
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
కాకినాడలో రాజాజీతో ముచ్చట్లు
ఆహ్వానిత మధురాలు
నరిసెట్టి ఇన్నయ్య
నరిసెట్టి ఇన్నయ్య
డా. నరిసెట్టి ఇన్నయ్య ‘ఆధునిక విజ్ఞానం తాత్విక ఫలితాల’పై పిహెచ్.డి. స్వీకరించారు. తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీలు వీరి రచనలు, అనువాదాలు ప్రచురించారు. వీరి రచనలలో పేర్కొనదగినవి - తెలుగులో - అబద్ధాల వేట - నిజాల బాట; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్ర; నేను కలిసిన ముఖ్యమంత్రులు-మానవవాదులు; సాహితీపరులతో సరసాలు; ఈ దేశంలో పునర్వికాసం రాదా? ఇంగ్లీషులో - Forced into Faith; Let Sanity Prevail; Between Charisma and Corruption; Political History of Andhra Pradesh; Essential writings of M.N.Roy (Edited). ఉస్మానియా యూనివర్సిటీలోను, ఆంధ్రజ్యోతి బ్యూరో ఛీఫ్ గానూ పనిచేశారు. అమెరికాలోనూ, ఇండియాలోనూ హ్యూమనిస్టు సంఘాలలో పనిచేశారు. అమెరికాలో ఆటా, తానా సంఘాల వారు గౌరవ పురస్కారాలు అందచేశారు. పాల్ కర్జ్, శిబ్ నారాయణ్ రే, ఆవుల గోపాలకృష్ణమూర్తి, మల్లాది రామమూర్తి, ఆవుసాంబశివరావు, వి.యమ్. తార్కుండతో కలిసి పనిచేశారు. ఎమ్.ఎన్.రాయ్, అగేహానంద భారతి, ఎ.బి.షా., పాల్ కర్జ్, రిచర్డ్ డాకిన్స్, శామ్ హారిస్, క్రిస్టోఫర్ హిచిన్స్ ల రచనలు కొన్ని తెలుగులోకి అనువదించారు. దేశ విదేశీ పత్రికలలో వ్యాసాలు రాశారు. భారత, ప్రపంచ హ్యూమనిస్ట్ ఉద్యమాలలో పాల్గొన్నారు.
***

రాజాజీతో నా తొలి పరిచయం ఒక మధురానుభూతి. ఇది 1959 జూన్ నాటి మాట. కాకినాడలో తొలిసారిగా ములుకుట్ల వెంకట శాస్త్రిగారి ఇంట్లో కలిసి చాలాసేపు ఇష్టాగోష్ఠిగా మాట్లాడటం నా అనుభవాలలో విశిష్టమైనది.
జీవితంలో ముఖ్యమంత్రి నుండి గవర్నర్ జనరల్ దాకా అన్ని పదవులూ జయప్రదంగా నిర్వహించి పేరు తెచ్చుకున్న రాజాజీ (చక్రవర్తుల రాజగోపాలాచారి) 80వ పడిలో ఆందోళన చెంది రాజకీయాలలోకి చురుకుగా పాల్గొనటం ఆశ్చర్యకరమైన విషయం. ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రైతుల హక్కులను హరించి వేస్తున్నదని, భాషాపరంగా హిందీని బలవంతంగా ఇష్టం లేనివారిపై రుద్దుతున్నారని రాజ్యాంగాన్ని సోషలిస్టు పరం చేస్తున్నారని భావించిన రాజాజీ కొత్త పార్టీకి పిలుపు నిచ్చారు. స్వతంత్ర పార్టీ అని పేరిట ఏర్పరచిన పార్టీలో దేశంలోని మేథావులు చాలామంది ముందుకు వచ్చి చేయూతనిచ్చారు. జమీందారులు మద్దతు పలికారు. అప్పుడు పార్టీ తొలి జైత్రయాత్రను ఆంధ్రలో బాపట్ల నుండి ప్రారంభించి బొబ్బిలి వరకూ అశేష ప్రజానీక ఆదరణతో సాగించారు. నేను అప్పట్లో ఆచార్య రంగాకు పర్సనల్ సెక్రటరీగా వుండేవాడిని. రాజాజీ స్వతంత్ర పార్టీ అధ్యక్షస్థానాన్ని రంగాకు కట్టబెట్టారు. కనుక ఆ పర్యటనలో నేను రంగాతో పాటు రాజాజీకి సన్నిహితంగా కార్యక్రమంలో పాల్గొన గలిగాను. రంగాజీ ఆనాడు వాహిని పత్రికను స్థాపించి నిర్వహిస్తుండేవాడు. దానికి ఇరువురు సంపాదకులుండేవారు. నేను ఆ రాజకీయ యాత్రలో వాహిని విలేఖరిగా పనిచేసి ఎప్పటికప్పుడు వార్తలను పంపేవాడిని. ఆ విధంగా నాయకులను సన్నిహితంగా చూడగలిగాను. అయితే నేను స్వతంత్ర పార్టీలో చేరలేదు. వాటి రాజకీయాలలో పాల్గొనలేదు. కేవలం మీడియా విలేఖరిగానే నా బాధ్యత నిర్వర్తించాను. ఇందులో ఒక విచిత్రమైన అనుభవం పేర్కొంటాను.
బాపట్లలో తొలి సభ ప్రారంభమైనప్పుడు విపరీతంగా జనం పాల్గొన్నారు. అక్కడ తొలి ఉపన్యాసకుడుగా రాడికల్ హ్యూమనిస్ట్ ప్రముఖుడు ఆవుల గోపాలకృష్ణమూర్తిని మాట్లాడమన్నారు. ఆయన నెహ్రూ తలపెట్టిన రాజ్యాంగ సవరణ సహకార వ్యవసాయం పేరిట రైతుల్ని సమిష్టి వ్యవసాయ నియంతృత్వంలోకి లొంగదీసే ప్రయత్నం చాలా తార్కికంగా వివరించారు. అందుకని రాజాజీ తను ప్రసంగించవలసిన పని లేదని గోపాలకృష్ణమూర్తి (ఎజికె) అద్భుతంగా మాట్లాడారని అన్నారు. ఎజికె. ములుకుట్ల వెంకట శాస్త్రిగారికి సన్నిహితులు. వారి కోరికపైన ఈ ప్రసంగం జరిగింది.
బాపట్లలో రాజాజీ ప్రసంగాన్ని తెలుగులో చేయడానికి చాలామంది ముందుకు వచ్చారు. ఆయన మాట్లాడుతుంటే చాలా సరళమైన శైలి, అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు విషయం విశదీకరణ అవుతుంది. స్థానికంగా ఉన్న ప్రముఖుడు పసుపులేటి కోటేశ్వరరావు దీనిని తెనిగించబోయి తడబాటు చెందారు. అలాగే ఇతర సభలలో గుంటూరు, తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి సభలలో రంగా అనుచరులు ప్రసిద్ధ ఉపన్యాసకులు సుంకర సత్యనారాయణ, ఎన్. వీరాచారి, ఎన్.విజయరాజకుమార్, కె. రోశయ్య, ప్రయత్నించి దారుణంగా విఫలమయ్యారు. వారి అనువాదాన్ని ప్రజలు ఆహ్వానించలేదు. విజయవాడలో ఆనాడు ఆలిండియా రేడియోలో ప్రోగ్రాము డైరెక్టరుగా ఉషశ్రీ (పురిపండ దీక్షితులు) వుండేవారు. ఆయన అనువాదం చేయడానికి సాహసించి చతికిలపడ్డారు. చివరకు గౌతు లచ్చన్న అనువదించగా ప్రజలు హర్షధ్వానాలతో ఆమోదించారు. రాజాజీ సభలన్నింటిలో ఆయననే కొనసాగించమని కోరారు.
నేను బాపట్ల నుండి బొబ్బిలి వరకూ బెజవాడ రామచంద్రారెడ్డిగారితోపాటు ప్రత్యేక కారులో ఆయనతో కబుర్లు చెప్పుకుంటూ పర్యటించాను.
కాకినాడలో ములుకుట్ల వెంకటశాస్త్రిగారి ఇంటిలో రాజాజీకి విడిది ఏర్పాటు చేశారు. అక్కడ మాకు మంచి అవకాశం లభించింది. రాజాజీతో పిచ్చాపాటి మాట్లాడాను. నన్ను పరిచయం చేసుకున్నాను. పర్యటనలో ‘ఏం చేస్తున్నా’రని అడిగారు. ‘విలేఖరిగా రాజాజీ ప్రసంగాలను వాహినీ పత్రికకు యధాతథంగా రాసి పంపిస్తున్నా’నని చెప్పాను. ‘చాలామంది విలేఖరులు చిలవలు పలవలుగా సొంత కవిత్వం పెట్టి వక్రీకరిస్తుంటారని అలా చెయ్యకుండా ఉన్నది ఉన్నట్లు రాయమని’ సలహా ఇచ్చారు. ఆయన ఉదయాన్నే చాలా రిలాక్స్ డ్ గా కాఫీ తాగుతూ కూర్చున్నారు. వెండి కప్పులో ఆయనకు వేడి వేడి కాఫీ ఇచ్చారు. రాజాజీ ఒక బట్టలో ఆ కప్పు పెట్టుకుని తాగుతున్నారు. నేను బట్ట ఎందుకు పట్టుకున్నారని అడిగాను. కప్పు చాలా వేడిగా వుంది. అందుకే పట్టుకున్నానని అన్నారు. ‘కాఫీ వేడిగా లేదా?’ అని అడిగాను. ‘ఉన్నది రుచి చూస్తావా?’ అని వేరే కప్పులో కొంచెం పోసి రుచి చూడమని నాకిచ్చారు. అది పాలు లేని డికాక్షన్ మాత్రమే. కషాయం వలె చాలా చేదుగా వున్నది. తాగలేకపోయాను. ‘ఎలావుందని?’ అడిగారు. ‘నేను తాగలేను. చాలా చేదుగా వున్నద’ని చెప్పాను. నవ్వి ‘నాకు ఇలాగే అలవాటు’ అని అన్నారు. అప్పుడు ఏది అడిగినా జోక్స్ తో సమాధానం చెప్పేవారు. ‘నేను ఎప్పుడైనా ఉత్తరాలు రాస్తాను సమాధానం ఇస్తారా?’ అని అడిగాను. ‘రాసి చూడు’ అన్నారు. పర్యటన అయిపోయి ఆయన మద్రాసు వెళ్ళిన తర్వాత ఉత్తరాలు రాశాను. వెంటనే పోస్టు కార్డు మీద చాలా సంక్షిప్తంగా జవాబులిచ్చేవారు. నేను కొన్ని దాచి హైదరాబాదు స్టేట్ ఆర్కైవ్స్ లో పెట్టాను. రాజాజీ ఆనాడు సంతానం ఎడిట్ చేస్తున్న స్వరాజ్య పత్రికలో రెగ్యులర్ గా రాస్తుండేవారు. వాటిని దేశవ్యాప్తంగా పత్రికలు స్వీకరించి పతాక శీర్షికలలో ప్రచురించారు. మొత్తం మీద రాజగోపాలాచారితో అదొక మరపురాని జ్ఞాపికగా మిగిలిపోయింది. దీనికి నా మిత్రులు కీ.శే. ములుకుట్ల వెంకట శాస్త్రిగారికి కృతజ్ఞతలు. ఆయనే నన్ను రాజాజీతో నేను ముచ్చటించటానికి ఏర్పాటు చేశారు. శాస్త్రిగారు రాడికల్ హ్యూమనిస్ట్. ఆంధ్రాకు తొలిసారి 1937 ఎం.ఎన్. రాయ్ ని తీసుకురావడానికి ప్రధాన కారకుడు. ఉత్తరోత్తరా శాస్త్రిగారు ఎం.ఎల్.సి.గా పనిచేసి చక్కని ఉపన్యాసాలు అందించారు. ఆయనతో హైదరాబాదులో ఎన్నోసార్లు కలిసి దంటు భాస్కరరావుగారి కంపెనీలో కాలక్షేపం చేసేవాళ్ళం
.
*****
మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...