top of page

పుస్త​క పరిచయాలు

నిర్వహణ: శాయి రాచకొండ  |  శ్రీనివాస్ పెండ్యాల

sahityam@madhuravani.com

adannamaata.png

సంపుటి  5   సంచిక  3

Website Published &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

పుస్తక విశ్లేషణ

మేము ఎంపిక చేసుకున్న కొన్ని  పుస్తకాలు ఈ ‘పుస్తక పరిచయాలు’ శీర్షికలో విశ్లేషించబడతాయి.

సంక్షిప్త పుస్తక పరిచయం

పుస్తక రచయితలకి ఉచితంగా ప్రచారం కలిగించడంకోసం మరియు పాఠకులకి కొత్త పుస్తకాల అందుబాటు గురించి క్లుప్తంగా పరిచయం చేయుట కొరకు "సంక్షిప్త పుస్తక పరిచయం" శీర్షిక ఉద్ధేశ్యింపబడింది. ఈ శీర్షిక లో తమ సరికొత్త గ్రంధాలని పరిచయం చెయ్యదల్చుకున్న వారు, ప్రచురించబడ్డ కొత్త పుస్తకాల ముఖ చిత్రం (స్కాన్ చేసిన ఫ్రంట్ కవర్), రచయిత వివరాలు, పుస్తకం గురించి ఐదు వాక్యాలు మించకుండా సంక్షిప్త సమీక్ష, కొనుగోలు వివరాలు మాకు పంపగలరు.

పంపించవలసిన చిరునామా:

sahityam@madhuravani.com

సంక్షిప్త పుస్తక పరిచయం విషయాలలో అంతిమ నిర్ణయం మధురవాణి నిర్వాహకులదే. 

videshagamane kathalapam
ramaneeya pelli kathalu

విదేశగమనే – కథా సంకలనం – తాడికొండ కె. శివకుమారశర్మ

-శాయి రాచకొండ

2016 లో వెలువడిన ఈ పుస్తకం ఈ మధ్యనే శర్మగారిని కలిసినప్పుడు స్నేహపూర్వకంగా ఆయన సంతకంతో నాకు చదవమని ఇచ్చారు.  అయితే అలవాటు ప్రకారం పుస్తకాన్ని ఒకచోట పెట్టబోయి ఇంకోచోట పెట్టి కనబడక మధురవాణి పాఠకులకు పరిచయం చెయ్యడం ఆలస్యమయింది.  అయితేనేం, ఇప్పటికయినా నాకా అవకాశం వచ్చినందుకు, అంటే పుస్తకం కనబడినందుకు, నన్ను నేనే వెన్ను తట్టుకుంటూ, ఇదిగో, ఓ మంచి పుస్తకం గురించి....

ఈ కథా సంకలనంలో 2004-2015 మధ్య వివిధ పత్రికలలో ప్రచురితమైన ఒక ఇరవై కథలున్నాయి.  ఇలా ఒక రచయిత రాసిన కథలు ఒకచోట ఉంటే, సాధారణంగా కథలకంటే ముందు ఆ కథలు రాసిన రచయిత రాసే విధానం గురించి, మనం రచయిత కలం వెనక ఆలోచనా విధానం గురించి తెలుస్తుంది అని నా అభిప్రాయం.  కథల గురించి చెప్పుకునే ముందు కథకుడి ఆలోచనలను కొంచెం చూద్దాం. 

మొత్తం ఇరవై కథలున్న ఈ పుస్తకంలో ఎనిమిది తొమ్మిది కథల నేపథ్యం తెలుగు దేశానివైతే, మిగిలినవి డయాస్పోరా కథలని చెప్పచ్చు.  కేతు విశ్వనాథరెడ్డి గారు రచయిత గురించి రాస్తూ, ‘చాలా మండి తెలుగు పాఠకులకు దరిచేరని కొత్త కథావస్తువులనూ, పాత్రలనూ, నేపథ్యాలనూ తన కథల్లో చిత్రీకరించాడ’ని చెప్పి, రచయితను ‘కొత్త వాకిళ్ళను తెరచిన కథకుడు’ అని అన్నారు.  కొన్ని కొత్త వాకిళ్ళను తెరిచిన మాట నిజమే.  అంతేకాదు.  పాత కథల్ని కొత్త కోణంతో చూడడం కూడా జరిగింది. 

 

ఉదాహరణకు ‘రహస్యం’ కథ పాండవులకూ కౌరవులకూ చదువూ, విలువిద్య, కత్తి యుద్ధం, మొదలైన యుద్ధ విద్యాలూ నేర్పే ద్రోణాచార్యుడు అర్జునుడికి తప్ప మిగతా అందరికీ హ్రస్వ దృష్టి ఉండడం గమనించి అర్జునిడికే విలువిద్యను ఎక్కువ పాలులో నేర్పించాడని చెబుతుంది.  ‘స్వాభిమానాభివృద్ధి వ్రత కథ’ శంకరయ్యకు తన ఇలాకా జయలక్ష్మీ ఖాతాలో తన ఎగస్పార్టీ నాయుడు కూడా ఉన్నాడని తెలిసిన కోపంతో మొదలై భారత యుద్ధంలో గెలిచిన తర్వాత ధర్మరాజు, రామాయణ యుద్ధంలో మేఘనాథుడు మరణం తరవాత రావణుడి పరిస్థితిని కలుపుతూ ఈ స్వాభిమాభివృద్ధి వ్రతాన్ని ముగ్గురి చేత చేయిస్తారు రచయిత.  ఎక్కడనుండి ఎక్కడికి వెళ్ళినా ఒకటి మాత్రం ఖచ్చితంగా తెలిసేదేమిటంటే రచయితకు భారత రామాయణాల మీద మక్కువ, చాలా లోతుగా పరిశీలించి అందులో కథలను కొత్త కోణంతో మనకందివ్వడం. 

 

విశ్వనాథ రెడ్డి గారు చెప్పినట్లు “కథల్లో ప్రస్తావనకు వచ్చే అమరకోశం, భర్తృహరి సుభాషితాలు, స్తోత్రాలు, నామావాళీ, సూక్తులు, పూజావిధానాలు, శతకాలు, కావ్యాల్లోని ఉల్లేఖనాలు, శివకుమార్ సంప్రదాయ ప్రీతినీ, తెలుగు భాషానురక్తినీ తెలియచేస్తాయి”  అన్నది అక్షరాలా నిజం. 

శివకుమార్ గారికి తెలుగు భాషపై మంచి పట్టున్నదనడంలో సందేహం లేదు.  కథను మలచే విధానంలో ఆయనది ప్రత్యేకమని చెప్పుకోవచ్చు.  సంభాషణలపైనే ఆధారంగా రాసిన కథలు చాలానే కనిపిస్తాయి.  అయితే కొంచెం శ్రమ పడితేనే గాని స్పష్టత రాని సందర్భాలు కనిపించేయి కూడా.  కొన్ని కథలు చదవడానికి ఇబ్బంది పెట్టిన మాట నిజం.   

 

చాలా కథల్లో ‘నాన్న’ని తల్చుకోవడం కనబడుతుంది.  ఇది రచయిత చూపించిన ఒక ఒరవడి.  కథల్లో పాత్రలు ఏదో రకంగా ఆ నాన్నను తల్చుకోవడం జరుగుతుంది, మంచిగానో చెడ్డగానో, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో.  రచయితని సైకో అనాలిసిస్ కి గురిచెయ్యడం లక్ష్యం కాదు కానీ, ఇదొక పరిశీలన మాత్రమే.  

 

విదేశ గమనే కథలో సాఫ్ట్ వేర్ నాలెడ్జి తను అమెరికా రావడానికి కారణమయితే, నాన్న నేర్పిన విద్య (పౌరోహిత్యం) బతకడానికి ఆధారమవడాన్ని నేర్పుగా పాఠకులముందుంచారు రచయిత.  సామాన్యంగా మనకు తెలిసిన మనుషులను అతి తేలిగ్గా అంచనా వేయడం పరిపాటి.  అలాంటి అంచనాలు తారుమారయి, సాధారణ మనసుల్లో అసాధారణ ఆలోచనాలుండవచ్చని చూపించే కథ ‘నాకు తెలిసిన టెంసింగ్ నార్కే’.  చివరలో రచయిత అన్న మాటలు – “గొప్పవాళ్ల విజయాలకి అసూయ పడలేనప్పుడు, వాళ్ళ స్థాయికి చేరుకోవాలని అనుకోవడానికి కూడా భయమేసినప్పుడు, చెయ్యడానికి మిగిలిందీ చప్పట్లు కొట్టటమేగా!” -  పాఠకులు కొంచెం ఆగి ఇంకో సారి చదివే మాటలివి.  అయితే చప్పట్లు కొట్టడం మనసుల్లో ఉన్న అసూయ పడలేని అశక్తతా?  ఆ స్థాయికి చేరుకోలేమోననే భయమా? ఆ మాటలతో ఏకీభవించడం కష్టమే!

 

‘లోన్ డ్రమ్మర్’ కథ వృత్తి వ్యాపకంలో పడి భార్యా పిల్లలతో సమయాన్ని పంచుకోలేని, డబ్బుతోనే మనిషికి విలువ కట్టే మనస్తత్వాన్ని అలవరచుకున్న అమెరికాలో సెటిల్ అయిన ఒక డాక్టర్ మనో విశ్లేషణ.  తనదైన శైలిలో శివకుమార్ రాసిన కథ బాగుంది.  ఆలోచింపచేసే మరో కథ ‘పెళ్ళంటే’.  తల్లి, తండ్రి చూసి చేసిన పెళ్ళి చేసుకున్నా ఒక అమెరికా నివాసికి మొదటి రోజు నుండి తామరాకును నీరంటని రీతిగా ఉన్న భార్య ప్రవర్తన అమెరికా వచ్చిన కొద్ది రోజులలోనే తన ప్రియుడితో పారిపోయిన జీవితం.  అమెరికాలో నివసించే ఒక స్త్రీ కట్టుకున్న భర్తతో ఒకరోజు సరిగ్గా కలిసి గడిపిన అతి కొద్ది రోజులలో జరిగిన ఒక ఆక్సిడెంట్లో అతను కోమాలో కెళ్ళి ఎవరికీ పనికిరాకుండా పోవడం కథకు ఆధారం.  వాళ్ళిద్దరూ కలసినప్పుడు వారి వారి ఆంతరంగిక ఆలోచనలు, వారిద్దరి మధ్య ప్రశ్నలు, రచయిత విశ్లేషణ – పాఠకుల్ని తప్పక ఆలోచింపచేసే కథ.

 

అమెరికా జీవితాన్ని చాలా సునిశితంగా పరిశీలించి, మంచి విశ్లేషణతో రాసిన కథలున్నాయి.  అన్నీ కథల్నీ విశదీకరించడం ఈ పుస్తక పరిచయం ఉద్దేశ్యం కాక పోవడం వల్ల నాకు నచ్చిన ఒకటి రెండు కథల్ని గూర్చి ప్రస్తావించడం జరిగింది. 

శివకుమార్ గారు మంచి రచయిత.  కథలు ఏదో కాలక్షేపానికి చదువబడలేవు.  కొంచెం ఆగి ఆలోచించాల్సినవే.    

 

అజో-విభో-కందాళం ఫౌండేషన్ వారి ప్రచురణ ఇది.  ప్రతులకు ఏ‌వి‌కే ఫౌండేషన్ వారిని సంప్రదించవచ్చు.  అన్ని పాపులర్ పుస్తక విక్రేతలదగ్గరా ప్రతులుంటాయని చెప్పారు.  వెల రూ. 150.00 మాత్రమే. 

రమణీయ పెండ్లి కథలు – అక్కిరాజు శ్రీహరి

ఇది కేవలం ఇరవై అయిదు పేజీల పుస్తకం.  మొత్తం ఏడు కథలు – ఏడడుగుల్లా అంటారు రచయిత.  ఇది అతని మొదటి కథా సంకలనం. 

పుస్తకాన్ని చూడంగానే కనిపించేవి రంగుల బాపు బొమ్మలు – పుస్తకానికి రెండువైపులా.   ఒకటి సీతారాముల కళ్యాణం, రెండోది కూడా సీతారాములే, హనుమంతుడితో సహా – పట్టాభిషేక ఘట్టం.  బాపు బొమ్మలే చెప్పక చెప్తాయి ఈ రెండట్టల మధ్య పాఠకుల ముందుంచిన రచయిత ఊహలు. 

తన మాటగా రాస్తూ, రచయిత “సీతారాములను ఏ ఇతిహాసానికో చెందిన దేవతలవలే చూడటంకాక వారి అనుబంధానికి వెనుకనున్న తత్వాన్ని తెలుసుకొని మనకు అన్వయించుకుంటే బావుంటుంది” అని.  అదే ఉద్దేశ్యంతో రాసిన చిన్ని కథలు అన్నీ.  సీతమ్మ పెళ్ళి, శరవణ కళ్యాణం, మీనాక్షి తిరుకళ్యాణం, శ్రీ గోదా కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం, సిరి కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం ఇవీ కథలు.  శ్రీరామ పట్టాభిషేకం కూడా ఒక కళ్యాణమే ఎందుకంటే అది లోక కళ్యాణమే అని రచయిత ఉద్దేశ్యమేమో!

 

చాలా సాధారణమైన భాషలో దేవుళ్ళని మనలోకి తీసుకొచ్చి మన ఆలోచనలకు అనుగుణంగా అనురాగం, ఆరాధన, ప్రేమలను పంచుకుంటూ పెళ్ళి చేసుకుంటే మనకూ అనిపిస్తుంది బాగుంటుంది కదా అని – ఎందుకంటే మన సమాజంలో ఉన్న పద్ధతుల్లో పెళ్ళికి ముందు ఇవి తక్కువే ఒక రకంగా.  అంతకు ముందు ఉన్నా, పెళ్ళి అయిన తరువాత అన్నీ మర్చిపోయి జీవితపు ఒరవడిలో పడిపోయి అవి మళ్ళీ కావాలనుకోవడం సహజంగా జరుగే విషయం.  ప్రతి మనిషికి కావాల్సిన ప్రేమానురాగాలు మనం దేవుళ్ళణించి తెచ్చుకోవడం మన మనుగడకి కలిగే కొంచెం సేద ఏమో.  అందుకే మనం దేవుళ్ళకి కళ్యాణాలు చేసి ఆనందిస్తూంటాం. 

 

ఈ చిన్ని పుస్తకం పెళ్ళిళ్ళలో, వధూవరులకు బహుమతిగా ఇవ్వడానికి బాగుంటుంది.  పుస్తకం కావలసిన వారు రచయిత (శ్రీహరి+91 9940116304) ని సంప్రదించండి.  పుస్తకం నిజంగానే వెల లేనిది.

bottom of page