కవితా వాణి
కవితా వాణి
నిర్వహణ: చిలుకూరి సత్యదేవ్ | మధు పెమ్మరాజు
పుస్తకాన్ని ఎలా చూడాలన్నదే ప్రశ్న
ఇప్పుడెలా అమ్ముకోవాలన్నదే ప్రశ్న -
కధల్ని కవిత్వాలని గుండెకెక్కించు కుంటావు
వేళ్ళతో తెల్ల కాగితాల మీద ముద్రించుకుంటావు
అది మాయకుండా ముట్టుకోకుండానే అటకెక్కి పోతుంది
దిగులు రెక్కలకి గాలినిస్తూ
పుస్తక ప్రపంచం రమ్మని ఆహ్వానిస్తుంది
అమ్ముకోమని గుడారం ఇస్తుంది
ఆశ ఆకాశంలో గాలిపటంలా ఎగురుతుంది
అందరికి చెప్పాలని కధ రెక్కల వాకిలి తెరిచి పెట్టుకుని
చూస్తూ ఉండగానే
జనాలు సీతాకోక చిలకల్లా వాలుతారు
నయనాలతో వేళ్ళతో నేమిలికలా తాకుతారు
రాజ హంసల్లా వెళ్ళిపోతారు
పొడి మబ్బు అయిన దుఃఖం కంట్లో ఆగిపోతుంది.
రాత్రి కలలో పుస్తకం
నా పక్కన కూర్చుంటుంది
స్నేహితుడై ఓదారుస్తుంది
గుండెల మీద నిద్రపోయిన రోజు
అరణ్యాలని చూపించిన రోజు
బాల్యపు ప్రవాహలని చదివించిన రోజు
కవిత్వమై చలించిన రోజు
కథగా గాథగా కన్నీళ్ళు పెట్టించిన రోజు
ఉత్తరాలని మడిచి దాచిపెట్టుకున్నవి
వాడిన పూరేకులని దాచినవి
అప్పటివన్ని కబుర్లుగా చెప్పి నిద్రచెట్టుకింద కూర్చోపెడుతుంది
పగలు గుమ్మంలో అమ్మకం అంగట్లో
నానుంచి విడిపోయిన పుస్తకం
అది నిర్మించుకున్న ప్రపంచంలో
మాటల మనుషుల మధ్యలో తిరుగుతోంది
ఆఖరికి
ముగిసిన ప్రదర్శనలో మిగిలిన దొంతులు
అటక ఎక్కుతూ ఒక్క మాట అంటాయి
కంప్యూటర్ కీ బోర్డులో శాశ్వత సంకెళ్ళు
తెగి భూమ్మీద మెరుపులా రాలినప్పుడే
అమ్మినా అమ్మకపోయినా
పద్యమో కధో నవలో వాక్యమై వెంటాడుతుంది ...
ఇక్కట్లకి అర్జీలు పెట్టినట్టే
అస్తవ్యస్తాలపై ఫిర్యాదులు చేసినట్టే
అర్దమవనీ ప్రపంచ తీరుతెన్నులపై
పరమాత్ముని కోసమో ప్రశ్నావళి
*
లోకాన వింత పోకడలెందుకు?
నోరులేని జీవాల ఆర్తులెందుకు?
ఆకలిదప్పులెందుకు?
అల్పుల ఆర్తనాదాలెందుకు?
*
మనిషిని సృష్టించనేల
మరబొమ్మగా మలచనేల
పుడమిన అంతలేసి చింతలేల
కష్టనష్టాలు, వ్యాధులు, దండనలేల
*
మనిషిని ఆయుధంగా మార్చుకుని
ఖర్మఫల సమరాన్ని సాగించనేల
జన్మలకి ఖర్మలకి కారణం నీవే కాదా?
ఈ జగన్నాటకం అర్థరహితం కాదా?
*
దయగలవాడవని నీకా పేరెందుకో?
బిడ్డలనాదుకోలేని నీకా గొప్పెందుకో?
వెతలు మాపలేని నీవెందుకో?
వ్యధభరితమైన నీ సృష్టెందుకో?
*
ఎంత వేడుకున్నా
నీకా వీడని గాంభీర్యమెందుకో
అడిగేవారు లేరనేనా
నిలదీసేవారు రారనేనా
*
నిజానికి నువ్వున్నావా?
ఉంటే కిందికి దిగి రావయ్యా...
లోకుల ఆర్తిని తీర్చి ఆదుకోవయ్యా...
దయగల దేవుడనని చాటవయ్యా...

నానీలు
~కొమ్ముల వెంకట సూర్యనారాయణ
మధుర వాణి
సాహితీవనంలో
విరబూసిన
అక్షరతరంగిణి
ఆత్మీయతలు
ప్రవహిస్తున్నాయి
వాయురూపంలో
చరవాణితో
పేదవాడి
అస్థిపంజరం
ప్రత్యక్షంగా కనిపించే
ఎక్స్-రే
ఎలక్షన్ వర్షం
హామీల చినుకులతో
ఓటర్లు
తడిసిముద్ద
విదేశీయుడైనా
కాటన్
స్వదేశీయులెవ్వరూ
నెవర్ ఫర్గాటన్
****
మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...
click here to post your comments...
ఏదో ఒక
దైనిక ఘటన
ఆలంబనగా
మనసులో ఒక మూల
దైర్య వచనాల కింద
అణిచి పెట్టబడ్డ
ఇది
ఆత్మ విశ్వాసపు మూతని
తన్నుకుని
స్ప్రింగులా
పైకి లేచి
వెక్కిరిస్తుంది.
ఘడియ ఘడియకీ
గొలుసుకట్ట
ఊహా పరిణామాల
చప్పుళ్ళు వినిపిస్తూ
నాలోంచే
అంతంతగా పెరిగి
నన్నే నాముందు
మరుగుజ్జును చేసి
ఎగతాళి
చేస్తుంది.
అ
పుడు
ధీరులైన
సజ్జనులు
పుస్తకాల్లో
దాచి ఇచ్చిన
విత్తనాలు కొన్ని
తీసి పాతితే
మది
లో
అవి
వివేకమై
వేళ్ళు తన్నుకుని
తర్కమై
లతలుగా పాకి
రొమ్ము విరుచుకు నిలబడ్డ
భయాన్ని చుట్టేస్తే
ఊపిరాడనీయక
నొక్కేస్తే
భీతి చెందిన
భయం
ఇంతింతై
ఇసుమంతై
తల్లో చీకటి లోయల్లో
జారిపోతుంది.
****
వానదేవుడా!
~వి. చెన్నయ్య (“దోరవేటి”)
తేII దివినిగల యమృతమునంత తివిరి, తివిరి
దేహభాండమ్మునను నింపితెచ్చి మనకు
ప్రేమమీర నిచ్చెడి మేఘ భామలదియె
ప్రాణులను పావనమొనర్చు వర్షధార!
ఉII మండెడి తల్లి గుండెసెగ మాన్పగనెంచి ఖగేంద్రుడా సుధా
భాండము తెచ్చియిచ్చెను సెభాషన లోకములెల్ల; నేడు భూ
మండల మెండిపోయి ‘కనుమా! నను పుత్రక’ యంచునుండె, నీ
యెండిన నేలలోన నుదయింపగజేయి సమార్ద్రతాఝరుల్
కంII లేవని, నీవిక నిపుడే
రావనుచు విజృంభణమున రాక్షస మతియై
గావించుచుండె దహనము
నా వహ్ని, జగమున నిండె హాహాకారాల్!
చII అమృతమువయ్యి నీవు యెదలందున జీవన చేతనంబులన్
క్రమముగ నిల్పగల్గుదువు గావున యీ వసుధాప్రజాళినిన్;
సమయము మించకుండ మము చల్లగజూడగ రమ్మటంచు నే
కముగను మ్రొక్కుచుండగను గావగ రమ్మిక వానదేవుడా!
కంII రమ్మని మొత్తుకొనగ కో
పమ్మను తీవ్రముగ జూపి వానను, రాళ్ళన్
గుమ్మరియించకు తండ్రీ!
వమ్మగు జీవనములన్ని వరుణోగ్రమునన్
సీll మారైతుమొక్కలు మట్టిలో మునుగక
తలిరాకు లేయాలి చెలిమి మీర;
మా పల్లెవాసులు మట్టి పరిమళమున్
మనసార గ్రోలాలి తనివితీర;
మా యాడుబిడ్డలు హాయిగా బ్రతకాలి
ఉదక బాధలులేక ముదము మీర;
మా జీవనదులన్ని యా జీవనమ్మును
గలగలలాడాలి కళలు మీర ...
తేII చెరువు లూటబావులు బోర్లు చెలిమెలన్ని
నిండుగా పొంగిపొరలాలి నీటితోడ
అమరనీయకు జడివాన లమర ముఖ్య!
నీకు చెడుపేరు రారాదు నిఖిల సఖ్య!
****
మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...
click here to post your comments...