టి వెళ్తున్నా.

‘అలాగే రామంగాడి పరీక్ష రామకీర్తన పాడించేయండి. నా సొమ్మేం పోయింది?’ అని పక్కకు తిరిగి పడుక్కున్నది.

రామం టెన్తు చదువుతున్నాడు. లెఖ్ఖలలో అవుకు అని విజయ్ రోజూ ఇంట్లో కూర్చోబెట్టి చేయిస్తున్నాడు. కాంతం బి.ఏ. చేసింది హిస్టరీలో. లెఖ్ఖలంటే తనకీ భయమే! ఇంకో మూడు వారా లలో రామం పెద్ద పరీక్షలు.. అంతదాకా కాపాడు నాన్నని వెంకటరమణమూర్తీ అని దండం పెట్టి తన ప్రయాణం వాయిదా వేసుకున్నాడు.

నాన్నా, అని సుందరి పిలవగానే కనులు తెరచి, ‘వచ్చావా తల్లీ! పిల్లలు కులాసావేనా?’ వచ్ఛేరేంటి నీతోటి’ అని రంగయ్య పలకరించాడు. పరీక్షలవగానే వస్తారని నాన్నకు చెప్పి అమ్మను చూడడానికి సుందరి వంటింటికి నడిచింది. అమ్మతో కాన్సర్ స్పెషలిస్ట్ సంగతి ఎత్తింది. డాక్టరుగారన్నది, నాన్న అభిమతమూ అమ్మ స్పష్ఠముగా చెప్పినా తన మాట కాదనడు అన్న నిబ్బరంతో సుందరి మళ్ళీ నాన్న వద్దకు వెళ్లి, ‘నాన్నా, కాన్సరు స్పెషలిస్టుకి చూపిద్దామని ఉన్నది… .

సుందరి మాట పూర్తి కాకుండానే రంగయ్య ఆవేశంతో ‘ఎన్ని సార్లు చెప్పాలే  మీ అమ్మకి? నా వల్ల కాదు మొర్రో అని? నిన్ను పంపించిందా? నేనిక్కడనుంచి కదిలేది లేదు. కదిలేది ఇంక ఆ పైలోకానికే. నా కన్నతల్లివి కనుక వాళ్లకి నాఇష్టం చెప్పి నన్నిక్కడ ఇలా చావనీవమ్మా’ అని చేయి పట్టుకుని వేడుకుంటూ ఉంటే సుందరికి చెప్పలేని దుఃఖ మొచ్చింది.. ‘ నే నీ కంట తడి చూడ లేనమ్మా’ అని రంగయ్య పెడ ముఖం పెట్టుకున్నాడు.

సుందరి వచ్చాక వర్ధనమ్మకు చాకిరీ ఆరాటం తగ్గింది. కానీ అబ్బాయిలు వెంటనే రావడం లేదన్న భయం ఆరంభమయింది. తీరా ఆప్రాణం పోయే సమయంలో ఇద్దరిలో ఒక్కడైనా వఛ్చి అంత్యక్రియలు చేస్తాడా లేదా అని. వర్ధనమ్మ భయానికి తగ్గట్టుగానే ఆ సాయంత్రం డాక్టరు గారు పరిస్థితి రోజులలోకి వచ్చినదని చెప్పాడు.

సుందరి మొదట ప్రసాదుకి ఫోను చేసింది. కమల ఫోను తీసి, ఆయనకు నిన్నటి నుంచీ జ్వరము. డాక్టరు నడిగి బయలు దేరుతారు. ఇదుగో ఆయనతోనే మాట్లాడు అని ఫోను ప్రసాదుకి ఇచ్చింది. ‘వీలయినంత త్వరగా బయలు దేరుతానే. అమ్మకు ధైర్యం చెప్పు’ అని చెప్పాడు. విజయ్ తో మాట్లాడుదామంటే సాధ్య మవలేదు. టెలిఫోన్ లైన్లు సరిగా లేవుట. అందుకని పోస్టాఫీసు వెళ్లి టెలిగ్రామ్ పంపింది, త్వరగా రా నాన్న రోజులలో ఉన్నారంటూ.

ఆ తరువాత రత్తాలుకి ఫోన్ చేస్తే గంగాయమ్మ తీశారు. ఓ రెండు సార్లు అల్లో అల్లో లయాక రత్తాలికి ఫోన్ అందించే ముందు తన ప్రశ్నలు ఆరంభించింది. ఎవరెవరు వచ్చారంటూ. సమయానికి మగపిల్లలు రాగలరో లేరో అన్నది విన్నాక రత్తాలుకి ఫోను అంధించింది.

సుందరి ఆ తరువాత భర్త ముకుందానికి ఫోన్ చేసింది. పిల్లలని పక్కింటి వాళ్లకి అప్పచెప్పి రైల్లో బస్సో పట్టుకుని అవసరమైతే కర్మకాండకి ఉండేలా శలవడిగి రమ్మన్నది. ఎప్పటి లాగే తీసుకో వలసిన జాగ్రత్తలు వర్లించింది.

అమ్మకి అన్నీ చెప్పి, ‘ఔను గానీ, బాబుల్లారా కూడాపలుక్కుని తలో నెలా వఛ్చి నాన్నను చూసుకొనండర్రా అని మగపిల్లలకు చెప్పుకోరూ’ అని అమ్మకు ఒక చురక అంటించింది. ‘నాకు నీ అంతటి తెలివితేటలు లేవే’ అని కొంగు పట్టుకుంది వర్ధనమ్మ.

శంకరం కూడా రత్తాలుతో బయలు దేరబోతొంటే, గంగాయమ్మ, ‘ఇక్కడ కూడా ఒక ముసలమ్మ ఉందని మరచిపోయారా ఏంటి? నా వల్ల కాదు బాబూ మీ పిల్లల సంరక్షణ. వాళ్లకి పరీక్షలంటున్నారు కదా. శంకరం, నువ్వు లేకపోతే ఎలారా? అయినా వాళ్ళ పిల్లలకే లేంది నీకెందుకురా అక్కడ? శవాన్ని మోసి ఆ కర్మకాండ నెత్తిన పెట్టుకోడానికా? అది చేయడానికి పోనీ మీ అత్తగారు ఒక ఎకర మైనా రాసిస్తుందా నీకు? ఆవిడ అడగడమూ బాగుంది, నువ్వు డూడూ బసవన్న అని వెంట వెళ్ళడమూ మహా బాగున్నాది. నవ్విపోతారు ఎవరేనా వింటే’ అని ఇద్దరి మీదా మండిపడింది. రత్తాలు మాత్రమే కన్నీటి ధారతో బయలు దేరింది.

ఆ మరునాడు సుందరి విజయ్ కి ఫోను చేయ ప్రయత్నిస్తే రక్షించి లైన్ పని చేసింది. విజయ్ లేడు. కాంతం ఎత్తి, ‘ ఆయన అక్కడెక్కడో రైలు పట్టాలు వరదలలో కొట్టుకు పోయాయంటూ వాటి మారామత్తుకి మొన్నననగా వెళ్లారు. సరిగ్గా మా రామం పరీక్షల ముందే. నేనాయనకు మారైల్వే ఫోనులో చెప్తా గాని ఈ పళంగా అతను బయలు దేరినా శ్రీరాంపురం చేరుకునే టప్పటికి అవతలెళ్లుండి అయిపోతుంది. బయలు దేరే ముందు మీకు ఫోన్ చేస్తారులే’ అని ఠక్కున ఫోన్ పెట్టేసింది. సుందరి కారాలు మిరియాలూ నూరుతూ వదిన చెప్పిన దానికి చిలవలూ పలవలూ అల్లి ‘సమయానికి వాడు రాకపోతే మా వారు ఉంటారులే’ అని అమ్మకు చెప్పగానే వర్ధనమ్మ చెప్పలేని దుఃఖ్ఖంతో కృంగిపోయింది.

రంగయ్య ప్రాణం పోయిన వేళకి ప్రసాదు గాని విజయ్ గానీ బయలు దేరుతున్నారన్న కబురే లేదు. ముకుందమే దహనక్రియ చేశాడు.

ఆ మరునాడు శంకరం గంగాయమ్మా పరామర్శగా వచ్చారు. విజయ్, ప్రసాదులు ఫోన్లు చేసి బయలు దేరుతున్నా మని, రాజమండ్రిలో గోదావరీ తీరాన్న మిగిలిన కర్మకాండ జరుపు గుందామనీ అన్నారు. ఆ కబురు విన్న గంగాయమ్మ రత్తాలుతో, ‘కొడుకులు ఎంత ప్రయోజకులైతేనేం? పాపం రంగయ్య గారికి కావలసినప్పుడు పనికి వచ్చారు కాదు. మా వాడు మీ అన్నయ్యలలా ప్రొఫెసర్లకు మస్కాలు కొట్టలేకపోయాడు. లేకుంటే వాడికీ ఫస్ట్ క్లాసులు వచ్ఛేవి.

అయినా ఆ నాలుగు రాళ్లు సంపాదించ డానికి అంతంత దూరాలు వెళ్ళాలా?’ అని ఎప్పటి లాగే రత్తాలు అన్నల మీద ఒక విసురు విసిరింది. రత్తాలు ఏమీ అనలేదు కానీ పక్కనే ఉన్న సుందరి ‘ఉంటాడు లెండి మీ అబ్బాయి మీకొంగు పట్టుకుని, మీకవసరం వఛ్చిన నాడు’ అని అన్నాది.

‘వయసు వఛ్చినా బుద్ధి రాలేదే నీకు’ అని సుందరికి చీవాటు పెట్టి, గంగాయమ్మ రత్తాలుతో ‘తెల్లవార గానే మేం వెళ్తున్నాం గాని నీవు తొందరగా వచ్ఛేయి. నీ అల్లరి పిల్లలని మేం కాయ లేం’ అని చెప్పింది.

‘నువ్వూ వాళ్ళతో వెళ్లిపో అమ్మా. ఆలస్యమయిందంటే మీ అత్తగారు నిన్ను బ్రతకనివ్వరు’ అని వర్ధనమ్మ రత్తాలుతో అంటే, ‘పరవా లేదమ్మా. ఆయన తాపీగా పుణ్యవాజనం ఆయాకనే రా. అమ్మ గోల మామూలే. వచ్చాక ఓ గంట ఓపిక పట్టుతే చాలు’ అని ఆయనన్నారు అన్నాక

వర్ధనమ్మ మనసు కుదుట బడింది.

నాలుగో రోజుకి విజయ్, ఆ మరునాడు ప్రసాద్ శ్రీరాంపురం చేరుకున్నారు. ఎనిమిదవ రోజున రాజమండ్రిలో అంత్యక్రియలు ఆరంభ మయాయి. రోహిణీ కార్తికల మండుటెండలు. విజయ్ కొండమీద ఉన్న రైల్వే రెస్ట్ హౌస్ ఏర్పాటు చేశాడు కనుక అందులో ఉన్నంత సేపూ ఒకింత హాయిగానే ఉండింది. కర్మకాండ అవుతూన్నంత  సేపూ పిల్లలు శ్రమపడిపోతున్నారే అని వర్ధనమ్మ దిగులు.

‘ఈ నాలుగు రోజులలో ఏమైపోరు నీ సుకుమార ముద్దు బిడ్డలు’ అని మగపిల్లల మీదే కానీ ఆడపిల్లల మీద అభిమానమే లేదు నీకు’ అని ఎప్పుడూ పాడే పాటే పాడింది.

పుణ్యవాజనమయి పిల్లలందరూ రెస్ట్ హౌస్ లోని పెద్ద డ్రాయింగ్ రూమ్ సోఫాలలో కూర్చున్నారు. నీరసంగా ఉందంటూ వర్ధనమ్మ ఆ పక్క పడక గదిలో నేలన  చాపమీద నడుము వాల్చింది.

లీలగా రంగయ్య ఎదురుగా కనపడి, ‘నీకింకా దిగులెందుకు? ఆణిముత్యాల లాంటి పిల్లలు నా అంత్యక్రియలు సవ్యంగా జరిపించారు కదా’ అని అంటున్నాడు. అదే సమయంలో సన్నగా డ్రాయింగ్ రూము నుంచి పిల్లల మాటలు అలా అలా వినవస్తున్నాయి.

ప్రసాదు మాటలా ఉన్నాది. ‘అమ్మ మాదగ్గర ఉంటే మాకూ అమ్మకూ ఎంతో సుఖం. ఒక్కటే చిక్కు. ఆ దేశంలో వంటికి ఏది వస్తే, హెల్త్ ఇన్స్యూరెన్స్ లేకపోతే ఛఛ్చినంత ఖర్చు. ముందు మనకున్న దంతా అయిందనిపించి దివాలా తీశాకనే ఉచితంగా ట్రీట్మెంటు జరిపిస్తారు. అమ్మకి మా ఇన్స్యూరెన్స్ పనికిరాదు. తనకు సిటిజెన్షిప్ వచ్ఛేకనే ప్రభుత్వ హెల్త్ పోలసీ వస్తుంది. అది రాడానికి ముందు గ్రీన్ కార్డు రావాలి. అది వఛ్చిన మరో ఐదేళ్లకి ఆ పాలసీ వస్తుంది. ఇప్పటి వరకూ అమ్మకు ఏమీ లేదు కానీ వయసు మీరింది కదా. నాన్నకి మొన్నమొన్నటి దాకా ఏమీ లేదు. ఒక్క సారి ఎలా వఛ్చి పడిందో చూడండి? అదలా ఉంచి అమ్మ విమానంలో అంత సేపు ప్రయాణం చేయాలి దేశం రావాలంటే. అమ్మని చూడాలంటే మీరే రావాలక్కడికి.’

‘మేమెలా రాగలమురా అంత ఖర్చు పెట్టుకుని?’ అన్నది రత్తాలు.

‘అమ్మని చూడడానికి వాడికయే ఖర్చే మనకు పెడతాడే. ఒక ఏడాది నీకు. మరొక ఏడాది నాకు’ అన్నాది సుందరి.

‘మీ ఆయన రెండు చేతులా ఆర్జిస్తున్నాడు కాదే. నీకెందుకు పెట్టాలే?’ అన్నది విజయ్ మాట.

‘నిన్నెవరు అడిగారురా? మీ ఇంటికి రావడానికి నేను నిన్నేమీ అడుగనులే’ అన్నది సుందరి మాట.

బాగుందర్రా, మీ దెబ్బలాట, అని వర్ధనమ్మ మగత నిద్రనుంచి మేల్కొని వారి మాటలు మరింత కుతూహలంతో విన సిద్దమయి అలాగే నడుము వాల్చే ఉండిపోయింది.

ప్రసాద్ మళ్ళీ తన బాధ చెప్పకుంటున్నాడు.. ‘మేమిద్దరమూ రోజల్లా ఆఫీసులలో ఉంటాము. పిల్లలు ఇప్పుడు పది పదకొండు క్లాసులలో ఉన్నారు. వాళ్ళ ఆటలు, స్నేహితులూ అంటూ ఇంటి పట్టున ఉండరు. తెలుగు అర్థమైనా మాట్లాడరు. అమ్మకి ఇంగ్లీషు  రాదు. రోజంతా ఒక్కర్తీ ఉంటుంది. అందుకే అమ్మలాంటి వారు ఆ దేశ నివాసం ఒక బంగారు పంజర  మంటారు. పోనీ మేము మనదేశం వచ్ఛేద్దామంటే సొమ్ము మాటటుంచి, ఇక్కడ పని వాతావరణం వేరు. అక్కడ అలవాటు అయ్యాక మన దేశంలో చాకిరీ చేయడం మహా కష్టం. మా మాట అలా ఉంచి మా పిల్లలు అసలు ఒప్పుకోరు ఆ దేశం వదిలి రావడానికి.’

‘ఐతే ఏమంటావ్! ఇంత తిప్పితిప్పి చెప్పే కన్నా ఒక్క మాటలో చెప్పేయ రాదూ, నేను అమ్మను తీసుకు వెళ్ళలేను అనీ.’

సుందరి కొంచెం కంఠం పెంచే మాట్లాడింది.. 

‘నెమ్మదిగా మాట్లాడావే. పక్క గదిలో అమ్మ పడుకున్నదన్నది మరచిపోయావా? అని విజయ్ గొంతుక.. కొంచెం సేపు నిశ్శబ్దం. ఆ తరువాత మెల్లగా సుందరి మాట వినవచ్చింది.

‘నువ్వంటే నప్పుకోలేక ఆ దేశంలో ఏడవాలి గాని అమ్మకి అక్కడే ఉండాలని ఏముంది? ఉన్నాడుగా ఇంకో కొడుకిక్కడ?’

‘సుందరీ! నీ మాట దురుసుతనం పొనిచ్చుకున్నావు కాదు. ఆ గీరంతా మీ ఆయన ఈ దేశంలోనే గొప్పగా ఆర్జిస్తున్నా డనే కదా?’ అని ప్రసాదు కోపగించుకున్నాడు.

‘అదేంకాదు. ఉన్నమాటంటే ఉలుకెందుకూ? అయినా విజయ్ నువ్వు ముద్దరాలిలా ఉలుకూ పలుకూ లేకుండా కూర్చున్నావేం?’ అని సుందరి అంటే విజయ్, ‘సుందరీ, నీకు తెలియని దేముంది? కాంతం ఒక్క అమ్మ విషయంలో తప్ప చాలా మంచి మనిషే అనాలి. అప్పుడెప్పుడో అమ్మ అలా అన్నది, మా నాన్నను అలా ఏడిపించిందంటూ శివమెత్తుతుంది. అమ్మ మాతో ఉంటే అనుక్షణమూ అమ్మని ఏదో ఒకటి అని ఏడిపిస్తుంది. అది చూసి నేను సహించక దానిని ఏమైనా అంటే నా వల్ల మీ ఇద్దరికీ దెబ్బలాట ఎందుకురా అని అమ్మ మొత్తుకుంటుంది. మా రామం పుట్టిన కొత్తలో అమ్మ వచ్చింది కదా. మళ్ళీ అలాంటి నరకం వద్దు బాబోయ్ అని ఆనాడే నిశ్చయించుకున్నా. నేను చేయగలిగింది లేకపోలేదు. అమ్మకి రైల్వే ఆసుపత్రిలో అన్నీ  ఉచితంగా జరిపించ గలను. అలాగే మనదేశంలో అమ్మ ఎక్కడికి వెళ్లాలన్నా అమ్మకి, అమ్మకి తోడుగా మరొకరికి రైల్వేపాసులు పంప గలను’ అని కొంచెం విచారకరంగానే తన అవస్థ చెప్పుకున్నాడు.

‘అమ్మకి నా బొందెలో ప్రాణమున్నంత కాలం సేవచేసి నా ఋణం తీర్చుకోవాలనే ఉన్నది. కానీ మా అత్తగారున్నన్నాళ్లు అది సాధ్యమాయే మాట కాదు. మా అత్తగారు మనందరినీ పంపించే ఆ లోకానికి వెళ్ళేటట్లు ఉన్నారు’ అని రత్తాలు ఒక చిన్న రాగం పెట్టింది.

‘ఇక నేనే గదా ఉన్నాను. మా అత్తగారు, మామగారూ నా చేత చేయించుకునే వెళ్లారు. నాకొక్కటే లొసుగు. మా ఆయనకు డబ్బు, గొప్పలు కావాలి. అందుకనీ... కొంచెం సేపాగి, మళ్ళీ, ‘అన్నయ్యలూ, మీరిద్దరూ అమ్మని మా ఇంట దింపినప్పుడు, బావగారూ, మీరే శరణ్యం. సుందరీ, మీరూ మా అమ్మని చూసుకుని కాపాడాలి. అమ్మ విషయంలో మీకు దమ్మిడీ ఖర్చు కూడా పడదు. మేమిద్దరం సర్దుబాటు చేస్తాము. అమ్మ పేరున ఉన్న భూమీ, ఇల్లూ మీకే! మాకు వాటితో సంపర్కం లేదు, అని చెప్పండి.. .

ఏమిటలా చూస్తున్నారు? ఎంత పాపిష్టిదీ సుందరి అన్నట్లు? మీరేమీ రాసియ్యక్కర లేదు. అలా అనండి చాలు. మా ఆయన సంగతి నాకు బాగా తెలుసును. ఏదీ కాగితం చూపించండి అని అడగరు. మీ మాటంటే ఆయనకంత నమ్మకం’ అని సుందరి పకపకా నవ్వుతే మిగతా ముగ్గురూ ఆ నవ్వులో వంతు కలిపారు.

వర్ధనమ్మ, కనులు మీదకు ఉంచి, ఆ లోకంలో ఉన్న ఆయనతో, ‘ విన్నారా, మీ ఆణిముత్యాల మాటలు? మీ ముద్దుమామ్మ తిడితే తిట్టుగాక, నన్ను చూసుకుంటుందిట. ఏది ఏమైనా ప్రాణం పోయే వరకూ శ్రీరాంపురం లోనే ఉంటా అని వాళ్లకు తెలియదు. వాళ్ళు నన్నడిగితే గదా! త్వరలోనే మీ దగ్గరకు చేర్చమని ఆ సర్వేశునకు నా నిత్య ప్రార్థనలు ఇక మీద’ అని పక్కకు తిరిగి నిబ్బరంగా నిదుర పోయింది.

****