
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
మధురవాణి ప్రత్యేకం
తప్పొప్పుల తక్కెడ – 6
6. చిన్నపిల్లలకు విద్యాభోదన

ఎలనాగ
భాషాప్రియులైన పాఠకులకు స్వాగతం.
ముందు గత సంచికలోని "తప్పొప్పుల తక్కెడ - 5" ను చర్చిద్దామా?
తప్పొప్పుల తక్కెడ – 5 : ఆడంబరం అభిలషణీయం కాదు
ఒక దేశ ప్రదానమంత్రి గారి షష్ఠిపూర్తి ఉత్సవాలను రంగరంగ వైభవంగా జరపాలని పార్టీ వాళ్లు ఊహించారు. అలా చేస్తే పార్టీ ప్రాధాన్యతను సంతరించుకుంటుందని వారి అభిప్రాయం. కానీ వారి ఉద్దేశ్యం ఆయనకు నచ్చక, వారి బలిష్టమైన కోరికను తిరస్కరించాడు. దాంతో వారి ఉత్సాహం చప్పగా మారింది. ఆయన నియమనిష్టల మనిషి అని అందరికీ తెలుసు. ఆడంబరానికి దూరంగా ఉండాలన్నది ఆయన పెట్టుకున్న నియమాలలో ఒకటి. మంచిదే అని చెప్పవచ్చు. రాజకీయ ప్రాభల్యం ఉన్నంత మాత్రాన గర్వపోతు కావాలా. ప్రజలు కూడా తమ నేత అభీష్ఠాన్ని మెచ్చుకుని భలా అన్నారు రాబోయే ఎన్నికల్లో ఆయన విజయానికి ధోకా లేదు అని విశ్వసణీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది
తప్పు ఒప్పు
1. ప్రదానమంత్రి - ప్రధానమంత్రి
2. షష్ఠిపూర్తి - షష్టిపూర్తి
3. రంగరంగ వైభవంగా - అంగరంగ వైభవంగా
4. ఊహించారు - నిశ్చయించారు/నిర్ణయించారు/అనుకున్నారు
5. ప్రాధాన్యతను - ప్రాధాన్యాన్ని
6. బలిష్టమైన - బలిష్ఠమైన
7. చప్పగా మారింది - చప్పబడింది
8. నియమనిష్టల - నియమనిష్ఠల
9. మంచిదే అని చెప్పవచ్చు - అది మంచిదే అని చెప్పవచ్చు
10. ప్రాభల్యం - ప్రాబల్యం
11. గర్వపోతు - గర్విష్ఠి
12. కావాలా - అవాలా?/అవ్వాలా?
13. అభీష్ఠాన్ని - అభీష్టాన్ని
14. భలా - భళా
15. ధోకా - ఢోకా
16. విశ్వసణీయ - విశ్వసనీయ
*ఉద్దేశం, ఉద్దేశ్యం రెండూ సరైనవే.
వివరణలు:
1. ప్రధానమంత్రి అనే పదాన్ని చాలా మంది తరచుగా ప్రదానమంత్రి అని తప్పుగా రాస్తారు. ఇక్కడ కేవలం జటను వదిలేయడం ఒక్కటే సమస్య కాదు. తప్పుగా రాసిన పదానికి భిన్నమైన అర్థం ఉండటం పెద్ద సమస్య. ప్రదానముకు భిన్నమైన అర్థం ఉంది మరి! ప్రదానము చేయుట అంటే ఇచ్చుట. కాబట్టి ప్రదానమంత్రి అంటే ఇచ్చే మంత్రి అవుతాడు!
2. షష్ఠి అంటే ఆరవ. షష్టి అంటే అరవైయవ. పంచమి తర్వాత వచ్చే తిథిని షష్ఠి అంటాం. కాబట్టి, ఆరవ జన్మదినం సందర్భంగా ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటే, అది షష్ఠిపూర్తి అవుతుంది. అరవై సంవత్సరాల వయసున్నప్పుడు చేసుకునేదాన్ని షష్టిపూర్తి అనాలి.
4. ఊహించారు అనే మాట తెలుగుభాషలో లేదని కాదు. ఆ విధంగా చూస్తే, అది సరైన పదమే. కానీ ఈ సందర్భంలో అది పొసగదు. నిశ్చయించారు, నిర్ణయించారు, అనుకున్నారు మొదలైనవి సరైనవి. ఈ శీర్షికలో ఇటువంటి పదాలు (భాష పరంగా సరైనవైనా, సందర్భానికి సరిపోనివి) ఎన్నో వస్తాయి. పాఠకులు జాగ్రత్తగా గమనించాలని మనవి.
5. ఈ మాటను ఇంతకు ముందు వేరే చోట్ల చాలాసార్లు చర్చించినప్పటికీ, తప్పొప్పుల తక్కెడ పాఠకులకోసం మళ్లీ వివరిస్తున్నాను. ప్రధానం అనే ధాతువుకు ఏదో ఒకవైపుననే ప్రత్యయాన్ని కలపాలని చెప్పారు భాషాశాస్త్రజ్ఞులు. కాబట్టి, ప్రధానత లేక ప్రాధాన్యం సరైన మాటలు. అదేవిధంగా ప్రముఖత లేక ప్రాముఖ్యం. ప్రాధాన్యత, ప్రాముఖ్యతల ప్రయోగాన్ని మానుకోవాలి. ఐతే ఇది ప్రాథమిక స్థాయికి చెందిన భాషాదోషం కాదు. కాబట్టి, మరీ అంత సీరియస్ గా తీసుకోవలసిన అవసరం లేదేమో.
7. చప్పగా మారింది అన్న ప్రయోగం కూడా తెలుగుభాషలో ఉన్నదే. కానీ ఈ సందర్భంలో 'చప్పబడింది' అనేదే చక్కగా పొసగుతుంది.
9. ఇలా సర్వనామం లేకుండా వాక్యాలను రాయడం మంచి పద్ధతి కాదు. ఏది మంచిదో చెప్పకపోవడం వలన ఈ వాక్యానికి సంపూర్ణత సిద్ధించలేదు. కాబట్టి, ప్రారంభంలో అది అని రాయాలి. కొన్ని సందర్భాల్లో ‘ఇది’ బాగా కుదురుతుంది.
11. నామవాచకాలకు, క్రియలకు అంత్యప్రత్యయాలను (suffixes ను) మనకిష్టమైన రీతిలో పెట్టకూడదు. వాటిని పూర్వీకులైన మన పండితులు ఇదివరకే నిర్ణయించారు. తిండి – తిండిపోతు, వదరు - వదరుబోతు, తాగు - తాగుబోతు ఉన్నాయి కనుక, గర్వపోతు అనలేము. దీనిని నిర్ణయించే విషయంలో పాణిని వ్యాకరణ సూత్రాలు ప్రధాన పాత్రను పోషిస్తాయి.
12. చాలా సూక్ష్మంగా పరీక్షిస్తే తప్ప ఇది పెద్ద భాషాదోషం కాకపోవచ్చును. వ్యవహారంలో అతి తరచుగా ఉపయోగింపబడే మాట ఇది. ఐతే, ‘కావాలా’ను Do you want? Is it needed? అని ప్రశ్నించే సందర్భంలో కూడా వాడుతాం కనుక, కొంత అయోమయానికి దారి తీసే అవకాశముంది.
15. ధోకా అంటే మోసం, వంచన. ఢోకా అంటే భయం, కొరత, ప్రమాదం. ఢోకాకు కూడా మోసం, వంచన అనే అర్థాలు ఇవ్వబడినప్పటికీ, అవి వ్యవహారంలో ఆ అర్థంలో ఎక్కువగా ప్రయోగింపబడవు.
~~~~
రాబోయే సంచిక కోసం తప్పొప్పుల తక్కెడ – 6 ను కింద ఇస్తున్నాను. సాహితీ బంధువులిక మీ భాషాజ్ఞానాన్ని ఉపయోగించి, ఈ క్రింది పారాగ్రాఫ్ లోని తప్పొప్పులను కనిపెట్టి జవాబులని రాయండి.
6. చిన్నపిల్లలకు విద్యాభోదన
ప్రాధమిక పాఠశాలల్లో చదివే పిల్లలకు తప్పనిసరిగా మాతృభాషలోనే విద్యాభోదన జరగాలనే వాదనను సమర్ధించని వారుంటారా! ఒకవేళ ఉంటే, అది దురదృష్టమైన విషయం. పిల్లలు తమ బాల్యంలో ఎక్కువ వరకు మాతృభాషనే, వినడం జరుగుతుంది కనుక ఆ లేత వయసులో వారికి ఆ భాషలో పాఠాలు నేర్చుకోవడమే ఈజీగా ఉంటుంది. ఆదశ లో ఆంగ్లాన్ని వాల్లమీద రుద్దితే, అది వారి మస్తిష్కాల మీద అనవసరమైన భారాన్ని మోపుతుంది. అప్పుడు వాళ్లకు మనస్థాపంతో వేగిపోతూ స్థిమితం లేని పరిస్తితి ఏర్పడుతుంది. ఎందుకంటే, ఆ చిన్న వయసులో ఒక కొత్తభాషను నేర్చుకునేందుకు వారి మేధస్సు అనువుగా ఉండదు. కేవలం ఇంగ్లీషు ఒక సబ్జెక్టుగా ఉంటే కొంత వరకు అది ఓకేనేమో. కాని మీడియంగా మాత్రం ఉండకూడదు.
*****