top of page
adannamaata.png

సంపుటి  5   సంచిక  3

Website Published &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

అదన్నమాట సంగతి

దూరం... దూరం...

Jyothi Valaboju

జ్యోతి వలబోజు

పూజ చేసుకుంటున్న బామ్మ దగ్గరకు వెళ్తే స్నానం చేయకుండా నన్ను ముట్టుకోవద్దు దూరం అంటుంది.

ఇల్లు దులుపుతున్న నాన్న దగ్గరకు వెళ్తే ఇక్కడికి రాకు దూరం అంటాడు.

వంట చేస్తున్న అమ్మ దగ్గరకు వెళ్తే దూరం దూరం రాకు.. హాల్లో ఆడుకో పో అంటుంది.

ఇలా ఇంట్లో అందరూ దూరం అంటారు.

కాని...

ఇప్పుడు ప్రపంచమంతా దూరం దూరం అంటోంది.

ఎందుకు... ఏమిటి...

సాధారణంగా ఒక ఆరోగ్య సమస్య ఒక ఊరు లేదా పట్టణం, ఒక రాష్ట్రం, ఒక దేశం, ఒక ఖండం అని  వస్తుంది. కాని ఇఫ్పుడు  ప్రపంచం మొత్తం ఒకే మాయదారి మహమ్మారి బారిన పడి అల్లకల్లోలంగా ఉంది. 

పేదా గొప్పా, చిన్నా పెద్దా, ఆడా మగా అన్న తేడా దానికి అస్సలే లేదు. అందరిని కాటేస్తోంది. లక్షలమందిని పొట్టనబెట్టుకుంది.

విశ్వవిజేతలనుకున్నవారిని కూడా విలవిలలాడేలా చేస్తోంది ఈ మందులేని మహమ్మారి..

ఒకవైపు భయం, మృత్యువు మరణతాండవం చేస్తున్నా, దీనినుండి దూరంగా ఉండడానికి, దరికి రాకుండా చేయడానికి దూరం దూరం అనే మంత్రం పాటించక తప్పదు. ఇందుకోసం పాటించే సూత్రాలు అనాదిగా మన భారతీయ సంప్రదాయంలో ఉన్నవే. పెద్దలు చెప్పినవే.. మనం  పాటించడం మానేసినవే మళ్లీ మొదలెట్టక తప్పడంలేదు.

కొత్తవాళ్లు, పెద్దలు, బంధువులు ఎవరైనా ఇంటికి వచ్చినా, ఎదురైనా రెండు చేతులు జోడించి నమస్కారం చేయమని చెప్పారు. కాని చాలా మంది ఇప్పుడు షేక్ హాండ్ అంటున్నారు... హగ్ అని కౌగలించుకుంటున్నారు.. ఇదేం మాయరోగమో. ఫారిన్ చదువుల ప్రభావమో.. కాని  ఇపుడు ఇవన్నీ వద్దంటే వద్దు .. అసలు వద్దు అంటున్నారు. భారతదేశమే కాదు విదేశాల్లో కూడా ఈ సూత్రం పాటించక తప్పడం లేదు. చేస్తే నమస్కారం లేదా దూరం నుండే హాయ్ , హలో... అంటున్నారు. నో హగ్, నో షేక్ హాండ్.. భలే భలే కదా..

నోరు మూసుకో...   అంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా. ఇలా అంటే చిన్న పిల్లలు కూడా పడట్లేదు. ఇంత మాట అంటారా అని వాళ్లకీ కోపమే... మరి ఇప్పుడు ఎవ్వరూ అంటే ఎవ్వరూ కూడా... నోరు మూసుకో అంటే ఎంచక్కా నోరు మూసుకుంటున్నారు.  పది రూపాయలు, ఇరవై రూపాయలు, వంద , రెండు వందలతో దొరికే మాస్కులు మూతికి కట్టుకోవడం కంపల్సరీ అయిపోయింది. మూతికి మాస్కు లేకుంటే నో ఎంట్రీ అని కూడా అంటున్నారు ఎక్కడికెళ్ళినా..  మరో వింత విషయం చెప్పేదా.. అసలు మనవారి క్రియేటివిటీకీ జోహార్లు చెప్పాలండీ. కరోనా రాకుండా మాస్కు పెట్టుకోమంటే అందులో కూడా వెరయిటీ, డిజైనర్ కూడా మొదలయ్యాయి. మగవాళ్లకంటే ఏదో ఒకటి చాలులే అనుకోవచ్చు కాని లేడీస్ కి అలా ఎలా కుదురుతుంది ?? ... చీరలకు తగిన మాచింగ్ మాస్క్. కలంకారీ ప్రింట్ మాస్క్, కాస్త కాస్ట్లీ చీరలైతే జరీ అంచులు గట్రా , ఇంకా హెవీ చీరలకు మాత్రం మాచింగ్ ఆరి వర్క్ అదేనండి జరీ, సీక్వెన్స్ ఎంబ్రాయడరీ చేసిన మాస్కులు కూడా తయారు చేయించుకుంటున్నారు. ఆడాళ్లా మజాకా.. ఇక్కడ ఇంకో వింత చెప్పనా. దుబాయిలో ఆల్రెడీ అమ్ముతున్నారంట.. అచ్చంగా వెండితో నగిషీలు చెక్కిన మాస్కులు మార్కెట్లో అమ్మకానికి తయారుగా ఉన్నాయి. ఇంకా ఉన్నవారైతే బంగారంతో కూడా చేయించుకుంటారేమో . ఏమో ఎవరికి తెలుసు..

ఇప్పుడు జరిగే పెళ్లిళ్లలో చాలా మార్పులు వచ్చాయి.. కాదు కాదు.. చేయక తప్పట్లేదు.. అతిధులు అందరూ మాస్కులతోనే రావాలి. గుమ్మంలో బొట్టు పెట్టి, పన్నీరు చల్లే బదులు మీటరు పెట్టి టెంపరేచర్ చూసి, సానిటైజర్ చేతులకు రాసి, రిజిస్టరులొ పేరు, అడ్రస్సు, ఫోన్ నంబరు రాసి లోపలికి వెళ్లాక పెళ్లివాళ్ళే తలా ఒక్కరికి పండు పువ్వు బదులు ఒక సానిటైజర్, ఒక మాస్కు ఇస్తున్నారంట.. హాళ్లో కూర్చోవడం కూడా దూరం దూరమే. ఏం చేస్తాం. కాలం అలా మారిపొయింది. పెళ్లి చేసుకుంటే యాభైకి మించకూడదు. చావులకైతే ఇరవైకి మించకూడదు అని ప్రభుత్వం ఆర్డర్ వేసేసింది. పాటించక తప్పదు మరి లేకుంటే మనమే పాడెక్కక తప్పదు.

 

మన మోడీ సారు ఒకరోజు జనతా కర్ఫ్యూ అన్నారు. పెద్దాయన చెప్పాడు కదా అని బాగోదులే... సరే అని ఇంట్లో కూర్చున్నాం. చప్పట్లు కొట్టమన్నారు. భలే ఉందే అని చప్పట్లు, పళ్ళేల మీద చెంచాలతో కొట్టుడ్లు, ఆ ఓపిక లేకుంటే గంట కొట్టడం చేసారు. నాలాంటి బద్ధకిస్టులు యూట్యూబులో గుడిగంటల వీడియో పెట్టారు సౌండు పెంచేసి.. ఆ తర్వాత ఇలా వైరస్ వచ్చేస్తోంది. దాన్ని కట్టడి చేయాలంటే లాక్‌డౌన్ తప్పదు అన్నారు. నిజమే కామోసు.. ఏం చేస్తాం. ఇంట్లోనే కూర్చున్నాం. దుకాణాలు బంద్, కంపెనీలు బంద్, మార్కెట్లన్నీ బంద్, సినిమాలు బంద్, షాపింగ్ కాంప్లెక్సులు బంద్.. మందులు (వేసుకునేవే సుమా), కిరాణా సరుకులు, కూరగాయలు, పళ్ల దుకాణాలు తప్ప అన్నీ బంద్. మృదులాత్మక నిపుణులకు మాత్రం ఇంటినుండే ఉద్యోగం చేయక తప్పలేదు. అర్ధం కాలేదా. అదేనండి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. అమ్మల్లారా... అయ్యల్లారా.. అమ్మాయిల్లారా.. అబ్బాయిల్లారా.. మీ ఆఫీసు కంప్యూటరు, టేబులు ఇతర సామాన్లన్నీ మీ ఇంటికి పంపిస్తాము. ఎంచక్కా ఇంట్లో ఉండి పని చేయండి. ఠంచనుగా జీతం తీసుకోండి అన్నారు. నయం కదా.. ఉద్యోగం ఊడకుండా ఉంది అనుకున్నారు.  అలా నా కొడుకులాంటి వాళ్లు ఇంటినుండి ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ల బాధలు వేరే లెండి.

ఇక లాక్‌డౌన్లో ఏం చేస్తున్నారయ్యా అంటే.. పిల్లలకు స్కూళ్లు లేవు, కాలేజీలు లేవు. వీళ్లంతా పరీక్షలు రాయకుండానే పాస్ అయిపోయారు. ముందే తెలిసుంటే నా డిగ్రీ పరీక్ష కూడా కట్టేసి పాసయ్యేదాన్ని.. ప్చ్.. ఆఫీసులు లేవు. ఇంటినుండే ఉద్యోగాలు. ఎవరి రూములో వాళ్లు తలుపులేసుకుని కంప్యూటరు ముందు కూర్చుంటారు. ఇంకో ముఖ్య విషయం... పనిమనుష్యులను కూడా నో అన్నారు. ఏమో వాళ్లు నాలుగైదు ఇళ్లు తిరుగుతూ ఉంటారు. ఏమో ఎవరు చెప్పొచ్చారు. ఏ పుట్టలొ ఏ పాముందో. ఎవరికి కరోనా రోగముందో.. అని చాలా అపార్టుమెంట్లలో పనిమనుష్యులను రానివ్వలేదు. కొందరు పుణ్యాత్ములు పనిమనిషి రాకున్నా జీతాలు మాత్రం ఇచ్చారు. వీలైతే సరుకులు కూడా ఇచ్చారు. అంతా బాగయ్యాక  వద్దువులే ఇంట్లోనే జాగ్రత్త ఉండు అన్నారు. సో మిగిలింది ఎవరు?  ఇంట్లో ఉండే లేడీస్. అదేనండి భార్యలు, అమ్మలు.. ఇంతకు ముందైతే పొద్దున్నే టిఫిన్లు వంటలు కానిచ్చేసి, బాక్సులు కట్టిస్తే పది గంటల వరకు భర్త, పిల్లలు వెళ్లిపోయేవారు. పనిమనిషి వచ్చి ఇంటి పనంతా చేసి వెళ్లాక తీరిగ్గా మిగతా పనులు చేసుకునేది. మరి ఇప్పుడు.. అందరూ ఇంట్లోనే ఉంటారు. పని మనిషీ రాదు. ఏముంది. వంటలకు విరామం ఉండదు. పని తెగదు. తెల్లారదు. ఒకవైపు వంట చేసి పెట్టామా అంటే కడగడానికి సింకునిండా అంట్లు. వాటిని శుభ్రం చేసుకుని, ఇల్లు ఊడ్చి, బట్టలు ఉతికి సర్దుకున్నామంటే మళ్లీ టిఫిన్లో , భోజనాలో అంటారు. అదీ కాకుంటే పంటికిందకు ఏదో ఒకటి అడుగుతారు. ఈ లాక్‌డౌన్ మూలంగా స్విగ్గీ పాయే, జొమాటో పాయే, హోటల్సూ మూతపడే, బండి మీద కూడ ఏమీ దొరకవాయే, మిగిలింది ఏంటి...?? ఎవరింట్లో వాళ్ల వంటిల్లే. పర్సునిండా డబ్బులున్నా కొనుక్కుని తినే పరిస్థితి లేదు. ఇంట్లోనే అమ్మ/ఆలి చేతితో వండించుకోక తప్పదు. మరి ఆవిడకు ఎంతమంది సాయం చేసారో తెలీదు.  ఇల్లాలికి ఉన్న తీరిక సమయమంతా హుష్ కాకి అయిపోయింది.  కాని ఒక మాట చెప్పక తప్పదు. బయటకు వెళ్ళే వీలు లేకున్నా చాలామంది జంక్ ఫుడ్, బండి మీద ఫుడ్ అన్నీ ఇంట్లోనే చేయడం మొదలెట్టారు. ముఖ్యంగా పానీపూరి. బండి మీద రుచి రాదనుకోండి. అయినా ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యానికీ మంచిది,, డబ్బులు కూడా మిగిలిపోతాయి కదా. అసలు వంటను ఎంజాయ్ చేస్తూ చేసారంటే దానంత సంతృప్తి వేరే లేదనుకోండి. బయట దొరికేవన్నీ ఇంట్లో చేసుకోవచ్చు. దీనికోసం ఫేస్బుక్‌లో కూడా చాలా పేజీలు, గ్రూపులు, యూట్యూబులో వీడియోలు చేస్తున్నారు. చాలా సులువుగా, ఈజీగా దొరికే సామాన్లతో హోటళ్లలో, బేకరీలలో దొరికేవన్నీ ఇంట్లో చేసేస్తున్నారు. అందుకే షాపుల్లో కాని, ఆన్లైన్ కాని ఓవెన్లు, బేకింగ్ పౌడర్, యీస్ట్, మొదలైన సామాన్లు చాలా వేగంగా అమ్ముడవుతున్నాయంట.  షార్టేజీ ఉంది.. లాక్డౌన్ చేసిన మంచి పనుల్లో ఇదొకటి.. ఇంటిపట్టున రుచికరమైన, శుభ్రంగా వంట చేసుకోవడం.  ఇంట్లోని వారంతా కలిసి సమయం గడపడం.. నేనైతే తీరిగ్గా నాకోసం అంటూ ఎన్నో స్పెషల్స్ చేసుకుంటూ  ఉన్నా. ఇంతకు ముందైతే పని బిజీ మూలంగా టైం దొరికేది కాదు. తిండి మీద శ్రద్ధ ఉండేది కాదు.

కరోనాని ఒకవిధంగా మెచ్చుకున్నా, మరో విధంగా తిట్టుకోక తప్పదు. ఎక్కడికీ వెళ్లకుండా, ఎవరినీ కలవకుండా చేసిందిగా. ఇంతకు ముందైతే ఎన్నెన్ని పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పార్టీలు, ఫ్రెండ్స్ ని కలవడాలు, పుస్తకాల ప్రోగ్రాములు... అబ్బో... ఎన్ని చీరలు కట్టుకుని తిరిగేది. ఇపుడంతా తారుమారయింది.. చీరల బీరువా తలుపు తీసి ఎన్ని నెలలైందో.. తలుపు తీసి కాలు బయట పెట్టని దానికి, మండు వేసవిలో ఏం చేస్తాం. నైటీలే దిక్కు.. ఎవరు చూడొచ్చారులే అన్న నిర్లక్ష్యం.. ఇల్లు శుభ్రం చేసుకోవడం, కడుక్కోవడం, తుడుచుకోవడం, వంట, అంట్లు.. ఇలా కాలం గడిచిపోతుంది. టైం దొరికితే సినిమాలు.. బయట థియేటరుకు వెళ్లకుంటే ఏంటి.. ఎంచక్కా ఇంట్లో టీవీలో కాని, కంప్యూటర్లో కాని, మొబైల్‌లో కాని ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ అంటూ ఎన్నో సైట్లలో చూడడానికి చాలా సినిమాలున్నాయి. ఒక్కరి పేరు మీద సంవత్సర చందా కట్టేయడం నలుగురైదుగురు చూసేయడం.. ఎప్పుడంటే అప్పుడు మంచి సినిమాలు.

ఇక మీటింగుల విషయానికొస్తే జూం అనేస్తున్నారు. ఎవరింత్లో వాళ్లు కూర్చుని మీటింగులెట్టేస్తున్నారు.

మనమంతా సేఫ్ గా ఇంట్లో ఉండడానికి మనకోసం డాక్టర్లు, పోలీసులు, బ్యాంకు సిబ్బంది. మున్సిపాలిటీవాళ్లు, హెల్త్ డిపార్టుమెంట్ వాళ్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నారు. వాళ్లకు సలాం చేద్దాం.. మనం వాళ్లకోసం, మనకోసం, మనవారి కోసం ఇంట్లోనే ఉందాం.. అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఉండడం చాలా ముఖ్యం. కాస్త ఓర్పు వహిస్తే చాలా తొందరగా ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు చక్కబడతాయి..

ఈ దూరం ఎప్పటికి పోయేనో. మామూలు పరిస్థితి ఎప్పటికొచ్చేనో..

మన చేతిలో ఏమీ లేదు.. అయినా చేతులు కడుక్కోక తప్పదు..

***

bottom of page