top of page

వంగూరి పి.పా.

అమెరికా వారోత్సవాల కథ

వంగూరి చిట్టెన్ రాజు

మొన్న ఆదివారం మా వారోత్సవంలో భలే చికాకు వేసింది. అదేమిటో కానీ, ప్రతీ వారం ఇలా ఏదో ఒక చిన్న చికాకు వస్తూనే ఉంటుంది, అయినా మా ఇంట్లో వారోత్సవాలు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. వారోత్సవం అంటే ప్రతీ వారం అడ్డమైన గడ్డీ, నానా చెత్తా కొనేసుకుని డబ్బులు తగలేసేసి ఆ తరవాత భోరుమనే మా షాపింగ్ సంబరాలు అన్నమాట. ఈ ఉత్సవ తతంగం ప్రతీ శనివారం పొద్దున్నే మొదలవుతుంది. వారాంతంలో కూడా ఏదో పెద్ద పని ఉన్నట్టు నా కంటే ఎప్పుడూ ముందే నిద్ర లేచి, రక రకాల చప్పుళ్ళు, కూతలు, సద్దుళ్ళు, కొండొకచో అరుపులతో దున్న పోతులా పడుకున్న నేను కూడా పక్క దిగ వలసి వస్తుంది. అలా దిగి, నేను స్నానం, గీనం వగైరా పూర్తి చేసుకున్నాక మా ఇద్దరి మధ్యా ఎంతో ఆత్మీయంగా పలకరింపులు ఉంటాయి. పెళ్ళయి ఇన్నేళ్ళయినా మా ప్రేమానుబంధాలు వీసమెత్తు అయినా తగ్గ లేదు సరి కదా, ప్రతీ వారం కొత్త కొత్త ప్రేమ డైలాగులు కూడా పుట్టుకొస్తున్నాయి. అమెరికా వచ్చినప్పటి నుంచీ మా వారోత్సవం లో మొదటి డైలాగుల క్రమం ఇలా ఉంటుంది.

నేను: ఇవాళ పని మనిషి గంగమ్మ వచ్చిందా?  

ఆవిడ: ఆ, ఇందాకా వచ్చింది. కాస్త కాఫీ కావాలేమో అడుగు. అవునూ, పొద్దున్న తోట పనికి ఫెర్నాండేజ్ గాడు  వచ్చాడా?

 

నేను; ఆఆ ...వచ్చాడు. ఇవాళ గడ్డి కట్ చెయ్యక్కర్లేదు అంటున్నాడు. గంగమ్మా, కాఫీ కావాలా? టీ ఇవ్వనా?

ఆవిడ: ఏడిశాడు. పని ఎగ్గొట్టడానికి అలాగే అంటాడు. అదేం కుదరదు. లేక పొతే కనీసం మొక్కల్లో పెరిగిపోయిన గడ్డి పీక మను. లేక పొతే ఊరుకోను. హా...ఇవాళ గంగమ్మ కి ఆ వెధవ అమెరికన్ ఫిల్టర్ కాఫీ ఇవ్వకు. మాంఛి ఇండియన్ బ్రూ కాఫీ పెట్టు. పంచదార నేనే వేసుకుంటాలే. నువ్వు వేస్తే కాఫీ రుచి పోయి పానకం తాగుతున్నట్టు ఉంటుంది.

 

నేను: ఓకీ, డోకీ ..వంటావిడ కాంతమ్మ వచ్చిందా? ఈ వారం స్పెషల్స్ ఏమిటో?

ఆవిడ: ఆ...వచ్చింది. రాక చస్తుందా. వారానికి సరిపడా వంట చేసి చావాలిగా. స్పెషల్సూ, గిషల్సూ నై జాంతా....ఏం చేస్తే అవి తినాల్సిందే!  ఇవాళ అస్సలు వంట మూడ్ లేదు.

 

నేను: అది కాదోయ్. వారం అంతా ఒకే డాల్, ఒకే సబ్జీ ఈటింగ్ పని వాడికి కష్టమ్....పాపమ్ ఇష్టమ్ అయిన వాడ్ని కుకింగ్ చెయ్యమను కాంతమ్మని.

ఆవిడ: ఏమిటా ఆ వెధవ సంకర భాష...సరిగ్గా టాక్ టాక్కపోతే నో పప్పు, నో కూర....ఇవాళ కాంతమ్మ అంతా రెస్ట్ ..నో  వంటా, పెంటా...రోజంతా ఋతురాగాలు, మా ఇంటి మహా లక్ష్మి...(అంటూ టీవీ రిమోట్ తీసుకొనుట)

 

నేను: వాకే, వాకే. ఇవాళ చాకలి వెంకమ్మ వచ్చిందా? (సదరు రిమోట్ లాక్కొనుట)

ఆవిడ: ఆ..ఆ...రాక చస్తుందా? ఒకటా రెండా,  వారానికి డజను లోపలి చెడ్డీలు, రోజుకో తడి తువ్వాలు, గదికి రెండు దుప్పట్లు, నాలుగు తలగడా కవర్లు, చెత్తా చెదారం ఉతికి ఆరెయ్యక పొతే అయ్య గారికి  ఆవేశం.  అన్నట్టు క్రిందటి వారం సబ్బు పిండి అయిపోయింది, కొనుక్కురమ్మని సూన్నారాయణకి చెప్పి చచ్చాను. తెచ్చాడా?

నేను: సబ్బు పిండా? అదేమిటీ?

ఆవిడ: అబ్బబ్బ..నీతో చస్తున్నాను. ఇంగ్లీషు మాట రాగానే తెలుగో అని ఏడుస్తావు. నేను తెలుగులో ఏడిస్తే నీకు అర్థం అవదు..సబ్బు పిండి అంటే ..లాండ్రీ డిటర్జెంట్ ..అండర్ స్టాండ్?

 

నేను: (నాలిక కొరుక్కునుట, టాపిక్ మార్చుటకు ప్రయత్నించుట’)...సూన్నారాయణ కి ఈ  వారం షాపింగ్ లిస్టు ఇస్తే వెళ్లి అన్నీ పట్టుకొస్తాడు. లేకపోతే నడ్డి మీద చంపేస్తాను వెధవని.

ఆవిడ: ప్రత్యేకం రాసివ్వడానికేం ఉంది. ఎప్పుడూ తెచ్చేవేగా..వెధవ దేశం, ఒకటే రొటీను, విసుగోస్తోంది.  లెటజ్ గో బేక్ టు వైజాగ్ ఆర్ కాకినాడా....

 

నేను: ఓకీ, డోకీ

ఆవిడ: అదిగో...మళ్ళీ ఆ మాట అన్నావంటే చంపేస్తాను. పెద్ద టెక్సస్ కౌబోయ్ అనుకుంటున్నావేమో...ఆంధ్రా బైతూ... (ఆవిడ ఎడం చేతి చూపుడు వేలు గంటకు వెయ్యి మైళ్ళ వేగంలో నా వేపు చూపి ఊపుట).

 

నేను:  (పల్లెత్తి ఒక్క మాట అనకుండా కేవలం చేతి వేలిని మాత్రమే వాడే ఆవిడ భావ ప్రకటనా చాతుర్యాన్ని గమనించి వెను వెంటనే ఠకీమని అక్కడే ఉన్న పావు తెల్ల కాగితపు ముక్కను...అనగా నేను ఇంటికి పోస్ట్ లో వచ్చిన ప్రకటనలలో – ఉదాహరణకి అమెరికా జాతీయ స్థాయి సంస్థల ఎన్ని’కుల’ బేలట్లు- - ఒక వేపు మాత్రమే ముద్రించి వెనక వేపు ఖాళీగా తెల్లగా ఉన్న వాటిని నాలుగు భాగాలుగా కత్తిరించుకుని ఇలాంటి పరిస్థితులలో షాపింగ్ లిస్టులు రాసుకొనుట కోసం వాడుకునే  అత్యవసర వస్తువు)  తీసుకుని గత పదేళ్ళగా రాస్తున్న వార్షికోత్సవ షాపింగ్ పట్టిక మళ్ళీ రాయడం మొదలు పెట్టుట)

పరవా లేదు ..చెప్పండి కాంతమ్మా,  వెంకమ్మా, గంగమ్మా

ఆవిడ: అంటే లాండ్రీ డిటర్జెంట్ తేలేదన్నమాట ఆ వెధవ సూన్నారాయణ (ఆవిడ నాలిక్కరుచుకొని, నా వేపు అదోలా సారీ అన్నట్టు చూచుట)

 

నేను: ఏం పరవా లేదు ప్రేయసీ (ఉదయావేశములో దగ్గరగా వెళ్లి ప్రేమ అభినయించుట.

ఆవిడ: సిగ్గు లేకపోతే సరి  (లెంపకాయ కొట్టుట అభినయించుట)

 

నేను: వాకే, వాకే....రెండు శాతం కొవ్వు గల లీటర్ పాలు, యోగర్ట్ అనబడే పెరుగు,  వంకాయలు, దొండ కాయలు, నువ్వు తినే ఆకులు అలములూ,....ఇంకా ఏమైనా ఉన్నాయా?

ఆవిడ: లేకేం..సబ్బు పిండి....ఈ సారి మర్చిపోతే ...నీ చెడ్డీలు, నా తువ్వాళ్ళు అన్నీ నీవే ఉత్తి సబ్బుతో రుద్ది ఉతక వలెను. (ఎడం చేతి చూపుడు వేలు ఊపుట కార్యక్రమ పున:ప్రారంభం)

 

నేను : (ఏడుపు): ఒకే, ఒకే...మరి కంది పప్పు, ఉప్పు , ఆవాలు, జీలకర్ర వగైరాలేమైనా ఉన్నాయా?

ఆవిడ: నీ మొహం. ఉంటే అడుగుతానా? లేనివేమిటో అవి అడగాలి....

 

నేను: (మాట పడిపోవుట) గుర్, గుర్

ఆవిడ: సర్లే....ఐదు అరటి పళ్ళు, మూడున్నర ఏపిల్ పళ్ళు...

 

నేను: వాట్? మూడున్నర ఏపిల్ పళ్ళా? వాళ్ళు అలా సగం సగం అమ్మరు. ఓన్లీ హోల్ సేల్. (నా పన్ కి నేనే సంతసించుట)

ఆవిడ: అదిగో అదే. నాకు కావలసినది చెప్పాను కానీ వాళ్ళు ఏం అమ్ముతారో చెప్పానా?

నేను: (మళ్ళీ మాట పడిపోవుట)    

 

పై విధంగా ప్రతీ వారాంతం లోనూ మా ఇంట్లో నేను ఫెర్నాండేజ్, సూన్నారాయణ మొదలైన బహుపాత్రాభినయం చేస్తూ ఉంటే మా క్వీన్ విక్టోరియా గంగమ్మ, కాంతమ్మ, వెంకమ్మ వగైరా పాత్రలలో అష్టావధానం చేస్తూ సంసారం చక్కపెడుతూ ఉంటుంది. ఇక ఎదుగుతున్న పిల్లా, పీచూ ఉంటే అంతే సంగతులు. వారోత్సవం అంతా వాళ్ళ సేవలోనే గడిచిపోతుంది.  

 

అమెరికాలో పని మనుషులు అక్కర్లేదుగా...అన్నీ మెషీన్లే చేసేస్తాయిగా అనుకునే వాళ్ళు ఆ కాకమ్మ కథలు నమ్మకండి. అమెరికా ఇల్లాళ్లు ఇండియాలో పది మంది పని వాళ్ళు చేసే పనులు చేస్తారు. అలాగే ఇండియాలో ఇక్కడి వస్తువు అక్కడ పెట్టని మగ పురుషులు అమెరికాలో ఇంటి పన్లూ, బయట పన్లూ వాళ్ళే చేసుకుంటూ ఒళ్ళు హూనం చేసుకుంటూ ఆనందం నటిస్తూ ఉంటారు. కావాలంటే ఓ సారి వచ్చి నాలుగు రోజులు ఉండి చూడండి.

అలాగే వస్తారా? బాబోయ్ ..వీసా కావాలా?  ఆ ఒక్కటే అడక్కండి!

 

అన్నట్టు ఆటోమేటిక్ మెషీన్లు అనగానే నేను ఎన్ని సార్లు చూసినా ఆబ్బురపడే ఈ క్రింది ‘బాపు’ కార్టూన్ గుర్తుకొస్తొంది

( ఈ కార్టూన్ -మధురవాణి సంక్రాతి 2016  నుంచి పునర్ముద్రితం)

*****

మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...

1
2
3
comments
bottom of page