top of page

కథా మధురాలు

భలే మంచి చౌక బేరము

Nirmalaaditya, bhaskar pulikal

నిర్మలాదిత్య

( భాస్కర్ పులికల్ )

పాటామాక్ నది దాని ఇరువైపులా అందంగా లాండ్స్కేప్ చేసిన ఒడ్డు, నది పైన వాషింగ్టన్ అందాలు విహార యాత్రికులకు చూపెడుతూ వయ్యారంగా  తిరుగుతున్న పడవలు.  ఓ క్లాసిక్ పెయింటింగ్ లాగ కనిపిస్తున్నది.

సాయంత్రం కావడంతో ఆకాశం, క్షణక్షణం మారుతున్న కెంజాయ రంగులతో, కదులుతున్న మబ్బులతో ఎదురుగా 19 అంతస్తుల ఏట్రియం లో ఓ వనంలా కట్టిన రెస్టారెంట్ లో కూర్చుని ఏమి త్రాగాలి ఏమి తినాలి అని సతమతమౌతున్న వారి దృష్టి ఆకర్షించడానికి తెగ పాట్లు పడుతున్నది.

 

ఏట్రియం లో ఓ వైపు 19 అంతస్తుల హోటల్ రూములు పైకి కిందకి దిగుతున్న గాజు ఎలివేటర్లు ఉంటే, మిగిలిన మూడు వైపులా పైన గాజు, స్టీల్తో కట్టిన ఏట్రియం ఫౌంటేన్లు, చిన్న చిన్న జల పాతాలు, పూల్స్ మొక్కలు, లాన్లు, ఏకంగా పెద్ద చెట్లే అదేదో పార్కా, షాపింగ్ మాలా, అన్ని సదుపాయాలున్న ఓ ఆధునిక నగరమా అన్న సందేహాన్ని కలిగిస్తుంది.

 

ఇంతకీ అదో పేరుమోసిన కవెన్షన్ సెంటర్, రిసార్ట్. దేశ విదేశాలలో ఉన్న సంస్థలు తమ ముఖ్యమైన కాన్ఫరెన్సులు ఈ రిసార్టులోనే జరుపుకుంటారు. కాన్ఫరెన్స్ లో పాల్గొనేవారు తమ ఫ్యామిలీ పిల్లలతో వస్తే వాళ్లకి కాలక్షేపంగా ఆ రిసార్ట్లోనే బోలెడన్ని ఆటలు, రైడ్లు, సిటీ చూడాలనుకొనే వారికి గైడెడ్ టూర్లు అన్ని సదుపాయాలు చేయడం వల్ల ఆ సెంటర్ ఎప్పుడు బిజీనే. నెలల ముందే బుక్ చేసుకోవాలి.

 

సాయంత్రం అవ్వడం వల్ల రోజంతా కాన్ఫెరెన్సు లలో పాల్గొన్నవారు, రెస్టారెంటుకు వచ్చి గుంపులు గుంపులుగా చేరి కావలసిన డ్రింక్స్ వెయిటర్ కో బార్ టెండర్ కో చెప్పి తమ నెట్వర్కింగ్ ప్రయత్నాలలో పడి పోతున్నారు.

 

ఈ హడావిడికి కొంచెం అటువైపుగా విజే, బాబి కూర్చున్నారు. విజే అసలు పేరు వడమాలపేట జంబన్న. ఈ దేశం వచ్చాక స్టయిల్ గా ఇంగ్లీష్ లో పేరులోని మెదటి అక్షరాలు కలిపి విజే అయ్యిపోయాడు. బాబి పేరు గుణదల బాబ్జి.

 

"ఇరవై ఏళ్లకు ఎంత మార్పు కదా. నిన్ననే అమీర్ పేట్ కోచింగ్ సెంటర్ బయట టీ తాగుతున్నట్లు ఉంది", అన్నాడు విజే బాబి తో.

"అవును విజే", బాబి గొంతులో అదే నాస్టాల్జియ.

 

విజే చదివింది బి కామ్. బాబి బి ఏ చదివాడు. పత్ని కంప్యూటర్ కంపెనీలో సేల్స్ గ్రూప్లో పనిచేస్తుండే వారు. తమతో పాటు చదివిన క్లాస్ మేట్లు ఇంజినీరింగ్ అవీ చేసి అమెరికాకు పోయి అక్కడ డబ్బు సంపాదించడం అక్కడి కబుర్లు వినడం, తాము పని చేస్తున్న కంపెనీ లోపల బయట వింటుండడం తో తాము కూడా బాగా చదివి ఇంజినీరింగ్ చేసి అమెరికా వెళ్లి వుండాలేమో అని బాధ పడుతున్న సమయంలో, అప్పటికే అమెరికాలో పని చేస్తున్న కొంతమంది సొంత కంపెనీలు పెట్టి ఇండియా నుంచి సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను పిలవడం మొదలెట్టారు. డిగ్రీలకంటే అనుభవం కే ప్రాముఖ్యం అని గమనించిన ఇలాంటి ఓ పిల్ల కంపెనీ ఓనర్ వీళ్ల డ్రింక్ పార్టీ స్నేహితుడు కావడం వీళ్ల అదృష్టం. అక్కడి డిమాండ్ పట్టి వీళ్ళను ఓ ఎస్ ఏ పి కోర్సు అమీర్ పేటలో చేయమని, వీళ్ళని హెచ్ 1 బి కి స్పాన్సర్ చేసి అక్కడ చేరాక వాళ్ళకి లేని అనుభవాలు రెస్యూమెలో ఇరికించి తానూ డబ్బు చేసుకొని వీళ్ళకి ఓ జీవనోపాధి కలిగించడంతో వీళ్ల అమెరికన్ డ్రీమ్ ప్రారంభం అయ్యింది.

 

వారంలో నాలుగు రోజులు ట్రావెల్ జాబ్. ఇంటికి వీకెండ్ మాత్రం రావడం. భార్యలకు విసురుకోకుండా వాళ్లకి ఓ కంపెనీ మొదలెట్టి అన్ని బాధ్యతలను అప్పజెప్పడం, వచ్చిన డబ్బులు ఏమి చేయాలని రియల్ ఎస్టేట్ లో, ఫ్రాంఛెస్ లలో పెట్టడం వారి జీవితాలని మరింత బిజీగా, మాట్లాడడానికి సమయం కూడా లేనంతగా మార్చేసాయి.

 

వచ్చిన కొత్తలో సెకండ్ హాండ్ కేమ్రీ కొనడం, తరువాత డబ్బులు రావడంతో తమకు లక్జరీ జర్మన్ కార్లు భార్యలకు లెక్సస్ కార్లు కొనడం అంతా ఏకాభిప్రాయంతో నే విజే, బాబి చేశారా అనిపిస్తుంది. కొన్న కార్లు,  ఇళ్ళు, పిల్లలు చదువుతున్న బడులు, ఎక్సట్రా ట్యూషన్లు, టెన్నిస్ పాఠాలు, భరత కూచిపూడి నాట్యాలు, ప్రాం డేట్లు, ఆ ఫోటోలు అన్నీ గొర్రె దాటులా ఒకే మూసలో పోసినట్లనిపించినా, దానికి కారణం జీవితంలో పైకి పోవాలి, పిల్లలని పైకి తీసుకెళ్లాలనే అందరికి ఉన్న కామన్ తపనే ఉండచ్చు. జీవితం అంటే ఇది టాప్ మాడల్, ఇలాంటి మాడల్ జీవితమే కావాలి అంటూ, టాప్ మాడల్ కారు, ఇల్లు కొన్నట్లే, డబ్బులు తీసుకొని పరుగులు తీస్తున్న జనం లో దూరి తాము కూడా పరిగెట్టడానికి విజేకి బాబి కు పెద్ద సమయం పట్టలేదు.

 

ప్రయత్నాలు అన్నీ ఒకటే అయినా రిజల్ట్స్ ఒకటే కావడం, కార్లు ఇళ్ళు కొనడంలో సాధ్యమౌతుందేమో కాని పిల్లల చదువులో కాదు. అదీ అందరూ తమ పిల్లలు డాక్టర్లే కావాలనుకుంటే పెద్ద సమస్యే.  మెడికల్ కాలేజీ సీట్లు పరిమితమే. అండర్ గ్రాడ్యుయేషన్ లో మంచి జి పి ఏ, ఎంకేట్ లో మంచి స్కోర్, వాలంటరీ పనులు చేసిన అనుభవం, ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు సరిగా జవాబులు చెప్పడం లాంటివి ఎన్నో సరిగా చేసినా చేతికి సీట్ అందే వరకు నమ్మకం లేదు. ప్రయత్నించడంలో తప్పులేదు. కానీ సీటు రాకపోతే వదలకపోవడంలో విజే, బాబిలకు, అంతకు ముందే వలస వచ్చిన మన దేశీయులు మార్గ దర్శకులయ్యారు. ఆ ప్రయత్నంలోనే ఇలా  విజే,  బాబి ఈ కన్వెన్షన్ సెంటర్ రావడం జరిగింది.

 

విజే కి అమ్మాయి. బాబి కి అబ్బాయి. ఇద్దరు ఇప్పుడు కాలేజి నాలుగో సంవత్సరం లో ఉన్నారు. చేతికందినంత డబ్బులు ఉండడం, ఖర్చు పెట్టడానికి బార్లు, కార్లు, స్నేహితులు ఉండడం, వీరితో మాట్లాడడానికి కూడా తీరక లేని తల్లి తండ్రులుండడం, వీరికి రెండో సంవత్సరంలోనే తెలిసిపోయింది ఇక్కడ మెడికల్ సీట్ రాదని. విజే, బాబి లకు మాత్రం పిల్లలను ఎలానో అలా డాక్టర్లను చేయాలని పట్టుదల. కార్లు, ఇండ్ల తో పాటు , పిల్లలు డాక్టర్లు అయ్యితేనే జీవన సఫలత కు పరాకాష్ట.

 

"ఈ కేరీబియన్ కాలేజీల గురించి బాగానే చెప్పారు. నాకు వీటి గురించి అంతగా తెలియదు. నన్ను కూడా నీతో పాటు ఈ కాన్ఫరెన్స్ కు పిలుచుక వచ్చినందుకు థాంక్స్, బాబి", అన్నాడు విజే.

 

"ఇక్కడ అమెరికన్ యూనివర్సిటీస్ లో సీట్ రాలేదంటే ఇక కేరీబియన్ లేకపోతే ఇండియాలో ఏదో ఓ డొనేషన్ కాలేజినే మార్గం కదా. ఇంతకీ నీవేం నిర్ణయం తీసుకున్నావు"  ప్రశ్నించాడు బాబి.

 

"అమ్మాయి కదా, ఇండియా ఆప్షన్ మంచిదనిపిస్తుంది. కాలేజి దగ్గరే  ఓ అపార్ట్మెంట్ కొని మా అమ్మను కూడా తోడుగా ఉండమనవచ్చు"

 

"ఇంకా బేబి సిట్టింగ్ ఎందుకు విజే, ఆలోచించి నిర్ణయం తీసుకో. మెడికల్ డిగ్రీ బయట చేస్తే ఇక్కడ వెంటనే రెసిడెన్సీ ఇవ్వరు. క్లినికల్స్ చేయాలి, లైసెన్స్ పరీక్షలు వ్రాయాలి. ఈ కేరీబియన్ కాలేజీలకు అమెరికా ఈస్ట్ కోస్ట్ లో ఉన్న కొన్ని కాలేజీలతో అనుబంధాలు ఉన్నాయి. కేరీబియన్ కాలేజి పిల్లలు తమ 3వ 4వ సంవత్సరాలు ఇక్కడ అమెరికాలోనే చేయొచ్చు. రెసిడెన్సీ మేచి అవకాశాలు కూడా ఎక్కువ", అన్నాడు బాబి.

 

"నాకు తెల్సిన డాక్టర్ వాళ్ళ అమ్మాయి ఇండియాలో చదివి మొన్న మార్చిలో మ్యాచ్ అయ్యింది. తనకు మంచి స్కోర్ కూడా వచ్చిందట. కొంత మంది రెసిడెన్సీ డైరెక్టర్లు కూడా మా బంధువులలో పట్టాను. సహాయం చేస్తామన్నారు కూడా" అన్నాడు విజే.

 

"ఇండియాలో చదివి ఇక్కడి లైసెన్స్ పరీక్షలు పాస్ కాలేక తిరిగి ఏదో చిన్న ఉద్యోగానికే సెటిల్ అయిన వారిని కూడా చూసాను. డిగ్రీ  తెచ్చు కోవడానికి ఇండియా అయినా కేరీబియన్ అయినా కోటి పైనే ఖర్చు అవుతుంది. అలోచించు. నేనైతే మా అబ్బాయిని కేరీబియన్ లోనే చేరుస్తాను. దగ్గర్లో ఉంటాడు, రెండు సంవత్సరాలు కేరీబియన్ లో, మరో రెండు ఇక్కడ అమెరికాలోనే చదువుకుంటాడు. ఆ కేరీబియన్ కాలేజి క్లినికల్ రొటేషన్, లైసెన్స్ పరీక్షలకి, రిసిడెన్సీ మ్యాచ్ కావడానికి సహాయ పడుతుంది. సక్సెస్ రేటు కూడా ఎక్కువ", మెత్తగా హెచ్చరించాడు బాబి.

 

అలా వారు పిల్లల భవిషత్తు గురించి మాట్లాడుతూ ఉంటే, వారి దృష్టి ఓ రెండు టేబుళ్ల అవతల కూర్చున్న అతని మీద పడింది.

 

విజే బాబీ ల కంటే ఓ 20 ఏళ్ళు పెద్దతను. పూర్తిగా బట్టతల. అక్కడక్కడా ఉన్న జుట్టు కూడా పూర్తిగా నెరిసిపోయింది కను బొమ్మలతో సహా. అతని ముఖం చూడగానే కొట్టొచ్చినట్లు కనపడేది ప్రసన్నత, తరచుగా దోబూచులాడే చిరు నవ్వు. తను, తన పక్కనున్న వారు ఏదో మాట్లాడుతూ నవ్వుతూ సంతోషంగా ఉన్నారని ఇట్టే తెలిసిపోతుంది.

 

"రామారావు కదూ, చాల రోజుల తరువాత కనపడ్డాడు", విజే గొంతులో ఓ తేలికభావం బాగా ప్రస్ఫుటమయ్యేటట్లు మాట్లాడాడు.

"అవును విజే, రామారావే, తను ఇలాంటి రిసార్ట్, కాన్ఫెరెన్సులకు రావడమేమిటి? చూసి ఓ 10 యేళ్ళ పైనే అయ్యింది", అదే తేలిక భావంతో అన్నాడు బాబి.

 

రామారావు, విజే, బాబి ఓ పదేళ్ల క్రితం ఒకే ఊళ్ళో ఉండే వారు. ఉగాది, సంక్రాంతి, దీపావళి లాంటి పండగలకు తెలుగు సంఘం పెట్టే కార్యక్రమాలలో కలిసేవారు. రామారావు 1970 ప్రాంతంలో చదవడానికి వచ్చి అలానే యూనివర్సిటీలో ఓ టీచింగ్ జాబ్ లో చేరిపోయాడు. తనకు సరిపోయిన ఆవిడనే పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. వారికీ ఒకే అమ్మాయి.

 

రామారావు గురించి అప్పటికే జనాలు గుస గుసలాడుతూ నవ్వుకునే వారు. దానికి కారణం, అందరిలా కాకుండా ఓ విచిత్రమైన జీవన విధానం అతడు ఎన్నుకోవడమే. అందరూ ఓ కమ్యూనిటీలో ఇళ్లు కొనుకుంటే, రామారావు ఊరి బయట ఉన్న ఓ పాత ఫార్మ్ హౌస్ ను కొన్నాడు. చిన్న ఇల్లు, దాని చుట్టూ పెద్ద యార్డు, కంచె బదులు ఎత్తుగా పెరిగిన పొదలు, చెట్లు, ఇంటి పక్కన పాడు పడిన గాదె.  అసలు ఆ గాదె కోసమే రామారావు ఆ ఇల్లు కొన్నాడని కొందరంటారు. గాదెని, ఓ గరాజి లాగ మార్చి, తను కొన్న ట్రక్ పైన అదో ఇదో ప్రాజెక్టులు చేయడం రామారావు సరదా.  రామారావు వాళ్ళావిడ పిల్లలకి సంగీతం నేర్పడం వల్ల దాదాపు ఊళ్ళో, పిల్లలున్న తెలుగు వారందరూ ఆ ఇంటిని చూడడము వెనుక నవ్వుకోవడం జరిగాయి. రామారావుకి ఆ సంగతి తెలిసే ఉంటుంది. కాని దానిని అతనెప్పుడూ పట్టించుకోలేదు.    దానికి తగ్గట్టు, వారి అమ్మాయికి రామారావు మెర్సిడెస్ అన్న పేరు పెట్టడం కూడా రామారావును చూసి నవ్వడానికి మరో కారణమైనది. మెర్సిడెస్ పెంపకం ఒక విచిత్రమే. ఆ అమ్మాయి వాళ్ళమ్మ దగ్గర సంగీతం నేర్చుకోవడానికి యే మాత్రం ప్రయత్నం చేయలేదు. ఎప్పుడూ రామారావు వెంట ట్రక్ మీద పని చేస్తుంటే సహాయం చేసేది. హై స్కూల్ వచ్చే సరికి, ఒక లెక్కల సబ్జెక్ట్ తప్ప మిగతా వాటిలో సరిగా మార్కులు వచ్చేవి కాదు. కమ్యూనిటీ కాలేజీలో వెల్డింగ్, వర్క్ షాప్ లాంటి కోర్సులు తీసుకొంది. అప్పుడే పిచ్చిగా పాత గడియారాల  పైన గంటల తరబడి పని చేస్తుండేది. కాలేజీ లో ఉన్నప్పుడు ఓ రోజు పిక్కల పైన, ముంజేతి పైన పెద్ద పెద్ద పచ్చలు పొడిపించేసుకుంది. ఆ తరువాత కాలేజి డ్రాప్ చేసి పనిలో చేరినట్లు వినికిడి.  ఏదో టూల్ కంపెనీలో చేరిందని చెప్పారు. మెర్సిడెస్ ఓ ఆర్టిస్ట్ ను ప్రేమించి పెళ్ళిచేసుకుందన్న మాట ఎవరిని ఆశ్చర్యచకితులను చేయలేదు. రామారావు మీద జాలి పడడానికి, నవ్వుకోవడానికి మరో అవకాశంగా దోహద పడ్డాయి.

 

"నాకు రామారావు అంతుబట్టలేదు, బాబి. అందరిలాగా ఓ మాడల్ హోం కొనుక్కోవచ్చు కదా. ఓ మంచి కారు కొనవచ్చు కదా. స్పెల్లింగ్ బీ, జాగ్రఫీ బీ, యంగ్ బిజినెస్ లీడర్స్, పబ్లిక్ స్పీకింగ్, టెన్నిస్, బ్యాండ్, షో కాయిర్, ఎన్ని ఆక్టివిటీ లు ఉన్నాయి. మనమంతా పిల్లలను వేసుకొని వీటిలో  కోచింగ్ కని,  పాల్గొనడానికి అని తిప్పి తిప్పలు పడలేదు.  పిల్లకు ఇంట్రెస్ట్ లేదంటూ, ఒక్క దానిలో కూడా చేర్చలేదు. తనతో బాటు ఆ ట్రక్ పనిలో పెట్టేసాడు. ఉన్న ఒక  పిల్లకు మంచి చదువులు చదివించి ఓ డాక్టర్నో, లాయర్నో, చివరకు సాఫ్ట్ వేర్ మేనేజర్ నో చేసి ఉండవచ్చు కదా. పిల్ల భవిష్యత్తు నాశనం చేసేసాడు. పెళ్లి కూడా అమ్మాయి మనసు పడితే ఒప్పుకోవడమేనా. వద్దని మంచి సంబంధాలు వెదికి ఉండవచ్చు కదా", అన్నాడు విజే.

 

"నాకూ రామారావు మిస్టరీనే, విజే. మా అబ్బాయి డాక్టర్ అయ్యితే డాక్టర్ అమ్మాయి సంబంధమే చూస్తాను. అప్పుడే ఈడు జోడి గా ఉంటుంది",  అన్నాడు బాబి.

 

విజే, బాబి లు రామారావు గురించి మాట్లాడుతూ ఉన్న, రామారావు ను కలవాలన్న ఆసక్తి లేదు. అందుకే వారు మరో వైపు చూస్తూ మాట్లాడుకోసాగారు. కాని రామారావు దృష్టి విజే, బాబి ల   మీద పడింది. తనతో మాట్లాడుతున్న వారితో ఇప్పుడే వస్తానని , నవ్వుతూ విజే బాబి ల దగ్గర వచ్చి హలో అని పలకరించాడు.

 

" హలో రామారావు గారు", ఇద్దరూ ఒకేసారి పలికారు.

 

" ఎలా ఉన్నారు.  ఏంటి ఇలా వచ్చారు", అన్నాడు రామా రావు.

 

"పిల్లలని మెడికల్ కాలేజీలో చేర్పించడానికి సెమినార్ కని వచ్చాం. మీరేమిటి ఇలా. మెర్సిడెస్ ఎలా ఉంది", అడిగాడు బాబి.

 

"మెర్సిడెస్ బాగానే ఉంది. తను కూడా వచ్చింది. పిల్లలు అప్పుడే కాలేజీలో చదువుతున్నారు. వాళ్ళని చిన్న పిల్లలుగా నిన్న చూసినట్లు ఉంది", అన్నాడు రామారావు.

 

" అవును, టైం ఫ్లైస్ అండి. ఇంతకూ మీరు వెకేషన్ మీద వచ్చారా ఈ రిసార్ట్ కు", బాబి ప్రశ్నించాడు.

 

" లేదు, మేము కాన్ఫరెన్స్ కనే వచ్చాం", రామారావు బదులిచ్చాడు.

 

"ఓహో, కాన్ఫరెన్స్ లో పాల్గొనాలని వచ్చారా? మీరు రిటైర్ అయ్యి పోయారు కదా, ఇంకా ఈ కాన్ఫరెన్స్ లెందుకు?"

 

" కాన్ఫరెన్స్ నాకు కాదు, మెర్సిడెస్ కు,"

 

" అలానా, మెర్సిడెస్ పాల్గొనాలని వచ్చిందా?"

 

"అవును, తనదో   ప్రెజెంటేషన్ ఉంది"

 

" మెర్సిడెస్ పేపర్ ప్రెజెంట్ చేస్తున్నదా? తను కాలేజి గ్రాడ్యుయేషన్ కూడా కాలేదు కదా"

 

"అవును తను కాలేజీ డ్రాప్ ఔట్. తనదే కీ నోట్ అడ్రస్ "

 

"అర్ధం కావటం లేదండి. కాచ్ అప్ చేయాల్సిందే. వివరంగా చెప్పండి", విజే రామా రావు ను అడిగాడు.

 

"మెర్సిడెస్ ను మీరు చూసి పదేళ్ల పైనే అయ్యింది కదా. తనకు చిన్నప్పటి నుంచే గడియారాలు,  వాచీ, మీనియేచర్ మోటార్స్ పైన పని చేయడం ఇష్టం ఉండేది.  కాలేజి డ్రాప్ అయ్యిన తరువాత, ఓ కంపనీ పెట్టి,  శరీరంలో ఇంజెక్షన్ ద్వారా ప్రవేశపెట్టగలిగే డ్రోన్స్ మీద పనిచేయడం మొదలు పెట్టింది. దీన్ని జబ్బులు కనుక్కోవడానికి, చివరికి సర్జరీ బదులు కూడా ఉపయోగించే అవకాశాలు ఉన్నందువల్ల వెంచర్ కేపీటలిస్టు లు సహాయపడడం తో కంపెనీ బాగానే పైకి వచ్చింది. ఇప్పుడు ఓ  పది మంది డాక్టర్లు కూడా ఈ కంపెనీలో చేరారు. ఈ సెమినార్ మెర్సిడెస్ తన కంపెనీ సాధించిన ప్రగతి గురించి వైద్య రంగంలో ఉండేవారికని ఏర్పాటు చేసింది. కాన్ఫరెన్స్ కు చాలా మంది డాక్టర్లు, సైంటిస్టులు వచ్చారు"

 

బాబికి రామారావు చెప్పిన విషయం షాక్ లాగ అనిపించింది. తను పిల్లలని పైకి తీసుకు రావడానికి ఎంచుకొన్న మార్గంకు భిన్నంగా ఉన్న మెర్సిడెస్ జీవితం తీవ్ర అసంతృప్తికి కారణం అయ్యింది. వెంటనే రామారావు నుద్దేశించి "మరి మీ అల్లుడు సంగతేమిటండి. ఇంకా బొమ్మలేస్తూనే ఉన్నాడా", ఎంత దాచుకున్నా ఓ చిన్న ఎగతాళి గొంతులోంచి బయటపడింది. 

రామారావు  అదే చిరు నవ్వుతో "అల్లుడు బాగానే ఉన్నాడండి. తన ఆర్ట్ ఎక్సిబిషన్ పోయిన వారం న్యూ యార్క్ లో జరిగింది. తన పెయింటింగ్స్ మీద జనాలు, కంపెనీలు బాగానే ఇంట్రెస్ట్ చూపెడుతున్నాయి. అతను ఫార్చ్యూన్ 500 కంపెనీలకు ఆర్ట్ కన్సల్టెంట్ లాగ పని చేస్తున్నాడు. మెర్సిడెస్ కంటే తనకే సంపాదన ఎక్కువ. మనసున్న పనే జీవనోపాధి అవ్వుతే అంతకు మించింది ఏముంది. ఏ పని ఎంచుకున్నా, అందులో బాగా రాణించగలిగితే డబ్బు తనంతట అదే వస్తుంది అన్నదానికి మా అల్లుడే తార్కాణం" అన్నాడు. రామారావు, బాబి ఎగతాళి గమనించకుండా ఉంటే, చివరి రెండు వాక్యాలు పలికే వాడు కాదేమో.

 

విజే కి కూడా ఈ సంభాషణ కష్టంగా ఉంది.  అతనికి రామారావు మీద, ఇది విన్న తరువాత గౌరవం పెరిగింది. కానీ తామెంచుకున్న మాడల్ కంటే రామారావు గారి మాడల్ మంచిదేమో అన్న సందేహం మొదలైంది.

 

"మరి మేము పిల్లలను కెరీబియాన్లో చేర్పించడం సరి అంటారా. మీ అభిప్రాయం చెప్పండి", అని రామారావును అడిగాడు విజే.

 

రామారావు విజే ముఖం చూస్తే కొంచెం జాలి కలిగింది.

 

" ఆ ప్రశ్నకు జవాబు మీ పిల్లలే చెప్పాలి".

oooo

మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...
 

Bio

నిర్మలాదిత్య ( భాస్కర్ పులికల్ )

ఇంటర్లో స్టేట్ మొదటి రాంక్, యూనివర్సిటీ లో మొదటి రాంక్, రిజర్వ్ బ్యాంకు లో ఉన్నతోద్యోగానికి  దారి తీసి, జీవితం చక్కగా నడుస్తున్నా, అవతల వైపు ఏముందో అన్న ఉత్సుకత తో 1998 లో అమెరికాకు వలస రావడం ఓ గొప్ప మలుపు - ప్రస్తుత నివాసం టాంపా బే, ఫ్లారిడ . 1986 నుంచి 1998 వరకు విపుల, ప్రభ, జ్యోతి, స్వాతి వంటి పత్రికల లో కథలు అచ్చైయాయి. 1998 నుంచి 2004 వరకు evaram.com తెలుగు పత్రిక వెబ్లో నడపడం అందులో రచనలు చేయడం మరువరాని అనుభవం . 2004 నుంచి అమెరికా జీవనం ప్రతిపలించే మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాను, దాదాపు అన్ని కథలు వంగూరి ఫౌండేషన్ పోటీలలో నెగ్గినవే. యూనివర్సిటీ అఫ్ అయోవా రైటర్స్ వర్క్ షాప్ ద్వారా రెండు కథలు ఇంగ్లీషు లో అచ్చయ్యాయి.  జీవితము అనుక్షణం సంతోషంగా గడపడానికి నా స్నేహితురాలు, సహచరి నిర్మల, అబ్బాయి ఆదిత్య కారకులు.

***

Nirmalaaditya
Comments
bottom of page