top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

టీం-జావా (Click & Call ==SAVE)

prasad-oruganti_edited.jpg

ప్రసాద్ ఓరుగంటి

java.jpg

సమయం రాత్రి 8 గంటలు. 

హైదరాబాద్. 

ఒక పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ.

ఒక పాతికేళ్ల యువతీ కంప్యూటర్ వైపు చూస్తూ చాలా అసహనం గా ఉంది, తను అనుకున్న, రావాల్సిన ఫలితం రాకపోవడం తో.  ఇంకో అరగంట లో ఆన్ సైట్ కాల్ ఉంది. ఇంకా ప్రాబ్లెమ్ సాల్వ్ అవలేదు అని. ఈ ఇష్యూ ఫిక్స్ అయితే, అమెరికా లో నున్న టీం కి అప్డేట్ చేసేసి క్యాబ్ లో రూం కి వెళ్ళవచ్చని ఆ అమ్మాయి ఆలోచన.

ట్రింగ్ ట్రింగ్ మని సెల్ ఫోన్ రింగు. “హే దివ్యా! ఏంటి ఇంకా ఆఫీస్ లో ఉన్నావా? ఇంటికెళ్ళావా” అంటూ ఒక గొంతు అటుపక్క. "ఇంకో అరగంట లో మీటింగ్ ఉంది, నాకేమో ఇక్కడ బగ్ ఫిక్స్ అవ్వలేదు. టెన్షన్ తో చస్తున్నా ఇక్కడ...మా టీం అందరూ వెళ్లిపోయారు. ఈరోజు నాదే అప్డేట్ ఇవ్వాలి ఆన్ సైట్ వాళ్ళకి...నాకు పిచ్చి ఎక్కేలా ఉంది" -మాటల్లో విసుగు దాచలేకపోయింది దివ్య. " ఫర్లేదులే. నేను నీ ఆఫీసుకి వచ్చి, మీ హాస్టల్ దగ్గర వదిలేస్తాను. " చెప్పింది అటువైపు గొంతు. "సరేలే. అయిన వెంటనే వాట్స్ అప్ టెక్స్ట్ చేస్తా. వచ్చేసేయ్” అంది దివ్య. “ సరే. జాగ్రత్త.” అని పెట్టింది అటుపక్క గొంతు.

సమయం 8 గంటల ఏభై నిముషాలు. ఆఫీస్ లో అందరూ ఒక్కొక్క ఇంటికి మెల్లగా వెళ్తున్నారు. దివ్య కూడా కంప్యూటర్ ఆఫ్ చేసి, వచ్చేయమని వాట్స్ అప్ టెక్స్ట్ చేసింది… అటుపక్క నుంచి వెంటనే రిప్లై వచ్చింది.

రావాల్సిన సమయానికి కాసింత ఆలస్యంగానే వచ్చాడు కళ్యాణ్. వస్తూనే- "హే ట్రాఫిక్ చాలా ఉంది. ఆలస్యమైంది” అంటూ “బయట డిన్నర్ చేద్దామా, లేకపోతే డ్రాప్ చేసేయనా” అన్నాడు కళ్యాణ్ కార్ నడుపుతూ, పక్కన కూర్చున్న దివ్య తో. ‘లేదు నేను ఇంట్లో తినేస్తా...టూ లేట్ ఇప్పటికే’ అని అంది దివ్య. ఓకే అంటూ కార్ దివ్య రూమ్ వైపుకి పోనిచ్చాడు అతను.

**

"కళ్యాణ్, ఏంటీ విషయం? నిన్న ఎవరో అమ్మాయి నీ కార్లో? ప్రేమ కథా?" అంటూ కళ్యాణ్ ఉంటున్న ఫ్లాట్ కి నలుగురు ఫ్రెండ్స్ వస్తూనే వెంటపడ్డారు. "అవును ఫ్రెండ్స్, తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు మూడేళ్ళ కిందట అమీర్ పేట లో జావా కోర్స్ నేర్చుకుందామని వెళ్ళినప్పుడు పరిచయం అయ్యింది. మూడేళ్ళలోనే తాననుకున్న లక్ష్యాన్ని సాధించుకుంది. వెరీ స్మార్ట్.”  అన్నాడు కళ్యాణ్. గతాన్ని తలుచుకుంటూ అన్నాడు కళ్యాణ్. "అలా గాలిలో చూడటం కాకుండా ఆ కథేదో మాకూ చెప్పొచ్చుగా?" నవ్వుతూ అడిగారు స్నేహితులు.

**

మైత్రీవనం సెంటర్. అమీర్ పేట.  హైదరాబాద్. అక్కడ ఆ వీధులన్నీ బానర్స్ తో కప్పి ఇదే ఆకాశం అని చెబుతున్నట్టుగా ఉంది. చాలా పేపర్స్ కింద పడి ఉన్నాయి. ఒక పక్క జిరాక్స్ మెషిన్ లో నుంచి కాపీ లు తీయిస్తున్నారు. ఇంకో పక్క చిన్న బండి మీద నూడుల్స్ పెట్టి టక టక సౌండ్ చేస్తూ అమ్మేస్తున్నారు. అక్కడ అమ్మాయిలు, అబ్బాయిలు యేవో మాట్లాడుకుంటూ అవి తింటున్నారు. ఇంజనీరింగ్ ని పూర్తిచేసి, క్యాంపస్ లో జాబ్ కొట్టని అమ్మాయిలు, అబ్బాయిలు వచ్చి ఏమి నేర్చుకుంటే బావుంటుందని అడిగి, కోర్సెస్ లో జాయిన్ అవుతున్నారు. ఇంజనీరింగ్ అయిన వెంటనే నేను కూడా అక్కడ జావా కోర్సు చేద్దామని ఒక సెంటర్ కి వెళ్ళా. అప్పడు కనపడింది నా కలల రాణి దివ్య. అప్పుడు యేవో ప్రశ్నలు వేస్తోంది ఇన్స్ట్రక్టర్ ని. "నేను ఆమె నే చూస్తున్నానప్పుడు. అలా మొదలయి, ఇప్పటి వరకూ చూస్తూనే ఉన్నాను." నవ్వుతూ అంటూ "కాఫీ తాగి వస్తా" అంటూ కిచెన్ లో కెళ్ళాడు కళ్యాణ్.

ఆ తర్వాతా వదల్లేదు వాళ్ళు – “తర్వాత?” అంటూ వెంటపడటంతో- "ఆమె రోజూ క్లాస్ కి మిస్ అవకుండా వచ్చేది. నేను కూడా మిస్ అయ్యేవాడిని కాదు ఈ మిస్ ని చూడకుండా. ఆమె చాలా ఏకాగ్రతగా కూర్చుని వింటూండేది. ఇచ్చిన ప్రోగ్రాంలు టక టక ఎగ్జిక్యూట్ చేసేసి అవుట్ ఫుట్ చూపించేది. నా నా ధ్యాస మాత్రం అంతా ఆమే. ఒక్కోసారి తన నోట్స్ అడిగేవాడిని- “హలో దివ్యా! మీ నోట్స్ ఇస్తే నేను అవి చూసి "హలో వరల్డ్" లు ఎగ్జిక్యూట్ చేసుకుంటా అని, ఆమె నవ్వు కునేది. మనోడు ఇంకా హలోవరల్డ్ లో నే ఉన్నాడు అనుకుని కాబోలు. కోర్ జావా వరకూ నోట్సు అడిగేవాడినల్లా, అడ్వాన్సుడ్ జావా మొదలయ్యాక "క్లాస్ అయ్యాక నూడుల్స్ తిందామా?" అంటూ అపుడప్పుడూ అడిగి కాసేపు మాట్లాడేవాడిని, కుటుంబం, ఊరు, చదువులు, లక్ష్యాలు ఎన్నో మాటలు తను చెబుతుంటే వింటూండే వాడిని." చెబుతూ ఉన్న కళ్యాణ్ ఏదో గుర్తొచ్చినవాడిలా -" ఫ్రెండ్స్, నాకు అర్జంట్ పనుంది, తర్వాత తీరిగ్గా మాట్లాడదామని అంటూ ఫోన్ లో మునిగిపోయాడు కళ్యాణ్.

"వీడూ, వీడి పనీ. వీడెపుడూ ఇంతే." స్నేహితులు అనటం వినిపిస్తూనే ఉంది కళ్యాణ్ కి.

**

దివ్యా హాస్టల్

హే దివ్యా... ఎవరా అబ్బాయి? ఏమా కథ? రూమ్మేట్ రమ ఆటపట్టించసాగింది దివ్యని. దివ్యా మొదలెట్టింది.

వాడు మంచోడే. కానీ ప్రోగ్రామింగ్ మీద ఎప్పుడూ ధ్యాస లేదు. నా ఆలోచనలు అంతా వేరు. నేను మంచి ఉద్యోగంలో చేరాలి, నా కెరీర్ చాలా బాగా ఉండాలి. అదే లక్ష్యం. ఆ జావా ని జావ లా తాగేసి, జాబ్స్ కి అప్లై చేశా. నాకు వెంటనే ఈ కంపెనీ లో జాబ్ వచ్చేసింది. జాబ్ వచ్చిన తరువాత నేను కళ్యాణ్ తో మాట్లాడిందే లేదు, నా జాబ్, నేను సమయమే సరిపోకపోయేది. ఆలోచిస్తే ఇపుడనిపిస్తుంది- కళ్యాణ్ ని నేను ఎప్పడూ అతను గురించి అడగలేదు. అతను మాత్రం నా గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉండేవాడు.

"అంటే అతనికి జీవితంలో లో సెటిల్ అవుదామని లేదంటావా"... అని ఆపిల్ కొరుకుతూ అడిగింది రమ. "అవునే అలాంటిదే...ఎప్పుడూ నా గురించి ఆలోచిస్తూ, నన్నే చూస్తూ ఉండేవాడు. సో నేను ఎక్కువగా పట్టించుకోలేదు. నాకెపుడు ఎలాంటి భావాలు కలుగలేదు కానీ, ఒక మంచి స్నేహితుడని అనిపించేది." అంది.

కాసేపాగి -" నాకు ఉద్యోగమొచ్చాక ఫోన్ చేసాడు- కంగ్రాట్స్ చెప్పటానికి. నేనూ "ఇంకా అక్కడే ఉన్నావా? కొత్తగా ఏమైనా నేర్చుకున్నావా?" అంటూ ప్రశ్నలడిగి, మంచి సలహా ఇచ్చాను. “ఒక స్నేహితురాలిగా చెప్తున్నా. కోర్సుల్లో ఎంతో కొంత నేర్చుకున్నావు కదా. ఎక్కడైనా జాబ్ చేయచ్చు కదా..అలా ఖాళీ గా తిరగకపోతే" అని. "సరే"అని ఫోన్ పెట్టేసాడు.

నేను చాలా హ్యాపీ గా ఉన్నాను, జాబ్ ఉంది ఎప్పుడో అమెరికా కి onsite కూడా వెళ్ళవచ్చు, అప్పుడప్పుడు కొంచం వర్క్ ప్రెషర్ ఉన్నా, జాబ్ ని ఎంజాయ్ చేస్తు న్నాను. హాలిడేస్ కి ఆమ్మా వాళ్ళింటికెళ్ళడం అక్కడ వాళ్ళు మా అమ్మాయి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ లో జాబ్ అని గొప్పగా చెప్పడం, అహ, వండర్ఫుల్ డేస్.

రోజులు గడుస్తున్నాయి, ఇంట్లో వాళ్ళు సంబంధాలు మొదలెట్టారు. ఆస్ట్రేలియా నుంచి, అమెరికా దాకా అబ్బాయిలు ఫోటో లు వస్తున్నాయి. కానీ నాకెవరు నచ్చట్లేదు. తొందరెందుకూ, మెల్లగా చూద్దాం అని ఆమ్మా వాళ్ళకి చెప్పేదాన్ని.  నా మైండ్ లో కూడా ఎవరూ లేరు. ఉన్నది ఒకటే- అది జావా కోడింగ్.

చెబుతూ చెబుతూ దివ్య ఆలోచనల్లో పడి, మౌనంగా మారింది.

**

కళ్యాణ్ ఫ్రెండ్స్ తో:

తనకి జాబ్ వచ్చిన తరువాత నేను ఎక్కువ గా మాట్లాడలేదు, తను నాకెప్పుడూ ఫోన్ చేయలేదు. నేనే అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉండేవాడిని. ఎలా ఉంది జాబ్, హాస్టల్, అని....

ఒకరోజు తను ఆఫీస్ నుంచి లేట్ గా ఆఫీస్ కి ఇంటికి బయల్దేరింది. తను క్యాబ్ బుక్ చేసుకోపోవడం తో అక్కడ ఆగి ఉన్న ఆటో ని పిలిచింది. ఆటో ఎక్కింది. ఆటో మెల్లగా బయలుదేరింది. తను చాలా పనివత్తిడి వల్ల అలసటలో ఉందేమో, ఆటో ఎటెళుతుందీ గమనించలేదు. అంతలో మెయిన్ రోడ్ నుంచి ఆటో అడ్డారూటులోకి మరలటం, సరిగ్గా ఆ సమయం లోనే నా ఫోన్ మోగటంతో ఉలిక్కిపడిన దివ్య అటూ, ఇటూ చూసి, పరిస్థితి గమనించి అలర్టయి, నాతో ఫోన్ లో ధైర్యంగా మాట్లాడుతూ ఎటెళుతుందీ, ఎక్కడుందీ, ఆటో నంబర్ వగైరా వివరాలు సాధారణంగా చెబుతూ మాట్లాడుతుండటంతో, ఆటో వాడది గమనించి, మెయిన్ రోడ్ వైపుకి తిప్పేసాడట.  ఆ తర్వాత కాసేపటికి క్షేమంగా హాస్టల్ కి చేరాకకూడా ఫోన్ వదలలేదు దివ్య. గట్టిగా ఏడ్చేసి, నా ఫోన్ కాల్ వల్లే ప్రమాదం జరగలేదని పదే పదే అంది. ఇక ఆ తర్వాత నుంచీ, అపుడపుడు స్నేహంగా ఫోన్ చేసేది తను. తన గురించి చెప్పేదే కానీ, నా వివరాలెపుడూ అడగలేదు. ఉద్యోగంలో చేరమన్న సలహా ఇవ్వటం మాత్రం మానలేదు." నవ్వుతూ ముగించాడు కళ్యాణ్.

**

హాస్టల్ లో దివ్య:

దివ్యా, ఏ ఆలోచనల్లో ఉన్నావు? నీ కథ పూర్తి చేస్తావా? రమ కదిలించటంతో - ఆ రోజు గుర్తు చేసుకుంది దివ్య.-

ఒక రాత్రి ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరినప్పుడు ఆటో వాడు నన్ను ఎక్కడికో తీసికెళ్తుంటే, సడన్ గా నాకు కళ్యాణ్ నుంచి ఫోన్ వచ్చింది, నన్ను మాట్లాడుతూ ధైర్యం గా ఉండమన్నాడు. ఈ లోపులో ఒక పోలీస్ వాన్ వచ్చి ఆ ఆటో డ్రైవర్ ని పోలీస్ స్టేషన్ కి తీసికెళ్లారు.

ఆ రాత్రి కళ్యాణ్ తో మాట్లాడుతూ ఏడ్చేసా...అదే అతనితో అంతసేపు మాట్లాడింది. ఆ రాత్రి తలచుకుంటే ఇప్పటికే భయం గా ఉంటుంది. నన్ను అతనే కాపాడాడు. అప్పటినుంచి అతనితో మాట్లాడాలనిపించేది. కానీ, అప్పటికీ అతనికి కెరీర్ మీద గైడెన్స్ ఇచ్చి జాబ్ చేసుకోమని చెప్తూనే ఉన్నా. అతను ‘అలాగే అలాగే’ అని అంటుండేవాడు. అతనితో స్నేహం చెయ్యాలనిపించేది, యేవో యేవో కబుర్లు చెప్పాలనిపించేది. కానీ ఒక్కటే బాధగా ఉండేది అతను ఇంకా సెటిల్ అవలేదని. అలా అలా మొదలయ్యింది మా స్టోరీ.  చాల్లే. ఇంక పడుకోండి” అంటూ లైట్ కట్టేసి పడుకుంది.

"బానే ఇంటరెస్టింగ్ గానే ఉంది మీ స్టోరీ...చూద్దాం ఎక్కడికి వెళ్తుందో" అంది రమ వాట్స్ అప్ చూసుకుంటూ.

**

సమయం 2AM. హైదరాబాద్. కాల్ సెంటర్ ఆఫీస్. ఇద్దరు అమ్మాయిలు క్యాబ్ లో హాస్టల్ కి వెళదామని క్యాబ్ ని బుక్ చేసుకున్నారు. క్యాబ్ వచ్చింది. అమ్మాయిలు క్యాబ్ ఎక్కారు. కొంత దూరం వెళ్లిన తరువాత క్యాబ్ మెయిన్ రూట్ నుంచి అడ్డా రూట్ కెళ్ళి ఆగింది. అక్కడ ఇద్దరు మగాళ్లు కార్ ఎక్కుదామనుకున్నారు. ఒక అమ్మాయి డ్రైవర్ తో అరుస్తోంది “ఎవరు వాళ్ళు” అని, ఇంకో అమ్మాయి మొబైల్ మీద ఏదో పని చేస్తోంది. ఈ డిస్కషన్ అయిన 10 నిమిషాలలో ఒక పోలీస్ వాన్ వచ్చి ఆగింది... డ్రైవర్ తో పాటు ఆ మగాళ్లని కూడా పోలీస్ లు తీసికెళ్లారు.

సమయం నాలుగు గంటలు. తెల్లవారు జామున. ఒక ఫామిలీ బండి మీద వెళ్తున్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళని వెంబడిస్తున్నారు. ఈ ఫామిలీ అతను బండిని ఫాస్ట్ గా పోనివ్వడం మొదలెట్టాడు. కొంత దూరం వెళ్లి బండి ని ఆపాడు. ఈ లోపులో గుర్తు తెలియని వ్యక్తులు వస్తున్నారు. వాళ్ళని పట్టుకుని గన్ చూపించి ఎవరు మీరు అని గట్టి గా అడిగాడు. ఈలోపులో పోలీస్ వాన్ వచ్చింది. ఆ గుర్తు తెలియని వ్యక్తులని పోలీస్ లు పోలీస్ స్టేషన్ కి తీసికెళ్లారు.

**

హైదరాబాద్ లో అర్ధ రాత్రి నుంచి, తెల్లవారు జామున ఇంటికి వెళ్లే జాబ్ చేస్తున్న యువతులు అందరూ వాళ్ళ వాళ్ళ ఫోన్ లలో ఒక ఆప్ ని వాడుతూ, క్షేమంగా ఇంటికి గా వెళ్తున్నారు. ఏదైనా గుర్తు తెలియని వ్యక్తులు ఆ క్యాబ్ లో కి ఎక్కాలనుకున్నా, లేదా ఆటో లు దారి మళ్లించాలనుకున్నా- పది నిమిషాలలో పోలీస్ లు వచ్చేస్తున్నారు, అమ్మాయిలను సురక్షితం గా ఇంటికి చేరుస్తున్నారు. ఆగంతకులను జైలు కి పంపిస్తున్నారు.

 

“హే కళ్యాణ్ ! దివ్యా హియర్. ఏంటి ఏమి చేస్తున్నావ్” అంది దివ్యా. "వర్క్ లో ఉన్నా. ట్రాక్ చేస్తున్నా" అని రిప్లై ఇచ్చాడు కళ్యాణ్. "ఏంటీ అక్కడ బయట అమ్మాయిలని చూస్తున్నావా. ఏదో ట్రాక్ చేస్తున్నానంటున్నావ్” అని నవ్వుతూ అంది. ఆ మాటకి "అవును అమ్మాయిల్నే ట్రాక్ చేస్తున్నా" అని నవ్వుతూ అన్నాడు. "హే కళ్యాణ్... చిన్న సలహా. నువ్వు ఏమి అనుకోకపోతే ఒక మాట వింటావా. నేను నీకు మళ్ళి జావా ని రిఫ్రెష్ చేస్తా. బాగా నేర్చుకుని జాబ్ ట్రై చేయవచ్చుకదా, ఇలా అమ్మాయిలని చూస్తూ ఇంకా ఎప్పటికి సెటిల్ అవుతావు" అంది. "సరే సరే ఇంక తొందరలోనే సెటిల్ అయిపోతాను. ఓకేనా" అని అన్నాడు కళ్యాణ్ . "ఎప్పుడో నేర్చుకున్నవాళ్లందరికీ జాబ్ వచ్చేసింది. ఆ గ్రూప్ లో నువ్వొక్కడే ఇంకా సెటిల్ అవలేదని నా ఫీలింగ్ అంతే. డోంట్  మైండ్" అని పెట్టేసింది దివ్య .

**

ఆ ఆప్ ఆండ్రాయిడ్, IOS లలో చక్కగా రన్ అవుతోంది. ఆ ఆప్ క్లిక్ చేసిన వెంటనే గూగుల్ మ్యాప్ ద్వారా అక్కడున్న ప్రదేశం అవతలవాళ్ళకి చేరుతుంది. ఎమర్జెన్సీ కాల్ నొక్కినవెంటనే, ఆ చుట్టుపక్కల మొబైల్ రూమ్స్ కి చేరి వెంటనే ఆ టీం అలెర్ట్ అయ్యి, ఇక్కడ ఫోన్ అలారమ్ కింద మోగుతుంది. 10 లేదా 15 నిమిషాలలో ఆ టీం ఇక్కడికొచ్చి సేవ్ చేస్తూ ఉంటుంది. ఆపదలోనున్న అమ్మాయిలు అందరూ వాడుతున్నారు. అప్పుడప్పుడు కొంచం సరదాగా కి కూడా వాడుకుని ఆ టీం చేత చివాట్లు కూడా తింటున్నారు.

**

దివ్యా కాల్ చేసింది కళ్యాణ్ కి. "హే కళ్యాణ్, "సేఫ్ ట్రావెల్" అనే ఆప్ గురించి తెలుసుగా? రియల్లీ ఇట్స్ సేవింగ్ వర్కింగ్ గర్ల్స్ లైవ్స్. నాకే ఆ ఆప్ రెండు, మూడు సార్లు ఉపయోగ పడింది. ఆ కంపెనీ రీసెంట్ గా స్టార్ట్ అయింది. చాలా మంది వర్క్ చేస్తున్నారట. వాళ్ళ దాంట్లో చాలా ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయిట. జావా మీద, నైట్ టీం సపోర్ట్ అని. నువ్వు ఎందుకు ట్రై చేయకూడదు కళ్యాణ్? ఎంతో కొంత మనీ వస్తుంది, దానికన్నా, అలాంటి టీం లో పనిచేస్తూంటే, నలుగురికీ సాయపడిన తృప్తి ఎంత ఉంటుందో తెలుసా?  నేను కూడా చూస్తున్నా అక్కడ. వస్తే హ్యాపీ గా అక్కడకే వచ్చేస్తా"అని అంటూ, "ఇదిగో కళ్యాణ్. ప్లీజ్ దీని గురించి కొంచం ఆలోచించవా?" అంటూ పెట్టేసింది ఫోన్ .

**

దివ్యా హాస్టల్ లో:

హే దివ్యా, సీ న్యూస్ లో వస్తోంది ఆ "సేఫ్ ట్రావెల్" ఆప్ గురించి. అంటూ రమ పిలిచింది. ఆరోజు ఆదివారం కావటం వల్ల కొందరు స్నేహితులు కూడా ఉన్నారు. ఈ మధ్య ఆ ఆప్ కి పెరిగిన క్రేజ్ వల్ల, మిగతా పనులు పక్కనబెట్టి స్నేహితులంతా టీ.వీ. ముందే సెటిలయ్యారు. దివ్యా, ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు. అప్పుడే లైవ్ లో కి ఒకతను వచ్చి కుర్చీ లో కూర్చున్నాడు. యాంకర్ చెప్తోంది. ప్లీజ్ వెల్కమ్! కళ్యాణ్, యంగ్ సీఈఓ అఫ్ ది కంపెనీ. ఇప్పుడు ఈ ఆప్ గురించి తెలియని యువతులు ఉండరు. ఇంకా తెలియని వాళ్ళకి ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆ ఆప్ గురించి, ఆ ఆప్ ని కనిపెట్టిన మన కళ్యాణ్ గురించి మీకందరికీ చెప్పబోతున్నాం.” అంటూ కళ్యాణ్ వైపు తిప్పారు కెమెరా.

తెరపై కళ్యాణ్ ని చూసిన దివ్య కి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. స్నేహితులదీ ఇంచుమించు అదే పరిస్థితి.

కళ్యాణ్ చెప్తున్నాడు టీవీ లో ఆ ఆప్ గురించి. "నేను మాములుగానే ఇంజనీరింగ్ చదివి పాస్ అయ్యా. చదువుతున్నప్పుడే నాకు ఒక ఆప్ ని తయారు చేసి, దానిని ఎక్కువమందికి ఉపయోగపడేలా చెయ్యాలని తపన ఉండేది. ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడే నేను ఈ ప్రాజెక్ట్ కి అంకురార్పణ చేశాను.  నా సీనియర్స్ అమ్మాయిలు కి జరిగిన అలాంటి సంఘటనలు ఏ అమ్మాయిలకి జరగకుండా ఉండాలనే ఈ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేశాను ".

మొదట్లో ఎవరైనా ఎమర్జెన్సీ కాల్ ని కొట్టిన వెంటనే, ఆ కాల్ మా మొబైల్ టీం కి రావడం. ఆ తరువాత మా మొబైల్ టీం నుంచి పెద్దగా అలారమ్ మెసేజ్ లు పంపడం, దీనివలన అడ్డదారిలో వెళదామనుకునేవాళ్లకి భయాన్ని కల్పించాం. తరువాత ఇంటర్నల్ గా కొద్దీ మంది తో టీం ని ఏర్పాటు చేసి, ఏదైనా సంఘటన జరిగిన వెంటనే వాళ్ళు ఇమ్మీడియేట్ గా ఆ ప్లేస్ కెళ్ళి, అమ్మాయిలని సేఫ్ జోన్ కి తీసికెళ్ళేవాళ్ళం. ఆ తరువాత పోలీస్ టీం తో కూడా అనుసంధానమయ్యి ఆ ఆప్ ద్వారా, పోలీస్ లు కూడా సకాలం లో అక్కడికి వచ్చి బాధితుల్ని సేవ్ చేస్తున్నారు. నెమ్మదిగా స్టార్ట్ అయ్యిన ఈ టీం, మేము కూడా జాయిన్ అవుతాం నైట్ టీం సపోర్ట్ కి అంటూ చాలా మంది మాకు, పోలీస్ డిపార్ట్మెంట్ కి హెల్ప్ చేస్తున్నారు. అక్కడ టీవీ చూస్తున్న అమ్మాయిల కళ్ళలో అతనిపట్ల కృతజ్ఞతాభావం.

దివ్య TV లో మాట్లాడుతున్న కళ్యాణ్ వైపుకి చూస్తూ-  ‘ఇతనే నా కళ్యాణ్’ అంటూ అబ్బురపడింది తనకు తనే.

**

కాసేపయ్యాక, కళ్యాణ్ నుంచి ఫోన్.  తెలీని తడబాటు దివ్యలో. “హే దివ్యా, ఈ వీకెండ్ కూర్చుందామా జావా క్లాస్ లో." మామూలుగా అడుగుతున్న కళ్యాణ్ ని ఆపేస్తూ-  “అయాం సిల్లీ, కళ్యాణ్. నువ్వు నాకు ఎప్పుడూ నీ గురించి చెప్పలేదు. కాదు కాదు. నేనే నీ గురించి అడగలేదు. అంటూ గొణిగింది దివ్య.

**

6 నెలల తర్వాత

‘కళ్యాణ్! నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పేసాను మన గురించి. ఒకసారి నిన్ను రమ్మంటున్నారు. టీవీ లో చూశారట. కానీ దగ్గర గా చూడాలిట. అప్పుడే డిసైడ్ చేస్తారుట” నవ్వుతూ అంది దివ్య.

“సరే. నువ్వు కూడా నచ్చేసావుట మా వాళ్ళకి.  మరి మన పెళ్లి జావా క్లాసుల్లో కాకుండా, జాబిలి పైనయితేనే చేస్తారట. నీకు ఓకేగా?" సరదాగా అన్నాడు కళ్యాణ్.

“దానికేం? మనం ఒక ఆప్ తయారు చేసి, అది నొక్కిన వెంటనే స్పెషల్ రాకెట్ వచ్చి మనందరినీ అలా జాబిలి పైకి తీసుకెళితే, అంతకన్నానా?” అంటూ నవ్వేసింది జావా బాల దివ్య.

*****

bottom of page