MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
కథా మధురాలు
మబ్బు వెనక...
ఆర్.దమయంతి
ఇంకొన్ని క్షణాల్లో - సినిమా మొదలైపోతుంది అనడానికి సంకేతంగా అప్పటి దాకా వెలుగుతున్న గుడ్డిదీపాలు చప్పున ఆరిపోయాయి.
హఠాత్తుగా హాలంతా కటిక నిశ్శబ్దమైపోయింది.
ప్రేక్షకుల అంచనాకి తగినట్టుగా వారి ఉత్కంఠ స్థాయి లో - తెరమీద బానర్ పేరు పడింది. ఆ వెనకే చెవులు దద్దరిల్లే వాయిద్యాల హోరు తో దృశ్యం మొదలైంది. వందల కొద్దీ గుర్రాలు శరవేగంగా పరుగులు తీస్తున్నాయి. చెవుల్లో డెక్కల శబ్దాలకి గుండె దడ దడ లాడేలా మోగిపోతున్నాయి. సరిగ్గా అప్పుడే కథా నాయకుడు వీర సాహసంతో - గుర్రం మీంచి గాల్లోకి ఎగిరి, పల్టీలు కొట్టి విలన్ రధం లోకి చొచ్చుకుపోయాడు.
గ్రాఫిక్స్ మాయలు చేస్తుంటే కళ్ళప్పగించేసి చూస్తున్నారు.
అంత ఉత్కంఠం లోనూ ఆమె కళ్ళు స్క్రీన్ మీద కంటె, ఎంట్రన్స్ డోర్ నే చూస్తున్నాయి.
ఏడీ ఇతను? పాప్ కార్న్ తీసుకొస్తానని వెళ్ళినవాడు ఇంకా రాడేమిటీ? ' అనుకుంటూ, కళ్ళు చిట్లించి చూసింది.
అదిగో వస్తున్నాడు. గబగబా అడుగులేసుకుంటూ. ఎవరో తరుముకు వస్తున్నట్టు, చెంప పక్కన చేయడ్డుపెట్టుకుని వస్తున్నాడు. చీకట్లో వెతుక్కోకుండా - రో లోంచి చేయెత్తి చూపించింది..'ఇటు రా ' అన్నట్టు. .
గబగబా వచ్చి సీట్లో కుర్చున్నాడు. అయితే, ఇంతకుముందటి ఉత్సాహం గా కాదు. బతుకు జీవుడా అనేలా.
అతని చేతిలో పాప్ కార్న్ బాస్కెట్ లేదు. అది కాదు ప్రశ్న. ఆమె వింతపోతోంది దేనికంటే, మనిషి - తనని తాను కోల్పోయినంత శూన్యం లా, ఎలా, ఇంతలా అయిపోయాడేమిటా అని.
కొన్ని నిముషాల క్రితం తను చూసిన అతనకీ, ఇప్పటి ఈ లంఖణాల బండి ఆకారానికి సంబంధమేలేదు. అంతలోనే ఇంతలా ఎలా అయిపోయాడు? ఆమెకి పజిల్ గా వుంది.
జీవం లేని పదార్ధం లా, నిఠారు చువ్వలా బిగుసుకుపోయున్న అతని భుజం మీద మెల్లగా చేయేసి, 'ఆర్యూ ఆల్ రైట్ విజయ్?' - అని అడిగింది ఆదుర్దా నిండిన స్వరంతో.
ఆమె చేతి స్పర్శకి అప్పుడే స్పృహలోకొచ్చి, చలనం వచ్చిన వాడిలా కదిలాడు. మరు క్షణమే గభాల్న ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ ' శైలూ, వెళ్ళిపోదామా? ప్లీజ్' అన్నాడు తొందరతొందరగా బలహీనమైన స్వరంతో.
చల్లగా మంచు ముక్కలా వున్న అతని చేతులనీ, ప్రపంచంలోని సమస్తపు దిగులుమూటనీ మోస్తున్నట్టు -కుంగిన ఆ వాలకాన్ని చూసి ఆమె కి చప్పున ఏదో స్ఫురించింది. ' 'ఓ! అలా గానీ జరగలేదు కదా?' అని ఒక క్షణం పాటు సందేహించింది. అదే నిజమైతే, ఇక క్షణం ఆలస్యం చేసినా ఈ మనిషికి మేలు జరగదని తెలిసిందాన్లా 'సరే పద.' అంటూ లేచింది. అతనొక్క ఉదుట్న సీట్లోంచి దూకినంత ఫాస్ట్ గా ఆమెని అనుసరించాడు.
ఇద్దరూ బయటకొచ్చేసారు.
హాల్ బయట జనమెవరూ లేరు. కొంచెం సేపటి కితం వరకూ వున్న రద్దీ లేదు. ఆవరణంతా ఖాళీ గా విశాలం గా కనిపిస్తోంది.
తలతిప్పి అతని వైపు నిశితంగా చూసింది. - లైట్ల వెలుగులో.
ప్రాణం పోతున్న వాడికి ఆక్సిజన్ ఎక్కిస్తుంటే జీవం అంది, ఎలా స్థిమిత పడతాడో అలా వుంది విజయ్ పరిస్థితి. గుండెల్నిండా ఊపిరి తీసుకుని - గాలి వదిలేస్తూ ''ఉఫ్ ..'' అన్నాడు.
దారితప్పిపోయిన వాడిని ఇంటి దగ్గరకి తీసుకెళ్ళి దింపితే ఎంత గొప్ప గా ఫీలౌతాడో, అంతలా కృతజ్ఞతగా చూసాడామె వైపు. తనని అర్ధం చేసుకున్నందుకో ఏమో!
బదులుగా నిట్టూర్చింది. ఆమె ముఖం లో ఎలాటి భావమూ కనపడకుండా జాగ్రత్తపడటానికి ప్రయత్నిస్తోందామె.
ఈ సినిమా తామిద్దరూ కలిసి చూడాలని తపన పడింది అతనే. పదిరోజుల ముందుగా బుక్ చేసాడు. గొప్ప ఉత్సాహం తో తీసుకొచ్చాడు. చెప్పలేనంత సంబరపడిపోతూ - సినిమా కలెక్షన్స్ సమాచారమంతా గడగడా అప్పచెప్పాడు. చిన్న పిల్లాడిలా గంతులేయడం ఒకటే తక్కువ అన్నట్టు చూసింది అతని వైపు మురిపెంగా. అంతలో - తను వొద్దంటున్నా వినకుండా 'ఇప్పుడే వస్తా. పాప్ కార్న్, కోక్ తీసుకునీ అంటూ వెళ్ళిన వాడు - యుధ్ధంలో పరాజయం పొందిన వాడిలా ఇలా తిరిగొచ్చాడు.
కారణం? - అడగకూడదనుకున్నా, ఊరుకోలేక సూటిగానే అడిగింది. "ఆ..వి..డ.. కనిపించిందా మళ్ళా?" అని.
అతను అవునన్నట్టు తలూపి ఆమె కళ్ళల్లోకి చూడలేని వాడిలా, చూపులు తిప్పుకున్నాడు.
తను ఊహించింది కరెక్టే నన్నమాట! అని నిర్ధారణ చేసుకుంది. ఇలాంటి అనుభవాలు ఇంతకుముందు రెండు మూడు సార్లు జరిగాయి. పార్క్ లో, రెస్టారెంట్ లో, షాపింగ్ మాల్ లో... అప్పుడూ ఇలానే జరిగింది.
కారణం ఇదీ అని చూచాయగా చెప్పాడు. తనేమీ అనలేకపోయింది.
అందుకే - మొదటిసారి తెలుసుకున్నప్పుడు కలిగినంత అలజడి ఇప్పుడామెలో కలగలేదు. అందుకే ప్రశ్న మీద ప్రశ్న వేసి అతన్ని వేధించలేదు. అంతే కాదు అతన్ని ఆ బాధ నించి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం గా ఏం చేయాలా అని ఆలోచిస్తోంది.
స్నేహం అంటే - స్నేహితుణ్ణి బాధ పెట్టడం కాదు. అతను పడుతున్న బాధనించి తప్పించడం.
అతన్ని ఈ లోకంలోకి తీసుకురావడం కోసం టాపిక్ డైవర్ట్ చేసింది. "డోంట్ వర్రీ విజయ్. సినిమా కి మళ్ళా వద్దాంలే కానీ ఇప్పుడెక్కడికెళ్దామో చెప్పు ముందు. హోటెల్ కెళ్ళి, డిన్నర్ చేసి ఇంటికి పోదామా? లేక, నీ ఫ్లాట్ కెళ్ళి కార్డ్స్ ఆడుకుందామా?" అని అడిగింది చాలా కాజువల్ గా.
ఆమె అలా అడగంగానే అతని మది - 'హమ్మయ్యా' అనుకుని నెమ్మదించింది.
ఎందుకంటే ఈ విషయాన్ని ఆమె అంత తేలికగా తీసుకోవడం తో అతని ముఖం లోని నలుపు క్షణాల్లో మాయమైపోయింది.
'ఫ్లాట్ కెళ్దాం." అన్నాడు వెంటనే స్పందిస్తూ. 'అవును. అదే బెటర్. ఇతనితో సావకాశంగా మాట్లాడుకోవచ్చు. తన మనసులోని సందేహాలన్నీ ఇవాళ్టితో తీరిపోయేలా మాట్లాడాలి. తప్పదు! అని నిశ్చయించుకుంది మనసులో.
అతను వెంటనే కారు తీసుకొచ్చి ఆమె ముందు ఆపాడు. 'నేను డ్రైవ్ చేయనా?' అడిగింది. ఆమె స్వరం లోని మృదుత్వం అతని మనసుకెంతో ఓదార్పునిస్తోంది. మండువేసవి లొ వీచే తెమ్మెరలా హాయిగా తోస్తోంది.
' నేను డ్రైవ్ చేయగలను. నౌ ఐ యాం ఓకె ' అన్నాడు. అతని పెదవుల మీద కదిలీ కదలని నవ్వు చూసి, 'పర్వాలేదు. చాలా వరకు తేరుకున్నాడు. డ్రైవ్ చేయగలడు.' అని నమ్మకం కలిగిన దాన్లా, 'అయితే సరే' అంటూ మరో వైపు డోర్ తీసుకుని అతని పక్కకొచ్చి కుర్చుంది.
కారు కదిలింది . అతనుండే ఫ్లాట్ వైపుకి.
****
విజయ్, శైలు - ఇద్దరూ ఉద్యోగం లో స్థిరపడిన వాళ్ళే.
కానీ ఇద్దరూ జీవితం లో ఎదురుదెబ్బ తిన్న వ్యక్తులే. పైకి కనిపించని గాయాల నించి ఇద్దరూ ఇంకా కోలుకోలేదనే చెప్పాలి. కానీ ఇద్దరూ పైకి తేలరు.
ఎవరూ లేని ఒక నిశ్శబ్ద తీరాన, ఎవరికి వారు తమని తాము ఒంటరిగా ఓదార్చుకుంటున్న ఏకాంతం సమయంలో - అలా వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురయి 'హలో ' అనుకున్నారు. ఆ పరిచయం క్రమ క్రమంగా స్నేహం గా మారింది. మాటలు కలిసాక, అవి నవ్వులయ్యాయి. లోకంలోని అవీ.. ఇవీ అన్నీ సంగతుల్నీ కలబోసుకుంటూ కొంచెం కొంచెం గా - తమ గురించిన బాధల్నీ కబుర్లలో కలిపి వొంపుకున్నారు . 'కానీ, అసలు విషయం ఇదీ '- అని ఇద్దరూ మనసు విప్పి చెప్పుకోలేదు.
అలా, చెప్పీ చెప్పక, అడిగీ అడగక, ముందుకు వెళ్ళీ వెళ్ళక...,నట్ల బండిలా బ్రేకులేసుకుంటూ నడిపిస్తున్నారు బండిని. కాలమనే వంతెన మీద వీరి వాహ్యాళి మొదలై అప్పుడే యేడాది దాటిపోయింది.
ఒకరి మీదొకరికి ఇష్టం పెరుగుతోందనడానికి ఋజువు గా నిలిచాయి - శని ఆదివారాలు. కలుసుకున్న ప్రతి సారీ, అందమైన రోజు గానే గడుస్తోంది. 'మరి, మన ఇద్దరి సంగతి ఏమిటీ?' అని ఒకర్నొకరు ప్రశ్నించుకోవాలని అనిపించినా,
ఇద్దర్లో ఎవరూ ఆ సాహసం చేయలేకపోతున్నారూ అంటే కారణం ఏమిటీ? ఎందుకనీ?
ఎందుకంటే - భయం. ఎంత భయమంటే - ఈ సంబంధమూ మొదటి రిలేషన్ లా నే బెడిసికొడుతుందేమో అని. అందుకే మరో సారికలిసినప్పుడు చెప్పుకుందాం అని వాయిదా వేసుకుపోతున్నారు.
నిజమే. ఏ వ్యక్తి కైనా మొదటి వివాహ బంధం విఫలమయ్యాక, విడిపోయాకా ఆ బాధ వర్ణాతీతం గా వుంటుంది.
మరో సారి అవకాశం కలిగినప్పుడు ... స్వీకరించడానికీ భయం గా వుంటుంది. తగిలిన గాయం - గాయం గా మిగిలిపోయినా పర్వాలేదు. కానీ పుండు మళ్ళా పచ్చిదైతే.. అనే ఊహే భయవిహ్వలితుణ్ణి చేస్తుంది. సరిగ్గా ఆ పాయింట్ దగ్గరే ఆగిపోతున్నారు ఆ ఇద్దరూ.
అతనున్న పరిస్థితికి తోడు - ఎప్పుడో తెగిన జ్ఞాపకం - మళ్ళా మళ్ళా కళ్లముందుకొచ్చి నప్పుడు -అతని మనసు బీభత్సం అయిపోతుంది.
'నిజం చెప్పాలంటే అతను - నిజాయితీగా బయటపడుతున్నాడు. మరి తనో?' తనని తాను ప్రశ్నించుకుంది శైలు. ' ఎన్నిసార్లు ఈ గుండె గూడు చెదిరిందనీ? - లోలోనే ఎంతగా కుమిలి కుమిలీ... పోయిందనీ? పైకి మాత్రం చెక్కు చెదరనట్టు కనిపిస్తుంది అంతే.
మొన్న బిర్లా మందిర్ కెళ్ళినప్పుడు - అతను కనిపించినప్పుడు..మనసంతా చేదయి పోలేదూ? ఇంటికిపోదాం అంటూ అమ్మని తొందర చేస్తే, 'కాసేపు కూర్చుందామన్నావ్ కదటే? అప్పుడే వెళ్ళిపొదామంటున్నావ్?..కాస్త మెల్ల గా నడు. నీ అంత గబగబా నేను నడవలేను. మోకాలి నొప్పి..' - అని అంటున్న అమ్మ మాటలు వినిపించాయా తనకు? - ఊహు. లేదు.
విజయ్ పరిస్థితీ తన పరిస్థితీ - ఒకటే. ఇద్దరి భయాలూ కూడా ఒకటే.
తామిద్దరూ వేర్వేరు శరీరాలు అయినా, ఒకే రకపు ప్రమాదం నించి బయటపడి , ఇంకా కోలుకోలేకపోతున్న రెండు గుండెలు. - తిరిగి, తామిద్దరూ కలిసి ఒకే దారిలో నడవడం కుదిరే పనేనా?
'విజయ్! గాయానికి గాయం ఒక సాయం అవుతుంది. ఒకరి ఓదార్పు మరొకరికి ఔషధం గా మారుతుంది. అరికాల్లో దిగిన గట్టి ముల్లు - తీసేసినా, నొప్పి మిగిలే వుంటుందని నాకూ తెలుసు. నిన్ను నేనర్ధం చేసుకోగలను.' అని అతన్ని దగ్గరకి తీసుకుని ఓదార్పుగా చెప్పాలనిపిస్తుంది. కానీ - ఎప్పటికప్పుడు వచ్చిపోయిన తుఫానుకే మళ్ళా మళ్ళా వొణికిపోతున్న అతనితో ఇదంతా వివరించడం తన వల్ల సాధ్యం కాదెమో' అనీ నిరాశ వేస్తుంది. అతనికి గత చేదు అనుభవం ఏదైనా కావొచ్చు. ఎంతైనా వుండొచ్చు. కానీ, తనతో జీవితం పంచుకోవాలనుకుంటే మరి ఇతని ఈ బలహీనతని తను జీవితాంతం భరించగలదా? - లేదు. భరించలేదు. 'ఇంతకీ, అతను తన జీవితంలోకి భార్యగా ఆహ్వానించినప్పుడు కదా? తనంటే స్నేహభావం తప్ప మరేమీ లేదేమో? డైవోర్సీ ని వివాహమాడతాడా? తను భ్రమించడంలేదు కదా? లేదు లేదు. విజయ్ తనని ఇష్టపడుతున్నాడు. తన సాహచర్యాన్ని కోరుకుంటున్నాడు. ఆ ఇష్టం కేవలం శారీరక ఆకర్షణ మాత్రమే కాదని తన మనసుకు అర్ధమౌతోంది. ఏకాంత సమయాలలో అతనెప్పుడూ హద్దు దాటి ప్రవర్తించలేదు. ఎంతో ఎమోషన్ అయినప్పుడు, చేతిలో చేయి తీసుకుని కొన్ని క్షణాలు అలానే వుండిపోతాడు. తను అభ్యంతరం చెప్పలేదు.
తనని కలవడం కోసం ఎందుకంతగా ఆరాటపడతాడో? సంకేత స్థలాని కి తనకంటే ఎప్పుడూ అతడే ముందుంటాడే? ' ఆడవాళ్ల చేత వెయిట్ చేయించడం మగాళ్ళ సంస్కారం కాదు అంటూ మర్యాద చూపుతాడు!? ఒకసారి ఆబిడ్స్ ట్రాఫిక్ లో చిక్కుకుపోయి అరగంట ఆలస్యం గా వెళ్లింది. చికాకు పడతాడేమో అనుకుంది. కానీ, చిత్రం గా అతను కంగారు పడ్డాడు. 'హమ్మయ్యా, ఏం కాలేదు కదా' అని అతను ఊపిరి తీసుకుంటుంటే అర్ధం కాక అడిగింది. 'నాకేమౌతుంది. నా మొహం' అని. 'అది కాదు శైలూ, స్కూటీ మీద వస్తావ్ కదా, ఏమైనా అయిందేమోని టెన్షన్ పడ్డానూ అని అంటున్నప్పుడూ నిజంగా ప్రేమేసింది అతనిపైన.
ప్రేమంటేనే - కేర్ అండ్ కన్సర్న్ కదూ?
బాల్కనీ లో కుర్చుని- ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలని చూస్తూ ఆలోచిస్తున్న ఆమెని చూసి, నొచ్చుకుంటూ చెప్పాడు విజయ్. " నిజం గా క్షమించాలి శైలూ. ఈ సారికి నన్ను క్షమించాలి. తప్పదు.' అంటూ ఆమె చేతికి కోక్ అందించి, ఆమె ఎదురుగా కుర్చున్నాడు. తనూ కొంచెం కొంచెంగా సిప్ చేస్తూ.
గంట క్రితం సినిమా హాల్లో అతనిలో కనిపించిన భయం, టెన్షన్ ఇప్పుడు ఇసుమంతైనా కనిపించడం లేదు. పైగా, అసలేం జరగనట్టు చాలా ప్రశాంతంగా వున్నాడు.
తుఫానూ మనమే. తీరమూ మనమే. ప్రతి మనిషిలోనూ ఒక సముద్రం వుంటుందని అందుకే కాబోలు అంటారు కవులు.
మరే.
తన వైపు తదేకంగా చూస్తున్న ఆమెనుద్దేశిస్తూ " శైలూ, నువ్ నన్ను బాగా అర్ధం చేసుకుంటావు... నా మనసు నీకు బాగా తెలుసు కదూ?" అని అడిగాడు. హఠాత్తుగా. తను చెప్పదలచుకున్న దానికి ఉపోద్ఘాతం అన్నట్టు.
ఆమె తలూపింది. అవునని."కానీ, తెలుసుకోవాల్సింది కొంత మిగిలిపోయింది ." అంది జవాబుగా.
తలాడించాడు. "నిజమే. మిగిలింది చెప్పాలి. అదే తెలీడం లేదు. ఎలా చెప్పగలనా అని.." అంటూ ఆగాడు.
"కానీ, ఇలా ఎన్నాళ్ళు?" - అర్ధోక్తి గా అంది.
కనుబొమలు ముడిచి చూసాడు. 'అంటే?' అన్నట్టు.
"అదే. ఇలా ఎంత కాలం బాధపడతావ్ అని ?"
అతను మౌనంగా వుండిపోయాడు. కొన్ని క్షణాలు.
అదే అవకాశం గా తీసుకుంటూ, అసలు విషయాన్ని కదపాలని ధైర్యం చేసింది. -"విజయ్! అసలు నీకు ఎదురౌతున్నది నిజంగా 'ఆమే' నా? నువ్వు పొరబడౌతున్నావేమో?" అని, అతనివైపు చూసింది.
ఆ ప్రశ్న వినంగానే చెప్పలేనంత ఉద్వేగం తో 'లేదు. నేను పొరబడటం లేదు శైలూ... ఆమెనే. నా కళ్ల తో నేను స్వయం గా..." అంటూ ఆగాడు. ఆమె అడిగిన ప్రశ్నకి తను చెబుతున్న జవాబు కరెక్ట్ కాదేమో అనే అనుమానం కలగడంతో అక్కడ ఆగాడు.
"అయితే, చూడగానే ఆమెని గుర్తుపడుతున్నావూ అంటే - నువ్వు అస్సలామెని మరచిపోలేదని అర్ధం కదూ?"
"నో. కాదు...అ..వు..నా..?" - తత్తరపడ్డాడు.
"అంత జ్ఞాపకమైన ఆమె - నీకెదురైనప్పుడు పోనీ నువ్ 'హలో' అని పలకరించొచ్చు కదా?"
"ఛీ... " అన్నాడు. ప్రపంచంలోని అసహ్యాన్ని అంతా ఒక దగ్గర చేసినట్టు. "చస్తే నేనా పని చేయను. ఈ జన్మలో... అది జరగని పని. " -అని స్థిరంగా చెప్పాడు.
" అయితే ఆమె నీకు శతృవై వుండాలి."
"కాదు. అంతకంటేనూ ఎక్కువ. నా జీవితాన్ని..." అతని కోపం, కసి గా మారే లోపే, ఆమె అడ్డుకుంది.
"అదంతా వొద్దు. వదిలేద్దాం. ఆమె శతృవు కానప్పుడు మిత్రురాలైనా అయివుండాలి. స్నేహం కానప్పుడు పరిచయమైనా వుండి వుండాలి. అసలీ భావాలేవీ హృదయంలో లేవు. తుడిచేసాను అని నువ్వనుకున్నప్పుడు నీకు ఆ మనిషి ఎదురయినా కనబడనిదై వుండాలి. కనిపించినా, ఎలాటి భావోద్వేగాలు నీలో కలగకుండావుండాలి. ఇన్ని కోట్ల జనాభాలో ఆమె ఒకతి అని అనిపించాలి. కదూ?- కానీ, అలా జరగడం లేదు విజయ్ - నీలో నీకే తెలీని ఒక నువ్వు - నిన్ను బాధపెడుతున్న మాట వాస్తవం
ఆమె ఎక్కడ కనిపించినా నీ మనసు - ప్రళయ భూకంపానికి గురి అవుతోంది. ముక్కలైన గుండెని అతికించుకుని, తిరిగి మామూలు మనిషి వౌతావ్. మళ్లా అంతలో మరో సారి దాడి జరుగుతోంది.
అయితే, నువ్వు కేవలం ఆమెని చూడటం వల్ల మాత్రమే ఇంత ఉపద్రవం జరుగుతోందని నేననుకోవడం లేదు.." అంటూ ఆగింది.
ఆమె మాటలు బాణాల్లా తాకాయి. ఆ ప్రశ్నకి జవాబుంది. కానీ , అది కేవలం తన అంతరాత్మకి మాత్రమే తెలిసిన జవాబు. ఆ నిజాన్ని చెప్పాలా? వొద్దా? ఒక్క క్షణం అతనికేమీ తోచలేదు.
ఎదురుగా శైలు తననే చూస్తోందని తెలిసి కూడా పట్టించుకోనివాడిలా చటుక్కున గ్లాసెత్తుకుని అందులోని మొత్తం ద్రవాన్ని గడగడా తాగేశాడు.
తలొంచుకుని, చేత్తో జుట్టు పట్టుకునిండిపోయాడు.
శైలూ ప్రశ్నకి తను జవాబు చెప్పాలి. చెప్పితీరాలి. కానీ సిగ్గుగా వుంది. చెప్పలేని అసహాయత పెరిగిపెరిగీ, బరువై, దుఃఖమై కట్టలు తెంచుకుంటానంటోంది. తన ఉక్రోషం, అక్కసు అంతా విన్నాక, 'ఛా. నువ్వింత బలహీనుడివా?!' - అని నీచంగా భావిస్తుందేమో? విషాదం లో పడి కొట్టుకుపోతున్న ఈ ఒంటరి జీవితంలో- నచ్చిన స్నేహితురాలు ఈ కారణం గా దూరమైపోతుందేమో? ఈ చిన్నపాటి చిరు ఆనందమూ కరువైపోతుందేమో?
ఇక గతం వొద్దు. వెళ్ళిపోయిన స్త్రీ పెళ్ళి చేసుకుని సుఖంగా వుందనే భావనా అస్సలు వొద్దు. ఇప్పుడు అందమైన ఆవలి తీరానికి ఒక వంతెన వేసుకోవాలి. అదొక అందమైన వాక్యం లో నిర్మించాలి. ఎలా? పదాల కోసం వెతుక్కుంటున్నాడు.
ఆమె కి తెలుసు. ఆ వాక్యం. కానీ, అతని మనసులో ని నిజాన్ని నోటెంట పలికించాలని ఆమె ప్రయత్నం.
అతని నుంచి ఎలాటి స్పందనా లేకపోవడం తో ఆమె కినుకుపోయింది. " చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దులే." - అంది.
మాటల్లో కొంచెం నిష్టూరం ధ్వనించడం అతను విన్నాడు. అతను సంతోషించే - చనువు కనపరచింది కావాలనే.
ఇన్నాళ్ళ స్నేహంలో శైలు - అతని సొంత విషయాల గురించి ఎప్పుడూ అడగలేదు. కానీ... ఇప్పుడు తన లోని బాధకి అసలు కారణం అడుగుతోంది.
కేవలం 'ఆమె' ఎదురవడం వల్లే నీకింత బాధ వేయదు అని డిక్లేర్ చేస్తూనే తనని కొశ్చెన్ చేస్తోంది. తేట తెల్లనైన సమాధానం కోసం ఎదురుచూస్తోంది. ఎందుకనీ? -
ప్రేమ పుట్టిన చోట - ప్రశ్నా పుడుతుందిట. నిజమా?
మౌనంగా మరో సారి - సీసా వొంచి ఖాళీ గ్లాస్ నింపుతున్న అతనితో అంది. - " ఎక్కువ తాగడం వల్ల నిద్రొస్తుంది కానీ మెలకువ రాదుగా!
ఇన్నాళ్ళ మన స్నేహాన్ని మనసులో వుంచుకుని, నీకొక మాట సలహా గా చెప్పాలనుకుంటున్నా విజయ్! మనది కాని గతాన్ని పూడ్చేయాలే కానీ తవ్వుకోవడం వల్ల నష్టపోయేది మనమే కదూ?
మనిషి జీవితం లో సమస్యలెదురవకుండా చూసుకోవాలి. ఒక వేళ ఎదురైనా, ఎప్పటి సమస్య ని అప్పుడే పరిష్కరించుకోవాలి.
తాళం తయారుచేసిన వాడే కీ కూడా తయారు చేస్తాడు. మనం పరిష్కారాలను ఎక్కడో పారేసుకుంటాం కానీ వెదికితే దొరుకుతాయి.
తెలుపు నలుపులు కలిసిందే కాలం. నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడే నీకు సుఖం.
నువ్వెప్పుడూ సుఖం గా సంతోషం గా వుండాలనేదే నా కోరిక. అందుకు నా వంతు సహాయం ఏం కావాలన్నా నిర్భయం గా నా నుంచి తీసుకోవచ్చు. సరే మరి. చాలా టైమైంది. ఇక నే వెళ్తా ప్లీజ్. " అంటూ హాండ్ బాగ్ అందుకుని, కుర్చిలోంచి లేచింది.
అతను మాటలు వెతుక్కుంటున్నాడు.
అదేం గమనించని దానిలా బాల్కనీ లోంచి లోపలి హాల్ లోకి అడుగులు వేసింది.
మత్తు వదిలిన వానిలా, గబుక్కున లేచి, ఆమె వెంట అడుగులేస్తూ ..'నువ్వడిగిన ప్రశ్నకి జవాబు చెప్పనీయవా? ' - బేల గా అడిగాడు. ఆమె వెనక్కి తిరగలేదు. చూడలేదు.
విసురుగా తలుపు తీయబోతుంటే, చటుక్కున వెనకనించి అతను బోల్ట్ మీద చేయి అడ్డుపెట్టి, - "మనసుని బాధపెట్టి పోతావా శైలూ?' అని అడిగాడు. - ఎంతో మార్దవంగా.
గుండెని కరిగించే ఆ స్వరానికో, బొంగురుపోయిన మాటలవె నక ఒలికిన అతని విషాదానికో గిర్రున తిరిగి చూసి ఉలిక్కిపడింది. - ఇద్దరి మధ్య కేవలం రెండడుగుల దూరం కూడా లేదు. అంత సమీపంగా అతన్ని ఊహించకపోవడం తో ఆమె ఉక్కిరిబిక్కిరౌతోంది. అతను మాత్రం - ఆమె ముఖంలోకి చూస్తూ, చూపులతో తడుముతూ అడిగాడు. "శైలూ ..మనం 'కూడా' పెళ్ళి చేసుకుందామా? ప్లీజ్ చెప్పు. మనం కూడా పెళ్ళిచేసుకుందామా? - అని అడుగుతున్న అతన్ని గుచిగుచ్చి చూసింది . - ఆమె సమాధానం కోసం ప్రాణాలు ఉగ్గపెట్టుకున్న వాడిలా చూస్తున్నాడు.
ఎత్తైన పర్వతం మీంచి లోయలోకి - ఇంకొక్క అడుగులో జారిపోయే ముందు ఆ వ్యక్తి చూసే చూపు ఎలా వుంటుందో అలా..చూస్తూన్నాడు.
ఆ క్షణం లో ఆమెకి అతను కనిపించలేదు. అతనిలో - తననే చూస్తోంది. అదే మనసు. అదే బాధ. పైకి వెళ్ళగక్కలేని బాధ. వెలితైన బాధ. పక్కనెవరూ లేనప్పుడు శూన్యం లాటి బాధ..విశ్వమంత విషాదమైన బాధ.. ఇప్పుడు తీరబోతోంది..ఇతని వల్ల ఇక పూర్తిగా తీరిపోతుంది.
ఆ భావమొక్కటే ఆమెని ఉప్పెన లా కుదిపేసింది. ఇన్నేళ్ళు గుండెలో దాగిన దుఃఖం ఎగదన్నుకుని, ఒక్క పెట్టున కట్టలు తెంచుకుందేమో- అమాంతం అతన్ని చుట్టుకుపోయింది.
దక్కిన అదృష్టం ఎక్కడ జారిపోతుందో నన్నంత భయంగా, భద్రంగా రెండు చేతులతో ఆమె నడుము ని చుట్టుకుని బిగించి, మరింత బిగించి, గుండెలకు హత్తుకున్నాడు.
రెండు గుండెల చప్పుడు ఇప్పుడు ఒకే రాగాన్ని ఆలపిస్తున్నాయి.
ఇక అతన్నీ ఆమెనీ ఏ గత నీడలూ వెంటాడవు.
OOO