top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

అదన్నమాట సంగతి

ఇస్తినమ్మ వాయినమ్మ... పుచ్చుకుంటి వాయినం!

Jyothi Valaboju

జ్యోతి వలబోజు

కామాక్షి మండిపోతూ వచ్చి చేతిలో కవర్ పక్కన పడేసి మంచం మీద కూలబడింది. లోపలికి వచ్చిన రమేష్ ఫాన్ వేసాడు. అయినా కూడా కామాక్షి చాలా కోపంగా, బుసలు కొడుతున్నట్టుగా అనిపించింది. భయపడుతూనే “కాముడూ.. ఏంటలా ఉన్నావు. బయట ఎండలు కూడా అంతగా లేవే. ఎంచక్కా ఎ.సి హాల్లోనే పెళ్లికి వెళ్లొచ్చావు కదా.”  అని అడిగాడు.

“మీకు తెలుసా? ఆ లత ఎంత ఘనంగా తన కొడుకు  పెళ్లి చేసింది. రిటర్న్ గిఫ్ట్ గా ఈ స్టీలు టిఫిన్ బాక్సు ఇచ్చింది. మనబ్బాయి పెళ్లికి నేను అందరు ముత్తయిదువులకు వెండి కుంకుమభరిణలు ఇచ్చానా? మరీ ఇంత కక్కుర్తేంటసలు? ఇంత కష్టపడి  వెళ్లిన ఫలితమేంటి?  వాళ్ల పెళ్లిరోజు అని పిలిస్తే ఇద్దరికీ బట్టలు పెట్టానా? మన యానివర్సరీ అని సత్యనారాయణవ్రతానికి పిలిస్తే కొబ్బరికాయ,  పళ్లు, పసుపు కుంకుమ మాత్రం తీసుకొచ్చింది.” అంటూ కోపంగా మాట్లాడసాగింది.

అక్కడుంటే తను కూడా బలి కాక తప్పదని మెల్లిగా జారుకున్నాడు రమేష్.

కట్ చేస్తే...

 ఈరోజుల్లో  ఏ చిన్న ఫంక్షన్ అయినా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం చాలా ముఖ్యం.  వచ్చినవాళ్లందరూ సుబ్బరంగా భోంచేసి  బహుమతులు ఇవ్వకున్నా పట్టించుకోరు కాని  భోజనాలకు ముందో చివర్లోనో రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇవ్వాలండోయ్. అదికూడా వారి తాహతుకు తగినట్టుగా. లేకుంటే అందర్లో నామోషీ కాదూ.

బహుమతులు అందుకోవడం భలే సరదాగా ఉంటుంది కదా.   సందర్భాన్ని బట్టి బహుమతులు వస్తాయి. కాని అందులో కూడా చాలా చాలా బహుమతులు మనకు అవసరం ఉండవు. ఏదైనా సందర్భంలో  బహుమతులు వస్తే అవి అందుకోగానే ఎప్పుడెప్పుడు ప్యాకింగ్ విప్పి లోపల ఏముందో చూద్దామా అని ఇంట్లోవాళ్లు అందరికీ ఆత్రుతగా ఉంటుంది.   ఒక్కో గిఫ్ట్ పైన పేరు చూసుకుని పేపరు విప్పి దానిలోపల బాక్సు తీసి  అందులో ఎముందా అని తహతహ.. మనకు నచ్చినవి, ఇంట్లోకి అవసరమైనవి ఉంటే పర్లేదు. కాని ఒకటే రకం బహుమతి కాని, పనికిరానివి వాళ్లకు వచ్చిన బహుమతిని మళ్లీ మనకు పంపిణీ చేసారని (ఆ విషయం అలా తెలిసిపోతుందంతే) ఎంత తిట్టుకుంటామో. అప్పటికప్పుడే వాటిని ఎవరికైనా ఇచ్చేయడం లేదా వేరేవాళ్లకు ఇచ్చేయొచ్చులే అని పక్కన పెట్టడం జరుగుతుంది.  ఎన్నని ఇంట్లో పెడతాం చెప్పండి.  ఈ బహుమతుల  ప్రహసనం  పెళ్లిళ్లు లాంటి పెద్ద ఫంక్షన్ లలో తప్పకుండా  ఉంటుంది. మనకు బహుమతులు వస్తే  చూసుకోవడం చాలా బావుంటుంది.. కాని మనం వేరేవాళ్లకు బహుమతి ఇవ్వాలంటే మాత్రం చచ్చేంత విసుగొస్తుంది. ఇక అవతలివాళ్లకు ఎలాటి గిఫ్ట్ నచ్చుతుందో తెలీదు.   మన బడ్జెట్ లో వాళ్లకు నచ్చే బహుమతి కొనగలమో లేదో, కొనడానికి ఎక్కెక్కడ తిరగాలో తెలీదు.

 నచ్చుతుందేమో అని కొన్న తర్వాత ప్యాకింగ్ చేయడం ఓ పెద్ద పని.. లోపల చిన్న చెంచా ఉన్నా, కుంకుమ భరిణ  ఉన్నా దాన్ని అందంగా ప్యాక్ చేయాలి.. ఇక పెళ్లి లో రాధాకృష్ణులు, గడియారాలు, మగ్గులు, ప్రేమపక్షుల బొమ్మలు కుప్పలుగా వస్తాయి.. ఏంటోమరి.. ఇస్తే ఒక తంటా , ఇవ్వకుంటే మరో తంటా. స్నేహితులకు బహుమతులు ఇవ్వడం చాలా సులువు.  మంచి పుస్తకాలు కాని, గిఫ్ట్ కార్డుకాని,  ఆర్ట్ పీసెస్ కాని, ఇంకేవైనా వాళ్లకు నచ్చుతాయి అనిపించినవి ఇవ్వొచ్చు  కాని ఈ బందువులు ఉన్నారే..చూసి ఇవ్వాలి. లేదంటే తర్వాత ఏ పెళ్లిలో కలిసినా మనముందే ఇతర బంధువులతో ఫలానావాళ్లు ఇలాటి గిఫ్టు ఇచ్చారు. ఎందుకు పనికొస్తుంది . అది ఏం చేసుకోవాలి. కాస్త ఇంట్లోకి పనికొచ్చే వస్తువన్నా ఇవ్వాలని తెలీదా అని ఉతికి ఆరేస్తారు. ఆ మాట అలా అలా చుట్టాల్లో దాదాపు అందరికీ చేరిపోతుంది.  ఇస్తీనమ్మ వాయినం పుచ్చుకుంటి వాయినం అన్నట్టు నాకెంత పెడితే నీకంతే ధరలో బహుమతి ఇస్తా అంటారు..ఇచ్చి కొట్టించుకోవడం అంటే ఇదే మరి.  ఈ గొడవలంతా ఎందుకని   చాలామంది సింపుల్ గా   డబ్బులు కవర్ లో పెట్టి ఇచ్చేసి హమ్మయ్యా అనుకుంటున్నారు.  ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. పెళ్లిలో డబ్బులతో వచ్చిన కవర్లలోని సొమ్ములను జాగ్రత్తగా వారి పేరుతో ఒక పుస్తకంలోరాసి పెట్టుకుని మళ్లీ వాళ్ల ఇంట్లో పెళ్లికి వెళ్లినప్పుడు వాళ్లు ఎంత ఇచ్చారో మన పుస్తకంలో చూసుకుని ఒక్క పైసా కూడా ఎక్కువ కాకుండా అంతే ఇవ్వడం. ఎందుకంటే ఇచ్చినవాళ్లకి తప్పకుండా గుర్తుంటుంది ఫలానావారికి ఎన్ని రూపాయిలు కవర్లో పెట్టి ఇచ్చామో.

ఈ మధ్య ఏ  ఫంక్షన్ అయినా వచ్చినవారికి రిటర్న్ గిఫ్టులు ఇవ్వడం ఆనవాయితీగా మారుతోంది. ఇంతకుముందైతే వచ్చిన ముత్తయిదువులకు  బొట్టు పెట్టి తాంబూలం లేదా జాకెట్టు ముక్క ఒక పండు పెట్టేవారు. ఇప్పుడలా చేయడం నామోషీగా ఫీలవుతున్నారు. అయ్యో ఏదైనా ఐటెమ్ ఇవ్వాలి , ఇవ్వకుంటే ఎలా అని  ఈ రిటర్న్ గిఫ్టులకోసం తప్పనిసరిగా  ఖర్చు  పెట్టక తప్పడం లేదు.  ఇక పెళ్లిళ్ల సీజన్ లో అయితే పండగే. ఓ అయిదారు పెళ్లిల్లు తిరిగితే కనీసం అయిదు రిటర్న్ గిఫ్టులు తప్పనిసరిగా  లభిస్తాయి. భలే ఉంటుంది కదా.    వారి వారి తాహతును బట్టి ఈ గిఫ్టుల ఎంపిక ఉంటుంది.

పెళ్లిళ్లలో ఇరువైపు కూడా కొందరు బంధువులకు పెట్టుబడిగా బట్టలు లేదా చీరలు  పెట్టక తప్పదు. ఇందులో కూడా లెవెల్స్ ఉంటాయి. అంటే ఫలానావారికి ఫలానా ధరలో చీర అంటూ వేర్వేరు ధరల్లో చీరలు కొంటారు.  బహుమతి ఇవ్వాలనుకున్నప్పుడు అందరికీ సమానంగా ఇవ్వాలి కాని అది మాత్రం జరగదు.

గిఫ్ట్ లేదా బహుమతి ఇవ్వడంకంటే తీసుకోవడం చాలామందికి ఇష్టం.. మన డబ్బులతో మనకు నచ్చినవి కొనుక్కోవచ్చు కాని అదే వస్తువు వేరొకరు బహుమతిగా ఇస్తే అదో తుత్తి. చిన్నప్పుడు ప్రతీ పుట్టినరోజునాడు అమ్మ నాన్న ఇచ్చే డ్రెస్సులు, పెన్నులు, బొమ్మలు, సైకిల్ లేదా ఆట వస్తువుల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసేవాళ్లం . అలా మనకంటూ ప్రత్యేకంగా పేరు పెట్టి ఏదో ఒక వస్తువు ఇస్తే తీసుకోవడం ఎవరికి మాత్రం ఇష్టముండదు. అది నాది, ఎవరికీ ఇవ్వను అనే అధికారం ఉంటుంది. పెద్దవుతున్నకొద్దీ అందరి ఇష్టాలు మారుతుంటాయి.  ఆ ఇష్టాలు ఎవరు గమనిస్తారు.  ఏ సందర్భం లేకుండా ఎవరూ  ఎవరికీ బహుమతి ఇవ్వరు . ఇచ్చే అలవాటు కూడా అందరికి ఉండదు కదా.. బహుమతులకోసం పుట్టినరోజులు, పెళ్లి వగైరా జరపలేం కదా. ఇంతకుముందు కొద్దిపాటి సొమ్ముతో ఏదో ఒక వస్తువు కొని పాకింగ్ చేసి బహుమతిగా ఇచ్చే వీలుండేది. ఇప్పుడలా కాదు. కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి అన్నట్టుంది.

కాని మీకు బాగా నచ్చిన, నచ్చే వస్తువులు బహుమతిగా వస్తే ఎలాగుంటుంది. అడగకముందే, అసలు కావాలనే ఆలోచన రాకుండానే మనకు ప్రియమైన వ్యక్తులనుండి ఇలాటి అపురూపమైన బహుమతి వచ్చినప్పుడు కలిగే ఆనందం అలవికానిది. ఏ కొలమానం లేనిది. అది ఖరీదైనదే కానక్కరలేదు. పది రూపాయిల పూవులైనా పదిలక్షల విలువైన ఆనందాన్నిస్తాయి. అసలు మనం బహుమతి ఇవ్వాలంటే అవతలి వ్యక్తి అభిరుచులు, ఇష్టాయిష్టాలు తెలుసుకుని ఇస్తే అది ఎప్పటికి గుర్తుంటుంది. వాళ్లదగ్గరే పదిలంగా ఉంటుంది.. ఒక బంగారు గొలుసు ఇవ్వలేని ఆనందాన్ని ఒక చిన్న కార్డు అందులో రెండు మాటలు ఇస్తాయి. ఎందుకంటే అవి అవసరానికో, మొహమాటానికో చెప్పేవి కావు. మనసునుండి వచ్చిన మాటలు అవతలి వ్యక్తికి నేరుగా అందుతాయి.. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఎప్పటికి మరువలేనిది అవుతుంది. అందుకే ఎవరికైనా బహుమతి ఇవ్వాలనుకుంటే ఆలోచించి ఇవ్వండి. మనీతో కాకుండా మనసుతో ఆస్వాదించేది.. అనుభవించేదిగా ఉండాలి.. ( బంధువులైతే మాత్రం జాగ్రత్తండోయ్. ఇలాటివన్నీ వాళ్లకు నచ్చవు. ఎంచక్కా నోట్లు లేదా వస్తువు ఇవ్వండి. ప్రశాంతంగా ఉండండి)

మనకు ఇష్టమైనవారికి  బహుమతి ఇవ్వడానికి ఒక సమయం , సంధర్భం అవసరం లేదు. ఎప్పుడైనా ఏదైనా ఇచ్చి పుచ్చుకోవచ్చు.  అందుకే ఆలోచించి ఆ వ్యక్తికి నచ్చే బహుమతి వెతికి ఇవ్వడంలోని ఆనందమే వేరు. అలా అందుకున్న బహుమతి కూడా ఎంతో అఫురూపం. ఇటువంటి వాటికి వెల కట్టడం ఎవరి తరమూ కాదు.

o o o

bottom of page