top of page

విన్నకోట రవిశంకర్

ముకుంద రామారావు

ఆహ్వానిత మధురాలు

Anchor 1

జీవం

అనంత కాలంగా చూస్తున్న ప్రపంచాన్నే
ఒక శిశునేత్ర గవాక్షం నుంచి
ప్రతి ఉదయం కొత్తగా కనుగొనటం దాని వ్యాపకం.

 

వేల సార్లు సాహసంతో
సంకల్ప బలంతో సాధించిన పర్వత విజయాల్ని
ప్రతి రోజూ ఒక పసివాడి తడబడే అడుగుల్లో
పోగొట్టుకోవటం దానికి సరదా.

 

పరిపక్వమైన పాండిత్యంతో, శాస్త్ర పరిజ్ఞానంతో
అందనంత ఎత్తులో పండై వ్రేలాడినదే
మళ్ళీ చిరు మొలకలై 
దారి తోచని తడి వేళ్ళ వంక 
బేల కళ్ళతో చూస్తుంది.

 

తరతరాలుగా శృంగార రస సముద్రాన్ని మధించి
సాధించిన అమృత ఫలాన్ని మరిచి
అపరిచిత ప్రియ దేహం మీద సందిగ్ధంగా తడిమే
వేళ్ళుగా కదులుతుంది
దీని ఆవిష్కరణ ఎప్పటికీ చెదరని
ఒక ఉన్మత్తుని రంగుల కల.
దీని ఆట
ఒక ముసలివాడు విడవకుండా
తనతో తనే ఆడుకొనే వింత చదరంగం.

****
 

ప్రేమ

నువ్వు పూవయితే  
నేను దాని మొక్కనవుతా
            నువ్వు మంచుబిందువవుతే
           నేను దాన్ని మోసే పువ్వునవుతా  
నువ్వు సూర్యరశ్మివవుతే 
నేను మంచుబిందునవుతా
           నువ్వు నదివవుతే
           నేను సముద్రాన్నవుతా
నువ్వు నక్షత్రమవుతే 
నేను ఆకాశాన్నవుతా
           నువ్వు గమనించకపోయినా  
           నిన్ను తాకుతూ ఉండే గాలినవుతా 
నేను మట్టిలో కలిసిపోయినా
నిన్ను మోసే భూమినవుతా

*** 

సంక్రాంతి సంచిక 2016​

క్రింది పేజీలు

ప్రస్తుత తాజా సంచికలో

లభ్యమవుతాయి

వ్యాఖ్యలు క్రింద చూడగలరు

Anchor 2

విన్నకోట రవి శంకర్

అమలాపురం లో పుట్టిన విన్నకోట రవి శంకర్ గత ముఫై ఏళ్ళగా తనదైన ముద్ర తో ఆధునిక కవులలో అగ్రశ్రేణి కవి. తన అభిమాన కవి ఇస్మాయిల్ అనీ నిత్య జీవితంలో ఎదురయ్యే సున్నితమైన అనుభవాలని గాఢంగా ఆవిష్కరించడానికి కవికి స్పష్టత, నిజాయితీ అవసరమని విశ్వసిస్తారు. “కుండీలో మర్రి చెట్టు” (1993), “వేసవి వాన” (2002), “రెండో పాత్ర” (2010) మొదలైన స్వీయ కవితా సంపుటాలు, అనేక ఇతర కథలు, కవితలు, కవితా విశ్లేషణలు ప్రచురించారు. కవితా సంకలనాలకి సంపాదకుడి గా ప్రముఖ పాత్ర వహించారు. 
శ్రీ కళ, కూతురు హిమ బిందులతో పదిహేనేళ్ళగా సౌత్ కెరోలైనా రాష్ట్రం లో కొలంబియా నగరం నివాసం. 

 

****

Anchor 3

ముకుంద రామారావు

ప్రముఖ కవి ముకుంద రామారావు గారు 1946 నవంబర్ 9 వ తేదీనాడు ఖరగ్‌పూర్ లో జన్మించారు. రైల్వే శాఖ, సాఫ్ట్ వేర్ రంగాలలో పనిచేసి 2006లో పదవీ విరమణ చేసారు. వలసబోయిన మందహాసం, ,మరో మజిలీలోకి ముందు మొదలైన సుప్రసిద్ద తెలుగు కవితలు అనేకం, The smile that migrated,and other poems అనే ఆంగ్ల కవితా సంపుటి, అనేక కథలు, వ్యాసాలు గ్రంధాలు ప్రచురించారు. “అదే గాలి” పేరిట ప్రపంచదేశాల కవుల, కవిత్వ చరిత్ర గ్రంధం ముద్రణలో ఉంది. వీరి కవితలు అనేక ఇతర భాషలలోకి అనువదించబడ్డాయి. టీవీ, రేడియోలలో మంచి వక్తగా పేరుపొందిన ముకుంద రామారావు గారు తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారం మొదలైన అనేక పురస్కారాలు అందుకున్నారు.

Please keep your facebook logged in another browser tab or new browser window to post a comment in madhuravani.com website. 

bottom of page