top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

“దీప్తి” ముచ్చట్లు

గమ్మీ టైం- కెమెరామన్ బన్నీ తో మా గమ్మీ!

Deepthi Pendyala, madhuravani, Deepthi Pendyala madhuravani

దీప్తి పెండ్యాల

"పాత్రికేయ రత్న" అవార్డు గ్రహీత కుమారి.గాలి గమిత కి అభినందనలు!

ఓ ఫైన్ వీకెండ్ పొద్దునే 'అవార్డులపంపకమ్స్ ' సంస్థ ట్యాగ్ చేసిన మా గమిత ఫోటోని ఫేస్బుక్ లో చూడగానే ఆశ్చర్యం! దాంతో పాటే ఆనందం.

చిన్నప్పుడు హైస్కూల్ లో గమిత గాలి వార్తలు తెచ్చి మమ్మల్నదరినీ ఎపుడూ ఏదో రకంగా వినోదపరిచేది. ముద్దుగా గమ్మీ అని పిలిచేవారిమి. చూయింగ్ గం లా  సా...గ...తీసి మరీ మా గమ్మీ చెప్పే విశేషాలు ఎప్పటికప్పుడు మాకు వింతే. ఒక్కోసారి నవ్వేవారిమి. ఒక్కోసారి చీకాకు పడేవారిమి. ఒక్కోసారి కొన్ని గాసిప్ వార్తలు విన్నాక దానితో జీవితంలో మళ్ళీ మాట్లాడకూడదనుకున్నప్పటికీ, ఆ జీవితకాలం రెండు, మూడ్రోజులకి మించేది కాదు. మరి, తను తీసుకొచ్చే వార్తలలా సరదాగా ఉండేవి. అబద్ధాలో, అతిశయోక్తులో అని తెలిసినా...అదో వినోదం. అంతే.

కానీ, అలాంటి గమితే ఇలా ప్రయోజకురాలయ్యి విజువల్ మీడియాలో ఇంత గొప్ప పేరు తెచ్చుకుంటుందని ఏ రోజూ ఊహించలేదసలా!

అసలు దాని ఫేస్ బుక్ ఫాలోవర్స్ ని చూస్తే నాకు తగని ఆశ్చర్యం. ఆ ఫాలోవర్లూ, తుమ్ముతూ పెట్టిన ఫోటోనీ పదిమందితో "షేర్" చేసుకునే భక్తులూ, "గమ్మీ టైం" అంటూ ఓ హాష్-ట్యాగూ, దాని పేరిట పోష్టే ప్రతీ వాక్యమూ మూడువేల కామెంట్లు, ఆరున్నరవేల లైకులతో దివ్యంగా వెలుగుతుందసలు!

దేశం కాని దేశం వచ్చి పడి భారతాన బొత్తిగా ఏం జరుగుతుందో బొటాబొటిగా తప్ప తెలీకున్నా, ఈ ఫేస్బుక్, వాట్సప్ పుణ్యమాని అందరూ నా వేలి టచ్ దూరంలో టచ్ లో ఉన్నారు.  కనుక, గమ్మీ ఎంత పాపులరో తెలుస్తూనే ఉంది. అడపా దడపా గర్వపడుతూనే ఉన్నాను. నాకసలే దూరదర్శన్ రోజుల్నించీ పాత్రికేయ వృత్తి అంటే గౌరవమూ, అభిమానమూనూ! ప్రజాస్వామ్యానికి ‘కనిపించే’ నాలుగో స్థంభం కదూ మీడియా?!  మరి అలాంటి మీడియాలో నా స్నేహితురాలు పేరు తెచ్చుకుంటూంటే సంబరం కాక మరేమిటీ?

ఆ సంబరం వల్లే,  ఈ అవార్డేదో వచ్చిందని తెలీగానే,  పన్నెండు వరకల్లా పనులు ముగించేసి, ఆపై తీరిగ్గా… అభినందించేందుకని గమ్మీకి ఫోన్ చేసాను. ఒక్క రింగయినా అయిందో, లేదో...  ఫోన్ తీసి గబగబా ఏదో చెప్పింది. గుసగుసగా. ఏదో ఆపరేషన్ లో ఉందనీ, చెట్టు తొర్రలో కూర్చుని ఉందనీ, సిగ్నల్ లేదనీ, పని అవగానే  చేస్తానంటుందనీ అస్పష్టంగా అర్థమయింది.

"ఓ! సరే, మళ్ళీ మాట్లాడుదాము" అంటూ అంతకన్నా గుసగుసగా చెప్పి, చటుక్కున పెట్టేసాను.

టైం చూస్తే వాళ్ళకి దాదాపుగా అర్ధరాత్రి. ‘భలే! నా స్నేహితురాలు ఏదో రహస్య ఆపరేషన్ మీదుంది. బహుశా, ఎన్నో వేల కోట్ల స్కాం లాంటిదో బయటపెట్టి, దేశప్రజలనందర్నీ అప్రమత్తం చేస్తుంది. అక్కడ తెల్లవారుతూనే, జనాలని చీకట్లోంచి వెలుతురులోకి తెస్తుంది. దేశానికి కావాల్సింది ఇలాంటి వారే కదూ! అదీ నా స్నేహితురాలు!’ గర్వంగా అనుకు న్నాను.

ఠంచనుగా 24 గంటల తర్వాత ఫోన్ వచ్చింది. డిష్ వాషర్ అప్పుడే లోడ్ చేసానేమో, ఆ సౌండు, దాని గొంతు సౌండు ఒకే వేవ్ లెంత్ లో ఉన్నా... రెండూ కలుస్తూన్నపుడు చెవులెందుకో ఇబ్బంది పడుతూండటంతో,  అలా, ఇంటి వెనుకాలకి, ఆరుబయటకి వెళ్ళి మాట్లాడాను.

గమ్మీ చాలా సంతోషంగా వినబడింది.

"హేయ్ దివ్యా! తెలుగు చానల్సేమయినా చూస్తున్నావా?! నిన్నటి "ఆపరేషన్ కుమ్మక్"  మీడియాలో పేద్ద సంచలనం అయింది తెలుసా? ఎన్నో నెలలుగా సేకరిస్తున్న ఇన్ఫర్మేషన్ సహాయంతో పకడ్బందీ స్కెచ్ వేసి మరీ ఆధారాలతో సహా పట్టుకున్నందుకు  తెలుగు రాష్ట్రాల్లో అంచనాలు మించి మరీ సంచలనం సృష్టించిందనుకో. క్రెడిట్ అంతా నాదే. ప్రతీ చానల్ లో అదే న్యూస్, తెలుసా. మా ఛానల్ టీ.ఆర్.పీ లన్నీ అమాంతంగా పెరిగిపోయాయి!" గలగలా చెప్తూన్న గమ్మీ ఉత్సాహం తన గొంతు దాటి, ఫోన్ దాటి, ఆ వైబ్రేషన్ నా చెవులని స్పష్టంగా చేరుతుంది. నేనూ ఆ ఉత్సాహాన్ని సంతోషంగా అందుకుంటున్నాను.

అంతలో- "నీకక్కడ తెలుగు చానల్స్ వస్తాయో, లేదో?  యూట్యూబ్ లింక్స్ పంపుతున్నాను చూడు." అంది.

నాకూ ఆసక్తిగా ఉంది. సంచలనం సృష్టించిన వార్త చూడాలని.

“చానళ్ళు రాకేం? ఓ యాప్ ఉంటే అన్నీ వస్తాయి కానీ, లింక్స్ పంపేయ్. మరింత ఈజీగా చూసేయొచ్చు.” అనేసి, మరోసారి అభినందించి ఫోన్ పెట్టేసాను.

కార్గిల్ యుద్ధసమయాన, శత్రుసైనికుల ఉనికికి వెరువకుండా యుద్ధరంగంలో కలియతిరుగుతూ క్షతగాత్రులైన మన సైనికుల వివరాలని, అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు మనకు కళ్ళకి కట్టిన బార్ఖా దత్ ని నా స్నేహితురాలిలో ఊహించుకుని ఆనందపడ్డాను.

ఆరుబయటున్నాను కనుక, అనుకోకుండా  లాన్ స్ప్రింక్లర్ నుంచి పడిన జల్లు సరిగ్గా కంటికింద పడింది.  అచ్చు గుమ్మడి గారు ఆనందభాష్పాలు తుడుచుకున్నాట్టే నేనూ కళ్ళు తుడుచుకున్నాను. యాధృచ్చిక భాష్పాలలా నేనున్న సన్నివేశానికి బలం చేకూర్చాయి.

 అంతలోపే వాట్సప్ లో గమ్మీ పంపిన లింక్స్ చేరాయి.

వరుసగా యూట్యూబ్ లింక్స్. అన్ని చానళ్ళ లింక్స్.

గూగుల్, మీడియానీ తినబోతుందన్నమాట!

ఒక లింక్ తెరిచాను.

‘సంచలనం సృష్టించిన ఎక్స్ క్లూజివ్ వీడియో’ అంటూ ఓ వీడియో మొదలయింది. అర్ధరాత్రి కదా. సరిగ్గా వెలుతురు లేదేమో, సీక్రేట్ ఆపరేషన్ కనుక ఫోకస్ లైట్లూ లేవేమో, ఏదీ సరిగ్గా కనబడట్లేదు.

అంతా చీకటి.

అంతలో ఓ కారు వచ్చి ఆగింది.

కారులోంచి ఓ మనిషి దిగినట్టు కనబడుతుంది.

కారులో వ్యక్తి విండో గ్లాస్ తీసాడు. అస్పష్టమయినా నేను పోల్చుకోగలిగాను.

కారులో వ్యక్తి బై చెప్పినట్టున్నాడు. దిగిన వ్యక్తి కూడా బై చెప్పాడు.

కారు సర్రున దూసుకుపోయింది.

దిగిన వ్యక్తి ఇంట్లోకి వెళ్ళేందుకు గేట్ తెరిచాడు.

నాలో ఉత్సుకత! ఇపుడీ వ్యక్తి ద్వారా ఏ కుంభకోణం, ఏ ఆయుధాలు సరఫరా చేసే ముఠా బయటపడనుందో? 'షాడో' మధుబాబు గారి సీరియల్ దృశ్యరూపంలో చూస్తూన్న ఉద్విగ్నత నాలో! తరువాయి సీన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

అంతే!!!  వీడియో ఆగిపోయింది !!!

మళ్ళీ మొదట్నించీ మొదలయింది. వెనుకే వాయిస్ ఓవర్ కూడా ఇంచుమించు అక్కడ ఆ వ్యక్తి కార్ దిగి బై చెప్పడాన్ని మళ్ళీ, మళ్ళీ వివరిస్తుంది. వార్త ముందుకెళ్ళదే? విసుగొచ్చింది. “అవును. అయితే ఏంటట? కార్ లో వచ్చిన వ్యక్తి దిగకుండా ఉంటాడా? బై చెప్పకుండా ఉంటాడా? అసలు విషయం వదిలి, ఇంట్రో ఇంతసేపా? సో డిజప్పాయింటింగ్, యు నో!" ఉద్విగ్నత గొణిగింది.

అంతలో "రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన అధికారులు" అంటూ మళ్ళీ అదే మాట. అపుడర్థమయింది. వాళ్ళిద్దరూ అదేదో  శాఖలో ఉన్నతాధికారులని. అక్కడితో ఉద్విగ్నత పారిపోయింది. ఆసక్తి కి ఓపికెక్కువ. ఇంకాసేపు చూద్దామనుకుంది.

అప్పుడు గమనించాను. “బై, బై” చెబుతున్న చేతిని రెడ్ సర్కిల్ లో మార్క్ చేసారు.

"హయ్యో! వీడియో ఎడిటింగ్ సాఫ్టువేరుతో చేతికి రెడ్ సర్కిల్ చుట్టగానే దాన్ని-రెడ్ హ్యాండెడ్ అనకూడదమ్మా తింగరబుచ్చీ!" హావభావాలతో వర్ణిస్తున్న న్యూస్ యాంకర్ ని చూసి నవ్వుకున్నాను.

ఎందుకో అనుకోకుండా మా చిన్నప్పటి దూరదర్శన్ న్యూస్ రీడర్ గుర్తొచ్చారు. ఆయన గొంతులో భావం తప్ప, మొహంలో ఏ హావభావాలు కనబడేవి కాదు. హుందాగా వార్తలు చదువుతూ, విషాద వార్తలకి కాస్త డల్ గానూ, మంచివార్తలకి కాస్త నవ్వుమొహంతోనూ… అలా… అతి చిన్న వేరియేషన్ చూపించేవారు. రంగస్థల నటులు కాదుగా. అభినయానికి ప్రాధాన్యత ఇవ్వటానికి? ఆ రోజుల్లో న్యూస్ బులెటిన్ అంటే- ప్రాధాన్యత కేవలం వార్తకే. వార్తలోని విషయానికే.

మరిపుడేంటీ?  విషయం అర్థం కాకుండా కేవలం ఓ లాంగ్ షాట్ క్లిప్పింగ్ చూపించి అర్ధగంట పాటు ఒకే మాటని రకరకాల హావభావ అభినయ విన్యాసాలతో చెప్తారే? పైగా, వెనకాల బ్యాక్గ్రౌండ్ లో గుండెలు దడదడేలా,  అదరగొట్టేంత పెద్ద సౌండుతో, మ్యూజిక్! ఈ హంగామా ఎందుకో అర్థమవలా.

లింక్ ఏమయినా కరప్టయిదేమోనని మరో లింక్ ఓపెన్ చేసాను. అందులోనూ అదే వీడియో. సరిగ్గా అంతవరకే! ఆ అధికారులెవరో అర్థమవుతుంది కానీ, దేనికి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారో ఆ విషయం చెప్పరే? అవినీతి? అక్రమాలు? కుంభకోణాలు? ఎందుకు స్కెచ్ వేసారో చెప్పరే?

కొన్ని చానళ్ళలో డిబేట్లు నిర్వహించారు. వరుసగా అన్ని వీడియోలు చూసిన పిమ్మట నాకు అర్థమయిన విషయం- ఈ అధికారులిద్దరూ ఏదో చిల్లర కేసులో కుమ్మక్కయ్యారని గిట్టనివారెవరో ఆరోపించారట. మా గమ్మీ వాళ్ళ చానల్ వారు ఆ కేసేంటో, ఈ వార్తేంటో, నిజానిజాలెంతో- ఏదీ విచారించకుండా... ఈ "ఆపరేషన్ కుమ్మక్" కి ఇంచార్జ్ గా గమ్మీని నియమించి పంపారట. ఆ ఆపరేషన్ లో భాగంగా ప్రతీ రోజు, అధికారి ఇంటికొచ్చే సమయంలో గమ్మీ, ఒక అసిస్టెంట్ చెట్టు తొర్రలో కనబడకుండా కూర్చుని గమనిస్తున్నారట.  నిన్నటిరోజు అధికారులిద్దరూ రాత్రిపూట విధులనించీ తిరిగొస్తూ కలిసి రావటం, బై చెప్పటం  వాళ్ళపై ఆరోపణకి  తిరుగులేని ఆధారాలుగా భావించుకుని ఆ వార్త ప్రసారం చేస్తున్నారట.

ఒకే డిపార్టుమెంటట. పరిచయముండటము సహజమేగా? ఇపుడు కొత్తగా ఈ ఆపరేషన్ ఇచ్చిన సమాచారమేముందీ? అయోమయంగా ఓ డిబేటుని ఐదునిమిషాలు చూడగలిగాను.

 బై చెప్పే వీడియో ఆధారంగా వీరిద్దరికీ పరిచయముందని తేలింది కనుక కుమ్మక్కయుండటమూ నిజమే అయుండాలని పెద్దతలకాయలందరూ కూర్చుని విశ్లేషిస్తున్నారు. “సరిపోయింది. పరిచయముందని తేల్చటానికే ఐతే ఈ అర్ధరాత్రి గస్తీలెందుకు? చెట్టుతొర్రల్లో కాపుకాయటమెందుకు?  డిపార్టుమెంట్లో ఏ ఉద్యోగినడిగినా చెప్పగలిగేసమాచారమేగా?” ఆసక్తి అసహనంగా విసుక్కుంది.

ఇది వార్తా? దీనికి ఛానల్సన్నీ ఇంత విలువయిన సమయం కేటాయించాలా? న్యూసా? న్యూసెన్సా?

 ఇంతకన్నా, మా గమ్మీ చిన్నప్పుడు చెప్పే విశేషాల్లో ఎంతో కొంత వార్తావిషయమంటూ ఉండేది కదూ?

'వార్తలు చూసేవారు మరీ లోకువయిపోయారబ్బా!' అని గొణుక్కుంటూనే, గమ్మీ కొత్తగా పంపిన మరో కొత్త లింక్ ఓపెన్ చేసాను. పాత్రికేయ అవార్డు తెచ్చిపెట్టిందీ వీడియోనేనట. ఎక్కడో మిణుకు మిణుకుమంటున్న ఆశ ఆ వీడియోని చూడమంది. ఈసారి బార్ఖాదత్  పాకిస్తాన్ లోనో, ఇరాక్ లోనో కెమెరా పట్టుకుని తిరుగుతూ మనోఫలకంపై తళుక్కుమంది. ఆ స్మృతి భద్రంగా దాచేసి, లింకుని ఒక్క క్లిక్కు నొక్కాను. "జై పాత్రికేయ రత్న" అనుకుంటూ!

ఇందులో మా గమ్మీనే ప్రెజెంటర్. కెమెరామన్ బన్నీ తో మా గమ్మీ!

తెరిచిఉన్న బోరుబావిలో ఓ చిన్నారి అసలెలా పడిపోయిందో, ఎలా రక్షించబడిందో డెమో ఇస్తుంది. సంతోషించాను. అవేర్ నెస్ ప్రోగ్రామన్నమాట. భలే!  గమ్మీ మాట్లాడుతూ, మాట్లాడుతూ పక్కనే తెరిచి ఉన్న మ్యాన్ హోల్ లో చటుక్కున పడిపోయింది. కంగారు పడ్డాను.  ఆక్సిడెంటల్ గా అనుకున్నాను. గమ్మీ “పాత్రికేయ పాత్రత”పై ఆశలన్నీ ఆరిపోయి, అణగారిపోయేలా వగరు నిజం తెలిసింది. నేననుకున్నట్టు ఆక్సిడెంట్ ఏ మాత్రం కాదట. ఈ మధ్య ఇదే ట్రెండట. బాత్ టబ్బుల్లో పడుకొని మునగటమెలా అని చూపటం, ఆక్సిడెంటయితే కారుని ఓ గుద్దు గుద్దుకుని ప్రత్యక్షంగా మనకి ఆ ప్రమాదతీవ్రతని కళ్ళకి కట్టటం...అబ్బో, ఇలా చెప్తూపోతే చాలా చాలా ఉన్నాయట.  ఇదేనట ట్రెండ్.

లాన్ స్ప్రింక్లర్లలోంచి జల్లు మళ్ళీ నా మొహంపై పడ్డాయి. అవే నీళ్ళు, సన్నివేశానికి బలం చేకూర్చటమూ జరిగింది కానీ...  సన్నివేశమే... మారింది!  ఇందాకట్లా గుమ్మడిగారిని కాకుండా, ఈ సారి బిగ్ బాస్ పార్టిసిపెంటుని అనుకరించాను. కళ్ళు తుడుచుకోవడంలో!

ఇంకా నయం, వీళ్ళకి అంతిమసంస్కారాల రిపోర్టింగ్ డ్యూటీ ఇవ్వట్లేదు. ఇస్తే, చచ్చూరుకోవటమే... వాళ్ళేనా?! చూడలేక మనమూ!

***

Tags Deepthi Pendyala madhuravani telugu magazine  Deepthi MuchaTlu  madhuravani January 2018

bottom of page