top of page

మధురవాణి ప్రత్యేకం

సాహితీ సౌరభాలు

సాహిత్యంలో జీవనదుల సమ్మేళనం

ప్రసాద్ తుర్లపాటి 

adannamaata.png

సంపుటి  5   సంచిక  3

Website Published &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

" ఓం! మధువాతా ఋతాయతే, మధుక్షరంతి సింధవ: "

అన్నది వేదమంత్రము.  అనగా  సత్కార్యం  ఒనరింప అభిలషించే మనకు,  నదులు తియ్యటి నీటితో  ప్రవహించు  గాక.   ఇది మన పూర్వీకుల  పర్యావరణ చింతనా వైశిష్ట్యాన్ని సూచించే మంత్రము.  అందుకే మంత్రపుష్పములో, నీరే సర్వ ప్రకృతికి ఆధారం అని చెప్పబడింది. సామాన్యంగా వేదాలలో నీరు, సముద్రం వంటివి జీవితానికి స్వారూప్యాలుగా చెప్పబడుతాయి. అందువలన నీటి ఆధారం చంద్రుడు, మేఘం అని చెప్పబడినప్పుడు ప్రాపంచిక జీవనానికి ఆధారంగా ఉండేది ఈ సమస్త ప్రకృతి అని సూచించబడింది.  అందువలన ప్రకృతిని  ఆరాథించాలి.  ఈ ప్రకృతి లో  భాగమే జీవనదులు.

 అందుకే -  

" యోపామా ఆయతనం వేద! ఆయతనవాన్ భవతి "

య: = ఎవరు, అపాం = నీటి యొక్క, ఆయతనం = ఆధారాన్ని , వేద = తెలుసుకుంటాడో , ఆయతన్ వాన్ = నెలకొన్న వాడు , భవతి = అవుతాడు. అతనే భగవంతుడు. నీరు శరీరాన్ని శుభ్రపరిస్తే , ఆ జలాలకధిపతియైన దేవతలను , మనము వేద మంత్రాల ద్వారా అభ్యర్థిస్తాము. ఈ పవిత్ర జలమే జీవనదులుగా మన సువిశాల భరతావనిలో ప్రవహిస్తున్నవి.

అందుకే మన శుద్ధి మంత్రాలతో దేశంలోని అన్ని జీవనదులను ఆవాహన చేస్తాము.

" గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ

నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు "

 

దైవార్చన సమయంలో కలశంలోని జలాన్ని పవిత్రీకరించడానికి పఠించే మంత్రస్ ఇది. పరమశివుని శిరస్సుపై తరంగ నృత్యం చేసే గంగా నదితో పాటు సరిసమానమైన నదులన్నీ ప్రస్తావించబడినాయి. మన దేశంలోని నదులన్నీ గంగా స్వరూపాలే! కావున అన్ని నదుల పవిత్ర జలానికి గంగ అన్న నామాంతరం వర్తిస్తుంది.

సాహితీవేత్తలు ఈ జీవనదులను తమ కావ్యాలలో ఎంతో కొనియాడారు. చక్కని సాహిత్యం కూడా ఈ నదీమ తల్లుల పరీవాహక ప్రాంతంలోనే విలసిల్లింది. నది చైతన్యానికి సంకేతం. జీవనదుల వలన సదా చైతన్యమే కదా! భారతదేశంలోని నదులు మనకు దేవతామూర్తులు. " సుజలాం! సుఫలాం! " అని బంకించంద్ర చటర్జీ ఆన్నా, " ఉఛ్ఛల జలథితరంగా " అని రవీంద్రనాథ ఠాగూర్ అన్నా అవి మన సంస్కృతి స్మరణలే! భారత థార్మిక వ్యవస్థ పై వారికున్న గౌరవానికి నిదర్శనాలే ! 

         అందుకే విశ్వనాథష్టకములో-

        " గంగా తరంగ రమణీయ జటాకలాపం!

             గౌరి నిరంతర విభూషిత వామభాగం ! "

అని ఆది శంకరచార్యులవారు ఆ పరమశివుని స్థుతించారు.  

జీవనదుల ప్రస్తావన సాహిత్యములో ఈ విధముగా కనిపిస్తుంది.

1. అవతారికలో జీవనది ప్రస్తావన

2. కావ్యాలలో కథాభాగంలో పౌరాణిక పురుషుల తీర్థయాత్రల వర్ణనలలో

3. కథాభాగంలో నదుల ప్రస్తావన

4. వివిధరకాల వర్ణనలలో నదుల ప్రశంస

మనకున్న జీవనదులు - గంగ, యమున, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణా, తుంగభద్ర, పెన్నా, కావేరి మొదలగునవి. ఈ వ్యాసంలో ముఖ్యంగా ఆంధ్రదేశంలోని నదుల గురించి ప్రస్తావించుకుందాం.

తెలుగునేల ఎంతో సస్యశ్యామలమైనది. ఆంధ్ర సంస్కృతికి తీయని క్షీరధార అయిన గోదావరి, సర్వాలంకారభూషిత అయిన కృష్ణవేణి, సర్వగుణభద్ర అయిన తుంగభద్ర నది, పెన్న, వంశధారలు మన సంస్కృతి లో, కావ్యాలలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ నదుల విశిష్టతను వివరిస్తూ ఈ వ్యాసాన్ని కొనసాగిస్తాను.

1. గోదావరి -

"వింధస్య దక్షిణే గంగా గౌతమి సానిగద్యతే" - వింధ్య పర్వతాలకు దక్షిణంలో ప్రవహించే గంగ, గౌతమి అని పిలవబడుతున్నది.

“గోదావరీయాం సరితాం వరిష్టా" సర్వనదులలో గోదావరి నది శ్రేష్టమయినది అని వాల్మీకి మాట.

"గోదావరి, గోదావరి గోదావరి యంచు బల్కు గుణవంతులకున్

                           గోదావరి తల్లీ, సంపాదింతు గదమ్మ నీవు భవ్య శుభంబుల్"

అనుచు శ్రీనాధుడు భీమఖండము నందు వర్ణించాడు.

సహజ పండితులైన పోతనామత్యుడు "అభ్రంకష శుభ్ర సముత్తుంగ తరంగ" అని గోదావరీ నదిని కీర్తిస్తూ ఆంధ్రమహాభాగవత రచనకు శ్రీకారం చుట్టారు.  కీ.శ తొమ్మిదో శతాబ్దం వాడైన అలంకారిక శిరోమణి రాజశేఖరుడు తన "కావ్యమీమాంస" లో, మహాపండితుడైన వెంకటాధ్వరి తన "విశ్వగుణదర్శం" లో, కాశ్మీర కవిచంద్రుడైన కలహణుడు "రాజతరంగిణి" లో గోదావరి మాతను ఎన్నో విధాలుగా శ్లాఘించారు.

సప్త గౌతమీ తరంగాలకు- ఆనంద పరవశుడయిన కవిసార్వభౌముడు శ్రీనాధుడు తన భీమేశ్వర పురాణం లో గౌతమీ గంగ (గోదావరిని) ఈ విధంగా వర్ణించాడు -

                                              “త్రయంబకాచల శిఖాగ్రంబునం దుదయించి

పొదలి యార్యావర్తభూమి దరసి

మలంగి దండక వనీమధ్య భాగమున నా

ప్ర స్రవాణాచల ప్రస్థ మొరసి

పట్టిస శ్రీ వీరభద్రేశు సేవించి

తిల సోమనాధు మందిరము డాసి

యేచి అనంత భోగేశ్వర స్థానంబు

రుద్ర పాదముల పై ద్రోవ గాగ

 

గోటి పల్లీశు కోమలాంఘ్రములకు మ్రొక్కి

కుండలా ముఖ తీర్థంబు గుస్తరించి

భీమమందలి డాపల బెట్టికొనుచు

గౌతమీ గంగ లవణాబ్థి కౌగలించె “

భీమేశ్వర పురాణం అంతా గోదావరీ వర్ణన, గోదావరీ తీరంలోని ముఖ్యంగా సప్తగోదావరి పరిసరాల్లోని తీర్థాలు, అక్కడి ప్రజల గోదావరీ దర్శనం మున్నగునవి వర్ణింపబడినవి.      

ఆదికవి నన్నయ్య అవతరించిన నేల ఈ గోదావరి పరిసర ప్రాంతంలోని రాజమహేంద్రవరము. అందుకే ఆ తొలి తెలుగు రచన సాహితికి క్షీరధార అయినది. తొలి తెలుగు కవితకు " శ్రీవాణి గిరిజాశ్వరాయదథతో..." అని శ్రీకారం చుట్టింది ఇక్కడే.  అందుకే అక్కడి గోదావరి నదిది వేద ఘోష; అమరధామయినది రాజమహేంద్రి.

ఆంధ్రమహాభారతం తొలి తెలుగుకావ్యమయితే, శ్రీనాథ విరచిత భీమేశ్వరపురాణం రెండో ఆంధ్రపురాణంగా ప్రసిద్ధి పొందింది. గోదావరీ నదీమతల్లిని తెలుగులో ప్రధమంగా కీర్తించినది నన్నయ్య భట్టారకులే.   "దక్షిణ గంగ నా తద్దయు నొప్పిన గోదావరి యు జగదాది యైన" (ఆంధ్ర మహాభారతము)  అని నన్నయ గోదావరిని దక్షిణగంగగా పేర్కొన్నారు.

గౌతమీ సాగర సంగమ స్థలం గంగాతీరంలోని కాశీ క్షేత్రం కంటే మోక్షదాయకమని శ్రీనాధుడు మనోహరంగా వర్ణించాడు.

అందుకే

“సప్త గోదావరము భీమశంకరునుని

  నాకులేశ, స్వయంభు, పినాకపాణి

  రుద్రపాదంబులును సమారూఢభక్తి

  దలతు వారెవ్వరు పో ధన్యమతులు”

‘కమనీయ మణికర్ణికా ప్రవాహమునకు సప్త గోదావరి జలము సాటి’ అన్నాడు శ్రీనాధుడు.

గోదావరితో రామునికి గల సంబంధాన్ని కంచర్ల గోపన్న (భక్త రామదాసు) ఈ విధంగా గానం చేసాడు.    

“శ్రీరమ సీత గాగ, నిజసేవకబృందము వీరవైష్ణవా

  చార జనంబు గాగ, విరజానది గౌతమిగా వికుంఠము

  న్నరయ భద్రశైల శిఖరాగ్రము గాగ, వసించి చేతనో

  ధ్భరకుదైన విష్ణుడవు దాశరధీ కరుణాపయొనిధి"

గోదావరినదిని సాక్షాత్తు విరజా నదితో, భధ్రాద్రిని వైకుంఠముతో పోల్చిన మహాభక్తాగ్రేసరుడు గోపన్న. ముందుగా గోపన్న దర్శించినది గోదావరినే –

"కంటి నదీతటంబు, పొడగంటిని భద్రనగాధివాసమున్"

ఇక విశ్వనాథ వారు ‘శ్రీమద్రామయణ కల్పవృక్షము’ లో విజృంభించారు.

సీతారామలక్ష్మణులు ఉభయసంధ్యలలో ఆ గోదావరీ నదికి స్నానానికి వెళుతూ ఉంటే దండకారణ్యం వైకుంఠ నగరీహ్లాదైక సంపూర్ణతను కూర్చిందంటారు.

   "బిందు బిద్వంతర సందీపిత

     సుకృత సందోహ విమల పాదొ నిర్ఘర!

     వందారు జనతాఘబృంద నికృంత

     నఛ్ఛందో వతారంబు గోదావరీ!"

అని వర్ణించారు విశ్వనాథ.

“జలజాతేక్షణ గౌతమీ తటమున్ స్నానర్థ మేతేరగా

  వలయాకార ప్రదక్షిణంబుగ నదీ వార్వేణి సౌదమనీ

  కలిత స్థంభముగా లేచి మునకల్ కల్పించి సూత్నంభుజాం

  జలియై కానుకలిచ్చి పొవు వినయస్కానంబు మర్యాదయై!"

ఆ సీతా రామ లక్ష్మణులు గోదావరీ తటికి స్నానమార్ధమైవెళితే - గోదావరి నది మెరుపు తీగ వలే లేచి, కొత్త కలువల అంజలితో తనలో స్నానమాడ వచ్చిన సీతారాములకు మర్యాదపూర్వకంగా కానుకలిచ్చి పులకించేదట. ఇక సీతాపహరణం వేళ జానకి తను గోదావరీ జలాలు పోసి పెంచిన మొక్కలకు కూడ విన్నపం చేసిందని వర్ణిస్తారు  "జనక జాస్వ హస్తకృత నిత్య గోదావరీ జల పరిసేవక సేవనా వర్ణిత బాల తరు సంతానము"

ప్రెగ్గడవల్లి పోతయ్య అనే మహాకవి ప్రత్యేకించి గోదావరి శతకాన్నే రచించారు. గోదావరి నదీమతల్లిని ఆయన "స్థిర పూర్ణోదయ మేదినిందు వదనా సీమంత విధీలసద్గురు ముక్తాఫల సూత్రమన్నారు".

ఇక ఎంతోమంది కవులు,పండితులు ఈ గోదావరి నదీమతల్లిని ఎన్నో విధాలుగా వర్ణించి, పూజించి తరించారు. సినిమా సాహిత్యంలో కూడా ఎన్నో పాటలలో ఈ నది ప్రస్తావన కనిపిస్తుంది.

"గోదావరీ పారనోదర వాపుర మఖిల భారతము మాదన్న నాడు...." అని కవిసామ్రాట్ విశ్వనాథ వారు ఆంధ్ర పౌరుషాన్ని అభివర్ణిస్తే,

"ఉప్పొంగి పోయింది గోదావరి తాను తెప్పున్న ఎగసింది గోదావరి...." అని అడవి బాపిరాజు గారు గోదావరి పరవళ్ళను చూసి పొంగి పోయినారు.

అందుకే వేదంలా ఘోషించే గోదావరి సదా తన క్షీరధారలతో ఆంధ్రదేశాన్ని, భారతదేశాన్ని సస్యశ్యామలంగా చేస్తూనే ఉన్నది.

ఈ విధంగా గోదావరి గలగలా కదలిపోతుంటే, కృష్ణవేణి బిరబిరా పరుగులిడుతూ వస్తుంది.

 

2. కృష్ణ

సహ్యాద్రులనుంచి సముద్రం దాక ప్రవహిస్తూ, అంధ్రదేశాన్ని సశ్యశ్యామలంగా మార్చిన నదీమతల్లి కృష్ణమ్మ.  కృష్ణాతీరంలో విలసిల్లిన ప్రముఖ కవి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు. వీరి ఆంధ్రప్రశస్తి లో కృష్ణానదిపై తనకు గల ఆత్మీయతను అభివర్ణించి ఆనందించారు. ఆంధ్ర మహావిష్ణువు రాజధాని అయిన శ్రీకాకుళాన్ని " కృష్ణా సరిదుల్ల సత్ఫణి ఫణామణి" గా అభివర్ణించారు. కృష్ణవేణి ఒడిలో పెరిగిన మహాకవి శ్రీ విశ్వనాథ.

"కృష్ణా తరంగ నిర్ణిద్రగానము తోడ

       శిల్పమ్ము, తొలిపూజ సేయునాడు

  అక్షర జ్ఞాన మెరుగదో ఆంధ్రజాతి

       విమల కృష్ణానదీ సైకతముల యందు

  కోకిలపు పాట పిచ్చుక గూళ్ళు కట్టి

      నేర్చు కొన్నది పూర్ణిమా నిశలయందు"

 

- అని విశ్వనాథ వారు,

"కృష్ణా తరంగ పంక్తిన్ ద్రొక్కి త్రుళ్ళింత నాంధ్ర నౌకలు నాట్యమాడునాడు...."

- అని రాయప్రోలు వారు,

 

"గల గలా గోదారి కదిలి పోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరువులిడుతుంటేను

  బంగారు పంటలే పందుతయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి.."  

 అని శంకరంబాడి సుందరాచార్య గారు,

"కృష్ణా తరంగాల సారంగ నాదాలు కృష్ణ లీలాతరంగిణి దివ్యగీతాలు..."

అని వేటూరి వారు,

కృష్ణమ్మకు స్వాగత గీతాల నాలపించారు.  

"నమామి సుకృత శ్రేణీం కృష్ణవేణీం తరంగిణిం

 యద్వీక్షణం కోటి జన్మ కృత దుష్కర్మశిక్షణం"

అని వాదిరాజు దీక్షితుల వారు కృష్ణవేణిని స్తుతించారు.

తన తీయని పదాలతొ పరిమళింప చేసిన క్షేత్రయ్య కృష్ణాతీరంలోని వాడే!

కృష్ణానది నేపధ్యంలోనే డా.సి.నారాయణ రెడ్డి గారు "నాగార్జున సాగరం" అనే గేయకావ్యాన్ని రచిస్తే, మల్లాది వారి నుంచి "కృష్ణా తీరం" అనే నవల జాలువారితే, సత్యం శంకరమంచి "అమరావతి కథలు" కృష్ణా తీర సంస్కృతి ని ప్రతిబింబ జేసాయి.

 

వేటూరి వారన్నట్లు -

  "జాణగా జనియించి, మాధవ కధా గాన

    వీణగా రవళించి, నిదురించే అలివేణి

    కలలన్నీ అలలైన సిరికకొలను రాణి

    గల గలమని నేడు సాగిన కృష్ణవేణి"

అందుకే “కృష్ణవేణి తెలుగింటి విరిబోణి".  కృష్ణవేణి ప్రవాహంలో తెలుగుసిరులు కలసి ఉన్నాయి.

"నొసట కుంకుమ రాగ రంజితంబొనరించె

  తొగరు కుచ్చెళ్ళు పారాణి జీరాడె

  కలికి కాటుక కనుల తెలుగు సిరులే మెరిసె

  అల్ల నల్లన కృష్ణ ఆంధ్రలో నడచె"

శ్రీ పాలవరపు కోటేశ్వరరావు గారు "కృష్ణవేణి" అనే పేరుతో ఒక గేయకావ్యం వ్రాశారు. 

జలబిందువై రూపొంది, పరిపూర్ణ జలధారయై, జీవనవాహినియై, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రజల ఆరాధ్యదేవతగా రూపొందింది కృష్ణవేణి.  అనేక జాతుల, మతాల, తెగల జీవనవాహిని కృష్ణవేణి. సంస్కృతీ ప్రవాహమై, సర్వ జనామోదమై, సకల సంపద్విలసితమై కన్నతల్లిగా నిలచింది కృష్ణవేణి. కమనీయ చరితలను రూపొందించింది కృష్ణవేణి.

"నట శివ సాయం సంధ్యా

  చ్ఛటా ఘటానూపు రమణి సంభవ కాంతి

  స్ఫుట చిట చిట చిట వినదో

  ధ్భట కనకము విజయవాటి వర్షం కురిసెన్"

ఇంతటి పవిత్రత పొందిన నదీతీరంలో నున్న విజయవాడలో ఆనాడు ధర్మదేవత ఆనంద నృత్యం చేసింది అన్నారు విశ్వనాథ.

“హే జననీ కృష్ణవేణీ ! భ్రాజిత తరంగ రాణీ !

  పంచపాతక హారిణి ! పరమ మంగళకరిణీ !

  దక్షిణే దివ్యవాహిని - అక్షీణ భాగ్యప్రదాయినీ !

  శ్రీశైల మల్లికార్జున దివ్యచరణ సంసేవినీ !

  కనక దుర్గా భవ్య కరుణా కటాక్ష సంవర్ధినీ

  కృష్ణవేణీ ! కృష్ణవేణీ ! మమ ప్రసీద !! మమ ప్రసీద !! “

అని సి నారాయణరెడ్డి గారు స్తుతించారు.

 

ఇకపోతే మరియొక ప్రముఖ నది తుంగభద్రానది. తుంగ, భద్రలు కలిసి తుంగభద్రగా ఏర్పడి కృష్ణమ్మతో సంగమిస్తున్నాయి.

3. తుంగభద్ర

తుంగభద్ర నది, కర్ణాటక రాష్ట్రం పశ్చిమ కనుములలో తుంగ,భద్ర అనే రెండు నదులుగా ఆవిర్భవించినవి. రెండు కలసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య సరిహద్దులో ప్రవహించే ముందు, చివరికి కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం గ్రామానికి సమీపంలో ఉన్న కృష్ణా నదిలో కలుస్తుంది.

తెలుగు సాహిత్యము లో, ఈ నది కొన్ని రచనలలో ప్రస్తావించబడినది. తెనాలి రామకృష్ణుడు, తన పాండురంగ మహాత్యములో ఈ నది అందాన్ని ఈ విధంగా పొగుడుతున్నాడు -

" గంగా సంగమ మిచ్చగించునె? మదిన్ గావేరి, దేవేరిగా

  నంగీకార మొనర్చునే?యమునతో నానందమ్ము బొందునే?

  రంగ తుంగ తరంగ హస్తములతో రత్నాకరేంద్రుండు నీ

  యంగంబంటి సుఖించునేని గుణభద్రా తుంగభద్రా నదీ! "

సముద్రుడు భర్త, నదులన్నీ అతని భార్యలు - అది కవి సమయం! తుంగభద్రా నది ఉపనది.అది సముద్రంలో కలవదు. అందుకని కవి చమత్కారంగా తుంగభద్ర అందాన్ని  పొగుడుతున్నాడు. “ ఓ తుంగభద్రా! ఆ సముద్రుడు నిన్ను చుడలేదు కానీ! చూసి ఉంటే, గంగ, కావేరి, యమునా నదులతో సుఖించేవాడా! ఉండేవాడు కాదు. నీవంత సౌందర్యవతివి; అని భావన చేశాడు.

వాదిరాజు దీక్షితుల వారు తుంగ భద్రా నదీమ తల్లులను ఈ విధము గా ధ్యానిస్తున్నారు - 

నతోస్మి తుంగాం విలసత్తరంగా

 మమేఘ భంగాం హరి పాద సంగాం

 శ్రీతోస్మి భద్రాం హృతపాపనిద్రాం

 విముక్తి పద్యాం విమలైక సాధ్యాం”

ఇక మన నదీమ తల్లుల గురించి వివరిస్తూ పొతే అది యొక ఇతిహాసమే అవుతుంది.

సువర్ణముఖీ తీరంలో ధూర్జటి, పెన్నా నదీ తీరంలో తిక్కన, ఎర్రాప్రగడ మరియు ఎంతోమంది కవులు, పండితులు భాసిల్లారు.

ఈ విధంగా ఎన్నో నదుల చరిత్రలు, వర్ణణలు మన సాహిత్యంలో మమైకమయినవి.  గుర్రం జాషువా గారు అన్నట్లు -

"   సింధు గంగానదీ క్షీరముల నెపుడు కురిసి,  

    బిడ్డల పొషించుకొను

    పచ్చి బాలింతరాలు మా భారతమాత

    మాతలకు మాత, సకల సంపత్సమేత ! మాతలకు మాత, సకల సంపత్సమేత !!

   మా భారతమాత! "

భారతీయులకు ఏ నది అయినా జీవనదియే! అది ఒక్క నది మాత్రమే కాదు, మన తల్లి. తెలిసో తెలియకో చేసిన దైహిక, మానసిక మలినాలను తొలగించే పవిత్ర వస్తువు నది. ఆకాశం నుంచి పడిన నీరు ఏరై, నదియై సాగరంలో సంగమించే ప్రక్రియ జీవితానికి గొప్ప సందేశమిస్తుంది.


మానవుని మేధోవికాసానికి ప్రకృతి వనరులు ఏంతో తోడ్పడతాయి కదా! మరి, సమస్త మానవాళికి ఆధారమైన ఈ నదులను మనం కాలుష్యరహితం గా ఉంచుకొనలేమా? భావి తరాలకు స్వచ్చమైన వనరులను అందించడము మన గురుతర బాధ్యత కదా!

ఈ అపురూప సంపదను మనం కాపాడుకుంటూ సమ సమాజ నిర్మాణంలో పాలుపంచుకుందాము.
 

*****

bottom of page