top of page

ఎన్నారై కాలమ్ - 6

6. కాశీనాథుని కథానాయికలు

 

Satyam Mandapati Madhuravani.com

సత్యం మందపాటి

ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో మనందరి అభిమాన దర్శకులు శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ గారు తనకు ఇష్టదైవమైన శివుని మెడలో తన సంగీత సాహిత్య నృత్య కళా సంపదల శంకరాభరణం వేయటానికి మనల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయారు. 

పాశ్చాత్య నాగరికతా ప్రభావంతో రెపరెపలాడుతున్న మన సంప్రదాయ కళలను ఆయన ఎంతో గొప్పగా మనందరికీ గుర్తు చేస్తూ మన హృదయాలకు ఎంత దగ్గరయారో ఆయన చిత్రాలు చూసిన, చూస్తున్నవారందరికీ తెలుసు. ఆయనకు ప్రపంచ కళా పిపాసులమందరం శిరస్సు వంచి నమస్కారం చేద్దాం. 

ఆయన చిత్రాల మీద ఎంతోమంది స్పందన రకరకాల మాధ్యమాల ద్వారా మనకి తెలుస్తూనే వుంది. వాటి గురించి మళ్ళీ ఇక్కడ వ్రాయటం అనవసరం. 

కానీ ఆయన సినిమాల్లోని సాహిత్యం, సంగీతం, నృత్యం, నటన, దర్శకత్వం ఇలా అన్నీ పూర్తిగా ఆస్వాదిస్తూనే వున్నా, ఒకానొక రచయితగా నేను పరిశీలించిన విషయం చెబుతాను. కథా రచయిత విశ్వనాథ్ కథలోనూ, కథనంలోనూ తనని తానే సవాల్ చేసుకుంటూ, ఎంతో క్లిష్టమైన సందర్భాలు, సంఘటనలూ సృష్టించుకుని వీరాభిమన్యుడిలా ఆ పద్మవ్యూహంలోకి చొచ్చుకుపోతుంటే, ఈయన ఆ పరిస్థితిలోనుంచీ ఎలా బయటకి వస్తారా, అసలు రాగలరా అని నాకు భయం వేసేది. కానీ ఆయన నాబోటి మీబోటి పాఠకులనూ, ప్రేక్షకులనూ నిబిడాశ్చర్యంలో ముంచేసి, ఎంతో చక్కగా అందరినీ ఒప్పిస్తూ బయటికి రావటం చూస్తుంటే, ఆయన్ని అందరూ అంత గొప్ప దర్శకుడు అని ఎందుకు అంటారో, ఆయన కళాతపస్వి ఎందుకు అయారో సులభంగా అర్ధమవుతుంది. దాదాపు ఆయన తీసిన అన్ని చిత్రాల్లోనూ అలాటి ఆయన ముద్ర కనపడుతూనే వున్నా, ఒక సప్తపది, స్వాతిముత్యం, స్వాతికిరణం, శంకరాభరణం, సిరివెన్నెల, స్వర్ణకమలం, సాగరసంగమం, శుభలేఖ, చెల్లెలి కాపురం ఆయన కథ కూర్చి తీసిన ఏ చిత్రమైనా సరే నిశితంగా చూస్తుంటే విచిత్రంగా వుంటుంది. అంత గొప్ప కథనం కోసం ఆయన ఒక గొప్ప రచయితగా ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది. 

ఆయనే అంటారు, “అలా ఎందుకు చేస్తానంటే అదే నాకు ఇష్టం కనుక. నా ప్రేక్షకులు కూడా అదే కోరుకుంటారు. కాకపోతే నాకూ, నా మాటల, పాటల రచయితలకూ ఎన్నో రాత్రులు నిద్ర ఉండేది కాదు” అని.

అవును ఏదో కథ అడిగారు కదా అని ఏదో వ్రాసేస్తే పోలేదా అనుకుంటూ మామూలుగా వ్రాస్తే దాంట్లో మజా ఏముంటుంది? 

 

***

రచయిత విశ్వనాథ్ గారి గురించి నా మనసులోని మాట చెప్పేశాను కనుక ఇక అసలు విషయంలోకి వెడదాం. అదే “కాశీనాథుని విశ్వనాథ్ గారి కథానాయికల” గురించి. 

ఏమిటి ఆయన నాయికల గొప్పతనం లేదా వైవిధ్యం లేదా వైశిష్ట్యం? అదే చూద్దాం. 

ఆయన చిత్రాల నాయికలు మనం రోజూ మన చుట్టూ చూసేవారే. వాళ్ళు ఎక్కడినించో ఊడిపడరు. కాకపోతే ప్రతివారిలోనూ ఏదో ఒక్క సమస్యతో కూడిన విశేష గుణం కనిపిస్తుంది. ఇలాటి ప్రతి స్త్రీ పాత్ర వెనుకా, బయటికి చెప్పుకోలేని, చెప్పని ఆ విశేషాన్ని రచయిత విశ్వనాథ్ ఎలా బయటికి తీసుకు వస్తారో, ఆ సమస్యకు ఎంత చక్కగా పరిష్కారం ఇస్తారో చూస్తే ఒళ్ళు పులకరిస్తుంది.

మొట్టమొదటగా ‘సప్తపది’ చిత్రం తీసుకుందాం. ఈ చిత్రంలో సబిత నటించిన పాత్ర హేమ. తాత యాజులుగారికి, ఆయన పుత్రుడూ తన మేనమామ అవధానిగారికి, హేమ తల్లిదండ్రులు కొన్ని కారణాల వల్ల దూరమవుతారు. యాజులుగారి ప్రాణ స్నేహితుడు రాజుగారు ఆ రెండు కుటుంబాలనీ మళ్ళీ కలపాలనే ఉద్దేశ్యంతో, అమ్మవారి ఉత్సవాల్లో హేమ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేస్తాడు. హేమ నృత్యానికి మురిసిపోయన యాజులు తన మనవడు గౌరీనాథంతో అప్పటికప్పుడు హేమ వివాహం ఏర్పాటు చేస్తాడు. ఇది ఇప్పటిదాకా మామూలు కథే. ఎవరైనా వ్రాయగలరు. కానీ ఇక్కడే పెద్ద మలుపు. హేమ అమ్మవారి నృత్యం చేస్తున్నప్పుడు చిన్నప్పటినించీ ఆ గుడికే అంటుకుపోయిన గౌరీనాథానికి హేమలో అమ్మవారే కనిపిస్తుంది. భక్తితో పరవశించి పోతాడు. ఆ అమ్మవారికి తలవంచి నమస్కారం చేస్తాడు. తాత, తండ్రుల మాట కాదనలేక బలవంతపు పెళ్ళి చేసుకున్నా, అతనికి నిత్యం తన భార్యలో పవిత్రమైన అమ్మవారే కనిపించి ఆమెను తాకను కూడా తాకడు. ఇక్కడే కథ ఇంకొక మలుపు తిరుగుతుంది. హేమ తన నృత్యానికి సంగీతం అందించేవారిలో మురళి వాయించే హరిబాబు అంటే ఇష్టపడుతుంది. ఇక్కడ సమస్య ఏమిటంటే ఆమె సంప్రదాయ బ్రాహ్మణ యువతి, అతను హరిజనుడు. ఈ మలుపు విశ్వనాథ్ గారిని పూర్తిగా పద్మవ్యూహంలోకి తీసుకువెడుతుంది. నిజంగా అది మొట్టమొదటిసారిగా చూస్తున్నప్పుడు రచయితగా ఆయన ఎలా బయటికి రాగలరా, ఈ సమస్యకి ఏ పరిష్కారం ఇవ్వగలరా అని గాభరాపడ్డాను. హేమ తెలివైన యువతి. తనికి ఏమి కావాలో తెలుసు. కానీ సంప్రదాయ వాతావరణంలో పెరిగిన యువతి. అప్పుడే దగ్గరైన ఆ రెండు కుటుంబాలనీ మళ్లీ వేరు చేయలేదు. ఇటు తను మనసా, వాచా ప్రేమించిన అతన్ని కులం పేరుతో దూరం చేసుకోలేదు. ఇది విశ్వనాథ్ చిత్రం కనుక ఏ పాత్రకీ ఎక్కువ మాటలుండవు. ఆయన దృశ్యపరంగా చిత్రీకరణలో చూపించేవే మాటలు. అందుకే ఎంతో అభినయ విశిష్టమైన కూచిపూడి నృత్యంలో దిట్ట సబితని హేమ పాత్రకి ఎంచుకున్నారనిపిస్తుంది. ఆమె కళ్ళూ, ముఖకవళికలు చాలు కథ చేప్పేయటానికి. తన మిత్రులు రాజుగారి మాటలతోనూ, శంకరాచార్యులవారు ఒక మాలవాడికి ఎదురు వచ్చిన సన్నివేశం చూపిస్తూనూ, యాజులుగారిలో పెద్ద మార్పే తెప్పించారు విశ్వనాథ్ గారు. ఏ కులమూ నీదంటే గోకులమే మాది అన్నారు. గోకులంలో పెరిగిన శ్రీకృష్ణుడినే భగవానుడిగా పూజించే మనకు, మరి కులమనేది అడ్డమవుతుందా? నేను అంత పెద్ద మార్పు మూడవతరం గౌరీనాథం దగ్గరనించో, రెండవతరం అవధానినించో వస్తుందని అనుకున్నాను. కానీ ఇది ఎంతో కట్టుదిట్టమైన సంప్రదాయభూషితమైన మొదటితరంనించీ రావటం అబ్బురపరుస్తుంది.

ఇక్కడ హేమ ఏ విధమైన ప్రసంగాలూ చేయదు. హరిబాబు మీద ప్రేమ చూపిస్తూనే వుంటుంది. భర్త తనని తాకడు. అయినా సంప్రదాయాన్ని ఎదిరించి బయటికి రాదు. చాల క్లిష్టమైన పాత్ర. ఆ పాత్ర ద్వారా ఉపన్యాసాలేమీ ఇప్పించకుండా, కేవలం దృశ్య మాధ్యమాన్ని ఎన్నుకుని, సందర్భోచితమైన పాటలతో విశ్వనాథ్ గారు చేసిన ఆ పాత్ర పోషణ అమోఘం. ఆ సమస్యా పరిష్కారం మన సమాజానికి ఒక దారి చూపిస్తుంది.

ఇక ‘శంకరాభరణం’ చిత్రంలో శంకరశాస్త్రి హీరో. మనం కాదనలేము. కానీ మంజు భార్గవి వేసిన “తులసి” పాత్ర ఎంతో విశిష్టమైనది. ఆమె ఒక వేశ్య కుటుంబంనించీ వచ్చింది. దేవాలయాల్లో చక్కటి నృత్యాలు చేస్తున్నా, తులసిని ఆ వేశ్యా వృత్తిలోకే దించాలని ఆమె తల్లి దురాలోచన. సంగీత, నృత్యాలకు తన జీవితాన్నే అర్పించిన తులసికి అది ఏమాత్రం ఇష్టం లేదు. చివరికి బలవంతాన ఒక రసికుడికి తులసిని అర్పిస్తుంది ఆమె తల్లి. ఆ కారణంగా తులసికి ఒక కొడుకు పుడతాడు. ఆ పిల్లవాడిని శంకరశాస్త్రిగారి దగ్గర శిష్యుడిగా చేర్చి, ఎంతో గొప్ప సంగీత విద్వాంసుడిగా చేయాలని ఆయనకు దగ్గరజేస్తుంది. చివరకు శంకరశాస్త్రి ఆర్థికంగా చితికిపోయినప్పుడు ధన సహాయం చేసి, తనకి దొరికిన అటువంటి సేవకు మురిసిపోయి ఆ విద్వాంసుడి వారసుడిగా తన కొడుకుని మిగిల్చి, తనువు చాలిస్తుంది. 

మంజు భార్గవి కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న నృత్య కళాకారిణి. ఆవిడకు చిత్రం మొత్తం మీద మూడో నాలుగో డైలాగులు. ఈ పాత్రకూడా తన కూచిపూడి హావభావాలతోనే కథను నడిపిస్తుంది. బురదలో ఉండే పురుగులు, బురదలోనే ఉండనక్కరలేదు, బురదలోనించీ బయటికి వచ్చి మాణిక్యాలు అవవచ్చు అని నిరూపించే పాత్ర. ఎంతో వైవిధ్యం ఉన్న పాత్ర. నటనలో విశ్వనాథ్ గారి నటనా పాఠశాల నించీ బయటికి వచ్చి బంగారు పతక స్థాయిలో పాత్రపోషణ చేసింది మంజు భార్గవి. 

ఇక్కడ నాకు ఆ సినిమా ఎన్నోసార్లు చూశాక అనిపించింది, ఈ చిత్రానికి పేరు శంకరాభరణం శంకరశాస్త్రి గారి వల్లే కాకుండా, ఈ కథానాయికవల్ల కూడా వచ్చిందేమో అని. తన తల్లి దుర్భుద్ధితో విటుడు తులసి శీలాన్ని అపహరించే సమయంలో ఆమె పరుగెత్తుకుంటూ ఒక విషపు పాములా వున్న, వ్రేలాడే ఒక దీపాన్ని గుద్దుకుని దెబ్బతినటం, ఆ విషపునాగు కామం కాటు వల్ల పుట్టిన పిల్లవాడిని ఆయన చేతిలో పెట్టి ఒక గొప్ప సంగీత విద్వాంసుడిగా చేయటం, ఆ వేదికపైనే అతన్నిశంకరశాస్త్రిగారి వద్దే చేర్చి, ఆయన పాదాల దగ్గరే తనూ ప్రాణాలు వదలటం అదేనేమో విశ్వనాథ్ గారు తులసి పాత్ర ద్వారా తన ఇష్టదైవమైన శంకరుడి మెడలో వేసి సమర్పించిన శంకరాభరణం. 

విశ్వనాథ్ గారి గురించి మంజు భార్గవి మాటలు- “నేను నటిని అని నాకు తెలియదు. నాకు నృత్యం తప్ప వేరే లోకం లేదు. అలాంటి పాత్ర నాకు ఇవ్వటం, నాలోని కూచిపూడి అభినయాన్ని పూర్తిగా వెలికితీసి, అంత క్లిష్టమైన పాత్ర పోషణకి తగినట్టు ఉపయోగించుకున్న గురువుగారికి నేను ఋణపడివున్నాను”   

పై రెండు చిత్రాలు “ఆచార వ్యవహారాలు అనేవి సమాజంలో ఒక క్రమశిక్షణ కోసమేగానీ, కులం పేరుతో మనుష్యులను విడదీయటానికి కాదు” అనే సందేశం మీద ఆధారపడిన రెండు వైవిధ్యమైన కథనాలే. 

‘స్వాతిముత్యం’ కథానాయికలో ఇంకొక కోణం చూడవచ్చు మనం. భర్తను కోల్పోయిన లలిత తన ఐదేళ్ళ కొడుకుతో అన్నావదినల పంచన చేరుతుంది. తన అన్న మంచివాడే అయినా, వదిన సాధింపులతోనూ, పెట్టే కష్టాలతోనూ వేరే గత్యంతరం లేకపోవటం వల్ల అవి భరిస్తూ నిర్జీవ జీవనం గడుపుతూ ఉంటుంది. పక్కింట్లో ఒక బామ్మగారు. ఆవిడ మనవడు శివయ్య. శివయ్యకి చిన్నప్పుడు తలకి దెబ్బ తగిలి బుధ్ధిమాంద్యం వచ్చింది. ఎంతో మంచివాడే అయినా, తనేం చేస్తున్నాడో తనకే తెలియని అమాయకుడు. చిన్న పిల్లల మనస్థత్వం కలవాడు. శివయ్య అక్కడ అందరికీ సహాయం చేస్తుంటే చూస్తూనే వుంటుంది లలిత. ఒక శ్రీరామనవమి రోజున, హరికథ వింటున్న సమయంలో, కొన్ని విచిత్ర పరిస్థితులవల్ల శివయ్య ముందూ వెనకా చూడకుండా, లలిత మెడలో తాళి కట్టేస్తాడు. అప్పటినించీ శివయ్య జీవితాన్నీ, అతని సంరక్షణా భారాన్ని, తన పిల్లల జీవితాన్నీ మీద వేసుకుంటుంది లలిత. తన తెలివితేటలతోనూ, ఆత్మవిశ్వాసంతోనూ, ధైర్యంగా అతనికి కూడా ధైర్యమిస్తూ, అతని చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తుంది. స్త్రీలకు మన సమాజంలో మంచి గౌరవం ఉండాలంటే, ఎంత పట్టుదలతో ఎదుర్కోవాలో చేసి చూపిస్తుంది. విశ్వనాథ్ సృష్టించిన లలిత పాత్రకు పూర్తి న్యాయం చేసింది సహజ నటి రాధిక. ఏ స్త్రీవాద రచయితా ఇలాటి పాజిటివ్ పాత్రను చూపించినట్టులేదు. స్త్రీ ఎంత ఒదిగిమణిగి వుంటుందో అవసరమైనప్పుడు అంతకన్నా ఎక్కువ ధైర్యాన్ని కూడగట్టుకుని తన జీవితాన్ని వున్నంతలో విజయవంతం చేసుకోగలదు అని నిరూపించే పాత్ర. విశ్వనాథ్ గారు మరోసారి తన నాయికలను ఉన్నతంగా చిత్రీకరించిన పాత్ర ఈ లలిత. 

అలాగే ‘స్వర్ణకమలం’ చిత్రంలో భానుప్రియ నటించిన మీనాక్షి పాత్ర. కూచిపూడి నాట్యంలో నిష్ణాతుడైన శేషేంద్రశర్మ ఆర్థికంగా చాల ఇబ్బందులు పడుతూ, ఇద్దరు కూతుళ్ళకూ చదువులు చెప్పించలేక, తనకు తెలిసిన నాట్యం, సంగీతం మాత్రమే నేర్పించగలుగుతాడు. సావిత్రి ఆ సంగీతాన్నే గౌరవిస్తూ అదే జీవనాధారంగా సర్దుకుపోతుంది.  కానీ మీనాక్షికి నాట్యం బాగా నేర్చుకున్నాకూడా, ఆ ఎద్దుబండి జీవితం వదిలి బయట విలాస ప్ర్రపంచంలో విహరించాలని కోరిక. అందుకనే నేర్చుకున్న నాట్యాన్ని చిన్నచూపు చూస్తూ, ఎలా బయటపడాలా అని కలలు కంటూ వుంటుంది. అప్పుడే తారసపడతాడు పక్కింట్లో వున్న సాధారణ యువకుడు, రోడ్డు పక్కన సినిమా బోర్డుల చిత్రకారుడు చంద్రశేఖర్.

అతను ఆమెలోని నాట్యాన్ని చూసి అభిమానిస్తాడు. కానీ ఆమె అయిష్టతను గమనించి బాధపడతాడు. ఆమె చేత ఎలాగైనా నాట్య ప్రదర్శన ఇప్పించాలని ఒక ప్రదర్శన కూడా ఏర్పాటు చేయిస్తాడు. అయితే ఆమె అయిష్టంగా అందుకు ఒప్పుకొని నాట్యం మధ్యలో నిలిపివేయడంతో, ఆమె తండ్రి నాట్యాన్ని కొనసాగిస్తాడు. కానీ దురదృష్టవశాత్తూ ఆయన నాట్యం చేస్తుండగానే మరణిస్తాడు. తన తండ్రి మరణానికి తనే కారణమయ్యానని బాధ పడుతుంటుంది. 

ఈ చిత్రంలో కూడా విశ్వనాథ్ సాంప్రదాయసిద్ధమైన కళా జీవన నేపధ్యాన్నే ఎన్నుకుని కథను అల్లినా, ఎంతో మానసిక సందిగ్ధతకి లోనైన పాత్రగా మీనాక్షి పాత్రను ఎంతో నేర్పుగా తీర్చిదిద్దారు. ఆయనకి ఇష్టమైన దృశ్యకళా చాతుర్యాన్ని మరోసారి ఉపయోగించుకుంటూ, నాట్యంలో నిష్ణాతురాలైన భానుప్రియని ఆ పాత్రకి ఎంచుకున్నారు. ఆమె కేవలం కళ్ళు తిప్పుతూ కథ చెప్పగలదు. కథనాన్ని సవ్యంగా నడిపించగలదు. డైలాగులు అనవసరం. ముందు కొంచెం చిన్నపిల్ల మనస్తత్వంతో తను నేర్చుకున్న అసాధరణ నాట్యకళను విస్మరించినా, తండ్రి అకాలమరణంతోనూ, మిత్రుడు చంద్రశేఖర్ (వెంకటేష్) ప్రోద్బల, ప్రోత్సాహాలతోనూ ఆమెలో ఎంతో మార్పు కనిపిస్తుంది. ఆ మార్పుని హఠాత్తుగా కాకుండా ఎన్నో గొప్ప సన్నివేశాలు సృష్టించి తెలివిగా, ఆమెలో ఆ మార్పుని క్రమంగా తీసుకురావటంలో ఇటు రచయితగానూ, అటు దర్శకుడిగానూ విశ్వనాథ్ గారు, తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. ఇది భానుప్రియ జీవితంలోనే కాక “స్వర్ణకమలం” చిత్రం చూసినవారందరి హృదయాల్లోనూ కలకాలం నిలచి వుండే పాత్ర. 

అలాగే “స్వాతికిరణం” చిత్రంలో అనంతరామశర్మగా మమ్ముట్టి, గంగాధరంగా మంజునాథ్ పాత్రలను ఎంతో హృద్యంగా విశ్వనాథ్ గారు తయారుచేసినా, నిశితంగా చూస్తే నన్ను బాగా కదిలించిన పాత్ర రాధిక పోషించిన శారద పాత్ర. అనంతరామశర్మగారి భార్య. తనకి పిల్లలు లేని కారణంగా, భర్త వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకోవటానికి వచ్చిన గంగాధరాన్నే స్వంత కొడుకులా చూసుకుంటుంది. గురువును మించినా శిష్యుడిగా అతని ప్రావీణ్యాన్ని చూసి ఆనందంతో స్వంత తల్లిలా మురిసిపోతుంది. కానీ తన శిష్యుడిని చూసి భరించలేని  ఈర్ష్యతో అతని స్వరకల్పనలను తనవిగా చెప్పుకుని, అతని భవిష్యత్తునీ,  ప్రతిభనీ చావుదెబ్బ కొడుతున్న భర్తని చూసి తనలోతనే కుమిలిపోతుంది. ఒకపక్క కొడుకు తల నరికేసిన పరమశివుడిలాటి భర్త, ఇంకొక పక్క కన్నకొడుకులా తను చూసుకుంటున్న గణపతిలాటి కొడుకు. అ ఇద్దరి మధ్యా నలిగిపోతున్న పార్వతి పాత్ర.

 

అక్కడ విశ్వనాథ్ గారు, సిరివెన్నెల సీతారామశాస్త్రిగారితో కలిసి చెప్పిన సమాధానం గుండెలు బ్రద్దలయేలా  కథా కథనాల మార్గాన్ని పూర్తిగా మార్చేస్తుంది. 

గుండెనొప్పితో తన భర్త చనిపోతాడేమో అని భయపడుతున్న శారదతో, తన జీవితాన్నే గురుదక్షిణగా ఇచ్చిన గంగాధరం చెబుతాడు, “కాటుక కంటినీరు పెదవులనంటనీకు, చిరునవ్వు దీపకళిక చిన్నబోనీయకు, నీ బుజ్జిగణపతిని బుజ్జగించి చెబుతున్నా, నీ కుంకుమకెపుడూ ప్రొద్దుగుంకదమ్మా” అని.

“ప్రాణపతినంటుందా, బిడ్డగతి కంటుందా, ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి, కాలకూటంకన్న ఘాటైన గరళమిది, గొంతునులిమే గురుతై వెంటనే వుంటుంది, ఆటుపోటు ఘటనలివి ఆటవిడుపు నటనలివి, ఆదిశక్తివి నీవు, అంటవు నిన్నేవి” అని ఆ సమస్యా పరిష్కారం ఇస్తారు. 

ఈ చిత్రంలో రాధిక నటన, ముఖ్యంగా “ఆనతినీయరా” పాట చివరిలో ఆవిడ ముఖంలో చూపించే భావ ప్రకటన, అంతటి మహానటికి, ఆమె చేత అలా నటింపజేసిన కళాతపస్వికి శతకోటి వందనాలు. ఆనతి నీయరా హరా అని గంగాధరం పాడుతుంటే, ఆ హరుడు శివుడా లేక తనని హరించుతున్న తన గురువునే తను వెళ్ళిపోవటానికి ఆనతి అడుగుతున్నాడా అనిపించింది నాకు. 

అలాగే “శుభలేఖ” చిత్రంలో పెద్ద చదువులు చదివి లెక్చరరుగా పనిచేస్తున్న సుజాత (సుమలత) తనని ఒక పశువుగా వేలంపాటలో కట్నాల కోసం వేధిస్తున్న సమాజంలో, ఆ దురాచారాన్నిఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ధైర్యంగా ఎదుర్కొని, తన జీవితాన్ని ఎలా సుఖమయం చేసుకుంటుందో చెప్పే ఇంకొక విశిష్టమైన పాత్ర. 

“సిరివెన్నెల” చిత్రంలో తను ఇష్టపడిన అంధ మురళీ విద్వాంసుడితో సంభాషించే మూగ చిత్రకారిణి ఒక పక్క, విలాస జీవితానికి అలవాటుపడ్డ ఇంకొక పాత్ర ఆ అంధ విద్వాంసుడికి ప్రకృతిలోని అందాలని చూపించటం ఇంకొక పక్క, రచయిత విశ్వనాథ్ దర్శకుడు విశ్వనాథుడికి విసిరిన పెద్ద సవాల్. 

ఒక సాధారణ తాగుబోతు వ్యక్తిలో దాగివున్న ఎంతో గొప్ప నాట్యాచార్యుడిని గుర్తించి, అతన్ని అసహ్యించుకునే కూతురినే అతని దగ్గర నృత్యం నేర్చుకోవటానికి చేర్పించిన ఒక స్త్రీ కథే “సాగరసంగమం”.

ఇలా చెప్పుకుంటూ పోతే, కాశీనాథుని విశ్వనాథుని కథానాయికల పరిశీలనకి అంతువుండదు. ప్రతి పాత్రా ఆయన మేథస్సునించీ వచ్చిన ఒక సజీవ పాత్రే! అందుకని మిగతా పాత్రల గురించి ఇక వ్రాయటం లేదు.

నేను పైన చెప్పినట్టు రచయిత విశ్వనాథ్ గారు పద్మవ్యూహంలో ఇరుక్కున్న ప్రతిసారీ, ఆయన్ని రక్షించింది ముగ్గురు. ఒకరు దృశ్యమాధ్యమ దర్శకుడు విశ్వనాథ్. ఎక్కువ మాటలు లేకుండా, కళ్ళకు కట్టినట్టు ఒక దృశ్యకావ్యంగా మలచగలగిన దర్శకుడు విశ్వనాథ్. రెండు, కవి విశ్వనాథ్. ఆయన విసిరిన సవాలుని ఎదుర్కొని నిద్రాహారాలు కూడా ఉపేక్షించి, ఆయన్నే కాక, మనందర్నీ కూడా సమాధాన పరచిన ఆయన పాటల, మాటల రచయితలను తన స్థాయికి తీసుకువచ్చిన విశ్వనాథ్. దానికి మహాకవి విశ్వనాథ్ గారే స్వయంగా ఎన్నో పాటలకు పల్లవి మాత్రమేకాక, కొన్ని చరణాలు కూడా ఇవ్వటం. ఆయన సినిమాల్లో పాటలు కూడా కథలు చెబుతాయి. కథనాన్ని కొనసాగిస్తాయి. కథకి ఏమాత్రం అడ్డురావు. మూడు, సాటి నటుడిగా ఆయన తన పాత్రలకు ఎంచుకునే నటీనటులు. ఎంతోమంది ఆయన నటనా పాఠశాలలోనే నటులం అయామని పైకే చెప్పుకున్నారు. ఆయనకు తెలుసు ఏ నటుడి దగ్గర తనకి కావలసిన సహజ నటన ఎలా రాబట్టుకోవాలో.

ఇదేనేమో "సంగీత సాహిత్య సమలంకృతే” అంటే! 

విశ్వనాథ్ గారు పుట్టిన కాలంలోనే పుట్టి, ఆయన చిత్రాలు చూసి, ఇంకా మళ్ళీ మళ్ళీ చూస్తున్న మనం నిజంగా అదృష్టవంతులం! 

*****

bottom of page