top of page

వంగూరి పి.పా- 30

 

నేనూ- 50వ టెక్సస్ సాహిత్య సదస్సూ

 

Vanguri Chitten Raju

వంగూరి చిట్టెన్ రాజు

అప్పుడప్పుడు నాకు నా మీద నాకే భలే అనుమానం, అవమానం కలిసి మెలిసి వచ్చేస్తాయి. అవకాశం దొరికినప్పుడు ఎగిరి గెంతేసి, దొరకనప్పుడు ఎలాగో అలాగా మధ్యలో దూరేసి నా గొప్పలు నేనే చెప్పేసుకుంటానేమో అని అనుమానమూ, అవతలి వాడు తన గొప్ప తనం గురించి చెప్పేసుకుంటూ పోతూ ఉంటే నన్నేదో అవమానం చేస్తున్నట్టుగానూ అనిపించేస్తూ ఉంటుంది మరి. మొన్న మార్చ్ 25-26, 2023 తేదీలలో టెంపుల్ అనే నగరం లో జరిగిన మా 50వ టెక్సస్ సాహిత్య సదస్సు లో కూడా నాకు మొదటి ఫీలింగ్, అంటే నా డబ్బా నేనే ఎక్కువ కొట్టేసుకున్నానేమో అనిపించింది. కానీ ఆ రెండో ఫీలింగ్ అయిన అవమానం ఎక్కడా కలగ లేదు సారి కదా, పైగా నిర్వాహకులు నన్ను పొగిడినప్పుడు కాస్త సిగ్గు కూడా వేసింది. నిజానికి నన్ను ఎవరైనా, ఎందుకైనా పొగుడుతున్నప్పుడు మొహం ఎలా పెట్టాలో అస్సలు తెలీదు. అంచేత అలాంటప్పుడు అష్టవంకరలూ తిరిగిపోతూ ఉంటాను. ‘నీ మొహం ఎలా పెట్టినా అలాగే ఉంటుంది లే” అంటుంది మా క్వీన్ విక్టోరియా మొహం అదోలా పెట్టి!    

 

మా టెక్సస్ లో గత పాతికేళ్ళుగా  ఇంచుమించు ఆరు నెలలకి ఒక సారి ప్రతీ మార్చ్, సెప్టెంబర్ నెలలలో టెక్సస్ సాహిత్య సదస్సు లు నిర్వహించి కవులు, కథకులు, సాహిత్యాభిమానులు కలిసి హాయిగా తెలుగు లో మాట్లాడుకుంటాం. ఇది ఆస్టిన్, హ్యూస్టన్, శాన్ ఏంటోనియూ, డాలస్, టెంపుల్ నగరాలలో వంతుల వారీగా ఇప్పటి దాకా క్రమం తప్పకుండా జరిగి ఇప్పుడు 50వ సదస్సు వంతు చిన్న టెంపుల్ నగరానికి వచ్చింది. ఈ నగరాన్ని మేము గుడివాడ అని పిలుచుకుంటాం. అక్కడ మొత్తం తెలుగు వారి జనాభా వేళ్ళ మీద లెక్క పెట్ట వచ్చును. అయినా, ఆస్టిన్ నివాసి, ప్రముఖ రచయిత సత్యం మందపాటి గారి నాయకత్వం లో డా. సుమ & డా. ప్రసాద్ దంపతులు, డా. వై.వి. రావు & అంజలి దంపతులు ఈ సదస్సుని ఎంతో సమర్ధవంతంగా, ఆత్మీయంగా నిర్వహించారు. అన్నీ నగరాల నుంచీ మేము రాత్రి అక్కడ వారు ఏర్పాటు చేసిన హోటెల్ లో బస చేసి రెండు రోజులు మహదానందంగా గడిపాం. సుమారు 150 మంది  ఆ సదస్సు కి రావడం చెప్పుకోదగ విషయమే! 

ఇక నేను వేదిక ని “అలంకరించడానికి” ఏం చెయ్యాలా అని ఆలోచించి కొన్ని ట్రిక్కులు వేశాను. మొదటిది “The Science of Arunaprasna”- Cosmology to Quantum Physics” అనే గ్రంథం ఆవిష్కరణ. ఇది వ్రాసినది మా హ్యూస్టన్ మరియు కాకినాడ వాడూ, సంగీత విద్వాంసుడు, వేద పండితుడు అయిన అయ్యగారి సీతారామ్. అసలు భూమి ఎలా పుట్టింది, వాయువు, వర్షం, సూర్యరశ్మి, భూమ్యాకర్షణ శక్తి మొదలైన వాటి స్వరూపం ఏమిటీ ఇలాంటి అంశాల మీద వేదకాలంలో శాస్త్రీయ దృక్పధం మీద సోదాహరణగా సాగిన సీతారామ్ ప్రసంగం ఎంతో ఆసక్తికరంగా జరిగింది. ఈ గ్రంథ మూలం కృష్ణ యజుర్వేదం, తైత్తరీయ కారకం లోని ‘అరుణ ప్రశ్న”. మనకి ఇలాంటివి ఎలాగా అర్ధం కావు కాబట్టి ఎక్కువ మాట్లాడితే మన బండారం బయట పడుతుందేమో అని కేవలం  సీతారామ్ ని పరిచయం చేసి నేను మూసుకున్నాను. 

ఇక రెండోది ఘంటసాల గారి శత జయంతి సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ప్రచురించిన “మన ఘంటసాల” జీవిత కథ ఆవిష్కరణ. ఘంటసాల గారు బ్రతికి ఉన్నప్పుడే 1963లో ఈ గ్రంథ రచనకి ఆయన అనుమతితో స్వీకారం చుట్టినది  ప్రముఖ సాహితీ వేత్త, రేడియో ప్రయోక్త డా. పి.ఎస్. గోపాల కృష్ణ గారు. ఆయన ఈ గ్రంథాన్ని 1969 లో వ్రాయడం మొదలు పెట్టి, ఘంటసాల గారి నిర్యాణం తర్వాత కుటుంబం ప్రోద్బలంతో పూర్తి చేసిన ఆ గ్రంథం తొలి సారి 2003 లో ఘంటసాల గారి విగ్రహావిష్కరణ సందర్భంగా ఆత్మీయుడు ఎస్. పీ. బాలసుబ్రమణ్యం ముద్రించారు. ఇప్పుడు ఘంటసాల గారి శత జయంతి సందర్భంగా పున:ముద్రణ అవకాశం నాకు కలిగింది.  ఈ సదస్సుకి 96 సంవత్సరాల జ్ఞానవృద్ధులు శ్రీ కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి గారు రావడం, ఆయన రచించిన ఘంటసాల “పుష్ప విలాపం” బాణీలో  “కుసుమాభ్యర్ధన” గేయాన్ని ప్రముఖ గాయనీ, ఆయన కోడలూ అయిన శ్రీమతి మణి శాస్త్రి ఆలపించడం ఒక కొస మెరుపు. అలాగే పోతన గారి “ఎవ్వనిచే జనించు” పద్యాన్ని మా పప్పు సత్యభామ భక్తి పారవశ్యంతో ఆలపించగా నేను మా పుచ్చా మల్లిక్ వ్యవస్థాపకుడిగా పోతన భాగవత ఆణిముత్యాల సంస్థ రూపొందిస్తున్న పోతన భక్తి పద్యాల ఏనిమేషన్ చిత్రం గురించి సభికులకి పరిచయం చెయ్యడం నాకు మరపు రాని అనుభూతి.

పనిలో పనిగా- ఈ ఉగాది సందర్భంగా మేము నిర్వహించిన 28వ ఉగాది ఉత్తమ రచనల పోటీలో ఉత్తమ కవిత గా బహుమతికి విజేతగా నిలిచిన ఇంద్రాణి పాలపర్తిని సభాముఖంగా శాయి రాచకొండ నగదు బహుమతితో సత్కరించగా నేను కాలర్ ఎత్తుకున్నాను. ముందే మనవి చేసుకున్నట్టుగా, ఈ పిచ్చా పాటీ అంతా స్వీయ మర్ధన అనబడు సొంత డబ్బా కోసమే కానీ 50వ టెక్సస్ సదస్సు సమీక్ష కోసం కాదు. అది వ్రాయాలంటే అబ్బో, సుమారు 50 ప్రసంగాలూ, స్వీయ కవితా పఠనాలూ,  నాట్య ప్రదర్షనలూ, సంగీత కార్యక్రమాలూ, ఇర్షాద్ నిలబడే హాస్యం, ఊరిమిండి నర సిం హా రెడ్డీ "సిరి సంపదలు" క్విజ్- ఇలా ఒకటా, రెండా? ఇలా చాలానే ఉన్నాయి మరి.

 మొత్తానికి తెలుగు సాహిత్య, సంగీత, జానపద, ఆధ్యాత్మిక, నాట్య కళా రంగాల పరంగా ఈ 50వ టెక్సస్ సాహిత్య సదస్సు అందరికీ ఎంతో ఆనందాన్నీ, ఉత్సాహాన్నీ కలిగించింది. ఇక మా క్వీన్ విక్టోరియా అయితే అక్కడికి వెళ్ళిన మరు క్షణం నుంచీ నన్ను పూర్తిగా మర్చిపోయి, అంతా అయ్యాక “మా డ్రైవర్ ఏడీ?” అని మాత్రమే నన్ను గుర్తుకు తెచ్చుకుంది. 

నా అసలు అనుమానం ఏమిటంటే- ఇలాంటి ఆహ్లాదకరమైన సాహితీ సదస్సులు మా అమెరికాలో ఇతర రాష్ట్రాలలోనూ, ఇతర దేశాల లోనూ, ఆ మాటకొస్తే తెలుగు రాష్ట్రాల లోనూ జరుగుతాయా? జరగకపోతే ఎందుకు జరగవూ?  

*****

bottom of page