
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
కవితా వాణి
నిర్వహణ: చిలుకూరి సత్యదేవ్ | మధు పెమ్మరాజు
డా. అక్కిరాజు సుందర రామకృష్ణ
డా. అక్కిరాజు సుందర రామకృష్ణ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. పౌరాణిక నాటక రంగంలో అత్యుత్తమ నటులుగా, పద్య గాయకులుగా, శతాధిక సినీ నటుడిగా, అధిక్షేప కవిత్వంలో నిష్ణాతుడిగా, వైవిధ్య కవితా వస్తువులతో పలు శతకాల రచయితగా, అనేక టెలివిజన్ కార్యక్రమాలకి సంధాన కర్తగా, మరెన్నో విధాలుగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి పొందిన స్ఫురద్రూపి. నటి జమునతో శ్రీ కృష్ణ తులాభారంలో శ్రీ కృష్ణుడిగా శతాధిక ప్రదర్శనలు, తెనాలి రామలింగడు, శ్రీనాధుడు మొదలైన పాత్రలలో తన నటన, పద్య పఠనాలతో సాటి లేని మేటి నటుడిగా, పండితుడిగా అనేక దేశాలలో ప్రదర్శనలు ఇచ్చారు. ముఠా మేస్త్రి, శివ మొదలైన శతాధిక సినిమాలలో నటించారు. నరసరావు పేట కి చెందిన అక్కిరాజు గారు ఉస్మానియాలో “వేంకట పార్వతీశ్వర కవులు” అంశం పై డాక్టరేట్ పట్టా అందుకుని, తెలుగు ఉపాధ్యాయులు గా పదవీ విరమణ చేశారు. ‘అభినవ ఘంటసాల’, ‘కవితా గాండీవి’ ‘నాట్య శ్రీనాథ’ మొదలైన అసంఖ్యాక బిరుదులు, ప్రపంచవ్యాప్తంగా అనేక పురస్కారాలు పొందిన అక్కిరాజు వారు హైదరాబాదు నివాసి.

పి. భారతీకృష్ణ
శ్రీమతి పి. భారతీకృష్ణగారు రచించిన సుమారు 25కి పైగా నాటికలు, 30 కథానికలు ఆకాశవాణి ద్వారా ప్రసారమయినాయి. వివిధ పత్రికలలో కవితలు, వ్యాసాలు ప్రచురితమయినాయి. ఆకాశవాణి హైదరాబాదు-ఏ కేంద్రంలో 'బీ గ్రేడ్ లలిత సంగీత గాయని. తూ.గో.జిల్లాలోని కపిలేశ్వరపురంలో నివాసం.

ఆచార్య కడారు వీరారెడ్డి
రసాయనశాస్త్రంలో అధ్యాపకులైన ఆచార్య కడారు వీరారెడ్డిగారు శాతవాహన విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా వ్యవహరించారు. ఉస్మానియా యునివర్సిటీలో పనిచేసిన డా. వీరారెడ్డిగారు రసాయన శాస్త్రంలో పలు గ్రంథాలు ప్రచురించడమే గాక, కవిత్వం, కథలు ప్రక్రియల్లో ప్రవేశం ఉంది. తెలుగు, హిందీ భాషల్లో "భాస్వరాలు, కాలం అడుగులు" మొదలుగా మొత్తం ఏడు కవితా సంపుటాలు వెలువరించారు.

ఎస్.కే.వీ. రమేష్
శ్రీ ఎస్.కే.వీ. రమేష్‌గారు తిరువూరు మండలంలో అధ్యాపకులుగా పని చేస్తున్నారు. గుడివాడ స్వస్థలమైన శ్రీ రమేష్‌గారికి మినీ కవితలు, హైకూలు, కూనలమ్మ పదాలు వ్రాయడంలో అనుభవం వుంది.

బెజ్జంకి జగన్నాథాచార్యులు
డాక్టర్ బెజ్జంకి జగన్నాథాచార్యులు గారు విశ్రాంత ప్రధమశ్రేణి తెలుగు పండితులు.బాలల రచయిత, కవి, వ్యాసకర్త. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యయ సమతారావు అవార్డు గ్రహీత. గుంటూరు జిల్లాలోని మాచర్ల పోష్టు మండలంలో నివసించే జగన్నాథాచార్యులుగారు “పలనాటి వేమన”, “పలనాటి చరిత్ర కథా సమ్రాట్” మొదలైన బిరుదులు పొందారు

పి. సురేంద్ర రావు

శ్రీ పి. సురేంద్ర రావుగారు వేదా౦తి, కవి, రచయిత, కళాకారుడు, స౦గీత సాధకుడు. భారతీయ పట్టు చేనేత కార్మికుల సమస్యకు ఒక శాశ్వత పరిష్కార మార్గ౦ కనుగొన్న కుబ్జా టెక్నాలజీ సృష్టికర్త.
బీ.కొత్తకోట, చిత్తూరు జిల్లా వాస్తవ్యులైన రావుగారు తానే స్వరబద్ధం చేసిన “పచ్చి నిజాలు శతక౦” కూడా రచించారు
శ్రీనివాస భరద్వాజ కిశోర్ (కిభశ్రీ)

శ్రీనివాస భరద్వాజ కిశోర్ గారికి డా. సి. నారాయణ రెడ్డి గారు అభిమానంగా పెట్టిన కలం పేరు కిభశ్రీ. 17 సం।।లు భారత దేశంలో వైజ్ఞానికునిగానూ, గత 19 సం।।లుగా అమెరికాలో ఐటీ మానేజ్మెంట్ లోనూ పని చేసి కళారంగంలో కృషి ద్విగుణీకృతం చేసేందుకు పదవీవిరమణ చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు. దాదాపు 600 గేయాలకు బాణీలు కట్టారు, 16 సంగీత రూపకాలకు సంగీతం సమకూర్చారు. తెలుగు, హిందీ ఆంగ్ల భాషలలో పద్యాలు, కవితలు, గజళ్ళు, నాటికలు, సంగీత రూపకాలు వ్రాసారు. గత సంవత్సరం "కదంబం" పద్య గేయ సంపుటి డా।।సినారె గారి చేతులమీద విడుదల అయింది. 250 మంది అమెరికన్ సభ్యులు గల టాలహాసీ కమ్యూనిటీ కోరస్, స్వరవాహిని బృందాలు ఈయన వ్రాసి స్వరబద్ధం చేసిన గేయాలను చాలా వేదికలమీద పాడారు. ఈయన వ్రాసి స్వరబద్ధం చేసిన చాలా గేయాలను, నాటకాలను బృందాలు దర్శించాయి. ఫ్లారిడా లోని టాలహాసీ నగర నివాసి.