
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ రచనల పోటీ
నాకూ, నారాయణుడికీ మధ్య...

పోలంరాజు శారద
అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ & శ్రీ శారద సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబిల్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన కధల పోటీలో మొదటి బహుమతి పొందిన పద్యకథ
1. ఉ
పచ్చటి చేల మధ్య కల పావన మందిర దర్శనంబుకై
నెచ్చెలి తోడు రాగ మది నిండుగ యానము సల్పి జేరగా
నచ్చట కాన వచ్చె గద నా మది వేదన కల్గ జేయగా
ముచ్చుల బోలు మానవుల మోసపు చర్యలు దైవసన్నిధిన్
పద్య భావము
పైరుపంటల మధ్య ఉన్న మందిరం చూడవలెనని స్నేహితులతో వెళ్ళిన నాకు అక్కడ దైవసన్నిధిలో దొంగబుద్దులు కలిగిన మానవులను చూసి మనసు కలత చెందింది.
2. ఉ.
హారతి పళ్ళెరంబు నొక హస్తమునందిడి, వామహస్తమున్
తీరుగ జాచ కాంచగ, నిదేమని శంకలు జేయ, తెల్పగన్
కోరికలన్ని తీరగనుకూలము కాగలదందు రొక్కమున్
నేరుగ వేయగా ననుచు నీతులు జెప్పెను బమ్మరిల్లగా
పద్య భావము
ఒక చేతిలో హారతి పళ్ళెము పట్టుకొని చాచిన ఎడమ చేతిని చూసి, అదేమిటని అడిగిన నాకు "అక్కడ ధనము వేసిన ఎడల కోరికలు తీరగలవు" అని చెప్పిన నీతులు విని ఆశ్చర్యము కలిగింది.
3. క.
నిలిచెను వాకిలి కడ్డము
తొలగుచు రూకలు పడగను తూరుపు దిశగా
తెలిసెను భావము లతనివి
కలిగిన వారికి చిదాత్మ కరుణ లభించున్
పద్య భావము
వాకిలికి అడ్డముగా నిలుచొని, పళ్ళెములో డబ్బులు వేయగానే పక్కకు తొలుగుచూ ఉన్న అతనిని చూసాక, కలిగినవారికే భగవంతుడి దర్శన భాగ్యము లభించగలదని అర్ధమయింది.
4. క.
దక్షిణ నొసగిన వారికి
తక్షణ దరిశనము కలుగ తథ్యము కాదా
రక్షకు సన్నిధి యందువి
చక్షణను కనగ మదిన విచారము కల్గెన్
పద్య భావము
దక్షిణ సమర్పించిన వారికే భగవంతుని దర్శనము చేసుకొనే భాగ్యము వెంటనే కలగటం అన్న బేధభావము చూసి మనసులో విచారము కలిగింది.
5. క.
ఫలకముపై కన సూచన
కలతను తీర్చగ చదివితి "కానుక వేయన్
వలెగా హుండిన మాత్రము
వలదు నొసంగగ నిచట నెవరికీ" నంచున్
పద్య భావము
"కానుకలు హుండీలో మాత్రమే వేయవలసినది" అన్న సూచనలతో ఫలకాలు చూసిన తరువాత మనసులో ఏర్పడ్డ కలత కొంత తీరింది.
6. క.
సామికి నాకూ నడుమగ
పామరుడు నిలిచె దరిశన భాగ్యము కరువై
ఏమది యని కలవరమున
నా మది కుంగగ మరలితి నాబస చేరన్
పద్య భావము
నాకూ నా స్వామికి మధ్య ఒక సామాన్య మానవుడు అడ్డముగా వచ్చాడన్న కలవరముతో నా బసకు చేరుకున్నాను.
7 ఉ
మానవ నైజమున్కనిన మానస మందగ ఖేదనంబు సే
వా నిరతి న్విధుల్సలుపు వారలు భక్తుల నివ్విధంబుగా
కానుక లంద దైవమున కడ్డుగ నిల్చుట సవ్య చర్యయే?
యానము దండుగాయెనని యాతన పొందుచు చింతనందితిన్
పద్య భావము
సేవా నిరతితో వృత్తి ధర్మము చేయవలసిన వారు ఈ విధముగా కానుకల కొరకు భక్తులకు అడ్డుపడటం సరైన పనేనా? ఇంత దూరము చేసిన ప్రయాణము వృధా అయిపోయిందని బాధ కలుగుతున్నది.
8. ఉ
పొంగుతు వచ్చె నార్తమును పోరుచు కంటికి నిద్రలేక నా
రంగడి దర్శనం కలుగు రాణను శోధన చేయసాగితిన్
చెంగున సాధనం బొకటి చిత్తము నందు తటిల్లతోలె తో
చంగ మనంబునన్శమము ఛాయగ రూపును దిద్దుకొన్నదై
పద్య భావము
పొంగి పొరలుతున్న దుఃఖముతో కంటికి నిద్ర లేక శ్రీరంగడి దర్శనము కలిగే మార్గము వెతకసాగాను. చటాలున ఒక ఆలోచన మనసులోకి వచ్చి రూపు దిద్దుకున్నది.
9. క.
మరుసటి దినము వెడలితిని
దరిశన ముకయి పరమాత్మ దాపున నిలువం
గ రయము నేతెంచె నతడు
కరమున రూప్యము సరణుల కన పసరిల్లెన్
పద్య భావము
దైవదర్శనానికి మరుసటి రోజు మళ్ళీ వెళ్ళి గర్భగుడి ముందర నిలబడగానే, చేతిలో రూపాయల బొత్తిని చూసి అతనే మళ్ళీ పరుగున వచ్చాడు.
10.
సీ.
కప్పుర కాంతుల కన్న మిన్నయిన నా
కమనీయ సామిని కంటి కనుల
విందుగ. పక్కన వేచి యున్నాతని
నోర కంట కనుచు నొక్క వేయి
రూకలు హుండిన రూఢిగ వేసితి
కాంచిన పూజారి కలవర పడ
ముదమున మరలితి మోసపు చర్యల
నడ్డగించిన చిరునగవు తోడ
తే.గీ.
నాకు నారాయణుడికిని నడుమ నిలిచి
న సిరి, మన్నించరాగదే నాదు చర్య
దుష్టులను గెలువంగను ధూర్తనయితి
కోపగించగ రాదమ్మ కూనలపయి
పద్య భావము
కర్పూర కాంతులను మించి వెలుగుచున్న నా స్వామిని కన్నుల విందుగా చూసుకున్నాను. పక్కనే నిలబడ్డ అతనిని ఓరకంట గమనిస్తూ వేయి రూపాయలు హుండీలో వేసాను. అది చూసిన అతను కలవరపడుతూండగా అతని మోసపు చేష్టలను అడ్డగించానన్న సంతోషముతో చిరునవ్వుతో అక్కడ నుండి కదిలాను.
నాకూ నారాయణుడికి మధ్య నిలిచిన లక్ష్మీ! దుష్టులను గెలవటానికి నేను చేసిన మోసపు పని మన్నింపవమ్మా!
నీ బిడ్డలపై కోపగించవలదమ్మా!
నాకూ నారాయణుడికి మధ్య
సాయంత్రం సభ్యులందరి కోరిక మీద మాబృందానికి మటుకు ప్రత్యేకమైన దర్శనం ఏర్పాటు చేసారు. ఇంక వేరే భక్తులెవ్వరూ లేరు. మా బృందంలో అందరం కూడా ఆనందంగా ఆ పూజలో పాల్గొన్నాము.
అక్కడ వున్న ప్రతి స్తంభానికి నోటీసు పెట్టి వున్నాయి.
దాని సారాంశం, "ఎవరికి చేతికి ధనం ఇవ్వరాదు. అక్కడ పెట్టి వున్న హుండీలలో వేసిన కానుకలు మాత్రమే భగవంతునికి చెందుతాయి," అని.
అక్కడ మొదలయ్యింది నా మనస్తాపానికి మూలం. నారాయణుడు ఇరువురు అమ్మలతో కొలువై వున్నాడు. ఆ విగ్రహాలకు అడ్డంగా పూజారి నిలబడ్డాడు. అతని చేతిలో శఠగోపం పెట్టిన పళ్ళెం. అందులో కొన్ని నోట్లు కొంత చిల్లర వున్నాయి
.
నాకు అక్కడి నోటీసులు ఙాపకం వచ్చి పర్సులో పెట్టిన చేతిని బయటకు తీసాను
"అమ్మా ఇక్కడ డబ్బులు వేసి మీ గోత్రనామాలు చెప్పండి" అంటూ ప్రతి భక్తుడిని హెచ్చరిస్తూ వున్నాడు ఆ పూజారి. ఆ పళ్ళెంలో డబ్బు వేసిన వాళ్ళకు ఆ డబ్బు విలువ ననుసరించి కొంచం పక్కకు జరిగి నారాయణుడి దర్శనానికి వీలు కల్పిస్తున్నాడు. గోత్రనామాలు చదువుతున్నాడు. మరీ చిల్లర వేసిన వాళ్ళను చీదరించుకుంటున్నట్టు చూస్తున్నాడు.
అదంతా ఆ సమయంలో నేను పెద్దగా గమనించకుండా నా పాటికి నేను విష్ణుసహస్రనామం చదువుతూ పోతున్నాను. నా వంతు వచ్చింది.
నారాయణమూర్తిని కళ్ళారా దర్శనం చేసుకోవాలని ఆతృతగా తొంగి చూడటానికి ప్రయత్నం చేసాను. కాని నాకూ నారాయణుడికి మధ్య ఆ పూజారి విగ్రహం అడ్డొస్తున్నది.
"అమ్మా ఇక్కడ మీ ముడుపులు చెల్లించుకొని గోత్రనామాలు చెప్పండి" అతని గొంతు వినిపించింది. గోత్రం చెప్పబోయాను. అతను అక్కడి నుండి కదలకుండా "పదపదవమ్మా" అంటూ తోసేసాడు.
"అయ్యో, ఇంత దూరం వచ్చాను భగవంతుడిని తనివితీరా, కాదుకాదు, అసలు దర్శనం కూడా చేసుకోలేకపోయినానే అన్న బాధ అప్పటినుండి పీడించ సాగింది.
దాని ఫలితమే అంత అలసటగా వున్నా కూడా నిద్ర పట్టలేదు.
అమ్మవారి మీద కోపం రాసాగింది. "తల్లీ, నీ భర్తపక్కన చిరునవ్వుతో కులుకుతూ వున్నావు. నా బోటి అభాగ్యులం పతిసమేతంగా కొలువై వున్న నీ దర్శనానికి వస్తే నువ్వే అడ్డొస్తున్నావా? ఇదేమయినా న్యాయంగా వుందా?" అని పదే పదే ఆలోచిస్తూ వుండంగా ఒక చిన్న మెరుపులాగా ఒక చిలిపి ఆలోచన వచ్చింది. ఏ లక్ష్మి గురించయితే నారాయణుడి దర్శనం కరువయ్యిందో, అదే లక్ష్మిని అడ్డుపెట్టుకొని ఈ సారి ఏ విధంగా నైనా తనివితీరా దర్శించుకోవాలి అన్న ఆలోచన రూపం దాల్చింది. ఆ ప్రణాళికకు ఒక రూపం ఏర్పడ్డ తరువాత ప్రశాంతంగా నిద్ర పట్టింది.
మరుసటి రోజు భగవద్దర్శనానికి వెళ్ళే అవకాశం వచ్చింది. ముందరే ప్లాన్ లో వుండబట్టి కొంత ధనం తీసి చేతిలో పట్టుకున్నాను. అందులో ఐదు వందల రూపాయల నోట్లు స్పష్టంగా కనబడేలా పట్టుకున్నాను.
గర్భగుడిలోని భగవంతుని దర్శనానంతరం వుత్సవ మూర్తుల వద్దకు వెళ్ళాను. తిరిగి అదే సంఘటన పునరావృతం అయింది. అయితే ఈ మాటు కొంత తేడాతో.
పూజారి నాచేతిలో కనుపిస్తున్న నోట్ల వంక చూస్తూ చాల మర్యాదగా, "అమ్మా ఆ ధనం ఈ పళ్ళెంలో వేసి మీ గోత్ర నామాలు చెప్పండి" అన్నాడు. నేను నోట్లు సర్దుకుంటూ, మా గోత్రం, నా భర్త, కొడుకులు మనుమల అందరి పేర్లూ వివరంగా చెప్పాను. అతను వుత్సవమూర్తులు బాగా కనబడేలాగా పక్కగా జరిగి చాల వైనంగా అందరి పేర్లూ చెప్పుతూ వెనగ్గా వున్న భక్తులను కొంత తడవు ఆపేసి ప్రత్యేకంగా శ్రీదేవి భూదేవి సమేత నారాయణుడికి హారతి కూడా ఇచ్చాడు. తీర్ధ ప్రసాదాలు ఇచ్చి శఠగోపం పెట్టి ఆశీర్వదించాడు. అతని చూపంతా నా చేతిలో వున్న ఐదు వందల రూపాయల బొత్తి మీదే.
నేను నెమ్మదిగా ఆ నోట్ల మధ్యలో వున్న ఒక ఐదు రూపాయల నాణెం ఆ పళ్ళెంలో వేసాను. "అమ్మా మహాలక్ష్మీ నన్ను క్షమించు తల్లీ. నువ్వే మాకు నీ దర్శనానికి ఆటంకం కలిగిస్తూ వుంటే, నిన్నే అడ్డుపెట్టుకొని నేను ఈ నాటకం ఆడాల్సి వచ్చింది. అందుకు అపరాధ రుసుము అనుకున్న దానికి రెట్టింపు నీకే నేరుగా అందేలా నీ హుండీలోనే వేస్తున్నాను." చేతిలో పట్టుకున్న నోట్లన్ని ఆ పక్కనే వున్న హుండీలో వేసాను.
తల ఎత్తి చూడకుండా అక్కడినుండి అనుకున్నది సాధించానన్న తృప్తితో కదిలాను. కాని వెనకనుండి నిర్విణ్ణుడయి చూస్తున్న పూజారి రూపం నా మనో నేత్రాలకు కనిపిస్తూనే వుంది.
******