adannamaata.png

సంపుటి  5   సంచిక  3

Website Published &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

పుస్త​క పరిచయాలు

నిర్వహణ: శాయి రాచకొండ  |  శ్రీనివాస్ పెండ్యాల

sahityam@madhuravani.com

పుస్తక విశ్లేషణ

మేము ఎంపిక చేసుకున్న కొన్ని  పుస్తకాలు ఈ ‘పుస్తక పరిచయాలు’ శీర్షికలో విశ్లేషించబడతాయి.

సంక్షిప్త పుస్తక పరిచయం

పుస్తక రచయితలకి ఉచితంగా ప్రచారం కలిగించడంకోసం మరియు పాఠకులకి కొత్త పుస్తకాల అందుబాటు గురించి క్లుప్తంగా పరిచయం చేయుట కొరకు "సంక్షిప్త పుస్తక పరిచయం" శీర్షిక ఉద్ధేశ్యింపబడింది. ఈ శీర్షిక లో తమ సరికొత్త గ్రంధాలని పరిచయం చెయ్యదల్చుకున్న వారు, ప్రచురించబడ్డ కొత్త పుస్తకాల ముఖ చిత్రం (స్కాన్ చేసిన ఫ్రంట్ కవర్), రచయిత వివరాలు, పుస్తకం గురించి ఐదు వాక్యాలు మించకుండా సంక్షిప్త సమీక్ష, కొనుగోలు వివరాలు మాకు పంపగలరు.

పంపించవలసిన చిరునామా:

sahityam@madhuravani.com

సంక్షిప్త పుస్తక పరిచయం విషయాలలో అంతిమ నిర్ణయం మధురవాణి నిర్వాహకులదే. 

Satyam Mandapati.PNG
kavya dahanostavam.PNG
padya rachana.PNG
prema moggalu.PNG
Ounu Valliddaru Istapaddaru

  

-శాయి రాచకొండ

A Date with Death and other Non-Resident Indian Stories – by Satyam Mandapati and translated from Telugu by Ramarao Annavarapu

సత్యం మందపాటి గారు సాహితీ లోకానికి చిరకాల పరిచితులు. ఎన్నో చక్కని కథలు గత నలభై ఏళ్ళకు పైగా తెలుగు పాఠకులకు అందిస్తూ వచ్చిన రచయిత.  ఆయన రాసిన ఎన్నారై కబుర్లు, అమెరికా భేతాళుడి కథలు, మేడ్ ఇన్ అమెరికా పుస్తకాలు అమెరికాకు వలస వచ్చిన భారతీయుల మనస్తత్వాలూ, వాళ్ళు అనుభవించే కల్చరల్ షాక్, అక్కడా, ఇక్కాడా పెరిగిన పిల్లల ఆలోచనలలో, నడవడిలో తేడాలు, వీసా బాధలు, ఇలా ఎన్నో జీవన విధానాలను దృష్టిలో పెట్టుకుని చదువరికి స్పష్టంగా తెలిసేలా కథల రూపంలో చెబుతాయి.

అన్నవరపు రామారావు గారు సత్యం గారి పుస్తకాలలో నుండి ఒక పదమూడు కథలను ఎన్నుకొని ఇంగ్లీషులోకి అనువదించారు.  ఆ అనువాద కథల సంపుటమే ఈ పుస్తకం.  ‘మరణ ముహూర్తం’ అన్న కథను A Date with Death గా అనువదించి అదే పేరుని పుస్తకానికి మకుటంగా పెట్టారు.  అమెరికా వచ్చి కొత్త జీవితాన్ని మొదలు పెట్టి చివరికి భర్త పెట్టిన బాధలకు అతన్ని, పిల్లల్ని చంపి, చివరికి ఆత్మహత్య చేసుకున్న ఒక యువతి కథ అది.   

సత్యంగారి కథలు చాలా మందికి తెలుసు.  నా ఉద్దేశ్యంలో ఆ కథలను పరిచయం చెయ్య వలసిన పని పెద్దగా ఉందనుకోను.   ఇంగ్లీషు అనువాదం గురించి రాయడం అవసరమని నా అభిప్రాయం.

నేనెప్పుడూ అడిగే ప్రశ్నే ఇక్కడ కూడా వేసుకున్నాను.  ఈ అనువాదం ఎవరినుద్దేశించి (target audience) చేసింది అని.  చాలా అనువాదాల లాగే ఈ పుస్తకం కూడా ఇంగ్లీషులోకి తర్జుమా చేస్తే బాగుంటుందనే ఉత్సాహంతో చేసినదే కానీ ఏ కోవలోకి చెందిన పాఠకులనూ దృష్టిలో పెట్టుకుని చేసింది కాదని అనిపించింది.  కానీ ఏ తెలుగు భాషేతరులు (భారత దేశంలో) ఈ పుస్తకాన్ని చదివినా, తప్పక హర్షిస్తారని నా అభిప్రాయం.  పుస్తకాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.

సత్యం గారిది సులభ శైలి.  చాలా సరళమైన భాషలో చదివించే కథలు.  అందుచేత తెలుగు-ఇంగ్లీషులలో పట్టున్న అనువాదకుడికి అంత క్లిష్టమైన సమస్య కాదు.  విషయంపై కేంద్రీకరిస్తే చాలు.  అదే జరిగింది ఇక్కడ కూడా.  రామారావు గారు కూడా ఏక ధాటీనా చదవగలిగే రీతిలో అనువాదం చేయడం జరిగింది.

అయితే నేను చూసిన ఎక్కువ ఆంగ్లానువాదాలు ఆ భాషలో ఎంత పట్టున్నా మూల భాష ఒడిలోనుంచి బయటపడలేవు.  ఈ పుస్తకం కూడా ఆ పరిధులు దాటి పోలేదు.  అనువాదం పూర్తి అయిన తరువాత మరొక్క సారి  ఇంగ్లీషు మాతృ భాష అయి, అందులో పట్టున్న ఎవరి చేతనైనా మరో పరిశీలన చేయించి మార్పులు చేర్పులు చేయిస్తే భారతీయేతర భాషల పాఠకులు గుర్తిచే అవకాశం వుండి వుండేదని నా ఆలోచన.  ఎందుకంటే సత్యం గారు కథలలో ఎంచుకున్న విషయం అలాంటిది కనుక.  వలస వచ్చిన భారతీయుల ఆలోచనలు తెలుసుకోవడం తప్పకుండా ఆసక్తికరంగా వుంటుందనే భావిస్తాను.  అయితే ఎవరో చెప్పినట్లు మరొక సారి ఎవరి చేతనైనా ప్రూఫ్ చదివించడం అంత సులభమైన పని కాదు.  ఖర్చుతో కూడుకున్న విషయం.  వెచ్చించే సమయం కూడా ఎక్కువే కావాలి.  పుస్తకాలు ప్రచురించడం కేవలం రచయిత తన మనోభావాల్ని వ్యక్తం చేస్తూ ప్రపంచానికి తన ఉనికిని, ఆలోచననూ చూపే ఒక సాధనమే కానీ, దాని వల్ల ఆర్ధికంగా లభ్ది కలిగించే విషయం కాదది.  మరి మంచి తెలుగు పుస్తకాలు ప్రపంచానికి అందించే విధానమేమిటనేదానికి సమాధానం నా దగ్గర లేదు ప్రస్తుతానికి.  సాహితీ ప్రపంచం ఆలోచించే సమయమిది.

 

నా దగ్గరున్న ఈ పుస్తకాన్ని చూసి, ఒక ఏడాది క్రితం ఇండియా నుండి వచ్చిన ఇరవై ఏళ్ళ మా మేనకోడలు చదువుతానని తీసుకుంది.  పుస్తకంలోని ప్రతి కథా ఎత్తిన పుస్తకాన్ని దించకుండా చదివి ‘ఎంత బాగా రాశారు, ఎంత బాగా రాశారు’ అంటూ ఒకటే మురిసిపోయింది.  ఆ అమ్మాయికి ఆసక్తి కలిగించిన విషయాల గురించి చెబుతూ, ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లల ఆలోచనలో తేడాలు, ఇక్కడ, అక్కడా పెరిగిన పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుండే వచ్చే సమస్యలు, అమెరికాలో వుండేవాళ్ళకి ఇండియాలో ఎంతో వదలి వచ్చేశామనే కలిగే లోటు, అక్కడ వాళ్ళకు స్వర్గంలాగా  కనిపించే అమెరికా, ఇండియాలో ప్రబలి వున్న కట్నాల భావన అమెరికాలో ఎలా బెడిసి  కొట్టిందో – ఇలాంటి విషయాలు కథలలో చూపించబడిన స్పష్టత ఆమెను సమ్మోహన పరిచిందని చెప్పింది.  ఒక పుస్తకానికి అంతకంటే పెద్ద యోగ్యతా పత్రం ఇంకేమిటి కావాలి?

ఈ పుస్తకం తెలుగు దేశంలో అన్ని ప్రముఖ పుస్తక విక్రేతల దగ్గరా దొరుకుతుంది.  అమెరికాలో కాపీలు కావలసిన వారు సత్యం మందపాటి గారిని వారి ఈమెయిలు ద్వారా సంప్రందించండి (satyam_mandapati@yahoo.com).  

* * *

కావ్య దహనోత్సవం – వేలూరి వేంకటేశ్వర రావు గారు రాసిన పుస్తకం గురించి మొదటి సారిగా హ్యూస్టన్ వెన్నెల కార్యక్రమంలో చంద్రహాస్ మద్దుకూరి గారి పరిచయం విన్నప్పటినుండి ఆ పుస్తకాన్ని తెప్పించుకుని చదవాలని అనుకున్నాను ఎన్నిసార్లో, కానీ అవలేదు.  అనుకోకుండా గొర్తి బ్రహ్మానందం గారి పుస్తకం ‘నేహల’ని అడిగినప్పుడు ఆయన కావ్యదహనోత్సవం కూడా జోడించి పంపారు చదవమని.  ఆవిధంగా దొరికిన అవకాశం ఇది.  

1960 లో ఆంధ్రా విశ్వవిద్యాలంలో వేలూరి వెంకటేశ్వరరావు గారు ‘కావ్య దహనోత్సవం’ జరిపినప్పుడే కాదు, అది ఇప్పుడు జరిగినా కూడా అదొక  తిరుగుబాటు ఆలోచనే.   శ్రమకోర్చి రాసిన కావ్యాన్ని దహనం చెయ్యడమేమిటి?  పుస్తక దహనం కాదది.  ఆలోచనా దహనం.

ఇదొక వ్యంగ్య రచన. నాటకం కాని నాటకం లాంటి ప్రక్రియ.  అరవై సంవత్సరాలక్రితం వేలూరి గారు స్వయంగా రాసుకొని, బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు గారి ప్రోత్సాహంతో విశ్వకళా పరిషదావరణలో ఎర్స్కిన్ స్క్వేర్ అనబడే బహిరంగ కళా మండపంలో ప్రదర్శించిన ఒక కార్యక్రమం.  వెయ్యి మందికి పైగా విద్యార్థులు, ప్రముఖులు హాజరైయ్యారట.   ఇది ఆయన రెండవ ప్రదర్శన.  మొదటి సారి ఏలూరులో ప్రదర్శించారని చెప్పారు.  మరో పదిహేడేళ్ల తరువాత ఎర్స్కిన్ స్క్వేర్ వేదిక మీద నేనూ ఇంకో సందర్భంలో మాట్లాడడం కేవలం యాదృచ్ఛికం మాత్రమే – అట్టమీది బొమ్మ చూసినప్పుడు నా పాత జ్నాపకాలు వెలికొచ్చాయి.

ఆ కార్యక్రమంలో కృతికర్త వేంకటేశ్వరరావు గారే.  ‘అగ్నిశంఖం’ అనే కావ్యాన్ని రాసినట్టూ, ఆ కావ్యాన్ని, దానితో పాటు మిగిలిన రచనలూ ఆరోజు దహనానికి పాత్రమైన పుస్తకాలు.  వేదిక మీద నిజానికి ఏ దహనమూ జరగలేదు.  అసలీ కావ్యదహనమనే ఆలోచనేమిటి?  ఎందుకు?  వేంకటేశ్వరరావు గారు రాసిన దాన్ని బట్టి, ఒక ఇంగ్లీషు కవి గురించి తాను చదివిన విషయం ప్రేరణ కావచ్చు.  ఆ ఇంగ్లీషు కవి, యాభైవ సంవత్సరాల వయసులో తను రాసింది కవిత్వం కాదని గుర్తిస్తాడు.

అగ్నిశంఖం కావ్యానికి కృతికర్తగా రావు గారు వేదిక మీద చెప్పిన మాటలద్వారా మనకు తెలుస్తుంది కార్యక్రమానికి అంతరార్థం.  కుక్కగొడుగుల్లాగా వచ్చి పడుతున్న శతకోటి క్షుద్రకావ్యాలను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన కార్యక్రమమిది!  మరి క్షుద్ర కావ్యాలకు నిర్వచనం ఏమిటి?  ఏ ఇంగ్లీషు కావ్యాన్నో అనుకరిస్తూనో, పూర్తిగా కాపీ కొడుతూనో రాయడం, అవి తనవిగా ప్రచారం చేసుకోవడం, ‘చిత్ర విచిత్ర బంధనలతో’, తనకే అర్థం కానీ సమాసాలతో కవితలు, గేయాలు రాయడం, అంతకంటే అర్థం లేని ప్రయోగాలు చేయడం, పుస్తకం ప్రచురించిన ‘కైపు’లో స్వంత డబ్బా కొట్టుకుంటూ ప్రచారాలు చేసుకోవడం – ఎడ్వర్టైజ్మెంట్ స్లైడులు సినిమా హాళ్ళలో వేయించడంతో సహా… ఇలా సాగుతుంది ఆ నిర్వచనం.  కేవలం ప్రముఖుల అభిప్రాయాల వల్ల ఒక కావ్యం గొప్పదైపోదని, కవిత్వానికి వుండవలసిన విలువలు, రచయితలో నిజాయితీ, వున్నప్పుడే రచనలు నిలుస్తాయనీ అభిప్రాయం వెలిబుచ్చుతారు.

పుస్తకం చాలా చిన్న పుస్తకం.  కానీ ఇచ్చే సందేశం పెద్దది.  తెలుగు సాహిత్యంపై వేంకటేశ్వరరావు గారికి ఆయన యుక్తవయస్సులో వున్నప్పుడున్న ఆలోచనలను ప్రతిబింబిస్తుంది.  అరవై ఏళ్ళ తరవాత కూడా మనుషుల్లో అంత తేడా ఏమీ వచ్చినట్లు లేదు.  సాంకేతికంగా చాలా మార్పులొచ్చాయి.  ఎవరు ఏమి వ్రాసినా ప్రజలపైకి తోయడానికి ఎన్నో మాధ్యమాలొచ్చాయి.  తమకు కావలసిన వారిమీద పన్నీరు జల్లడానికో, అక్కరకు రాని రచయితలపై బురద జల్లడానికో ఈ మాధ్యమాలు ఎంతో అనుకూలం.  ఎవరో చెప్పినట్లు సాహిత్యంపై సద్విమర్శ తక్కువగా కనబడుతోంది.  పుస్తకాలకు విలువ తగ్గిపోయింది.  చదివే వారి శాతం తగ్గిపోతోంది రోజు రోజుకీ.  అనువాదాలు జరుగుతున్నాయి, అయితే మిగతా ప్రపంచానికి అందించడానికి కావలసిన సంఘటిత ప్రయత్నం కనబడదు.  తన ఉపన్యాసం మధ్యలో తెలుగు సాహిత్యాన్ని గురించి ప్రస్తావిస్తూ, మనకు ఏ భాషలోకి అనువదించినా కావ్యంగానే నిలబడే రచనలేవీ లేవని అంటారు.  ఒక మాటలో చేపాలంటే వేంకటేశ్వరరావు గారు తన ఆలోచనలలో ఆ రోజుల్లోనే కొన్ని దశాబ్దాలు ముందున్నారని, తన ఆలోచనలను అందరితో పంచుకోవడానికి కావలసిన ధైర్యం కూడా వుందని తెలుస్తుంది ఈ పుస్తకం ద్వారా.

ఆప్పట్లో రావు గారి స్వదస్తూరీతో రాసిన కాగితాలు దొరకటంతో స్నేహితుల ప్రోత్సాహంతో ఎన్నో ఏళ్ళ తరువాత పుస్తకాన్ని ఈ సంవత్సరం ఫిబ్రవరి లో  ప్రచురించారు.  ఆయన దస్తూరీతో వున్న పేజీలు ఒకవైపు, టైపు ఫాంటుతో పక్క పేజీలోనూ ప్రచురించారు.  మంచి పుస్తకం, చదవండి.  

పుస్తక ప్రతులు విశాలాంధ్ర, నవచేతన, నవోదయా వారి దగ్గర దొరుకుతాయి.  ఈ-పుస్తకం కినిగేలో కొనుక్కోవచ్చు.  వెల కేవలం యాభై రూపాయలే.  
 

* * *

పద్య రచనామృత బోధిని – పద్య గురువు కొల్లారపు ప్రకాశరావు శర్మ

పుస్తకంలోకి తొంగి చూసిన తరువాత తెలిసింది కొల్లారపు శర్మ గారు ఎంత పాపులరో అని.  ఆయన శిష్యులలో మా హ్యూస్టన్ వాస్తవ్యులు కూడా ఉన్నారని, వాళ్ళ చేత కూడా గర్వపడేటట్లు శర్మ గారు శతక పద్యాలు రాయించారనీ తెలిసి కొంచెం ఆనందం, ఆశ్చర్యం పడటం నా వంతు అయింది.  ఎంతో ఆప్యాయతతో ఒక శిష్యురాలు రాసిన ఈ క్రింది పద్యం ఆయన గురుతత్వానికి అద్దం పడుతుంది.

కం. దక్షిణ కోరని గురువుకు 

నక్షర కుసుమాల పద్య హారము నిడుదున్ 

సాక్షాత్ తు గీమువేలుపు 

కక్షయమౌ భక్తి తోడ నభివందనముల్.

 

పుస్తకాన్ని ఎందుకు రాశానని చెబుతూ, శర్మ గారు “ఈ పుస్తకము సహాయముతో కనీసము ఒక వందమంది క్రొత్తగా ఛందస్సు నేర్చుకొని చిన్నచిన్నఛందోబద్ధ పద్యాలు వ్రాసేవాళ్ళు తయారు కావాలని నా ఆకాంక్ష” అంటారు.

 

అలాగే ఎంతో వినయంతో “నేను తెలుగు పండితుడిని కాను. ప్రబంధాలను చదువలేదు. నా చదువుకుగాని వృత్తికిగాని పద్యసాహిత్యముతో ఏమాత్రము సంబంధములేదు. నా బలము నా మాతృభాషయైన తెలుగు పైన మక్కువ, నాపైన నాకు ఆత్మవిశ్వాసము, ఆ భగవంతునిపైన విశ్వాసము, మరియు నేను నేర్చుకొన్నది పదిమందికి నేర్పడములోనే నా విద్య పవిత్రము అవుతుందని అపారనమ్మకం” అంటారు.  

 

పద్య సాహిత్యం తెలుగు వాళ్ళ సొత్తు.  అందులో అనుమానం లేదు.  ఛందోబద్ధ పద్యం సంస్కృతం నుండి దిగుమతి చేయబడ్డ సాహితీ ప్రక్రియే కావచ్చు.  కానీ అది మన స్వంతం చేసుకున్నాం.  నన్నయ, తిక్కన దగ్గర్నుంచి నేటి వరకూ ఛందస్సుతో కూడిన పద్యాలు సాహిత్యానికి ఒక వెలుగు తెచ్చాయనడంలో ఆశ్చర్యం లేదు.  పద్యం అనంగానే గ్రాంథికమై ఉండాలనేది ఒక ప్రామాణికమయిపోయింది.  అయితే ఆభావన రోజు రోజుకీ మారిపోతోంది.  పద్యం ఏ ఒక్కరి సోత్తూ కాదని, ఛేదిస్తే ఎవరైనా రాయొచ్చనే భావన, ధైర్యం రోజు రోజుకీ బలపడుతోంది.  ఆ మార్పుని తీసుకోస్తున్న కొద్ది మందిలో శర్మ గారు కూడా ఒకరు.  

 

పద్యానికున్న ప్రాణాలలో భావన, విషయం, వర్ణన, ఒక ఎత్తైతే, ఛందస్సు ఇంకో ఎత్తు.  మొదటిది కవి హృదయంలోంచి రావాలి.  రెండోది కేవలం సాంకేతిక పరమైనది – just a technique.  కవి హృదయం పలకడానికి టెక్నిక్ ఒక సాధనం మాత్రమే.  పలికే హృదయం ఏ మాధ్యమమైనా ఎంచుకోవచ్చు.  సత్తా వున్న ఏ రచనా అయినా సాహిత్య చరిత్రలో నిలుస్తుంది - కేవలం పద్య రూపమే అక్కరలేదు.  కానీ పద్యం చాలా కాలం ఒక సవాలుగా, సామాన్యులెవరికీ అందని ఒక గూఢ ప్రక్రియగా (enigma) నిలచి పోయింది.  అంతర్జాలం ప్రపంచాన్నంతటినీ ఒకటి చేసింది.  గూగుల్, వాట్సాప్, మరెన్నో మానవ సంబంధాలలోనూ, ఒకరితో ఒకరు సమాచారాన్ని పంచుకోవడంలోనూ విప్లవాన్ని తీసుకొచ్చాయి.

ఇదిగో, ఇలాంటి వాతావరణంలో మన కొల్లారపు ప్రకాశ శర్మ గారు తను నేర్చుకుంటూ, ఇంకొకళ్ళకి నేర్పుతూ, పద్య బడిని మొదలు పెట్టారు.  అంతర్జాల మాధ్యమాల సహాయంతో ఆయన ఉత్సాహం ఎన్నో దేశాలలోని పద్యాభిమానుల్ని ఆకర్షించి కొత్త పద్య కవుల్ని తయారుచేయడాని దోహదమయింది.  ఎక్కడో అందుబాటులో లేదనుకునే పద్యం ఇప్పుడు పాత కవుల్ని అనుకరిస్తూనో, స్వయంగానో, ఇంకేవిధంగానో భావ స్ఫూర్తిని పొంది సాంకేతిక ప్రజ్ఞ జోడై, సాంప్రదాయ పద్ధతిలో పద్య రూపాన్ని పొందుతూ, ఎంతో మందిని, ముఖ్యంగా యువతను ఆకర్షించగలుగుతోంది. 

వారానికో పాఠం చొప్పున పది వారాలలో పది పాఠాలు ఈ పుస్తకంలో చెప్పారు శర్మ గారు.  గురు లఘువులతో మొదలు పెట్టి, ఆటవెలది, తేటగీతి, సీసం, కందం, వృత్త పద్యాలయిన ఉత్పలమాల, చంపకమాల , శార్దూలం, మత్తేభం పద్యాల నిర్మాణం, ఆయా పద్యాల విశేష లక్షణాలు, ప్రతి పద్య రూపానికీ ఎన్నో ఉదాహరణలు ఇస్తూ శర్మ గారు ఒక గురువు శిష్యుడికి బోధిస్తున్నట్లుగానే ఈ పుస్తకాన్ని అందరి ముందుంచారు.  

కేవలం తమ సాంకేతిక ప్రజ్ఞను ప్రదర్శించుకోవడానికి మాత్రమే పద్యాలు రాస్తే సరదాగా వుండవచ్చు.  కొంత తృప్తీ కూడా కలగ వచ్చు.  అయితే ఆ పద్యాల్లో ఆర్ద్రత వుండదు.  ఒకసారి వేము భీమశంకరం గారు హ్యూస్టన్ వచ్చినప్పుడు ఆయన తన అరవై ఐదో ఏట పద్య రచనా వ్యాసంగం ఎలా మొదలు పెట్టారో చెబుతూ, పద్యం లో ఉన్న ఛందస్సు తాను చెప్పదల్చుకున్న భావానికి తగ్గట్లుగా వుంటుందని, వుండాలని వివరించారు.  అలాగే డల్లాస్ వాస్తవ్యులు అష్టావధాని పూదూరు జగదీశ్వరన్ గారు ఒక నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమంలో ప్రతి పద్యానికి ఒక లయ ఉంటుందని, ఆ లయను ప్రాతిపదికగా తీసుకుంటే గణాలు తెలియకుండానే వచ్చేస్తాయని చెప్పినట్లు గుర్తు – అంటే భావగర్భితమయిన పద్యాన్ని ఆ భావానికి తగ్గట్లు ఒక లయలో చొప్పిస్తే, యాంత్రికంగా ఛందస్సు నేర్చుకునే పని వుండదా?  పద్య కవులే చెప్పాలి.  

చాలా క్రమ విధానంలో ప్రతి పాఠాన్ని శ్రమతో పద్యాల్ని మొదటి సారి రాయాలనుకునే ఔత్సాహికులకోసం రాసిన పుస్తకం ఇది.  శర్మ గారు వెల ఇవ్వలేని పుస్తకాన్ని ప్రచురించారు.  ఎవరికి కావాలన్నా ఉచితంగా ఇస్తామన్నారు.  తనకొచ్చిన చదువును నలుగురితో పంచుకోవాలనుకునే ఆయన ఉత్సాహాన్ని తప్పక అభినందించాలి.  కావలసిన వారు kollarapu.bodhini@gmail.com కి ఈమెయిలు పంపి పిడిఎఫ్ కాపీ తెప్పించుకోవచ్చు. 

 

* * *

ప్రేమ మొగ్గలు – డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ గారి హృదయంలోంచి పెల్లుబికిన ప్రేమ సాహితీ కుసుమాలు.  ప్రేయసీ ప్రియుల మధ్య ప్రేమ వెలిబుచ్చే సాహిత్యం ఈనాటిది కాదు.  అది ఈనాటితో ఆగేదీ కాదు.  మానవ హృదయాలు స్పందిస్తున్నంతకాలం భావాలూ ఆగవు, సాహిత్యమూ ఆగదు.  విభిన్న హృదయాలలోంచి వచ్చే శబ్ద తరంగాల అంతరం ఆయా హృదయాలకే స్పష్టం.  అయితే అది సాహిత్య రూపంలో మిగతా ప్రపంచానికి అందించినప్పుడు ఎన్నో గుండెల చప్పుడుతో కలసి మొగ్గలు పువ్వులై వికసించి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనడంలో సందేహం లేదు.  శ్రీకాంత్ గారి ప్రయత్నం ఇలాంటిదే.  

ఆచార్య మసన చెన్నప్ప గారు పుస్తకం గురించి అంటారు, “మొగ్గలు ఒక నవ్య కవి హృదయంలోంచి వచ్చిన సుకుమార కవిత రూపానికి ప్రతీకలు” అని.  

కవితలలో శ్రీకాంత్ గారు చేసిన ప్రక్రియ ఆసక్తికరంగా వుంది.  ప్రతి  ‘మొగ్గా’ మూడు పాదాల కవిత.  మొదటి రెండు పాదాలూ ప్రేమికుల మధ్య జరిగే అన్యోన్య ప్రతిస్పందన అయితే మూడో పాదం ఆ ప్రతిస్పందనను నిరూపించే నిర్వచనం.  ఉదాహరణకు చూడండి. 

 

ఎన్ని యుగాలు గడచిపోతున్నా కానీ 

నువ్వొస్తావని ఎదురు చూపులే ఇంకా 

ప్రేమంటే ఎదురు చూపుల సంగమం

 

ఇలా సాగిపోతాయి మొగ్గలు.  అనుభూతుల వర్ణనలు చదవడానికి బావున్నాయి.   ఆదర్శమైన ప్రేమ తత్వం క్షుణ్ణంగా కనిపిస్తుంది.  అయితే కొన్ని సహజత్వాన్ని కోల్పోయి కాగితపు మొగ్గలై, కృత్రిమ రంగులతో కనబడతాయి.  ఇలాంటివి తప్పవేమో మరి.  

పుస్తకానికి వేసిన ముఖచిత్రం రచయిత ప్రేమావేశానికి ప్రతిబింబమే. ప్రతులకు రచయితను సంప్రదించండి (+91 9032844017).

  

* * *

 

ఔను...వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు - డా.శ్రీసత్య గౌతమి రచించిన పదహారు కథల సంపుటి "ఔను...వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు". ఈపేరుతో రచనాసాహిత్య రంగంలో మొట్ట మొదటిసారిగా మానవసబంధాలలోని వివిధకోణాలపై ప్రచురింపబడిన కథల పుస్తకం. ఇది 216 పేజీల పుస్తకం, 16 కథల సమాహారం. ఈ కథల రచయిత్రి డా. శ్రీసత్య గౌతమి, అమెరికాలోని ఫిలడెల్ఫియా నగర వాస్తవ్యులు. ఇది ప్రథానంగా సామాజిక అంశాలకు ప్రాముఖ్యతనిస్తూ వ్రాసిన కథలు. ఇవి వివిథ పత్రికల్లో ప్రచురితమయి, ప్రజాదరణపొందినవి. వీటిల్లో అంతర్జాతీయంగా బహుమతులను సాధించుకున్న కథలు కూడా ఉన్నాయి. కథలకు అర్ధవంతంగా, కళాత్మకమయిన కవర్ పేజ్ తో, అందమైన ప్రింటు, క్వాలిటీ పేపర్ తో హైదరాబాద్ జేవీ పబ్లికేషన్సు నుండి రూపొందింపబడిన పుస్తకం.

కళ్ళతో అక్షరాలను చదువుతున్నప్పుడు మనసుకు హత్తుకునే కథలు ఈ “ఔను… వాళ్ళిద్దరూ ఇష్ఠపడ్డారు”. చక్కటి ముందుమాటలతో, ప్రేమను గెలిపించే కథలతో, మనుష్యుల బంధాలు, విలువలు, వాటి ఔన్నత్యాలు ఎక్కువ భారం లేకుండా తగుమోతాదులో వ్రాయబడిన కథలు ఈ “ఔను… వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు”. ఏవయసువారైనా, విద్యార్ధులైనా, ఒకరికి బహుమానంగా ఇవ్వాలన్నా అందమయిన డిజైండు కవర్ పేజ్ తో, క్వాలిటీ పేపర్ తో, తేలికగా మీ చేతుల్లో ఇమిడిపోయే సంపుటి “ఔను… వాళ్ళిద్దరూ ఇష్ఠపడ్డారు”. 

 

ఈ సంపుటిపై వచ్చిన కొన్ని ఆత్మీయస్పందనలు-

“మంచి అయినా, చెడు అయినా సూటిగా చెప్పిన రచయిత్రి నిజాయితీని మెచ్చుకోక తప్పదు. ఇది మంచి రచయితకివుండవలసిన లక్షణం”.  - శ్రీ సత్యం మందపాటి, డయాస్పోరా రైటర్, ఆస్టిన్, టెక్సస్

“పాఠకుల్లో వినూత్నమైన, విభిన్నమైన ఆలోచనలను రేకెత్తిస్తుందీ సంకలనం. ప్రతి కథకూ తనదైన శైలిలో ఒక అనువైన ముగింపునివ్వడం డా. గౌతమి ప్రత్యేకత”. - శ్రీ భరద్వాజ్ వెలమకన్ని, మాలిక పత్రిక ఫౌండర్, ఏక్రాన్, ఒహాయో. 

“గౌతమిగారి కథలు మన జీవితంలో జరిగినట్టు అనిపిస్తూ, కథావస్తువు చాలావరకు చుట్టుప్రక్కల జరిగిన సంఘటనలతో ముడ్టిపడి వుండడం నాకు నచ్చుతుంది”.  - శ్రీమతి లక్ష్మీరాయవరపు, తెలుగుతల్లి ఎడిటర్, టొరంటో, కెనడా.

“శ్రీసత్య గౌతమి కథల్లో ఎక్కడా నేల విడిచి సాము చేయరు, ఆయా పాత్రలకు తగ్గ భాషను, మాండలికాన్ని చక్కగా పొదుగుతారు. కథ కేవలం చదివిస్తే చాలు అనుకోకుండా పాటకులకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా, సమాజహితంగా వుండేలా..సందేశాత్మకంగా వ్రాయడం ఎన్నదగ్గ విషయం”. - శ్యామల జొన్నలగడ్డ, జర్నలిస్ట్, విమర్శకురాలు, ఇండియా.

“కథాపరిశోధనలో సామాజికాంశాలకు ప్రాముఖ్యతనొసగిన కథలు, ఇష్టపడి చదవాల్సిన కథలు ఔను...వాళ్ళుద్దరూ ఇష్టపడ్డారు”. -శ్రీమతి సి. ఉమాదేవి, సమీక్షకురాలు, ఇండియా

“సంస్కారవంతమయిన తెలుగుభాషతో ఏకథకి ఆకథే గొప్పగావుంది, వాస్తవానికి దగ్గరగా వున్న కథలు”. -శ్రీమతి జి.సుబ్బలక్ష్మి, రైటర్, ఇండియా.

“కథలన్నీ ప్రస్తుత సామాజికాంశాలకు దర్పణంలావున్నాయి”. -శ్రీ టి. తిరుమలరావు, టీచర్, విజయనగరం.

“కథలన్నీ చాలా బావున్నాయి”. -శ్రీమతి నాగజ్యోతి సుసర్ల, రైటర్, బెంగుళూరు, ఇండియా.

“మన్ పసంద్ కథలు. కవర్ పేజ్ పై అందమైన ఆర్ట్. తెలిసినవారికి గిఫ్టుగా ఇవ్వడానికి 20 కాపీలు కొన్నాను”. -డా. ప్రసాద్ ధూళిపాల, ఆస్టిన్, టెక్సస్.

మరికొన్ని వివరాలకు ఈ క్రింది యూ ట్యూబ్ లింకుపై క్లిక్ చెయ్యగలరు

https://www.youtube.com/watch?v=AQjY5LecSYk 

పుస్తకం దొరుకు వివరాలు:

అమెరికాలో ప్రతులకు కాంటాక్ట్ చెయ్యాల్సిన WhatsApp నెంబర్ - 610-888-2724. పుస్తకం ధర $10.00 (shipping included). 

ఇండియా లో ప్రతులకు – Please contact Whatsapp no. +16108882724 

పుస్తకము ధర - Rs. 100 + Rs. 60 (మెయిలింగు చార్జెస్ -రెండు తెలుగు రాష్త్రాలు ). ఇతర రాష్ట్రాలకు అక్కడి మెయిలింగు చార్జెస్ పడతాయి. 

హోమ్ డెలివరీ - 

1. 7382193310 or 7416940998 

2. 8096310140 (J.V. Publications) 

3. https://books.acchamgatelugu.com/.../ounu-valliddaroo.../

ఇతర ప్రధాన కేంద్రాలు - 

1. విశాలాంధ్ర (ఆంధ్రా బ్రాంచీలన్నిటిలో) 

2. నవచేతన (తెలంగాణా ) 

3. నవోదయ (తెలంగాణా )