top of page

సంపుటి 1 సంచిక 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

మా వాణి ...

అక్కడ తెలుగునాట ఘంటసాల యుగం ముగిసి బాలూ యుగం మొదలవుతున్న రోజులు. ముత్యాల ముగ్గు సినిమా శతదినోత్సవాలు జరుపుకుంటున్న రోజులు. ప్రిన్స్ మహేష్ బాబు బుడి బుడి నడకలు వేస్తూ మమ్మీ, డాడీ అంటున్న రోజులు. అన్ని పాఠశాలలలోనూ ఇంకా మాతృభాష నేర్పిస్తున్న మంచి రోజులు. దేవులపల్లి వారికి ఇంకా కేంద్ర సాహిత్య ఎకాడెమీ బహుమతి రాని రోజులు. ఆంద్రజ్యోతిలో అమరావతి కథలు సంచలనం సృష్టిస్తున్న రోజులు. చేరా గారి “తెలుగు వాక్యం” మన భాష ఔన్నత్యం మీద అవగాహన పెంచిన రోజులు. భారత దేశంలో ఎమర్జెన్సీ అమలులో ఉన్న రోజులు...ఇంకా ఎన్నెన్నో...

ఇక్కడ అమెరికాలో వియత్నాం యుద్దం తరువాత సద్దుమణగని అస్తవ్యస్త ఆర్ధిక పరిస్థితులు. గ్రీన్ కార్డ్ కి అప్లై చెయ్యాలంటే కొంచెం భయపడే రోజులు. తొలి తరం తెలుగు వారు తమ ఆస్థిత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో సాంస్కృతిక సంఘాలు సంస్థాపించుకుంటున్న రోజులు. మన వాళ్ళతో మూడు నిముషాలు మాట్లాడి మహానందపడడానికి అమెరికన్ ఆపరేటర్ ద్వారా కాల్ బుక్ చేసుకుని గంటల తరబడి ఫోన్ కనెక్షన్ కోసం ఆత్రుతగా ఎదురుచూసే రోజులు. బాగా ధనవంతులు తప్ప కలర్ టీవీ కొనుక్కోలేని రోజులు. కంప్యూటర్, ఇంటర్ నెట్ లాంటి పదాలు నిఘంటువు లో నిక్షేపించబడీ,   వెబ్ సైట్, సెల్ ఫోన్ లాటి పదాలు మానవమాత్రులు వినని  రోజులు. మొత్తం టెక్సస్ రాష్ట్రంలో తెలుగు వాడు స్థాపించిన ఒకే ఒక్క ఇండియన్ రెస్టారెంట్ ఉన్న రోజులు.

కేవలం పాతిక మంది తెలుగు కుటుంబాలు, అమెరికా మొత్తం మీద ఐదు తెలుగు సంఘాలు మాత్రమే ఉన్న ఆ రోజుల్లో... హ్యూస్టన్ మహా నగరం లో ప్రారంభించబడిన సరికొత్త తెలుగు సాంస్కృతిక సమితికి అనుబంధంగా వెలసిన అచ్చ తెలుగు పత్రిక “మధురవాణి.  1977 ఉగాది నాడు నలభై పేజీల చేతివ్రాతగా, 50 క్సీరాక్స్ కాపీలతో విడుదల అయిన ప్రారంభ సంచిక నుండీ కథలూ, కవితలూ ప్రచురిస్తూ అచిరకాలంలోనే ఉత్తర అమెరికాలో సాహిత్యానికి పెద్ద పీట వేస్తున్న ఒక మంచి పత్రికగా గుర్తింపు పొందింది.  కాలక్రమేణా కొన్నేళ్ళు కేవలం సంస్థాగత సమాచార పత్రికగా మారిపోయి, గత పదేళ్ళగా సుదీర్ఘ సుషుప్తి లోకి జారుకుంది.

ఆ “మధురవాణి” ని నిద్ర లేపి, ముస్తాబు చేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఒక అంతర్జాల పత్రికగా తీర్చిదిద్దాలని ఉవ్విళ్ళూరుతూ గత కొద్ది కాలంగా నేనూ, కొందరు నవతరం సాహిత్యాభిమానులూ ఆ ప్రయత్నాలు మొదలుపెట్టాం. వారిలో ముఖ్యులు సుధేష్ పిల్లుట్ల, మధు పెమ్మరాజు, చిలుకూరి సత్యదేవ్, శాయి రాచకొండ, శ్రీనివాస్ పెండ్యాల, దీప్తీ పెండ్యాల. వీరందరూ సాహిత్యాభిమానులే  కాక కలం పట్టి మంచి రచనలు చేసే వారే. వారిలో సుధేష్ ఆధ్యాత్మిక అవగాహనలో దిట్ట. మధు పెమ్మరాజు అమెరికాలో తెలుగు కథకి కొత్త గొంతు. సత్యదేవ్ ప్రాచీన, ఆధునిక సాహిత్యాలు రెండింటిలోనూ ప్రతిభావంతుడు, శాయి సాహిత్య విశ్లేషణలో నిష్ణాతుడు. వీళ్ళెవరూ నేల విడిచి సాము చెయ్యరు. తమకి తామే “ఎత్తు” లో పెట్టుకుని ఇతర సాహితీవేత్తలని తక్కువగా చూడరు. వీరిలో  ఇటీవల ఉద్యోగరీత్యా మా హ్యూస్టన్ నగర నివాసులుగా తరలి వచ్చిన యువ దంపతులు శ్రీనివాస్  & దీప్తి పెండ్యాల రాకతో మా ప్రయత్నాలకి అనుకోని “ఊపు” వచ్చింది. అందుకు కారణం వారికి అంతర్జాలంలో పత్రికలు రూపు దిద్దడంలో అత్యవసరమైన సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానం, అనుభవం ఉన్నాయి. అన్నింటికీ మించి అద్వితీయమైన ఆసక్తీ, తెలుగు భాషా సాహిత్యాల మీద వల్లమాలిన అనురక్తీ, స్వయంగా కలానికి పదును పెట్టే ధీశక్తీ కూడా ఉన్నాయి. ఇవి గమనించి “మధురవాణి” పునరుజ్జీవనం ప్రసక్తి వారి దగ్గర తీసుకురాగానే  వారిద్దరికీ తక్షణం అది నచ్చేసి, ఆ ఆలోచనని స్వంతం చేసుకుని “మధురవాణి” సమగ్ర రూపకల్పనకి పూనుకొన్నారు. ఇక అందరం ఆఘమేఘాల మీద నిర్వహణా బాధ్యతలు పంచుకుని, ఇప్పుడు మీరు వీక్షిస్తున్న “మధురవాణి” అంతర్జాల పత్రిక ప్రారంభ సంచిక సగౌరవంగా సమర్పిస్తున్నాం. మేము రచనల కోసం ఆహ్వానం పంపించగానే వచ్చిన అనూహ్యమైన స్పందన మా ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.

సుమారు నలభై ఏళ్ళ క్రితం “మధురవాణి” వ్యవస్థాపక సంపాదకుడిగా ఆనాడు నా జీవితంలో   మొట్టమొదటి సంపాదకీయం వ్రాశాను. అంతేకాక ఇప్పటికీ చాలా మంది గుర్తుపెట్టుకుని గొల్లపూడి వారి “వందేళ్ళ తెలుగు కథకి వందనం” (టీవీ ప్రసారం) వంద కథలలో ఒకటిగా ఎంపిక అయిన నా మొట్టమొదటి కథ “జులపాల కథ” కూడా అప్పుడే వ్రాశాను. వాటికి గుర్తింపుగా ఈ ఇ-మధురవాణి లో ఈ “మా వాణి” అనే ముందుమాట వ్రాసే అవకాశం నాకు కలిగించి మా నిర్వాహక బృందం నాకు ఎనలేని గౌరవం చేశారు. దీన్ని మేము సంపాదకీయం అనే ఉద్దేశ్యం లేదు. ఎందుకంటే నాతో కలిపి మేము ఏడుగురమూ “మధురవాణి” నిర్వాహకులమే కానీ సంపాదకులం అనే పెద్ద తరహా మాటలు వద్దు అనుకున్నాం. బాధ్యతా నిర్వహణలో మాలో అందరూ సమానమే కానీ ఎవరూ “ఎక్కువ” సమానం కాదు. మధురవాణి అంతర్జాల పత్రికగా మళ్ళీ ప్రారంభించడంలో సాహిత్యపరమైన ఆశయాలు “మా గురించి” అనే వేరే పేజీలో పొందుపరిచాం. ఈ సంచిక “మన ఇల్లు” పేజీలో కనపడుతున్న “బాపు బొమ్మ”, నిజంగానే బాపు గారు “మధురవాణి” కోసం పాతికేళ్ళ క్రితం వేసినదే! మకుటం కూడా ఆ మహానుభావుడి చేతి వ్రాతే!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు పాఠకులకి మధురవాణి లో ఉన్న శీర్షికలు ఆసక్తి కలిగిస్తాయి అని మా నమ్మకం. ముందు ముందు మరికొన్ని కొత్త శీర్షికలు, వెసులుబాట్లు కలిగిస్తాం. ఆయా శీర్షికలలో ఉండే రచనల మీద మీ అభిప్రాయాలనీ, “మధురవాణి” పత్రిక ఇంతకంటే సులభంగా చదువుకోడానికీ, సాంకేతిక వెసులుబాటుల విషయాలలోనూ, అదనపు అంశాలలోనూ మీ నిర్మాణాత్మక సూచనలని స్వాగతిస్తున్నాం.

మీ స్పందన మాకు తెలియజేయవలసిన చిరునామా

sahityam@madhuravani.com

వంగూరి చిట్టెన్ రాజు

bottom of page