top of page

మధురవాణి ప్రత్యేకం

పాండి బజార్ కథలు - 13

ఊర్మిళ

భువనచంద్ర

adannamaata.png

సంపుటి  5   సంచిక  3

Website Published &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

“బాబయ్య… మీ నాన్నగోరండీ… మా పేణాలు నిలబెట్టింది. మీ అమ్మగోరి చేతికి ఎముక లేదండీ… ఇయ్యాళ మళ్ళా మీరు మా ముందుకొచ్చారండీ… బాబయ్యా, ఆ ఆదినారాయణరెడ్డి ఆట కట్టించే దమ్ము మీకు తప్ప లోకంలో ఎవరికుంటుందండీ.” 

“అయ్యా… మా పాలి మీరు దేవుడండీ… దేవుడ్ని చూసినోడు ఎవరన్నా వున్నారా అనడిగినవోడికి మేం చేబుతామండి… ‘దేవుడ్ని మేం చూశాం… మా సిన్నబాబుగారే మాకు దేవుడు’ అని.”

“అమ్మా రాణీ భువనేశ్వరమ్మా.. నువ్వు దయతలచకపోతే ఇంకెవరు మా పేదోళ్ల బతుకుల్ని కాపాడగలరమ్మా. మా మీద కోపగించకు తల్లీ.”

 “రేయ్…వచ్చాడ్రా మా దేవుడు. కత్తి ఎత్తాడంటే సుడిగాల్లో పత్తి ఎగిరినట్టు మీ తలకాయలు ఎగిరిపోతై”

 “సుడిగాలి వస్తాది… ఆరిపోద్ది, మా సూరన్న సుడిగాల్లా వస్తే మాత్రం ఆగడు… చెలరేగి పోతాడు… మీ చిల్లర నా యాళ్లనందర్నీచంపేసి పోతాడు!”

***

 వేరు వేరు సిన్మాలో డైలాగులన్నీ పలికింది సుధాకర్రాజు వెస్టుగోదావరివాడు. హైస్కూలు పాలకొల్లు, కాలేజీ గుంటూరు, మొదటి ఉద్యోగం తణుకు, రెండో ఉద్యోగం వైజాగు. అప్పుడే నాటకాల పిచ్చి పట్టింది. స్వతహాగా అందగాడు. మంచి వర్చస్సు. అద్భుతమైన వాచకం వుండడంతో సినిమా పిచ్చి తోడై మద్రాసుకి వచ్చాడు. మొదట్లో హీరో ఫ్రెండ్స్ గుంపులో ఒకడిగా, వ్యాపారస్తుడిగా, పోలీసుగా, దొంగగా, ఒక సీన్ లాయరుగా, కొన్ని చోట్ల ఏ డైలాగు లేని విలన్ అసిస్టెంట్ గా పనిచేశాడు. ప్రతి గుంపులోనూ అతనుంటాడు. ఒకటో రెండో నించి అయిదారు డైలాగులుండే వేషందాకా అతనే మనకి కనిపిస్తూ వుంటాడు. హీరో హీరోయిన్లకీ, దర్శకులకీ, బేనర్లలకీ రజతోత్సవాలు జరుపుతారు. ఈ మధ్య సినిమాలక్కూడా షష్టిపూర్తులూ, భీమరధ శాంతులు జరుపుతున్నారు. 

“గుంపులో గోవిందా” లకి ఎవరు జరుపుతారు? జరిపినా జరపకపోయినా సుధాకర్ రాజుకి కూడా సినీ రజతోత్సవ సంవత్సరం అది. అతని సినిమా పేరు “పేద నారాయణ.” అతను సినిమాల్లో అడుగుపెట్టినప్పుడు పెట్టుకున్న పేరు “వేదనారాయణ.” ఎక్కువగా ‘పేద’ వేషాలే వేయడం వల్ల ‘వేదనారాయణ’ కాస్తా ప్రొడక్షన్ మేనేజర్ల నోట్లో పడి ‘పేద నారాయణ’ గా రూపాంతరం చెందింది.

అసలు విషయం ఏమంటే వేదనారాయణ/పేదనారాయణ అనబడే సుధాకర్ జీవితంలోకి ఊర్మిళ ప్రవేశించడం. ఆ ప్రవేశం చాలా నాటకీయంగా జరిగింది. పాండీ బజార్ ఎంత ఫేమస్సో, ఆ బజార్‌లోని ‘ఆంధ్రా కిళ్ళీషాపు” అంత ఫేమస్. ‘ఎక్‌స్ట్రా’ లందరూ వెళ్లే ముందో వచ్చే ముందో ఆ షాపుని దర్శిస్తారు. ఆల్మోస్టు వాళ్ళ అడ్రస్సులన్నీ షాపు ఓనర్‌కే కాదు పనోళ్ళకి కూడా తెలుసు. ఆ పక్కనే ‘వైన్’ షాపు ఒకటి వుండేది. డబ్బులొచ్చిన రోజున షాపులో తీసుకున్న షోడా లోంచి కొంచెం తాగో, ఒంపేసో, మిగతా దాంట్లో క్వార్టరు పోసి గటగటా లాగించేవారు కొందరైతే, ఓ క్వార్టరు మందు కొనుక్కొని అప్పట్లో కొత్తగా వచ్చిన ‘బిస్లేరీ’ బాటిల్ లో పోసి, ఏ చెట్టు కిందో నిలబడి కబుర్లు కొడుతూ మందులాగించే వాళ్లు మరికొంతమంది. ‘త్రిభా’ వాడు రూపాయికో పుల్కా ఇస్తే, “హామీదియా” వాడు రూపాయిన్నరకో దిట్టమైన చపాతీ ఇచ్చేవాడు. పోస్టాఫీసు దగ్గర వుండే ఇడ్లీ, దోశ బళ్ళ దగ్గర లెక్కలేనంత మంది సినీ జనాలు, రూపాయికి నాలుగు ఇడ్లీ, నీళ్ల చట్నీలు రెండు + కావల్సినంత సాంబారు. దోశ అయితే అర్ధరూపాయి.

ఇదంతా ఎందుకంటే ‘ఊర్మిళ’ సుధాకర్ కి తారసపడింది పాండీ బజార్లోని ‘కైరాలి’ ముందు కారు దిగుతూ. (ఆ షాపు ఇప్పటికీ వుంది). చూడగానే స్టన్నయ్యాడు సుధాకర్. 

 అప్పుడే ఆకాశంలోంచి జగదేకవీరుడి కథ లో నేలకి దిగొచ్చిన బి.సరోజ అతని కళ్ళముందు మాడ్రన్ డ్రెస్‌లో నిలిచింది.

 ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ తనలో తను అనుకున్నాడు. ఆ రోజుల్లో. అతనికి 100% నమ్మకం వుంది. హీరో అయితీరతానని, డబ్బూ వుంది, అమ్మానాన్న నెలనెలా పంపేది.

 ఆవిడ కైరాలిలో కొన్ని కొనేవరకూ చూశాడు. ఆ తరవాత ఆవిడ రెండు మూడు షాపుల్లో ఏవో ఐటమ్స్ కొని కారెక్కింది. ఆవిడ సుధాకర్‌నీ, సుధాకర్ ఆవిడనీ గమనించడం ఇద్దరు గమనించారు. ఒకడు లంగోటీ రామచంద్రుడు. ఇతనెప్పుడూ ‘వస్తాదు’ వేషాలు వేసేవాడు. పెద్ద నటులకి డూప్‌గా కూడా పనిచేసేవాడు.

రెండోవాడు కాస్ట్యూమ్ శంకర్. ఇండస్ట్రీలో పెద్ద హీరో అవుదామని వచ్చి కనీసం ఎక్ స్ట్రా  వేషాలు కూడా దొరక్క, తాతముత్తాతల వృత్తి అయిన టైలరింగ్‌ని నమ్ముకొని, మొదట కాస్ట్యూమ్ శీను దగ్గర రెండేళ్ళు పనిచేసి తరవాత సొంతంగా సినిమాలకి కాస్ట్యూమర్ గా సెటిలయ్యాడు.

“ఏంట్రా సుధాకరూ, ఊర్మిళ మీద కన్ను పడిందా?” నవ్వుతూ అడిగాడు రామచంద్రుడు.

“ఆ అమ్మాయి పేరు ఊర్మిళా?” అడిగాడు సుధాకర్. 

“అవును... మాంఛి కసక్ పార్టీ. ఐతే మన లాంటి కేరాఫ్ ఎడ్రస్ లేనోళ్లకి అందదు. కనీసం సైడ్ హీరో, కో-డైరెక్టర్ లెవిలుండాలి.” సిగరెట్ వెలిగించి అన్నాడు శంకర్. ముగ్గురూ రోజూ మలర్ కోడి మేన్షన్, ‘మొట్ట మాడి’ అని పిలవబడే టెర్రస్ మీద కూర్చుని మందు కొడతారు. మందయ్యాక శంకర్ ఇంటికీ, రామచంద్రుడు ‘పూంగా మేన్షన్’ కీ వెళ్ళిపోతారు. ఈ రెండు మేన్షన్ లోనూ ఉండే గదుల్లో వుండేది సినీ జీవులే. (నేనూ వున్నానోచ్!)

 “ఏం చేస్తుందీ?” కుతూహలంగా అడిగాడు సుధాకర్.

“గొల్లభామ పచ్చని ఆకు మీద వాలినట్టు పచ్చనోట్లు దండిగా వునోళ్ల మీద వాల్తాది.” పొగ పీల్చి అన్నాడు శంకర్.

"ఆ తరవాత?" అడిగాడు సుధాకర్.

"ఎక్కడ వాలింది అక్కడే వుంటాదా? కొరకాల్సింది కాస్తా కొరికేసి మరో మొక్కనో చెట్టునో చూసుకోదూ... ! ఈవిడా అంతే!" శంకర్ పెట్టెలోంచి సిగరెట్టు తీసి వెలిగించి అన్నాడు రామచంద్రుడు.

ఆ తర్వాత లక్షా తొంబై పుకార్ల మీదా, ప్రొడక్షన్ కంపెనీల మీదా సంభాషణలు రసవత్తరంగా సాగినా సుధాకర్ మనసులోంచి మాత్రం ఊర్మిళ తొలగిపోలేదు.  

***

 

"ఆరునెలలపాటు మా స్నేహం అద్భుతంగా కొనసాగింది." నిట్టూర్చి అన్నాడు సుధాకర్. ఒక్కప్పుడు హామీదియా, గీతా కేఫ్, బాలాజీ కేఫ్, ఇవన్నీ పాండీబజార్లో పేరొందిన హోటల్సు.  అందులో బందరు మిఠాయి దుకాణం కూడా చాలా ఫేమసే. అలాగే చక్రవర్తి మెస్, చౌదరి మెస్, ఆంధ్రా టీ స్టాల్ ఇవి కూడా చాలా ఫేమస్. 'శరవణ భవన్' హోటల్స్ వచ్చి అన్నిటినీ తొక్కేశాయి. రుచి శుచి శుభ్రంతో జనాల మనసుల్నీ, పర్సుల్నీ కూడా కొల్లగొట్టేశాయి. ఇప్పుడు నేనూ, ఆ సుధాకరూ కూర్చున్న ది శరవణ భవన్ హోటల్లోనే.

“ఆ తరవాత?” అడిగాను.

“జన్మలో హీరోని కాలేనని నాకూ, నాతో పరిచయం భవిష్యత్తులో ఉపయోగపడదని ఊర్మిళకీ అర్ధమయింది.” మళ్ళీ నిట్టూర్చాడు సుధాకర్.

నిజం చెప్పొదూ… నిట్టూర్చే వాళ్లంటే నాకూ కోపం. 

ఎందుకో మాత్రం నాకే తెలీదు. నా దృష్టిలో నిట్టూర్చడం అనేది ఓ జబ్బు. అది అలవాటైతే, స్వర్గం లో వున్నా సదరు 'నిట్టూర్పు వీరులు' నిట్టూర్చడం మానరు. 

"అసలు మిమ్మల్నిద్దర్నీ కలిపిన అంశం ఏమిటీ?" కుతూహలం ఆపుకోలేక అడిగాను.

ఊర్మిళ హై.ఫై . సుధాకర్ కామ్ అండ్ జెంటిల్. 

“లిటరేచర్ గురూజీ, లిటరేచర్! నా పేదరికపు యాస, డైలాగులు చూసి నేను ఏ రెండో తరగతో, మూడో తరగతో చదివుంటానని జనాలు అనుకుంటారు.

నిజానికి నేనో పోస్టుగ్రాడ్యుయేట్‌ని. ఇంగ్లీష్ లిటరేచర్ లో Hons. ని. గర్వంగా అన్నాడు. (‘ఆనర్స్’ని). నేనూ షాకు తిన్న మాట వాస్తవం. దానిక్కారణం గతంలో అతను నటించిన సినిమాలన్నిట్లోనూ అతను పోషించింది 'పేద' పాత్రలే.  

"ఊర్మిళ...' అనబోయి ఆగాను.
 

"అద్భుతమైన ఇంగ్లీషు మాట్లాడుతుంది. ఇంగ్లీష్ లిటరేచర్ ఆమెకి కొట్టిన పిండి. సోమర్‌సెట్ మామ్ అంటే ఆవిడకి ప్రాణం... ఇహ హెరాల్డ్ రాబిన్సూ, జేమ్స్ హాడ్లీ చేజూ, మాన్ సుయాన్, అగాథా క్రిస్టీ, గుస్టెల్ ప్లేబెర్గ్ ఇలా చెప్పుకుంటూపోతే వందలకొద్దీ రచయితల పేర్లు చెప్పాల్సుంటుంది. అనేకమంది ఇంగ్లిష్, అమెరికన్ రచయితల పుస్తకాల్ని నాకు పరిచయం చేసింది ఊర్మిళే. మాది just స్నేహం కాదు... ఇంటెలెక్చువల్ ఫ్రెండ్షిప్." ఆగాడు సుధాకర్. 

నేనేం మాట్లాడలేదు. స్నేహానికి కూడా రకరకాల పేర్లనీ, స్థాయినీ, విభాగాల్నీ, మానవుడు సృష్టించడం నాకూ విచిత్రంగా అనిపించింది. ఇంటలెక్చువల్ ఫ్రెండ్షిప్ వున్నప్పుడు ఈడియాటిక్ ఫ్రెండ్షిప్ కూడా వుంటుంది గదా మరి. 

"అంటే, అది నవలల చర్చతోనే ఆగలేదు... ఇంకొంచెం ముందుకి నడిచింది." ఆగాడు.

కొంత సస్పెన్స్ ని మెయిన్ టెయిన్ చెయ్యాలనుకుంటున్నాడని నాకు అర్ధమయింది. అందుకే మౌనంగా వున్నా. ఎలాగూ చెప్పకుండా వదలడని తెలిశాక నేను కుతూహలాన్ని ప్రకటించడం ఎందుకూ? ఓ రెండు నిమిషాలు మౌనంగా గడిచింది. 

"ఆఫ్ కోర్స్.. నా సబ్జెక్టు అంత కుతూహలాన్ని మీలో కలిగించి వుండకపోవచ్చు.. కానీ, మేము శారీరకంగా ఒకటి అయ్యామని గర్వంగా చెప్పగలను." కళ్ళలో ఆనందాన్ని ప్రతిఫలిస్తూ అన్నాడు. నవ్వొచ్చింది. వాళ్ళు శారీరకంగా ఒకటైతే అందులో గర్వం ఎందుకూ అని. 

"అంటే పెళ్లి చేసుకున్నారా?" కావాలనే అడిగా. 

“లేదు. ఆ అవకాశమే రాలేదు. ఊర్మిళ ఆల్ రెడీ సుందర పాండీని పెళ్లి చేసుకుంది. బాగా డబ్బున్నవాడు. అతని మొదటి భార్యా పిల్లలూ, కొడంగళత్తూర్ లో వుంటారుట. ఊర్మిళకి సుందర పాండీ ఏదో విలేజ్ గుళ్లో పసుపుతాడు కట్టాడుట. సాక్షాలు వాళ్ళూ ఎవరూ లేరు. మూడొంతుల ఆస్తి భార్య పేరు మీదే వున్నదిట.” వివరాలు చెప్పాడు సుధాకర్. నేనేమీ మాట్లాడలేదు. “ఆమె ద్వారా నాకొక కొడుకు కూడా వున్నాడని నా అనుమానం.” ఆగాడు కొంచెం చెబుదామా వద్దా అనే సంశయంతో, మళ్ళీ ఓ రెండు నిమిషాలు మౌనం మాత్రమే మాట్లాడింది. 

“అనుమానం ఎందుకంటే ఆమెకి మరో ఇద్దరు స్నేహితులున్నారు. ఆఫ్ కోర్స్ వారికీ ఆమెకీ మధ్య ఏ రిలేషన్ వుందో స్పష్టంగా నాకు తెలీదు.” 

“ఆ కొడుకు మీ కొడుకని ఆమె మీతో చెప్పిందా?” అడిగాను. న్యాయంగా అయితే చాలా కోపం వచ్చింది.

“ఎప్పుడూ చెప్పలేదు. నేను అడగలేదనుకోండి.” కొద్దిగా తలవంచుకొని అన్నాడు.

“మీ రిలేషన్ ని కట్ చేసింది ఎవరూ?”. ఈ ప్రశ్న అడగక్కూడదు. అయినా అడక్కపోతే కథ ముందుకు నడవదని అడిగాను. ఎందుకంటే, సుధాకర్ ని నేను కలిసి తన కథని చెప్పమనలేదు. తనే చెప్పడం మొదలెట్టాడు.

“కారణం నేనే. ఏమీ చాలా పోజెసివ్ గా తయారయ్యాను. ఆ పోజెసివ్ నెస్ తో బాటు నా కంటే చాలా చాలా ఎక్కువ చదివిందనే జలసీ నా లోపల వుందనుకుంటాను. చాలా బేడ్ గా బిహేవ్ చేశానని నాకు తెలుసు. ఓ మూడు నెలలు నిజంగా నరకమే చూపించి వుంటాను. ఆ తరవాత ఒకే మాటతో నన్ను కట్ చేసింది.” బాగా తలవొంచు కుని అన్నాడు. నిట్టూర్పుల మాట పక్కన పెడితే అతని గొంతులో సిన్సియారిటీ వుంది. 

“మీ తప్పు మీరు ఒప్పుకోవడం గ్రేట్” సిన్సియర్ గా అన్నాను. 

“టూలేట్. వెంటనే వెళ్లి కాళ్ళు పట్టుకుంటే బాగుండేదేమో. నా ఈగో నన్నాపని చెయ్యనివ్వలేదు. అసలా వైపుకే వెళ్లనివ్వలేదు. రెండేళ్ల పాటు ఇండస్ట్రీని వదిలేసి మా వూరికి పోయాను. మా వాళ్ళ బలవంతంమీద పెళ్లి కూడా చేసుకున్నా” ఆగాడు. రొటీన్ కథే అనిపించింది. 

“నాకు అర్థమైనదేమంటే, నేను చేసుకున్నది మా వాళ్ల బలవంతం మీద కాదనీ, ఊర్మిళ మీద వున్న’కచ్చ’ తోననీ!” మరోసారి ఓ కిలోమీటర్ నిట్టూర్చాడు. 

“పెళ్లయిన పదహారు నెలలకే తండ్రినయ్యాను. పుట్టిన పాపకి ఊర్మిళ అని పేరు పెట్టాను.” మళ్ళీ సైలెన్స్. 

“రెండేళ్లు గడిచేసరికి ఇక వుండలేకపోయాను. నాకు ఆ రోజుల్లో డైరీ రాసే దరిద్రపు అలవాటుండేది.  ఓ రోజు నాకు తెలీకుండా నా భార్య నా డైరీలు మొత్తం చదివింది. నిలదీసింది. ఊర్మిళ పేరుని మార్చి పాపకి శారద అని పెట్టింది. మళ్ళీ మరో ఈగో క్లాష్.” నిట్టూర్పుల సంగతి వ్రాయాలని లేదు కానీ, అవి కూడా బాధ యొక్క ‘గాఢత’ అని తెలిపే మీటర్లుగా భావిస్తే, ఆ మీటర్ ఫుల్ అయిందని మాత్రం చెప్పగలను. 

“నా భార్య తండ్రి బాగా ఆస్తి ఉన్నవాడవడం వల్ల ఆవిడకి స్వాభిమానం ఎక్కువ. ఒకే ఒక్క మాటలో నన్ను cut చేసి పుట్టింటికి వెళ్లిపోయింది.” ఈసారి మాత్రం తలెత్తి నా వంక చూస్తూ అన్నాడు. పశ్చాత్తాపం లేదు గానీ కోపం చాలా వర్షించింది… అతని కళ్ళల్లో.

“సరే.. అవన్నీ జరిగిపోయిన విషయాలు గదా!” అన్నా ను. 

“అవును. అదంతా గతించిన గతమే. ఇప్పుడు నాకు ఏభై నాలుగేళ్లు. జీవితం చేతు ల్లోంచి ఇసుక జారినట్టు జారిపోయింది. ఒకమాట చెప్పనా మేస్టారూ, నేను వేసినవన్నీ పేద పాత్రలే.  ఊళ్ళో నాకు కొద్దో గొప్పో ఆస్తి వుంది. పోస్టు గ్రాడ్యుయేట్ ని. అయినా పేదవాడిగా, నిరక్షరాస్యుడిగా సినిమాల్లో ఎక్ స్ట్రా వేషాలకు నేనెందుకు సిద్దపడ్డానూ అని ఆలోచిస్తే, నా మనసుకి పట్టిన పేదరికమే కారణం అని అనిపిస్తుంది. 

కొంతమందికి ఏదీ లేకపోయినా వారి ప్రెజెన్సే వారికి గౌరవాన్ని తెచ్చి పెడుతుంది. కారణం “వారిలోని వారు.”  మేబీ, నేను సృష్టించబడింది ‘పేద’ అనే మెటీరియల్ తో కావచ్చు. ఇన్నేళ్లొచ్చాక చుట్టూ చూస్తే ఏముందీ, నిరుత్సాహం, నిస్పృహ, నిర్లిప్తత, నిట్టూర్పులు తప్ప నేను చచ్చి చాలా కాలం అయిందనిపిస్తోంది.” సుదీర్ఘంగా నిట్టూర్చి సైలెంటయ్యాడు. నా మనసు కలుక్కుమంది. 

"సార్… ఎన్నో ఆశలు ఎన్నో కోరికలతో ఈ మద్రాసు వచ్చాను.  నా చదువు గానీ, నా మిగతా ఎస్సెట్స్ కానీ ఇక్కడ ఏమీ వుపయోగపడలేదు. ఏరోజుకారోజు వెతుకులాట. వెనక్కి తిరిగి చూస్తే ఏముందీ. ఏవో కొన్ని సినిమాల్లో నేను కనిపించిన మాట నిజమే, కానీ ఆ గుర్తింపు రావడానికి నేను పోగొట్టుకున్నదేమిటో తెలుసా? అమూల్యమైన కాలం. రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగడం, ఓ చిన్న డైలాగు చెప్పే వేషం వస్తే ఆకాశం చేతికందినంతగా ఆనంద పడిపోవడం, ఆ తర్వాత మళ్లీ మామూలే. మళ్లీ వెతుకులాట. ఇన్ని వందల సినిమాల్లో వేషాలు వేసినా టైటిల్స్ లో నా పేరు కనబడదు. ఒకటీ రెండుసార్లు మాత్రమే ఓ కో-డైరెక్టర్ నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తెలుసు గనక వేశాడు. 

పోనీ, తోటి వాళ్ళ సంగతి మరీ ఘోరం. ‘ఏవయ్యా చదూకున్న నీ లాంటోళ్లు వుద్యోగాలు చేసుకోక మా పొట్టలు ఎందుకు కొడతారు?’ అని నా ముందరే యీసడిస్తారు.” ఆగాడు సుధాకర్. గబగబా ఓ వ్యక్తి శరవణ భవన్ లో కి వచ్చి సుధాకర్ ని పిలిచి పక్కకి తీసికెళ్ళాడు. నేనూ సంభాషణ ఆపుదామనే అనుకున్నా. 

“సారీ సార్, పూర్వికా ప్రొడక్షన్స్ వారు కబురు పెట్టారు. మాంఛి జడ్జి వేషంట. మరోసారి కలుస్తాను “కళ్ళు మిలమిలా మెరుస్తూండగా అన్నాడు సుధాకర్ ఆ వచ్చిన వాడితో బయలుదేరుతూ.

“All the best” అన్నాను. 

ఒక విచారకరమైన, భారమైన mood తొలగి, కాస్త ఉత్సాహవంతమైన కాలకెరటం వచ్చినందుకు మనసుకి ఆనందం కలిగింది. బిల్లు చెల్లించి బయటికొచ్చాను.

***

ప్రస్తుతం

 

లెజెండ్స్ కీ సెలబ్రిటీల కీ ఏం జరిగినా ఇటు పత్రికలూ అటు ఛానల్సూ ఆ విషయాన్ని తమ తమ మీడియాలో హోరెత్తిస్తాయి. 

ఓ ఎక్ స్ట్రా నటుడి గుండెపోటు వార్తని ప్రచురించేదెవరు? అయినా ‘నాలాయిరం’ అనే తమిళ జూనియర్ ఆర్టిస్టు ద్వారా నాకూ మరి కొందరు తెలుగువాళ్ళకీ కబురందింది. 

వెళ్ళాం, ఓ చిన్న హాస్పిటల్ లో ఉన్నాడు. నీరసంగా నవ్వాడు. "మాస్టారు చాలా చెప్పాలని వుంది. ఏదీ చెప్పే ఓపికలేదు. ఒక్కసారి ఊర్మిళకు నా విషయం చెప్పరూ." అన్నాడు. సరే నన్నట్టు తల వూపి వచ్చాను. ఊర్మిళ నాకు తెలుసు సుందరపాండి వ్యాపారస్థుడే కాదు, ఓ పాటి సినీ ఫైనాన్సరు కూడా.

అయితే ఇబ్బంది ఎక్కడంటే, అతని భార్యకి సుధాకర్ గురించి ఎలా చెప్పడం? మీ ఎక్స్ బాయిఫ్రెండ్ చావుబతుకుల్లో ఉన్నాడని చెప్పాలా. హార్టెటాకుతో భాదపడుతూ నిన్ను చూడాలంటున్నాడని చెప్పాలా? ఏం చెప్పినా నిశ్చలంగా వున్న నీళ్లలో బండరాయిని పడేయటమే అవుతుంది.

ఆ మధ్యాహ్నమే వెళ్లి సుధాకర్ తో “అయ్యా మీరు చెప్పమన్నట్టు నేను ఊర్మిళతో చెప్పలేను. అది ఏ మాత్రం సరైన పని అని నాకు అనిపించడం లేదు" అని నిర్మొహమాటంగా చెప్పేశాను. 

“మీరు ఈమాట అంటారని వూహించాను” చిన్నగా నవ్వి అన్నాడు.

“అంటే, మీరు వూహించిందే జరుగుతుందా లేక మరోలానా అని టెస్ట్ చేశారన్నమాట” నా మాటల్లో ధ్వనించిన కోపం నాకు అర్ధమయింది. 

“మీరు పెద్దవాళ్లు గనక మీ ద్వారా ట్రై చేస్తే తనని చూసే అవకాశం వుంటుందని చెప్పాను.” నిర్లిప్తంగా అన్నాడు.

ఓ నిమిషం మౌనంగా వుండి నేను వచ్చేశాను. డ్యూటీ నర్సు ముందే చెప్పింది, ఆయనకి వచ్చింది మైల్డ్ స్ట్రోక్ అని, కంగారు లేదని. 

ఆ సాయంత్రం ఇంటికి వెళ్లేసరికి ఓ లెటరుంది. సింపుల్ గా. "నా పేరు ఊర్మిళ. ఇది నా ఫోన్ నంబర్. కాల్ చేయగలరా?" అని.

ఫోన్ చేసాను. ‘హలో’ అనగానే నా పేరు చెప్పాను. ఆవిడా కూడా ‘నేను ఊర్మిళనండీ.. మీ పేరు వినడమే గాని, పరిచయం లేదు. ఫోన్ చేయమని మీకు లెటర్ పంపడం తప్పే" అంటూ బిడియపడింది. "విషయం చెప్పండి. ఎదో ముఖ్యమైతేగాని లెటర్ వ్రాయరు కదా" అనునయంగా అన్నాను

మా మధ్య జరిగిన సంభాషణ సె మొత్తం చెప్పాలంటే చాలా చాలా పేజీలు వ్రాయాలి. క్లుప్తంగా చెబితే – 

ఊర్మిళ సుధాకర్ ని ఇష్టపడిన మాట నిజమే. ఫిజికల్ గా కలిసిన మాటా నిజమే. అతను చాలా పోజెసివ్ గా, శాడిజం తో ప్రవర్తించిన మాటా నిజమే. అయితే, ఆమెకి మరొకరితో సంబంధం వుందన్న మాట అబద్దం. సుందరపాండీ ఊర్మిళను నిజంగా ప్రేమించే దగ్గరకు చేర్చుకున్నాడు. వాళ్ళ వయసు వ్యత్యాసం కూడా అతనికి తెలిసిందే. ఊర్మిళకి సుధాకర్ తో సంబంధం వుందని తెలిసినా చూసీచూడనట్టు వదిలేశాడు తప్ప, ఊర్మిళని నిలదియ్యలేదు. అయితే సుధాకర్ సుందరపాండీని చాలా చులకనగా చూడటం మొదలెట్టబట్టే ఊర్మిళ సుధాకర్ ను బయటకు నెట్టింది. ఇప్పుడు, ఇన్నేళ్ల తరవాత, సుధాకర్ ఊర్మిళను బెదిరించడం మొదలుపెట్టాడు... ‘కొడుకు’ తన కొడుకేనని, ఆ విషయం పబ్లిక్ చేస్తాననీ, మొన్న గుండె నెప్పి వచింది గనక కబురెట్టానని. 

ఊర్మిళకి పాపం ఏం చేయాలో తెలీటంలేదు. సుందరపాండీ మంచివాడు. ప్రాణం పోయినా అతని పరువుని బజార్లో పెట్టలేదు. ఇక వీడేమో మానవ పిశాచంలా బెదిరిస్తున్నాడు. విషయం ఇదీ.

***

చాలా తీవ్రమైన కోపం వచ్చింది. ఏం చెయ్యాలీ ? అతనేమీ నా సబార్డినేట్ కాదుగా నేను చెప్పింది వినడానికీ. ముఖ్యంగా అంతకి తెగించిన సుధాకర్ నా మాట వింటాడా? అదే మాట ఊర్మిళతో అన్నాను. 

“ఆ విషయం నేనూ ఆలోచించాను సార్… కొన్ని మార్గాలు వున్నాయి కానీ, బాబుకి అంటే నా కొడుక్కి యీ విషయం చెప్పాల్సి వస్తుంది. అదే నా బాధ” అన్నది. రెండో మూడో నిశ్శబ్ద నిమిషాలు గడిచాక అన్నది… “ఒక ఆలోచన వుంది. దాన్ని ఫాలో చేసి చూస్తాను. కుదరకపోతే జరిగిన, జరుగుతున్న, విషయం సుందర పాండీ గారికి చెప్పడమే!” చిన్నగా నిశ్వసించి అన్నది. "సరేనమ్మా. మూడోవ్యక్తి కల్పించుకోవాల్సిన అవసం రాదేమో. ప్రయత్నించి చూడు. ఒకవేళ కల్పించుకోవాల్సి వస్తే అప్పుడు తప్పకుండా చూద్దాం” అన్నాను.

ప్రతి జీవితంలోనూ కొంత హైడ్రామా, కొంత మెలోడ్రామా ఉంటాయని కొందరు చెబితే, జీవితమే ఓ నాటకం అన్నాడు షేక్ స్పియర్. దాన్నే “జీవితమే ఓ నాటకరంగం” అన్నాడు తెలుగు కవి. ఏదైతేనేం, ఓ చక్కని డ్రామా జరిగింది. ఈ విషయాన్ని నాకు చెప్పింది “సంజయ్ గుండ్ల” అనే మంచాతిమంచి జర్నలిస్ట్.

 

సంజయ్ యువకుడు. కేవలం నవ్వు ముఖంతో తప్ప మరే ముఖం తోనూ అతన్ని వూహించలేము. Top హీరోహీరోయిన్లు, top మంత్రులు, రాజకీయ నాయకులు, top most అధికారులతోనే గాకుండా, అతి సామాన్యులతో టీ చక్కగా కలిసి పోయే స్వభావం సంజయ్ ది. సింపుల్ గా చెప్పాలంటే అతను ‘అందరివాడు.’ 

“భయ్యా, ఊర్మిళ డైరె క్టు గా ఓ రెండు పెట్టెల నిండా చీరల్ని తీసుకుని సుధాకర్ వుండే రూమ్ కి వెళ్లి, “ఈ క్షణం నించీ నేను ఇక్కడే వుంటాను. బాబు కూడా ఇక్కడికే వస్తాడు. పోషించాల్సిన బాధ్యత నీదే” అన్నదిట. గుండె గొంతులోకొచ్చిన సుధాకర్ కాళ్ళా వెళ్ళా పడి, జన్మలో ఆమె జోలికి వెళ్లనని ప్రామిస్ చేయడమేగాక వ్రాతపూర్వకంగా రాసిచ్చాడట. బస్.. కథ కంచికి, ఊర్మిళ తన ఇంటికి. పకపకా నవ్వాడు సంజయ్. 

“నాకు చెప్పమని నీకెవరు చెప్పారు భయ్యా?” అన్నాను.

“ఇంకెవరూ.. ఉర్మిళే చెప్పింది 'కథ సుఖాంతం' అని మీతో చెప్పమని” మళ్ళీ నవ్వాడు సంజయ్.

 చెప్పొద్దూ… చెప్పలేని రిలీఫ్.

***

P.S.: చాలా సమస్యలు మబ్బుల్లాంటివే. ఎంత గాఢంగా మబ్బులు కమ్ముకున్నా, ఒక్కసారి గాలి కెరటం వీచేసరికి అన్నీ ఎగిరిపోతాయి, లేదా కరిగిపోతాయి. ఎటొచ్చీ కావల్సింది కాస్త ధైర్యం, సంయమనం… కొంచెం ఆలోచన. అంతే! 

మరో సంచికలో మళ్ళీ కలుద్దాం.

మీ

భువనచంద్ర

***

bottom of page