top of page
adannamaata.png

సంపుటి  5   సంచిక  3

Website Published &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

“దీప్తి” ముచ్చట్లు

ముసుగు

Deepthi Pendyala, madhuravani, Deepthi Pendyala madhuravani

దీప్తి పెండ్యాల

"శివ తత్వంలో ట్రాన్స్ జెండర్ థియరీ ఉందట, తెలుసా డాడీ?" లిలియన్ అడిగిన ప్రశ్నకి తలెత్తి చూసాను.

మౌనంగా తలాడించి, ఒవెన్ లోనించి ఎంచిలాడా తీసి, డైనింగ్ టేబుల్ పై పెట్టాను.

"అవును డాడీ, చిన్నప్పటినుంచీ నువ్వు చెప్పావు కదా? అర్ధనారీశ్వరుడని. పార్వతీ దేవి కి సగభాగాన్ని ఇచ్చాడని. పర్ఫెక్ట్ మ్యారేజ్ కి సింబాలిక్ రూపం అనీ? కానీ, అది కాదట అసలు కారణం. థర్డ్ జెండర్ కూడా ప్రకృతిలో భాగమని చూపించేందుకే ఇద్దరూ ఒక శరీరంలో ఇమిడిపోయారంట. అసలు హిందూ వేదాల్లో ప్రస్తావించినంతగా ఈ ‘థర్డ్ జెండర్’ గురించి మరి ఏ మత గ్రంధాలలోనూ లేదట. ఇండియాలో ‘మోస్ట్ సివిలైజ్డ్ ఎరా’ ఉండేదట ఒకప్పుడు. ఇప్పుడిపుడు మనం ఒక కొలిక్కి తెస్తున్న అంశాలు, భావజాలాలన్నీ హిందూ గ్రంధాలలో ప్రస్తావించే ఉన్నాయని మా ప్రొఫెసర్ చెప్పారు."  సీరియస్ గా నా వెంటే తిరుగుతూ చెబుతున్న లిలియన్ మాటలపై దృష్టి పెట్టలేకపోతున్నాను.

 

మామూలుగా అయితే లిలియన్ ఇలా ఉన్నట్టుండి ఏదో ఒక ప్రసక్తి తీసుకురావటం కొత్త కాదు నాకు.

ఈ జూన్ మాసమంతా "LGBTQ ప్రైడ్ మంత్ "  అవటంతో లిలియన్, పెద్దమ్మాయి శర్వాణీ ఇద్దరమ్మాయిలూ ట్విట్టర్ లలో, ఇన్స్టా గ్రాం లో వస్తున్న ఫీడ్ ఒరవడిలో "తాము సైతం" అంటూ ఉత్సాహంగా పాల్గొంటూనే ఉన్నారు. జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతంలో ప్రొటెస్టుల్లోనూ సామాజిక మాధ్యమాలలో చురుగ్గానే పాల్గొంటూండటంతో గత రెండు నెలలుగా ఇంట్లో కరోనా తో పాటుగా వర్ణ వివక్ష, LGBTQ హక్కుల గురించిన చర్చలే జరుగుతున్నాయి. ఇద్దరు పిల్లలనీ సామాజిక స్పృహ ఉన్న పిల్లలుగా పెంచటంలో మంచి తల్లితండ్రుల పాత్రే పోషించాము ఇంతవరకూ. కాకపోతే ఈరోజు నేను ఉన్న సందిగ్ధంలో లిలియన్ చెబుతున్న విషయం పై నాకు ఏ మాత్రం ఆసక్తి లేదు. నా మనసులో ఆలోచనలు వేరేగా ఉన్నాయి. మా వీధిలోనే ఉండే రేచెల్, ఈ రోజు సాయంత్రం వాళ్ళింట్లో జరుగనున్న గెట్ టుగెదర్ కి మమ్మల్ని ఆహ్వానించింది. ఈ కరోనా సమయంలో ఎవరికి వారే ఉంటున్నాము. ఇంత హడావిడిగా ఇప్పుడు కలవటమేంటో అర్థమవలేదు. ఐతే మాస్కులతోనే రమ్మనీ, సరదాగా కాసేపు దూరంగా కూర్చుని మాట్లాడుకునేందుకేనని చెప్పి మరీ రమ్మంది. వాళ్ళబ్బాయి గ్రేసన్ మా పెద్దమ్మాయి శర్వాణీకి చిన్ననాటినుంచీ మంచి స్నేహితుడు.

 

అంతకు ముందు వారం నుంచే శర్వాణీ స్నేహితుడు గ్రేసన్ ఇంటికి తరచుగా వస్తూండటంనా దృష్టికి వచ్చింది. దాంతో గ్రేసన్ ని గమనించటం మొదలుపెట్టాను. స్నేహం వరకే అనుకున్నపుడు గ్రేసన్ రంగు, జాతిపై నాకెపుడూ దృష్టిపోలేదు.  కాకపోతే ఒక వారం నించీ మాత్రం "కేవలం స్నేహమేనా?" అన్న అనుమానం కలుగుతుంది.  అప్పటి నుంచీ ఇదీ అని చెప్పలేని అసౌకర్యం. అక్కడికీ నా భార్య క్రిస్టీని ఒకసారి కదిలించి చూసాను. 'వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు, శరత్!' అని తేల్చేసి, నేను టేబుల్ మీద పెట్టిన ఎంచిలాడాని చక్కగా సర్ది, గార్నిష్ చేసే పనిలో మునిగిపోయింది. అది గ్రేసన్ కి ఇష్టమని చేయమన్నారు క్రిస్టీ, శర్వాణి. నేను అపుడపుడూ మాత్రమే చేసే కొన్ని వంటకాలకి అభినందనలూ ఎక్కువే. అభిమానులూ ఎక్కువే. 

 

ముప్ఫయేళ్ళ క్రితం భారతదేశం వదిలి, రీసెర్చుకని అమెరికా వచ్చి, క్రిస్టీ తో ప్రేమలో పడి, తల్లిదండ్రులని ఒప్పించి పెళ్ళి చేసుకోవటం, - ఇదంతా నిన్న మొన్న జరిగినట్టే ఉంది. ఆనాడు మా ఇంట్లో ఎంతో సులభంగా నా నిర్ణయం చెప్పి, నేనుకున్నది సాధించుకున్నాను. మరి ఇపుడేమో శర్వాణీ విషయంలో నా ఆలోచనల్లో ఇంతటి క్లిష్టత?

నా గోధుమ వర్ణం కన్నా ఏమంత తక్కువలో ఉన్న వర్ణమనీ గ్రేసన్ ని ఆలోచనల్లోనయినా అంగీకరించలేకపోతున్నాను? నిజానికి వాళ్ళ దృష్టిలో బేధభావాలుంటే, వాళ్ళ కంటే నేను ఎక్కువ స్థానంలో ఉంటానో, రేసుత్రాసులో నేనే తక్కువలో తూగుతానో తెలీదు కానీ నా మటుకు నాకు, శర్వాణీకి గ్రేసన్ సరికాడనిపిస్తుంది.

 అందునా, ఈ రోజు సాయంత్రం పార్టీకి పిలిచేందుకని ఫోన్ చేసినపుడు  గ్రేసన్ తల్లి రేచెల్ శర్వాణీతో ప్రత్యేకంగా మరికాసేపు మాట్లాడటం ఎన్నడూ లేనిది నన్నెందుకో అసహనానికి గురిచేసింది.

 

నేను ఊహించనిది ఏదో జరగబోతున్నట్టుగా సంకేతాలు అందుతున్నాయి నాకు. మనసులో ఏదో అలజడి.

 

ఉన్నట్టుండి శర్వాణీ అడిగింది -"డాడీ, గతవారం నుంచీ వైరల్ అవుతున్న నీ ట్వీట్ చూస్తూంటే చాలా గర్వంగా ఉంది. ఎంత పదునుగా రాస్తావు? మా స్నేహితులందరూ దాన్ని రీట్వీట్ చేస్తూ, మాట్లాడుతున్నప్పుడల్లా గర్వంగా ఉంటుంది. అయాం ప్రౌడ్ ఆఫ్ యూ."

 

శర్వాణీ మాటలు వింటూనే ఉలిక్కిపడ్డాను. ఆ ట్వీట్ నేను జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం నేపథ్యంలో నల్లజాతీయులకి మద్దతుగా, వర్ణ వివక్షకి వ్యతిరేకంగా రాసాను. ఇది మాత్రమే కాదు. నాకున్న వేల సంఖ్యల ఫాలోవర్ల కోసమని ఏది రాసినా అది సంచలనమే అవుతుంది. నేను అనుకున్నది సూటిగా, అందంగా రాయగల నేర్పు నా సొంతం. అందువల్లనే ప్రతీ అంశంపైనా నా గళం వినిపిస్తూనే ఉంటాను. ప్రతీసారి అది నా గళం కాకపోవచ్చు. నా చుట్టూ ఉన్నవారి దృష్టిలో నా పట్ల ఉన్న "ప్రోగ్రెసివ్" అన్న ఇమేజ్ ని కాపాడుకునేందుకుకని నాకు నేను సృష్టించుకున్న నా ఆల్టర్ ఈగో గళం అది. అది ఎంత మాత్రం నేను కాదని తెలిసొచ్చిన సందర్భాలు బహు తక్కువ. ఇదిగో ఈరోజు అలాంటి ఒక సందర్భంలోనే కొట్టుమిట్టాడుతున్నాను.

అక్కడితో ఆగకుండా శర్వాణీ మళ్ళీ అంది. - "నిజం డాడీ. నువ్వే అన్నింటిలో నాకు ఆదర్శం."

నేను ధరించిన ముసుగు నాకు ఊపిరాడనీకుండా చేసి నా గొంతు నొక్కేస్తున్న భావన కలుగుతుంటే,  ఉన్నపళాన ఆ ముసుగుని తీసేందుకు సన్నద్ధమయ్యాను.

నా గొంతులో ఆదుర్దా ఏ మాత్రం తెలీకుండా శర్వాణీని అడిగాను. "శర్వాణీ, గ్రేసన్ కేవలం స్నేహితుడేనా?"

 

ఆశ్చర్యంగా చూసింది శర్వాణీ నన్ను. "అవును డాడీ. ఎందుకా సందేహం?"

 

పెద్ద రిలీఫ్ నాలో. ఇక నా ప్రోగ్రెసివ్ ముసుగు తీసేయాల్సిన అవసరం ఇప్పట్లో లేదు.

 

సమాధానంగా అన్నాను "చనువుగా ఉంటే,పెళ్ళి గురించేమయినా ఆలోచిస్తున్నారేమో అని కనుక్కునేందుకు అడిగానంతే."

 

నా మాటలు వింటూనే తల్లీ కూతుళ్ళిద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. అక్కడే ఉన్న లిలియన్ వింతగా నన్నే చూస్తూ "డాడీ, గ్రేసన్ నిన్న రాత్రే, తనకి మెడికల్ గా కూడా అమ్మాయిగా గా మారాలనుందని ఇంట్లో అందరికీ చెప్పాడు. ఈ విషయం అక్కకి, నాకు, దగ్గరి స్నేహితులు మరిద్దరికీ ఈ మధ్యే చెప్పాడు కానీ, ఇంట్లో చర్చించేందుకే సంశయం.  అక్క ఇన్నిరోజులుగా గ్రేసన్ ని నిన్నటి "కమింగ్ ఔట్" కోసం మానసికంగా సిద్ధం చేసింది. అందుకే రేచెల్ కృతజ్ఞతగా మనందరినీ ఈరోజు గేదరింగ్ కి పిలిచింది." అంది.  

ఒక్క నిమిషం పాటు ఏమి విన్నానో కూడా సరిగ్గా అర్థం కాలేదు. ఆ పై ఏమి మాట్లాడాలో తెలీలేదు, అంతలోనే తిరిగి ముసుగు సర్దుకుంటూ -

"ఓహ్, చాలా గొప్ప విషయం. అయాం ప్రౌడాఫ్ యూ" అంటూ శర్వాణీని అభినందించాను. 

"చెప్పాగా డాడీ, మీరే ఆదర్శమనీ. టైమయింది, బయల్దేరుదామా? నన్నే చూస్తూ అడిగింది శర్వాణీ . తలవూపి వారితో పాటు బయటకి నడిచాను. 

 

గ్రేసన్ ఇంటికి వెళ్ళే దారిలోనే,  కనీసం మరో వారంపాటు వైరల్ గా మారి ప్రపంచాన్ని చుట్టేసే మరో ట్వీటు మనసులోనే రూపొందుతుంది. అలా ఒకటీ, రెండూ కాదు.  నా  గళం సంధించే  ప్రశ్నలు  నా ఇంటి గడప తొక్కనంతవరకూ  తీతుపక్షి గగనాలే హద్దుగా స్వేచ్ఛావిహారం చేస్తూనే ఉంటుంది.

*****

bottom of page