
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
Website Published & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
మధురవాణి ప్రత్యేకం
అధ్యాత్మికం
కలియుగ దైవం

ఎర్రాప్రగడ రామకృష్ణ
భగవంతుణ్ని భక్తులు రకరకాల పేర్లతో కొలుస్తారు, పిలుస్తారు. కాని ‘శ్రీవారు’ అన్న పేరు - ఒక్క శ్రీ వేంకటేశ్వరునికే సార్థకమైంది.
అలాగే దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నా - ‘కలియుగ వైకుంఠం’ అనేసరికి భక్తులందరికీ ఒక్క తిరుమల పుణ్యక్షేత్రమే స్ఫురిస్తుంది.
సంస్కృతంలో సప్తగిరీశుడని, తెలుగులో చక్కగా ఏడుకొండలవాడని, కొందరు బాలాజీ అనీ, శ్రీనివాసుడనీ, తిరుమలరాయుడనీ మరీ ఆప్యాయంగా వెంకన్న దేవుడనీ - భక్తులు వేంకటేశ్వరస్వామిని నోరారా పిలుస్తూ గోవిందనామాలతో స్తుతిస్తూ, పరవశిస్తూ, తరిస్తూ వుంటారు. వేంకటాద్రికి సరితూగే పుణ్యక్షేత్రము లేదు, శ్రీనివాస విభునితో సాటి రాగల దైవము లేనే లేరని భక్తుల నిశ్చిత అభిప్రాయం. ఇది ప్రస్తుతానికే కాదు – నిన్న, రేపు, ఎల్లప్పుడూ, కలియుగం పర్యంతం వర్ణించే మాట! ‘కలౌ వేంకట నాయకా’ అనే సార్ధక నామానికి అర్థమిదే! ‘వేం’ పదంతో కలియుగ మానవుల పాపాలను, ‘కటః’ తొలగిస్తాను- అన్న ప్రతిజ్ఞతో శ్రీ వేంకటపతి ఈ భూమికి దిగి వచ్చారు. అనుక్షణం ఈ శపథాన్ని పాటిస్తున్నారు. భక్తుల కోరికలు తీరుస్తున్నారు. భక్త జనసందోహాన్ని గమనించినప్పుడు, శ్రీవారి వైభవాన్ని తిలకించినప్పుడు మనం ఈ నేపధ్యాన్ని గుర్తు చేసుకుంటే “వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన” అన్న శ్లోకానికి తాత్పర్యం మనసును తాకుతుంది.
రామాయణం ప్రారంభంలో వాల్మీకి మహర్షికి నారదుడు వివరించిన పదహారు అవతార సత్పురుష లక్షణాలు శ్రీ వేంకటపతికి అక్షరాలా వర్తిస్తాయి. ఉదాహరణకు “కృతజ్ఞుడు” అనే లక్షణాన్ని పరిశీలించినట్లయితే - శ్రీ వరాహస్వామి వారిపట్ల శ్రీ వేంకటపతి ప్రదర్శించిన కృతజ్ఞతా లక్షణం స్ఫురిస్తుంది. వాస్తవానికి శ్రీనివాసుని కన్నా ముందే ఆదివరాహస్వామి ఈ క్షేత్రంలో స్థిరపడ్డాడని స్థలపురాణం చెబుతోంది. ఇది ఆదివరాహ క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. వైకుంఠుడు ఇక్కడ అవతరించాలన్న కోరికతో తనకు వంద అడుగుల స్థలాన్ని ఇవ్వమని శ్రీ వరాహస్వామిని అర్ధించాడు. బదులుగా తొలి దర్శనం, తొలి పూజ, తొలి నివేదనం - వరాహస్వామికి కృతజ్ఞతా పూర్వకంగా సమర్పిస్తానన్నాడు. ఆ మాట ఇప్పటికీ చెల్లుబాటు అవుతోంది. పూజ సామాగ్రితో పాటు నివేదన ద్రవ్యాలన్నీ శ్రీవారి ఆలయం నుంచే వెళతాయి. తొలి కైంకర్యం వరాహస్వామికే సమర్పించడం జరుగుతోంది. ఇది శ్రీవారి కృతజ్ఞతా భావానికి స్పష్టమైన ఉదాహరణ.
ప్రథమం దర్శనంచ స్సా న్నైవేద్యం క్షీర సేవనం
ఇదమేన పరం ద్రవ్యం దదామి కరుణానిధే!
అని శ్రీనివాసుడు చేసిన నియమం మనకు బాగా అర్ధమైతే, తొలుత వరాహస్వామిని మనం దర్శించడమే స్వామికి ప్రీతికరం అని తెలుస్తుంది. కృతజ్ఞత దేవుడు ఇష్టపడే గుణం. వైకుంఠుడు ఆచరించే గుణం. “లక్ష్మణునిగా తనకు సేవలందించిన ఆదిశేషుడి పట్ల కృతజ్ఞత చెల్లించేందుకై రాముడు ద్వాపరంలో బలరాముడికి తమ్ముడిగా దిగివచ్చి శ్రీ కృష్ణుడి పేరుతో ఆది శేషుణ్ని సేవించాడు” అనేది మనం గుర్తు చేసుకోదగిన విషయం.
వరాహ దర్శనాత్పూర్వం శ్రీనివాసం నమేన్నచ
దర్శనాత్ప్రగ్వరాహస్య శ్రీనివాసో న తృప్తసి
శ్రీనివాసుని కన్నా ముందే వరాహస్వామిని దర్శించడం శ్రీవారికి తృప్తినిస్తుంది - అనేది క్షేత్ర సంప్రదాయం అయింది. అది శుభకరం, విశేష ఫల ప్రదం అని భక్తుల విశ్వాసం. శ్రీనివాసుని దర్శనానికి ముందు వరాహస్వామిని సేవించడం ఎలాగో, శ్రీ వారి గురించి ప్రస్తావనకు ముందు వరాహస్వామి ప్రాశస్త్యాన్ని గమనించడంలోనూ అంతే ఔచిత్యం ఉంది. ప్రాచీన శాసనాలలో “జ్ఞానప్పిరన్” (జ్ఞాన ప్రదాత) గా, “వరాహ నాయనార్” గా, అలాగే వ్యవహారంలో వరాహస్వామి “ఆదివరాహ పెరుమాళ్” గా ప్రత్యేక ప్రస్తావనకు నోచుకోవడం గమనార్హమైన విషయం.
శ్రీనివాసుడు ఎవరు?
పేరులో శ్రీని ధరించినవాడని స్పష్టంగా ఉన్నా, భక్తులను శ్రీవారు ఎవరనే సందేహం అప్పుడప్పుడు కలవర పెడుతుంది. ముఖ్యంగా ధనుర్మాసంలో బిల్వపత్రాలతో స్వామికి అర్చన జరుగుతుంది కనుక స్వామి శివుడి అవతారంగా కొందరు భావిస్తారు. పద్మ పీఠంపై వెలిశాడు కనుక బ్రహ్మదేవుడి అంశగా మరికొందరు అనుకుంటారు. “కాదు కాదు స్వామి అమ్మవారి అవతారం, ప్రతి శుక్రవారం జరిగే అభిషేకం దీనికి ఆధారం” అని మరికొందరంటారు. ఆనంద నిలయానికి నలుదిక్కుల సింహం ప్రతిమలుండటం, “బాలా త్రిపుర సుందరీ” అని ధ్వనించేలా “బాలాజీ” అనే పేరుండటం వంటి సాక్ష్యాలను వీరు ప్రతిపాదిస్తారు. వాస్తవానికి ప్రతి శుక్రవారం పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిగేది శ్రీవారి వక్షస్థలం మీది శ్రీ మహాలక్ష్మికి! “తద్వక్షః స్థల నిత్యావాసరసికాం” అని ఆరాధించగలిగేది ఒక్క లక్ష్మీదేవినే! ఆ స్థానంలో శ్రీదేవి కొలువుదీరేది శ్రీనివాసునికే!
శ్రీ వేంకటాచల మహత్యంలో “పద్మావతీమ్ విశాలాక్షీం భగవాన్ ఆత్మవక్షసి...” అంటూ మొదలయ్యే ప్రస్తావన ఒకటుంది. “దయా స్వరూపిణియైన శ్రీదేవిని తన పావన వక్షముపై ధరించినవాడు, భయం కొలిపే శంఖచక్రాది ఆయుధాలను విడిచి పరమ శాంత స్వరూపంతో విరాజిల్లుతున్న వాడు (శ్రీవారికి మూల స్వరూపంలో శంఖ చక్రాలు ఉండేవికావు, ఆ రెండు తదనంతర కాలంలో వచ్చి చేరాయి) వరద, కటి హస్తాలతో కలియుగ మానవుల సంసార దుఃఖ భయాలను సమూలంగా నిర్మూలించేవాడు, రమాపతి (లక్ష్మీ దేవికి భర్త) అయిన శ్రీవేంకటపతి భక్తులకు పరమ ఆనందాన్ని చేకూరుస్తున్నాడు” అని ఆ ప్రస్తావన తాత్పర్యం. తిరుమలేశుని హృదయ పీఠికపై “వ్యూహలక్ష్మీ” గా, తిరుచానూరులో అర్చామూర్తి పద్మావతిగా అలరారుతూ “భూత కారుణ్య లక్ష్మి” గా స్తుతించబడుతున్నది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి దేవియేనని భక్తుల విశ్వాసం. “శ్రీవత్సం”గా పురాణాలు పేర్కొనే పుట్టుమచ్చ విష్ణువు వక్షస్థలంపై ఉంటుంది. శ్రీనివాసుని సైతం “శ్రీవత్స వక్షసం” అంటూ కీర్తిస్తాం కనుక శ్రీనివాసుడు సాక్షాత్తూ శ్రీమన్నారాయణమూర్తి అవతారమన్నది విస్పష్టంగా రుజువు అయింది.
“కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మం బనుచు
తలతురు మిము శైవులు తగిన భక్తులు శివుడనుచు
అలరి పొగడుదురు కపాలికులు ఆది భైరవుడనుచు…”
అంటూ అన్నమాచార్యులు భక్తుల వివిధ మనోభావాలను విశదీకరించారు. ఎవరెన్ని రకాలుగా తలచినా, కొలిచినా - శ్రీనివాసుడు శ్రీ మహావిష్ణువు అవతారమేనన్నది అధిక సంఖ్యాకులైన భక్తుల మనోగతం! ఏకం సత్.. అన్నట్లుగా ఉన్నవాడొక్కడే - శ్రీ వేంకటేశ్వరుడు! ఆయనే కలియుగ శ్రీమన్నారాయణుడు!
ప్రవః పాన్థ మన్ధసో ధియాయతే
మహేశ్వరాయ విష్ణవే చార్చిత
అని ఋగ్వేదమంత్రం చేత ప్రతిపాదించబడిన శ్రీ మహా విష్ణువు అర్చవతార మూర్తి - శ్రీ వేంకటేశ్వరుడు! ఆయనే సర్వేశ్వరుడు!