top of page

సత్యాన్వేషణ - 13

తెలుగు భాషా‘కోవిడు’లొచ్చారు, జాగ్రత్త!

 

సత్యం మందపాటి

adannamaata.png

సంపుటి  5   సంచిక  3

Website Published &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

దాదాపు ఒక సంవత్సరమయిందేమో, నన్ను అడక్కుండానే కొంతమంది తెలుగు మిత్రులు రకరకాల తెలుగు గుంపులలో నా పేరు చేర్చేశారు. వాటి పేర్లు కూడా కొన్ని గమ్మత్తుగా వున్నాయి. అవి బహిరంగంగా ఈ వ్యాసంలో చెప్పటం భావ్యం కాదు కనుక, అవి ఎలా వున్నాయో మాత్రం చెబుతాను. ‘తెలుగు ఆట’. ‘తెలుగు కోట’, ‘తెలుగు బాట’, ‘తెలుగు పీట’, ‘తెలుగు తీట’, ‘తెలుగు తాట’ లాటివి.

నాకు నరనరానా తెలుగు భాషాభిమానం అనేది ఒకటి వుంది కదా, అందుకని సరే కానీలే వీలున్నప్పుడు చదువుకోవచ్చు అని వూరుకున్నాను.

వటుడింతై, ఇంతింతై అని.. నా తపాలా పెట్టెలో రోజుకి ఐదారు ఉత్తరాలతో మొదలయి, రోజుకి ఇరవై ముఫై పైనే రావటం మొదలయింది. వారిలో కొంతమంది విశ్వవిద్యాలయాల వారు, తెలుగు ఆచార్యులు, పరిశోధకులు, ఉపాధ్యాయులు, రచయితలు, విమర్శకులు మొదలైన భాషా కోవిదులున్నారు. తెలుగు భాషని మృతభాషగా ఐక్యరాజ్య సమితి కొన్ని సంవత్సరాల క్రితం చెప్పిన తర్వాత వారి స్పందననీ, ఆవేదననీ సోదాహరణంగా పంచుకున్నారు. అలాగే మన పాత, కొత్త ప్రభుత్వ రాజకీయ దురంధరులు తెలుగు భాష భోదనా మాధ్యమం గురించి ఆడుతున్న ఆటలు చెప్పుకుని బాధ పడ్డారు. నేను కూడా ఈ విషయం మీద ఎన్నో వ్యాసాలు వ్రాసి ప్రచురించాను కనుక, కొన్ని సభల్లోనూ, టీవీ కార్యక్రమాల్లోనూ మాట్లాడాను కనుక, ఎంతో ఆసక్తితో పాల్గొన్నాను. అక్కడినించీ ఈ కథ కొంచెం పట్టాలు తప్పి నడవటం మొదలుపెట్టాక, నిజం చెప్పొద్దూ నాకు చాల బాధ వేసింది.

ఒక తిలోదకాల తిరుమలరావు అంటాడూ..  “మన తెలుగు భాషలో ఎన్నో అక్షరాలు ఇప్పుడు వాడటం లేదు. ఎందుకు ఇంకా వాటిని పట్టుకుని వేలాడటం? వాటిని వదిలేద్దాం” అని.

మత్తు వదిలి అప్పుడే ‘కల్లు’ తెరిచిన ఇంకొక కల్లు కామేశం అంటాడు.. “ళ అనే అక్షరం అసలు వాడనే వాడం. దానితో ఇంకా మనకి పని ఏమిటి. తీసేద్దాం!” అని, మల్లీ వెంటనే కల్లు మూసుకున్నాడు.

కాలిఫోర్నియాలో వుంటున్న నా మంచి మిత్రుడు, నాకెంతో ఇష్టుడు, మంచి కార్టూనిష్టుడు అక్కడే తన భావాలు కూడా వెల్లడించారు, తనకి ళ, ఋ, ౠ, ణ, స, శ, ష అనే అక్షరాలంటే ఎంత ఇష్టమోనని. నా మిత్రుడని కాదు కానీ, ఆయన చెప్పింది ఎంత నిజమో చెబుతూ నేనూ ఆయన్ని సమర్ధించాను. మరి ఎంత అందమైన అక్షరాలో అవి! చూడటానికే కాదు. అవి పలుకుతుంటే నాకు మధురమైన సంగీతం వినిపిస్తుంది.

మనం కళ్ళతో చూస్తాం కానీ కల్లతో కాదు. ఒక అమ్మాయి, అబ్బాయి చేసుకునేది పెళ్ళి, పెల్లి కాదు. మళ్ళీ మళ్ళీ చెబుతాం కానీ, మల్లీ మల్లీ చెప్పం. అలాగే ఋషి రుషి అయితే తెలుగు భాషలో అందం పోతుంది. సంకరుడు, షెంకరుడు కాకుండా, బీజాక్షరం వాడి శంకరుడు అంటే ఆ మహాశివుడు కూడా ఆనందిస్తాడు. శాంత షాంతగానూ, శ్యాం ష్యాంగానూ మారితే పాదుషాలు షంతోషిస్తారేమో కానీ తెలుగు భాషని ప్రేమించేవారు సంతోషించలేరు.

ముళ్ళపూడి వెంకట రమణగారు ఒకసారి వ్రాశారు, స, శ, ష అనే మూడు అక్షరాలతో ఒకే ఒక మాట వుంది, అది సశేషం అని. ఆ మాటని ససేసం అనో, శశేశం అనో, షషేషం అనో, ఇంకా ఎన్నో విధాలుగా ఆ మాటని నా’ష’నం చేసేవారున్నారు. మరి దానికి మన ఈ తెలుగు భాషా’కోవిడు’లు ఏమంటారో!  

మా స్పందన చూడగానే, ఇక మా మీద విరుచుకుపడ్డారు మన అక్షర హంతకులు. అది మరి వారి ఆట, బాట, కోట, పీటలలో ఏదో గుర్తులేదు కానీ, మా తాట తీసేలా కనపడ్డారు. అలా మా తాట తీస్తే కానీ, వారి తీట తీరేలా కనపడలేదు. ఎవరి దురద వారిది మరి!

ఒకాయన “మీరు పడికట్టు ఆలోచనతో కట్టుబడి.. పోయారు” అని పర దూ’సన’ కూడా చేశాడు.

ఈ విషయానికి వీరు పెట్టిన మకుటం పేరు ‘ఋ అనే అక్షరాన్ని మనం వుంచాలా?’ అని.

అదొక్కటే కాదు. ‘అసలు తెలుగులోకి సంస్కృత పదాలు, తెలుగేతర భాషా పదాలు ఎందుకు రావాలి? అవి తీసేయండి మై లార్డ్’ అని కూడా బల్ల గుద్ది మరీ దబాయించారు.  

నిజం చెప్పొద్దూ, అప్పుడు నాకు మాటిమాటికీ రైలు ఆగిన ప్రతి స్టేషన్లోనూ ఆడవాళ్ళ పెట్టె దగ్గరికి వచ్చి రాధని పలకరించే గోపాలాన్ని చూసినప్పుడు బుడుగుకి వచ్చినంత కోపం వచ్చింది. ఆ కోపం కోపంలా వుండగానే, గుంపు గోవిందులకి ఒక వుత్తరం వ్రాశాను. దాన్ని యధాతథంగా కాపీ కొట్టి, ఇక్కడ అతికిస్తున్నాను.

“నేను ఈ అంతర్జాల చర్చా వేదికలో కొన్ని నెలలుగా వస్తున్న విద్యుల్లేఖలు చదువుతున్నాను. కొందరి భావాలు చూసి, కోపం వచ్చి ఈ లేఖ వ్రాస్తున్నాను. మీకు నా మీద కోపం వస్తే, నన్ను మన్నించి ఒక్కసారి మీకు మీరే కొంచెం ఆలోచించండి. 

రెండు వేల సంవత్సరాలనించీ సజీవంగా వున్న తెలుగు భాషలో కొన్ని అక్షరాలని నిషేధించటానికి ఎవరండీ మీరు? మీకు ఆ అధికారం ఎక్కడినించీ వచ్చింది? ఎవరిచ్చారు?

          ఒక్క ఇంగ్లీష్ ముక్క కూడా రాకుండా తెలుగే మాట్లాడలేని తొంభై శాతం తెలుగువారు మీరు, మీ పిల్లలకు తెలుగు రానీయకుండా ఇంగ్లీషు మీడియంలో చదివిస్తున్న మీరు, తెలుగు అక్షరాలనే మింగేద్దామని చూస్తున్నారా? ఉట్టికెక్కలేనమ్మ వూళ్లేలుదామనుకున్నదిట!

మీకు కొన్ని అక్షరాలు నచ్చకపోతే వాడకండి. మీ కొంపలేం అంటుకోవు. కానీ మన చక్కటి తెలుగు భాషని నాశనం చేసి పైశాచికానందం పొందకండి. 

ఒకరికి దోశ కావాలి, ఇంకొకరికి ఇడ్లీ కావాలి. మరికొందరికి పూరీ కావాలి. దానిలో తప్పేమీ లేదు. కానీ మీకు నచ్చనివి, మిగతా ఎవరూ ఆనందించటానికి వీల్లేదంటే ఎలా?

ఈ పిచ్చి ప్రయత్నాలు మాని, తెలుగు భాషని వున్నదున్నట్టుగా కాపాడుకుందాం. తెలుగు భాషకి మళ్ళీ స్వర్ణయుగాన్నిద్దాం. ఆ దిశగా ఆలోచించి మన ప్రభుత్వాలనీ, ప్రజలనీ ఎలా ఉత్తేజపరచాలో ఆలోచించండి. అంతేకానీ మీకు నోరు పలకటంలేదని, వ్రాయటం రాదనీ, మన అందాల భాషలోని అక్షరాలని హత్య చేయకండి” అని వ్రాశాను.

ఇది చదివాక, తిట్టే ఆ భాషా ‘కోవిడు’లు తమ తిట్టే కార్యక్రమాన్ని, సవ్యాన్ని అపసవ్యం చేసుకుంటూ మ’ల్లీ’ నిర్విఘ్నంగా కొనసాగించారు. తిట్టే నోరు మరి వూరుకోదు కదా!

కాకపోతే నా భావాలతో అంగీకరించిన వారు అక్కడే ఇచ్చిన జవాబులు, నాకు మాత్రమే పంపించిన కొన్ని చక్కటి జవాబులు చూశాక, ఇంతమంది తెలుగు భాషా ప్రియులు అండగా వుండగా, ఈ అక్షర హంతకులను పట్టించుకోవటం అనవసరం అనిపించింది.

‘చక్కగా సెలవిచ్చారు. పెళ్ళిని పెల్లి చేసేవాళ్ళూ, భాషను బాస చేసేవాళ్ళు, సంస్కృత భాషను వ్యతిరేకించే వాళ్ళూ, వింత వింత తెలుగు పదాలను సృష్టించే వాళ్ళూ, దయచేసి తెలుగు భాషను ఉద్ధరించకండి. తెలుగు తల్లిని చంపకండి. చేతనైతే మంచి తెలుగును వ్రాయండి, మాట్లాడండి. చేత కాకపోతే మీకు చేతనైనట్లు వ్రాయండి. మేము అర్థం చేసుకోగలము. అంతేగాని పొల్లులు తీసేసి, వొత్తులు మింగేసి, అక్షరాలను దాచేసి భాషను చూస్తూ చూస్తూ హత్య చేయకండి. ప్రభుత్వాలు భాషకు చేసే అన్యాయాన్ని తప్పక ఎదిరించండి’ అని ఆ తాట తీటలకు బాట, పీటల్లోనే ఒకాయన జవాబు వ్రాశారు.

ఇంకొకాయన నాకు వేరే విద్యుల్లేఖ పంపించారు.

‘భాషను పరిరక్షించే పేరుతో అవాకులూ, చెవాకులూ పేలుతున్న వాళ్ళకి బాగా చీవాట్లు పెట్టారు. తెలుగు మీద ప్రేమ మాటున సంస్కృతం మీద ఇష్టం వచ్చినట్లు దుమ్మెత్తి పోస్తున్న సో కాల్డ్ భాషా పరిరక్షకులకు బుద్ధిని ప్రసాదించమని ఆ పలుకులమ్మను ప్రార్థిస్తున్నాను’ అని.

అసలు ఏ భాష అయినా జలజలా పారే ఒక సజీవ నదిలాటిది. అది అలా ప్రవహిస్తూనే వుంటుంది. మధ్య మధ్యలో కృష్ణానదిలో ఎన్ని పాయలో, కాలువలో చేరినా, అవి కృష్ణానదిలో పూర్తిగా కలిసిపోయి, కృష్ణానది పేరుతోనే ప్రవహిస్తాయి. భాష కూడా అంతే. ఇతర భాషల్లోని ఎన్నో మాటలని తనలో చేర్చుకుని, తనని ఉత్తేజ పరుచుకుని, తన పేరుతోనే, రెట్టించిన ఉత్సాహంతో అలా వెడుతూనే వుంటుంది.

ఆంగ్ల భాషలో కూడా రోమన్, స్పానిష్, లాటిన్ మొదలైన ఎన్నో భాషలలోనించీ వచ్చిన ఎన్నో పదాలు, ఆంగ్ల పదాలుగా మారిపోయాయి. అంతేకాదు మన భారతీయ భాషల్లోనించీ కూడా ఎన్నో పదాలు వచ్చి ఆంగ్ల పదాలుగా మారిపోయాయి. ఉదాహరణకి, కాష్ అనే పదం కాసు, మాంగో అనేది మాంగా అనే తమిళ పదాలనించీ ఆంగ్ల భాషలోకి వచ్చాయి. నాకు సమయం దొరికినప్పుడల్లా, నా దగ్గరున్న మూడు వేల పేజీల వెబ్స్టర్ డిక్ష్ణరీలో, ఎన్నో పదాల మూలాలు వెతుకుతుంటాను.

అలాగే మన తెలుగులో కూడా అచ్చ తెలుగు పదాలతో పాటు ఎన్నో ద్రవిడ, సంస్కృత పదాలున్నాయి. బుర్ర అనే అచ్చ తెలుగు పదంతో పాటు, తల అనే ద్రవిడ పదాన్ని, శిరస్సు అనే సంస్కృత పదాన్నీ కూడా మనం వాడుతుంటాము. ఈ మూడు పదాల్లోనూ తల అనే పదాన్ని ఎక్కువగా వాడటానికి కారణం, మన తెలుగు ద్రవిడ భాష కనుక. దానిలో తప్పు ఏమీ లేకపోగా, సందర్భాన్ని బట్టి వాటినలా వాడుతుంటే వినటానికి మధురంగా వుంటుంది కూడాను.

తురుష్కుల రాకతోనూ, బ్రిటిష్ వారి రాకతోనూ వారి భాషా పదాలు కూడా తెలుగులో చోటు చేసుకున్నాయి. రోడ్ రోడ్డుగానూ, పోలీస్ పోలీసుగానూ, స్టేషన్ స్టేషనుగానూ మన భాషలోకి వచ్చేశాయి. అలాగే షామియానా, బిర్యానీ, ఖాళీ, తాజా మొదలైన పర్షియన్ అరబిక్ పదాలు కూడా మన రోజువారీ వాడుకలో వినిపిస్తాయి. అలాటివి ఇప్పుడు పూర్తిగా తెలుగు పదాలే అయిపోయాయి. ఇలాటి పర భాషా పదాలు మన తెలుగు భాషని విస్కృతం చేస్తాయే కానీ కించపరచవు.     

  ఆమధ్యన నేనొక పార్టీకి వెళ్ళాను. అక్కడ నాలా జుట్టు నెరిసిన వాళ్ళూ, జుట్టుకి నల్లరంగూ వేసిన వాళ్ళేకాక, కొత్తగా భారతదేశాన్నించీ దిగుమతి అయిన వాళ్ళు కూడా కొందరున్నారు. మేము మాట్లాడుకుంటూ వుండగా, ఒకతను నా దగ్గరికి వచ్చి తెంగ్లీషులో, “అంకుల్, యు స్పీక్ మంచి తెలుగండీ” అన్నాడు. 

అతను ఇచ్చిన ఉచిత స్వర్ణ పతకానికి సంతోషం రాకపోగా, ఒళ్ళు (ఒల్లు కాదు) మండిపోయింది.

“నేను తెలుగువాడిని. నా మాతృభాష తెలుగు. నేను తెలుగులో మాట్లాడటం ఏమీ గొప్ప విషయం కాదే! నువ్వు ఒక బెంగాలీ బాబు దగ్గరికి వెళ్ళి, నువ్వు బెంగాలీ బాగా మాట్లాడతావే అంటావా? గుజరాతీ అతన్ని గుజరాతీ బాగా మట్లాడతాడని పొగుడుతావా? ఒక ఫ్రెంచ్ అతన్నో, చైనేస్ ఆవిడనో, జర్మన్నో మీ భాష బాగా మాట్లాడతారు అని అనగలవా? మరి ఒక తెలుగువాడిని నన్నెందుకు అలా అడిగావ్?” అన్నాను సుత్తి వీరభద్రరావుగారిలా.

“అదికాదు అంకుల్. యు కేమ్ టు అమెరికా లాంగ్ ఎగో. అయినా ఇంకా….“

“అయితే? మా అమ్మ పుట్టి తొంభై ఏళ్ళయింది. ఆవిడని మర్చిపోమంటావా? తెలుగు భాష నా మాతృభాష. ఎలా మరచిపోతాను? మా అమ్మ ఎంతో, నాకు నా మాతృభాష కూడా అంతే” అందామనుకుని, మరీ అంతమంది మధ్య అది సభ్యత కాదని వూరుకున్నాను.

తర్వాత ఆలోచనలో పడ్డాను. అసలు మన తెలుగు భాషకే ఎందుకు ఏ భాషకీ లేని ఇంత తెగులు పట్టిందని.

ఇంకొక ఇరవై-ముఫై ఏళ్ళలో తెలుగు మృతభాష అవబోతున్నది అంటేనే ఒళ్ళు ఝల్లుమంటున్నది. వెన్నెముకలో వణుకు పుడుతున్నది. నమ్మబుధ్ధి కావటంలేదు. కాకపోతే, ఏ భాషనయినా 30 శాతం జనాభా కానీ, అంతకన్నా తక్కువ కానీ మాత్రమే మాట్లాడుతుంటే ఆ భాష మృతభాష అయే అవకాశం వుంది అంటున్నారు ఐక్యరాజ్య సమితి వారు.

ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలుపుకుని తెలుగు  మాట్లాడటం, చదవటం, వ్రాయటం చేసేవారు దాదాపు యాభై - అరవై శాతం మాత్రమే వున్నారుట. కనుక ఐక్యరాజ్య సమితి వారు చెప్పిన దానికి, ఈరోజు మనం అంత అందోళన పడవలసిన అవసరం లేదు. అదీకాక అమెరికాలోనూ, మిగతా విదేశాల్లోనూ, తెలుగు బడులతో ఇక్కడి పిల్లలు తెలుగు నేర్చుకుంటుంటే, ఇంకా విచారపడటం అనవసరం అనిపిస్తుంది.

మరి ఇంకో పాతిక ముఫై సంవత్సరాల్లో ఏమవుతుంది?

ఈరోజు తెలుగు చదవటం, వ్రాయటం నేర్చుకొనని పాతిక ముఫై ఏళ్ల వారంతా, యాభై అరవై ఏళ్ళ వయసులోకి వస్తారు. వాళ్ళకే తెలుగు రానప్పుడు, వారి పిల్లల్లో ఎంతమందికి తెలుగు నేర్పిస్తారు అనేది ఒక పెద్ద ప్రశ్న. అప్పుడు వారి పిల్లల వయసు పాతికనించీ ముఫై ఏళ్ళ వరకూ వుంటుంది. మరి ఆ పిల్లల తరువాత తరంలో, ఎంతమంది తెలుగు మాట్లాడగలరో ఊహించటానికి లెఖ్ఖల్లో పీహెచ్డీ అవసరంలేదు. ఈలోగా నేనూ, ఇప్పటి నా వయసులోని తెలుగు అభిమానులు ఎక్కువమంది ఈ భూమి మీద వుండక, తెలుగు వచ్చినవారి సంఖ్య ఇంకా పడిపోతుంది. అంటే పైన చెప్పుకున్న యాభై/అరవై శాతం చకచకా తగ్గిపోయి, ఐక్యరాజ్య సమితి చెప్పిన ముఫై శాతానికన్నా బాగా తగ్గిపోతుందన్నమాట!

అలా జరగక పోతే ఎంత బాగుండును అనుకుంటుంటే, నా ఆలోచన ఇంకో వేపుకి వెళ్ళటం మొదలుపెట్టింది. ఏ భాష అయినా మృతభాష అవటానికి ముఖ్య కారణాలు ఏమిటి అని. దానికీ నాలుగు కారణాలు చెబుతున్నారు.

ఒకటి: క్రింద నించీ పైకి భాషాభివృద్ధి లేకపోవటం. అంటే ఇళ్ళల్లోనూ, సమాజంలోనూ, ముఖ్యంగా తర్వాత తరాల పిల్లలు ఆ భాష మాట్లాడటం, చదవటం, వ్రాయటం క్రమంగా తగ్గిపోవటం.

రెండు: పైనించీ క్రిందకి భాషాభివృద్ధి లేకపోవటం. అంటే మనవి ‘స్వరాజ్యా’లు కనుక, ప్రభుత్వం భాషాభివృద్ధి చేయకపోవటమే కాక, నిర్లక్ష్యం చేయటం. 

మూడు: రెండు భాషలు మాట్లాడే చోట, ఒక భాషని ప్రముఖంగా మాట్లాడుతున్నప్పుడు, రెండవ భాషని చిన్న చూపు చూసే అవకాశం వల్ల ఆ రెండవ భాష క్రమేణా మాయమయి పోవటం. ఆ భాషలోని కొన్ని మాటలు ప్రముఖంగా మాట్లాడే భాషలో అంతర్లీనమవటం కూడా సాధారణంగా జరిగేదే!

నాలుగు: ఒక సంస్కృతి క్రమేణా అంతరించి పోతున్నప్పుడు, ఆ సంస్కృతిలో భాగమైన ఆ భాష కూడా అంతరించిపోయే అవకాశాలు వుంటాయి.

వీటిని ప్రస్తుతం మన తెలుగు భాష మాట్లాడే వారిని దృష్టిలో పెట్టుకుని పరిశీలిద్దాం.

ఇప్పుడు పాతికేళ్ళ వయసు లోపల, ముఖ్యంగా నర్సరీ స్కూల్ నించీ హైస్కూల్, కాలేజీల్లో చదువుతున్న పిల్లల్ని చూస్తుంటే, నిజంగా భయమేస్తుంది. తెలుగులో చదవటం చాల చాల తగ్గిపోయింది. తల్లిదండ్రులే ఇంగ్లీష్ మీడియంలో ఎంతో డబ్బు కట్టి చేర్పించిన పిల్లల్ని తెలుగులో చదవకుండా జాగ్రత్త పడుతున్నారు. క్లాసులో పిల్లలు తెలుగులో మాట్లాడటమే పెద్ద తప్పుగా చూస్తున్నారు. అంటే ఇంకొక ఇరవై సంవత్సరాల్లో తెలుగు మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా, అందోళనకరంగా తగ్గిపోయే అవకాశం వుంది.

అలాగే ప్రభుత్వం. తెలుగులో పాఠాలు చెప్పటం అనేది నిర్భంధ విద్యావిధానంలో భాగంగా పరిగణించటం లేదు. అంతేకాదు ప్రభుత్వంలోనూ, ప్రభుత్వాధికారుల్లోనూ తెలుగు భాషని హింసించి, కుదించి, ఆటలాడుకునే వారే కానీ, భాష మీద గౌరవం, భాషాభివృద్ధికై పట్టుదల వున్నవారే లేరు. తెలుగు భాషకి ప్రాచీన భాషగా గుర్తింపు కోసం పాకులాడింది, దానితోపాటూ వచ్చే నిధుల కోసమే కానీ వేరే ఉద్దేశ్యమేమీ లేదు అనేవారు కూడా వున్నారు.

తెలుగు గౌరవం నిలబెట్టాడని చెప్పుకునే ఆనాటి ముఖ్యమంత్రి గ్రంధాలయాలకు ధన సహాయం చాలవరకూ ఆపేసి, ఎన్నో లైబ్రరీలు మూసేసి, తెలుగు పుస్తక ప్రచురణకీ, పుస్తక పతనానికీ కారకుడయాడు. ఎంతోమంది ప్రచురణకర్తలు దివాలా తీయటానికీ, ఎన్నో పుస్తకాల షాపులు మూసేయటానికీ కారకుడయాడు. దానితో తెలుగు పుస్తక పఠనం ఎంతో తగ్గిపోయింది. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి తన, తనవారి ఖజానాలు నింపుకోటానికి, చదువులని అమ్మకానికి పెట్టి, ఇటు తెలుగు భాషనీ, అటు విషయపరమైన విజ్ఞానాన్ని అటకెక్కించేశాడు. కొన్ని కాలేజీల్లో డబ్బుకి డిగ్రీల కొనుక్కునే కార్యక్రమం కూడా జరిగింది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎలిమెంటరీ స్కూలు నించీ కూడా అసలు తెలుగు బోధన మాధ్యమమే అవసరంలేదు, ఇంగ్లీషులోనే జరగాలని తనకి తెలిసిన తెలుగులో అంటున్నాడు.  

తెలుగుదేశంలో ఉద్యోగావకాశాలు తక్కువగా వున్నాయనీ, యూరప్ అమెరికాలాటి దేశాలకు వెళ్లిపోయి ఎంతో డబ్బు సంపాదించుకోవాలనీ, దానికి తెలుగు నేర్చుకున్నందువల్ల ఏమీ ఉపయోగం లేదనీ, పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకే పంపిస్తున్నామనీ పిల్లల తల్లిదండ్రులంటున్నారు. అలా ఇంగ్లీష్ ప్రభావం ఎక్కువ అవటంతో తెలుగు నేర్చుకోవటం వెనుకపడింది.

ఇంగ్లీష్ నేర్చుకోవటం కోసం తెలుగు మానేయాలి అనేది నిజం కాదని అందరికీ తెలుసు. నాతో సహా, 1970 నించీ 1985 దాకా అమెరికానే కాక, ఇతర దేశాలకి వలస వచ్చినవారు హైస్కూలు, ప్రీ యూనివర్సిటీ దాకా తెలుగు మీడియంలోనే చదువుకుని, ఇంజనీరింగ్, మెడిసిన్, సైన్స్ మొదలైన డిగ్రీలు ఇంగ్లీషులో చదువుకుని వచ్చిన వాళ్ళమే. ఇటు తెలుగు, అటు ఇంగ్లీషుల మీద మోజు పెంచుకుని, రెండిట్లోనూ చక్కటి వాగ్ధాటి సంపాదించుకున్న వాళ్ళమే! ఇక్కడ ఉద్యోగాల్లోనూ, సమాజంలోనూ ఎంతో విజయవంతంగా బ్రతుకుతున్న వాళ్ళమే! ఇండియాలో ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకుని అమెరికాకి వచ్చిన, కొంతమంది ఇటు తెలుగూ అటు ఇంగ్లీషూ సరిగ్గా వ్రాయలేని మాట్లాడలేని రెంటికి చెడ్డ రేవడలని చూస్తుంటే బాధ వేస్తుంది. కనుక ఈ వాదనలో నిజం లేదని తెలుస్తున్నది.

అంతేకాదు, తమిళులకీ, గుజరాతీలకీ, బెంగాలీలకీ, జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, చైనీస్ మొదలైన ఇతర భాషల జనాభా రెండు భాషలూ చక్కగా ఉపయోగించుకుంటున్నారే! వేరెవరికీ లేని ఈ సమస్య, మరి తెలుగువారికే ఎందుకు వచ్చింది?

ఎందుకంటే ఇక్కడ కావలసింది భాష కాదు. అది ఎప్పుడూ ఒక సమస్య కానే కాదు. మానవ మనుగడకి, ముఖ్యంగా మనలాగా వలస వచ్చిన వారికి కావలసింది, కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి, పట్టుదల, మన మీద మనకే నమ్మకం. అది మనవాళ్ళలో ఎంతవుంది అనేది మనం చూడాలే కానీ, ఆలోచన ఏమాత్రం లేకుండా మన భాషని మనమే హత్య చేసుకోవటం కాదు చేయవలసింది.

ఇక పైన చెప్పిన నాలుగవ కారణం చూస్తే, సాంస్కృతికంగా మనం ఎక్కడికి వెడుతున్నామో చూడాల్సిన అవసరం వుంది. హరికథలూ, బుర్రకథలూ, హరిదాసులూ, డూడూ బసవన్నలూ, పౌరాణిక నాటకాలూ అన్నీ మన తీపి గురుతులుగానే మిగిలిపోయాయి. ఈనాడు తెలుగు సామెతలూ శతకాలు చదివేవారు కానీ, చెప్పేవారు కానీ  ఎంతోమంది లేరు. మన సినిమాలు, టీవీ కార్యక్రమాలు తెలుగు సాంస్కృతిక దారిద్యానికి యధాశక్తి ఎంతో దోహదం చేస్తున్నాయి. సెక్స్, వయొలెన్స్ ముడిసరుకుగా, సరుకు లేని కొడుకులు, తమ్ముళ్ళు హీరోలుగా తెలుగుతనం లేని సినిమాలు మనకి చూపిస్తున్నారు ఆ సంస్కారవంతులు. వాటి గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ఇక పబ్ కల్చర్ గురించి చెప్పనక్ఖర్లేదు. వేషధారణలో కూడా తెలుగు సంస్కృతికి చిహ్నమైన ఓణీలు, పరికిణీలు, చీరలు ఎక్కడో కానీ కనపడటంలేదు. మనదే అయిన కూచిపూడి నృత్యం, త్యాగరాజు కీర్తనలు తెలుగునాటకన్నా, తమిళదేశంలో ఎక్కువగా ఆదరించబడుతున్నాయి. ఇలా మన సంస్కృతికి మనం దూరం అవుతున్నాం. ఇవన్నీ నా ఇష్టాయిష్టాలను దృష్టిలో పెట్టుకుని చెప్పటం లేదు. మనం అందరం చూస్తున్న, జరుగుతున్న విషయాలను మరోసారి గుర్తు చేయటం కోసమే!

ఇంత వివరంగా పరిశీలన చేస్తుంటే, నాకు ఐక్యరాజ్య సమితి చెప్పింది నిజమవుతుందేమోననే భయం కూడా ఎక్కువయింది.

మధ్యే మధ్యే, ఈ అక్షర హంతకులు, తెలుగు భాషా’కోవిడు’లు తొందర పడి ముందే కూస్తున్నారు!

వారి ప్రయత్న దోషం లేకుండా వారి ప్రచారం వారు చేస్తూనే వున్నారు.

అది ఐక్యరాజ్య సమితి వారు చెప్పిన దానికన్నా ముందే మన భాషకి ఈ మహమ్మారి వైరస్ అంటగట్టే ప్రయత్నం కాదు కదా!

కాదనే అనుకుందాం!

*****

bottom of page