top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

మధురవాణి ప్రత్యేకం

నా డైరీల్లో కొన్ని పేజీలు... 

గొల్లపూడి మారుతీ రావు

ఒక చరిత్ర

1972 సెప్టెంబరు 25

రాత్రి మూడున్నర గంటలకు అట్లూరి పుండరీకాక్షయ్యగారి ఆఫీసులో దృష్టి మళ్లీ 'వారాలబ్బాయి' మీదికి పోయింది. ఎన్ని నెలల కిందటో అటకెక్కిన సబ్జెక్ట్. మేం మద్రాసులో ఉన్నాం. ఫైలు తేలికగా 1500 మైళ్ళ దూరంలో శంబల్పూరు (ఒరిస్సా)లో ఉంది. ఇది సినిమా. నిర్ణయాన్ని వెంటనే తీసుకున్నారు. అప్పటికప్పుడు బలరాం కొడుకు మద్రాసునుంచి బయలుదేరి, విశాఖలో మా తమ్ముడిని కలిసి, ఇద్దరూ శంబల్పూరు చేరి, ఇంటి యజమాని భారీదాసుకి నా ఉత్తరం చూపించి, ఫైలుని వెదికి మళ్ళీ రైలెక్కి మద్రాసు చేరాలి. మహాప్రస్థానం బయలుదేరింది.

మొదట కథ ఇక్కడ ప్రారంభం అయితే కలవదు. అనగా అనగా..

ప్రొద్దుటూరు రాయల నాటక కళా పరిషత్తు పోటీలలో ప్రత్యేక ఆహ్వానితులకు ఘనమైన స్వాగతం. ఎవరా ఘనమైన ఆహ్వానితులు? మహనటుడు ఎన్.టీ.రామారావు, గొల్లపూడి మారుతీరావు, దర్శకుడు తాపీ చాణక్య.  ముందు మమ్మల్ని ఆహ్వానించి తర్వాత ఆ మేరు దిగ్గజాన్ని పిలిచారు. ఆయన అంగీకరించారు. ఆయన ముందు, ఆయనతో మాకు ఊరేగింపు ఏమిటి? ఆయన పక్కన మేమిద్దరం 'కేతిగాళ్ల'లాగ ఉన్నాం. 99శాతానికి మేమెవరమో తెలీదు.

ఒక ఉదాహరణ. ముగ్గురినీ వేదికమీద కూర్చోబెట్టారు. మమ్మల్ని పట్టించుకున్నవాడు లేడు. ఎట్టకేలకు ఒకాయన వచ్చాడు. అమ్మయ్యా! నా పరపతికి చిన్న ఆస్కారం దొరికిందనుకున్నాను. నా దిక్కుమాలిన నాటిక ఏదయినా చదివాడేమో అని ఆనందించాను. నా చెవిలో ఏదో అంటున్నాడు. "తమ నాన్నగారు రాసిన 'విజయోల్లాస వ్యాఖ్య..' “…! జగద్విదితం. నాకలాంటి కితాబులు లేవు. చెప్పేది మరొక ప్రముఖ అవధాని సి.వి.సుబ్బన్న అవధాని. వారికి వెంటనే విన్నవించాను. "అయ్యా, నా పేరు ఫలానా. తమరు భావిస్తున్నది అటు కూర్చున్నవారు" ఆ వ్యవస్థలో అట్లూరి. ఇదీ ఆనాటి నమూనా వ్యవస్థ.

ఈ వ్యవస్థలో అట్లూరు పుండరీకాక్షయ్యగారనే నిర్మాత నన్ను ఎన్.టీ.ఆర్‌కి పరిచయం చేశారు. ఆయన బుర్రకి ఆ దశలో ఎంత ఎక్కిందో? అనుకోకుండా ఆ పోటీలలో నా "రెండు రెళ్లు నాటిక"కు ఉత్తమ రచన అవార్డు. అది ఏ కాస్తో గుర్తుండి ఉండాలి.

ఆ వరసలోనే అట్లూరి, ఎన్.టీ.ఆర్‌తో వచ్చిన డి.వి.ఎస్ రాజు, యు.విశ్వేశ్వరరావు, త్రివిక్రమరావు ఇత్యాదులను పరిచయం చేశారు.

ఇది గొప్ప ప్రహసనం.

దీని వల్ల నాకు జరిగిన ఉపకారం. నేను అట్లూరి సోదరులతో టంకం వేసినట్టు అతుక్కుపోయాను. సోదరుడు బలరాం. రాయలసీమలో చిన్న పంపిణీదారుడు. ఇద్దరూ మూర్తీభవించిన సహృదయులు. ఆత్మీయులు. కలిసిపోయే అతి మామూలు కమ్మవారు. ఈ మాట రాయాలి. అతిథేయులు.

వారు ఎన్.టీ.ఆర్‌కి చెయ్యని పని లేదు. వారికి ఏం కావలసి వచ్చినా పుండరీకాక్షయ్య, బలరాం పేర్లు నోట్లో పలుకుతాయి. పెన్నులో ఇంకు పొయ్యడం దగ్గర్నుంచి. హైదరాబాదులో బిల్డింగు రెజిస్ట్రేషన్ వరకూ ఏ పని కావాలన్నా పుండరి పేరు ధ్వనిస్తుంది. వారిది అలాంటి బంధుత్వం.

ఒకప్పుడు విజయవాడలో నడిచిన ఎన్.ఏ.టీ. నాటక సంస్థకి ప్రధాన దర్శకులు పుండరీకాక్షయ్య. సెట్టులో ఆయన ఉంటే షాట్ కాగానే ఎన్.టీ.ఆర్ దృష్టి వారి వైపు వెళ్ళడం నాకు తెలుసు. తిరుపతిరావుగారు నిర్మించిన "మహామంత్రి తిమ్మరుసు"ని పుండరీకాక్షయ్య నిర్వహించి ఘన విజయాన్ని సాధించి పెట్టారు. వారికి ప్రస్తుతం ఎన్.టీ.ఆర్ ఒక సినిమా చేసి పెట్టాలి. నిజానికి పుండరీకాక్షయ్య సినిమా తీసే ధనవంతుడు కాడు. ఎన్.టీ.ఆర్ కథని అంగీకరించడం వారికి పెట్టుబడి. ఈ దశలో నేను దొరికాను. "ఆంధ్ర పత్రిక" ఎడిటోరియల్ చెప్తే కథని వటవట వాగే వేగం నాది అప్పటిది. ఇంకా సినీ రంగంలో కథాపరంగా  అడుగుపెట్టలేదని తమరు గ్రహించాలి. ఒకటే చెప్పడం. అలా గుంతకల్లు అంటే బలరాం ఆఫీసు ఉన్న ఇల్లు. వెళ్ళి కూర్చుని కుటుంబం మధ్య ఎన్నో లైన్లు వాగాను. 'వారాలబ్బాయి' అని పేరు పెట్టుకున్న ఒక కథ. పేరే గుర్తులేని ఒక ఏక్షన్ కథ అందరికీ నచ్చింది. మీట నొక్కితే చెప్పే దశకి వచ్చాను. ఒకరు నీళ్ళిచ్చి, ఒకరు కుర్రాడు విసిరి, మంచి భోజనం, నిద్ర, గొప్ప ఆదరణ.. ఇవీ సేవలు. కథ నా దగ్గర నలుగుతోంది. చిలకలాగా వాగుతున్నాను. కథని ఇంకా శంఖంలో పొయ్యలేదు. అంటే ఎన్.టీ.ఆర్‌కి చెప్పలేదు. వారికి చెప్పాలంటే ముందు వారి తమ్ముడు త్రివిక్రమరావుగారికి చెప్పాలట. ఇది 'సాకు' ఏమో! వారు ఆర్ధిక అవసరాల దృష్ట్యా కథను 'దూరం'గా ఉంచే సాధన ఏమో!

కథ మిత్రుల మధ్య తిరుగుతోంది. పెద్దాయనకి చేరలేదాయె. కారణాలు వెయ్యి కావొచ్చు. ఆర్ధిక, రాజకీయ, రకరకాల కారణాల ఎన్నయినా ఉన్నాయేమో. నాకయితే తెలియదు. గిరి రోడ్డులో భాస్కర చిత్ర (పుండరీకాక్షయ్య) ఆఫీసుకు వచ్చిన ప్రతి నిర్మాతా ఆ కథ విన్నారు. అందరికీ నచ్చింది. సాధారణంగా కథలు అందరికీ అలా చెప్పరట. పుండరీకాక్షయ్యగారికి పోయిందేముంది? అలా విన్నవారిలో డి.వి.ఎస్ రాజుగారు, కొసరాజుగారు. విజయా పూర్ణచంద్రరావుగారు. ఎందరో ఎందరో ఉన్నారు. మరిచిపోయారేమో.

విజయా డిస్ట్రీబ్యూటర్స్ పూర్ణచంద్రరావుగారు (అంటే చక్రపాణిగారి మిత్రులు - అభిప్రాయాన్ని చెప్పడంలో అంత సున్నితం) ఈ కథ విన్నారు. ‘బాగుందే!’ అన్నారు. వారి ద్వారా పుండరీకాక్షయ్యగారు ఎన్.టీ.ఆర్.గారికి ఉప్పందించారేమో.

"ఏమా కథ?" అన్నారట అన్నగారు. అంతే! రథం కదిలింది.

ఏదీ కథ? ఏదీ కథ?

నేనప్పుడు శంబల్పూర్(ఒరిస్సా)లో ఉద్యోగం. అంటే కేవలం 1500 మైళ్ల దూరంలో నేనూ, మా ఆవిడా, పిల్లలూ మద్రాసులో ఉన్నాం. తీరా కథ శంబల్పూర్‌లో ఉంది.

రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదువా? రాత్రి ఈ చర్చ. సరాసరి వెంటనే మనిషిని శంబల్పూర్ పంపాలని నిర్ణయించారు. అంతవరకూ చంకలో ఉన్న ఫైలు వద్దని శంబల్పూర్‌లో దుమ్ము పడుతున్న ఫైలు.

ఎవరు వెళ్లాలి. బలరాం కొడుకు బాబు 22 ఏళ్ళు. ఎవరికి శంబల్పూరులో నా ఇల్లు తెలుసు? విశాఖలో ఉన్న మా తమ్ముడు మరో 22 ఏళ్లు? తాళాలు? ఇక్కడ మద్రాసులో అప్పటికప్పుడు 1500 వందల మైళ్ల ప్రయాణం. మధ్యలో మా తమ్ముడు విశాఖలో జాయినింగు, కలిసి ఏ అర్ధరాత్రికో (మూడో నాడు) చేరారు.

ఈ కథకి ఏంటీ క్లైమాక్స్. బాబు బయలుదేరిన మూడోగంటకే మద్రాసు ఫైళ్ళ చెత్తలో 'వారాలబ్బాయి' ఫైల్ దొరికింది. ఎవరికీ చెప్పను మా ఆవిడకి తప్ప. చెప్తే నామోషీ.

ఫైళ్ళ తట్ట శంబల్పూర్ నుంచి రానిచ్చి దానిలో నా ఫైలు కలిపాను. ఇప్పుడు మంచినీరే తీర్థమయింది. 'వారాలబ్బాయి' పట్టాలెక్కాడు.

ఇప్పటికింతే కథ.

Bio

గొల్లపూడి మారుతీ రావు

గొల్లపూడి మారుతీ రావు గారి పేరు తెలియని తెలుగు వారు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. గొల్లపూడి మారుతీరావు గారు సుప్రసిద్ధ రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి.  తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను నటుడిగానూ సుపరిచితులు. శతాధిక నాటకాలు, కథలు, నవలలు, వ్యాసాలు, కవితలూ రాశారు.  రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషను డైరెక్టరుగానూ, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉపసంపాదకుడిగానూ పనిచేశారు. సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన డాక్టర్ చక్రవర్తి కి ఉత్తమ రచయితగా నంది అవార్డుతో బాటు మరో మూడు నందులు అందుకున్నారు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి. విజయనగరంలో జన్మించిన మారుతీ రావు గారి ప్రస్తుత నివాసం విశాఖపట్నం. ప్రపంచవ్యాప్తంగా శతాధిక పురస్కారాలు అందుకున్నారు.

***

bottom of page