top of page

కథా మధురాలు

వలస తెచ్చిన మార్పు

Srinivasa Bharadwaj Kishore KiBaSri

శ్రీనివాస భరద్వాజ కిశోర్ ( కిభశ్రీ)

అట్లాంటా విమానాశ్రయం ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్  దాటుకుని నుంచి తమ లగేజ్ ట్రాలీ తోసుకుంటూ బైటికి వచ్చారు ఉజ్వల, నాగేంద్ర.  ముప్ఫై ఏళ్ళక్రితం చూసిన ఎయిర్పోర్టే అయినా కొత్తగా వచ్చిన అంతర్జాతీయ టర్మినల్ సొబగులను చూస్తూ ఆదమరచి వున్న ఉజ్వల, నాగేంద్ర ఎటు వెడుతున్నాడో అర్థంకాకపోయినా, ఎక్కడికి వెళ్ళాలో ముందుగానే తెలుసన్నట్లు నడుస్తున్న అతనివెంట నడువసాగింది. 

 

“ఆర్ యూ అనూష్క?” దాదాపు పాతిక సంవత్సరాల వయసు, చామనచాయలో వున్నా చక్కని కనుముక్కుతీరుతో, అమెరికాలో వుండేవారి తీరుదుస్తుల్లో ఉన్న అమ్మాయిని ఉద్దేశించి అడిగాడు నాగేంద్ర.  “నమస్తే అంకుల్” అంటూ కాళ్ళకు దండం పెట్టబోయిన అనూష్కను ఆపాడు నాగేంద్ర.

ఇంతలో సుమారు అదే వయసు అబ్బాయి కూడా అక్కడికి వచ్చి ఉజ్వలను ఉద్దేశించి “నమస్తే ఆంటీ” అని ఉజ్వలను ఉద్దేశించి అంటే వస్తారని అనుకున్నవారు కాకుండా అనుకోకుండా తారసపడిన ఈ ఇద్దరూ ఎవరో తెలియని పరిస్థితిలో,  నాగేంద్రవైపు అనుమానపు చూపు చూసి “నమస్తే”  అని ఒక అర చిరునవ్వు విసిరింది ఉజ్వల.  “యూ మస్ట్ బీ రంజన్ - రైట్” అన్న నాగేంద్ర ప్రశ్నకు “మీరు ఈజీగానే పోలిక పట్టేసారే” అంది అనూష్క.    “మరి మీ ఇద్దరి గురించి అన్ని వివరాలు చెప్పిందిగదా.... మా ……” పేరు పలకడానికి కూడా కాస్త జంకుతూ ఉజ్వలవైపు చూసాడు నాగేంద్ర.  “ఈ చలిలో ఎందుకు గానీ, కారులోనో, ఇల్లు చేరినతరువాతనో మాట్లాడుకుందాము పదండి” అని హడావుడి పెట్టి  ”మీరంతా ఇక్కడే వుండండి - ఇప్పుడే కారు తెస్తాను” అని  వెళ్ళాడు రంజన్.

  

“ఇంతకీ వీళ్ళిద్దరూ ఎవరు? మనం ఎక్కడికి వెళుతున్నాము?” అడిగింది ఉజ్వల, చూసేవారికి నాగేంద్ర చెవులు కొరుకుతూందా అనిపించేట్లు .  ఆమె మాటకు సమాధానం చెప్పకుండా  దాటేస్తూ “ఎంత దూరమమ్మా ఇల్లు ఇక్కడికి?” అని నాగేంద్ర అడిగిన ప్రశ్నకు అనూష్క "నలభై నిముషాలు పడుతుంది అంకుల్" అన్న సమాధానంతో మొదలు, ఉజ్వల ఉనికి పట్టించుకోకుండా కబుర్లలో పడిపోయారు నాగేంద్ర, అనూష్కలు “నేనంటే అందరికీ చులకనే - సమాధానం చూడు - ఎంత దూరం అని అడిగితే - నలభై నిముషాలట - చదివేస్తే ఉన్న మతి పోయిందన్నట్లు ” అనుకుంది ఉజ్వల చిరుకోపం ముఖంలో కనబరుస్తూ.

 

****

కారుడ్రైవు చేస్తూ రంజన్, నాగేంద్రలు ముందు వరుస పాసెంజర్ సీటులో, వెనుక సీటులో  అనూష్క, ఉజ్వలలు. 

“ఇంతకీ మనం ఎక్కడికి వెళుతున్నాము?” అని అనూష్కను అడిగింది ఉజ్వల.  నాగేంద్ర అడ్డుకుని, “అనూష్క, మీ పేరెంట్స్ ఎక్కడుంటారమ్మా?” అని అడిగిన ప్రశ్నకు అనూష్క సమాధానం ఇచ్చేలోగానే ఉజ్వల, మరోసారి “ఇంతకీ మనం ఎక్కడికి వెళుతున్నాము?” అని అడిగింది.  నాగేంద్ర కు సమాధానం చెబుతూ అనూష్క “వాళ్లు కూడా హైదరాబాదే అంకుల్ !  మీ ఇంటినించి సరిగ్గా రెండు కిలోమీటర్ల దూరంలోనే వుంటారు” అని సమాధానం చెప్పింది.  “ఓసి నీ గడుగ్గాయి!  మా ఇల్లు ఎక్కడో కూడా తెలుసన్నమాట నీకు” అని తనలో తను అనుకుని, ఎందుకు నన్నెవ్వరూ పట్టించుకోవడం లేదు అనుకుంటూ జెట్లాగ్ మూలాన మగత నిద్రావస్థలోకి జారిపోయింది ఉజ్వల. 

 

కాసేపటికి మెళకువ వచ్చి  “ఇంతకీ మనం ఎక్కడికి వెళుతున్నాము?” అని మళ్ళీ అడిగింది ఉజ్వల.  “ఆంటీ దాదాపు ఇరవైనాలుగు గంటల ప్రయాణం తరువాత బాగా అలసిపోయినట్లున్నారు!  ఇదిగో ఇంటికి వచ్చేసాము” అంటూ డ్రైవ్ వే మీదికి కారు తిప్పి గరాజ్ డోర్ రిమోట్ తో ఓపెన్ చేసాడు రంజన్. 

“ఎందుకు అందరూ నా మాట దాటేస్తున్నారు?   కొంపదీసి ———    అమ్మో మా ఇద్దరికీ ఎంత అభిప్రాయ భేదాలు వున్నా — ఆ ఆలోచనే భయంకరంగా వుంది— వద్దు బాబు” తనలో తను అనుకుంది ఉజ్వల

 

*****

 

ముందు అనూష్క, తరువాత రంజన్, తరువాత ఉజ్వల, ఆఖరుకు నాగేంద్ర గరాజీ నుంచి వంటింటిద్వారా వచ్చే తలుపులోనుంచి లోపలికి వచ్చారు.  ఉజ్వల “పెద్ద పెద్ద వాకిళ్ళు ఉంటాయి ఇళ్ళకు. కానీ అందరూ లోపలికి వచ్చేది దొడ్డిదారెంబడే” అని వెటకారంగానే అంటూనే కళ్లతో అన్ని దిక్కులలోనూ చూస్తూ - ఎవరికోసమో వెతుకుతూ, “మనం ఎవరింటికి వచ్చాము?” అని అడిగింది.  “ఆంటీ మా ఇంటికి - సారీ కాదు కాదు - మీ ఇంటికే వచ్చాము!    కాస్త రిఫ్రెష్ అయి బయలుదేరుదాము.  బాత్రూము చూపిస్తాను రండి.  టవళ్ళు బాత్రూములో వున్నాయి” అంటూ అతిథి సత్కారాలకు దిగాడు రంజన్.  “ఇంతకీ ఇక్కడికెందుకు వచ్చాము?  ఎక్కడికి వెళ్ళాలిప్పుడు?  నాకంతా అయోమయంగా వుంది” అంది ఉజ్వల.  అనూష్క యేదో చెప్పబోతూంటే నాగేంద్ర వెనుకనుంచి చిరునవ్వుతో చెప్పొద్దని సైగ చేస్తాడు।  అది గమనించి ఉజ్వల ఉక్రోషంగా  “సరేలేండి - ఏమీ చెప్పకుండా దాచిపెట్టండి - పరిచయాలు లేవు - పలకరింపులు లేవు, ముక్కూ మొగం తెలియని వారింట్లో రిలాక్స్ అవాలంట రిలాక్స్” అంటూ విసురుగా వెళ్ళి సోఫాలో కూర్చుంది ఉజ్వల.  మిగిలిన అందరూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు. 

 

అనూష్క ఉజ్వల పక్కనే కూర్చుని తన చేతిలోకి ఆమె చేతిని తీసుకుని, “ఆంటీ, మనం కలవకపోయినా, మీ గురించి మా ఇద్దరికీ అంతా తెలుసు” అంది. 

 

“మా గురించి ఏమేమి తెలుసు ఈ అమ్మాయికి?  కొంపదీసి అన్నీ చెప్పేసిందా యేమి మా సుపుత్రీమణి” అనుకుంటూ  “అదిసరే మా ఆయనకు మీరిద్దరూ ఎలా తెలుసు?” అని “ఇంతకీ ఇక్కడ యేమి జరుగుతూందో నాకు కాస్త యెవరైనా చెబుతారా?  ఎందుకు నన్నందరూ సస్పెన్సులో పెడుతున్నారు?  మీ అందరి వాలకం చూస్తూంటే నాకేదో —— అనుమానంగా వుంది” అంది ఉజ్వల.

 

ఎవరూ యేమీ మాట్లాడకపోవడంతో కాస్త కోపంగా “మేము రాకపోతే అసలు పెళ్ళే జరగదని మారాం చేసిన నా కూతురు ప్రజ్వల మా ఇద్దరికీ టికెట్లు పంపగా వచ్చాను గానీ, ఇక్కడ ఈ విధమైన ప్రవర్తనలు చూడవలసి వస్తుందని తెలిసుంటే అసలు వచ్చేదాన్ని కాదు.  అయినా వాళ్ళు రాకుండా మిమ్మల్ని పంపించారు” అని సాగదీసింది "నా కూతురు" అన్న పదం మీద కాస్త గర్వం నిండిన ఒత్తిడితో ఉజ్వల. 

 

“అబ్బా, వీళ్ళిద్దరి ఫోటోలూ మనని రిసీవ్ చేసుకునేందుకు వచ్చేవారిగా  మొన్న దూరదర్శన్ వార్తల్లో మూడు రోజులపాటు ప్రకటించారు. నీవు చూడలేదా?” కాస్త చిలిపితనం, కాస్త విసుగు కలిసిన స్వరంలో అన్నాడు నాగేంద్ర. 

 

“ఇక్కడేదో అంతా వింతగా వుంది.   మీ అంకుల్ కు నన్ను ఈవిధంగా సతాయించడంలో ఎంతో ఆనందం వస్తుంది కానీ రంజన్  నీవైనా చెప్పవయ్యా” అని కాస్త తగ్గి రంజన్ ను ఉద్దేశించి అడిగింది. 

 

సోఫాలో ఆమెకు ఇంకోవైపు కూర్చుని ఎంతో ఆప్యాయంగా “ఆంటీ,  మీకు తెలుసుగా ప్రజ్వల ఉండే వూరు చేరడానికి నాలుగు గంటలు డ్రైవ్ చేసుకెళ్ళాలి” అని రంజన్ తెలివిగా సమాధానం చెప్పి వివరాలేవీ చెప్పకుండా తప్పించుకున్నాడు.   “పెళ్ళికి తను కూడా వస్తుందా?” “తను” అన్నప్పుడు కొంత వ్యంగ్యం వ్యక్తపరుస్తూ “అయినా ఆవిడగారికి ఈ పెళ్ళిళ్ళు గిళ్ళిళ్ళు మన సంప్రదాయాలు గట్రా గిట్టవుగా” అంది ఉజ్వల.  ఆమె ఎవరినుద్దేశించి ఆ మాట అనిందో అక్కడున్నవారికందరికీ తెలుసు. 

 

“అలాగంటావేంటి - రాకుండా ఎలా వుంటుంది?  సరే!   టైమవుతూంది! మరి తయారవుదామా?” అని నాగేంద్ర తొందరపెట్టాడు కూతుళ్ళను వీలున్నంత త్వరలో కలుసుకోవాలని.

 

*********

 

రంజన్ కారు విజిటర్ పార్కింగ్ లాట్ లోకి తీసుకోవడం బాల్కనీనుంచి చూసి కిందికి పరిగెట్టుకుంటూ వచ్చి “పె--ద్ద--మ్మా--, హాయ్ మై జంక్ ఫుడ్ బడ్డీ బిగ్ డాడీ” అని అరుస్తూ ఉజ్వల నాగేంద్ర లను గట్తిగా వాటేసుకుంది ప్రజ్వల.  బుద్ధి తెలిసినప్పటినుంచీ ఎప్పుడూ ఇన్నాళ్ళు వీళ్ళకు దూరంగా వుండలేదన్న బాధనంతా తన ఉడుము పట్టుతో వ్యక్తపరిచింది ప్రజ్వల. 

“ఎలాగున్నావే బంగారు!!   ఇదేవిటే  — పెళ్ళికూతురివి  —  రెండు రోజులో పెళ్ళి - ఈ అవతారమేమిటే?” అడిగింది ఉజ్వల, తలిదండ్రులిద్దరూ కారు ప్రమాదంలో చనిపోయినప్పటినుంచీ తనదగ్గరే పెరిగిన ప్రజ్వలను ఉద్దేశించి.  “పెద్దమ్మా - నేను ఏ వేషంలో ఉన్నా నువ్వు మలిచిన నా పర్సనాలిటీ మారదు కదా?  నేను జీన్సు పాంటులో వున్నా నాలో ఉండే నీ జీన్సు మారవుకదా?  యే దేశంలో వున్నా, రక్తసంబంధం లేకపోయినా నా పెద్దనాన్న కూతురిని కాకపోతానా?” అని ఆప్యాయంగా నాగేంద్ర భుజంమీద పక్కవాటంగా ఆనించిన ప్రజ్వల తలను కళ్ళు కొంచెం చెమర్చిన నాగేంద్ర ప్రేమగా నిమిరాడు.  మాటలతో సమాధానం ఇస్తున్నా ఉజ్వల చూవులు మాత్రం అన్ని దిక్కులూ పరిగెడుతూ ఎవరికోసమో వెతుకుతున్నాయి.

 

“రండి రండి లోపలకు వెళ్దాము!   మీకు పెళ్ళికొడుకును పరిచయం చేస్తాను.  మీరు వస్తారని ఆత్రంగా వెయిట్ చేస్తున్నాడు” అని హడావుడి చేసింది ప్రజ్వల.  “ఇదేమి చోద్యమే!  పెళ్లికి ముందు పెళ్లికొడుకు మీ ఇంట్లోనే వుండడం” అని ఇంట్లోకి అడుగు పెడుతూ ఉజ్వల ప్రశ్నకు, “పెద్దమ్మా - ఇక్కడి సంస్కృతిని పాతికేళ్ళ కిందే అర్థం చేసుకున్న నీవేనా ఈ ప్రశ్న అడుగుతూండేది?” అని ప్రజ్వల అంటూండగా

మంచి ఖరీదైన షేర్వానీలో వున్న ఒక అబ్బాయి వచ్చి ఉజ్వల, నాగేంద్రలకు చిరునవ్వు కూడిన నమస్కారంతో పలకరించాడు.  రూపురేఖలలో కాకేషియన్ లాగ వున్నా, వాళ్ళ రంగులోలేని ఆ అబ్బాయిని చూసి అవాక్కై పోయింది ఉజ్వల. 

 

“అదేమిటే ఇతనెవరు? పెళ్ళి రౌనక్ తో కదా?  కొంపదీసి నీవు——?” అని స్నేహితురాలు చెవిలో మెల్లగా అడిగిన ప్రశ్నకు కాస్త ఆగమన్నట్లు సైగ చేసింది ప్రజ్వల.  ఇంతలో ఆ అబ్బాయి, “ఆంటీ - మీ ప్రయాణం బాగా జరిగిందా ?” అని అమెరికన్ యాసతో తెలుగులో అడగడంతో విస్తుబోయిన ఉజ్వల అప్రయత్నంగా తలవూపి సమాధానమిచ్చింది.

 

***

 

"పెద్దమ్మా, ఇతని పేరు క్రిస్.   ఇతనికి మనందరి గురించి అంతా తెలుసు"  అంది  ప్రజ్వల.   

"అంటే ఇతని గురించి మీ పెదనాన్నకు కూడా ముందే తెలుసన్నమాట" ఉక్రోషం వెళ్ళబుచ్చింది ఉజ్వల.

"మీ హెక్టిక్ ట్రావెల్ స్కెడ్యూల్  అయిపోగానే 30 గంటల ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చినందుకు చాలా  థాంక్స్.   మీరు రావడం ఎంతమందికి సంతోషం కలిగించిందో మీకు తెలియదు" అన్న క్రిస్ మాటకు "ఆ--సంతోషించిన అం---దరూ ఇక్కడున్నారుగా"  అంది  ఉజ్వల "అందరూ" అన్న పదం కాస్త దీర్ఘంతో.   ఆమె మాటలోని భావం అక్కడున్నవాళ్ళందికీ అర్థమైపోయింది.  "మా సంగతి అందరికీ తెలుసు కానీ ఇక్కడ వున్న ఏ ఒక్కరిగురించీ నాకు మాత్రం తెలియదు.  అన్ని విషయాలూ అందరితోనూ పంచుకునే అవసరం ఏమిటో?".  

 

"ఆంటీ నేను హైదరాబాదులో పుట్టాను" అన్నాడు క్రిస్.

"ఆగాగు ! ఏమి! నీవు పుట్టింది హైదరాబాదులోనా?  ఐ కాంట్ బిలీవ్ ఇట్" ఆనందాశ్చర్యాలతో అడిగింది ఉజ్వల.

"ఆంటీ, మా నాన్న అమెరికన్ సెంటర్ లో పనిచేసే రోజుల్లో, ఒక కాన్సర్ట్ లో  అద్భుతంగా వీణ వాయించిన ఒక అచ్చతెలుగు అమ్మాయిని చూసి, ఆమెమీద మనసుపడి, వాళ్ళ పేరెంట్స్ ను కన్విన్స్ చేసి హిందూ రిచువల్స్ ప్రకారం పెండ్లి చేసుకున్నాడు.  నాకు పదేళ్ళు వచ్చేవరకు అక్కడే వున్నాను" అని తనను గురించి చెప్పుకోవడం మొదలుపెట్టాడు క్రిస్."  ఉజ్వల మూడ్ లో మార్పు కనబడసాగింది " ఐ ఆల్రెడీ లైక్ యూ యంగ్ మాన్!"  అంది .

 

"థాంక్స్.  మా నాన్నకు పెళ్ళి తరువాత తెలుగు కల్చర్ మీద మక్కువ పెరిగింది.  మా ఇంట్లో అందరూ తెలుగే మాట్లాడుతాము, తెలుగు కస్టమ్స్, ఫెస్టివల్స్ ఎన్నో పాటిస్తాము" అంటూ కొనసాగించాడు క్రిస్.

 

"మీరే నయం. ఆ సంస్కృతిని పేరుకు మాత్రమే పుట్టుకతో సంతరించుకున్న మేము వెస్టర్న్ రీతులవైపు మోగ్గుతున్నాము.  ఎంతవరకో ఎందుకు నా స్వంత కూతురికే భారతీయ సంస్కృతి అంటే చిన్న చూపు" వెటకారంగా అంది ఉజ్వల.

 

"మరీ అంతగా తీసి పారేయకు దాన్ని.  నీ రోజులు గుర్తు తెచ్చుకో  అమెరికాలో డాక్టరేటు పట్టా పుచ్చుకుని, ఒక ఈగో క్లాష్ కు గురై ఇండియాకు తిరిగి వచ్చేంతవరకు నీవు యే విధంగా వుండే దానివి?" అడిగాడు నాగేంద్ర.

 

ఉజ్వల ఆలోచనలోకి వెళ్ళిపోయి "అవునుగదా - ఆ రేసిస్టు వెధవ మనమంతా వెస్టర్నైజ్ అయిపోయి వాళ్ళని బుట్టలో వేసుకుని మొత్తం తెల్లజాతి వర్ణసంకరం చేయాలన్న ఆలోచనలో వున్నట్లు అవమానపరచబట్టే కదా ——" అనుకుంటూంటే ఆమె ఆలోచనాసరళికి అడ్డుపడి నాగేంద్ర, "అదంతా ఎందుకు ఇప్పుడు,  ఈ కుర్రాడి సంస్కారం చూడు  -  షేర్వానీలో రాజకుమారుడిలా యెంత మెరిసిపోతున్నాడో" అన్నాడు.

ఆ మాటను అందుకుని ప్రజ్వల "అంతే కాదు పెద్దమ్మా, క్రిస్ కి వాళ్ల తల్లిదండ్రులు పెట్టిన అసలు పేరు కృష్ణచైతన్య.   వాళ్ళ అమ్మా నాన్నలతో కలసి ఇప్పటికీ ప్రతి శనివారం గుడికి వెడతాడు.  క్రిస్ తన బాండ్ కాన్సర్ట్స్ లో పాడుతున్నప్పుడు, తనకు తెలియకుండానే రాగాలాపన లాంటి ప్రక్రియలు చేసి అందరిని ఆశ్చర్యపెడుతుంటాడు!   అదేమని అడిగితే, తనకు తెలియకుండానే వస్తుందని, బహుశా చిన్నప్పటినుంచి ఇండియన్ మ్యూజిక్ ఇంట్లో వినబట్టి దాని ప్రభావం చాలా వుందనుకుంటాను అంటూంటాడు"  అంది .

 

ఇదంతా విన్న ఉజ్వల ఆనందం పట్టలేక "అబ్బాయ్ క్రిస్, కాదు కృష్ణచైతన్య,  ఐ లైక్ యూ ఎ లాట్.  మై డాటర్ ఈజ్ లక్కీ టు చూజ్ యూ"  అంది . 

 

ఆశ్చర్యంగా తికమకపడిపోతూ " యువర్ డాటర్? చూజ్ మీ?? వాట్ ఆర్ యూ గైస్ టాకింగ్ అబౌట్??" అన్న క్రిస్ ను ఉద్దేశించి ప్రజ్వల,  "క్రిస్, ఐ విల్ టెల్ యూ లేటర్.  చిల్ ఫర్ నౌ"  అంది  ప్రజ్వల.

 

ఉజ్వల వైపు తిరిగి, "పెద్దమ్మా నీకు నచ్చినట్లేనా?  నీవు క్రిస్ ను అప్రూవ్ చేసినట్లేనా?  ఐ నో. పెదనాన్న చిరునవ్వులోనే తెలుస్తూంది హీ ఈజ్ ఓకే అని"  అంది . 

 

"వేల దివిటీలతో వెదికినా దొరకని ఇంత బంగారంవంటి పిల్లవాడు వెదుక్కుంటూ కూతురి చేతిని అడిగితే యే తల్లి ఉక్కిరిబిక్కిరవదు? కంగ్రాట్స్ ఆన్ యువర్ చాయిస్" అని జవాబు చెప్పింది ఉజ్వల.

 

"అయితే ఇది పచ్చ జెండాయేనా?  మళ్ళీ నీ మనస్సు మార్చుకోవుగా?" చిలిపి చిరునవ్వుతో అడిగింది ప్రజ్వల.

"భగవంతుని మీద ఆన!  నేను నా మనస్సును మార్చుకోను"  అంది  ఉజ్వల.

 

" హమ్మయ్య!   ఇట్ ఈజ్ టైమ్ టు సెలెబ్రేట్ అండ్ లెట్ ది కాట్ అవుట్ ఆఫ్ బాగ్"  అంది  అనూష్క, వెంటనే ఫోను చేసెయ్యి - ఇంక మా వల్ల కాదు ఈ సస్పెన్స్ మొయ్యడం" అన్నాడు రంజన్.

 

ఆ మాట విని ఉజ్వల కంగారుగా "అదేంటి!   సస్పెన్సేమిటి!  కొంపదీసి వెధవపనులేమైనా చేసి కప్పి పుచ్చుకునేందుకు నాటకాలేమైనా ఆడుతున్నారా? అని అడిగింది ఉజ్వల.

 

అనూష్క అందుకుని, " ఆంటీ,  ఛీ, ఆంటీ అని కాదు, మేము కూడా పెద్దమ్మా అనే పిలుస్తాము.  పెద్దమ్మా మీ పెంపకంపై మీకు నమ్మకం ఇదేనా?"  అంది.

 

ఉజ్వల కొంచం ఉదాసీనంగా "అదే పెంపకం ఇద్దరికీ ఇచ్చాము మరి ఇద్దరిలో ఇంత వ్యత్యాసం ఎందుకో?" అంటే ఆమె భావాన్ని అర్థం చేసుకున్న రంజన్ "నిజం ముందే చెప్పితే మీరు రారన్న భయంతో !!!!" అన్నాడు.

 

ఉజ్వల "నిజమా!!  ఏమి నిజం!  అంటే నేను చూస్తూన్నదంతా అబద్ధమేనా?"  అంది  కంగారుగా.

 

నాగేంద్ర "అబ్బా అనుమానం, కోపం ముందు పుట్టి నీవు తరువాత పుట్టావనడంలో సందేహం లేదు.  కాస్త సావకాశంగా వాళ్ళు చెప్పేది వినరాదా" అన్నాడు రాని కోపాన్ని చూపించే ప్రయత్నం చేస్తూ.

 

" హే గైస్,  నౌ అయామ్ టోటలీ కన్ఫ్యూస్డ్" అన్న క్రిస్ కు "హాంగ్ ఆన్ క్రిస్!  ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్" అని సమాధానమిచ్చింది ప్రజ్వల.

"పెద్దమ్మా - అన్నింటికన్నా ముందు నిజం - మీరు వచ్చింది నా పెళ్ళికి కాదు" "నా--" అన్న పదం మీద నొక్కి  అంది  ప్రజ్వల.

 "నీ పెళ్ళికి కాదా? మరి ఎవరి పెళ్ళికే?  ఓహో - అర్థమయింది.  నాకు తిరుగు టికెట్టు తెప్పించు వెంటనే" కోపం వెళ్ళబెట్టింది ఉజ్వల. 

"ఆగు పెద్దమ్మా మరీ అంత త్వరగా నీ సొంత ఇంటర్ప్రెటేషన్ వద్దు - ఇంక రెండవనిజం - క్రిష్ పెళ్ళికొడుకేకాదు"  అంది  ప్రజ్వల. 

"మరి?" ప్రశ్నార్థక చూపుతో అడిగింది ఉజ్వల.

రంజన్ అందుకున్నాడు " క్రిష్ వాళ్ళ నాన్నకు మీ అమ్మాయి చాలా నచ్చేసింది.  తెలుగుదనం ఉట్టిపడుతూ బాపుగారి బొమ్మలా వుండే మీ కూతురిని మా పెళ్ళిలో ఆయన కన్నార్పకుడా చూడడం మేమందరం చూశాము"

దానికి స్పందించి ఉజ్వల "మరి నా కూతురంటే మాటలా?" అని ప్రజ్వలను హత్తుకుంది. 

"పెద్దమ్మా -----నన్నుచూసి కాదు----"  అంది  ప్రజ్వల తను కూడా ఉజ్వలకు అంటుకుపోతూ.  

"మరింకెవరిని... శ్రావణినా?"  మొట్టమొదటిసారి కన్నకూతురి పేరెత్తింది ఉజ్వల.

అందరూ తలవూపడం చూసి,"ఎప్పుడూ విరబోసుకున్న చింపిరి జుట్టు, జిడ్డోడు మొగం, చిరిగిన జీన్సులో వుండే శ్రావణి మొహాన్ని చూసి దిగ్భ్రాంతి చెందారంటే ఆయన టేస్టుకు నా జోహార్లు"  అంది .    దానికి

నాగేంద్ర "ఏదీ ఈ ఫోటోను చూసి ఆ మాట అను చూద్దాం?" అని పర్సులోనుంచి తీసి చూపించిన ఫోటో చూసి "ఎంత చక్కగున్నావే ప్రజ్వల, మీ అమ్మపోలికలోనే?"  అంది  ఉజ్వల. 

"అయ్యో - కళ్ళజోడు సరిగ్గా పెట్టుకుని చూడు పెద్దమ్మా.  కజిన్స్ అయినా ఐడెంటికల్  ట్విన్స్ లాగ వుంటామే కానీ ఏ విషయంలో చూసినా శ్రావణి నాకంటే నయమే.  అది శ్రావణి ఫోటో"  అంది  ప్రజ్వల. 

"అవును.  అది  నా బంగారుకొండే, నీ కూతురే.  అచ్చం నీవు ఆ వయసులో వున్నప్పుడు ఉన్నట్లే వుంది చూడు." అన్నాడు నాగేంద్ర. 

"నేనెప్పుడూ దాన్ని ఇంత చక్కగా, ఈవిధంగా తయారై చూడలేదు!  ఇది శ్రావణి ఫోటో అంటే నమ్మలేకుండా వున్నాను!   నా దృష్ఠే తగులుతుందేమో!!"  అంది  ఉజ్వల.

 

"దానిలోని తప్పులు వెదకడం దృష్ఠితో తప్ప ఇంకో కోణంనుంచి చూసావా ఎప్పుడైనా" మొదటిసారి కాస్త మందలింపు వినబడింది నాగేంద్ర గొంతులో.

 

"అది మాత్రం, నేను దాన్ని చిన్నచూపు చూస్తున్నాన్న తప్పు భావన తప్ప——  ఆఖరుకు, అమెరికా ప్రయాణం రోజు కూడా నాతో పడ్డ గొడవ, ఇంకెప్పుడూ నా మొహం చూడనని చేసి శపథం——" ఉజ్వల కళ్ళలోనుంచి కన్నీరు బొటబొటా కారసాగింది. 

 

సముదాయింపు చర్యగా ఆమె చుట్టూ చెయ్యి వేసి "పెద్దమ్మా, అవన్నీ ఇప్పుడెందుకు గుర్తు తెచ్చుకోవడం - అది పైకి ఆ విధంగా చేసిందే కాని, ప్లేను ఎక్కింది మొదలు, అమెరికా చేరేంతవరకు, కంట కార్చిన నీళ్ళు నేను చూసాను.  నిన్ను బాధపెట్టినందుకు తనలో తను ఎంత మథనపడిందో నాకు, పెదనాన్నకు తెలుసు"  అంది  ప్రజ్వల.

 

"మరి ఫోను చేసి ఏడవచ్చుగా – మూడేళ్ళ… నాలుగు నెలల... ఎనిమిది... రోజులయింది" మనసులోని అసలు భావన అభిమానాన్ని తొక్కేసి బైటికొచ్చింది ఉజ్వలకు. 

 

"దాని దగ్గరి నుంచి వచ్చిన ప్రతి ఫోనుకు, గొంతు వినగానే, నాకు అందించేసి అక్కడినుంచి వెళ్ళిపోయావే తప్ప, మాట్లాడే ప్రయత్నం చేసావా?" అడిగాడు నాగేంద్ర.

 

"రోషం నాకు లేదా?   దాని తల్లిని నేను" ఉజ్వల ఉక్రోషంగా  అంది. 

 

"రోషం అభిజాత్యం తల్లి ప్రేమను అంతగా ఎలా అణగదొక్కాయి?  మాట్లాడినంతసేపు పక్క గదిలోనుంచి చెవులు రిక్కించుకుని మా మాటలు విన్న సంగతి నాకు తెలియదనుకున్నావా?  పాపం పిచ్చిది - వచ్చిన ప్రతి ఫోనులోను, కాన్వర్సేషన్ సగానికి పైగా నీకు తనపై కోపం తగ్గిందా అన్న దానిమీదనే" ఇన్నాళ్ళుగా భార్య ప్రవర్తన మీద ఒక్కమాట కూడా అనని నాగేంద్ర విరుచుకుపడ్డాడు. 

 

"మరి మీరు మాత్రం - - ఎందుకు నాకు చీవాట్లు పెట్టి మాట్లాడించలేదు?"   మాతృవాత్సల్యం పొంగుకొచ్చి  అంది  ఉజ్వల. 

 

వంటగదిలోనుంచి స్వగృహ ఫుడ్స్ పాకెట్లలో చేగోడీలు, గవ్వలు తీసుకొచ్చి అనూష్క అందుకుంది "మీరు మీ చేతులతో చేసినట్లు తనకు తెలిస్తే పారేస్తుందని మీరనుకున్నట్లున్నారు, ఈ పాకెట్లలో ప్రజ్వలకోసం అని పంపేవారు.  కానీ శ్రావణి మాకందరికీ పంచేప్పుడు, మా అమ్మ మా కోసం తన చేతులతో మాపట్ల అమితమైన ప్రేమతో చేసినవే ఇవి. మీరు కూడా రుచి చూడండి ఇటువంటి చేగోడీలు ఎక్కడా దొరకవు అనేది".

 

దొరికింది అదననుకుని రంజన్ ఎత్తుకున్నాడు "మీరు పాడిన పాటల సీడీలు దాదాపు అన్నీ మాతో రెండు కాపీలు తెప్పించి మాకు ఒక కాపీ ఇచ్చింది మీ అమ్మాయి.  మీ ప్రోగ్రాముల వీడియోలన్నీ యూట్యూబులో చూపిస్తూనే వుంటుంది". 

 

"ఎవరూ శ్రావణే?" అడిగింది ఉజ్వల సగం పూడుకున్న గొంతుతో.  ఇదంతా విని ఉజ్వల "అంటే శ్రావణికి నామీద కోపం లేదంటారా?" అని అడిగింది అమాయకంగా.

 

" లేదు పెద్దమ్మా -  ముందునుంచీ, శ్రావణికి నీవంటే ప్రాణం!  కానీ దానికి నీతో ముఖాముఖి అనేప్పటికి ఏమయేదో అర్థం అయేది కాదు!  ఏదో ఈగో అడ్డొచ్చేది!  మీ మధ్య కమ్యూనికేషన్ గాప్ పెరుగుతూ పోయింది.  అన్ని విషయాలలోనూ నీకు ఏది ఇష్టం లేదో అదే చేసి చూపించేది."  అంది  ప్రజ్వల. 

 

"మరి ఇప్పుటికీ అలాగే వుందా లేదా కొంచమైనా మారిందా?  వేషభాషలలోనూ వ్యవహారాలలోనూ ఇంత మార్పు యెలా వచ్చింది"  కళ్ళను తుడుచుకుంటూ అడిగింది ఉజ్వల.

 

"ఇదిగో నిన్ను తన నిజాయతీ, మంచితనంతో, ప్రేమలకు ప్రతిరూపం తో ఆకట్టుకున్న - నీ కృష్ణ చైతన్య పుణ్యమా అని" క్రిష్ ను చూపించింది ప్రజ్వల.

 

" ఫస్ట్ టైం శ్రావణిని టెంపుల్ లో లో చూసినప్పుడు, డిప్రెషన్ లో వుందని తెలుసుకున్నాను.  మెల్లగా క్లాస్మేట్ గా దగ్గరైన తరువాత సిబ్లింగ్ రైవల్రీ విక్టిం అని అర్థం చేసుకున్నాను.  ఆమెకు fresh perspective to family, feelings, and bondings చూపించాను.  అప్పటినుంచీ మీరు చేసిన ప్రతి పనీ ఏ విధంగా తనమీద ప్రేమతో చేసారో రియలైజ్ అయింది శ్రావణి. అంతే the absolutely wonderful person in her came out in an instant.  వీ బోత్ ఆర్ వెరీ  క్లోజ్ ఆజ్ సోల్ మేట్స్.  బట్ మీరు, మా పేరెంట్స్, మాకు ఇచ్చిన వాల్యూస్ మూలాన వితౌట్ గెటింగ్ ఇన్టు ఎనీ  రిలేషన్షిప్, బెస్ట్ ఫ్రెండ్స్ గా వుండిపోయాము" అన్నాడు.

 

" క్రిష్ తో కొన్నిసార్లు మాట్లాడినప్పుడే నాకు కూడా అతనంటే అభిమానం ఇష్టం ఏర్పడ్డాయి" అన్నాడు నాగేంద్ర. 

 

రంజన్ "పెద్దమ్మా, మాకందరికీ, ఇండియాలో వున్నంతకాలం, ఫ్రీగా వచ్చే వాటి విలువ, ముఖ్యంగా ప్రేమాభిమానాల విలువ తెలియదు.  అమెరికాలోని సగటు నాగరీకులు, మా స్థాయికి అందుకోడానికి పడవలసిన వ్యయప్రయాసల గురించి, తల్లిదండ్రులప్రేమకు నోచుకోని వారిగురించి తెలుసుకున్న తరువాత, ఇంట్లో అడగకుండానే దొరికే అన్నం విలువ తెలిసి వచ్చింది"   అన్నాడు.

 

"మనం మన తరం అనుభవాలను దృష్ఠిలో పెట్టుకుని వీళ్ళకు ఆలోచించే స్వేచ్ఛ ఇవ్వము!  ఆలోచించి చూస్తే వీళ్ళకు మనకంటే ఎక్సపోజర్, మెచ్యూరిటీ ఎక్కువ!  అంతే కాదు, ఇక్కడికి వలసవచ్చిన తరువాత తాము పెరిగిన సమాజంలోని విలువలను, వాటిపట్ల తమ బాధ్యతలను తెలుసుకుని, వాటిని సక్రమంగా అమలుపరచాలన్న ఆలోచన రావడం - హాట్సాఫ్ టు యువర్ జనరేషన్" చాలా నిజాయితీ కూడిన ప్రశంసలనిచ్చాడు నాగేంద్ర.

 

ఉజ్వల నలుగురు పిల్లలను దగ్గరికి చేర్చుకుని "ఈగో ఎంత మనోక్షోభకు దారితీస్తుందో నాకు కూడా తెలిసింది.  ఇన్నాళ్ళూ పనికిమాలిన అభిమానంతో శ్రావణితో మాట్లాడలేదే కానీ, లోలోపల ఎంత మథనపడినానో ఆ దేవునికే తెలుసు.   ఇంక ఆగలేను.  నన్ను తనదగ్గరికి - ఛీఛీ నా అభిమానం పాడుగాను, నా బిడ్డ శ్రావణి దగ్గరికి తీసుకెళ్ళరూ ప్లీజ్?" అని ప్రాధేయపడింది ఉజ్వల.

 

"ఇక ఫైనల్ నిజం!  ఇప్పుడు మనమంతా ఇక్కడ చేరింది పెళ్ళికే - మీ ముద్దుల కూతుళ్ళిద్దరూ రేపు మీ 30వ ఆనివర్సరీ అని మరచిపోకుండా మీ అనుమతి లేకుండానే గుళ్ళో సాయంకాలం వేంకటేశ్వరకల్యాణం ఏర్పాటు చేశారు. - అంటే మేము అబద్ధం చెప్పలేదనేగా?" అన్నాడు రంజన్.  ఇంతలో బెల్ మోగిన శబ్ధం.

 

ఠక్కున లేచి "హమ్మయ్య - పెద్దమ్మా, అదిగో వచ్చేసింది మన హీరోయిన్" అని పరిగెట్టి తలుపు తీసింది ప్రజ్వల.

ఇక నేనుకూడా ఆగలేనన్నట్లు ఉజ్వల,  నా కూతురిని చూడకుండావుండడం నా వల్ల కాదన్నట్లు నాగేంద్ర ప్రజ్వల వెంట పరుగెత్తారు. 

 

ఎదురుగా ... కళ్ళనిండా నీటితో శ్రావణి... లోపల ఆమెకెదురుగా ఉజ్వల.   ఇన్నాళ్ళుగా పేరుకుని వున్న అగాధాన్ని దాటలేక నిలిచిపోయారు... కానీ అహంకారాన్ని ప్రేమానుబంధాలు అరక్షణంలో చిత్తుచేయడంతో గట్టిగా కావలించుకుని ఆనందభాష్పాలు ధారాపాతంగా కార్చసాగారు.  మిగతావారందరినీ  కూడా ఈ దృశ్యం కదిలించివేసింది.

.

oooo

మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...
 

Bio

శ్రీనివాస భరద్వాజ కిశోర్ ( కిభశ్రీ)

శ్రీనివాస భరద్వాజ కిశోర్: వీరి కలం పేరు కిభశ్రీ. 17 సం।।లు భారత దేశంలో వైజ్ఞానికునిగానూ, గత 19 సం।।లుగా అమెరికాలో ఐటీ మానేజ్మెంట్ లోనూ పని చేసి కళారంగంలో కృషి ద్విగుణీకృతం చేసేందుకు పదవీవిరమణ చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు. దాదాపు 600 గేయాలకు బాణీలు కట్టారు, 16 సంగీత రూపకాలకు సంగీతం సమకూర్చారు.  తెలుగు, హిందీ ఆంగ్ల భాషలలో పద్యాలు, కవితలు, గజళ్ళు, నాటికలు, సంగీత రూపకాలు వ్రాసారు.  గత సంవత్సరం "కదంబం" పద్య గేయ సంపుటి డా।।సినారె గారి చేతులమీద విడుదల అయింది. 250 మంది అమెరికన్ సభ్యులు గల టాలహాసీ కమ్యూనిటీ కోరస్, స్వరవాహిని బృందాలు ఈయన వ్రాసి స్వరబద్ధం చేసిన గేయాలను చాలా వేదికలమీద పాడారు.  ఈయన వ్రాసి స్వరబద్ధం చేసిన చాలా గేయాలను, నాటకాలను బృందాలు దర్శించాయి. ఫ్లోరిడాలోని టాలహాసీ నగర నివాసి.

***

Comments
bottom of page