top of page

నన్ను గురించి కథ వ్రాయవూ?

స్వర్గీయ బుచ్చిబాబు

(జూన్ 14, 1916 - సెప్టెంబర్ 20, 1967)

Jayanthi Sarma

'అలనాటి' మధురాలు

బుచ్చిబాబు శతజయంతి సందర్భంగా....

బుచ్చిబాబు (జూన్ 14, 1916 - సెప్టెంబర్ 20, 1967) గా పేరుపడిన ఈయన అసలు పేరు శివరాజు వెంకట సుబ్బారావు. ఈయన ప్రసిద్ధ నవలాకారుడు, నాటకకర్త మరియు కథకుడు. ఈయన తెలుగు రచనలలో 'బుచ్చిబాబు' అన్న కలంపేరుతోనూ, ఆంగ్ల రచనలలో 'సంతోష్ కుమార్' అన్న పేరుతోనూ రచనలు చేశారు. 80 పైగ్గా కథలు,  40 వ్యాసాలూ, నాటికలు, ఒక వచన కావ్యం, పరామర్శ గ్రంధం మొదలైన విశిష్ట రచనలు చేసిన బుచ్చి బాబు ఏకైక నవల “చివరకు మిగిలేది” అజరామరంగా నిలిచిపోయిన రచన.

కథా సాహిత్యంలో ఒక కళాఖండంగా నిలిచిన బుచ్చిబాబు గారి “నన్ను గురించి కథ వ్రాయవూ?” అనే కథ మధురవాణి పాఠకుల కోసం పున:ప్రచురిస్తున్నాం. 95 సంవత్సరాల ఆయన సతీమణి శివరాజు సుబ్బలక్ష్మి గారి సౌజన్యానికి మా ధన్యవాదాలు

తొలి ప్రచురణ: ఆంధ్రశిల్పి - 1946 ఆగస్టు

"నన్ను గురించి కథ వ్రాయవూ?" అని అడిగింది కుముదం.

ఈ ప్రశ్న నాకు కొంత ఆశ్చర్యం కలగజేసింది. ఎందుకంటే కొద్ది మార్పుతో ఇదే ప్రశ్న ఎనిమిది సంవత్సరాల క్రితం అడిగింది. నాకు బాగా జ్ఞాపకం. మా మేనమామగారింట్లో కుముదం తండ్రి కాపురం వుండేవాడు. అద్దె తీసుకురమ్మని అప్పుడప్పుడు నన్ను పంపేది మా అత్తయ్య. ఆ రోజు సాయంత్రం కర్రకు మేకు దిగేసి , ఇనుపచక్రం దొర్లించుకుంటూ దొడ్లో పరుగులెత్తింది కుముదం. నాకప్పుడు పన్నెండో ఏడు. ఆమె నాకంటే రెండు సంవత్సరాలు చిన్నదని వాళ్లమ్మ నాకు చెప్పింది. నేను అద్దెమాట మరిచి కుముదంతో కబుర్లు చెబుతూ కూర్చుండేవాడిని. చెట్టెక్కి జామపండ్లు కోసి పెట్టమని వేదించుకు తినేది. పూర్తిగా పండని జామపండు రంగులా వుండేది ఆ పిల్ల చాయ. నేనేదో కల్పించి కథలకింద చెప్పేవాడిని. వీటిల్లో పాత్రలు మా వూళ్లో యిరుగుపొరుగు అబ్బాయిలూ, అమ్మాయిలు.. ఈ కబుర్లు అమాయకంగా చూస్తూ విన్నా, కుముదం కళ్లల్లో ఎక్కడో ఈర్ష్య మసకగా మెదిలినట్లు భ్రమించి, నేను గర్వపడేవాడిని. అతిశయోక్తి కల్పన కథకుడి జన్మలక్షణం కాబోలు.. యధార్థ విషయాలు మానేసి, కల్పిత గాథలను,  యదార్థాలుగా చెప్పడం ఊహాసృష్టి లక్షణం అనుకుంటా. ఇవన్నీ కుముదం నమ్మినట్లుగానే కొంటెగా నిట్టూర్పు విడిచేది. నేనూ, యీ వ్యక్తులు, ఘట్టాలు యదార్థాలుగా స్మరించుకొని, తెచ్చిపెట్టుకున్న మౌనంలో పడేవాడిని. ఆ నిశ్శబ్దంలో కుముదం కంఠం వినిపించింది. "నన్ను గురించి కథ చెప్పవూ?" అంది. ఆ ప్రశ్న వెయ్యకపోతే, ఆమె కథ మరొకరి దగ్గర చెప్పివుందునేమో నాకు తెలీదు. నే అనుకోవడం ఆమె కథ ఎవరితోనూ చెప్పి వుండను. ఎందుకంటే, ఆమె నిజంగా మనిషి - ఊహలో వ్యక్తి కాదు.

అదే ప్రశ్న మళ్ళా అడగడం  నాకు ఆశ్చర్యం కలగజేసింది. ఐనా నేను కథలు వ్రాస్తానన్న సంగతి ఆమెకెట్లా తెలుసో నాకర్ధం కాలేదు. నా కథలు, వొకటి రెండు తప్ప అచ్చుకాలేదు. వాటిని గురించి నేనెవ్వరితోనూ ముచ్చటించలేదు. ఇరవై సంవత్సరాల యువక అజ్ఞానంలో వున్న నన్ను ఎన్నుకోతగ్గ రచయితగా యీ సంఘం గుర్తించదని నా భయం. ముదుసలే జ్ఞాని   కాగలడని భారతీయుల వెర్రి నమ్మకం. పెద్దలన్నా, ప్రాచీనులన్నా, పాత విషయాలకన్నా, మనవాళ్లకి అంత గౌరవం. ఒక విషయం మంచిదా, చెడ్డదా అన్న తార్కిక సంశయాలకి సంఘంలో అంతగా తావులేదు. ఎటొచ్చీ ఆ విషయాన్ని ప్రతిపాదించిన వ్యక్తి మృతుడై వుండాలి.

శక్తిగలవాళ్లు ధనార్జనలోనూ, అది లేనివాళ్లు దైవంలోనూ లీనమైన యీ దేశంలో కథకుడికి విలువలేదని నే నా రోజుల్లో నమ్మేవాడిని. నేను వ్రాసి తగల పెట్టిన రచనలతో నాకు మరో బ్రహ్మరధం పడుదురు. సంఘం గుర్తించదన్న భయమొకటే కాదు, నేను కథలు వ్రాయకపోవడానికి కారణం. నా రచనా విధానానికి పరిపక్వం రాలేదని కూడా నే లోపల అనుకునేవాడిని. నా సృష్టి శక్తుల్ని రగిల్చి నన్ను తన్మయుణ్ణి చేసి నా జీవితంపై వొత్తిడి కలిగించే వ్యక్తులు కాని, నా రచనల్ని చదివి, వాటిల్లోని లోతులకి దిగబ్రాకి తాత్కాలికంగానైనా ధన్యత చెందే వ్యక్తులు కాని ఆనాటివరకూ లేరని నాకు తెలుసు. ప్రపంచాన్ని పరిశీలిస్తూ వ్యక్తుల మంచి చెడ్డలని, వింత ప్రవర్తనని ప్రేక్షకుడుగా అనుభవించి అర్ధం చేసుకుని, అల్లా సంపాదించిన అంతరంగిక జ్ఞానాన్ని నా తాత్విక దృష్టిలో మేళవించి, వార్ధక్యంలో మహత్తర గ్రంథం వ్రాసి, మరణించాలని నా ఆదర్శం. ఈ రెంటిలో వొకటైనా జరిగి తీరుతుంది. మహత్తర గ్రంథం వ్రాయలేకపోవచ్చు. కాని మరణం మాత్రం తప్పదన్న ధైర్యం నాకో నూతన వుత్సాహాన్ని ప్రసాదించింది. ఆ రోజుల్లో "నన్ను గురించి కథ వ్యాయవూ?" అనే ప్రశ్న స్త్రీ నోటినుండి వినడం అదే మొదటిసారి. తన వ్యక్తిత్వాన్ని గుర్తించుకుని, దాని ప్రభావాన్ని ఇతరులకి తెలియచెయ్యాలన్న స్త్రీని మొట్టమొదట కుముదంలో చూడగలిగాను. ఆమె వొక జీవి. ప్రత్యేకమైన వునికిగలది. ఆమెని తొలగిస్తే ప్రపంచంలో కొంత పవిత్రమైన ఖాళీ ఏర్పడుతుంది. నే చూసిన స్త్రీలు వివాహం జరిగినరోజునే జన్మించినవాళ్లు. భర్తని పొడిగిస్తే, స్త్రీ  ఔతుంది. యింకా పొడిగిస్తే భర్త సంతానంగా మారతాడు. అతను గతించగానే ఆమె స్థూలజీవితం సమాప్తమౌతుంది. సృష్టిని ఆహ్వానిస్తూ తెరుచుకున్న తలుపులు మన స్త్రీలు, తెరుచుకోని తలుపులు లేవు. ఏదైనా వొక తలుపు తెరుచుకోనినాడు దాన్ని గురించి చెప్పుకొని, మరమ్మత్తు సంకల్పించాలి. మరమ్మత్తు చేసినా బాగుపడని తలుపులను నిర్మూలం చెయ్యాలా, లేక వేరే పనులకు వుపయోగించుకోవాలా అన్న సందేహాన్ని సంస్కర్తలు తీర్చాలి. కథకుడు  ఏం చెడిపోయిందో చెప్పగలడు. వీలైతే మిగిలినదానితోనే తృప్తి పడుతూ యితరులతో ఆ తృప్తిని పంచుకోగలడు.  కాని బాగుచేసే విధానాలతో అతనికి నిమిత్తం లేదు.

"నీలో ఏముందని నిన్ను గురించి కథ వ్రాయనూ?" అన్నాను. అట్లా అన్నందుకు పశ్చాత్తాపపడినా, ఆ ప్రశ్న నా నమ్మకాన్ని, ఆశయాలనీ  యధార్థంగా వ్యక్తపరుస్తుంది. ఆమెలో కథావస్తువుగా వుండేటంతటి విశేషం వొక్కటి కూడా లేదు. చూడడానికి చాలా సామాన్యంగా వుంటుంది. పల్చటి శరీరం. వేసంగిలో వర్షం కురిసేముందు దట్టంగా అల్లుకున్న మబ్బురంగు శరీరచ్చాయ. సంపూర్ణంగా వికసించని అవయవాలు. ఎవరో దువ్వినట్లుగా ఉండే జడకట్టు. చూసిన వస్తువులు తన కోసం కానట్టు చాంచల్యంగా కదిలే బలహీనమైన కనురెప్పల కింద మంచులో కదిలిపోయిన కుందేలులా మెరిసే నేత్రాలు. కంఠంలో కొలవడానికి వీలుగా వుండే పచ్చటి నాళాలు. నీడ కనిపించినట్లు స్ఫురించే వక్షం. శరీరంలో పైభాగాన్ని మోసేటందుకు వోపిక లేనట్టి అల్పమైన నడుం. కుముదం సాధారణమైన స్త్రీ. ఎవరూ - తుదకు వాళ్లమ్మ కూడ - ఆమె అందమైందని చెప్పుకోవడం నే నెరుగను. అందుకనే ఆమెలో నేనేమీ విశేషం చూడలేక పొయ్యానేమో!

"నాలో ఏముండాలి?"

"ఒక ప్రత్యేకత. అందరిలో లేని ఏ వొక్క విశేషం అయినా సరే.."

వేలునున్న ఉంగరాన్ని చూచి దాన్ని వేళ్లతో తిప్పింది. పోతపొసి పదును పెట్టినట్లుగా చలించే వేళ్లు ఆమెవి. ఏ అవయవం కదిలినా, శరీరంలోని శక్తంతా దానిలో పూరించినట్లు వుంటుంది. ఒక వస్తువుకేసి చూస్తున్నప్పుడు, పంచప్రాణాలు కళ్లలోకి పరుగెత్తుకొచ్చినంత తీవ్రంగా చూస్తుంది. సిగ్గుపడితే రక్తం చెక్కిళ్ళలోనుంచి తొంగి చూస్తున్నట్లుంటుంది. కాని కుముదాన్ని వర్ణించినంత మాత్రాన కథౌతుందా?

"నీ పెండ్లికి నన్ను పిలవలేదేం?" అని అడిగాను.

"మా అమ్మ నీకూ శుభలేఖ పంపానంది - వొస్తే నలుగుర్నీ చూసి, ఏమన్నావుంటే  కథేనా వ్రాద్దువుగా" అంది కుముదం. కళ్లలోంచి పెదవుల మీదికి దిగజారిన నవ్వుని ప్రదర్శిస్తూ.

"నేను తమాషాకి అనడంలేదు. సాధారణ వ్యక్తులను గురించి వ్రాసేటందుకు ఏముంది? పదిమందీ ఒకేలాగున్నప్పుడు వారిలో ఏ ఒక్కర్ని గురించి చెప్పుకోం. కాని, అందులో ఏ ఒక్కడైనా, పదిమంది చేసినదానికి వ్యతిరేకంగా చేస్తే అతన్ని గురించి చెప్పుకుంటారు. అట్లాంటి వ్యక్తులని గురించి వ్రాయొచ్చు." అన్నాను.

"అయితే అందరూ చేసినదానికి విరుద్ధంగా చేసేవాళ్లే మనుష్యులన్నమాట.."

"నే అల్లా అనను. అట్లాంటి వాళ్లు చెప్పుకోదగ్గ మనుషులంటాను."

ఎక్కడో ఎప్పుడో పుట్టడం, ఎవరో ఎవర్నో వొప్పగిస్తే వార్ని పెళ్ళాడడం. ఎందుకో తెలీకుండా పిల్లల్ని కనడం, ఎప్పుడో ఎక్కడో చచ్చిపోవడం ఇది చాలామంది చేస్తున్నది. దీన్ని గురించి కథగా చెప్పుకునేందుకు ఏముంది? ప్రత్యేకత, వ్యక్తిత్వం లేని యీ జీవితాలు ప్రశాంతాన్ని పొందుతున్నాయి. కాని, అది బురదగుంటలో పురుగు పొందే ప్రశాంతం. సంఘాన్ని ధిక్కరించి, సాంప్రదాయాలపై విప్లవం చేసి, యితరులకి అవగాహన కాని కొత్త విలువని సాధించి పొందినవాడే ధన్యజీవి. వ్యర్థజీవులు సంఘం అల్లిన వలలో చిక్కుకొని, మర్యాద పేరు చెప్పుకుని కుళ్ళిపోతారు. స్థాపితమైన ఆదర్శాలపై విప్లవం చేసినవాడు సంఘాన్ని తనవైపుకి మరల్చ యత్నిస్తాడు. కాబట్టి సంఘాభివృద్ధి అల్లాంటి వాళ్లపై ఆధారపడుతుంది. కుముదంలో ఈ విప్లవ చిహ్నం ఒక్కటి కూడా లేదు.

ఆమె చదువుకోలేదు. సంగీతం నేర్చుకోలేదు. కనీసం కూనిదీర్ఘాలు తీస్తుందని చెప్పుకోడమేనా నే నెరగను. జ్ఞానం వొచ్చిం తర్వాత ప్రేమించి - చేసుకున్న పెండ్లి కాదు. గొప్ప స్థితిపరురాలు కాదు. పోనీ బాగా బీదదీ కాదు. సానుభూతి చూపేటందుకేనా.. చక్కంది కాదు. పద్యాలు వ్రాద్దామంటే. అనాకారి కాదు వికృతాన్ని ఆధునికుల ధోరణిలో చిత్రిద్దామంటే. మంచివాళ్లని గురించి వ్రాయొచ్చు. చెడ్డవాళ్లని గురించి వ్రాయొచ్చు. కాని సాధారణమైనవాళ్ళని గురించి వ్రాయడం కొంత కష్టం. అసలు వ్రాసేటందుకు ఏముంది?

కొందరు వ్యక్తులు  తల్లిదండ్రుల చర్యలవల్ల ఖ్యాతి కెక్కుతారు.  కుముదం ఆ తెగకి చెందదు. వాళ్ల తండ్రి చనిపొయ్యాడు. తల్లి ఏ వూళ్లోనో కొడుకు దగ్గర వుంది. వాళ్ల కుటుంబానికి చరిత్ర లేదు.

"మీ ఆయన ఏం చేస్తున్నాడు?"

"ఎల్.టి. చదువుతున్నారు."

"స్కూల్ మాస్టరవుతాడన్నమాట. ఏ పనీ దొరకనివారికి అదే శరణు. మంచివాడేనా?"

నవ్వింది. "మంచి అంటే ఏమిటో నాకేం తెలుసు? నీకు తెలియాలి. కథలు రాసేవాడవు."

"ఓస్! దెప్పడం కాబోలు. అది కాదు కుముదం. అందర్లాగే కాపరానికెళ్ళి పిల్లల్ని కంటే ఏం ప్రయోజనం? ఏదో వో గొప్పకార్యం సాధించాలి. సంఘాన్ని ముందుకు నెట్టాలి. ఇక్కడికే భారతమాత యీ సంతానాన్ని పోషించలేకపోతోంది.

"నాకింకా పిల్లలు లేరు. అయితే ప్రతి ఆడదీ పెండ్లి చేసుకోకుండా, పెళ్లి పందిళ్లలో పికెటింగ్ చెయ్యాలంటావా?"

"పెళ్ళి వద్దని నేననడం లేదు. వివాహం స్త్రీ జీవితంలో ప్రధానఘట్టం. అందులో నువ్వు సాధించింది ఏముంది? ప్రేమా? సౌఖ్యమా? ఆధ్యాత్మికమా? దేశభక్తా? ఏదీలేదు."

"పెండ్ళి చేసుకున్న ప్రతి స్త్రీ భర్తను వొదిలేస్తే నువ్వు కథలు వ్రాస్తానంటావ్. అంతేనా?"

అంత పచ్చిగా అడిగినందుకు నాకు రోషం వొచ్చింది.

"వొదిలేస్తే చాలదు.. మరో గొప్ప విలువను సాధించాలి."

"అంటే"

"ప్రేమలేని వివాహానికి విలువ లేదనుకుంటాను."

"నీకేం తెలుస్తుంది? నీకు పెళ్ళి కాలేదు."

"ఆ విలువని సాధించగల్గితేనే వివాహానికి అర్ధం వుంటుంది."

 "అట్లాగైతే, ప్రతి స్త్రీ భర్తను వొదిలేసి మరోడితో వుండాలంటావ్, ప్రేమను సాధించేందుకు?"

అట్లా అడిగినందుకు నాకు నవ్వొచ్చింది. "దానికోసం ఆ త్యాగం చెయ్యగలిగితేనే మెచ్చుకుంటాను" అన్నాను.

కుముదం మాట్లాడలేదు. ఈ భావాలు ఎంతవరకూ ఆమెని కలవరపెట్టాయో నాకు తెలీదు. స్త్రీ ప్రకృతిపైన వొత్తిడి కలిగించేది భావాలో, సహజమైన ఉద్రేకమో నేను చెప్పలేను. అది తెలిస్తే స్త్రీ హృదయం అర్ధం చేసుకున్నట్లే.

"కాని.. కాని..." మాటల కోసం తడుముకున్నట్టు నిదానించింది.

"ఏమిటి నీ సందేహం?"

"ఏమీలేదు.  నాకేదో చెప్పాలనుంది. ఎట్లా చెప్పాలో తెలీడంలేదు. నే చదువుకున్నదాన్ని కాదు. ఉండు, ఆలోచించనీ..."

నేను ఆమె కళ్ళకేసి చూస్తూ కూర్చున్నాను.  నిదానించి చూస్తే ఆమె మొహంలో వొక వింత ఆకర్షణ వుంది. ఆమె శరీరంలో వొంపులు, ఎత్తుపల్లాలు సూర్యరశ్మి సోకినప్పుడు తీర్చినట్టుగా విప్పారుకున్నాయి. ఆ  కళ్ళు ఆమెకి వుపయోగం లేవు కాబోలు. మనుషులకి ఆత్మ వుందో లేదో నాకు తెలీదు కాని, ఆమెకి మాత్రం లేనట్లు నాకనిపించింది.

మరో లోకంలో ఆత్మని మరచిపోయి, శరీరాన్ని తనిష్టం లేకుండానే ఇక్కడికి రప్పించినట్లు సంచరిస్తుంది. ఈ ప్రపంచంలో మూసుకుని మరో లోకంలో తెరచుకున్న నేత్రాలు ఆమెవి. "కాని.. కాని... సూర్యుడు, చంద్రుడూ ఎప్పుడూ చూస్తుంటాను. కాని ప్రతిసారి ఎందుకో కొత్తగా కనబడతాయి. మంచినీళ్లు రోజూ త్రాగుతా. కాని ప్రతిసారి ఎంతో కొత్తగా వుంటాయి... నక్షత్రాలు.."

నేను వెడతానని లేచాను.

"నక్షత్రాలు.. ఉ... మంచిది.." ఆమెని గురించి ఏం కథ వ్రాయనూ? 

****

క్రితంసారి మేం కలుసుకుని నాలుగేండ్లు అయింది. ఈసారి కుముదంగారి వూరు అద్దె కోసమే వెళ్ళలేదు. వేరే పనుండి వెళ్లాను. మధ్యాహ్నం రెండు గంటలు దాటింది. నడివేసంగి ఎండ నన్ను నీడకి తరిమింది. పోస్టాఫీసు ప్రక్కనున్న మామయ్యగారింటికి ఎప్పుడూ దొడ్డిదోవన వెళ్లడం అలవాటు చొప్పున ఆనాడు కూడా అల్లాగే వెళ్ళాను.

కుముదం మండువాలొ గచ్చుమీద కూర్చుని అనాసపండు తరిగి వెండిపళ్ళెంలో వేస్తోంది. నారింజపండురంగు చీర కట్టుకుంది. నన్ను చూచి లేవడంలో పమిట జారింది. నాకర్ధమైనట్లు నవ్వి వెనక్కి తిరిగి లోపలికెళ్ళి వొక కుర్చీ అమర్చి కూచోమని సంజ్ఞ చేసింది.  నే చూసిన దృశ్యం నాకిదివరకులేని కొత్త చనువునిచ్చిందని వొప్పుకోక తప్పదు. మనిషి శీలానికి వ్యక్తిత్వానికి మొహం వొక్కటే నిదర్శనం కాదనుకుంటాను. కొన్ని ఆకస్మిక దృశ్యాలు, జీవితకాలం పరిశీలించినా బోధపడని అంతరంగికాలని తేటపరుస్తాయి కాబోలు.

కుర్చీలో కూర్చోగానే పటుక్కుమంది పాతకుర్చీ. లేచి సర్దుకున్నాను. కుముదం పమిటని పళ్ల మధ్య బిగించి నవ్వుని ఆపుకుంటోంది.

"అన్ని కుర్చీల మాదిరి నిన్ను భరించి వూరుకోక, విరిగి, కొత్త దారి తీసింది చూచావా.! దాని కథ వ్రాయవూ?..." అంది. నాకూ నవ్వొచ్చింది. చాపమీద కూర్చొని స్తంభానికి జారబడ్డాను.

"మనం కలుసుకుని దగ్గరదగ్గర నాలుగేళ్ళయింది. తెలుసా? నేనివన్నీ మరిచిపొయ్యాను. నీకింకా ఎట్లా జ్ఞాపకం వుంది?" అన్నా ప్రశ్నార్ధకంగా..

"ఏమో, నువ్వు జీవితాన్ని పరిశీలిస్తావు. నేను అనుభవిస్తాను ఏమో" అన్నది.

ఆమెకి జీవితం అనుభవించడం అంటే ఏమిటో తెలీదని నా నమ్మకం. కాలం ఆమెపై ఎట్లాంటి మార్పూ తేలేకపోయింది. ఇదివరకు చూసినప్పటికంటే ఈసారి ఎక్కువ చలాకీ, యవ్వనోద్రేకం చూపగలిగింది. ఆమెలో ఆకర్షణీయమైంది. ఎడతెగని యవ్వనమేమొననిపిస్తుంది. యవ్వనం ఒక్కసారి తన శక్తిని ప్రకటించకుండా, నిలిపి నిలిపి ప్రజ్వలించినట్లుగా గోచరిస్తుంది". కొన్ని ఉపమానాలు మన నాగరిక సాంప్రదాయాలకి విరుద్ధమని జంకుతున్నాగాని, లేకపోతే ఆమె శరీరాన్ని గుర్రంపిల్ల కదలికలోని లావణ్యంతో పోల్చొచ్చు. లేడి గంతులో శృంగారం వుంది కాని, బలం లేదు. కుక్కపిల్ల గంతులో కొంటెతనం వుందికాని శక్తి లేదు. మేకపిల్ల గంతులో వేగం వుందిగాని మృదుత్వం లేదు. ఇవన్నీ గుర్రంపిల్ల అలిగిననాడు చేసిన నాట్యంలో వున్నాయి.

"నువ్వూ, మీ ఆయన కులాసాగా వుంటున్నారా?" అన్నాను ఏమనడానికి తోచక.

"నీ దయవల్ల"

"ఇంకా నిన్ను గురించి బోలెడు వినాలనుంది."

"నన్ను గురించి వినేందుకేముంది. మాది సామాన్య బ్రతుకు" అంది నీరసంగా.

"అప్పుడే జీవితం పైన విసుగు పుట్టిందా?" అన్నాను.

" ఈ ప్రశ్నలు నన్నింతవరకూ బాధించడం లేదు. నీ మాట చెప్పు ఏం చేస్తున్నావూ? ఎక్కడున్నావూ? ఎలా చదువుకున్నావూ?.."

మనదేశంలో చదువుకున్న యువకుణ్ణి ఏం చేస్తున్నావూ? అని అడగడంకంటే ఎక్కువ అపచారం లేదు. పాపం, అలా అడిగిన వాళ్లందరూ మా మేలు కోరేవారే. కాని దానికి సమాధానం చెప్పడంలో ఉద్యొగం లేని యువకుడు ఎంత బాధపడతాడో పెద్దవాళ్లకి తెలీదు. ఏమి చెయ్యడంలేదని చెప్పడం నాకు చిన్నతనంగా తోచి "ఏమీలేదు - కథలు వ్రాయడం మొదలుపెట్టాను" అన్నాను.

"నన్ను గురించా?"

నవ్వుకున్నాను. పడుతూ, నడుస్తూ, పడుతూ, చంటిపిల్ల చక్కావచ్చి అర్ధం లేకుండా ఏడవడం మొదలెట్టింది. నేనాశ్చర్యపడ్డాను.

"మా పాపాయి. ఇంక రెండు నెల్లకి మూడో ఏడొస్తుంది" అంది కొద్ది గర్వంతో.

"నాకెప్పుడూ చెప్పలేదే? ఈ సంగతే తెలీదు" అని ఆశ్చర్యం దిగమింగుకోలేకపోయాను.

"నీకు తెలియజేసేటందుకు యిందులో ఏం విశేషముంది? ఇది సాధారణంగా అందరికి జరిగే పనే కదా! నీకీ విషయం వేరే నే చెప్పాలా?" అంది. ఆమె అంతవరకూ తన  పిల్లని గురించి చెప్పకపోవడం చూస్తే నాకు మరీ ఆశ్చర్యం కలిగింది.

"దానికో  పాపాయి పుడుతుంది. ఎప్పుడో, ఎక్కడో అది ఎవర్నో ఎక్కడో పెండ్లి చేసుకుంటే దానికి మరో పాపాయి, ఎప్పుడో, ఎక్కడో పుడుతుంది. అలా జరిగిపోతుంది. ఇందులో  ఆశ్చర్యపడవల్సిన విశేషం ఏముంది..?"

కుముదంలో మాతృత్వం తాలూకు చిహ్నాలేవీ నాకు కనపడలేదు. పిల్లలని చూసుకునే తల్లులు పడే గర్వం ఆమెలో లేదు. ఆ ప్రశంస ఎత్తాలని ఆమెకు తట్టనే లేదు. ఆమె శరీరపటుత్వాన్ని చూస్తే, ఆమె ఈ పిల్లలని కన్నదా అనిపించింది. పిల్లలూ భర్తా, సంసారం - యివేవీ ఆమె నిజశరీరాన్ని తాకి పంచుకున్నట్లు లేదు.

"నీ పోలికా, వాళ్ల నాన్న పోలికా?"

"ఏమో నీకే తెలియాలి."

“నాకెట్లా తెలుస్తుంది? నేను వాళ్ల నాన్నని చూడనే లేదుగా"

"వీధిలో వున్నారు చూడకూడదూ?" వీధిలో అరుగుమీద విద్యార్థులతో ఆయన పడుతున్న అవస్థ నాకు వినపడుతూనే వుంది. వెళ్ళేటప్పుడు చూడొచ్చుననుకున్నాను.

కుముదం పిల్లని లోపలికి తీసుకెళ్ళిపోయింది. ఆకులో అనాస ముక్కలుంచి, మంచినీళ్ళు పెట్టింది.

"పాపం. ఎండలో వొచ్చావు. నీ మొహం మాడిపోయింది."

"నిజంగా?"

"మనం పెద్దవాళ్లమైపోతున్నాం కదూ?"

"నా మాట తెలీదు కాని, నువ్వు మాత్రం యింకా చిన్నదానివవుతున్నావు" అన్నాను.

"అదీ అబద్ధం. ప్రకృతి విరుద్ధం" కొంతసేపు ఎవ్వరం మాట్లాడలేదు. ఎందుకో కొన్ని కొన్ని సమయాలలో ఆమెతో మాట్లాడుతున్నప్పుడు, బుర్ర ఖాళీ అయిపోతుంది. సిగరెట్టు పీలుస్తూ, చీట్లాడుకుంటున్న సమయంలో అమాంతం గదిలోకి చిరుతపులి వొచ్చినప్పుడు, బుర్ర ఎట్లా పని చెయ్యదో, అట్లాగే ఆమెతో సంభాషణ.

"దేశంలో సంతానం ఎక్కువైపోతున్నారు. యిట్లా పది సంవత్సరాలు జరిగిందంటే తినేందుకు తిండి వుండదంటున్నారు సాంఖ్య శాస్త్రవేత్తలు. తెలుసా?" అన్నాను.

"అది నాకు తెలీదు. మనం ప్రకృతికి దాస్యం చెయ్యడం తప్పదు. దాస్యం నేను సహించలేను. కాని అది తప్పదనుకుంటాను నేను. ఎదురు తిరగలేక కాదు. నాకదిష్టం లేదు. జీవితానికి తలవొగ్గి, ప్రపంచాన్ని అంగీకరిస్తాను."

"అదే పొరపాటు. అంగీకారం ఆదర్శాలు  లేని వ్యర్థజీవి విముఖత్వం"

"కావొచ్చు. సృష్టిలో నేనెంతో అల్పురాలనని తోటివాడవైన నీకే తోచినప్పుడు సృష్టిముందు నేనేం తిరుగుబాటు చెయ్యగలను చెప్పు?"

వెడతానని లేచాను.

"అద్దె తీసుకురానా?" అంది. "నేను దానికోసం రాలేదు. మనియార్డరు చెయ్యొచ్చు."

పాపిష్టి డబ్బుని ఆమె చేతులు తాకటం నా కిష్టం లేదు. ఆమె భర్తని చూడడం కూడా మరచి, బైటకి నడిచాను. నన్ను కుముదం వెనక్కి పిలుస్తుందనుకున్నా, అట్లా పిలవలేదు. నా వెనకాల దొడ్డితలుపు గడియవేసిన చప్పుడు వినిపించింది.

కుముదాన్ని గురించి ఏం కథ వ్రాయనూ

*** 

ఆరు సంవత్సరాలు గడిచాయి. రెండో ప్రపంచ సంగ్రామం ప్రారంభమైంది. అప్పటికి నా చదువు, ఉద్యోగయత్నాలు పూర్తయ్యాయి. వొక్క యత్నమూ ఫలించలేదు. మా మామయ్య నాకోసం పెట్టిన డబ్బు ఖర్చంతా వృధా ఐంది. పైగా, ఆయనా, మా అత్తయ్యా, ఇండియా అంతా యాత్ర చేసి రావడం వల్ల ప్రావిడెంట్ ఫండంతా తరిగిపోయింది. నిరుద్యోగ సమస్యను గురించి బోలెడు కథలు వ్రాశాను. సమస్య పరిష్కారం కాలేదు. ఆంగ్లంలో యీ సమస్యను పరిష్కరించడానికి కొన్ని సలహాలిస్తూ వ్యాసాలు వ్రాశాను. ఎవరూ వాటిని గుర్తించినట్లు లేదు. కొన్ని సమయాలలో రాజకీయోధ్యమంలో దిగి జైలు కెడదామనిపించేది. అప్పుడు భుక్తికి లోటుండదు. కీర్తి దక్కుతుంది. పైగా జైలులో నే తలపెట్టిన మహత్తర గ్రంథాన్ని రచించడానికి మంచి అవకాశాలుంటాయి. కాని రాజకీయాలలో దిగడం ఎట్లా? "ఫరవాలేదురా అబ్బీ,  యుద్ధం వచ్చింది. దేవుడి ధర్మమా అని నీకేదో ఉద్యోగం దొరక్కపోదు" అని మామయ్య ఓదార్చేవాడు.

"నాకు నచ్చిన ఉద్యోగం ఒకటి ఖాళీ వచ్చింది మామయ్యా. దరఖాస్తుకి, ఇంటర్‌వ్యూకి వో ఏభై రూకలుంటే నాకు లభించొచ్చు" వెంటనే మామయ్యకి వో భావం తట్టింది.

"ఒరే! కుముదంగారింటికి వెళ్లి రెండు నెల్ల అద్దె, ముందుగా యిస్తారేమో కనుక్కురా" అని నన్ను సాగనంపాడు.

సూర్యుడు పడమటింట్లో గృహప్రవేశం అవగానే తలుపువేసి, కిటికీ కర్టెన్లు దగ్గరగా లాగడానికి సిద్ధపడినట్లు మేఘాలు చురుగ్గా విహరిస్తున్నాయి. కుముదంగారి దొడ్లో ఎన్నో యిదివరకు చూడని కొత్త మొక్కలు, చెట్లు వున్నాయి. కొబ్బరిచెట్లు  మేఘాలతో ఏకీభవిస్తున్నట్లు ఆకాశంలోకి పొడుచుకుని ఆడిపోతున్నాయి. జామచెట్టు వార్ధక్యం వచ్చిన దాని మల్లే ముడుచుకుంది. ఆ అల్ప ప్రకృతిలో వక్కటీ నా రాక గుర్తించినట్లు లేదు? చెట్లకొమ్మలకి ఉయ్యాల అమర్చి వుంది. నూతి పళ్లెం వైపునుంచి వో పాపాయి పాకుతూ వస్తున్నాడు. వాడితో ఏదో మాట్లాడాను. వాడికేమీ అర్హ్దంకాక జీవిత రహస్యం తెలుసుకోలేకపోయిన వేదాంతిలా,నిరర్ధకపు ఏడ్పు మొదలుపెట్టాడు. చెట్ల గుబురు మధ్య కుముదం మేఘాల మధ్య నక్షత్రంలా కదిలింది. నక్షత్ర బృందంలోంచి విడిపోయిన పిల్లకాంతిలా మరో చిన్నపిల్ల పరుగులెత్తింది. కుముదం చేతిలో గునపాన్ని గిరవాటెట్టి పమిటని పళ్లమధ్య బిగించి  పైకిలాగి, చేతిలో వున్న మొక్కని నా ముందు పడేసింది.

"చూశావా, యీ ఆకుని ఎట్లా తినేస్తుందో యీ చిత్రమైన పురుగు? ఈ పురుగు అందమైనదే, మొక్కా అందమైనదే, అందాన్ని చూచి అందం నోర్చులేదు కదూ?

నేనేమీ మాట్లాడలేదు.

"నువ్వొచ్చి ఎంతసేపయింది? పిలవలేక పొయ్యావా? లేక నా పేరే మరచిపొయ్యావా?" అంది.

"లేదు లేదు - యీ తోటని చూస్తూ ఆశ్చర్యపడుతున్నాను."

"ఇందులో ఆశ్చర్యం ఏముంది? విత్తనం వేసి నీళ్లు పోస్తే మొక్క మొలుస్తుంది. ఇవన్నీ సాధారణమైన మొక్కలు" కొంటెగా నవ్వింది.

"మా పాపని చూశావా. పెద్దదైంది. నువ్వింక సంబంధాలు చూసి పెట్టే సమయం వస్తోంది. వాడు మా రెండోవాడు. ప్రకృతంటే పడదు. అన్నింటినీ ధ్వంసం చేస్తాడు. వీడు మా మూడోవాడు. .వీడికి నాలా ప్రపంచంతో నిమిత్తం లేదు. పాప! బకెట్ తీసుకురా.."

అమ్మాయి బకెట్ తీసుకొచ్చింది. కుముదం చిన్నప్పుడు జామపండు తింటున్న దృశ్యం జ్ఞాపకం వచ్చింది.

“కొంచెం నీళ్లు తోడిపెట్టు, చేతులు కడుక్కుంటా" అంది.

నేను తోడాను. బకెట్‌లో సగం నీళ్ళు నూతిలోనే పడిపోయాయి.

"నీళ్ళు తోడడం తెలియకపోతే ఎట్లా? నీ భార్య బైటుంటే నువ్వే తోడుకోవాలి."

"నాకింకా పెండ్లి కాలేదు."

నమ్మలేనట్లు చూసి మౌనంలో పడింది.

"నాకు ఉద్యోగం లేదు. ఎందుకు పెండ్లి?" అని స్వగతంలా చెప్పుకున్నాను.

కుముదం నా మాట వినిపించుకోలేదు. చీరని పాదాల పైకి తీసింది. ఆమె శరీరానికి మాతృత్వం పరిపూర్ణత నిచ్చింది. వయసు మొహానికి వైరాగ్యాన్నిచ్చినా , వార్ధక్యాన్నివ్వలేకపోయింది. మట్టిలో నీళ్ళు కలిపిన వింత సువాసన నన్నావరించింది. మొహాన్ని పమిటతో తుడుచుకుంది. తడిసిన పమిట పర్వతశిఖరానికి ఎగబ్రాకేవాడికి పట్టు దొరికినట్లు, వక్షాన్ని అదిమిపట్టుకుంది. సూర్యుడి కడసారి కిరణం, లోయలో నీడని ఒక్కసారి వెలిగించి మాయమైంది. సంధ్య అందాన్ని అనుభవించాలన్నవాడు కుముదంతో వుండాలి. సంధ్యలో నేనెన్నడూ చూడని చూడని ప్రత్యేక శోభని ఆనాడు చూడగలిగాను.

"దా.. ఉయ్యాలమీద కూర్చో.. వెనక విరిగిన కుర్చీ యింతవరకూ బాగు చేయించనేలేదు... ఏదో వొకటి వొస్తూనే వుంటుంది. తీరిక లేదు."

కుముదం గడ్డిలో కూర్చుంది. వేదాంతిని ఎత్తుకొని లోపలి కెళ్లింది. రెండోవాడు, ధ్వంసం చేసేందుకు మొక్కలు లేవన్నట్టు, గడ్డినే దిమ్మిశాలా మర్దిస్తున్నాడు.

"మనం కలుసుకుని చాలా రోజులైంది తెలుసా?"

"ఆహా, దగ్గరగా ఆరు సంవత్సరాలైంది."

"నువ్వు చాలా మారిపోయావు."

మంచికా చెడుకా అని అడుగుదామనుకున్నాను. నన్ను మాట్లాడనీకుండానే "ఎక్కడెక్కడికెళ్లిందీ, ఏం చేస్తున్నదీ.. అంతా చెప్పు నీ గురించి" అంది.

"ఉత్తర హిందూస్థానం వెళ్లా. ఎక్కడా మంచి ఉద్యోగం దొరకలేదు. మామూలుగా ఇండియాలో మనిషి ఇరవై ఎనిమిదేండ్లకంటే ఎక్కువకాలం జీవించడంటారు సాంఖ్య శాస్త్రకారులు. దాని ప్రకారం నేను నాలుగేండ్ల క్రితమే చనిపోయి వుండాల్సింది. అల్పాయువుగలవాళ్ళు సుఖంగా వుండగలరు మన సంఘంలో.."

కుముదం సానుభూతి చూపి, జాలిపడుతుందని నా ఉద్ధేశ్యాన్ని ఎంతో  కసితో భయంకరంగా ప్రకటించానేమో!

"ఉద్యోగం లేకపోతేనేం? దానికోసం జీవితాన్ని తిట్టొచ్చా! ఉద్యోగంలో పడ్డావంటే అదే లోకం. మరి ప్రపంచంతో సంబంధం వుండదు. ఎవరికో బానిసవై స్వేచ్చ పోగొట్టుకుంటావు. ఆడాళ్ళకి వుద్యోగం చేసే బాధ  లేకపోవడం ఎంతో మెరుగు.

ఉద్యోగం చెయ్యనందుకు నన్ను అందర్లా ఆక్షేపిస్తూ తిట్టకుండా, మెచ్చుకున్నందుకు నేను కుముదాన్ని కొంత గౌరవించాను.

"పాశ్చాత్య దేశాలలో స్త్రీలు, పొట్టకూటికోసం భర్తలకు మన వాళ్లలా అమ్ముడుపోరు" అన్నాను. అప్రయత్నంగా రెండు గడ్డిపువ్వులను తెంచి జుట్టులో అముర్చుకుంది.

"మనకీ ప్రపంచంలో ఎవరో ఒకరికి దాస్యం చెయ్యడం తప్పదేమోననిపిస్తుంది. దేవుడు సైతం భక్తుడికి దాసుడు కావడం లేదూ."

"నా కింతవరకు ఉద్యోగం యివ్వని యీ సంఘాన్ని గౌరవించి, ఎందుకు సేవ చెయ్యాలో నాకు తెలీడంలేదు."

"నీకు ఉద్యోగం లేకుండా వుంటే నువ్వు సుఖపడతావు. ఐనా నీ పిచ్చి కాకపోతే, నీకు ఉద్యోగం ఎవరో యిచ్చేదేమిటి? నువ్వేదో గొప్ప కార్యం కోసం పుట్టానని వెనక చెప్పావు. అది నేను నమ్ముతాను. అది చెయ్యి. స్వతంత్రించి, నచ్చిన పని చెయ్యడమే మంచిది. నేను దాస్యం సహించలేను."

"దాస్యం లేకుండా, ప్రేమని సాధించడం ఎట్లా?" ఈ ప్రశ్న ఎందుకడిగానో నాకు తెలీదు.

"ఔను. మనుష్యులతో చేసే ప్రేమలో దాస్యం వుంది. సంసారంలో బంధనాలు ప్రేమలో బంధనాలు, అసలు పుట్టడమే సృష్టికి దాస్యం. వీటికి దూరంగా వుంటే మంచిది."

కుముదం హృదయానికి దగ్గరగా వుండే విషయాలని గురించి ముచ్చటిస్తుంటే వినడం అదే మొదటిసారి. నేను అనుకున్నంతటి అమాయకురాలు కాదని స్పష్టమైంది.

"ప్రపంచంతో నిమిత్తం లేకపోతే, అసలు గొప్ప కార్యం సాధించటం దేనికి?"

"సాధించటంతో మనుషులకు చేసే దాస్యం నుండి విముక్తి దొరుకుతుంది. కాబట్టి, ప్రపంచాన్ని మనం ఏదేనా కోరి, ఆశిస్తే దాన్ని యివ్వదు. మనం దేన్నీ ఆశించకుండా, దూరంగా వుండి చెయ్యగలిగిన పని చేస్తుంటే ప్రపంచం మన పాదాల ముందు వాల్తుంది."

కుముదం స్వతంత్రాన్ని అంత కాంక్షిస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. భర్త, పిల్లలు, సంసారం, ఉద్యోగం, తుదకి ప్రేమ - యివన్నీ కూడా దాస్యమేనంటుంది. స్వతంత్రం లేని బ్రతుకు వృధా. ఒక విలువని అంతగా కోరినప్పుడు, దాన్ని వారు పొందలేకపోతే, నా హృదయం బాధతో కృంగిపోతుంది. జనసామాన్యానికి స్వేచ్చనిస్తే దుర్వినియోగం చేస్తారు. దాని విలువ తెలియనివాళ్ళకి అదివ్వడం మహాపాపం కాని, దేన్నీ వుపయోగించకుండా, కేవలం విలువల ఆరాధనతో తృప్తిపడే కుముదంలాంటి వ్యక్తులకి స్వేచ్చ లేకపోవడం ప్రపంచానికి అనర్ధం.

"నేను నువ్వైతే ఏం చేద్దునో తెలుసా? నదీ తీరాన్ని చిన్న తాటాకు పాక కట్టుకుంటాను. అందులో కూర్చుని, ఊరికే చదువు నేర్పుతానని చాటింపు వేయిస్తాను. మొదట ఏ పదిమంది పొలంకాపులో వొస్తారు. సాయంత్రం, వాళ్లకి బోధించడం మొదలెడతాను. ఇరుగుపొరుగునుంచి అనేకమంది కర్షకులు, కూలివాండ్లూ చదువుకోసం వస్తారు. ఉత్తచేతుల్తో రాకుండా, ఒకరు వుప్పు, చింతపండు, ఒకరు పాలు - అలా నాక్కావల్సినవాటిని వాళ్ళే సిద్ధం చేస్తారు. వారు నా శిష్యబృందం. వాళ్ల కష్టసుఖాలు పంచుకుంటా. వారి తగాదాలకి తీర్పుచెపుతా. అంతే. అప్పుడు నా జీవితం వృధా అనుకోను."

సూర్యుడు అస్తమించగా అలిసిన తన పరివారం పడమటిలోయలో సేదతీర్చుకుంటున్నట్లు వెలుగుచాయలు కరుగుతున్నాయి. ఓపికలేక కదలలేకపోయిన మేఘద్వయం దక్షిణ గాలి పిలుపుకి కదిలిపోతున్నాయి. ఇది నా రాజ్యం అన్నట్లు వొంటి నక్షత్రం కన్నుమీటింది. ప్రకృతిలో నిశీధికీటకాలు తన్మయరొద సాగించాయి. మా సంభాషణ విని విని విసుగెట్టిన పుష్పాలు చీకటి ప్రశాంతంలో ముడుచుకున్నాయి. తూర్పు ఆకాశం జడ విపుకుంది. కుముదం తలలో తెల్లవెండ్రుక మెరిసింది.

"తెల్ల వెండ్రుక" అన్నా, వున్నచోట వేలు మెదుపుతూ.

"ఎన్నాళ్ళని యవ్వనానికి శరీరం దాస్యం చేస్తుంది" దాని దోవ అది చూచుకుంటుంది.

నా కళ్ళు చెప్పలేని విచారంతో తడిసినై. నేను అద్దె మాట అడగడం మరిచిపొయ్యాను. ఆ తన్మయతతో బరువెక్కిన వాతావరణాన్ని డబ్బు ప్రశంసతో పాడుచెయ్యడం నాకిష్టం లేకపోయింది.

వెడతానని లేచా. మంచిదంది. పోనీ యీ రాత్రి యిక్కడుండి వెళ్లకూడదా అంటుందనుకున్నా. కుముదానికి మర్యాదంటే ఏమిటో తెలీదు.

***

మరి నాలుగు సంవత్సరాలు గడిచినై. యుద్ధం సాగుతోంది. నాకు మాత్రం ఉద్యోగం చిక్కలేదు. నేను దాన్ని గురించి విచారించే రోజులు వెళ్లిపోయాయి.

రోజులు గడిచిపోతున్నాయి. నా తిండికి ఎట్లాంటి లోపమూ రాలేదు. వస్తున్న రోజు ఒక్కటి కూడా లేదు. దుబారా ఖర్చుకి నాకే అలవాట్లు లేవు. సిగరెట్లు కాల్చను. సినిమాలకెళ్లను. పుస్తకాలు కొనుక్కోను. అవంటే యిష్టం లేక కాదు. అవి నా అందుబాటులొ లేవు. మా మామయ్య చనిపోయి ఆరునెలలైంది. మా అత్త  తప్ప నాకు 'నా' అన్నవాళ్లు ఎవ్వరూ లేరు. ఇది కొంత మేలే. నా మీద అధికారం చలాయించేటందుకు ఒక్కరూ లేరు. నాకీ సంఘం తిండిపెట్టనక్కర్లేదు. నా బ్రతుకు నన్ను బ్రతకనిస్తే చాలు. మా అత్తయ్య వున్న యింటికి అద్దె యిచ్చుకోలేకపోతోంది.  తుదకు నిశ్చయించుకుని. సొంత యింట్లోకెళ్ళి కాపరం పెట్టడానికి. ఖాళీ చేయించే యేర్పాట్లకి నన్ను పంపింది.

ఆనాడు ఆదివారం. రాత్రి ఎనిమిది దాటింది. సన్నచంద్రుడు పల్చటి మేఘం వెనక దాక్కున్నాడు.  కుముదంగారి యింట్లో దొడ్లో అంతా నిశ్శబ్దం. వీధిలోకొచ్చాను. తలుపు తాళం వేసి వుంది. ఎక్కడికెళ్ళారో నాకు బోధపడలేదు. కాసేపు అరుగుమీద కూర్చున్నా. తెలిసినవాళ్లని కనుక్కుందామని వీధిలోకి నడిచాను. అప్రయత్నంగా బజార్లోకి వెళ్లాను. కిళ్ళీ దుకాణం ముందు బల్లమీద కుముదం పెద్దకూతురు పాపాయి నెత్తుకొని కూర్చుంది. నన్ను కేకేసింది.

"మా ఆఖరు చెల్లాయిని చూశారా? నాలుగోది. దీన్ని స్వరాజ్యం అని పిలుస్తుంది మా అమ్మ. చూడండి. వూ ఏడుస్తుంది. ఊరుకో నా చిట్టితల్లి."

"ఇంట్లా యిక్కడెందుకున్నవ్? మీ అమ్మ ఎక్కడ?"

"మా అమ్మ ఆస్పత్రిలో వుంది. ఇది ఏడుస్తుంటే ఆడించడానికి బైటికి తీసుకొచ్చాను. మా నాన్న హోటలికెళ్లాడు"

స్వరాజ్యాన్ని భుజాన వేసుకుని హాస్పిటల్‌కి వెళ్ళాం. కుముదం మంచంపై పడుకుంది. పైన తెల్లటి గుడ్డ కప్పివుంది. చిన్నబల్ల మంచం దగ్గరగా లాగి కూర్చున్నాను.

"ఏం జబ్బు?"

"న్యూమోనియా"

న్యుమోనియా అంత ప్రమాదకరమైన వ్యాధని నాకంతవరకూ తెలియదు. మాట్లాడేందుకు ఏమీ కనిపించక, దిగులుగా కూర్చున్నాను. కుముదం నీరసంగా నవ్వడానికి యత్నించింది. మొహం మెలికలు తిరిగింది. పెదవులు పవిత్రంగా వొణికాయి."నన్ను గురించి కథ వ్రాయవూ?" అంది. నేనేం చెప్పనూ?

" ఈ జబ్బు విషయం నాకు తెలీనే తెలీదు. పోనీ వో వుత్తరం ముక్క వ్రాయించకూడదా? డాక్టర్లు ఏమంటున్నారు.?"

"జబ్బు చెయ్యడం సాధారణమైంది. పదిమందితోనూ చెప్పుకునేందుకు అందులో ఏం విశేషముంది? ఫరవాలేదంటున్నారు డాక్టర్లు.. కాని వాళ్లకేం తెలుసు?" అని కళ్ళు మూసింది.

నాకక్కడినుంచి వెళ్ళిపోవాలనిపించింది. ఏదో చెప్పాలని వుంది.కాని నోరాడదు. నా శరీరం వొణికిపోతోంది. అనుకోకుండా, నా చెయ్యి ఆమె చేతిమీద ఆనించబొయ్యాను. అది వేలుకి వుంగరం వున్న చెయ్యి. వెంటనే చేతిని లాగేసుకుని తెల్లదుప్పటిలో దాచేసుకుంది.

"నువ్వెందుకు పెండ్లి చేసుకోలేదో నాకు తెలుసు. నాకోసం" అంటూ మళ్లా కళ్ళు మూసింది. నా గుండె స్థూలత్వాన్ని పోగొట్టుకుని ద్రవంగా విడిపోయి, దోవ తెలియక తిరుగుతున్న రక్తనాళాలగుండా, వుజ్వల వేగంతో ప్రవహిస్తుంది. కన్నీటిని నా వేళ్ళతో తొలగించుకొన్నాను. ఆమె నిశ్చల శరీరంపై నా కన్నీరు పడి మలినం చెయ్యడం పాపం అనిపించింది. మొహాన్ని పక్కకు తిప్పేసుకున్నాను. కిటికీ అద్దంలోనుంచి నిశీధి నల్లత్రాచులా లోకాన్ని అల్లుకుంటోంది.

"నీ స్థితి చూస్తే నాకెంతో బాధగా వుంది" అన్నా కన్నీరు దిగమింగుకుని.

"నాకు నిర్విచారం.. ఈ ప్రపంచం నాదైతేగా విచారానికి , నువ్వు మాత్రం.." కళ్లు మూసి మరి విప్పలేదు. ఈ లోకంలో మూసుకుని మరో లోకంలో తెరుచుకున్న నేత్రాలు కుముదానివి.

 ***

ఆత్మని దిగి విడిచి వచ్చిన వ్యక్తి మళ్ళా దానిలోకే చేరుకుంది. చెట్లు,, నదులు, మేఘాలు, చీకటి వెలుగుల సమ్మేళనంతో గిరగిరా తిరిగిపోతున్న విశ్వంలోకి కలిసిపోయింది.

నిషీధిలోకి నడిచి వెళ్ళావు. మహత్తర అనుభవం సంభవించినప్పుడు, తార్కిక జ్ఞానం, విమర్శనాబుద్ధి పని చెయ్యవు. ఇంద్రియాలు శరీరాన్ని వూపి,కొత్త జన్మనిస్తాయి. భావోద్రేకంలో నిమగ్నుడై  చైతన్య ప్రవాహంలో కొట్టుకుపోతున్న వ్యక్తి, ఒక్కసారి సృష్టి రహస్యాన్ని, మెరుపులా చేదించి మరో అవతారం దాలుస్తాడు. చచ్చి బ్రతకడంలాంటిది ఆ అనుభవం.

కుముదం నా వివాహాన్ని గురించి చెప్పిన కడసారి మాటలు నాలో అధోలోకాన్ని త్రవ్వి దాని దాపరికాన్ని నా కళ్ళముందు ప్రదర్శించినట్లయింది. ఆమెకోసం పెండ్లి చేసుకోలేదట. మానసిక శాస్త్రజ్ఞులు, మానవుడి బుర్రలో అధోలోకం వుందంటారు. అక్కడ అతని రహస్యమైన కోర్కెలు, బైట చెప్పుకోలేని తీరని వాంచలు అడవి మృగాలలా తిరుగుతాయట. అవి అన్ని సమయాలలోనూ బయటికి రాకుడా బుద్ధి కాపలా కాస్తుంది. అవి బైటికి రాలేకపోయినప్పటికీ, ఎప్పుడో, నిద్రలోనో, బలహీనమైన స్వప్నావస్థలోనో, గర్జించి వాటి వునికిని బాహ్యప్రపంచానికి వెల్లడిస్తాయట. ఇంతకాలం నా బుద్ధి వాటిని కట్టేసింది. ఆనాడు ఆమె చెయ్యిపైన చెయ్యి వేసినప్పుడు బుద్ధిని తొలగించి వాంచలు బైటికొచ్చినట్లు కుముదం గ్రహించి, తన చేతిని లోపల దాచుకున్నట్లు వాటిని వెనక్కి నెట్టి నోరు నొక్కింది. ఆమెలో ఏమీ విశేషం లేదని సమాధానపరుచుకున్నా, ప్రాకృతికమైన ఆకర్షణ లోపల దాగి వుండి, నా జీవితంపై అంత ఒత్తిడి కలిగించినందుకు ఆశ్చర్యపడ్డాను.

తనని గురించి కథ వ్రాయమంది. ఆరుగంటల పరిచయంతో, ఆరువందల మాటలతో, నా ప్రపంచాన్ని తలక్రిందులుచేసి, నా జీవిత పరమావధినే తారుమారు చేసిన కుముదాన్ని గురించి ఏం కథ వ్రాయను?

.

oooo

Comments
bottom of page