
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
కవితా మధురాలు
-వాడ్రేవు చినవీరభద్రుడు

సంపాదకుల ప్రత్యేక ఎంపిక
కోకిల ప్రవేశించే కాలం
అడవి మధ్య కొండవారినొక
ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు.
ప్రేమతో మమ్మల్ని కన్నారు,
పూల గాలులతో ఉగ్గు పోశారు.
కష్టించి పనిచేశారు, పూర్ణ
జీవితం కలిసి పంచుకున్నారు.
ఇంటి ముంగిట పచ్చని పందిరేసి
అతిథుల కోసం ఎదురు చూశారు.
జీవించగలిగినంత కాలం జీవించాక
ఎవరినీ నెపమెంచకుండా వెళ్లిపోయారు.
మామిడి చెట్లు పూచిన దారిన మా నాన్న,
విరబూసిన వేపచెట్ల తోవన మా అమ్మ.
ఇప్పటికీ ఆ చెట్ల నీడన పొదరింటిలో
వారిద్దరూ మసలుతున్నట్టే ఉంటుంది,
కన్నవారి కబుర్లు కడుపులో పెట్టుకుని
కోకిల ప్రవేశించే కాలమొకటి తిరిగొస్తుంది.
(కోకిల ప్రవేశించే కాలం కవితా సంపుటి నుండి)
-పాలపర్తి ఇంద్రాణి

ఆ రోజుల్లో
కంటి కొస
దివిటీలను
వెలిగించిన
రోజుల్లో
పంటి మెఱుపు
చంద్రకాంతిని
మింగిన
రోజుల్లో
నడక చురుకు
చిఱుత పరుగును
మించిన
రోజుల్లో
చిటికె వేస్తే
పువ్వులు విచ్చేవి
ఆవులిస్తే
తారలు వాలేవి
అడుగు వేస్తే
పచ్చిక మొలిచేది
తిరిగి చూస్తే
వెన్నెల కురిసేది
జీవన
లాలస
పొంగులు
వారిన
ఆ రోజుల్లో
కంపించే
హృదయం
కారణం లేని
నవ్వులని
ప్రసాదించేది
అది తరచూ
ఏ కొమ్మకో చిక్కి
ఉండుండి
మతిమాలిన
ప్రేమ గీతికలు
పలవరించి
బెంగటిల్లేది
నివుఱు
కప్పిన
కామన
కమ్ముకున్న
ఆ వెచ్చని
రోజుల్లో

-గరికపాటి పవన్ కుమార్
కన్నొకటి కావాలి
కన్నొకటి కావాలి నాకు
గరికపాటి పవన్ కుమార్
ఈ రచన సాధ్యం కాదు
కరిగిపోయిన మంచు శిల్పం
పునర్నిర్మించలేనట్లు,
ఎగసిపడే కెరటంలా ఉండే
నా చేయిప్పుడు బిగుసుకుపోయింది
ఇప్పుడు నాకొక కన్ను కావాలి
పొరలు లేనిది
కనురెప్పలు లేనిది
రాత్రీ పగలు తేడా తెలియని
పసిపాప నవ్వులాంటి
తెల్లని కలువ కన్ను
బ్రహ్మాండ విస్ఫోటనాలను
ఖగోళంలో విహరించే
అనేక సూర్యుల రహస్యాలను
తదేకంగా గమనించే
నక్షత్రంలాంటి
కన్నొకటి కావాలి నాకు
సమ్మెటపోటులతో ఆగిన గుండెల్లో
కొట్టుకొని బయటికి రాలేక
తట్టుకొని నిలిచిపోయిన
దట్టపు చీకటిని చూడగల
నిశితమైన
కన్నొకటి కావాలి నాకు
నల్లని నువ్వుల నూనెలో
సగం కాలి మాడిపోయిన
పచ్చని వత్తిని
తిరిగి ప్రజ్వలంగా వెలిగించగలిగే
నిప్పుకణం లాంటి
కన్నొకటి కావాలి నాకు
ఛిద్రమైన గాజు ముక్కలని
అదే వేగంతో దరిజేర్చి అతకగల
కన్నొకటి కావాలి నాకు
ప్రచండంగా మండుతూ
గడ్డకట్టిన కాలాన్ని ప్రవహింపజేసేది
కావాలిప్పుడు నాకు
కన్నొకటి
-బారు శ్రీనివాసరావు

అమెరికా ప్రయాణం
ఇల్లు తాళం వేస్తుంటే
ఇల్లాలిని పురిటికి పంపినంత గుబులు
ఈడు రాని కూతుర్ని అత్తారింట్లో దింపినంత దిగులు
అర్ధంకాని రిపోర్టులు , ఆర్నెల్లకు మందులు
స్వెట్టర్లు,సల్వార్లు,
ఇరవై డాలర్లు, ఇన్సూరెన్స్ కార్డులు
భూమినొదిలి రోదసికి పోయినట్లుంటుంది
ఐనవారున్నా అగమ్య ప్రయాణం అనిపిస్తుంది
ఈసురోమనే వీధుల్లో విసిరేసిన ఇళ్ళు
ప్లాస్టిక్ నవ్వులు, పల్చటి కబుర్లు
ప్రతిరోజూ చూసే మనవడి బడి
నెలకోసారి అనవసరంగా గుడి
పంటినొప్పంటే గుండెనొప్పంతా భయం
సాయానికి జోక్యానికి మధ్య నాదొక త్రిశంకు స్వర్గం
పిల్లలను చూడాలన్న ప్రతిసారి పరాధీనత ముంచుకొస్తుంది
రావిమాను నుంచి నేను మల్లెతీగ అయినాననిపిస్తుంది