top of page

“దీప్తి” ముచ్చట్లు 

బతుకు దోవలు

Deepthi Pendyala.jpg

దీప్తి పెండ్యాల

"స్వర్గమింత బోరనుకోలేదే రాణమ్మా. చిన్ని పువ్వులు, చిన్నారి నవ్వులు ఏమీ లేని లోకమదేతైనేమి, నాకొద్దే వద్దు. స్వర్గమట, స్వర్గంలో ఆనందమేముందే?  నేను స్వయంగా పెంచిన మొక్క పూలు పూస్తేనో, కాయొకటి కాస్తేనో, ఆ కాయతో ఏదయినా చేసుకు తింటేనో కలిగే ఆనందం ఎంతుండేది ఆ భూమ్మీద. ఇపుడదేమీ లేదు. పొద్దస్తమానూ తినటం, పడుకోవటం, ఎప్పుడూ అదే అమృతం. తీపనుకుంటే తీపిగా. కారంగా కావాలనిపిస్తే కారంగా. ఓ రుచీ చెడదు, ఓ ఆహా అనో అనిపించదు. ఎట్లాగే ఇక్కడ?  ఛ. భూమ్మీదే బావుండేది". గొణుక్కుంటూనే ఉంది వేణి.

రాణమ్మకి మాత్రం ఇదంతా సరదాగానే ఉంది. ఆమె చేతులు కాల్చుకోకుండా, వంటగదిలో పడీ, పడీ వంట చేయకుండా, ఓ ముద్ద ఆమె నోటి వైపు వెళ్ళిన రోజులు వేళ్ళమీద లెక్కబెట్టొచ్చు. అందుకే అనుకుంది. ఈ వేణికేం? కలిసొచ్చే కాలానికి వంటొచ్చిన కోడలొచ్చి, వండిపెట్టేసరికీ అంతా చెల్లింది కానీ, తనకంత అవకాశమేదీ? కొడుకో కోపిష్టి.  అమాయకపక్షి కోడలికి వాణ్ణి, పిల్లలని సంభాళించుకోవటమే కష్టమని తెలిసి, జాలితో వాళ్ళ సంసారానికి దూరంలో ఉన్నట్టే ఉంటూ, ఆ పిల్లకి తోచినపుడు వంటసాయం చేయటమే సరిపోయేది. అది కాకున్నా, ఎపుడూ ఏదో ఆరాటమే.  ఇక్కడయితే అసలు ఆకలి గొడవా లేదు. పూటకింత ఏదో వండుకు తినాలన్న బాధా లేదు. అక్కడ చుట్టాలు పోతే ఆ ఇంటోళ్ళని పలకరిద్దామన్నా, కదలనీయని బాధ్యతలుండేవి. ఇపుడో? పోయినోళ్ళనెవరిని తలుచుకుంటే వాళ్ళెదురుగా వాలిపోతారు. హాయిగా నా అనుకున్నవాళ్ళని ఎపుడంటే అపుడు చూడొచ్చు. కళ్ళు కావు కదా, మనోచక్షువులంటారట వీటిని. నోరే తిరగదు. వీళ్ళు చెప్పే పేర్లకి. ఆ పేర్లు తప్పితే అంతా బాగే.

పైగా, ఇక్కడయితే ఎక్కడికీ నడవక్కర్లేదు! ఎక్కడకి వెళ్ళాలనుకుంటే అక్కడే వాలిపోతుంది. అదే భూమ్మీదయితేనా. అపుడపుడూ పండుగలకో, సందర్భాలకో పుట్టింటికి,  అవసరం పడితే పిల్లలింటికో తప్ప రోజూవారీ జీవితంలో  ఇల్లు, పక్కనున్న గుడి, మంగళవారాలప్పుడు సంత కాక ఎక్కడికెళ్ళిందీ లేదు. ఈ మూడింటికీ నడుచుకుంటూ వెళ్ళటమే. ఆటోకి డబ్బులుపెట్టే స్థోమత లేక కాళ్ళీడ్చుకుంటూ సంచులు మోస్తూ ఇంటికి రావటం. ఆ నడకలో మాత్రం ఎవరితోనయినా మాట్లాడేందుకు చిక్కేదా? మధ్యాహ్నం ఆఫీసునుంచి మధ్యాహ్నం భోజనానికని మొగుడొచ్చేలోపల వండాలాయె. ఇల్లు త్వరగా చేరి, ఆకుకూరలన్నీ ఏరి, కూరగాయలన్నీ వేటికవి విడిగా సర్దిపెట్టేసి, వంట చేసుకోవాలన్న ఆరాటంలో గబగబా పరిగెత్తినట్టే నడుచుకుంటూ ఇంటికి వెళ్ళటం గుర్తొచ్చింది రాణమ్మకి. మళ్ళీ అంది "నాకిదే బాగుందే వేణీ!”

 

"ఏం బాగుందే రాణమ్మా? నీ మొహం. అక్కడ చూడు నీ పిల్లలు నిన్ను వదిలుండలేక ఎట్లా ఏడుస్తున్నారు పాపం?  నీ మనవరాలు పురిటికొచ్చే సమయానికి నీ ఆసరా లేకుండా పోయిందని నీ కూతురెంత బాధపడుతుందే?"

 

వేణి మాటలకి రాణమ్మ భూమ్మీదకి చూసింది. బిడ్డ మొహంలో నెలరోజులు గడిచినా ఇసుమంతయినా వీడని విషాదం. కడుపుంటే తరుక్కుపోయేది. "అవునే పాపం, దాని మొగుడు ఉత్తి మూగకొయ్యలా కూర్చుంటాడు. ఏ బాధో సంతోషమో, ఏదొచ్చినా పిచ్చితల్లి నాతో చెప్పుకొనేదే కానీ, మొగుడితో ఓ ముచ్చటన్నదే లేదు. అన్నిటికీ  గోడలా విని, ఊ కొడతాడు. అటు చూడు, పిల్ల వెక్కి వెక్కి ఏడ్చిందా, అల్లుడికి మాత్రం ఠంచనుగా ఆకలి. 'అయ్యో, తల్లి లేక దీనికి మనసేం బాలేదు, ఓ పూట వండిపెడదామ'నీ తోచదు. పిల్ల సగమయింది నామీద బెంగతో. నా మనవరాలు చూడు. ఉత్తినే అటు పుల్ల తీసి ఇటు పెట్టదు, ఇపుడయితే కడుపుతో ఉంది.  రేపు దానికో పిల్ల పుట్టాక ఏం చేసుకుంటుందో ఏమో. నా బిడ్డకి కష్టమేనే. పనే బతుకు.”

 

వేణి ఓదార్పుగా భుజం తట్టబోయేందుకు లేని చేతిని పైకెత్తబోయి, కుదరదని గుర్తొచ్చి, లేని నాలుక కరుచుకుంది. "అదేగా అంటూంటా. భూమ్మీదే బాగుండేదనిపించట్లా?"

తలాడించాలనుకుని ఆగిపోయింది రాణమ్మ. తల లేక కాదు. లేని తలలో ఏదో తట్టినట్టయి. "అమ్మో, ఏమీ బాగుండేది కాదులే. అక్కడే ఉండుంటే ఇపుడు ఈ పిల్ల పురిటి పనులూ, తరువాత కోడలికి ఆపరేషనూ- ఇవన్నిటినీ సంభాళించుకునేందుకు ఆరోగ్యమెక్కడిదే. చేయలేక ఊరుకోలేనూ, చేసేందుకు కాళ్ళు లేవవూ. ఒకటే నొప్పులు. ఆ నొప్పి తలుచుకుంటే ఇదే సుఖమనిపిస్తుందే. ఇరవయేళ్ళు ఆ నొప్పులు భరించలేదూ? ఎన్ని డాక్టర్ల చుట్టూ తిరిగానే? ఆ సుక్కూరులో వెళ్ళి నెలరోజులు లేనూ? ఆయనెవరో ఆకుపసరు వైద్యంతో తగ్గిస్తానంటే? ఎన్ని చోట్లు తిరిగాను? ఏ మందో పనిచేసి కాళ్ళనొప్పులు తగ్గుతాయనీ?  ఆఖరికి మన వీధిలోని ఆరెంపీ డాక్టరు గుహానందం ఇచ్చిన ఎక్స్పైరీ అయిన మందు వికటించి,  ఇక్కడొచ్చిపడితే తప్ప తప్పలేదా బాధ." హాయిగా గాలిలో తేలుతూ, కాళ్ళే లేని తేలికతనాన్ని అనుభూతిస్తూ అంది రాణమ్మ.

పేరు తలవగానే గుహానందం వచ్చి రాణమ్మ దగ్గరే వాలాడు. "ఏదోరకంగా తగ్గించాగా?" అనేసి, మళ్ళీ ఎవరు తలుచుకున్నారో ఎటో వెళ్ళాడు.

 

గుహానందం ఎగిరినవేపు చూస్తూ అంది రాణమ్మ. " పదుగురికీ ఒకేరోజు ఎక్స్పైర్డ్ మందులిచ్చి ఇక్కడికి రప్పించి బాధలు తొలగించిన పుణ్యం, అదేరోజు పోలీసులని చూడగానే గుండాగిపోయి ఇటే వచ్చాడు, మనతోపాటు. పుణ్యాత్ముడు. చల్లగుండనీ."

 

వేణి  లేని కనుబొమ్మలు ముడిచి, పాత పాటే పాడింది. "నాకయితే భూమ్మీదే బాగుండేదే? వీడు అన్నేయంగా నన్నూ పంపించాడిక్కడికి." భూమ్మీదున్న ఇంటివేపే చూస్తూ అనుకుంది.

 

రాణమ్మకి వేణి తీరు ఎపుడూ అర్థమే కాలేదు. రాణమ్మ పక్కిల్లే వేణిది. మొదట్నుంచీ హాయిగా గడిపేది. పిల్లలు పుట్టలేదని వేణి భర్త వాళ్ళ పెళ్ళయిన కొత్తల్లో ఎపుడయినా దిగులుపడేవాడేమో కానీ, వేణి మాత్రం ఎపుడూ హాయిగా ఏదో చదువుకుంటూనో, తోటలో తిరుగుతూనో గడిపేది. దేవుడేదిస్తే అది సంతోషంగా తీసుకోవాలనేది. చెల్లి, చెల్లి భర్త పోతే వాళ్ళ పిల్లాడిని తెచ్చి ఆ మొక్కల్లాగే వాడినీ ప్రేమగా పెంచి, పెద్ద చేసి, పెళ్ళి చేసింది. వాళ్ళు ఇల్లు వదలమంటే ఉండిపొమ్మంది. ఒక్క మనవడు పుడితే వాడితోనూ ఆడుకుంది. వేరే ఏ ఝంఝాటాలు లేవు. పెట్టుకోలేదు. ఇపుడెందుకో ఈ ఆఖరి ప్రయాణాన్ని కూడా దేవుడిచ్చిందని తీసుకోదేం?

 

అదే అడిగింది ఉండబట్టలేక వేణిని."ఎందుకుండలేకపోతున్నావే? ఏమయింది. భూమ్మీద నాకు చెప్పకుండా ఏం దాచుకున్నావేంటి?" వేళాకోళంగా అడిగింది.

 

"కాదే రాణమ్మా, ఒకటి చెప్పూ. నా తోటలో ఎన్ని చెట్లున్నాయో తెలుసా నీకు?"

 

రాణమ్మ గుర్తు తెచ్చుకోబోయింది. గుమ్మం దాటినపుడల్లా వేణి ఇల్లు దాటుతూనే వెళ్ళింది. ఎటు బయల్దేరినా వేణి చెయ్యూపి లోనికి రమ్మనేది. తనకంత సమయమెక్కడిదీ? ఎపుడూ హడావిడిగా ఏదో పనిపైన ఆరాటమో, లేదంటే నొప్పితో దిగులో ఏదయితేనేం, తోటని పరికించి చూసిందే లేదు. మరి ఎన్ని చెట్లున్నాయో ఎప్పుడు చూసింది కనుక? ఊరికే వేణి అంటూంటే లీలగా గుర్తొస్తుంది. అందంగా అయితే ఉండేది, అందాలను చూసుకుంటూ ఆగిపోయే తీరికెపుడుందనీ?  అదే చెప్పింది వేణితో.

 

" పోనీ, ఇప్పుడు చూడే ఒకసారి. చివరికి నీకిప్పటికి ఖాళీ దొరికిందికదా." వేణి అంటూంటే తోట వైపు చూసింది.

 

"అబ్బో, ఎంత బాగుందే వేణీ.  వేరే పనిలేక, ఎంతసేపూ ఆ మొక్కల్లో తిరుగుతావనుకున్నా కానీ, ఇంత పనీ నువ్వే చేసావంటే మెచ్చుకోవచ్చు. నీకలా కుదిరింది. అందుకే దాన్ని వదలటం కష్టంగా ఉన్నట్టుందే నీకు."

 

"అదే మరి. నాకూ కుదరలేదే. కుదుర్చుకున్నా. నేను బతికానే. ఈ చేతులతో అన్నీ ఇష్టంగా చేసుకున్నా. ప్రతీదీ నచ్చినట్టు మలుచుకున్నా. నా ప్రపంచం నేనే తయారుచేసుకున్నా. పరుగులు తీయలేదు.  నడుస్తూ చేసుకున్నా. అందుకే ఏదీ పననిపించలేదు. ఓ పువ్వు పరికించేందుకు సమయం ఉంచుకున్నాను, ఓ నవ్వు నవ్వేందుకు ఉల్లాసం నింపుకున్నాను. అదంతా వదిలే వచ్చాను. ఇపుడిక్కడ ఏదీ నేను సృష్టించుకోలేను. భూమ్మీదే బాగుండేది. చేతులూ, కాళ్ళుండేవి"  వేణి ఏదో వేరే ధోరణిలో ఉన్నట్టుగా చెప్పింది.

 

రాణమ్మకి వేణి గోల ఏమీ అర్థం కాలేదు. ఒకటర్థమయింది. కాళ్ళ నొప్పుల్లేకుంటే తనెంతో కొంత బాగా బతికేదని. బావున్నవయితే ఎప్పటికీ అలాగే ఉంటే బాగుండనిపించేదేమోనని. అర్థమైనంతలో ఊరడించేందుకు "పోనీలే, అలాంటి తోట ఇక్కడా కావాలనుకుందాం. వచ్చేస్తుంది. " అంది రాణమ్మ.

 

వేణి  మళ్ళీ అందుకుంది. "అలాంటిది ఏం ఖర్మ. వాళ్ళెవరూ పట్టించుకోక నాలుగు రోజులయ్యాక, అదే ఇక్కడికి వస్తుందిలే. అక్కడ ఎండిపోయినా, ఇక్కడ పచ్చగా బతుకుతుంది. నేనూ ఇక్కడే ఉంటాను. చూస్తాను. కానీ, చూస్తానంతే. భూమ్మీదే బాగుండేదే. చేతులూ కాళ్ళూ.--"

 

రాణమ్మకి కాళ్ళనగానే మళ్ళీ లేని గుండె ఝల్లుమంది. కాళ్ళనొప్పుల నరకం గుర్తొచ్చింది. "అబ్బబ్బా. నీ చేతులూ కాళ్ళ పురాణమాపవే. నీ చావు నువ్వు చావు. నన్ను బతకనివ్వవే. నాకిక్కడే బావుంది." అంటూ ఎగిరిపోయింది.

వేణి ఆ మాటలకి నవ్వేసింది. "సరేలేవే, బతుకుపో. ఇక్కడయినా."

*****

bottom of page