
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
పుస్తక పరిచయాలు
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
నిర్వహణ: శాయి రాచకొండ | శ్రీనివాస్ పెండ్యాల
పుస్తక విశ్లేషణ
మేము ఎంపిక చేసుకున్న కొన్ని మంచి గ్రంధాలు ఈ ‘పుస్తక పరిచయాలు’ శీర్షికలో విశ్లేషించబడతాయి. కేవలం మా ప్రత్యేక వ్యక్తిగత ఆహ్వానం మేరకే పుస్తకాలు స్వీకరించబడతాయి.
సంక్షిప్త పుస్తక పరిచయం
పుస్తక రచయితలకి ఉచితంగా ప్రచారం కలిగించడంకోసం మరియు పాఠకులకి కొత్త పుస్తకాల అందుబాటు గురించి క్లుప్తంగా పరిచయం చేయుట కొరకు "సంక్షిప్త పుస్తక పరిచయం" శీర్షిక ఉద్ధేశ్యింపబడింది. ఈ శీర్షిక లో తమ సరికొత్త గ్రంధాలని పరిచయం చెయ్యదల్చుకున్న వారు, ప్రచురించబడ్డ కొత్త పుస్తకాల ముఖ చిత్రం (స్కాన్ చేసిన ఫ్రంట్ కవర్), రచయిత వివరాలు, పుస్తకం గురించి ఐదు వాక్యాలు మించకుండా సంక్షిప్త సమీక్ష, కొనుగోలు వివరాలు మాకు పంపగలరు.
పంపించవలసిన చిరునామా:
సంక్షిప్త పుస్తక పరిచయం విషయాలలో అంతిమ నిర్ణయం మధురవాణి నిర్వాహకులదే.




విన్నకోట రవిశంకర్ గారు రాసిన కవితా సంపుటి ‘రెండో పాత్ర’. సంపుటిలో ముప్ఫైఆరు కవితలున్నాయి. గబగబా చదివేస్తే ఓ గంటకంటే పట్టదు. కానీ పుస్తకం చివరలో వేల్చేరు నారాయణరావు గారు చెప్పినట్లు మనసులో చేసే చప్పుళ్ళను వింటూ, నెమ్మదిగా చదవాలి. అప్పుడే రవిశంకర్ అతి సున్నితంగా మనముందుంచిన ఆలోచనలని మనసులో మనంకూడా భావించగలుగుతాం. “ఏ మాటా గట్టిగా అనకండి, మాటలు నలిగి పోతాయి. ఒత్తి పలక్కండి. మాటలు మాసిపోతాయి”. అన్న ఆయన మాటలు అక్షరాలా నిజం.
అతి సామాన్యమయిన విషయాల్లో అతి సున్నితమయిన భావ వ్యక్తీకరణ రవిశంకర్ కి సహజసిద్ధంగా వచ్చిన వరం. రవికాంచనిచో... అన్న నానుడి రవిశంకర్ కి వర్తించదు - రవి కవి చూడ గలిగిన లోతులు చదివిన ప్రతి మనసుకీ తాకక మానవు. ‘రెండో పాత్ర’ కవిత చదవంగానే ఎవరైనా ఒక సారి ఆగక తప్పదు. “పగలంతా పాల వాసన వెంట పరుగులెత్తిన ఈమె సగం రాత్రివేళ పారిజాతమై పరిమళిస్తుంది” అన్న మాటలు ఒక స్త్రీ పట్ల అవగాహనను గుర్తు చేసినా ఎవరికి వారు అనుభవించవలసిన భావమది. అనురాగం, అపరాధ భావన, ఏదో మనసుని ఒక్క సారిగా కదిలిస్తుంది.
‘గొడుగు’ అన్న కవితలో గొడుగు నాన్నగారికి సంకేతం. “ఆయన విడిచి వెళ్ళిన గొడుగుని బహుశా మేమెవ్వరమూ తెరవం. విప్పిచెప్పని ఆయన అంతరంగంలా ఆ గొడుగు ముడుచుకునే ఉంటుంది” అని అంటారు. చదివిన తరువాత నాన్నగారు గుర్తు రాని వారుంటారా?
సాయంత్రం పూట ప్రకృతిలోని ప్రతి వస్తువునూ పలకరిస్తూ, ఆప్యాయంగా అక్కున చేర్చుకుని ముద్దుపెట్టుకుంటూ నడుస్తూంటే ఆ ‘నడక’ని ఏమనాలి? “గుబురు గుబుర్లలో పక్షులు గుమిగూడి కబుర్లు చెప్పుకుంటూ ఉంటాయి. ఆకుపచ్చని రేడియో లోంచి తమకు నచ్చిన పాటల్ని వినిపిస్తూ ఉంటాయి”. ఇప్పుడొకసారి మళ్ళీ వెళ్ళి ఆ పాటలు వింటూంటే రవిశంకర్ గుర్తుకు రారూ?
"వినియోగ మహా యజ్ఞంలో వ్రేల్చిన సమిథలేవో బూడిద రంగు పెదవుల్తో పొడిపొడిగా నవ్వుతాయి" - అంటారు యజ్ఞం అన్న కవితలో - ఓ చైనా తల్లి సన్నని వేళ్ళతో కూర్చిన పరికరాన్ని, కొరియా పిల్ల తన చిన్ని పాదాలతో తొక్కిన కుట్టుయంత్రంతో చేసిన చొక్కాని మనకి రాళ్ళెత్తిన కూలీలను గుర్తుచేస్తూ.
జీవితంలో కావలసిన లోతు గురించి చెబుతూ, "సమాధానాలు వెతకడానికి అసంతృప్తి చాలు. సమాధాన పడటానికే సంయమనం కావాలి”. ఎంత నిజం! “అన్నిటితో సయోధ్య సాధించి ఏకవర్ణం కావాడమే కష్టం కాదా?" జీవన సంఘర్షణలో మన బాధ్యతని సున్నితంగా గుర్తు చెయ్యడమేగా?
‘తదనంతరం’ కవితలో "జీవం కోరేది కొనసాగింపు. కాలం కోరుకునేది ముగింపు, పెరిగే మొక్కల చివర్లలో ఒకటి మారాకు తొడుగుతుంది, మరొకటి పండిన స్మృతుల్ని ఆకులుగా రాలుస్తుంది". "చీకటి మూసిన ఒంటరితనపు పెంకుని పగలగొట్టుకొని ఒక కొత్త ఉదయం తొంగి చూస్తుంది". అవును. మళ్ళీ చదవండి. మళ్ళీ మళ్ళీ చదవండి.
నన్ను తాకిన పదాలు మరికొన్ని మీముందుంచుతాను -
"ఎదురుగా నడుచుకొంటూ ఒక నల్లవాడు, కళ్ళు కలిపి పలకరింపుగా నవ్వాడు.
తలదించుకుని వడి వడిగా అడుగులు వేసాను.
అటువైపునుంచే ఒక తెల్లవాడు. కళ్ళు కలిపి పలకరింపుగా నవ్వాను.
తలతిప్పుకొని వడివడిగా అడుగులు వేసాడు"
"నిజానికి, జీవితమంటే మరేం లేదు. పుట్టుక మొదలు అమ్మనించి విడివడుతూ మనిషి చేసే సుదీర్ఘ ప్రయాణం".
ఇలా ఎన్నెన్నో...
నారాయణరావు గారు రాసిన ’ఈ పద్యాలు ఎలా చదవాలి అన్న మాటలు ముందు చదవండి. తరవాత రవిశంకర్ పద్యాలు చదవండి.
రమణ జీవి గారు డిజైన్ చేసిన ముఖచిత్రం కొంచెం అర్థం కాక పోయినా బావుంది. పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రేతల దగ్గరా దొరుకుతుంది. భారతదేశంలో యభై రూపాయలు, అమెరికాలో అయిదు డాలర్లు మాత్రమే. ప్రతులకు రచయితని సంప్రదించండి. ఈ పుస్తకం చదవకపోతే ఏదో అనుభూతిని పోగొట్టుకున్న వారే మరి.
o o o
చింతపల్లి గిరిజాశంకర్ గారు రాసిన సూర్యాకాంతం కథలు. టెక్సాసులో జరిగే సాహితీసభలలొ చురుకుగా పాల్గొంటూ, అంతకంటే చురుకుగా చురకలంటిస్తూ నవ్వించే గిరిజాశంకర్ గారు ఎంతో సుపరిచితులు. వంటింట్లో అంట్లు కనిపించినప్పుడల్లా - అంటే రోజూ అన్నమాట – ‘చేసేవి రెండు పదార్థాలు, కడిగేవి ఇరవై అంట్లు’ అన్న ఆయన మాటలు వినిపిస్తూనే ఉంటాయి. ఈ దేశంలో నాకు తెలిసి సాహితి వ్యాసంగంలో మంచి హాస్య చతురత కలిగిన కొద్దిమందిలో గిరిజా శంకర్ గారు ఒకరు.
అందరూ చూసే జీవితంలోంచే హాస్యం పుట్టించగలగాలంటే, దానికి ఒక కొంటె కోణంతో చూడగలిగే సామర్థ్యం, నిశిత పరిశీలన, సంఘటనలను నలుగురితో పంచుకుని కిసుక్కున నవ్వించగలిగే స్కిల్ కావాలి. ఈ కథల పుస్తకంలో ఇవన్నీ పుష్కలంగా చూడొచ్చు.
మొత్తం ముప్ఫై ఏడు కథలున్న ఈ పుస్తకంలో గిరిజా శంకర్ గారు రాసిన ముందుమాట నుంచి చివర పేజీ వరకూ, చదువుతూ హాయిగా నవ్వుకోవచ్చు. అన్ని కథలూ, ఈ దేశంలోనూ, వెనక ఆంధ్ర దేశంలోనూ తాను చూసిన అనుభవించిన సందర్భాలే. అందుకే ఒక తరం వెనకకు చూసుకోగలిగే వారికి ఆయన కథలలో చెప్పిన అన్ని సంఘటనలూ చక్కగా అన్వయించుకోవచ్చు. పుస్తకం చదువుతున్నంత సేపూ, ముసిముసి నవ్వులు నవ్వుకోవచ్చు. చాలా మటుకు కథలుగా రాసినా, అవి కథలు కావు. ఆయన జీవితానుభవాలు.
మంగలి కథను మాత్రం విడవకుండా చదవండి.
కొన్ని మాత్రం కొంచెం బాధతో రాసినవే. ’నిజానికి అవి కథలు కావు. అమ్మ కథ, అమ్మ పుట్టినరోజు లాంటివి, చాలామంది గుండెల్లో కొంచెం కలుక్కుమనిపించక పోవు. అమ్మలందరూ ఒక్కలాగే ఉంటారా అనిపించింది నాకైతే.
ఇది కేవలం నవ్వుకోడానికే కాదు. పైన చెప్పినట్లుగా మొదటి తరం ప్రవాసాంధ్రుల అనుభవాలని ఈ పుస్తకం పేజీలలో నిక్షిప్తం చేశారు గిరిజా శంకర్ గారు. ఒక రకంగా ఆయన జీవితపు అనుభవాలని కాగితం మీద ఉంచారు. పుస్తకాన్ని ఆయన పెద్దగా ప్రకటించుకోలేదని (అడ్వెర్టైజ్ చెయ్యలేదని) నా అభిప్రాయం. బహుశా ఆయన వినయానికి (మోడెస్టీ) చాలా మందికి ఈ పుస్తకం ఉందని కూడా తెలియదు కదా మరి.
‘సూర్యకాంతం కథల’ని పేరుపెట్టినా, అట్టమీది బొమ్మమీద రేలంగి, సూర్యకాంతాల బొమ్మలు మనం గుర్తు పట్టేటట్లు ఉండి ఈ కథలు ఏ అత్తగారి కథల్లాగానో అనుకుంటే అది కాదు. ఆ ఇద్దరు కామిక్ నటుల బొమ్మలే కాకుండా వాళ్ళిద్దరు ఒక మంగళ సూత్రంతో కలపబడడం ఎందుకో అర్థం కాలేదు.
వేణి ప్రచురణలు, టెంపుల్, టెక్సాస్ వారు ప్రచురించిన ఈ పుస్తకం ఖరీదు అమెరికాలో పది డాలర్లు, ఇండియాలో ఇరవై డాలర్లు అనడంలోనే పుస్తకానికి ఖరీదు కట్టవద్దని చెప్తున్నారు గిరిజ గారు. ఆయన ముందస్తుగా ఒఖ్క నా మాట లో చెప్పినట్లుగా పుస్తకాన్ని స్వంత లాభానికి కాకుండా దాని మీద వచ్చిన అదాయాన్ని ఒక నిర్భాగ్యురాలి చదువుకి స్కాలర్షిప్పుగా వినియోగించాలనే ఆలోచన ఎంతో ప్రశంశించదగ్గ విషయం. అంతే కాదు. పుస్తకంలోని బొమ్మలన్నీ, లివర్ ట్రాన్స్ ప్లాంట్ అయి కాలేజీలో చదువుకుంటూ, మధ్య మధ్యలో అనారోగ్యం బాధిస్తున్నా వీలు చూసుకుని వేసిన తేజశ్రీకి అవకాశం ఇవ్వడం ఆయన పెద్ద మనసుకు సాక్ష్యం.
ప్రతులకు డా. సుమ పోకల, ఈమెయిల్: pokalasuma@hotmail.com ను సంప్రదించండి. ఈ కొద్ది మాటలు చదివి వదిలేయకండి. పుస్తకం చదివితే కాని మీరేం మిస్ అయ్యారో మీకే తెలియదు
o o o
బాలలకు చైతన్యాన్ని పెంచే కథలు - అఖిలాశ. నేడు తెలుగు సాహిత్యంలో బాల సాహిత్యం కొరత ఉండటం వాస్తవం. ఆ లోటు తీర్చే ప్రయత్నంలో ఈ మధ్య చాలా మంది రచయితలు బాల సాహిత్యాన్ని రాస్తున్నారు. పిల్లలకు చైతన్యాన్ని కలిగించే కథలు నేడు చాలా అవసరం అందుకే ప్రముఖ కవియిత్రి శ్రీ సత్యవతి దినవహి గారు తన మొదటి పుస్తకాన్ని చైతన్య దీపికలు పేరుతో బాల సాహిత్య కథలు రాసి తెలుగు సాహిత్యానికి అందించారు.
సత్యవతి దినవహి గారు అమోఘమైన రచయిత్రి ఎన్నో కథలు రాశారు వివిధ దినపత్రికలలో,అంతర్జాల పత్రికలలో వారి రచనలు ప్రచురణ అయ్యాయి. బాలల పుస్తకాలు వేసి ఉచితంగా పంచి పెట్టాలి అని మంచి ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేసారు. ఈ పుస్తకంలో మొత్తం పదహైదు కథలు ఉన్నాయి అన్ని కథలు పిల్లలకు చైతన్యం కలిగించడమై ఉండటం శుభపరిణామం.
పుస్తకంలోని మొదటి కథ ప్రస్తుతం రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ కి ఒక చిన్నారి ఎలా సహాయం చేసింది అని వివరిస్తూ రాసిన కథ. ఈ కథ ద్వారా పిల్లలు సహాయం చేయడమే కాదు రాష్ట్రం,దేశం పట్ల తమకు బాధ్యత ఉండాలి అని గుర్తు చేస్తుంది. రెండో కథ శభాష్ లో చెట్లను పాడుచేస్తున్నాము అని తలిచి ఒక విద్యార్తి అలోచించి ఒక మంచి పరిష్కారాన్ని చెప్పడం బాగుంది రచయిత్రి కథను నడిపిన విధానాన్ని చూస్తే తనకున్న అనుభవం తెలిసిపోతుంది.
మరో కథలో స్నేహానికి ఉన్న విలువ తెలియజేస్తూ బొల్లి సోకిన పిల్లవాడు స్కూల్ లో ఉండటం వల్ల అందరికి సోకుతుంది అని అపోహ పడటం చేత తను స్కూల్ మనేయాల్సి వస్తుంది. తన స్నేహితుడు అది వ్యాధి కాదని తన తల్లితండ్రుల సహాయంతో నిరూపించి మళ్ళీ స్కూల్ కి వచ్చేలా చేస్తాడు .ఈ కథ ద్వారా పిల్లలే కాదు పెద్దలకి కూడా చాలా విషయాలు తెలుస్తాయి. ఇలాంటి కథల అవసరం కూడా చాలా ఉంది ఇలాంటి అంశాన్ని ఎంచుకున్న రచయిత్రికి ఉన్న సామజిక బాధ్యత తెలిసిపోతుంది.
చైతన్య దీపికలు అనే కథలో నీటి ప్రాముఖ్యతను పెద్దలకు పిల్లలు చెప్పిన విధానం బాగుంది. ఇలా అన్ని కథలు సమాజ శ్రేయస్కరం కోసం రాసినవే పిల్లలే కాదు పెద్దలు కూడా తప్పకుండ చదవాల్సిన పుస్తకం రచయిత్రి గారు మరిన్ని పుస్తకాలు తెలుగు సాహిత్యానికి అందివ్వాలని కోరుతూ..!!
o o o
సాహిత్యం అంతర్వాణికి అక్షర రూపం. అంతరంగ భావనకు కలుగు హృదయ స్పందనకు ప్రతిరూపం. ఈ భావన మనసుకు హత్తుకోవటానికి కారణం, ఒక సంఘటన, సందర్భము, ఊహ, జ్ఞాపకం, అంశం, లేదా వస్తువు కూడా అయి ఉండవచ్చు. 'కాదేదీ కవిత కనర్హం' అన్నారు మహాకవి శ్రీశ్రీ. అది అక్షర సత్యం. కవి మదిలో భావోద్వేగం, గడియ గడియకు ప్రసవవేదనంలాంటిది. కవి, భావావేశంతో కూర్చిన పదాలే పూరేకులై, తాత్పర్యమే తావియై (పరిమళమై), వాటి మేళవింపుతో సరికొత్త సాహిత్య కుసుమం విరబూస్తుంది. మరొక విధంగా చెప్పాలంటే, భావావేశంతో కూర్చిన ఆ పదాలే, అక్షరాంశు అస్త్రాలై, హృదయాంతరాళ నిశీధినిలో నీలపంకమైన నిర్లిప్తతను ఛేదించగలవు. కఠినమైన పదాల మధ్య కవితను కటకటాల పాలు కానీయకుండా, కవితకు వన్నె తగ్గని రీతిలో సాధ్యమైనంత సరళముగా తెలుగువారందరికీ అంతర్వాణి చేరువ అవ్వాలని, కొన్ని పదములకు మరియు సాహిత్య కుసుమాల పట్ల కొంత వివరణను, లఘు వివరణల రూపంలో పొందుపరచడం జరిగింది. ఈ అంతర్వాణిలో, కాలానుగుణంగా భూత, వర్తమాన సామాజిక పరిణామాల పట్ల, భవిష్యత్ ఆకాంక్షల పట్ల దృక్కోణాన్ని, మరికొన్ని అనుభూతులను సాహిత్య రూపంలో పంచుకోవటం జరిగింది. తెలుగు భాషలోనున్న మాండలికాలు మన భాషాసౌందర్యాన్ని మరింత పెంపొందిస్తున్నాయి. ప్రియముతో, పలు మాండలిక పదములను ఈ సాహిత్యంలో ఉపయోగించటం జరిగింది. అభ్యుదయం, సామాజికప్రయోజనం, సమాజం పట్ల ప్రేమ, ఉన్నత విలువలు, ఉదాత్త ప్రమాణాలను ప్రతిబింబించే కవితలెన్నో ఉన్న కవిత్వ సంపుటి - 'అంతర్వాణి'.