top of page

క్రింది పేజీలు

ప్రస్తుత తాజా సంచికలో

లభ్యమవుతాయి

సంక్రాంతి సంచిక 2016​

వ్యాస ​మధురాలు

డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్

తెలుగులో వెలువడిన జన్యుశాస్త్ర మరియు వైద్యశాస్త్ర కాల్పనిక కథా సాహిత్యం​

తెలుగు సాహిత్యంలో ఆంగ్ల సాహిత్య ప్రభావంతో ఆవిష్కరించిబడిన నూతన ప్రక్రియ విజ్ఞానశాస్త్ర కాల్పనిక కథా సాహిత్యం. ఈ ప్రక్రియ మన సాహిత్యంలో కొన్ని దశాబ్దాలముందే ఉదయించినా, తన పరిధిని విస్తృతం చేసుకోవడంలో సఫలీకృతం కాలేకపోయింది. విజ్ఞానరంగంలో వచ్చిన మార్పులు సాహిత్యం మీద చూపిన ప్రభావమే వైజ్ఞానిక కాల్పనిక సాహిత్య ఆవిర్భావానికి కారణం. విజ్ఞానశాస్త్ర కాల్పనిక సాహిత్యంలో సైన్సుకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యం ఊహలకు ఉంటుంది. ఈ సాహిత్యంలో రచయితచే చేయబడిన ఊహలు భవిష్యత్తులో నిజరూపం దాల్చడానికి అవకాశం ఉందేమో అనే భావనను పాఠకులకు కలిగిస్తుంది. భవిష్యత్తులో మానవుడు కనుగొనడానికి అవకాశం గల నూతన ప్రయోగాలను, నూతన పరిశోధనలను విజ్ఞానశాస్త్ర కాల్పనిక సాహిత్యం ముందుగానే ఊహిస్తుంది. 
వివిధ రకాలైన ఆలోచనలతో, సిద్ధాంతాలతో వెలువడే విజ్ఞానశాస్త్ర  కాల్పనిక కథా సాహిత్యం అటు రచయితలను – ఇటు శాస్త్రవేత్తలను అనుసంధానం చేస్తుంది. భవిష్యత్తులో నూతన పరికరాలను, నూతన పరిశోధనలను, నూతన ప్రయోగాలను సృష్టించడానికి ఈ సాహిత్యం ఒక మార్గదర్శి. ఈ సాహిత్య అధ్యయనం మానవ పరిశోధన వికాసానికి దోహదం చేస్తుంది. సైన్సు అనేది రెండు వైపుల పదునున్న కత్తి వంటిది. సైన్సు మేలుతో పాటు కీడు కూడా చేస్తుంది. సైన్సును ఉపయోగించుకోవాల్సిన తీరును గూర్చి, సైన్సును స్వార్ధానికి ఉపయోగించుకుంటే కలిగే దుష్ఫలితాలను గూర్చి విజ్ఞానశాస్త్ర కాల్పనిక కథా సాహిత్యం హెచ్చరిస్తుంది. 
19వ శతాబ్దంలో పాశ్చాత్య సాహిత్యం నందు విజ్ఞానశాస్త్ర కాల్పనిక రచనలు విరివిగా వెలువడ్డాయి. ఎడ్గర్ అలెన్ పో, జూల్స్ వెర్న్, హెచ్.జి.వెల్స్, మేరీషెల్లీ, ఆసిమోవ్, సి.ఆర్. క్లార్క్, నాతనియెల్ హోతార్న్, ఒబ్రియన్ మొదలైన రచయితలు విజ్ఞానశాస్త్ర కాల్పనిక కథలు, నవలలు వ్రాశారు. ఈ రచయితలు తమ రచనలలో చేసిన చంద్ర మండల యాత్ర, జలాంతర్గామి, ఖండాంతర క్షిపణి తదితర ఊహలు ఆ తరువాత కాలంలో వాస్తవాలయ్యాయి. దీంతో రచయితల కల్పనలకు, ఊహశక్తికి గౌరవం లభించింది. ఈ రచయితల రచనల ప్రేరణతో తెలుగు రచయితలు కూడా విజ్ఞానశాస్త్ర కాల్పనిక సాహిత్యాన్ని సృజియించారు.  తెలుగులో జన్యుశాస్త్ర మరియు వైద్యరంగానికి సంబంధించిన అంశాల నేపథ్యంతో కొందరు రచయితలు కథలను వ్రాశారు. భవిష్యత్తులో జన్యుశాస్త్రం మరియు వైద్యరంగంలో వచ్చే పురోభివృద్ధిని గూర్చి, తత్ఫలితంగా కలిగే లాభనష్టాలను ముందుగానే ఊహిస్తూ ఈ కథలు వెలుగు చూశాయి.  
భవిష్యత్తులో జన్యుశాస్త్రం మరియు వైద్యశాస్త్రంలో వచ్చే పురోభివృద్ధిని గూర్చి, తత్ఫలితంగా కలిగే లాభనష్టాలను ఊహిస్తూ కొన్ని కథలు వెలువడ్డాయి. ఎమ్. హేమలత వ్రాసిన కన్నతల్లి టెస్ట్ ట్యూబ్ బేబీస్ కథా నేపథ్యంలో వెలువడిన కథ. ఈ కథ 1979వ సంవత్సరంలో ఆంధ్రప్రభ వారపత్రిక మే సంచికలో వెలువడింది. ఈ కథలో సంపన్నులైన ఆనందరావు – సునీత దంపతులు సంతానం కోసం డాక్టర్ సంజయ్ చోప్రాను సంప్రదిస్తారు. డాక్టర్ వీరిని పరీక్షించి సునీత గర్భం నుండి అండాన్ని వేరుచేసి, ఆమె భర్త వీర్యంలోని పురుష కణాలతో కలిపి టెస్ట్ ట్యూబ్ లో వుంచుతాడు. ఆ టెస్ట్ ట్యూబ్ లో జీవం పోసుకున్న ప్రాణాన్ని తమ పని మనిషి గర్భాశయంలోకి చేర్చి శిశువును జన్మింపజేస్తాడు. 1979వ సంవత్సరంలోనే టెస్ట్ ట్యూబ్ బేబీలకు సంబంధించిన విషయాలను కథ నేపథ్యంలోకి చొప్పించిన రచయిత్రి ముందుచూపును అభినందించాల్సిందే. 
1952లో పెన్సిల్వేనియాలో ఒక కప్ప నుండి ఎంబ్రియోను గ్రహించి, దాని ద్వారా మరో కప్పను సృష్టించడానికి ప్రయత్నాలను ప్రారంభించారు. 1980లో ఫిలడెల్ఫియాలో బయాలజిస్టులు ఎదిగిన కప్ప నుండి గ్రహించిన ఎర్ర కణాలను ఉపయోగించి చిరు కప్పలను సృష్టించారు. ఆ ప్రయోగాలు రచయితలను ఉత్సాహపర్చాయి. అందువల్లనే 1980 ప్రాతంలో తెలుగు కథా సాహిత్యంలో క్లోనింగ్ కు సంబంధించిన కథలు ఎక్కువగా వెలువడ్డాయి.
మనిషిలోని భావాలకు భౌతికరూపం ఇవ్వడాన్ని గూర్చి ఎన్.ఆర్. నంది వ్రాసిన మానవుడు – దానవుడు అనే కథ తెలియజేస్తుంది. ఈ కథలో సైంటిస్ట్ శ్రీహరిరావు మనిషిలోని భావాలకు రూపం ఇవ్వగల యంత్రాన్ని తయారుచేస్తాడు. ఈ యంత్రం ఆయనలోని సుగుణాలన్నిటితో ఒక యువతికి భౌతిక రూపం ఇస్తుంది. అట్లే అతనిలోని చెడ్డ గుణాలతో మరో వ్యక్తిని రూపొందిస్తుంది. చెడు గుణాల సమాహారంగా రూపుదిద్దుకున్న ఆ వ్యక్తి విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉంటాడు. డాక్టర్ రామారావు అనే మరో సైంటిస్ట్ శ్రీహరిరావు దుష్ట పరిశోధనలను గ్రహించి, అతని వినాశకర  ప్రణాళికలకు నాశనం చేయడంతో ఈ కథ ముగుస్తుంది. ఈ కథ 1957వ సంవత్సరంలో డిటెక్టివ్ మాసపత్రిక మే సంచికలో  వెలువడింది. క్లోనింగ్ కు సంబంధించిన ప్రాథమికమైన ఊహ ఈ కథలో మనకు కన్పిస్తుంది. 
మెదడుకు నిద్రను కలిగించే రసాయనాలు స్రవించే జీన్ ను తొలిగించడం ద్వారా నిద్రపోని శిశువులను సృష్టించ వచ్చుననే సరికొత్త ఊహకు ఊతమిస్తుంది పురాణపండ రంగనాథ్ వ్రాసిన కల అనే కథ. సైన్స్ సాధించిన అభివృద్ధి కారణంగా జెనెటిక్ మోడిఫికేషన్ ద్వారా నిద్ర అవసరం లేని పిల్లల్ని పుట్టించవచ్చుననే కొత్త ఊహకు ఈ కథ తెరతీస్తుంది.  ఒక అమీబా నుండి అనేక అమీబాలు పుట్టుకొచ్చినట్లే, బల్లి తోక తెగితే ఆ స్థానంలో కొత్త తోక పుట్టినట్లే మానవ శరీరంలోని ఒక అవయవం నుండి మరో మనిషిని ఎందుకు సృష్టించకూడదనే ఆలోచనకు మైనంపాటి భాస్కర్ వ్రాసిన కుడిభుజం అనే కథ ప్రాణం పోస్తుంది.  
అభివృద్ధి చెందుతున్న సైన్స్ భవిష్యత్తులో పురుషుడు అవసరం లేకుండానే ప్రాణులను సృష్టించగలదని రెంటాల నాగేశ్వరరావు వ్రాసిన స్త్రీ పర్వం కథ తెలియజేస్తుంది. ఒక స్త్రీ చేతి చర్మం నుండి కొన్ని కణాల జెనెటిక్ కోడ్ ఉన్న న్యూక్లియస్ తో సహా తీసుకొని, కణాల ట్రాన్స్ ప్లాంట్ ద్వారా మరొక స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెట్టి ఫలప్రదంగా మరో జీవిని సృష్టించడం ఈ కథలో ప్రధాన ఇతివృత్తం. ఈ కథ 1983వ సంవత్సరం ఆంధ్రప్రభ వార పత్రిక ఉగాది సంచికలో వెలువడింది. క్లోనింగ్ ను గూర్చి 16 సంవత్సరాల ముందే ఈ కథలో రచయిత ఊహించారు. పురుషుల అవసరం లేకుండా సంతానోత్పత్తి జరిగిన నాడు పురుషుల విలువ తగ్గి స్త్రీ పర్వం ప్రారంభమవుతుందని ఈ కథ సందేశాన్నిస్తుంది. 
40వ శతాబ్దంలోని శాస్త్ర, సాంకేతిక పురోభివృద్ధిని ఊహిస్తూ పిల్లలమర్రి రామలక్ష్మి జెనెసిస్ అనే కథ వ్రాశారు. ప్రకృతి సిద్ధ జీవ పరిణామాన్ని స్తంభింపజేసి రోబోట్స్ ద్వారా పనులు చేయించుకోవడం, క్లోనింగ్ ద్వారా మనుష్యులను సృష్టించుకోవడం ఈ కథలోని ప్రధాన వస్తువు. ఈ కథలో మూడవ ప్రపంచ యుద్ధ ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా మానవజాతి నాశనం కావడం – ప్రపంచంలోని మేథావులందరూ భూగర్భంలో తలదాచుకోవడం – యుద్ధం ముగిసి రేడియేషన్ తగ్గాక మళ్ళీ వీరు భూమి పైకి వచ్చి మానవజాతిని నిర్మించడం – క్లోనింగ్ ద్వారా అధికార దాహం లేని వ్యక్తులను సృష్టించడం.... తదితర అంశాలు పాఠకులకు కథను చదవాలనే ఆసక్తిని కలుగజేస్తాయి. స్త్రీ పర్వం, జెనెసిస్ ఈ రెండు కథల్లోను ప్రధానాంశం ఒక్కటే. క్లోనింగ్ గూర్చి ఈ కథల్లో ఊహించి చెప్పిన చాలా అంశాలు 20వ శతాబ్ది చివరిదశలో సాధ్యమయ్యాయి.   
వైజ్ఞానికంగా మానవుడు ఎంత అభివృద్ధి సాధించినా ప్రకృతి ధర్మాన్నివిస్మరించి వ్యవహరించరాదని సందేశాన్నిస్తూ కొన్ని కథలు వెలువడ్డాయి. పురుషుని అవసరం లేకుండానే తల్లి కావాలని ప్రయత్నించిన స్త్రీ అభ్యుదయవాదికి ఎదురైన వింత అనుభవాన్ని గూర్చి పురాణపండ రంగనాథ్ వ్రాసిన వికల్పం అనే కథ తెల్పుతుంది. పురుష సమాజంపై ద్వేషంతో ఒక పరిశోధకురాలు పార్దినో జెనెసిస్ ద్వారా బిడ్డను కనాలని ప్రయత్నించి విఫలం కావడం ఈ కథలోని ప్రధాన వస్తువు. అట్లే సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందినా, క్లోనింగ్ ద్వారా పిల్లలను పుట్టించినా అగ్నిసాక్షిగా పెండ్లాడి పిల్లలను కని పెంచడంలో కలిగే మాధుర్యం, ఆత్మ సంతృప్తి చాలా గొప్పదని బుధ వ్రాసిన డ్యామీ అనే కథ సందేశాన్నిస్తుంది. 
ఇప్పటి వరకు గుండె, మూత్రపిండాలు మాత్రమే ట్రాన్స్ ప్లాంట్ చేయడానికి వీలైంది. ఐతే భవిష్యత్తులో మరికొన్ని అవయవాలు కూడా ట్రాన్స్ ప్లాంట్ చేయడానికి అవకాశం ఉందని ఊహిస్తూ విజ్ఞానశాస్త్ర కాల్పనిక కథకులు కొన్ని కథలను సృజియించారు. మెదడు మార్పిడిని గూర్చి తెలుగులో వెలువడిన తొలి కథగా ఎన్.ఆర్.నంది వ్రాసిన పరకాయ ప్రవేశం కథను పేర్కొనవచ్చు. ఈ కథ 1957వ సంవత్సరం డిటెక్టివ్ మాసపత్రిక జూన్ సంచికలో వెలువడింది. మనవుని గుండెమార్పిడిని గూర్చి కూడా ఆలోచనలు అంతగాలేని రోజుల్లో రచయిత ఈ కథలో మెదడు మార్పడిని గూర్చి ఊహించారు.  బంగారం తయారు చేయడం తెలిసిన డాక్టర్ కుటుంబరావు మెదడును దొంగిలించి, దాని స్థానంలో మరో మెదడును అమర్చి, అతని మెదడులోని భావతరంగాల ఆధారంగా బంగారం తయారు చేయడం తెలుసుకోవాలని మరో డాక్టర్ ప్రయత్నించడం ఈ కథలోని ప్రధాన ఇతివృత్తం. మనిషి శరీరంలో అత్యంత ముఖ్యమైనది మెదడు. ఇంతటి ప్రాముఖ్యత సంతరించుకున్న మెదడును తీసివేసి, ఆ వ్యక్తికి మరో మనిషి మెదడును అమర్చడం ద్వారా జరిగే పరిణామాలను గూర్చి కె.ఆర్.కె. మోహన్ వ్రాసిన మనిషిలో మనిషి అనే కథ తెలియజేస్తుంది. మెదడు మార్పిడి వల్ల శరీరం మాత్రమే వ్యక్తిది అవుతుంది కానీ ఆలోచనలు - జ్ఞాపకాలు మాత్రం ఆవ్యక్తికి అమర్చబడిన వ్యక్తుల మెదడును అనుసరించి ఉంటాయని ఈ కథ తెలియజేస్తుంది. 
మనిషిలో మెదడు మార్పిడి వల్ల జరిగే పరిణామాలను వివరించిన మరో కథ ఆర్.వి. లక్ష్మీదేవి వ్రాసిన శంకూ! ఫ్రాంకిన్ స్టయిన్. మరణించిన ఒక క్రూరమైన వ్యక్తికి, మంచి సుగుణాలు గల వ్యక్తి మెదడును అమర్చడం వల్ల అతడు మంచివాడిగా ప్రవర్తించడం ఈ కథలోని ప్రధానాంశం. మనిషి మెదడులోని ఆలోచనలే వ్యక్తి ప్రవర్తనను నిర్దేశిస్తాయని ఈ కథ వివరిస్తుంది. మెదడు మార్పిడి పై వచ్చిన మరో కథ అన్నపూర్ణారెడ్డి వ్రాసిన సోలాంగ్ మై ఫ్రెండ్.  మెదడు మార్పు వల్ల ఒక ప్రేమికుడు తన ప్రియురాలిని మర్చిపోవడం ఈ కథలోని ప్రధాన ఇతివృత్తం. మెదడు మార్పిడి వల్ల శరీరం ఒకరిది, మనస్సు మరొకరిది అవుతుందని ఆ కథ తెలియజేస్తుంది.  
మానవశరీరం, మనస్సులపై సప్త వర్ణాలు ప్రభావాన్ని చూపుతాయి. కలర్ హీలింగ్ పద్ధతి ద్వారా జబ్బులను నయం చేయవచ్చునని శంఖువరపు సరోజా సింధూరి వ్రాసిన వరదగుడి అనే కథ తెలియజేస్తుంది. సప్త రంగుల కాంతి కిరణాలు శరీర అరోగ్యానికి చేసే మేలును గూర్చి, పాశ్చాత్య దేశాలలో వాటి అభివృధ్ధిని గూర్చి జరుగుతున్న పరిశోధనలను గూర్చి ఈ కథలో చక్కగా చర్చించబడింది. కలర్ సోలారైజ్డ్ ప్రాగ్రెన్స్ ఫ్యాన్, కలర్ బ్రీతింగ్, కలర్ వాటర్, కలర్ హీలింగ్ లాంటి ప్రక్రియల ద్వారా దీర్ఘ వ్యాధుల బారి నుండి దేహారోగ్యాన్ని సంరక్షించుకోవచ్చునని ఈ కథ తెలుపుతుంది.
తెలుగు సాహిత్యంలో వెలువడిన వైద్యపరమైన కాల్పనిక కథలలో అత్యధిక భాగం మెదడు మార్పడికి సంబంధించినవే ఎక్కువ. జన్యుశాస్త్ర రంగానికి  సంబంధించిన కాల్పనిక కథలలో ఎక్కువగా క్లోనింగ్ కు సంబంధించినవి. ఈనాడు శాస్త్రవేత్తలు వీర్యకణం లేకుండానే మానవ పిండాన్ని ఉత్పత్తి చేసి మానవాళిని అశ్చర్యంలో ముంచెత్తారు. క్లోనింగ్ కు సంబంధించి రచయితలు చేసిన ఊహలు భవిష్యత్తులో యదార్ధాలుగా మారే అవకాశం లేకపోలేదు. క్లోనింగ్ కు సంబంధించి తెలుగులో చక్కని కథలు వెలువడ్డాయి. జన్యుపరమైన మరియు వైద్యరంగానికి సంబంధించిన కాల్పనిక కథలు తెలుగులో చాలా తక్కువ సంఖ్యలో వెలువడ్డాయి. 1983వ సంవత్సంలోను, 1992 – 1998 మధ్య కాలంలోను ఈ కథలు తెలుగు సాహిత్యంలో ఎక్కువగా వెలుగుచూశాయి. 2000 సంవత్సరం నుండి తెలుగు సాహిత్యంలో ఇటువంటి కథలు కనిపించడం లేదు. ప్రేమ, క్రైమ్ కథల ఒరవడిలో ఇటువంటి కథలు కనుమరుగయ్యాయి. రచయితలు సైతం ఇటువంటి కథలు వ్రాయడానికి ఆసక్తి కనపర్చే ప్రోత్సాహకరమైన వాతావరణం నేడు లేదు. పత్రికలు కూడా ఇటువంటి కథలకు సముచిత స్థానం ఇవ్వడంలేదు.  
సాహిత్యం యొక్క ముఖ్య లక్ష్యం సామాజిక ప్రయోజనం. తెలుగు కథా సాహిత్యంలో ఒక ప్రత్యేక కోవకు చెందిన విజ్ఞానశాస్త్ర కాల్పనిక కథాసాహిత్యం వెలుగు చూడాల్సిన అవసరం సమాజానికి ఎంతో ఉంది. సైన్స్ అభివృద్ధితో ప్రపంచమే ఒక కుగ్రామంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో విజ్ఞానశాస్త్ర మూలాలను సామాన్య ప్రజలకు, ముఖ్యంగా బాలబాలికలకు అందించాల్సిన ఆవశ్యకత ఎంతో వుంది. ఆ అవసరాన్ని ఈ కథా సాహిత్యం తీరుస్తుంది.  విజ్ఞానశాస్త్ర కాల్పనిక కథల ద్వారా నేటి బాలబాలికలకు సైన్సు పట్ల ఆసక్తిని, శాస్త్ర సాంకేతిక రంగాల యందు జిజ్ఞాసను పెంపొందించగలిగినప్పుడే మన దేశం వైజ్ఞాన రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలదు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన కథా సాహిత్యం నవీన కల్పనలతో రానున్న రోజుల్లో వెలువడి తెలుగు కథాసాహిత్యానికి సరికొత్త వెలుగులను ప్రసాదించగలదని ఆశిద్దాం.

 
*****

డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్

డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్

డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్ గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని కొలకలూరు గ్రామంలో జన్మించారు. తెనాలిలోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా పని చేస్తున్నారు. అమెరికా తెలుగు కథా సాహిత్యంపై పరిశోధన చేసి పిహెచ్.డి. డిగ్రీ పొందారు. అనేక జాతీయ - అంతర్జాతీయ - అంతర్జాల పత్రికలలో ఈయన రాసిన సాహితీ వ్యాసాలు ప్రచురించబడ్డాయి. ఆంధ్రదేశంలో వెలువడే ఆంధ్రజ్యోతి, సాక్షి దిన పత్రికల్లో ఈయన రాసిన పలు ఎడిటోరియల్ వ్యాసాలు ప్రచురించబడ్డాయి. 2014 ఆటా వారు నిర్వహించిన వ్యాస రచన పోటీలో ప్రథమ బహుమతి, 2015 తానా వారు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నారు.

Please keep your facebook logged in another browser tab or new browser window to post a comment in madhuravani.com website. 

bottom of page