top of page
Anchor 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

టంగ్... టంగ్... టంగ్..

Hitesh Kollipera

హితేష్ కొల్లిపర

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో ఉత్తమ బహుమతి సాధించిన కథ

దూరం నుంచి వస్తున్న చప్పుడు చూసి లేచి గేట్ తెరిచాడు పవిత్ర థియేటర్ గేట్ మన్. కృష్ణ తన బండిని తోసుకుంటూ తెచ్చి థియేటర్ సెకండ్ గేట్ ముందు టికెట్ కౌంటర్ పక్కన నిలిపాడు. సమయం, సరిగ్గా పది యాభైఐదు. పదకొండు గంటలకి మార్నింగ్ షో. అట్లకాడతో బాణీ మీద మోదుతూ పల్లీలు వేయిస్తున్నాడు.

కృష్ణ టైమ్ సెన్స్ ని మెచ్చుకోవాల్సిందే. రోజూ సరిగ్గా ఆ సమయానికి, అక్కడ ఉంటాడు. కౌంటర్ లో నిలబడ్డ ‘కళాపోషకుల’ చేత కనీసం పది ‘పల్లీ కోన్స్’ అయినా కొనిపించకపోతే తన ‘పల్లీల’ బ్రాండ్ కే అవమానం అని అతడి ఫీలింగ్. అప్పటికీ ఏరోజైనా తన ‘పది’ టార్గెట్ రీచ్ కాదనిపిస్తే తనే రంగంలోకి దిగుతాడు.

 

“ఇదిగో..., ఆట మొదలైన ఐదు నిమిషాలకి టాప్ యాంగిల్ నుంచి కారం సీన్ ఒకటి వస్తుంది. అప్పుడు గనుక కారకారంగా ఈ పల్లీలు నములుతూ చూశావనుకో, నా సామీరంగా….. అదిగదా స్వర్గం అంటే” టికెట్ క్యూలో నించున్న వాళ్ళతో మత్తుగా మాట చెప్తాడు. అతడి ‘మార్కెటింగ్’ గమ్మత్తుకి దాసోహమనని కళాభిమాని ఉండడు.

 

‘పది’ టార్గెట్ రీచ్ అయ్యాక టంగ్… టంగ్… లాడిస్తాడు తప్ప తానుగా వెళ్ళి కొనమని ఎవరినీ అడగడు. జనాల్ని మాత్రం నిశితంగా గమనిస్తూ ఉంటాడు. ఎవరైనా ఎదురుగానున్న కిళ్ళీకొట్టు వైపు అడుగులేస్తున్నట్టు అనిపిస్తే  వెళ్ళి అడ్డుపడతాడు. ఇలానే.,

 

“ఏయ్... ఎక్కడికి?”

“సిగరెట్స్... మర్చిపోయా… లేవు. తెచ్చుకోవటానికి”

“అరె.., రెండు నిమిషాలకే పవర్ఫుల్ సీన్.... మిస్ అయిపోతావ్.... ఇంటెర్వెల్లో గేట్ దగ్గరికొచ్చి నిలబడు. నేనందిస్తాలే”

ఆ వ్యక్తి ఆలోచనలో పడ్డాడు. ఇంతలో షో స్టార్టింగ్ బెల్ కొట్టారు.

“అదిగో... షో స్టార్ట్ అయింది. పో.. పో.. ఇంటెర్వెల్లో నిలబడు. నేనొచ్చి ఇస్తా”

అతడు హాల్లోకి వెళ్ళిపోయాడు. కృష్ణ బండిని బయటకి తెచ్చి కూల్ డ్రింక్ షాప్ కి ఓరగా నిలిపాడు.

కృష్ణ రోజూ చేసే ఈ చాతుర్యం అక్కడి వ్యాపారులకు వింతకాదు. వాళ్ళల్లో థియేటర్ ఎదురుగా కొట్టు ఉన్న జనార్దనా మినహాయింపు కాదు.

ఇందాకట్నుంచి కృష్ణ వైపే చూస్తున్నాడు జనార్ధన.

“సార్..,” కౌంటర్ మీద టీ గ్లాస్ పెడుతూ అన్నాడు అక్రమ్.

“ఏంట్రా?..” టీ గ్లాస్ టేబుల్ మీదకి మారుస్తూ జనార్ధన.

“దీంతో కలిపి నూటపాతిక అయింది సార్”

“ఉదయాన్నే ఏంట్రా... సాయంత్రం రా”

విఘ్నేశ్వరుడి పటం పక్కన జనార్ధన గుచ్చిన ఊదికడ్డీలు(అగరవత్తులు) పొడైపోయి అప్పటికే అరగంట గడిచింది.

“తమ్ముడు వచ్చాడు సార్. వంద కన్నా ఎక్కువ ఉంటే ఒప్పుకోడు”

“ఇంత వరకు బోణి కాలేదు. సాయంత్రం రా పో”

పెదాలు చిట్లించి వెళ్లిపోయాడు అక్రమ్.

         

టేబుల్ మీద ‘టీ’ గ్లాస్ చేతిలోకి తీసుకున్నాడు జనార్ధన. బాగా వేడిగా అన్పించి పెట్టేశాడు. మళ్ళీ కృష్ణ వైపు చూశాడు. బాదంపాలు తాగుతున్నాడు అతడు. చప్పట్లు కొట్టి ఒకటన్నట్టు చూపుడు వేలు చూపించాడు. ఐదు నిమిషాలన్నట్టు హస్తం చూపాడు కృష్ణ, మరో చేత్తో సగం ఖాళీ అయిన బాదం బాటిల్ ఊపుతూ. టీ చల్లారిపోతుందని  తాగేశాడు జనార్ధన.

 

“ఎవరు వచ్చారు సేటు గారు?” వస్తూనే అడిగాడు కృష్ణ.

“మీనాక్షి నేరా”

“దానెమ్మ ఇక రాదా?”

“ఒంట్లో బాగోలేదు అంది కదరా!?”

“ఇంకానా?... మూడు రోజులు అయింది”

“ఏమో”

పల్లీలు నింపిన పేపర్ కోన్ చేతికిచ్చాడు. అందుకుని యాభై నోటు ఇచ్చాడు జనార్ధన. “ఉండనీయండి సార్...” అంటూనే తీసుకున్నాడు కృష్ణ.

“ఇప్పుడిచ్చిన దానితో కలిపి నలభైఎనిమిది. మీవే 2 రూపాయలు నా దగ్గర ఉంటాయి” అన్నాడు.

అప్పుడే మీనాక్షీ పైన పని ముగించుకుని కింద కొచ్చింది.

 “లేకపోతే దీన్నే అడిగేయమంటారా?” మీనాక్షిని చూస్తూ అన్నాడు.

“నీ ఇష్టం”

“నిన్నే పైకప్పుకి రేకులు వేయించా. సెకండ్ హ్యాండ్ లో వస్తుంటే రంగు టీవి కొన్నా. 10 వేలది. కొని నాలుగు నెలలే అయింది. వేయికే వస్తుంటే తెచ్చేశా”

మీనాక్షి ఫైనాన్స్ కొట్లోకి వెళ్ళింది. కృష్ణ మాటలు జనార్ధనతో అయినా చూపులు అటువైపే ఉన్నాయి.

“తమ్ముడు సంగతి?” అడిగాడు జనార్ధన.

“పన్నెండు తప్పాడు. చాల్లేరా అని పూల కొట్ల దగ్గర బండి పెట్టించా. ఆరు వేలు ఇచ్చా ప్లేస్ కోసం. పాసైనా బండే పెట్టించేవాడ్ని అనుకోండి” కన్నుకొడుతూ చెప్పాడు.

 

మీనాక్షీ ఫైనాన్స్ కొట్లోంచి బయటికొచ్చింది. కాంప్లెక్స్ లో దాని పని ముగిసినట్టే. రోడ్డు బాట పట్టింది.

“చూడండి ఆ హొయలు. చామంచాయే అయినా భలే ఉంటుంది. ఎలాగైనా నా ఇంటిదాన్ని చేసుకోవాలి గురుగారు. ఇల్లు, తమ్ముడు కూడా సెట్ అయిపోయాయి” మీనాక్షి వెళ్తున్న వైపే చూస్తున్నాడు.

“అయితే వెళ్ళి అడుగు”

 

రెండు సెకండ్లు తటపటాయించి పరిగెత్తాడు కృష్ణ. మీనాక్షిని చేరుకున్నాడు. నిమిషం కన్నా తక్కువే మాట్లాడి వచ్చాడు.

“ఏమంది?” జనార్ధన కంఠంలో ఆతృత.

“తాగుతావా అంది. తాగననే చెప్పా” మళ్ళీ కన్నుకొట్టాడు. “వచ్చి అమ్మతో మాట్లాడుకో అంది” చెప్పాడు.

“అయితే కళ్యాణగడియ వచ్చిందంటావ్. మంచిరోజు చూసుకుని వెళ్ళి అడుగు”

“నాకు ఈ దేవుడూ, మంచిరోజులు మీద నమ్మకం లేదు సేటుగారు”

అతడన్నదానికి బదులివ్వలేదు జనార్ధన. కౌంటర్ మీద వేళ్ళతో డ్రమ్స్ ఆడాడు కృష్ణ.

“సరే గురుగారు, వస్తా. ఓయ్ ముసలోడా.. ఇంటెర్వెల్ కి నాలుగు కింగ్స్ తీసుంచు” పక్కన కిళ్ళీకొట్టుకి వినపడేలా అరుస్తూ వెళ్ళిపోయాడు.

కృష్ణ దిగగానే లాండ్ లైన్ మోగింది. వెళ్ళి రిసీవర్ ఎత్తాడు జనార్ధన.

“హలో?...”

 

“పండుని స్కూల్ నుంచి పంపేశారు. ఫీజ్ కడితేనే రానిస్తారంట” అవతల భార్య గొంతు.

“అందుకే నీకు నేను నిన్ననే చెప్పాను వెళ్ళమని. నువ్వేమో వెళ్ళలేదు” తప్పు తేల్చాడు.

“నేను వెళ్ళనని చెప్పా కదా” సౌమ్యంగానే అంది.

 

“ఓయ్ అరవకు!!...” గట్టిగా అరిచి, “ఆడోళ్ళు వెళ్ళి అడిగితే వాళ్ళు కొంచెం ఆగుతారు. నేను వెళ్తే అవదు. నీకు చెప్పినా అర్దంకాదు. ఇప్పుడన్నా వెళ్తేవెళ్ళు లేకపోతే మానుకో” కోపంగా ఫోన్ పెట్టేశాడు.

 

టంగ్.... టంగ్... టంగ్....

జనార్ధన తిరిగేసరికి శబ్దం చేసుకుంటూ సాగిపోతున్నాడు కృష్ణ.

                                                          ******

‘అధికార పార్టీ నేత హత్యతో అట్టుడుకుతున్న రాష్ట్రం. అంతటా నిరసన జ్వాలలు’

హాల్లో టీవి ప్రదర్శిస్తున్న నిరసనలకి పోటీగా లోపల కొడుకు మీద నిరసన ప్రదర్శిస్తున్నాడు జనార్ధన.

 

“ఏంటి ఈ మార్క్స్!... మాట్లాడవే!?” కొడుకుని చూస్తూ కోపంగా అరిచాడు.

చిన్నా మాట్లాడలేదు. అప్పటికే వాడి తల రెండుసార్లు గోడకి గుద్దబడి ఉండటంతో బుర్ర తిరుగుతుంది వాడికి. కొడుకు సమాధానం ఇవ్వకపోవటంతో చిర్రెత్తుకువచ్చింది జనార్ధనకి. వాడి కాలర్ పట్టుకుని ముందుకు లాగి అంతే విసురుగా వెనక్కి తోశాడు. మరోసారి గోడకి గుద్దుకుంది వాడి తల. కింద పడిపోయాడు.

 

కోపం చల్లారలేదు జనార్ధనకి. కొడుకుని లేపి గోడకి అదిమాడు. రెండు భుజాలు వొంచి ‘గోడకుర్చి’కి తీసుకొచ్చాడు.

“అరగంట పాటు గోడకుర్చి వేయ్. అప్పుడే నీకు బుద్ది వస్తుంది”

“ఏవండీ ఒకసారి....” భర్తని హల్లోకి తీసుకెళ్ళింది భార్య.

“వాడ్ని దండించాల్సిన పద్దతి ఇది కాదు. టెస్ట్ జరిగిన తరువాత వెంటనే అడక్కుండా ఇలా కోటర్లీకీ, హాఫర్లికీ ఒకేసారి కొడితే ఎలా?.. వాడెలా మారతాడు?” అంది.

 

“నువ్వు మూస్కో. నాకు తెలుసు వాడ్ని ఎలా దారిలోకి తేవాలో” భార్య మాటలు కొట్టిపడేశాడు జనార్ధన. ఆమె మౌనం వహించింది. ఆ రాత్రి చిన్నా భోంచేయకుండానే పడుకున్నాడు.

మర్నాడు ఉదయం యధావిధిగా షాప్ కి వెళ్ళాడు జనార్ధన. అక్కడ వాచ్ షాప్ సలీం చెప్పింది విని షాకయ్యాడు.

“నిన్న పూలకోట్ల దగ్గర జరిగిన అల్లర్లలో కృష్ణ గాడి తమ్ముడు చనిపోయాడంట. సోడా బాంబ్ తలకి తగిలిందంట పాపం” అన్నాడు సలీం.

“ఆర్రే.... పాపం మొన్నే కృష్ణగాడు వాడి చేత బండి పెట్టించాడు...” జనార్ధన కళ్ళలో ఆశ్చర్యం, మాటల్లో బాధ.

 

ఆ మర్నాటి నుంచి ఆ వీధిలో కృష్ణ గాడి టంగ్.. టంగ్... చప్పుళ్ళు మోగలేదు. పేపర్లో పడ్డాకే తెలిసింది. తమ్ముడి చావుకు ఆవేశంలో అధికారపార్టీ వాళ్ళ మీద కత్తి దూశాడని, సంప్రదింపులు కుదిరి ప్రతిపక్ష పార్టీ కండువా కప్పుకున్నాడని. ఆర్నెల్లకే జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షం కాస్తా అధికారపక్షమైంది పల్లీల కృష్ణ కాస్తా అఫిషియల్ గా కార్పొరేటర్ కృష్ణగా మారాడు. అనఫిషియల్ గా సెటిల్మెంట్ కృష్ణన్న.

                                                          ******

కాలం ముందుకు సాగింది. ఇప్పుడు కృష్ణ, కార్పొరేటర్ కృష్ణ కాదు. మేయర్ కృష్ణ.

“వాటా పోయిందనే కానీ షాప్ మీద అప్పు తీరిపోయింది. కాకపోతే ఒకటే బాధ, పిల్లలకి ఏం లేకుండా పోయిందే అని” ఆ రాత్రి భార్య తో అన్నాడు జనార్ధన.

“చిన్నా 10th క్లాస్ కి వచ్చేశాడు. రేపు ఇంజినీరింగ్ సీట్ కోసం అటు, ఇటు చూడాల్సి వస్తుంది. వెనక కూడా ఏం లేదు. ఇప్పట్నించే కూడబెట్టాలి” అంది భార్య.

 

“ఇంకా టైమ్ ఉందిగా.” గొణిగాడు జనార్ధనం.

                                                          ******

కాలం మరింత ముందుకు సాగింది. మేయర్ కృష్ణ కాస్తా ఎం‌ఎల్‌ఏ కృష్ణ అయ్యాడు.

“ఫ్యాన్ పెట్టుకోవచ్చుగా?” కర్చీఫ్ తో మెడ తుడుచుకుంటూ అన్నాడు చక్రి.

“ఏది... రిపేర్ కి ఇచ్చా. వాడివ్వట్లా” చెప్పాడు జనార్ధన.

“నెల క్రితం కూడా లేనట్టుందిగా!?”

“ఏంటి, చాలరోజులకి వచ్చావ్?” మాట మార్చాడు జనార్ధన.

“కృష్ణ సార్ తరుపున వచ్చా. రేపు నిన్ను రమ్మన్నారు. షాప్ గురించి”

“ముకుంద గాడి ఐడియానేగా?... ప్రసాద్ ఇలా చేయడు”

“ప్రసాద్ కి నోరు లేదు. ముకుందాకి ఉంది. అందుకే వాడి చేత చేయిస్తున్నాడు”

“మొన్న కూడా మనుషుల్ని తెచ్చి టేప్ పెట్టి కొలిపిస్తున్నాడు. నేనేం మాట్లాడలేదు. నీచుడు వాడు”

“ఏదైతేనేం. ఇప్పటికైనా తేల్చేసుకో. కృష్ణ సార్ దగ్గరికి వెళ్ళండి.”

“కృష్ణా!?.... నేను షాప్ పెట్టకముందు పార్ట్నర్ షిప్ లో ఉన్నప్పుడు వాడు నా ముందు నిక్కర్లు వేసుకుని తిరిగినోడు” హేళనగా అన్నాడు జనార్ధన.

 

“అప్పుడు వేరు. ఇప్పుడు వేరు. ఇప్పుడు కృష్ణ సార్ ఎం‌ఎల్‌ఏ. వెళ్ళేటప్పుడు భార్యతోటి వెళ్ళు. నేను రేపు ఉండట్లేదు. నీ గురించి ముందే సార్ కి చెప్పి ఉంచా. జాగ్రత్తగా మాట్లాడు ఆయనతో” చెప్పి వెళ్లిపోయాడు చక్రి. 

 

భార్య సహా డూప్లెక్స్ హౌస్ ముందు స్కూటర్ ఆపాడు జనార్ధన. పై అంతస్తులో కృష్ణ ఆఫీసు. పైకెళ్ళి విషయం చెప్పాడు. అసిస్టెంట్ కూర్చోమని లోపలికెళ్ళాడు. పెద్ద హాల్ అది. పార్టీ ప్రెసిడెంట్ ఫోటో పక్కనే కృష్ణ ఫోటో తగిలించి ఉంది. గుమ్మానికి మూడు మతాల దేవుళ్ళ ఫోటోలు అంటించి ఉన్నాయి. అంతలో పిలుపొచ్చింది. లోపలికెళ్ళాడు.

 

లోపల సోఫాలో కూర్చుని ఉన్నాడు కృష్ణ. చుట్టూ అనుచరులు నించుని ఉన్నారు. చేతికి దేవుడి ఉంగరాలు, మెళ్ళో రుద్రాక్ష, తెల్లటి డ్రస్ లో మెరిసిపోతున్నాడు.

“కృష్ణ...” అప్రయత్నంగా ఏకవచనం వచ్చింది జనార్ధనకి.

కళ్ళెగరేశాడు కృష్ణ.

“అదే కృష్ణగారూ...రమ్మన్నారంట... ప్రసాద్....” తడబాటుగా అన్నాడు.

“రా జనార్ధన రా, కూర్చో.... అమ్మా మీరు కూడా కూర్చోండి” ఇద్దరికీ సోఫా చూపిస్తూ అన్నాడు. కూర్చున్నారు.

“అది కాదు కృష్ణగారూ...” టాపిక్ ఎలా తేవాలో అర్దంకాలేదు జనార్ధనరావుకి.

కృష్ణ చేయెత్తాడు. తనే అందుకున్నాడు.

“చూడు జనార్ధన..., నువ్వు ఆ కొట్లో ఇరవై సంవత్సరాలు పైగా ఉంటున్నావు. కాదనను. కానీ ఏడు సంవత్సరాలుగా నువ్వు అద్దె చెల్లించట్లేదు. అది నువ్వు కూడా కాదనలేవు. దీనికి అంతం అనేది ఉండాలయ్యా”

“కాంప్లెక్స్ లో నేనొక్కడ్నే కాదు అద్దె చెల్లించనిది. ఫైనాన్స్ మనోజ్, ఫోటో షాప్ యాసీన్ కూడా చెల్లించట్లేదు” అన్నాడు.

 

“వాళ్ళతో నీకెందుకయ్యా!..., వాళ్ళు గడ్డి తింటే మనం తింటామా?... ఏమ్మా!?” జనార్ధన భార్యని చూస్తూ అన్నాడు కృష్ణ. అప్పటికే ఆమె ముఖం పాలిపోయింది.

“కరెక్టే నండీ. కానీ ఫైనాన్షియల్ గా బాగోలేదు కదా. ఏదో నా నగలు తాకట్టు పెట్టి కొట్టు నడుపుకుంటూ వస్తున్నారు. ఇప్పటికీ నా నగలన్నీ కూడా ఇంకా బ్యాంక్ లోనే ఉన్నాయి” అంది.

 

“మనదేశంలో సగం మంది మగాళ్ళు భార్య నగలతోనే అమ్మా, వ్యాపారాలు చేసేది. కాకపోతే రైతులు బయటకి చెప్పుకోగలరు, వ్యాపారులు చెప్పుకోలేరు అంతే. ఐనా అద్దెకి కూడా రానిదాన్ని ఇంకా ఎందుకమ్మా నడపటం? ఎప్పుడో డిస్పోజ్ చేయాల్సినదాన్ని ఇన్నాళ్ళు పోషించారు”

“అమ్మాయి పెళ్ళి కూడా కాలేదండి”

“అందుకేగా గుడ్విల్ల్ కింద ఏడు లక్షలు ఇప్పిస్తుంది”

“అబ్బాయికి కూడా మంచి ఉద్యోగం లేదు. బీటెక్ చదివించలేక డిగ్రీ చదివించాం. వాడెక్కడో గుజరాత్ లో షిప్పింగ్ యార్డ్ లో పని చేస్తున్నాడు. అక్కడిచ్చే జీతం వాడికే సరిపోవట్లేదు”

“సరే అమ్మా.., నీ ముఖం చూసి ఎనిమిది ఇప్పిస్తా”

“అది కాదండీ.., ఇరవై రెండు సంవత్సరాల క్రితమే సెంటరని డెబ్భైవేలు గుడ్విల్ ఇచ్చా. ఇప్పుడు దానికి ఎనిమిదంటే చాలా తక్కువ” మాట్లాడాడు జనార్ధన.

“అసలు అమ్మని షాప్ కి గుడ్విల్ ఎట్టా వస్తదయ్యా!... రోజుకి కనీసం నూటాభై కూడా అమ్మవటగా!? ఇది కూడా ఉన్నపళంగా ఖాళీ చేయిస్తున్నందుకు ప్రసాద్ చేత ఇప్పిస్తున్నా. అద్దె కూడా చెల్లించని టెనెంట్ కి ఓనరే ఎదురు డబ్బు ఇచ్చి పంపటం ఎక్కడైనా చూశామా!... ఏం రఘూ!?” అసిస్టెంట్ రఘుని చూస్తూ అన్నాడు కృష్ణ.

“కనీసం 20 లక్షలైనా...” నసిగాడు జనార్ధన.

“సరే జనార్ధన.., ఆఖరికి తొమ్మిది ఇప్పిస్తా. షాప్ లో ఫర్నీచర్, స్టాకు కూడా నువ్వే పట్టుకుపో. అది అమ్మితే ఒక లక్ష అయినా వస్తుంది. సుబ్బరంగా బ్యాంక్ లో వేసుకో. నెల రోజులు టైమ్” చెప్పి లేచాడు కృష్ణ. రఘుకి సైగ చేశాడు.

కృష్ణతోపాటే లేచిన ఇద్దర్ని రూమ్ నుంచి బయటకి తోలినంత పని చేశాడు రఘు.

“ప్రసాద్ కి ఫోన్ చేసి 30% పర్సెంట్ పంపమని చెప్పు” రూమ్ దాటుతున్నప్పుడు కృష్ణ మాటలు జనార్ధన చెవిన పడకపోలేదు.

మౌనంగా బయటికొచ్చారు ఇద్దరు. స్కూటర్ స్టాండ్ తీస్తుండగా గేట్ మెట్లెక్కుతున్న అరడజను ఆడాళ్ళుని గమనించాడు జనార్ధన. వాళ్ళలో పట్టుచీర, ఒంటినిండా నగలు దింపుకున్న మీనాక్షిని ఈజీగానే గుర్తుపట్టాడు.

“ఏయ్... అటు చూడు. తనే వాడి భార్య. మీనాక్షి. వేరేవాడితో పెళ్ళైతే, కార్పొరేటర్ గా ఉన్నప్పుడు లేపుకొచ్చేశాడు.” స్కూటర్ వెనక్కి తీస్తూ భార్యతో అన్నాడు.

 

ఆమె చూసింది కాని మాట్లాడలేదు. స్కూటర్ తిప్పటానికి స్థలం చాల్లేదు జనార్ధనకి. భార్య అడ్డుగా ఉంది.

“స్కూటర్ తిప్పుతుంటే అడ్డంగా నించుంటావేంటి!? వెనక్కి వెళ్ళు” విసుగ్గా అన్నాడు.

“వెనక కార్ వస్తుంది. కళ్ళు కనిపించట్లేదా?...” అరిచింది భార్య.

పెదాల ఆడించాడు గాని జనార్ధన అన్నదేదీ బయటకి వినపడలేదు. స్కూటర్ స్టార్ట్ చేశాడు. భార్య వచ్చి కూర్చుంది. గేర్ మారుస్తున్నప్పుడు వినిపించింది చప్పట్ల శబ్దం, ఎవరో పిలుస్తున్నట్టు. వెనక్కి తలతిప్పాడు.

దూరంగా ఉన్న పల్లీల బండిని ఎవరో పిలుస్తున్నారు. బాణీ మీద మోదుకుంటూ వస్తున్నాడు వాడు.

టంగ్... టంగ్... టంగ్...

ఇప్పుడు జనార్ధన బుర్రలో తిరుగుతుంది ఒక్కటే.... ఆ కుర్రాడు ఎప్పుడు ఎం‌ఎల్‌ఏ అవుతాడా అని.

టంగ్... టంగ్... టంగ్..​.

OOO

Bio

హితేష్ కొల్లిపర

గుంటూరుకు చెందిన హితేష్ కొల్లిపర వయస్సు 24 సంవత్సరాలు. చార్టర్డ్ అకౌంటెన్సీ- ఫైనల్ చదువుతున్నారు. చిన్నప్పటి నుంచి కథలు చదవడం అంటే ఇష్టం. ఆ ఇష్టంతో వ్రాసిన మొదటి కథ 'పేరమ్మ పేరాశ' 2004లో ఈనాడు-హాయిబుజ్జిలో ప్రచురితమైనదిఇప్పటి విషయానికి వస్తే,  కథలు స్వాతి, ఆంధ్రభూమి, మధురవాణి.కాం పత్రికలలో ప్రచురితమైయ్యాయి. . 2016లో madhuravani.com అంతర్జాల పత్రిక తొలి ఉత్తమ రచనలపోటీలో ‘ప్రశంసా బహుమతి’ అందుకున్నారు. 'లవ్ ఇన్స్టిట్యూట్' పేరుతో నవల ప్రచురించబడింది.

***

Hitesh Kollpara
bottom of page