
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
క్రింది పేజీలు
ప్రస్తుత తాజా సంచికలో
లభ్యమవుతాయి
కథా మధురాలు
స్మృతి పథంలో అమ్మ
సంక్రాంతి సంచిక 2016
శ్రీకాంత గుమ్ములూరి
కొత్తగా మాతృత్వాన్ని పొందిన ఆడపడుచు జీవన పథంలోకి అడుగు పెట్టింది. అతి భయంతో,"ఇది చాలా సుదీర్ఘమైన ప్రయాణమా?" అని అడిగింది. మార్గదర్శి, " అవును. మార్గం కష్టతరమైనదే, సుదీర్ఘమైనదే. గమ్యానికి చేరక ముందే నువ్వు వృద్ధాప్యం లోకి అడుగుపెట్టచ్చు. మార్గం మొదటి భాగం కంటే చివరి భాగం సులభసాధ్యంగా, ఆనందదాయకంగా వుంటుంది. కానీ అది నీ స్వయంకృషి మీద, సామర్ధ్యం మీద ఆధారపడి వుంటుంది" అని చెప్పింది.
ఆమె ఈ మాటల్ని లెక్క చెయ్యలేదు. మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ, తన చిన్నారుల ఆలనా పాలనే తన జీవిత ధ్యేయంగా వాళ్ళతో తన పయనాన్ని సాగించింది. ఆనందంగా నడుస్తున్న ఈ రోజులే మంచి రోజులని నమ్మింది. ఆడుతూ పాడుతూ వాళ్ళతో నడవసాగింది. చల్లని సెలయేరులో స్నానాలు చేయిస్తూ, దారిలో కనబడ్డ గడ్డిపూలను సేకరిస్తూ, బాల భానుని కాంతి కిరణాలు భగవంతుని కృపలా వారిపై ప్రసరిస్తుండగా,"ఇవే నా జీవితంలో అతి మధుర క్షణాలు!" అని గొంతెత్తి పాడింది.
రాత్రయింది. చీకటి దారి. దానికి తోడు పెను తుఫాను. అగమ్యగోచరమైన మార్గం. పిల్లలు చీకట్లో, చలిగాలిలో భయంగా వణకసాగారు. తల్లి పిల్లల్ని దగ్గరగా చేరదీసి తన చీరకొంగుతో కప్పింది. రెండు చేతులూ వాళ్ళ చుట్టూ వేసి, వొడిలో వాళ్ళని అతి భద్రంగా దాస్తూ, ఊరడింపు మాటలతో వారి జంకును పోగొట్టింది. "అమ్మా! ఇప్పుడు భయం వెయ్యటం లేదు. నువ్వు దగ్గర వుంటే మాకే కష్టం రాదు" అన్నారు వాళ్ళు.
తెల్లారింది. ఎదురుగా పెద్ద కొండ. ఎక్కీఎక్కీ పిల్లలు అలిసిపోయారు. తల్లీ అలిసిపోయింది. దారి పొడుగునా ఆమె అంటూనే వుంది, "కొంచెం ఓపిక పట్టండి. అధైర్య పడకండి. త్వరలో పైకి చేరుకుంటాం." పిల్లలు అతి కష్టంతో ఆమె వెంట నడవసాగారు. ఒడిదుడుకులకోరుస్తూ, ఆమెను అనుసరిస్తూ గమ్యం చేరగలిగారు. పైకి చేరగానే అన్నారు, "అమ్మా! నువ్వు పక్కన లేకపోతే మేము పైకి ఎక్కగలిగే వాళ్ళమే కాదు."
ఆ తల్లి రాత్రి పడుకున్నపుడు ఆకాశంలో ప్రకాశిస్తున్న చుక్కల్ని చూస్తూ అంది,"నిన్నటికంటే ఈ రోజు మంచి రోజు. ఎందుకంటే నాపిల్లలు నమ్మకంతో, ఓరిమితో, ధైర్యంతో కష్టాన్ని ఎదుర్కోవచ్చనే విషయాన్ని గ్రహించారు. నిన్న వాళ్లకి ధైర్యాన్ని ఇచ్చాను, ఈ రోజు ఆత్మబలాన్ని."
ఆ మరునాడు మార్గమధ్యంలో అతి భయంకరమైన, దట్టమైన మేఘాలు ఆవరించాయి, నలుదెసలా చీకట్లను చిమ్ముతూ - మోసాలనూ, ద్వేషాలనూ, అరిషడ్వర్గాలనూ ప్రసరింపజేస్తూ. పిల్లలు తల్లడిల్లి పోయారు, విచక్షణ కోల్పోతే వినాశనానికి దారితీసే ప్రమాదానికి గురికాగలమనే భయంతో. అమ్మ అంది "దేనికీ లొంగి పోవద్దు! ఇంకా పైకి చూడండి... అన్నింటినీ జయించగలిగే ప్రేమమయమైన దైవశక్తిని." పిల్లలు తలెత్తి చూసారు కారు మబ్బుల కతీతంగా వున్నదివ్య తేజస్సును, మంచి చెడుల మధ్య అంతరాన్ని వివరించి చెప్ప గలిగే మనస్సాక్షిని. అదే వారికి అంధకారం నుంచి తప్పించుకో గలిగే మార్గాన్ని చూపించింది. ఆ రోజు రాత్రి అమ్మ అంది,"ఈ రోజు నా జీవితంలో అతి ముఖ్యమైన రోజు. కారణం నేను నా పిల్లలకి దైవత్వమంటే ఏమిటో అర్ధమయ్యేలా చెప్పగలిగాను."
రోజులు గడిచాయి, వారాలు, నెలలు, సంవత్సరాలు. ఆమె వృద్ధాప్యం లోకి అడుగు పెట్టింది. నడుము వంగి, శరీరం చిక్కి శల్యమైంది… కానీ ఆమె పిల్లలు నిటారుగా, ధృడంగా, యౌవనవంతులై వున్నారు. చాలా ధైర్యంగా ముందుకి నడవ సాగారు. మార్గమధ్యంలో అవాంతరం వచ్చినపుడల్లా ఆమెను ఎత్తుకుని నడవసాగారు. ఆమె పక్షి ఈకలా తేలిగ్గా వుంది. చివరకు వాళ్ళు దూరంగా ఒక సుందరమైన పర్వతాన్ని, అవతల దేదీప్యమైన మార్గాన్ని, దాని చివర పూర్తిగా తెరిచి వున్న బంగారు ద్వారబంధాన్ని గమనించారు. అమ్మ తన అంతిమ గమ్యాన్ని చేరబోతోందని గ్రహించారు.
ఆ తల్లి అంది "నేను నా ప్రయాణం చివరి భాగానికి చేరాను. ఇప్పుడు నాకర్ధమైంది. మార్గదర్శి చెప్పినట్లుగానే ప్రధమ భాగం కంటే అంత్య భాగం ఎక్కువ బాగుంది. దానికి కారణం ఏమిటంటే 'నా పిల్లలు వాళ్ళ పయనాన్ని నేర్పుతో తామే శ్రేయస్కరంగా సాధించుకోగలరు వాళ్ళ పిల్లలు వెంట రాగా' అనే పూర్తి నమ్మకం నాకు కలగడమే."
పిల్లలు అన్నారు "అమ్మా! మేము వేసే ప్రతి అడుగులో సదా నువ్వు మా ముందు ఉంటావు. మేము చేసే ప్రతి పనిలో నువ్వే కనిపిస్తావు. నువ్వు కంటికి కనబడకపోయినా మా స్మృతిపధంలో ఎల్లవేళలా మా సమక్షంలోనే ఉంటావు." అంటూ వీడ్కోలు పలికారు.
అవును. అనుక్షణం మీ అమ్మ మీతోనే వుంటుంది! కార్యాన్ని సాధించిన నీ నవ్వుల కేరింతలలో! ఓటమి నాటి ప్రతీ కన్నీటి బొట్టులో! నీ వాకిట పూచిన ప్రతీ పూపరిమళంలో! సోదరుని సౌహార్ద్రతలో, చెల్లెలి చెలిమిలో, అక్క ఆప్యాయతలో, నీ మనసు గాయపడ్డప్పుడు ఓదార్చిన నీ సహభాగిని స్పర్శలో, నీ చిన్నారులు పలికిన మంచి పలుకుల్లో!!! నిన్నెవ్వరూ ఎప్పుడూ ఏవిధంగానూ వేరు చెయ్యలేరు మీ అమ్మ నుంచి !!!
***
శ్రీకాంత గుమ్ములూరి
శ్రీకాంత గుమ్ములూరి గారు రిటైర్డ్ సెకండరీ స్కూల్ టీచర్. నవిముంబై నివాసం. సాహిత్యాభిలాషి. NATS -సంబరాలు సావనీర్ లో రచనలు ప్రచురించారు. వేదమాతరం పత్రికలో అనువాదం ప్రచురింపబడింది.

Please keep your facebook logged in another browser tab or new browser window to post a comment in madhuravani.com website.
