top of page

సంపుటి 1 సంచిక 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా ​మధురాలు

టౌన్ హాల్

మధు పెమ్మరాజు

కొన్ని నెలలుగా మా సాఫ్ట్ వేర్ ప్రాజెక్టులు నల్లేరుపై నత్త నడకలా సాగుతున్నాయి. డెడ్ లైన్స్ గడియారపు ముల్లులా ఘడియ ఘడియకి మారుతుంటే, ప్రాజెక్టు ఖర్చు వదిలేసిన కుళాయి నీరులా పారుతోంది. మా ప్రోగ్రాం మేనేజర్ మూల కారణాలు వెతకడం మానేసి పూట పూటకి స్టేటస్ చెప్పమని, ఓవర్ టైం పని చెయ్యమని వత్తిడి చెయ్యడంతో స్టాఫ్ ఉత్సాహం గండి పడిన చెరువుగా మారింది. ఆ నేపథ్యంలో డేవ్ థామస్ ఫైరయ్యాడని బ్రాండీ చెప్పింది. 

 

నా ఎదురు క్యూబ్లో ఉండే బ్రాండీ ఆవలిస్తే వార్తలు పట్టేసే రకం. అక్కడక్కడా గాలి కబుర్లు ఏరుకొచ్చి నా చెవిలో వేస్తూ ఉంటుంది, నేను ఆసక్తిగా విన్నట్టు నటిస్తుంటాను. ఆ రోజు మాత్రం ఉలిక్కిపడి నిటారుగా కూర్చున్నాను, ఫైరయినవాడు మామూలు డెవలపర్ కాదు... గ్లోబల్ సిఐఓ, పదేళ్లుగా మా విభాగానికి రారాజు డేవిడ్ థామస్ జూనియర్. రాచ పీనుగు పోతూ, పోతూ పది మందిని వెంటబెట్టుకుని పోతుంది అంటారు, ఆ నానుడి మా కంపనీకి నూటికి నూరు పాళ్ళు వర్తిస్తుంది. పది మందిలో నేనుండచ్చనే ఆలోచన వెన్నులోంచి చలి పుట్టించింది. బ్రాండీకి హెడ్లైన్ అంటే మమకారం, వివరాలంటే వికారం. తాపీగా ‘లాటే’ చప్పరిస్తూ పని చేసుకుంటోంది.

 

లంచ్ నుంచి రాగానే ఎరుపు జెండా ఈ-మెయిలు నాకోసం ఎదురుచూస్తోంది, ఏమిటా అని తెరిచి చూస్తే బ్రాండీ చెప్పిన అపశకునపు వార్త ముస్తాబయి కాస్త ఆలస్యంగా వచ్చింది. అక్కడక్కడా అద్దిన అందమైన పదాలని ఏరి పారేసి, మిగిలిన సారం సావకాశంగా చదివితే మార్పు అనివార్యమని, రాబోయేవి మంచి రోజులు కాబట్టి తలెత్తకుండా, పుకార్లని నమ్మకుండా పని చేసుకోమని ఉంది. తల తిప్పి బ్రాండీ కేసి చూసాను, “చూసావా.. ముందే చెప్పాను..” అన్నట్టు గర్వంగా నవ్వింది.

 

రోజు గడిచిన కొద్దీ 'వార్తల సేకరి' బ్రాండీ చాలా తక్కువగా కనపడింది. ఎక్కడ తిరిగిందో, ఎవరిని పట్టుకుందో   కొత్త సిఐఓగా ఫ్రాంక్ అనే వ్యక్తిని నియమిస్తారనే సమాచారం ఏరుకొచ్చింది. ఆ రోజు బ్రాండీ గురి తప్పలేదు. రాబోయే టౌన్ హాల్ మీటింగ్లో కొత్త సిఐఓ  ప్రసంగిస్తాడని, కాబట్టి స్టాఫ్ తప్పక  హాజరవ్వాలని అధికారికంగా తెలిసింది.

 

మా కంపెనీ టౌన్ హాల్ అంటే నాకు విపరీతమయిన భయం, కారణమేమిటంటే రాబోయే పెనుమార్పులని సన్నగా గొంతు కోసినట్టు తెలియజేసే ఆత్మీయ సమావేశం కాబట్టి. నాలాంటి తెలివైన వారు తప్ప మామూలు స్టాఫ్ కసాయి ముందు గొర్రెలా  ఆనందంగా తోకాడించి, తలందిస్తారు. నేను మాత్రం ఆ రోజు నుంచి ప్రతీ కదలికనీ భూతద్దంలో చూడాలని నిర్ణయించుకున్నాను.  

 

మరుసటి రోజు కూలర్ ఎదురుగా, బ్రేక్ రూమ్లో, పార్కింగ్ లాట్లో ఎక్కడ చూసినా అత్యవసర సమావేశాలు ఊపందుకున్నాయి. దశ, దిశ కోల్పోవడంతో క్యూబ్లు ఖాళీ అయి మా ఫ్లోర్ మబ్బు పట్టిన దీపావళి సాయంత్రంలా ఉంది. అనుభవం నాకు అపనమ్మకం నేర్పింది, అప్రమత్తంగా ఉండడం నేర్పింది. వెంటనే పాత రెస్యూం దుమ్ము దులిపి కొత్త ఉద్యోగం వెతికే పనిలో పడ్డాను. ఏకాగ్రతతో రెస్యూంకి నగిషీలు చెక్కుతుంటే ప్రాజెక్ట్ లీడ్స్ ఉన్న పళంగా కాన్ఫరెన్స్ రూంకి రావాలని లారా కబురు పెట్టింది. కాళ్ళీడ్చుకుంటూ కాన్ఫరెన్స్ రూం చేరుకునేసరికి దీర్ఘచతురస్రపు టేబుల్ చుట్టూ ప్రశ్నార్ధపు మొహాలు అతికినట్టున్నాయి. లారా లోపలకి అడుగు పెట్టగానే ప్రొజెక్టర్ వొళ్ళు విరుచుకుని లేచింది. ఆవిడ పొగరుకి బట్టలు తొడిగి, అందం అద్దినట్టు ఉంది.

 

మా కంపనీ అప్పాయింట్మెంట్ లెటర్ పై సంతకం పెడితే ప్రోమోషన్ ఆశించననే కాంట్రాక్టుపై  సంతకమని ఇండస్ట్రీలో పెద్ద పేరు. అలాంటి కరడు గట్టిన చోట ప్రోగ్రాం మానేజేర్ స్థాయికి, అదీ ముప్పైలలో ఉండగా చేరుకోవడం సామాన్యమైన విషయం కాదు. లారా ప్రతికూల పరిస్థితులని అనుకూలంగా మలచుకోవడంలో, పై వాళ్ళని కాకా పట్టడంలో దిట్ట.

 

ఎన్నో సార్లు ప్రాజెక్టులు చక్కబరచడానికి సూచనలు చెబుతామని ఆవేశంగా వచ్చిన వారు, లారా మాటల ధాటికి గొణుక్కుంటూ, బుర్ర గోక్కుంటూ ఓ మూల చతికిల పడేవారు. స్టాఫ్ తో అవమానకరంగా ప్రవర్తిస్తోందని కొందరు హ్యూమన్ రిసోర్సెస్ కి ఫిర్యాదు  చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. మా ప్రాజెక్టుల దుస్థితికి లారా నిరంకుశత్వం కారణమని ఇంచుమించు అంతా ముక్తకంఠంతో, నిస్సహాయంగా తేల్చేసారు.

 

లారాకి గెలుపు నిచ్చెనల ధ్యాస తప్ప మా అంతర్మధనంతో పని లేదు, మా మొహాల కేసి కూడా చూడకుండా రెండు రోజుల్లో పెద్ద ఆడిట్ ఫర్మ్ రాబోతోందని, ప్రాజెక్టుల పని తీరుని ఆడిట్ చేస్తారని చెప్పింది.

 

“ఏ మొహమాటం లేకుండా మాట్లాడే స్వేచ్చ మన అందరికీ ఉంది, కానీ ఈ ఆడిట్లు ఎలా జరుగుతాయో మనందరికీ బాగా తెలుసు. ఆ రాబోయే టీం పాత టెంప్లేట్లలో సొంత పైత్యం నింపి పెద్ద చెక్కు పట్టుకుని పోతుంది. మన సమస్యలు మనకే తెలుసు, వాటిని మనమే పరిష్కరించుకోవాలి. సాధ్యమయినంత వరకు మన పని తీరుపై సానుకూలంగా స్పందించడానికి ప్రయత్నం చేద్దాం, దాంట్లో అందరి ప్రయోజనం ఉంది” అని మెత్తగా బెదిరించింది.

 

నా పక్కన కూర్చున్న బ్రాండీ “ఆవిడ ప్రయోజనం ఉంది :-) ” అని చిన్న కాగితంపై రాసి చేతిలో పెట్టింది.

 

“మీరు గాభరా పడకుండా పని చేసుకోండి, స్టాఫ్ చెక్కుచెదరకుండా చూసుకునే పూచీ నాది” అని బుజ్జగించి ముగించింది.

 

లారా చెప్పినట్టే పేరున్న పెద్ద ఆడిట్ ఫర్మ్ నుండి ఎనిమిది మంది ఉద్దండులు రెండు రోజుల పాటు ఆఫీసంతా కలియతిరిగారు, ఆగకుండా ఇంటర్వ్యూ లు చేసారు. ఎవరేం చెప్పారో తెలిసే అవకాశం లేదు కానీ అంతా అనుకూలంగా మాట్లాడారని అనుకున్నాను. మరో పక్క టౌన్ హాల్ దగ్గర పడుతున్న కొద్దీ స్టాఫ్ ఊహాగానాలు తారాస్థాయికి చేరుకున్నాయి. డిపార్టుమెంటు స్వరూపాన్ని మార్చే కీలకమైన నిర్ణయాలు తెలుస్తాయని  నిముషాలు లెక్క పెడుతున్నారు. 

 

                                            ****

 

శుక్రవారం ఉదయం మూడు వందల మంది పట్టే ఆడిటోరియం అరగంట ముందే నిండిపోయింది, కుర్చీలు మిగలకపోవడంతో అనువైన చోట ఇంకో వంద మంది దాకా సర్దుకున్నారు. ముందు వరసలో కొన్ని కళ్ళజోళ్ళు లాప్‌టాప్‌లు టక, టకలాడిస్తూ, అప్పుడప్పుడూ కొంగలా తలెత్తి చుట్టూ చూస్తున్నాయి. అందరి మొహాల్లో సందేహాల క్రీనీడలు దాగుడుమూతలు ఆడుతున్నాయి.

 

ఎదురుచూసిన ఘడియ రానే వచ్చింది, ఫ్రాంక్ స్టేజి పైకి రాగానే అందరి మొహాలు విచ్చుకున్నాయి. ఫ్రాంక్ సూటేసుకున్న ఆరడుగుల ఉక్కు ఊసలా ఉన్నాడు. ఎవరో పేరు తెలియని హాలీవుడ్ హీరోలా ఉన్నాడు. స్టేజిని నడకతో కొలిచి, హుందాగా నవ్వాడు. అంతా అందంగా స్పందించారు. 

 

సభని ఉద్దేశించి “నా గురించి మీకేం తెలుసు” అని అడిగాడు.

 

కొత్తవాడు, అదీ మొట్ట మొదటి రోజు తన గురించి ఏం తెలుసని అడగడంతో అంతా మొహామొహాలు చూసుకున్నారు. ఎవ్వడికీ పక్కవాడి మోహంలో జవాబు దొరకలేదు. నేను హడావిడిగా వికీని ఆశ్రయించినా ఫలితం లేదు. 

 

“అంత శ్రమ పడకండి నా వ్యక్తిత్వం నా పేరులో ఉంది” అని మంచి నీళ్ళ గ్లాసెత్తి టెన్నిస్ ప్లేయర్లా నాలుక తడుపుకున్నాడు.

 

“నేను చాలా ఫ్రాంక్ గా ఉంటాను” అని మృదువుగా నవ్వాడు.

 

తన మేనేజ్మెంట్ స్టైల్ గురించి కొన్ని పిట్ట కధలు, విజయ గాధలు మేళవించి గంటసేపు అనర్గళంగా, ఆసక్తికరంగా  మాట్లాడాడు. అంతా మంత్రముగ్ధులై విన్నారు. ప్రసంగం ముగియగానే ఆడిటోరియం చప్పట్లతో మారుమ్రోగిపోయింది.

 

ప్రశ్నోత్తరాల సమయంలో స్టాఫ్ మొదట తత్తరపడినా, కాసేపటకి పుంజుకుని సూటి ప్రశ్నలు అడిగారు.

 

“ఏవైనా మార్పులు చేయబోతున్నారా?”

 

“మంచి ప్రశ్న వేసారు. మార్పు అనేది ఫుల్ స్టాప్ కాదు, కామా...” అని గుంభనంగా నవ్వాడు.

 

“డిపార్టుమెంటు సరి చెయ్యడానికి ఏం చెయ్యబోతున్నారు”

 

“సలహాలు మీరిస్తారు, నేను అమలు జరుపుతాను. నేను దోహదకారిని మాత్రమే, నాకంటూ ప్రత్యేకమైన ఎజెండా ఏమీ లేదు” అని తప్పించుకున్నాడు.

 

యూరోప్ నుండి వచ్చిన ఆర్కిటెక్ట్ ఇంగ్లీష్ లాంటి పదాలతో ముద్దుగా ఏదో అడిగింది. ఒక్క ముక్క అర్థం కాకపోయినా అందగత్తెలని అవమానించడం తప్పనిపించినట్టు మెచ్చుకోలుగా తలాడించాడు. 

 

“నలుగురిలో మాట్లాడు, లీడర్షిప్ లక్షణాలు ఉన్నాయని అనుకుంటారు” అన్న సూత్రం ఒంటపట్టిన కొందరు అసందర్భపు ప్రశ్నలతో చెలరేగిపోయారు.  ఫ్రాంక్ బదులుగా చిరునవ్వు నవ్వాడు. 

 

చివరగా అసాధారణమైన లీడర్షిప్ చూపించినందుకు లారాని స్టేజిపైకి పిలిచి ఫ్రాంక్ ప్రత్యేకంగా అభినందించాడు. నేను, బ్రాండీ  మొహామొహాలు చూసుకున్నాము.

 

ఫ్రాంక్ మాటల్లో ఎక్కడో అక్కడ మా భవిష్యత్తు బయట పడుతుందని ప్రతీ మాట జాగ్రత్తగా విన్నాను. డొంక తిరుగుడు తప్ప సూటిగా ఏ విషయం చెప్పలేదు. టౌన్ హాల్ పై పెట్టుకున్న అంచనాలు లారాని విశేషంగా గుర్తించిన క్షణం తారుమారు అయ్యాయి. కధ అనగనగా.. కి చేరుకుంది.

 

                        ****

 

వారాంతం ఆకస్మిక రీఆర్గ్ నిర్ణయాలు ప్రకటించారా అని లెక్కలేనన్ని సార్లు ఆఫీసు మెయిలు చూసుకున్నాను, ఏ రకమైన మెయిలూ రాలేదు.

 

సోమవారం ఆఫీసుకి చేరుకోగానే బ్రాండీని అడిగితే “ఏమీ తెలీదు, అంతా షరా మామూలే అనుకుంటా” అని మానిటర్ కేసి చూస్తూ కాస్త సందేహంగా చెప్పింది. చూస్తూండగానే రెండు వారాలు గడిచాయి,  అంతా సద్దుమణిగి  ఎవరి పనుల్లో వారు పడ్డారు. నా ప్రాజెక్ట్ వేగం పుంజుకోవడంతో తీరిక లేకుండా పోయింది. ఎంత పనిలో మునిగినా ఏదో ఉపద్రవం తప్పదన్న అస్పష్టపు భయం మాత్రం పూర్తిగా పోలేదు.

 

మధ్యాహ్నం బ్రాండీ రెండు జంబో సైజు ‘లాటే’లు తెచ్చి, ఒకటి నా చేతిలో పెట్టింది.

 

“ఇప్పుడే తెలిసింది, లారాని డిమోట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్టుమెంటుకి పంపేసారు” అని హైఫై కొడుతూ చెప్పింది. ఆ వార్త క్షణాల్లో మా ఫ్లోరంతా పాకిపోయింది.

 

అసలు ఏం జరిగిందో తెలియలేదు, నా స్థాయికి తెలిసే అవకాశం కూడా లేదు. తెలిసిందల్లా నెల రోజులు అతిగా అనలైజ్ చేసి బుర్ర పాడు చేసుకున్నానని మాత్రమే..

***

bottom of page