MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
వ్యాస మధురాలు
మృచ్ఛకటకం- నాటి సామాజిక పరిస్థితులు
కర్లపాలెం హనుమంతరావు
మృచ్ఛకటకం అంటే మట్టి బండి. సంస్కృత రూపకం. మహాకవి శూద్రకుడి గొప్ప నాటకం. గురజాడవారి 'కన్యాశుల్కం' తీరులో ఈ నాటకం కూడా నాటి సామాజికి పరిస్థితులకు అద్దం పడుతుంది.
మృచ్ఛకటకం నాటికి సమాజంలో వర్ణవ్యవస్థ ఉంది. కానీ మధ్యయుగాల నాటి దుష్ట రూపం ఇంకా తీసుకోలేదు. వర్ణాలను బట్టి కాక వెసులుబాటును బట్టి వృత్తులు నిర్వహించుకొనే స్వేఛ్చ ఉండేది. వర్గాల మధ్య మంచి సామరస్యం కనపించేది.
చారుదత్తుడు బ్రాహ్మణుడు. అయినా వ్యాపారాలు నిర్వహించేవాడు. నాటకంలో ఆ పాత్రకు గల గౌరవం ఈ నిజాన్ని నిరూపిస్తుంది.
నాటి సమాజంలో జనం వద్ద పుష్కలంగా సంపత్తి ఉన్నట్లు మృచ్ఛకటకం బట్టి తెలియవస్తుంది. డబ్బుతో దాసీజనాన్ని కొనుక్కోవచ్చు. విడిపించుకోనూ వచ్చు. వడ్డీకి డబ్బు తిప్పే నేటి ఆర్ర్థిక లావాదేవీలు ఈ నాటకం నాటికీ ఉన్నట్లు అనిపిస్తుంది. జలమార్గాల ద్వారా వ్యాపారాలు జోరుగా సాగే కాలం మృచ్ఛకటకం నాటిది.
దాస్యం ఒక వృత్తిగా చలామణీలో ఉన్నట్లు నాటకంలోని సంఘటనలను బట్టి అర్థం చేసుకోవచ్చు.
పురుషులు ఒకరిని మించి ఎక్కువ మంది స్త్రీలను వివాహమాడేందుకు నాటి సమాజం అనుమతించేది.
నాటి వర్ణవ్యవస్థలో బ్రాహ్మణులదే ఆధిపత్యం. శూద్రులకు వేదాలు పఠించే హక్కు అప్పటికి ఇంకా ఏర్పడలేదు.
శైవులకు, శాక్తికులకు సమాదారణ ఉన్నా బౌద్ధమతానికి మాత్రం అంతంత మాత్రమే ఆదరణ ఉన్నదనిపిస్తుంది. ప్రయాణాల సమయాల్లో బౌధ్ధ సన్యాసి ఎదురవడం అశుభ సూచకం. రాజాదరణ కరవైనప్పుడు ఏ ధర్మానికైనా ప్రజాదరణా కరవవుతుంది. బౌధ్ధం ఆ దురవస్థలో ఉందా? మృచ్ఛకటకం కర్తకే బౌద్ధమంటే పడదా? నాందీ శ్లోకంలో శూద్రకుడు కేవలం శైవస్తుతికి మాత్రమే పరిమితమవడం చేత ఈ సందేహం!
న్యాయవ్యవస్థలో అందరికీ సమన్యాయమే జరిగేది. వివాదాలు, పేచీలు వచ్చినప్పుడు ఇప్పటిలాగా న్యాయస్థానాలను ఆశ్రయించేవాళ్లు. సప్రమాణికంగా విచారణలు జరిపించి, స్మృతులు నిర్ద్దేశించిన విధంగా నేరస్తులకు శిక్షలు విధించేవాళ్లు. రాజబంధువుల జోక్యం ఉంటే మాత్రం న్యాయం నిర్ణయంలో కొంత పక్షపాతం కనిపించేది. మరణ శిక్షలు పడిన నేరస్తులను ఎర్ర్రగుడ్డల్లో, ఎర్ర గంధంతో మాలలు అలంకరించి ఊరేగింపు తరువాత శిక్ష అమలు జరిపేవాళ్లు.
వేశ్యావృత్తి బహుళంగా వ్యాప్తిలో ఉన్న వ్యవస్థ మృచ్ఛకటకం నాటి సమాజానిది. వేశ్యలలో సైతం గణికలు అనే వర్గం స్త్రీలు కేవలం ఆటపాటలు, లలితకళలతో మాత్రమే వినోదమందిచేవాళ్లు. పడుపు వృత్తి పై బతికేవారికి వ్యభిచారుణులుగానే గుర్తింపు. గణికల వద్ద అశేషమైన ధన సంపత్తులున్నట్లు ఈ నాటకం ద్వారా మనం గ్రహించవచ్చు. కథానాయిక వసంతసేన గణిక జాతికి చెందిన ధనిక స్త్రీనే. బుద్ధచరిత్రలోని ఆమ్రపాలి ఆర్థికస్థాయి వసంతసేనది. వివాహం వారికి నిషిద్ధం కాదు. కథానాయకుడు వాసవదత్తుడిని ఆమె వివాహం చేసుకుంటుంది నాటకంలో. పాలకుడే స్వయంగా ఈ శుభకార్యం జరిపిస్తాడు కూడా. బ్రాహ్మణుడైన శార్వికుడు మదనికను పెళ్లాడం గణికులకు సమాజంలో గల గౌరవాభిమానాలకు సూచకం.
మధ్య, దిగువ తరగతుల్లో జూదమాడడం ఎక్కువగా ఉండేది. పనిపాటలకు పాలుమాలి సోంబేరులకు మల్లే దొరికిన సొమ్మును జూదంలో పెట్టే ద్యూతోపజీవులు మృచ్ఛకటకంలో కనిపిస్తారు. సంవాహకుడు ఆ తరహా వ్యవసపరుడే. జూదమాడేందుకు ప్రత్యేకంగా గృహాలుండేవి. వాటిని వర్యవేక్షించే పని 'సభికులు' అనే ప్రత్యేక తరగతిది. ఆటలో మోసానికి పాల్పడుతూ పట్టుబడినా, ఓడి సొమ్ము చెల్లించలేకపోయినా, పారిపోయినా న్యాయస్థానాలలో విచారణ ఎదుర్కోకావాలి.
మృచ్ఛకటకం నాటకం నాటి వ్యవస్థకు నేటి వ్యవస్థకు దగ్గరి పోలికలు కొన్ని కద్దు. నాటకంలోని రాజు అసమర్థుడు. స్త్రీలోలుడు. రాజు ఉంపుడుగత్తె బందువులు అధికార వర్గాలలో చేరి ప్రజల పై దౌర్జన్యాలు సాగించేవాళ్లు. సాటి అధికారులపై ఒంటికాలు మీద లేవడం పరిపాటి. న్యాయం తన పక్షాన రాకపోతే మరో న్యాయాధికారిని ఆ స్థానంలో నియోగిస్తానని శకారుడు న్యాయాధీశుణ్ణి బెదిరించడమే ఇందుకు ఉదాహరణ. శకారుడు మృచ్ఛకటకం పరిభాషలో 'కాణేకి మాతృకుడు'. అంటే వ్యభిచారిణి పుత్రుడు. రాత్రిళ్ళు రాజమార్గాలు సైతం స్త్రీలకు క్షేమకరంగాలేని అస్తవ్యస్త పరిస్ఠితులు ఈ నాటకంలో మనకు కనిపిస్తాయి. అసమర్థుదు, అనుకూలుడు కాని రాజుపై తిరుగుబాటు చేసి పదవీభ్రష్టుణ్ణి చేయడం మృఛ్చకటకం నాటికి ఆచరణలో కనిపిస్తుంది. ఈ విప్లవానికి జూదరులు, చోరులు, విటులు, వేశ్యలు వంటి వాళ్ళూ సాయమందించడం విడ్డూరమైన విషయం,
ఆ నాటి సమాజంలో వివిధ వర్గాలవాళ్లు వివిధ యాసలతో సంభాషించడం ఉంది. అయినప్పటికీ ఒకరి ఘోష మరొకరు అర్థంచేసుకొనేవాళ్ళు. ఆ యథార్థ పరిస్థితిని శౌరసేన, అవంతిక, ప్రాచ్యమాగది, శకారీ, ఛాండాలి, ఢక్కి వంటి నిమ్న పాత్రల యాసల ద్వారా శూద్రకుడు నిరూపించాడు. మృచ్ఛకటకంలో కవి వాస్తవ పరిస్థితులను కాక, ప్రాచీన కథాసాహిత్యం నుండి తన అవగాహన మేరకు స్వీకరించిన ఊహలను కల్పించి రాసినవని సిల్యాలెవీ అనే పాశ్చాత్య సాహిత్య పరిశోధకుడు అభిప్రాయపడుతున్నాడు. కానీ అది వాస్తవం కాదు. బృహత్కథలలో కనిపించే సామాజిక వాతావరణమే మృచ్ఛకటకంలోనూ కనిపించేది. అన్ని రంగాలలోని వివిధ వ్యక్తుల నైజం ఆదర్శభావంతో కాకుండా వాస్తవిక దృష్తితో శూద్రకుడు చిత్రించిన మాటే నూటికి నూరు పాళ్ళు నిజం.
సమకాలీన సామాజిక జీవితాన్నిఏ మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా ఇంత వాస్తవికంగా దర్పణం పట్టే దమ్ము శూద్రకుడికి మల్లే ప్రదర్శించిన రూపకర్తలు నాటి కాలంలోనే కాదు.. నేటి కాలంలోనూ అరుదే! మృచ్ఛకటకం నాటక కర్త నిశ్చయంగా అభినందనీయుడు!
(డాక్టర్ ముదిగొండ గోపాల రెడ్డి, డాక్టర్ ముదిగొండ సుజాతారెడ్డి రచన ‘సంస్కృత సాహిత్య చరిత్ర‘ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన వ్యాసం)
****