top of page
sanchika 2.png
hasya.JPG

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

కొలబద్ద

nirmaladitya_edited.jpg

నిర్మలాదిత్య

“ప్రతీ క్షణం విలువైనది. సమయం వృధా చేయలేను. సంవత్సరానికి ఓ అర్ధ మిల్లియన్ డాలర్లు అంటే క్షణానికి ఎంత ఉండచ్చు?”, తన ప్రశ్నకు జవాబు తెలుసుకొనే పరిస్థితిలో లేడు  సుకుమార్.

అదో జవాబుకు ఎదురుచూడని రిటోరికల్ ప్రశ్ననే.

 

సుకుమార్ విసుగుకు  కారణం , ఫోన్ సరిగా పని చేయకపోవడమే. కాన్ఫరెన్సు కాల్ లో తన మాటలు స్పష్టంగా వినపడలేదని కొన్ని సార్లు ఫోన్ కట్ చేసి మళ్ళీ కలిపితే, కొన్ని సార్లు ఫోన్ కాల్స్ దానంతటికి అవే  డ్రాప్ అయ్యిపోతున్నాయి. అలా అవుతుందని, అనుకుంటూనే, ఓ అసహాయతతో ఇష్టం  లేకుండా  ఇంత  దూరం వచ్చాడు సుకుమార్. అన్ని విషయాలలో ఖచ్చితంగా ఉండే సుకుమార్, వనజ విషయంలో అలా ఉండలేకపోతున్నాడు. అందుకే ఆదివారం సాయంత్రం దూప్ ఆరతి కి బాబా గుడికి పోదామంటే, కాదనలేకపోయాడు.


 

వనజ బాగా మారిపోయింది. పై చదువులకని అమెరికా రావడం, ఆ రోజుల్లో వెంటనే ఉద్యోగం రావడం, ఇండియా వెళ్లి వనజను చూసి ఓ వారంలో పెళ్లి చేసుకుని తీసుకు రావడము అట్టే జరిగి పోయాయి. వనజ పెళ్ళైన కొత్తలో తెగ చలాకీగా ఉండేది. ఒకటే వాగుడు కాయ. తానే కొన్ని సార్లు విసుక్కొనే వాడు. వారమంతా పని, వారాంతంలో అక్కడ, ఇక్కడ కొత్త ప్రదేశాలు చూడడంతో సమయం నిమిషాలలా,  సరదాగా, గడిచిపోయేవి. ట్రావెల్ జాబ్ లో బోలెడంత డబ్బులు చేసుకోవచ్చునని కెరీర్ అటు వైపు తిప్పుకోవడంతో, వనజ లో మార్పులు రావడం మొదలైయ్యాయి. చుట్టూ ఎప్పుడు చుట్టాలు, స్నేహితులు ఉన్న వాతావరణం నుంచి రావడం వల్ల  కాబోలని, తనని ఓ జాబ్ వెదుక్కోమన్నాడు సుకుమార్. ఏవో ఒకటి రెండు పనులు ప్రయత్నించింది కానీ తనకు నచ్చలేదని వదిలేసింది. అలా చూస్తుండగానే సమయం గడిచిపోయింది. ఉన్నటుండి ఓ రోజు సుకుమార్ కి వనజ బాగా ముభావంగా ఉందేమో అనిపించింది. పిల్లలు లేరని బాధ పడుతుందేమో అని, ఓ పిల్లని దత్తత కు తీసుకుందామా అని అడిగాడు. దానికి వనజ స్పందించక పోవడంతో, డాక్టర్ దగ్గరికి తీసుకు పోయాడు. అక్కడి నుంచి సైకియాట్రిస్ట్ కు పోవడం, వనజ బాగా డిప్రెషన్ లోకి పోయిందని తెలిసింది. వనజ  మనస్సు మరల్చే వ్యాపకమొకటి కనుక్కోమని , డిప్రెషన్ తగ్గ డానికి సెర్ట్రాలైను టాబ్లెట్ రాసి ఇచ్చారు. ఆ టైంలోనే, ఓ పదేళ్ల క్రితం ఈ బాబా మందిరం కట్టడం గురించి తెలిసింది. వనజకి చిన్నపటి నుంచే బాబా మీద అమిత భక్తి. ఇక మందిరం కట్టడం నుంచి ఇప్పటి వరకూ వాలంటీర్ గా బాబా పనులలో పడటం తో వనజ తిరిగి మనుష్యులలో పడింది. కానీ ఈ డిప్రెషన్, ఎందుకు ఎప్పుడు వస్తుందో తెలీదు. వనజ ఆ డిప్రెషన్ మందులు మావాడటం మాత్త్రం మానలేదు. మొత్తం మీద బాబా వల్లనో, ఈ టాబ్లెట్ ల వల్లనో వనజ లో మార్పు వచ్చింది. వచ్చిన కొత్తలో ఉన్నంత ఉత్సాహం లేక పోయినా, అందులో ఓ 50 శాతం ఉంటుందేమో. అందుకే వనజ సాయంత్రం గుడికి పోదామంటే కాదనలేకపోయాడు. అలా అంటే డిప్రెషన్ అని మళ్ళీ ఓ టాబ్లెట్ వేసుకుంటుందని సుకుకుమార్ కి ఓ మూల కొంచెం భయం కూడా లేకపోలేదు. ఆరతి మొదలెట్టగానే ఫోన్ వైబ్రేట్ అయ్యింది. వనజ విసుగ్గా మొహం పెట్టింది.


 

ఇప్పుడే వస్తానని గుడి బయటకు వచ్చాడు సుకుమార్. ఓ పావుగంటనుంచి లైను దొరక్కుండా ఫోన్ తో కుస్తీ పడుతున్నాడు. చాలా ముఖ్యమైన కాల్. రేపటికల్లా ప్రాజెక్ట్ ముగించి క్లయింట్ కు అందజేయాలి. ఇప్పుడో అడ్డంకి. ఈ సమస్యను ఇంత  ఆలస్యంగా తన దృష్టి కి తెచ్చినందుకు తెగ తిడదామని ఉంది సుకుమార్ కు. కానీ  అది రేపు చేయొచ్చు. ప్రస్తుతం ఎలానో ఆ టీము చేత ప్రోగ్రాం సరి చేయాలి. దాని మీదే తన ప్రమోషన్ ఆధార పడి  ఉంది. ఆదుర్దాగా ఉంది సుకుమార్ కి. తట్టుకోలేకుండా తన దగ్గరున్న సెర్ట్రాలైను టాబ్లెట్ వేసుకున్నాడు. విచిత్రం! తనకు ఎంగ్జైటీ  ఉందని, వనజకిచ్చిన టాబ్లెట్ తనకూ ఇచ్చాడు డాక్టర్. మనస్సు కొంత కుదుట పడటం తో , తను ఊరి బయట ఉన్నానని, స్టేటస్ అప్పటి కప్పుడు పంపమని టెక్స్ట్ చేసాడు. అటూ ఇటూ తిరుగుతుండగా సిగ్నల్ అంది టెక్స్ట్ మెసేజి వెళ్ళిపోయింది. ఇక ఇది సాల్వ్ అయ్యేంత వరకు జాగారణనే అనుకున్నాడు సుకుమార్.

 

టాబ్లెట్ వల్లనేమో సుకుమార్ మనస్సు పరిసరాలపైనా పడింది. చుట్టూ కొండలు, ఎటు చూసినా పచ్చని, ఏపుగా పెరిగిన చెట్లు. మధ్యలో ఎంతో శ్రద్ధ, ఖర్చు తో చేసిన అందమైన లాండ్స్కేప్. అక్కడక్కడా కొలనులు, మండపాలు, ఇతర దేవుళ్ళకి మరి కొన్ని గుళ్ళు, అందాగా ఉన్నాయి. అందుకే ఇలా అడవులలో, మనుషులకు దూరంగా ఈ గుడి కట్టారేమో. ఆదివారం, అదీ సాయంత్రం, చాలా మంది కి లో పాయింట్. అందుకనే నేమో కార్లు పెద్దగా కనిపించటం లేదు. ఎక్కువ శుక్రవారం సాయంత్రం  నుంచి ఆదివారం మధ్యాహం వరకే జనాలు. మిగతా సమయాల్లో వెదుక్కోవలసినదే. నీలాకాశం సిగ్గుపడడానికి ఆయత్తమవుతున్నది . అక్కడక్కడా తెల్లటి పిల్ల మేఘాలు. ఆ  బేక్ గ్రౌండ్ ముందు నిలిచిన ఎర్ర రంగు టెస్లా మోడల్ X క్రాస్ఓవర్ కార్ చూస్తుండగానే ముచ్చటవేస్తున్నది  అనుకున్నాడు సుకుమార్. మరి ఆ మోడల్ కొన్న మొదటి వాళ్లలో సుకుమార్ కూడా ఒక్కడు, అది తన కారే. సుకుమార్ ఒక్కింత గర్వం తో మేళవించిన సంతోషపు క్షణాన్ని,  భంగ పరుస్తూ ఓ తెల్లావిడ ప్రత్యక్షమైంది.


 

సుకుమార్ గమనించలేదు కానీ, ఆ తెల్లావిడ, సుకుమార్ వయస్సే ఉండవచ్చు, గుడి పనులు చేస్తూనే వుంది. సుకుమార్ కారు ముందుకి రావడంతో సుకుమార్ దృష్టి లో పడక తప్పలేదు. ప్రస్తుతం, ఆవిడ మధ్యాహ్నం భక్తులు తిని పారేసిన ప్లేట్లు, స్పూన్లు ఉన్న ట్రాష్ కవర్లు గుడిలోనుంచి తీసుకోని , గుడి బయటనున్న ట్రాష్ బిన్ లో వేస్తున్నది.  సుకుమార్ చూడగానే చిన్నగా పలకరింపుగా నవ్వింది. జీన్ ప్యాంటు, పైన ఓ కుర్తా , బహుశా ఎవరైనా ఇండియా నుంచి తెచ్చి ఇచ్చారేమో, మారే అలంకరణ లేకున్నా అందగానే ఉంది. చెత్త పడేసిన తరువాత నేరుగా సుకుమార్ దగ్గరికే వచ్చేసింది.


 

“ దేనికైనా వెదుకుతున్నారా?”, ఇంగ్లీష్ లోనే అడిగింది.

“థాంక్స్, వైర్లెస్ సిగ్నల్ అందడం లేదు?”, అన్నాడు సుకుమార్ తన సమస్యకు పరిష్కారం దొరికితే తిరిగి కాన్ఫరెన్స్ జాయిన్ అవ్వచ్చు అన్న ఆశ తో.

“మీది ఏ టెలిఫోన్ సర్వీస్”, తీరుగా ప్రశ్నించింది ఆవిడ.

ఫలానా అని చెప్పాడు సుకుమార్.

“ఆ టెలిఫోన్ సర్వీస్ సమస్యే , చాలా మంది గుడికి వచ్చిన వాళ్లు చెప్పారు”, అంది

సుకుమార్ కి ఇంకా పని మీదే మనస్సు ఉంది. గుళ్లో కి పోవాలనిపించలేదు. ఆలా అని గుడి వదిలి సిగ్నల్ కోసం మరీ దూరం పోవాలని లేదు. ప్రస్తుతం టెక్స్ట్ మెస్సేజ్ ల పై పని అవ్వగొట్టడం కంటే గత్యంతరం లేదనుకున్నాడు. ఓ సారి కొత్త మెసేజి కోసం ఫోన్ చూసి, ఆ తెల్లావిడను చూసి “నా పేరు సుకుమార్. నా భార్య ఆరతి లో ఉంది, కాన్ఫరెన్స్ కాల్ కనీ గుడి బయటికి వచ్చాను”, అని చెప్పాడు.

 

“నా పేరు లిసా. ఇక్కడే గుడిలో పార్ట్ టైమ్ పని చేస్తుంటాను”, అంది.

 

“గంటలు బట్టి జీతమేమో కదా, సరిపోతుందా? అదీ ఈ గుడిలోని ఉద్యోగమే ఎందుకు ఎన్నుకున్నారు. బయట బాగానే వస్తుందేమో కదా”, అన్నాడు సుకుమార్.


 

“వస్తుందేమో, కానీ పనికనీ, రోజు ఓ గంట పైనే దగ్గరున్న సిటీకి ప్రయాణం చేయాలి. మా ఇల్లు, ఇల్లంటే ఇల్లు కాదు ఓ ట్రైలర్ ఓ 5 మైళ్ళ దూరంలో అడవిలోనే ఉంది. నాకు ఊరికి బయట , ప్రకృతికి దగ్గరగా ఉండటం ఇష్టం. గుడిలో శుక్ర, శని ఆది వారాలు పొద్దున్న 8 నుంచి రాత్రి 8 వరకు పని చేస్తాను. మిగతా రోజులూ 2 గంటల పని ఉంటుంది. దాదాపు వారానికి ఓ 30 గంటల పని. మినిమం వేజ్ లే. దానికి తోడు పిల్లలకి గుడిలో శని ఆది వారాలలో పెయింటింగ్ నేర్పిస్తాను. దాని  వల్ల కొంత డబ్బు వస్తుంది. నా కనీసావసరాలకి సరి పోతుంది. నేను ప్రెట్టి హ్యాపీ”, అంటూ నవ్వేసింది.


 

పూజారి కారు అటు దూరంగా కనిపిస్తున్నది. మొన్న ఇటీవల ఓ 5 బెడఁరూం ఇల్లు మారినప్పుడు గృహప్రవేశానికని పూజారి అదే కారులో వచ్చాడు.


 

“ఎలా వచ్చారు గుడికి? మీ కారు కనిపించలేదు. మేమొక్కరమే ఉన్నట్లున్నాము గుడిలో. నా కారు అదిగో అదొక్కటే ఉంది”, అన్నాడు సుకుమార్


 

లిసా కి టెస్లా గురించి కానీ ఆ టెస్లా కార్ల గురించి కానీ తెలిసినట్లు లేదనుకున్నాడు.


 

లిసా అలాగా  అన్నట్లు ముఖం పెట్టేసి, “నాకు ట్రక్ ఉంది. నాకు ఒక  కూతురు. తాను తీసుకెళ్లింది. తాను ఇంకా ఇక్కడే కమ్మూనిటీ కాలేజీలో సాయంత్రం క్లాసులకు వెళుతుంది. నాకు ఇంటికి పోవడానికి, ఇక్కడికి రావడానికి మాత్రమే కారు అవసరం. ఎప్పుడైనా షాపింగ్ అంటే కలిసిపోతాము. కాబట్టి ఓ ట్రక్  తో పని కానిచేస్తున్నాం”, అంది


 

లిసా టైము చూసి, “ ఓ పది నిమిషాలలో తను రావాలి. నా మిగిలిన పనులు ముగించేస్తాను. గుడ్ లక్ విత్ యువర్ ఫోన్ “, అంటూ వెళ్ళిపోయింది.


 

సుకుమార్ కనెక్షన్ కని అటూ ఇటూ తిరుగుతూ, లిసా పనిచేస్తుండడము చూస్తూనే ఉన్నాడు. ఏదో కూని రాగాలు తీస్తూ, తాను చూసే ప్రతీది ఎంతో ఆనందం ఇస్తున్నట్ట్లు , లిసా చక చకా అటూ ఇటూ తిరుగుతూ పని చేస్తూ ఉంది.


 

సన్నగా ఆరతి వినిపిస్తున్నది. చాలా సార్లు వినడం వాళ్ళ, ఇంకో 5 నిమిషాలలో అయిపోతుంది అనుకున్నాడు. ట్రక్ చప్పుడు వినిపించింది. చూస్తుండగానే పెద్ద పెద్ద చక్రాలతో, కొట్టొచ్చేలా ఉన్న ట్రక్ గుడిలోకి వచ్చి సుకుమార్ కార్ ప్రక్కనే పార్క్ అయ్యింది.


 

ట్రక్ లో నుంచి ఓ 20 ఏళ్ళు ఉండొచ్చేమో, ఓ చక్కటి అమ్మాయి దిగింది.


 

లిసా దగ్గర వస్తుంటే, లిసా సుకుమార్ దగ్గరకి వచ్చి, ‘అదిగో మా అమ్మాయి బెత్’ అని పరిచయం చేసింది.

“బేబీ, నీ గురించే మాట్లాడుతున్నాము. హి ఈజ్ సుకుమార్”, అంది లిసా


 

తన దగ్గర తన కూతురు బెత్ కనీ ఓ ఉద్యోగం ఏమైనా అడుగుతుందేమో అని అనుమానమొచ్చింది సుకుమార్ కి.


 

“ హలో బెత్, ఏమి  చదువుతున్నావు” అని అడిగాడు సుకుమార్


 

“ ఆటోమొబైల్ వర్కుషాప్ కని కోర్సులు తీసుకుంటున్నాను”, అంది బెత్


 

“బెత్ కి కార్లంటే పిచ్చి. అదీ పాత కార్లు తీసుకొని రిస్టోర్ చేయడము. అదో నిచ్ మార్కెట్. అందుకే ఈ కోర్సులు చేస్తున్నది. ఎప్పుడో ఒకప్పుడు తను తన పేరునే అలాంటి బిజినెస్ మొదలెట్టాలని తన ఆశ”, అంది లిసా .
 

“అవును కార్లంటే, వాటిపై పనిచేయాలంటే నాకిష్టం. ఈ ట్రక్ వీల్స్, స్ప్రింగ్స్ మార్చి పైకి లేపడం, రిట్రో లుక్స్ కోసం బాడీ కూడా మార్చేసాను. నేను తీసుకుంటున్న బాడీ వర్క్ క్లాస్ లలో వెల్డింగ్, పెయింటింగ్ కూడా నేర్పించారు. అవే దీని  పైన ఉపయోగించాను”, అంది బెత్.


 

బెత్ చూపులు సుకుమార్ కార్ పైకి మరలాయి.. వెంటనే సుకుమార్ తో టెస్లా కారు గురించి, తనకు ఎలెక్ట్రిక్ కార్ల కంటే పెట్రోల్, డీజిల్ కార్లే ఎందుకు నచ్చుతాయో, ఎలెక్టిక్ కార్లలో ఉన్న తేడాలేమిటో అనర్గళంగా వాగుతూనే ఉంది. సుకుమార్ కి అన్నీ అర్ధం కాలేదు, తనకు కార్లు కొనడమే తప్పితే అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకొనే కోరిక లేదని పసి కట్టిన లిసా,


 

“బెత్, వీ నీడ్  టు గో, బై సుకుమార్”  అనీ ట్రక్ వైపు దారి తీసింది.


 

సుకుమార్ ఫోన్ మరో సారి చూసాడు. ఏ టెక్స్ట్ మెసేజిలూ కనపడలేదు. సమస్య ఇంకా ఉన్నట్లే ఉంది . టాబ్లెట్ మహత్యమా అని ఆందోళన లేకపోయినా విసుగ్గా ఉంది. కూర్చోబుద్ది కాలేదు.


 

లిసా వైపు ఆలోచనలు మళ్ళాయి. ఉండటానికి సరైన ఇల్లు లేదు, కదలడానికి ఓ డొక్కు ట్రక్, ఉంటుందో పోతుందో తెలియని ఉద్యోగాలు, లిసా, బెత్ లు ఎలా నవ్వుతూ ఉండగలుగుతున్నారు. ఇప్పటికీ సుకుమార్  ఏ  పని చేస్తే మరింత సంపాదించొచ్చు అనీ అహర్నిశం ఆలోచిస్తూనే ఉంటాడు, అవకాశం వస్తే అటూ ఇటూ చూడకుండా ఆ కొత్త ఉద్యోగానికి వెనుదీయడు. సుకుమార్ కి లిసా అంతు  బట్టలేదు. కూతురు కూడా అమ్మ పోలికే.  బెత్ కూడా అంతుపట్టలేదు.


 

ఆరతి అయిపోవచ్చింది. సుకుమార్ ఫోన్ మ్యూట్లో పెట్టేసి గుడి వైపు దారి తీసాడు. గుడిలో పూజారి, వనజ మాత్రమే ఉన్నారు. పూజ తరువాత సుకుమార్, వనజ పూజారితో పాటు గుడి వెలుపలికి వచ్చారు.


 

సుకుమార్ లిసా, బెత్ ల గురించి వనజ, పూజారులకు చెప్పాడు. దానికి పూజారి, “సుకుమార్ గారు, ఆవిడకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం అండి . వీలున్నపుడల్లా  తను ఆ పని చేస్తూనే ఉంటుంది. అన్నట్లు, మీరు మా కొత్త ప్రార్థన మందిరం చూడ లేదు కదా, రండి  చూద్దురు కానీ “ అని పూజారి ఆన్ 100 గజాల అటువైపున్న మందిరం వైపు దారి తీసాడు.


 

మందిరం ఓ పొడవాటి హాలు. హాలు లోకి ప్రవేశించిన వెంటనే సుకుమార్ కి ఓ అనిర్వనీయమైన అనుభవం  కలిగింది . హాల్ మూడు వైపులా గోడల మీద ముగ్గుల వంటి డిజైన్లు. గోడల మీద ఎంచుకొన్న రంగులు కూడా ఓ ప్రశాంతత కలిగిస్తున్నాయి. చాలా రోజుల తరువాత  మనస్సు ప్రశాంతంగా అనిపించింది సుకుమార్ కు. ఎదురుగా గోడ పైన నిలువెత్తు బాబా చిత్రం పైన స్టైన్ గ్లాస్ కిటికీలు. బాబా ముఖంలో ఉన్న ఆప్యాయత వల్ల వచ్చిందో లేక మొత్తం అక్కడున్న వాతావరణం వల్ల అలా ప్రశాంతత వచ్చిందో సుకుమార్ కు  అర్ధం  కాక సందిగ్ధంలో పడ్డాడు. హాలు లో ఓ మూల పిల్లలు వేసిన చిత్రాలు ఉన్నాయి. బహుశా అక్కడే పిల్లలకి పాఠాలు చెప్తారేమో.


 

పూజారి సుకుమార్ ఏదో ఆలోచనలో పడ్డాడని వనజతో మాట్లాడడం మొదలెట్టారు .
 

“ వనజ గారు, పిల్లల తరగతులు బాగా నడుస్తున్నాయి. పిల్లలు ప్రతీ శనివారం నిండి పోతున్నారు. లిసా గారంటే పిల్లలకి కూడా ఇష్టం….”

‘ఈ బాబా చిత్రం ఎవరు వేశారు? ఇంత  అందంగా ఉంది?’ అని సుకుమార్ చిత్రం దగ్గర పోయి ఆర్టిస్ట్ పేరు చదవబోయాడు. “లిసా”  
 

“ఇదిగో ఈ బాబా చిత్రం కూడా లిసా గారే వేశారు. ఆవిడ అద్భుతమైన పేయింటర్ అండి. ఎక్కడా ఒక చోట ఉండరు. నచ్చిన చోటకి ట్రైలర్ లో పోయి అక్కడో ఒకటి రెండు సంవత్సరాలు ఓ ప్రాజెక్ట్ చేస్తారు. ఎక్కువగా సోషల్ ప్రాజెక్టులే, అదీ వాలంటరీ పనే. మన బాబా గుడిలో తనే మొత్తం పెయింటింగ్ చేస్తానని అదీ ఊరికేనని చెప్పారు. ఎంతో కొంత డబ్బు తీసుకోండి అంటే ఆ డబ్బుకు సరిపడే వాలంటరీ పనులు చేస్తానంటూ అదిగో ఇలా గుడిలో పని చేస్తూ ఉన్నారు . తన అవసరాలు చాలా తక్కువ. దానికి సరిపడా  డబ్బులు చాలంటారు. తన పెయింటింగ్ లు డబ్బు కోసం కాకుండా గుడి కోసం ఇస్తున్నానన్న ఆ ఆనందం ఆవిడ పని లో కనిపిస్తూ నే ఉంటుంది. పెయింటింగ్ చేసిన, పిల్లలకు పాఠాలు చెప్తున్నా, గుడి ఫ్లోర్లు నీళ్లు వేసి శుభ్రపరుస్తున్నా,  తిని పారేసిన ట్రాష్ మూటలు మోస్తున్నా  ఆవిడ మొఖంలో ఆనందమే. నచ్చిన పని చేస్తున్నంత సేపు ప్రతీ క్షణం విలువ అంతులేని ఆనందమే కదండీ….,”పూజారి మాట్లాడుతూనే ఉన్నారు.


క్షణం వెలుగు, నీడలలో  విలువలు వెతుక్కుంటున్న జనాలకతీతంగా, సూర్యుడు అవిరామంగా ప్రజ్వలిస్తూనే ఉన్నాడు.

OOO

bottom of page