MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
మధురవాణి ప్రత్యేకం
సాహితీ సౌరభాలు
తెలుగు సాహిత్యం లో భక్తి శతకములు - 2
ప్రసాద్ తుర్లపాటి
భక్తి శతకాలను శైవ, విష్ణు భక్తి ప్రధానంగా విభజించవచ్చును. భక్తి శతకాలు ఇతర దేవతల పైన కూడా కొన్ని మనకు కానవస్తాయి. ఈ వ్యాసం మొదటి భాగంలో శైవ భక్తి ప్రపూర్ణమైన శతకాల గురించి వివరించాను. ఈ సంచిక లో విష్ణు భక్తి శతకాలు, ఇతర భక్తి శతకాల గురించి వివరిస్తాను.
తెలుగు దేశంలో వెలసిన విష్ణు భక్తి శతకాలలో ఎక్కువగా, నృసింహ, రామ, కృష్ణ అవతారాలకు సంబంధించినవి, క్షేత్ర మహిమలకు సంబంధించినవి. శ్రీహరి కీర్తనే ఈ శతక సాహిత్య లక్షణం.
విష్ణు భక్తి ని ప్రతిపాదక శతకములు – ఉదాహరణలు
-
దాశరథి శతకము కంచెర్ల గోపన్న
-
కృష్ణ శతకము నృసింహ కవి
-
నరసింహ శతకము శేషప్ప కవి
-
ఆంధ్రనాయక శతకము కాసుల పురుషోత్తమకవి
-
నారాయణ శతకము బమ్మెర పోతన
-
దేవకీనందన శతకము వెన్నెలకంటి జన్నయ్య (1450)
-
వేంకటేశ శతకము తాళ్ళపాక పెదతిరుమలార్య
-
శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము తాళ్లపాక అన్నమాచార్య
-
ఒంటిమిట్ట రఘువీర శతకము అయ్యలరాజు త్రిపురాంతక కవి
-
వేణుగోపాలశతకము పోలిపెద్ది వేంకటరాయకవి
-
మదనగోపాల శతకము చెంగల్వరాయఁడు
పైన చెప్పబడిన వాటిలో కొన్నింటిని సోదాహారణముగా పరిశీలిద్దాము.
-
వెన్నెలకంటి జన్నయ్య విరచిత దేవకీ నందన శతకం –
విష్ణు భక్తి ప్రతిపాదక శతకముల లో అతి ప్రాచీనమైనది - వెన్నెలకంటి జన్నయ్య కృతమగు దేవకీ నందన శతకం. ఈ శతకములో ‘కృష్ణా దేవకీనందనా’ అనే మకుటముతో 101 పద్యాలు ఉన్నాయి. మఱుగున పడి ఉన్న ఈ శతకాన్ని గద్వాల సంస్థానములోని పుస్తక భాండాగారములో తాళపత్ర లిఖితమై ఉండుట చూచి గద్వాల మహారాణి పునర్ముద్రణ కావించి ప్రకటించింది.
శా. శ్రీకైవల్యరమాధినాథ నిను నర్థిం గీర్తనల్‌జేసి కా
దా కంజాతభవేంద్ర నారద శుకవ్యాసాంబరీషార్జునుల్
నీకారుణ్యముఁ గాంచుటల్ ననుమతిన్ నేనెంతధన్యుండనో
నాకుఁ జేకురె నట్టిభాగ్యములు కృష్ణా దేవకీనందనా
భక్త శిఖామణులైన నారద, శుక, వ్యాస, అంబరీష, అర్జున నిన్ను కీర్తించి నీ కారుణ్యమును పొందారు. అటువంటి భాగ్యము నాకు చేకూరినాయి, నెంత ధన్యుండనో !!
క. ఈకృష్ణశతక మెప్పుడు
పైకొని విన్నట్టివారు వ్రాసినవారల్
చేకొని పఠించువారలు
శ్రీకృష్ణుని కరుణ కలిగి చెలఁగుదు రెలమిన్
అని శతక పఠన ఫలశ్రుతిని కూడా చెప్పాడు, ఈ శతకము లోని ఆఖరు పద్యములో.
ఈ శతకంలో “ కృష్ణా ! దేవకీ నందనా !! “ అన్న మకుటంతో 101 పద్యములున్నాయి. ఈ శతకంలో శ్రీకృష్ణుని గుణగణాలు, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చక్కగా వర్ణింపబడినాయి. ప్రవృత్తి, నివృత్తి మార్గాల సమన్వయం ఈ శతకం యొక్క ప్రత్యేకత.
శా. శ్రీ వైకుంఠనివాసగోత్రధర లక్ష్మీనాథ గోపాల లీ
లావిర్భావ పతంగవాహ యదువంశాంభోధిచంద్రోదయా
నీవే దిక్కని యున్నవాఁడను దయన్ వీక్షించి రక్షించవే
నా విజ్ఞాపన మాలకించు మది కృష్ణా దేవకీనందనా
సంపూర్ణ శరణాగతి తో “ నీవే దిక్కని యున్నవాఁడను దయన్ వీక్షించి రక్షించవే ” అంటూ భగవంతుని వేడుకుంటున్నాడు.
పరమానందభరితుడై, ఆ శ్రీకృష్ణ పరమాత్ముని, ఆయన శైశవ లీలలను ఈ విధముగా వర్ణిస్తున్నాడు కవి –
శా. నీడల్ దేఱెడు చెక్కుటద్దములతో నిద్దంపుఁగెమ్మోవితో
కూడీకూడని చిన్నికూకటులతో గోపార్భకశ్రేణితో
వ్రీడాశూన్య కటీరమండలముతో వేడ్కన్ వినోదించుచు
న్నాఁ డా శైశవమూర్తి నేఁ దలఁతుఁ గృష్ణా దేవకీనందనా
శా. అందెల్ చిన్నిపసిండిగజ్జియలు మ్రోయన్ మేఖలాఘంటికల్
క్రందై మ్రోయఁగ రావిరేకనుదుటన్ గంపింప గోపార్భకుల్
వందారుల్ గన వెన్నముద్దలకు నై వర్తించు మీబాల్యపుం
జందం బాదివిజుల్ నుతించుటలు కృష్ణా దేవకీనందనా
జపతపాదులు ఏమి తెలియని వాడను, నియమముతో నిత్య పూజలు సల్పలేను, ఉపవసములుండలేను, నేను ఏమి తెలియని వాడను, యనుచు నన్ను ఉపేక్ష చేయక నీ యందు అనంతరము భక్తి ఉండునటుల దయచేయుము దేవా !!
మ. జపముల్ సేయఁగ నేర నీమమున నిచ్చ ల్పూజ సేయంగలే
నుపవాస వ్రతభక్తి చొప్పెఱుఁగ వేదోక్తక్రమస్థుండఁగా
నపరాధంబులు నాయెడం దఱచు నే నజ్ఞాని నెబ్భంగులన్
జపలుం డంచు నుపేక్ష సేయకుము కృష్ణా దేవకీనందనా
దేవకీ నందన శతకము లో వివధ భక్తులు శ్రీకృష్ణుని సంపూర్ణముగా నమ్మి సాయుజ్యాన్ని పొందటానికి చేసే ప్రయత్నం కనిపిస్తుంది. భవబంధ విముక్తి కావింపమన్న వేడికోలు కన్పిస్తుంది. ఈ పద్యం శతక కవి స్వీయానుభూతికి నిదర్శనం.
మ. అరయం శంతనుపుత్రుపై విదురుపై నక్రూరుపైఁ గుబ్జపై
నరుపై ద్రౌపదిపైఁ గుచేలకునిపై నందవ్రజస్త్రీలపైఁ
బరఁగంగల్గు భవత్కృపారసము నాపైఁ గొంతరానిమ్ము మీ
చరణాబ్జంబుల నమ్మినాఁడ హరి కృష్ణా దేవకీనందనా
దేవకీ నందన శతకము లో శ్రీకృష్ణుని తత్వం అంతర్లీనంగా గోచరిస్తుంది. విష్ణు భక్తి శతకాలలో ప్రాచీనమైన ఈ శతకం క్రీ. శ. 1415 లో మొదటగా ప్రచురించబడినది.
-
బమ్మెర పోతన విరచిత నారాయణ శతకం –
“ ఇది శ్రీ పరమేశ్వర కరుణా కలిత కవిత విచిత్ర, కేశన మంత్రి పుత్ర. సహజ పాండిత్య, పోతానామాత్య ప్రణీతంబైన నారాయణ శతకము సంపూర్ణము “ అన్న శతాకంత గద్యను బట్టి ఇది బమ్మెర పోతానామాత్య కృతమని తెలుస్తున్నది.
భాగవత రచనకు పూర్వమే పోతన ఈ శతకము ను రచించెనని భావన. ఈ రచనకు గల కారణం – భగవంతుని నామస్మరణలో తాను ఏమైనా తప్పులు చేసినా, మంచి మనసుతో మన్నించమని వేడుకోలు చేసుకుంటున్నాడు -
శా. నే నీదాసుఁడ నీవు నాపతివి నిన్నే కాని యొండెవ్వరిన్
ధ్యానింపం బ్రణుతింప నట్లగుటకు న్నా నేర్చు చందంబునన్
నీ నామస్తుతు లాచరించు నెడల న్నే తప్పులుం గల్గినన్
వానిన్ లోఁగొనుమయ్య, తండ్రి, విహితవ్యాపార, నారాయణా!
ఈ శతకం లో హరి నామ సంకీర్తనం, నారాయణ మంత్రం ఆంజనేయుడు, ప్రహ్లాదుడు, విభీషణుడు, గాగేయుడు, ద్రౌపది మున్నగు భక్తులను తరింపచేసినదని వివరింపబడినది. కృష్ణవతార వర్ణన, కృష్ణ లీలలు చక్కగా వర్ణింపబడినాయి. కొన్ని ఉదాహరణలు -
మురళీ నాట్యం -
మ. లలితాకుంచితవేణియం దడవిమొల్లల్ జాఱ ఫాలస్థలి\న్
దిలకం బొయ్యన జాఱఁ గుండలరుచుల్ దీపింప లేఁజెక్కులన్
మొలకన్నవ్వుల చూపు లోరగిల మే న్మువ్వంకల\న్ బోవఁగా
నలి గైకొందువు గాదె నీవు మురళీనాట్యంబు, నారాయణా
గోవర్ధనగిరి నెత్తుట -
మ. జడ యెంతేఁ దడ వయ్యె జెయ్యి యలసెన్ శైలంబు మాచేతులం
దిడు మన్న\న్ జిరునవ్వుతో వదలినన్ హీనోక్తి గీపెట్ట నె
క్కుడు గోవుల్ బ్రియమంద నింద్రుఁ డడలం గోవర్ధనాద్రీంద్రమున్
గొడుగై యుండగఁ గేలఁ బూనితి గదా గోవింద, నారాయణా!
రాస లీల -
మ. ఒక కాంతామణి కొక్క డీవు మఱియు న్నొక్కర్తె కొక్కండ వై
సకలస్త్రీలకు సంతతం బలర రాసక్రీడ తన్మధ్య క
ల్పక మూలంబు సవేణునాదరస మొప్పంగా బదార్వేల గో
పికలం జెంది వినోద మొందునెడ నీ పెంపొప్పు నారాయణా
శ్రీమన్నారాయణుని ఘనతను ఈ విధముగా వర్ణించాడు -
మ. ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై
పరమామ్నాయము లెల్ల వందిగణమై బ్రహ్మాండ మాగారమై
సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై
వరుస న్నీ ఘనరాజసంబు నిజమై వర్ధిల్లు, నారాయణా!
గజేంద్ర మోక్షణం -
మ. కరినాథుండు జలగ్రహగ్రహణ దుఃఖాక్రాంతుఁడై యీశ మీ
శరణం బన్నఁ గృశాను భానుశతతేజస్ఫూర్తి యైనట్టి మీ
కరచక్రంబున నక్రకంఠము వెస\న్ ఖండించి మించెం దయా
పరసద్భక్త భయానక ప్రకర సత్ప్రాకట్య నారాయణా!
మోక్షానికి భక్తి మార్గం సులభమైనదని పోతన ఈ శతకం లో వివరించాడు. ఈ శతకం ప్రతిపద్యములోనూ పోతనకు భగవంతుని యెడ కల ఆత్మీయత వ్యక్తమవుతుంది. నవవిధ భక్తిమార్గాలన్నీ చక్కగా వివరింపబడినాయి. సర్వము నారాయణుడే అని నమ్మిన వ్యక్తి పోతన.
శా. నీవే తల్లివి నీవె తండ్రి వరయ న్నీవే జగన్నాథుఁడౌ
నీవే నిశ్చలబాంధవుండ వరయ న్నీవే మునిస్తుత్యుఁడౌ
నీవే శంకరమూలమంత్ర మరయన్ నీవే జగత్కర్తవున్
నీవే దిక్కనువారి వారలె కడు న్నీవారు నారాయణా!
శా. నీమూర్తుల్ గన నీకథల్ వినఁ దుదిన్ నీ పాద నిర్మాల్యని
ష్ఠామోదంబు నెఱుంగ, నీచరణాతోయం బాడ, నైవేద్యముల్
నీమం బొప్ప భజింప నీజపము వర్ణింపన్ గృపం జేయవే
శ్రీ మించన్ బహుజన్మ జన్మములకున్ శ్రీయాదినారాయణా
హృద్యమైన కవిత్వం తో, భక్తి భావనతో, లలితములైన పదములతో భక్తి పారమ్యాన్ని చక్కగా వివరించాడు పోతన. ఆ భక్తి మాధురులే భాగవతమంతా మనకు కనిపిస్తాయి.
-
తాళ్ళపాక అన్నమయ్య విరచిత శ్రీ (అలమేలుమంగ) వేంకటేశ్వర శతకం –
తొలి తెలుగు వాగ్గేయకారుడు, సంకీర్తనాచార్యుని గా గణుతికెక్కిన తాళ్ళపాక అన్నమాచార్య విరచితం ఈ శ్రీ (అలమేలుమంగ) వేంకటేశ్వర శతకం. శ్రీ అలమేలుమంగ, వేంకటేశ్వర స్వామి వారి దివ్య ప్రణయం మధురభక్తి పూరితంగా ఈ శతకం లో వర్ణింపబడినది. ముందుగా శ్రీకృష్ణుని భార్యల వలె నేను (అన్నమయ్య) నీ సేవ చేసుకొంటాను, అమ్మ అలమేలుమంగను నీ దరికి చేర్చుకోవయ్య !! అంటే దాస్య భక్తి ప్రస్ఫుటంగా గోచరిస్తోంది.
ఉ. శ్రీసతి నీల జాంబవతి శ్రీయమునాసతి సత్యభామ ధా
త్రీసతి రుక్మిణీరమణి దేవియిలాసతి వీర లందఱున్
జేసినసేవ చేసెదను జేకొను శ్రీయలమేలుమంగ నీ
మూసినముత్యమై యురము ముంగిటఁ జెంగట వేంకటేశ్వరా
మధురభక్తి ప్రదాయకమైన ఈ క్రింది పద్యంలో అమ్మ అలమేలుమంగ శ్రీ వేంకటేశ్వరుడు అన్యనాయికాసక్తుడగుట భరింపలేక స్వామిని నిందించుట వర్ణింపబడినది. మధుర భక్తి లో, జీవకోటిలో నున్న స్త్రీ, పురుష భేదము లేదు. భగవంతుడు ఒక్కడే పురుషుడు, మిగిలిన జీవకోటి అంతయు స్త్రీ మయం. అట్టి మధుర భక్తిని తన సంకీర్తనల ద్వార ప్రచారం చేసినవాడు అన్నమయ్య.
ఉ. ఎక్కడి కేఁగి వచ్చితి రమేశ్వర నీతనుదివ్యగంధ మే
చక్కనియింతిమేని దని సారెకు నీయలమేలుమంగ నీ
చెక్కు గళంబు గోళ్లవడిఁ జేర్చుచు నీయలపార్చి వేఁడుటల్
మక్కువగల్గుకాంతలకు మర్మరహస్యము వేంకటేశ్వరా
అన్నమయ్య తానే చెలికత్తె గా, అంతరంగికుడగుట, తనను భక్తితో కావుమని చెప్పుట ఈ శతకంలో ఎక్కువగా కానవస్తుంది. అన్నమయ్య చక్కని తల్లి అలమేలుమంగ, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మధుర శృంగార గీతముల పద ప్రయోగాలు ఈ శతకం లో కూడా కానవస్తాయి. (ఉదా. చక్కని తల్లికి చాంగుభళా .. కీర్తన వలె ఉన్న ఈ క్రింది పద్యం )
ఉ. చక్కనితల్లికిన్ నవరసంబుల వెల్లికిఁ బుష్పవల్లికిం
జక్కనిమోవిముత్తియపుజల్లికి శ్రీయలమేలుమంగకున్
జెక్కులు మించుటద్దములు చేతులు క్రొత్తమెఱుంగుఁదీగ లా
క్రిక్కిరిగుబ్బలే పసిఁడికిన్నరకాయలు వేంకటేశ్వరా!
ఉ. చాఁగు బళా జగత్పతికి జాఁగు బళా జగదేకమాతకున్
చాఁగు బళా రమేశునకుఁ జాఁగు బళా యలమేలుమంగకు\న్
జాఁగు బళా యటంచుఁ గడుఁ జక్కని కాంతను వీథివీథిమీ
రేఁగఁగ నిత్తు రారతు లనేకవిధంబుల వేంకటేశ్వరా!
అన్నమయ్య కాలం నాటి నైవైద్యాలు, ప్రసాదాలు, పిండివంటలు ఈ పద్యంలో కానవస్తాయి.
చ. అరిసెలు నూనెబూరియలు నౌఁగులుఁ జక్కెరమండిగల్ వడల్
బురుడలు పాలమండిగ లపూపముల య్యలమేలుమంగ నీ
కరుదుగ విందువెట్టు పరమాన్నచయంబులు సూపకోటియున్
నిరతి వినిర్మలాన్నములు నేతులసోనలు వేంకటేశ్వరా
ఇక ఈ చివరి పద్యంలో అన్నమయ్య “నా ఈ పద్య ప్రసూనాలను గ్రహించి అనేక యుగములు, కల్పములు అమ్మ అలమేలుమంగతో వర్ధిల్లుచూ భక్తుల బ్రోవుమని” వేడుకుంటున్నాడు.
ఉ. అమ్మకుఁ దాళ్లపాకఘనుఁ డన్నఁడు పద్యశతంబుఁ జెప్పెఁగో
కొమ్మని వాక్ప్రసూనములఁ గూరిమితో నలమేలుమంగకున్
నెమ్మది నీవు చేకొని యనేకయుగంబులు బ్రహ్మకల్పముల్
సమ్మది మంది వర్ధిలను జవ్వన లీలల వేంకటేశ్వరా
-
శేషప్ప కవి విరచిత శ్రీ నరసింహ శతకం –
‘భూషణ వికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర’ అన్న మకుటం తో నేటి కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన శేషప్ప కవి రచించిన నరసింహ శతకం సంపూర్ణ ఆత్మనివేదన తో చెప్పబడి, భక్తి శతక వాజ్ఞ్మయం లో ప్రముఖ స్థానం పొందినది. అలంకారాలతో విలసిల్లేవాడా, ధర్మపురి యందు వెలసిన వాడా, దుష్ట సంహారం కావించిన వాడా, పాపములను దూరం చేయువాడా నరసింహా! అన్నది శతక మకుటానికి అర్థం. అన్నీ పద్యములు ‘సీస, తేటగీతి చందస్సులలో రచింపబడినవి.
సీ. నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత - దురితజాలములెల్ల ద్రోలవచ్చు
నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత - బలువైన రోగముల్ బాపవచ్చు
నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత - రిపు సంఘముల సంహరింపవచ్చు
నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత - దండహస్తుని బంట్లఁదఱుమవచ్చు
తే. భళిర నేనీ మహామంత్రబలముచేత - దివ్యవైకుంఠ పదవి సాధింపవచ్చు
భూషణ వికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
“ లక్షాధికారైన లవణ మన్నమె కాని - మెఱుఁగు బంగారంబు మ్రింగఁబోఁడు “ అన్న ప్రముఖ నానుడి ఈ శతకము లోని ఈ క్రింది ప్రముఖ పద్యం లోనిది.. లోభత్వము విడనాడి, దాన ధర్మములు చేయమని ప్రబోధించే ఈ పద్యం తెలుగునాట ఎంతో ప్రాచుర్యం పొందింది.
సీ. తల్లి గర్భము నుండి ధనము తేఁ డెవ్వఁడు - వెళ్లిపోయెడినాఁడు వెంటరాదు
లక్షాధికారైన లవణ మన్నమె కాని - మెఱుఁగు బంగారంబు మ్రింగఁబోఁడు
విత్త మార్జనఁ జేసి విఱ్ఱవీఁగుటె కాని - కూడఁబెట్టిన సొమ్ము తోడరాదు
పొందుగా మఱుఁగైన భూమిలోపలఁ బెట్టి - దానధర్మము లేక దాఁచి దాఁచి
తే. తుదకు దొంగల కిత్తురో దొరల కవునో - తేనె జుంటీఁగ లియ్యవా తెరువరులకు?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
అవసాన దశలో అనారోగ్యము చేత నీ స్మరణ కలుగునో లేదో, లేక ఓపిక నశించి నీ నామ భజన చేతునొ లేదో , కనుక ఇప్పుడే నీ నామ భజన సదా తలచెదను, గైకొనువయ్య, అని వేడుకుంటున్నాడు. ( ఈ ఛాయాలలోనే, భక్త రామదాసు తన దాశరధి శతకము లో ఒక పద్యాన్ని రచించాడు.)
సీ. బ్రతికినన్నాళ్లు నీభజన తప్పను గాని - మరణకాలమునందు మఱతునేమొ
యావేళ యమదూతలాగ్రహంబున వచ్చి - ప్రాణముల్ పెకలించి పట్టునపుడు
కఫ వాత పైత్యముల్ గప్పఁగా భ్రమచేతఁ - గంప ముద్భవమంది కష్టపడుచు
నా జిహ్వతో నిన్ను నారాయణా యంచుఁ - బిలుతునో శ్రమచేతఁ బిలువలేనో
తే. నాఁటి కిప్పుడె చేతు నీనామ భజన - తలఁచెదను జెవి నిడవయ్య! ధైర్యముగను
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
సీ. అంత్యకాలమునందు నాయాసమున నిన్నుఁ - దలఁతునో తలఁపనో తలఁతు నిపుడె
నరసింహ! నరసింహ! నరసింహ! లక్ష్మీశ! - దానవాంతక! కోటిభానుతేజ!
గోవింద! గోవింద! గోవింద! సర్వేశ! - పన్నగాధిపశాయి! పద్మనాభ!
మధువైరి! మధువైరి! మధువైరి! లోకేశ! - నీలమేఘశరీర! నిగమవినుత!
తే. ఈ విధంబున నీనామమిష్టముగను - భజన సేయుచు నుందు నా భావమందు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
“ గరుడవాహన! దివ్యకౌస్తుభాలంకార! - రవికోటితేజ! సారంగవదన! మణిగణాన్విత! హేమమకుటాభరణ! చారు మకరకుండల! లసన్మందహాస! కాంచనాంబర! రత్నకాంచీవిభూషిత! - సురవరార్చిత! చంద్రసూర్యనయన! కమలనాభ! ముకుంద! గంగాధరస్తుత! - రాక్షసాంతక! నాగరాజశయన! పతితపావన! లక్ష్మీశ! బ్రహ్మజనక! - భక్తవత్సల! సర్వేశ! పరమపురుష! “ అంటూ తన ఆరాధ్య దైవమైన ఆ నారసింహుని స్తుతి చేస్తూ ధన్యుడినాడు శేషప్ప కవి.
సీ. శేషప్ప యను కవిచెప్పిన పద్యముల్ - చెవుల కానందమై చెలఁగుచుండు
నే మనుజుండైన నెలమి నీ శతకంబు - భక్తితో విన్న సత్ఫలము గలుగుఁ
జెలఁగి యీ పద్యముల్ చేర్చి వ్రాసినవారు - కమలాక్షు కరుణను గాంతురెపుడు
నింపుగాఁ బుస్తకంబెపుడుఁ బూజించిన - దురితజాలంబులు దొలఁగిపోవు
తే. నిద్ది పుణ్యాకరం బనియెపుడు జనులు - గష్టమెన్నక పఠియింపఁ గలుగు ముక్తి
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
-
భక్త రామదాసు విరచిత దాశరధి శతకం –
తెలుగు వారి ఆరాధ్య దైవం ఆ శ్రీ రామ చంద్రుడు. ఆ శ్రీరాముని ప్రస్తుతిస్తూ కంచర్ల గోపన్న (భక్త రామదాసు) 17వ శతాబ్దంలో రచించిన భక్తి శతకము – దాశరధి శతకం. ఈ శతకం లో అన్నీ పద్యాల లో “ దాశరథీ కరుణాపయోనిధీ “ అనే మకుటం చివరగా వస్తుంది. కంచెర్ల గోపన్నక్రీ. శ. 1620 లో, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లింగన్నమూర్తి, కామాంబ దంపతులకు జన్మించినాడు. దాశరధి శతకము, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానము - ఇవన్నీ రామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు. రామ భక్తి ప్రధానాంశముగా భక్త రామదాసు ఎన్నో కీర్తనలను, దాశరధి శతకం ను మనకనదించారు. ‘కదళీ, ఖర్జూరాది ఫలముల కన్నాను ఎంతో మధురం ఆ రామ నామం అన్నాడు రామదాసు. దాశరధి శతకము లో కొన్ని ఉదాహరణలు (వివిధ భక్తి మార్గములు)
-
శ్రీరాముని గుణగణాల వర్ణన – స్మరణం, వందనం
రఘువంశమున బుట్టినవాడవు, సొంపైన తులసీదండలు గలవాడవు, శాంతి, ఓరిమి మొదలు గుణములచే నొప్పువాడవు, ముల్లోకముల పొగడదగిన పరాక్రమ లక్ష్మికి ఆభరణమైన వాడా! వారింపనలవికాని కబంధుడను రాక్షసుని సంహరించినవాడా, జనుల పాపములను సముద్రమును దాటించు నామము గలవాడా! దయకు సముద్రమువంటి వాడా! భద్రాచలమందుండు శ్రీరామా! అంటూ శతక ప్రారంభం కావించాడు.
శ్రీ రఘురామ! చారుతులసీదళధామ శమక్షమాది శృం
గార గుణాభిరామ ! త్రిజ గన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబంధరాక్షస విరామ ! జగజ్జన కల్మషార్నవో
త్తారకనామ ! భద్రగిరి, దాశరథీ కరుణాపయోనిధీ
ఆ భద్రాచల రామచంద్రుడు, జనులను సంతోషింపజేయువాడు, పరశురాముని జయించినవాడు, పరస్రీలయందాసక్తి లేనివాడు, నల్లని మేఘమువంటి శరీర కాంతిగలవాడు, కాకుత్ స్థ వంశమును సముద్రమునకు చంద్రునివంటి వాడు, రాక్షసుల సంహరించిన వాడు ఐన రాముడు !
రామవిశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ
స్తోమ పరాంగనావిముఖ సువ్రత కామ వినీల నీరద
శ్యామ కకుత్ధ్సవంశ కలశాంభుధిసోమ సురారిదోర్భలో
ద్ధామ విరామ భద్రగిరి - దాశరథీ కరుణాపయోనిధీ!
సత్యము మాట్లాడువాఁడవు, శరణన్న వారిని రక్ష్మించువాడవు, దయచేతఁ బాపములఁ బోగొట్టువాడవు, బ్రాహ్మణుల సంతోషింపజేయువాడవు, గంగానది పుట్టిన పాదపద్మములు గలవాడవు, మణులచే నిగ నిగ మెఱయు సొమ్ములు గలవాడవు, భద్రాచల రామా, మా యందు కరుణ చూపమని వేడుకుంటున్నాడు !
అగణిత సత్యభాష, శరణాగతపోష, దయాలసజ్ఘరీ
విగత సమస్తదోష, పృథివీసురతోష, త్రిలోక పూత కృ
ద్గగన ధునీ మరంద పదకంజ విశేష మణిప్రభా ధగ
ద్ధగిత విభూష భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!
శత్రువులను సంహరించినవాడవు, గరుత్మంతుడు వాహనముగ గలవాడవు, ఆపదల బోగొట్టువాడవు, రంగనాధునిచే సేవింపబడిన వాడవు, దయతో నొప్పు మనస్సుగలవాడవు, సత్సంగుడవు, సీతాహృదయమును పద్మమునకు తుమ్మెదవంటివాడవు, రాక్షసులకు బీభత్స కరుడవు, శుభాంగుడవునైన భద్రాచల రామా!
రంగదరాతిభంగ, ఖగ రాజతురంగ, విపత్పరంపరో
త్తుంగ తమఃపతంగ, పరి తోషితరంగ, దయాంతరంగ స
త్సంగ ధరాత్మజా హృదయ సారసభృంగ నిశాచరాబ్జమా
తంగ, శుభాంగ, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!
సంపదల నిచ్చువాడవు, మునులచే పూజింపబడినవాడవు, కీర్తిమంతుడవు, అన్ని భూతములను పాలించువాడవు, దుఖఃముల బోగొట్టువాడవు, క్షత్రియ కులమును సముద్రమునకు చంద్రుడవు, నృత్యము, గానము వేడుకగా గలవాడవు, దాశరధి !
శ్రీద సనందనాది మునిసేవిత పాద దిగంతకీర్తిసం
పాద సమస్తభూత పరిపాల వినోద విషాద వల్లి కా
చ్ఛేద ధరాధినాథకుల సింధుసుధామయపాద నృత్తగీ
తాది వినోద భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!
పెద్దల కందరికి మ్రొక్కి, వంచిన శరీరము గలవాడనై గురువైన రఘునాధభట్టునకు నమస్కరించి, కవిశ్రేష్ఠులను పొగడి, కార్య లాభమునకై యొక శతకంబును వ్రాసెదను. దీని నిష్టముతో గైకొనుము దాశరధీ।
ఆర్యుల కెల్ల మ్రొక్కి విన తాంగుడనై, రఘునాధ భట్టరా
రార్యుల కంజలెత్తి కవి సత్తములన్ వినుతించి కార్య సౌ
కర్య మెలర్పనొక్క శతకంబొన గూర్చి రచింతునేడుతా
త్పర్యమునన్ గ్రహింపుమిది దాశరథీ కరుణాపయోనిధీ!
-
రామాంకితం –
రేగుపండ్లను ముత్తెములుపోసి కొనినట్లు దురాశతో మోసపోయి నా కావ్యములను దుర్మార్గుల కిచ్చితిని; నా నాల్కకు పవిత్రత సులభముగ గల్గునట్లును, పలుకుదేనియలు చిల్కునట్లు నా పద్యము ముఖమును నాట్యరంగమునందు సంతోషముతో నీవు నటింపుము దాశరధీ !
మసకొని రేంగుబండ్లుకును మౌక్తికముల్ వెలవోసినట్లు దు
ర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితి మోసమయ్యె నా
రసనకుఁ బూతవృత్తి సుకరంబుగ జేకురునట్లు వాక్సుధా
రసములుచిల్క బద్యముఖ రంగమునందునటింప వయ్య సం
తసమును జెంది భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!
- పద్య వృత్తాలతో పాద సేవనం
రఘువంశమునకు చంద్రుని వంటివాడవు, అట్టి నీ చరణముల ఉత్పలము, చంపకము మొదలగు పద్యవృత్తములను పూలచే పూజించుదును. నా పూజలను గైకొనుము రామా !
శ్రీ రఘువంశ తోయధికి శీతమయూఖుడవైన నీ పవి
త్రోరుపదాబ్జముల్ వికసితోత్పల చంపక వృత్తమాధురీ
పూరితవాక్ప్రసూనముల బూజలొనర్చెద జిత్తగింపుమీ
తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!
-
భగవంతుని సేవకు ఆలస్యమెందులకు ? ఆర్తి
ముసలితనమున యమభటులు వాకిట ముందునకు వచ్చి యుండగా, రోగ మెక్కువై కఫము గొంతులో నిండినప్పుడు, బంధువులు చుట్టుకొన్నప్పుడు మిమ్ము తలతునో తలపలేనో, భజింతునో భజింపలేనో కాబట్టి యిప్పుడే నీ నామ స్మరణ చేయుదును స్వామి !
ముప్పున గాలకింకరులు ముంగిటవచ్చిన వేళ, రోగముల్
గొప్పరమైనచో గఫము కుత్తుక నిండినవేళ, బాంధవుల్
గప్పినవేళ, మీస్మరణ గల్గునొ గల్గదొ నాటి కిప్పుడే
తప్పకచేతు మీభజన దాశరథీ కరుణాపయోనిధీ!
-
భగవంతుని దర్శనం
పవిత్ర గోదావరి నదీ తీరమున నున్న భద్రాచలమునందుండుట జూచితిని, సీతను జూచితిని, గొప్పవైన ధనువును, బాణములను, శంఖచక్రముల జూచితిని, మిమ్ము, లక్ష్మణుని జూచి కృతార్ధుడనైతి. (ఇదే అన్నమాచార్యులవారి పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా !! అన్న కీర్తనలోని భావం మరియు అదిగో భద్రాద్రి, గౌతమి ఇదిగో చూడండి.. అన్న రామదాసు కీర్తనలో కూడా ఈ భావమే ధ్వనిస్తుంది)
కంటి నదీతటంబుబొడగంటిని భద్రనగాధివాసమున్
గంటి నిలాతనూజనురు కార్ముక మార్గణశంఖచక్రముల్
గంటిని మిమ్ము లక్ష్మణుని గంటి కృతార్ధుడ నైతి నో జగ
త్కంటక దైత్యనిర్దళన దాశరథీ కరుణాపయోనిధీ!
-
రామ నామ మహిమ - నామస్మరణం
'రా' యను నక్షరము పాపముల బారద్రోలగా, 'మా' యను నక్షరము వాకిలియై పాపముల జొరనీయకుండును అన్నది పెద్దల వాక్కు. 'రామ' యను అక్షరములు బుద్ధిమంతులు భక్తితో పలికినట్లైన ఆపదలు ప్రపంచ జనుల గ్రమ్ముకొనవు కాదా అంటూ రామ నామ మహిమను వివారిస్తున్నాడు.
'రా' కలుషంబులెల్ల బయలంబడద్రోచిన 'మా'క వాటమై
డీకొనిప్రోవుచునిక్క మనిధీయుతులెన్నఁదదీయ వర్ణముల్
గైకొని భక్తి చే నుడువఁగానరు గాక విపత్పరంపరల్
దాకొనునే జగజ్జనుల దాశరథీ కరుణాపయోనిధీ!
చిక్కని పాలమీద నిగనిగలాడు మీగడతో చక్కెర గలిపికొని తిన్నట్లుగ నీ రూప మనియెడు అమృతము నా ప్రేమ పాత్రలో తగిన దాస్యమను దోసిలి యందు లభించిందని చెప్పి జుఱ్ఱుకొందును.
చిక్కని పాలపై మిసిమిజెందిన మీగడ పంచదారతో
మెక్కిన భంగి మీ విమలమేచక రూపసుధారసంబు నా
మక్కువ పళ్ళెరంబున సమాహిత దాస్యమనేటి దోయిటన్
దక్కెనటంచు జుఱ్ఱెదను దాశరథీ కరుణాపయోనిధీ!
-
రామ నామ – ఘోషణ
యుద్ధమునందు భయంకరుడు, దుఃఖితులకు జుట్టము, ధనుర్విద్యయందును, భుజబలము నందును పేరు గన్న రాముని వంటి దేవుడింకొకడు లేడు. ఈ విషయము నేను లోకమునకు ఘంటాపథం గా, ఏనుగు నెక్కి చాటెదను రామ అని ఎలుగెత్తి చాటిన భక్తాగ్రేసరుడు కంచర్ల గోపన్న.
భండన భీముడార్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణకో
దండకళాప్రచండ భుజ తాండవకీర్తికి రామమూర్తికిన్
రెండవ సాటిదైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా
దాండద దాండ దాండ నిన దంబులజాండము నిండమత్తవే
దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ!
-
మోక్షార్ధన –
శబరి, గుహుడు వంటి నీ దాసులను దయతో నెలినావు. నీ దాసునికి దాసుడు కాకపోయినను నీ సేవాభాగ్యము నిచ్చితివి. నేను నీ స్తోత్రమే గాని ఎట్టి పాపము చేయలేదు. నన్నేల నీ దాసునిగ చేసికొనవు. అనగా నాకు మోక్షము ఇవ్వమని ప్రార్థిస్తున్నాడు.
దాసిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు; నీ
దాసుని దాసుడా గుహుడు తావకదాస్యమొసంగినావు; నే
జేసిన పాపమో వినుతి చేసిన గావవు; గావుమయ్య, నీ
దాసులలోన నేనొకడ దాశరథీ కరుణాపయోనిధీ!
ఎక్కడ తల్లిదండ్రి, సుతులెక్కడివారు, కళత్ర బాంధవం
బెక్కడ, జీవుఁడెట్టి తనువెత్తిన, పుట్టుచుఁ బోవుచున్న వా
డొక్కడె, పాపపుణ్య ఫలమొందిన నొక్కడె, కానరాడు వే
ఱొక్కడు వెంటనంటి, భవమొల్లనయా, కృపజూడవయ్య, నీ
టక్కరి మాయలందిడక, దాశరథీ కరుణాపయోనిధీ!
అంటూ ఆ శ్రీరామ చంద్రునికి మంగళాశాసనాలను అర్పిస్తూ శతక రచన చేశాడు భక్త రామదాసు.
"రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ మహితమంగళం
కౌసలేశాయ మందహాస దాసపోషణాయ
వాసవాది వినుత సద్వరాయ మంగళం"
“రామదాసాయ మృదుల హృదయ కమల వాసాయ,
స్వామి భద్రగిరివరాయ సర్వ మంగళం”
-
శ్రీకృష్ణ శతకం –
భక్తి శతకము లలో సులభంగా చదువుకొనునది నృసింహ కవి విరచిత శ్రీ కృష్ణ శతకం. తెలుగు వారందరూ గత కాలములో తమ చిన్నతనములో ఈ శతక పద్యాలను ఎక్కువగా పఠించేవారు. సులభ రీతిలో, సరళమైన భాషలో శ్రీకృష్ణ లీలలు, దశావతారములను ఈ శతకములో వర్ణించాడు కవి.
భారద్వాజసగోత్రుడ
గౌరవమున గంగమాంబ కరుణాసుతుడన్
పేరు నృసింహాహ్వయుడన్
శ్రీరమయుత నన్ను గావు సృష్టిని కృష్ణా
నీవే తల్లివి తండ్రివి
నీవే నా తోడు నీడ నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగఁ కృష్ణా
అనుదినము కృష్ణశతకము
వినినఁ బఠించినను ముక్తి వేడుక గలుగు\న్
ధనధాన్యము గోగణములు
తనయులు నభివృద్ధిఁ బొందు దద్దయుఁ కృష్ణా
అంటూ నృసింహ కవి అందించిన ఈ శతకం అబాలగోపాలం యొక్క అభిమానాన్ని సంపాదించుకున్నది.
ఈ విధముగా తెలుగు సాహిత్యములో శతక సాహిత్యం తెలుగునాట భక్తి ఉద్యమాలలో పాలు పంచుకొన్నది. నవవిధ భక్తి మార్గములన్నియు ఈ శతకములలో కానవస్తాయి. తెలుగు శతకకారులు తమ మంగళాశాసనాలతో ప్రజలలో భక్తి పరమైన, సామాజిక హితకారకాలైన అంశాలనెన్నింటినో సృజించారు. ఆ శతకకారులందరి కి శతాధిక వందన సహిత ధన్యవాదములు.
|| మంగళం మహత్ ||